అయోధ్యా కాండ సర్గ 55 రామాయణంలో ముఖ్యమైన అధ్యాయం. ఆ రాత్రి అడవిలో గడిపిన తరువాత రామలక్ష్మణులు, సీత, మరునాడు అక్కడి నుండి బయలుదేరి చిత్రకూట పర్వతమునకు పోవడానికి సిద్ధం అయ్యారు. భరద్వాజుని వద్దకు పోయి ఆయనకు నమస్కారం చేసారు. భరద్వాజుడు సీతారామలక్ష్మణులకు మంగళాచరణము చేసి వీడ్కోలు పలికాడు. వారితో పాటు కొంతదూరము వెళ్లాడు. అక్కడ నిలబడి రామునితో భరద్వాజుడు ఇలా అన్నాడు.
యమునాతరణమ్
ఉషిత్వా రజనీం తత్ర రాజపుత్రావరిందమౌ |
మహర్షిమభివాద్యాథ జగ్మతుస్తం గిరిం ప్రతి ||
1
తేషాం చైవ స్వస్త్యయనం మహర్షిః స చకార హ |
ప్రస్థితాంశ్చైవ తాన్ ప్రేక్ష్యపితా పుత్రానివాన్వగాత్ ||
2
తతః ప్రచక్రమే వక్తుం వచనం స మహామునిః |
భరద్వాజో మహాతేజాః రామం సత్యపరాక్రమమ్ ||
3
గంగాయమునయోః సంధిమాసాద్య మనుజర్షభౌ |
కాలిందీమనుగచ్ఛేతాం నదీం పశ్చాన్ముఖాశ్రితామ్ ||
4
అథాసాద్య తు కాలిందీం శీఘ్రస్రోతసమాపగాం |
తస్యాస్తీర్థం ప్రచరితం పురాణం ప్రేక్ష్య రాఘవౌ ||
5
తత్ర యూయం ప్లవం కృత్వా తరతాంశుమతీం నదీమ్ |
తతో న్యగ్రోధమాసాద్య మహాంతం హరితచ్ఛదమ్ ||
6
వివృద్ధం బహుభిర్వృక్షైః శ్యామం సిద్ధోపసేవితమ్ |
తస్మై సీతాఽంజలిం కృత్వా ప్రయుంజీతాశిషః శివాః ||
7
సమాసాద్య తు తం వృక్షం వసేద్వాఽతిక్రమేత వా |
క్రోశమాత్రం తతో గత్వా నీలం ద్రక్ష్యథ కాననమ్ ||
8
పలాశబదరీమిశ్రం రమ్యం వంశైశ్చ యామునైః |
స పంథాశ్చిత్రకూటస్య గతః సుబహుశో మయా ||
9
రమ్యో మార్దవయుక్తశ్చ వనదావైర్విపర్జితః |
ఇతి పంథానమావేద్య మహర్షిః సంన్యవర్తతః ||
10
అభివాద్య తథేత్యుక్త్వా రామేణ వినివర్తితః |
ఉపావృత్తే మునౌ తస్మిన్ రామో లక్ష్మణమబ్రవీత్ ||
11
కృతపుణ్యాః స్మ సౌమిత్రే మునిర్యన్నోఽనుకంపతే |
ఇతి తౌ పురుషవ్యాఘ్రౌ మంత్రయిత్వా మనస్వినౌ ||
12
సీతామేవాగ్రతః కృత్వా కాలిందీం జగ్మతుర్నదీమ్ |
అథాఽసాద్య తు కాలిందీం శీఘ్రస్రోతోవహాం నదీమ్ ||
13
తౌ కాష్ఠసంఘాటమథో చక్రతుస్సుమహాప్లవమ్ ||
14
శుష్కైర్వంశైః సమాస్తీర్ణముశీరైశ్చ సమావృతమ్ |
తతో వేతసశాఖాశ్చ జంబూశాఖాశ్చ వీర్యవాన్ ||
15
చకార లక్ష్మణశ్ఛిత్వా సీతాయాః సుఖమాసనమ్ |
తత్ర శ్రియమివాచింత్యాం రామో దాశరథిః ప్రియామ్ ||
16
ఈషత్సంలజ్జమానాం తామధ్యారోపయత ప్లవమ్ |
పార్శ్వే చ తత్ర వైదేహ్యా వసనే భూషణాని చ ||
17
ప్లవే కఠినకాజం చ రామశ్చక్రే సహాయుధైః |
ఆరోప్య ప్రథమం సీతాం సంఘాటం ప్రతిగృహ్య తౌ ||
18
తతః ప్రతేరతుర్యత్తౌ వీరౌ దశరథాత్మజౌ |
కాలిందీమధ్యమాయాతా సీతా త్వేనామవందత ||
19
స్వస్తి దేవి తరామి త్వాం పారయేన్మే పతిర్ర్వతమ్ |
