BhaktiVed
వేంకటేశ్వరుడు

బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే

సంకీర్తనరచన: అన్నమాచార్య (Annamacharya)Raga Bowli; sung as a bhajan with clap taal

ఈ పాఠం ఇంకా సరిచూడబడలేదు.

తందనాన ఆహి తందనాన పురే

తందనాన భళా తందనాన

బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే

పరబ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే

కందువగు హీనాధికములిందు లేవు

అందరికి శ్రీహరే అంతరాత్మ

ఇందులో జంతుకులమింతా ఒకటే

అందరికి శ్రీహరే అంతరాత్మ

నిండార రాజు నిద్రించు నిద్రయు నొకటే

అండనే బంటు నిద్ర అదియు నొకటే

మెండైన బ్రాహ్మణుడు మెట్టుభూమి యొకటే

ఛండాలుడుండేటి సరిభూమి యొకటే

అనుగు దేవతలకును అల కామసుఖమొకటే

ఘనకీటపశువులకు కామసుఖమొకటే

దిన మహోరాత్రములు తెగి ధనాఢ్యున కొకటే

వొనర నిరుపేదకును వొక్కటే అవియు

కొరలి శిష్టాన్నములు గొను నాకలొకటే

తిరుగు దుష్టాన్నములు తిను నాకలొకటే

పరగ దుర్గంధములపై వాయు వొకటే

వరుస పరిమళముపై వాయు వొకటే

కడగి యేనుగు మీద కాయు యెండొకటే

పుడమి శునకము మీద పొలయు యెండొకటే

కడు పుణ్యులను పాపకర్ములను సరిగావ

జడియు శ్రీవేంకటేశ్వరు నామమొకటే

ఈ పాఠానికి వీడియో లేదు.YouTubeలో వెతకండి
మూలం: Annamacharya sankirtana; text as in the Tirumala Tirupati Devasthanams Annamacharya Sankirtanalu volumes and as commonly sung

ఇవి కూడా చదవండి