Napali Ghana Nidanamavu Neeve Nannu In Telugu – నాపాలి ఘన నిధానమవు నీవే నన్ను

నాపాలి ఘన నిధానమవు నీవే నన్ను - అన్నమయ్య కీర్తనలు

కీర్తన తెలుగు భాషలో ఒక విధమైన సాహిత్య ప్రక్రియ. కర్ణాటక సంగీతంలో ఎందరో వాగ్గేయకారులు కొన్ని వేల కీర్తనలు రచించారు. వారిలో అన్నమయ్య, రామదాసు, త్యాగరాజు, క్షేత్రయ్య మొదలైనవారు ముఖ్యులు. ఈ పోస్ట్ లో నాపాలి ఘన నిధానమవు నీవే నన్ను కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

నాపాలి ఘన నిధానమవు నీవే నన్ను – అన్నమయ్య కీర్తనలు

సంపుటి : 1
కీర్తన : నాపాలి ఘన నిధానమవు నీవే నన్ను
సంఖ్య : 108
పుట : 74
రాగం : శుద్ధ సావేరి

శుద్ధసావేరి

34 నాపాలి ఘన నిధానమవు నీవే నన్ను
నీపాల నిడుకొంటి నీవే నీవే

||పల్లవి||

ఒలసి నన్నేలే దేవుడవు నీవే యెందు
తొలగని నిజబంధుడవు నీవే
పలుసుఖమిచ్చే సంపదవు నీవే, యిట్టే
వెలయ నిన్నియును నీవే నీవే

||నాపాలి||

పొదిగి పాయని యాప్తుడవు నీవే, నాకు –
నదన తోడగు దేహమవు నీవే
మదమువాపెడినా మతియు నీవే, నాకు
వెదక నన్నియును నీవే నీవే

||నాపాలి||

యింకా లోకములకు నెప్పుడు నీవే యీ
పంకజభవాది దేవపతివి నీవే
అంకిలి వాపగ నంతకు నీవే, తిరు
వేంకటేశ్వరుడవు నీవే నీవే

||నాపాలి||

అవతారిక:

నిధానము అంటే పాతరలో దాచివుంచిన సొమ్ము. “నాయందు నిధానమువలె సమయానికి, నీపాల (పట్ల) వుంచుకొని ఆదుకొంటావు. నా దిక్కూ మొక్కూ వేరెవరున్నారు తండ్రీ! నీవే నీవే” అని ఏడుకొండలూ దిగి స్వయంగా శ్రీనివాసుడే దిగివచ్చేలా ఆలాపిస్తున్నారు అన్నమాచార్యులవారు. ఆపదలో ఆదుకునేవాడే నిజమైన బంధువు. ఆ విధంగా చూస్తే బంధువులు బండ్ల కొద్దీ వుంటారు కాని నిజబంధువు ఆ స్వామి తప్ప యెవ్వరూ వుండరు. అంకిలి వాపగ (ఆపద తొలగించ) నంతయు నీవే నీవే అంటున్నారు. మన అదృష్టం కొద్దీ ఈ అమృతధారలో తడిసే భాగ్యం కలుగుతున్నది. అవునా?

భావ వివరణ:

ఓ దేవదేవా! నాపాలి (నాకు లభించిన) గొప్ప నిధానమవు నీవే (పెద్దలు దాచివుంచిన పాతర నీవే). అందుకనే నిన్ను నాపాలన్ ఇడుకొంటి (నా పక్షాన అట్టేపెట్టుకొన్నాను). నీవే నీవే నాకు ఇంకెవ్వరూ వద్దు ప్రభూ!

ఒలసి (చేరి) నన్ను యేలునట్టి దైవము నీవే. నా బంధువులందరూ నా కష్టంలో నన్ను వదిలేశారు. కానీ నన్ను విడువని నిజమైన బంధువు నీవే. సంపదలనాసించేది సుఖమునిస్తాయని. కాని మా సంపదలు అనేక ఇబ్బందులనిస్తాయి. కాని నీవు మాత్రం అనేక సుఖములనిచ్చే సంపదవు. ఈ విధంగా ఇన్ని రకములైన భాగ్యముల నిచ్చే వాడవు నీవే నీవే.

ఆప్తుడు అంటే ఐశ్వర్యము వలె అదుకొనే సన్నిహితుడు. అయితే ఐశ్వర్యమునకుండే దుర్గుణమేమంటే అది యెప్పుడు విడిచిపెట్టి పోతుందో యెవ్వరికీ తెలియదు. కానీ ఓ శ్రీహరీ! నీవు పొదిగినట్లుగా యెన్నడూ వదలిపెట్టని ఆప్తుడవు. నేను చచ్చేదాకా నాతోడువుండే దేహములాగ నీవూ అదనతోడవు (అవసరమైన తోడువు). స్వామీ! నా మదము (అహంకారమును) బాపెడి మతియు (వివేకము) నీవే. పరికించి చూసే సర్వస్వమూ నీవే, నీవే నయ్యా!

ఇంకా చెప్పాలంటే… నాకే కాదు, ఈ లోకముల కన్నింటికీ యెప్పుడూ ఆధారము నీవే. (ఇన్ని లక్షల అంతరిక్షగాముల్లో ఒక్కటి తగిలినా మన ‘భూమి’ గతేమిటో చెప్పండి.) సృష్ఠి స్థితిలయలు పర్యవేక్షించే బ్రహ్మాదిదేవతల పతియు (యేలికవూ) నీవే. మాకు అడుగడుగునా అంకిలియే (ఆపదలే). దానిని తొలగించాలంటే ఇతరులకు సాధ్యమా? ఓ తిరువేంకటేశ్వరా! నీవేనయ్యా! నీవే సమర్థుడివి. ఇంకెవ్వరివల్లా కాదు తండ్రీ!

మరిన్ని అన్నమయ్య కీర్తనలు: