అయోధ్యా కాండ సర్గ 27… రాముని మాటలు విన్న సీతకు చిరుకోపం వచ్చింది. “ఏమిటండీ మీరు మాట్లాడేది. నాకు ఏమీ కావడం లేదు. కేవలం హాస్యానికి అంటున్నారా. నన్ను ఆట పట్టించడానికి అంటున్నారా. హాస్యానికైనా ఒక హద్దు ఉంటుంది కదా! మీనోటి నుండి రావాల్సిన మాటలేనా ఇవి. ఒకవేళ అరణ్యానికి వెళ్లాల్సివస్తే, మీరు మాత్రమే అరణ్యములకు పోవడం ఏమిటి?ఎందుకంటే తల్లి, తండ్రి, సోదరుడు, సంతానము, కోడళ్లు వారందరూ వారి వారి పూర్వజన్మ కర్మలను మాత్రమే అనుభవిస్తారు. ఈ విదంగా రాముల వారు వివరిస్తున్న సందర్బల్మ్లోనిది…
పతివ్రతాధ్యవసాయః
ఏవముక్తా తు వైదేహీ ప్రియార్హా ప్రియవాదినీ |
ప్రణయాదేవ సంక్రుద్ధా భర్తారమిదమబ్రవీత్ ||
1
కిమిదం భాషసే రామ వాక్యం లఘుతయా ధ్రువమ్ |
త్వయా యదపహాస్యం మే శ్రుత్వా నరవరాత్మజ ||
2
ఆర్యపుత్ర పితా మాతా భ్రాతా పుత్రస్తథా స్నుషా |
స్వాని పుణ్యాని భుంజానాః స్వం స్వం భాగ్యముపాసతే ||
3
భర్తుర్భాగ్యం తు భార్యైకా ప్రాప్నోతి పురుషర్షభ |
అతశ్చైవాహమాదిష్టా వనే వస్తవ్యమిత్యపి ||
4
న పితా నాత్మజో నాత్మా న మాతా న సఖీజనః |
ఇహ ప్రేత్య చ నారీణాం పతిరేకో గతిః సదా ||
5
యది త్వం ప్రస్థితో దుర్గం వనమద్యైవ రాఘవ |
అగ్రతస్తే గమిష్యామి మృద్గంతీ కుశకంటకాన్ ||
6
ఈర్ష్యారోషౌ బహిష్కృత్య భుక్తశేషమివోదకమ్ |
నయ మాం వీర విస్రబ్ధః పాపం మయి న విద్యతే ||
7
ప్రాసాదాగ్రైర్విమానైర్వా వైహాయసగతేన వా |
సర్వావస్థాగతా భర్తుః పాదచ్ఛాయా విశిష్యతే ||
8
అనుశిష్టాఽస్మి మాత్రా చ పిత్రా చ వివిధాశ్రయమ్ |
నాస్మి సంప్రతివక్తవ్యా వర్తితవ్యం యథా మయా ||
9
అహం దుర్గం గమిష్యామి వనం పురుషవర్జితమ్ |
నానామృగగణాకీర్ణం శార్దూలవృకసేవితమ్ ||
10
సుఖం వనే నివత్స్యామి యథైవ భవనే పితుః |
అచింతయంతీ త్రీఁల్లోకాంశ్చింతయంతీ పతివ్రతమ్ ||
11
శుశ్రూషమాణా తే నిత్యం నియతా బ్రహ్మచారిణీ |
సహ రంస్యే త్వయా వీర వనేషు మధుగంధిషు ||
12
త్వం హి కర్తుం వనే శక్తో రామ సంపరిపాలనమ్ |
అన్యస్యాపి జనస్యేహ కిం పునర్మమ మానద ||
13
సహ త్వయా గమిష్యామి వనమద్య న సంశయః |
నాహం శక్యా మహాభాగ నివర్తయితుముద్యతా ||
14
ఫలమూలాశనా నిత్యం భవిష్యామి న సంశయః |
న తే దుఃఖం కరిష్యామి నివసంతీ సహ త్వయా ||
15