యక్ష్యే త్వాం గోనహస్రేణ సురాఘటశతేన చ ||
20
స్వస్తి ప్రత్యాగతే రామే పురీమిక్ష్వాకుపాలితామ్ |
కాలిందీమథ సీతా తు యాచమానా కృతాంజలిః ||
21
తీరమేవాభిసంప్రాప్తా దక్షిణం వరవర్ణినీ |
తతః ప్లవేనాంశుమతీం శీఘ్రగామూర్మిమాలినీమ్ ||
22
తీరజైర్బహుభిర్వృక్షైః సంతేరుర్యమునాం నదీమ్ |
తే తీర్ణాః ప్లవముత్సృజ్య ప్రస్థాయ యమునావనాత్ ||
23
శ్యామం న్యగ్రోధమాసేదుః శీతలం హరితచ్ఛదమ్ |
న్యగ్రోధం తముపాగమ్య వైదేహి వాక్యమబ్రవీత్ ||
24
నమస్తేఽస్తు మహావృక్ష పారయేన్మే పతిర్వ్రతమ్ |
కౌసల్యాం చైవ పశ్యేయం సుమిత్రాం చ యశస్వినీమ్ ||
25
ఇతి సీతాఽంజలిం కృత్వా పర్యగచ్ఛద్వనస్పతిమ్ |
అవలోక్య తతః సీతామాయాచంతీమనిందితామ్ ||
26
దయితాం చ విధేయాం చ రామో లక్ష్మణమబ్రవీత్ |
సీతామాదాయ గచ్ఛ త్వమగ్రతో భరతానుజ ||
27
పృష్ఠతోఽహం గమిష్యామి సాయుధో ద్విపదాం వర |
యద్యత్ఫలం ప్రార్థయతే పుష్పం వా జనకాత్మజా ||
28
తత్తత్ప్రదద్యా వైదేహ్యా యత్రాస్య రమతే మనః |
గచ్ఛతోస్తు తయోర్మధ్యే బభూవ జనకాత్మజా ||
29
మాతంగయోర్మధ్యగతా శుభా నాగవధూరివ |
ఏకైకం పాదపం గుల్మం లతాం వా పుష్పశాలినీమ్ ||
30
అదృష్టపూర్వాం పశ్యంతీ రామం పప్రచ్ఛ సాఽబలా |
రమణీయాన్ బహువిధాన్ పాదపాన్ కుసుమోత్కటాన్ ||
31
సీతావచనసంరబ్దః ఆనయామాస లక్ష్మణః |
విచిత్రవాలుకజలాం హంససారసనాదితామ్ ||
32
రేమే జనకరాజస్య తదా ప్రేక్ష్య సుతా నదీమ్ |
క్రోశమాత్రం తతో గత్వా భ్రాతరౌ రామలక్ష్మణౌ |
బహూన్మేధ్యాన్ మృగాన్ హత్వా చేరతుర్యమునా వనే ||
33
విహృత్య తే బర్హిణపూగనాదితే
శుభే వనే వానరవారణాయుతే |
సమం నదీవప్రముపేత్య సమ్మతం
నివాసమాజగ్ము రదీనదర్శనాః ||
34
ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే పంచపంచాశః సర్గః ||
Ayodhya Kanda Sarga 55 Meaning In Telugu
ఆ రాత్రి అడవిలో గడిపిన తరువాత రామలక్ష్మణులు, సీత, మరునాడు అక్కడి నుండి బయలుదేరి చిత్రకూట పర్వతమునకు పోవడానికి సిద్ధం అయ్యారు. భరద్వాజుని వద్దకు పోయి ఆయనకు నమస్కారం చేసారు. భరద్వాజుడు సీతారామలక్ష్మణులకు మంగళాచరణము చేసి వీడ్కోలు పలికాడు. వారితో పాటు కొంతదూరము వెళ్లాడు. అక్కడ నిలబడి రామునితో భరద్వాజుడు ఇలా అన్నాడు.
“ఓ రామా! మీరు గంగా యమునా సంగమ స్థానము చేరిన తరువాత యమునా నది ఒడ్డునే పడమటి వైపుగా వెళ్లండి. అక్కడ మీరు ఒక తెప్పను కట్టుకొని యమునను దాటండి. మీరు యమునను దాటిన తరువాత మీకు ఒక పెద్ద మర్రిచెట్టు కనపడుతుంది. ఆ చెట్టు పేరు శ్యామము. అక్కడ ఎంతో మంది సిద్ధులు తపస్సు చేసుకుంటూ ఉంటారు. సీత ఆ చెట్టుకు నమస్కారము ఏ కోరికలు కోరుకుంటే అవి తీరుతాయి.
