మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అయోధ్యాకాండ పంచాశః సర్గ, “గుహసంగతమ్”, రామాయణంలోని ఒక ముఖ్యమైన భాగం. ఈ సర్గలో, రాముడు, సీత, మరియు లక్ష్మణులు వనవాసం కోసం ప్రయాణిస్తారు మరియు వారి మార్గంలో గుహ అనే అనుచరుడు మరియు స్నేహితుడు కలుసుకుంటారు. గుహ, కేవట్ కులానికి చెందినవాడు, రాముడి పట్ల ఎంతో భక్తి మరియు ప్రేమ చూపిస్తూ, అతడిని ఆదరించే విధంగా ప్రవర్తిస్తాడు. రాముడు మరియు అతని కుటుంబం గుహతో గడిపిన సమయం, అతని ఆతిథ్యం, మరియు స్నేహం ఈ సర్గలో హృద్యంగా వర్ణించబడ్డాయి. ఈ సర్గ రాముడు తన నిస్వార్థత మరియు వినయంతో గుహను సంతృప్తి పరచడం, అలాగే స్నేహం మరియు విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది.
గుహసంగతమ్
విశాలాన్కోసలాన్రమ్యాన్యాత్వా లక్ష్మణపూర్వజః |
అయోధ్యాఽభిముఖో ధీమాన్ప్రాంజలిర్వాక్వమబ్రవీత్ ||
1
ఆపృచ్ఛే త్వాం పురి శ్రేష్ఠే కాకుత్స్థపరిపాలితే |
దైవతాని చ యాని త్వాం పాలయంత్యావసంతి చ ||
2
నివృత్తవనవాసస్త్వామనృణో జగతీపతేః |
పునర్ద్రక్ష్యామి మాత్రా చ పిత్రా చ సహ సఙ్గతః ||
3
తతో రుధిరతామ్రాక్షో భుజముద్యమ్య దక్షిణమ్ |
అశ్రుపూర్ణముఖో దీనోఽబ్రవీజ్జానపదం జనమ్ ||
4
అనుక్రోశో దయా చైవ యథార్హం మయి వః కృతః |
చిరం దుఃఖస్య పాపీయో గమ్యతామర్థసిద్ధయే ||
5
తేఽభివాద్య మహాత్మానం కృత్వా చాపి ప్రదక్షిణమ్ |
విలపంతో నరా ఘోరం వ్యతిష్ఠంత క్వచిత్క్వచిత్ ||
6
తథా విలపతాం తేషామతృప్తానాం చ రాఘవః |
అచక్షుర్విషయం ప్రాయాద్యథాఽర్కః క్షణదాముఖే ||
7
తతో ధాన్యధనోపేతాన్దానశీలజనాన్శివాన్ |
అకుతశ్చిద్భయాన్రమ్యాం శ్చైత్యయూపసమావృతాన్ ||
8
ఉద్యానామ్రవణోపేతాన్సంపన్నసలిలాశయాన్ |
తుష్టపుష్టజనాకీర్ణాన్గోకులాకులసేవితాన్ ||
9
లక్షణీయాన్నరేంద్రాణాం బ్రహ్మఘోషాభినాదితాన్ |
రథేన పురుషవ్యాఘ్రః కోసలానత్యవర్తత ||
10
మధ్యేన ముదితం స్ఫీతం రమ్యోద్యానసమాకులమ్ |
రాజ్యం భోగ్యం నరేంద్రాణాం యయౌ ధృతిమతాంవరః ||
11
తత్ర త్రిపథగాం దివ్యాం శివ తోయామశైవలామ్ |
దదర్శ రాఘవో గఙ్గాం పుణ్యామృషినిసేవితామ్ ||
12
ఆశ్రమైరవిదూరస్థైః శ్రీమద్భిః సమలంకృతామ్ |
కాలేఽప్సరోభిర్హృష్టాభిః సేవితాంభోహ్రదాం శివామ్ ||
13
దేవదానవగంధర్వైః కిన్నరైరుపశోభితామ్ |
నాగగంధర్వపత్నీభిః సేవితాం సతతం శివామ్ ||
14
దేవాక్రీడశతాకీర్ణాం దేవోద్యానశతాయుతామ్ |
దేవార్థమాకాశగమాం విఖ్యాతాం దేవపద్మినీమ్ ||
15
జలఘాతాట్టహాసోగ్రాం ఫేననిర్మలహాసినీమ్ |
క్వచిద్వేణీకృతజలాం క్వచిదావర్తశోభితామ్ ||
16
క్వచిత్స్తిమితగంభీరాం క్వచిద్వేగజలాకులామ్ |
క్వచిద్గంభీరనిర్ఘోషాం క్వచిద్భైరవనిస్వనామ్ ||
17
దేవసంఘాప్లుతజలాం నిర్మలోత్పలశోభితామ్ |
క్వచిదాభోగపులినాం క్వచిన్నిర్మలవాలుకామ్ ||
18
హంససారససంఘుష్టాం చక్రవాకోపకూజితామ్ |
సదా మత్తైశ్చ విహగైరభిసన్నాదితాంతరామ్ ||
19
క్వచిత్తీరరుహైర్వృక్షైర్మాలాభిరివ శోభితామ్ |
క్వచిత్ఫుల్లోత్పలచ్ఛన్నాం క్వచిత్పద్మవనాకులామ్ ||
20
క్వచిత్కుముదషండైశ్చ కుడ్మలైరుపశోభితామ్ |
నానాపుష్పరజోధ్వస్తాం సమదామివ చ క్వచిత్ ||
21
వ్యపేతమలసంఘాతాం మణినిర్మలదర్శనామ్ |
దిశాగజైర్వనగజైర్మత్తైశ్చ వరవారణైః ||
22
దేవోపవాహ్యైశ్చ ముహుః సన్నాదితవనాంతరామ్ |
ప్రమదామివ యత్నేన భూషితాం భూషణోత్తమైః ||
23
ఫలైః పుష్పైః కిసలయైర్వృతాం గుల్మైర్ద్విజైస్తథా |
శింశుమారైశ్చ నక్రైశ్చ భుజంగైశ్చ నిషేవితామ్ ||
24
విష్ణుపాదచ్యుతాం దివ్యామపాపాం పాపనాశినీమ్ |
[* తాం శంకరజటాజూటాద్భ్రష్టాం సాగరతేజసా || *]
25
సముద్రమహీషీం గఙ్గాం సారసక్రౌఞ్చనాదితామ్ |
ఆససాద మహాబాహుః శృఙ్గబేరపురం ప్రతి ||
26
తామూర్మికలిలావర్తామన్వవేక్ష్య మహారథః |
సుమంత్రమబ్రవీత్సూతమిహైవాద్య వసామహే ||
27
అవిదూరాదయం నద్యాః బహుపుష్పప్రవాలవాన్ |
సుమహానిఙ్గుదీవృక్షే వసామోఽత్రైవ సారథే ||
28
ద్రక్ష్యామః సరితాం శ్రేష్ఠాం సమ్మాన్యసలిలాం శివామ్ |
దేవదానవగంధర్వమృగమానుషపక్షిణామ్ ||
29
లక్ష్మణశ్చ సుమంత్రశ్చ బాఢమిత్యేవ రాఘవమ్ |
ఉక్త్వా తమిన్గుదీవృక్షం తదోపయయతుర్హయైః ||
30
రామోఽభియాయ తం రమ్యం వృక్షమిక్ష్వాకునందనః |
రథాదవాతరత్తస్మాత్సభార్యః సహలక్ష్మణః ||
31
సుమంత్రోఽప్యవతీర్యాస్మాన్మోచయిత్వా హయోత్తమాన్ |
వృక్షమూలగతం రామముపతస్థే కృతాంజలిః ||
32
తత్ర రాజా గుహో నామ రామస్యాత్మసమః సఖా |
నిషాదజాత్యో బలవాన్స్థపతిశ్చేతి విశ్రుతః ||