ఇచ్ఛామి సరితః శైలాన్పల్వలాని వనాని చ |
ద్రష్టుం సర్వత్ర నిర్భీతా త్వయా నాథేన ధీమతా ||
16
హంసకారండవాకీర్ణాః పద్మినీః సాధుపుష్పితాః |
ఇచ్ఛేయం సుఖినీ ద్రష్టుం త్వయా వీరేణ సంగతా ||
17
అభిషేకం కరిష్యామి తాసు నిత్యం యతవ్రతా |
సహ త్వయా విశాలాక్ష రంస్యే పరమనందినీ ||
18
ఏవం వర్షసహస్రాణాం శతం వాఽహం త్వయా సహ |
వ్యతిక్రమం న వేత్స్యామి స్వర్గోపి న హి మే మతః ||
19
స్వర్గేఽపి చ వినా వాసో భవితా యది రాఘవ |
త్వయా భమ నరవ్యాఘ్ర నాహం తమపి రోచయే ||
20
అహం గమిష్యామి వనం సుదుర్గమం
మృగాయుతం వానరవారణైర్యుతమ్ |
వనే నివత్స్యామి యథా పితుర్గృహే
తవైవ పాదావుపగృహ్య సంయతా ||
21
అనన్యభావామనురక్తచేతసం
త్వయా వియుక్తాం మరణాయ నిశ్చితామ్ |
నయస్వ మాం సాధు కురుష్వ యాచనాం
న తే మయాఽతో గురుతా భవిష్యతి ||
22
తథా బ్రువాణామపి ధర్మవత్సలో
న చ స్మ సీతాం నృవరో నినీషతి |
ఉవాచ చైనాం బహు సన్నివర్తనే
వనే నివాసస్య చ దుఃఖితాం ప్రతి ||
23
ఇతి శ్రిమద్రామయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే సప్తవింశః సర్గః ||
Ayodhya Kanda Sarga 27 Meaning In Telugu
రాముని మాటలు విన్న సీతకు చిరుకోపం వచ్చింది. “ఏమిటండీ మీరు మాట్లాడేది. నాకు ఏమీ కావడం లేదు. కేవలం హాస్యానికి అంటున్నారా. నన్ను ఆట పట్టించడానికి అంటున్నారా. హాస్యానికైనా ఒక హద్దు ఉంటుంది కదా! మీనోటి నుండి రావాల్సిన మాటలేనా ఇవి. ఒకవేళ అరణ్యానికి వెళ్లాల్సివస్తే, మీరు మాత్రమే అరణ్యములకు పోవడం ఏమిటి?ఎందుకంటే తల్లి, తండ్రి, సోదరుడు, సంతానము, కోడళ్లు వారందరూ వారి వారి పూర్వజన్మ కర్మలను మాత్రమే అనుభవిస్తారు.
ఎవరు చేసిన పుణ్యఫలములను కానీ పాప ఫలములను కానీ వారే అనుభవిస్తారు. కాని భార్య అలా కాదు. భార్య తన భర్త చేసిన పుణ్యములో కానీ పాపమలో కానీ భాగము పంచుకుంటుంది. భర్త కష్టసుఖములలో పాలు పంచుకుంటుంది. అది భార్య ధర్మము. దానిని ఎవరూ కాదనలేరు.
మామగారు తమరిని అడవులకు వెళ్లమంటే నన్నుకూడా వెళ్లమన్నట్టు కాదా! అది వేరుగా చెప్పవలెనా! ఎందుకంటే భార్యకు భర్తతో పాటు ఎక్కడికైనా వెళ్లే హక్కు ఉంటుంది. ఇహలోకంలో కానీ,పరలోకంలో గానీ భర్త ఒక్కడే భార్యకు ఉత్తమ గతులు కల్పించగలడు. కాబట్టి తమరి వెంటే నేను.
