Ehametto Parametto Ika Naku In Telugu – ఇహమెట్టో పరమెట్టో ఇక నాకు

ఈ పోస్ట్ లో ఇహమెట్టో పరమెట్టో ఇక నాకు కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

ఇహమెట్టో పరమెట్టో ఇక నాకు – అన్నమయ్య కీర్తనలు

సంపుటి: 2
కీర్తన : ఇహమెట్టో పరమెట్టో ఇక నాకు
సంఖ్య : 461
పుట: 311
రాగం: సాళంగనాట

సాళంగనాట

61 ఇహమెట్టో పరమబెట్టో ఇంక నాకు
సహజమై హరియే శరణము నాకు

||పల్లవి||

చిత్తమిది యొకటే చింత వేనేలసంఖ్య
పొత్తుల హరిఁదలఁచఁ బొద్దులేదు
జొత్తుల కన్నులు రెండు చూపులైతే ననంతాలు
తత్తరించి హరిరూపు దగ్గరి చూడలేదు

||ఇహ||

చేతు లివియు రెండే చేష్టలు లక్షోపలక్ష
యీతల హరిఁ బూజించ నిచ్చ లేదు
జాతి నాలిక వొకటే చవులు కోటానఁగోటి
రీతి హరినామ ముచ్చరించ వేళ లేదు

||ఇహ||

వీను లివి రెండే వినికి కొలఁదిలేదు
పూని హరిభక్తి విన బుద్ధి లేదు
యీనటన శ్రీవేంకటేశుఁ డిటు చూచినను
తానే యేలె నిఁకఁ దడఁబాటు లేదు.

||ఇహ||461

అవతారిక:

నాకు ఇహలోకంతోకాని, పరలోకంతోకాని పనిలేదయ్యా! నా సహజగుణం ఒక్కటే. అది హరియే దిక్కని శరణాగతితో జీవితాంతం గడుపుట, అంటున్నారు అన్నమాచార్యులవారు. మానవజీవితం అన్నాక… మనస్సులో చింతలు తప్పవు, అనవసరమైన వాటినుంచి చూపులను మరల్చలేము, చేతులతో ఏవేవో వ్యర్థమైన పనులు చేస్తూనేవుంటాము, దేన్నిపడితే దాన్ని లొట్టలేసుకొని తింటాననే దౌర్భాగ్యపు నా నాలుకవున్నది, ఉన్నవి రెండే అయినా అంతేలేకుండా అన్నీ వినే చెవులున్నాయి. ఇవన్నీ భ్రష్టు పట్టిస్తూనేవున్నాయి. హరిభక్తి మీద బుద్ధినిలవటం లేదు. ఓ శ్రీవేంకటేశ్వరా! శరణు మహాప్రభో శరణు… అంటున్నారు.

భావ వివరణ:

ఓ మానవులారా! ఇక నాకు ఇహమెట్టో (ఇహలోకంలో ఏమవుతుందో) పరమెట్టో (ఊర్ధ్వలోకాలలో ఏమవుతుందో) పనిలేదు. నాకు సహజమైన (సహజసిద్ధంగా నిజాయితీగల) శరణాగతి హరియే (శ్రీహరి మాత్రమే).

నాది యెంత విచిత్రమైన పరిస్థితి అంటే… నాకున్న చిత్తము (మనస్సు) ఒక్కటే కాని దానికున్న చింతలు మాత్రం వేవేలు (వేలసంఖ్యలో వున్నాయి). నేను పెట్టుకొన్న పొత్తులతో (సంగత్వంతో) హరిని తలచుటకు పొద్దులేదు (తీరికేలేదు), జొత్తులకన్నులు (ఎఱ్ఱబారిన కళ్ళు) రెండే, కాని అవి చూచే చూపులకు అనవసరమైన వ్యాపకాలు మాత్రం అనంతం. కాని తత్తరించి (ఆరాటపడి) హరిని దగ్గరనుంచి చూడాలని మాత్రం వాటికుండదు.

నా ఈ చేతులు చూశారా! నాకున్నవి రెండే చేతులు. కాని ఇవి చేసే చేష్టలున్నాయే, అవి లక్షోపలక్ష (అనేక లక్షలు). కాని ఈతల (ఇటుచూస్తే) శ్రీహరిని పూజించాలంటేమాత్రం ఈ చేతులకి ఇచ్చలేదు (కోరిక పుట్టదు). ఇక, జాతి నాలిక (అతిసామాన్య ఔన్నత్యంగల నాలిక) నాకూ ఒక్కటే వున్నది. కాని దానికి కావలసిన చవులు (రుచులు) మాత్రం కోటానుకోట్లు. కాని రీతి (విధాయకంగా) హరినామాన్ని వుచ్చరించటానికి (అనుటకు) వేళలేదు (సమయం దొరకడంలేదు).

వీనులివి రెండే (నాకున్న చెవులు రెండు మాత్రమే). కాని ఇవి వినాలనుకొనే మాటలకి అంతుపొంతులేదు. వాటికి పూనికతో హరిభక్తి గురించి వినండి అంటే వాటికి బుద్ధిలేదు. ఇట్లాంటి నటన (నడవడితో) వున్న నన్ను శ్రీవేంకటేశుడు, ఇటుచూచి, తానే పోనీలే వీడు అర్భకుడు అని జాలిపడి యేలె నన్ను (స్వీకరించి పాలించాడు). అమ్మయ్య! ఇక తడబాటు (తత్తరబాటు) లేదు. ఆయన రక్షణలో బ్రతికేస్తున్నాను. భయం వదిలేశాను.

మరిన్ని అన్నమయ్య కీర్తనలు:

Leave a Comment