33
స శృత్వా పురుషవ్యాఘ్రం రామం విషయమాగతమ్ |
వృద్ధైః పరివృతోఽమాత్యైరజ్ఞాతిభిశ్చాభ్యుపాగతః ||
34
తతో నిషాదాధిపతిం దృష్ట్వా దూరాదుపస్థితమ్ |
సహ సౌమిత్రిణా రామః సమాగచ్ఛద్గుహేన సః ||
35
తమార్తః సంపరిష్వజ్య గుహో రాఘవమబ్రవీత్ |
యథాఽయోధ్యా తథేయం తే రామ కిం కరవాణి తే ||
36
ఈదృశం హి మహాబాహో కః ప్రప్స్యత్యతిథిం ప్రియమ్ |
తతః గుణవదన్నాద్యముపాదాయ పృథగ్విధమ్ |
అర్ఘ్యం చోపానయత్క్షిప్రం వాక్యం చేదమువాచ హ ||
37
స్వాగతం తే మహాబాహో తవేయమఖిలా మహీ |
వయం ప్రేష్యా భవాన్భర్తా సాధు రాజ్యం ప్రశాధి నః ||
38
భక్ష్యం భోజ్యం చ పేయం చ లేహ్యం చేదముపస్థితమ్ |
శయనాని చ ముఖ్యాని వాజినాం ఖాదనం చ తే ||
39
గుహమేవం బ్రువాణం తం రాఘవః ప్రత్యువాచ హ ||
40
అర్చితాశ్చైవ హృష్టాశ్చ భవతా సర్వథా వయమ్ |
పద్భ్యామభిగమాచ్చైవ స్నేహసందర్శనేన చ ||
41
భుజాభ్యాం సాధు వృత్తాభ్యాం పీడయన్వాక్యమబ్రవీత్ | [పీనాభ్యాం]
దిష్ట్యా త్వాం గుహ పశ్యామి హ్యరోగం సహ బాంధవైః ||
42
అపి తే కుశలం రాష్ట్రే మిత్రేషు చ ధనేషు చ |
యత్త్విదం భవతా కించిత్ప్రీత్యా సముపకల్పితమ్ |
సర్వం తదనుజానామి నహి వర్తే ప్రతిగ్రహే ||
43
కుశచీరాజినధరం ఫలమూలాశినం చ మామ్ |
విద్ధి ప్రణిహితం ధర్మే తాపసం వనగోచరమ్ ||
44
అశ్వానాం ఖాదనేనాహమర్థీ నాన్యేన కేనచిత్ |
ఏతావతాఽత్ర భవతా భవిష్యామి సుపూజితః ||
45
ఏతే హి దయితా రాజ్ఞః పితుర్దశరథస్య మే |
ఏతైః సువిహితైరశ్వైర్భవిష్యామ్యహమర్చితః ||
46
అశ్వానాం ప్రతిపానం చ ఖాదనం చైవ సోఽన్వశాత్ |
గుహస్తత్రైవ పురుషాంస్త్వరితం దీయతామితి ||
47
తతశ్చీరోత్తరాసంగః సంధ్యామన్వాస్య పశ్చిమామ్ |
జలమేవాదదే భోజ్యం లక్ష్మణేనాఽఽహృతం స్వయమ్ ||
48
తస్య భూమౌ శయానస్య పాదౌ ప్రక్షాళ్య లక్ష్మణః |
సభార్యస్య తతోఽభ్యేత్య తస్థౌ వృక్షముపాశ్రితః ||
49
గుహోఽపి సహ సూతేన సౌమిత్రిమనుభాషయన్ |
అన్వజాగ్రత్తతో రామమప్రమత్తో ధనుర్ధరః ||
50
తథా శయానస్య తతోఽస్య ధీమతః
యశస్వినో దాశరథేర్మహాత్మనః |
అదృష్టదుఃఖస్య సుఖోచితస్య సా
తదా వ్యతీయాయ చిరేణ శర్వరీ ||
51
ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే పంచాశః సర్గః ||