అది అడవి కానీ, అంతఃపురము కానీ. మీరు అడవులలో నడుస్తూ ఉంటే నేను మీ ముందు నడుస్తూ మీరు వెళ్లే దారిలో ముళ్లు రాళ్లు లేకుండా శుభ్రం చేస్తాను. కాబట్టి నన్ను కూడా తమరి వెంట అరణ్యములకు తీసుకొని వెళ్లండి. నా వల్ల తమరికి ఎలాంటి కష్టము కలగ కుండా నేను చూసుకుంటాను.
ఓ నాధా! నేను అంతఃపురములో ఉన్నను, అరణ్యములలో ఉన్నను, నాకు నా భర్తతోటిదే లోకము. మరే సుఖములు, భోగములు నాకు అక్కరలేదు. ఈ విషయములన్నీ నాకు నా తల్లి తండ్రులు నాకు ఇదివరకే ఉపదేశించారు. ఇప్పుడు నేను ఎలా నడుచుకోవాలో నాకు ఎవరూ వేరుగా చెప్ప పనిలేదు. మీరు వెళ్లే ప్రదేశము క్రూరమృగము లతో నిండిన దుర్గమారణ్యము కానీ నేను కూడా మీతో వస్తాను.
నేను అడవిలో ఉన్నా నా పుట్టింట్లో ఉన్నట్లు ఉంటాను. ఏ కష్టములను లెక్కచెయ్యను. నేను నిత్యము తమరి సేవ చేసుకుంటూ బ్రహ్మ చర్యమును పాటిస్తూ, అడవులలో స్వేచ్ఛగా విహరిస్తాను. నేను కూడా తమరితో పాటు ఫలములు, కందమూలములు తింటూ బతుకుతాను. మిమ్మల్ని అది తెమ్మని ఇది తెమ్మని ఇబ్బంది పెట్టను.
నాకు కూడా ఎన్నాళ్లనుండో అడవులలో విహరించాలని, అక్కడ ఉన్న హంసలను, నెమళ్లను వాటి సౌందర్యమును చూడాలని, తామర పూల కొలనులో స్నానమాడాలని, ఎంతో కోరికగా ఉంది. ఆ కోరిక ఇన్నాళ్లకు తీరుతున్నందుకు ఎంతో ఆనందంగాఉంది. ఆ మాదిరిగా మీతో లక్ష సంవత్సరములు కూడా ఆనందంగా గడుపుతాను.
ఇంక నా భద్రత అంటారా. మహావీరులు మీరు నా పక్కన ఉండగా నా భద్రత గురించి నాకు భయమెందుకు. కాబట్టి మీరు ఎలా తండ్రిమాటను మన్నించి అడవులకు వెళ్లాలని నిర్ణయించు కున్నారో, నేను కూడా తమరి వెంట రావాలని నిర్ణయించుకున్నాను. నా నిర్ణయంలో మార్పులేదు. ఎందుకంటే నాకు తమరు లేకుండా స్వర్గము కూడా తృణప్రాయము.
తమరు ఎదురుగా ఉంటే దుర్గమారణ్యము కూడా స్వర్గతుల్యము. కాబట్టి నన్ను తమరి వెంట తీసుకొని వెళ్లండి. లేకపోతే నేను ఆత్మహత్య చేసుకొని మరణిస్తాను కాని మిమ్ములను విడిచి ఒక్క క్షణం కూడా బతకలేను.” అని సీత తన నిర్ణయాన్ని స్పష్టంగా రామునికి తెలిపింది.
సీత చెప్పిన మాటలను ఎంతో ఓపిగ్గా విన్నాడు రాముడు. అరణ్యము అంటే ఏమిటో అది ఎలా ఉంటుందో వివరంగా చెప్పి సీతను తనతో పాటు వనవాసమునకు రావడాన్ని ఆపుదాము అని అనుకొన్నాడు రాముడు. సీతతో ఇలా చెప్పసాగాడు.