మీరు ఆ చెట్టు కింద ఆగి కొంచెం సేపు విశ్రాంతి తీసుకొన వచ్చును. లేని ఎడల మీరు ప్రయాణము కొనసాగించవచ్చును. అలా ఒక క్రోసెడు దూరము వెళ్లగానే మోదుగ చెట్లతోనూ, రేగు చెట్లతోనూ వెదురు పొదలతోనూ నిండి ఉన్న ఒక అరణ్యము కనిపిస్తుంది. అది యమునా నది ఒడ్డున ఉంటుంది. అదే చిత్రకూటమునకు పోవు దారి. నేను ఆమార్గములో ఎన్నోసార్లు ప్రయాణము చేసాను. అది ఎంతో సురక్షితమైన మార్గము. ఏ ప్రమాదమూ ఉండదు.” అని అన్నాడు భరద్వాజుడు.
ఆ మాటలు విన్న రాముడు భరద్వాజుని చూచి నమస్కరించి “మీరు చేసిన సాయమునకు కృతజ్ఞతలు. ఇంక మీరు ఆశ్రమమునకు వెళ్లండి. మాకు ముందుకు వెళ్లడానికి అనుజ్ఞ ఇవ్వండి.” అని ప్రార్థించాడు. ఆమాటలు విన్న భరద్వాజుడు వారిని ఆశీర్వదించి వెనుకకు వెళ్లిపోయాడు. రామలక్ష్మణులు సీత ముందుకు సాగారు.
వారు యమునా నదిని సమీపించారు. రాముడు లక్ష్మణుడు అక్కడక్కడా వెతికి కొన్ని కర్రలను తీసుకొని వచ్చారు. వాటిని తీగలతో కట్టి ఒక తెప్పను తయారు చేసారు. దాని మీద ఆకులతో మెత్తగా ఆసనములను ఏర్పాటు చేసారు. ముందు సీతను తెప్పలోకి ఎక్కించారు. తరువాత సీత వెంట దశరథుడు పంపిన వస్త్రములను, ఆభరణములను, రామ లక్ష్మణులు తమ వెంట తెచ్చుకున్న ఆయుధము లను, తెప్పలో పెట్టారు. తరువాత రామ లక్ష్మణులు ఎక్కారు. అందరూ ఆ తెప్పలో యమునను దాటుతున్నారు.
తెప్ప యమునానదీ మధ్యకు రాగానే సీత యమునకు నమస్కరించింది. “అమ్మా యమునా నదీమతల్లీ! మమ్ములను చల్లగా కాపాడు. మా అరణ్య వాసము నిర్విఘ్నంగా జరిగేటట్టు చూడు. మేము సురక్షితముగా అయోధ్యకు తిరిగి వస్తే నీకు వేయి గోవులను, వంద ఘటముల మద్యమును సమర్పించుకుంటాను.” అని మొక్కుకుంది.
తరువాత అందరూ యమునా నది దక్షిణతీరము చేరుకున్నారు. అందరూ తెప్పను దిగారు. భరద్వాజుడు చెప్పిన శ్యామ అనే వటవృక్షమును సమీపించారు. సీత ఆ వటవృక్షమునకు నమస్కరించింది. తమను చల్లగా చూడమని ప్రార్థించింది.
తరువాత వారు ముందుకు సాగారు. ముందు లక్ష్మణుడు నడుస్తున్నాడు, మధ్యలో సీత వెనక రాముడు నడుస్తున్నారు. ఆ వనములోని అందాలు చూస్తూ నడుస్తున్నారు.
సీత తాను అంతకు ముందు చూడని వృక్షముల గూర్చి మొక్కలు, లతల గూర్చీ రాముని అడిగి తెలుసుకుంటూ ఉంది. లక్ష్మణుడు వెళ్లి ఆయా చెట్లయొక్క ఆకులను పూలను తీసుకొని వచ్చి సీతకు ఇచ్చాడు. ఆ ప్రకారంగా వారు ఒక త్రోసెడు దూరము నడిచారు. అక్కడ రామలక్ష్మణులు తినడానికి యోగ్యమైన జంతువులను చంపి తీసుకొని వచ్చారు. వాటిని తిని ఆకలి తీర్చుకున్నారు. అంతలో చీకటి పడింది. వారు ఒక సమతల ప్రదేశములో ఆ రాత్రికి ఉండటానికి వసతి ఏర్పాటుచేసుకున్నారు.
శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము ఏబది ఐదవ సర్గ సంపూర్ణము ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్
అయోధ్యాకాండ షట్పంచాశః సర్గః (56) >>