Ayodhya Kanda Sarga 50 Meaning In Telugu
రాముడు సీతాలక్ష్మణ సమేతుడై రథము మీద కోసల దేశపు సరిహద్దుల వద్దకు వచ్చాడు. అయోధ్య ఉన్న వంక తిరిగాడు. రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తూ “కాకుత్థ్స వంశస్థులచే పరిపాలింప బడుతున్న ఓ అయోధ్యా నగరమా! పుట్టినప్పటి నుండి నీ ఒడిలో
పెరిగాను. ఇప్పుడు విధి వశాత్తు నిన్ను విడిచి వెళుతున్నాను. నిన్ను, నీలో నివసించు ప్రజలను విడిచిపోవుటకు మీ అనుమతి కోరుతున్నాను. అచిరకాలములోనే నేను వనవాసము పూర్తి చేసుకొని తిరిగి వస్తాను. అయోధ్యానగర ప్రవేశము చేస్తాను.”అని అయోధ్యాపురికి నమస్కరించాడు.
అప్పటికే రాముడు వచ్చాడని వార్త తెలిసి సమీప గ్రామ ప్రజలు రాముని చూడటానికి అక్కడకు చేరుకున్నారు. వారిని చూచి రాముడు ఇలా అన్నాడు. “మీరు నా మీద జాలి చూపించారు. కాని మీ మీ పనులు మానుకొని నాకోసం దుఃఖించడం మంచిది కాదు. మీ పనులు చూచుకొనుడు.” అని వారికి నమస్కరించి చెప్పాడు. వారుకూడా రామునికి పట్టిన దుర్దశకు దుఃఖిస్తున్నారు. తరువాత రాముడు కోసల దేశమును దాటి వెళ్లిపోయాడు.
రాముడు ప్రయాణించు రథము పరమ పవిత్రమైన గంగాతీరము చేరుకొంది. గంగానదీ తీరమున గల మున్యాశ్రమ ములు గంగానదికి అలంకారముగా శోభిల్లుతున్నాయి. దేవలోకమునుండి అప్సరసలు గంగా స్నానము కొరకు అక్కడకు వస్తూ ఉంటారు. పవిత్రమైన ఆ గంగను దేవతలు, దానవులు, గంధర్వులు సదా సేవిస్తూ ఉంటారూ. గంగ కొన్ని ప్రదేశములలో వేగంగానూ కొన్ని ప్రదేశములలో నెమ్మదిగానూ ప్రవహిస్తూ ఉంటుంది. ఆ గంగానదిలో హంసలు, సారస పక్షులుయధేచ్ఛగా విహరిస్తుంటాయి. గంగానదికి ఆ ఒడ్డున ఈ ఒడ్డున ఉన్న పచ్చని చెట్లు గంగానదికి అలంకరించిన పూలమాలల వలె ప్రకాశిస్తున్నాయి. గంగానదీజలములు నిర్మలంగా స్వచ్ఛంగా పారుతున్నాయి. కాని అక్కడక్కడ మదగజములు గంగానదిలో దిగి స్నానము చేయడం వల్ల నీరు కలుషితము అవుతూ మరలా నిర్మలంగా మారుతూ ఉంది. గంగానదీ తీర ప్రాంతము అంతా మధురమైన ఫల వృక్షములతోనూ, పూల మొక్కలతోనూ నిండి సర్వాలంకార శోభిత అయిన మంగళకరమైన స్త్రీ వలె శోభిల్లుతూ ఉంది. అటువంటి గంగాతీరము వెంట ప్రయాణించి రాముడు శృంగిబేరపురమునకు చేరుకున్నాడు.
“సుమంత్రా! రథమును ఆపుము. ఇక్కడ ఒక ఇల్గుదీ వృక్షము ఉన్నది. ఈ వృక్షము ఫలములతో నిండి ఉంది. ఈ రాత్రికి మనము ఇక్కడే ఉండెదము. పవిత్ర గంగానదిలో స్నానము చేసి, ఈ చెట్టు కిందనే నిద్రించెదము.” అని అన్నాడు రాముడు.
రాముని ఆదేశము ప్రకారము సుమంత్రుడు రథమును ఆవృక్షము కింద నిలిపాడు. రాముడు, లక్ష్మణుడు, సీత రథము దిగారు. సుమంత్రుడు కూడా రథము దిగి రథమునకు కట్టిన గుర్రములను మేతకు విడిచి పెట్టి, రాముని వద్దకు వచ్చాడు.
ఆ శృంగిబేరపురంలో బోయజాతికి చెందిన వాడు, అక్కడ ఉన్న బోయలకు నాయకుడు, రామునికి మిత్రుడు అయిన గుహుడు అనే బోయవాడు నివసిస్తున్నాడు. రాముడు తన రాజ్యమునకు వస్తున్నాడని వార్త ముందే తెలిసిన గుహుడు కుల పెద్దలతోనూ, సేవకులతోనూ రాముని వద్దకు వచ్చాడు. గుహుని రాక విని రాముడు అతనికి ఎదురుపోయి అతనిని కౌగలించుకున్నాడు. గుహుని క్షేమసమాచారములు అడిగి తెలుసుకున్నాడు.
“రామా! ఇది నీకు పరాయి ఇల్లు కాదు. నీకు అయోధ్య ఎలాగో ఇదీ అలాగే. నీ ఇష్టం వచ్చినట్టు ఉండవచ్చును. నీ వంటి మిత్రుడు అతిథిగా రావడం నేను చేసుకున్న అదృష్టం. నీకు ఏమి కావాలో ఆజ్ఞాపించు. క్షణంలో సమకూరుస్తాను.” అని అన్నాడు గుహుడు. రామునికి, సీత, లక్ష్మణుడు,సుమంత్రునికి రకరకాలైన భోజనములు, పానీయములు సమకూర్చాడు.
“రామా! భోజన పదార్థములు సిద్ధంగాఉన్నాయి. మీరందరూ భోజనం చేయండి.” అని అన్నాడు. అప్పుడు రాముడు గుహునితో ఇలా అన్నాడు. “నీవు నా వద్దకు వచ్చి నన్ను ఆదరించడమే నీవు మాకు ఇచ్చే ఆతిధ్యము. నేను ప్రస్తుతము వనవాసములో మునివృత్తిలో ఉన్నాను. ఎవరు ఏమి ఇచ్చినా తీసుకొనను. ఫలములు తప్ప వేరే ఆహారము తీసుకొనను. కాని నా రథమునకు కట్టిన అశ్వములు మా తండ్రిగారికి ఎంతో ప్రియమైనవి. వాటికి కావలసిన ఆహారము సమకూర్చుము. అదే నాకుమహదానందము.” అని అన్నాడు రాముడు.
వెంటనే గుహుడు అశ్వములకు కావలసిన ఆహార ఏర్పాట్లు చేసాడు. ఆ రాత్రికి రాముడు కేవలము నీరు ఆహారంగా తీసుకొని నిద్రించాడు. గుహుడు ఆ రాత్రికి అక్కడే ఉన్నాడు. లక్ష్మణునితోనూ, సుమంత్రునితోనూ మాట్లాడుతూ మేలుకొని ఉన్నాడు.
రామునికి ఓ పట్టాన కటిక నేలమీద నిద్రపట్టలేదు. ఆ రాత్రి చాలా దీర్ఘంగా ఉన్నట్టు అనిపించింది రామునికి.
శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము ఏబదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్