Ayodhya Kanda Sarga 100 In Telugu – అయోధ్యాకాండ శతతమః సర్గః

అయోధ్యాకాండం శతతమ (100వ) సర్గలో, భరతుడు నందిగ్రామానికి చేరుకుని, అక్కడ నివసిస్తూ పాలనను పర్యవేక్షించడానికి సిద్ధమవుతాడు. అతను రాముని పాదుకలను సింహాసనంపై ఉంచి, తాను రాముడి ప్రతినిధిగా పాలన చేస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు. భరతుడు వలమాలిన వాస్రాలు ధరించి, నిరాడంబర జీవితం గడపాలని నిర్ణయిస్తాడు. ప్రజలు భరతుని ధర్మ నిష్ఠను, నిస్వార్థతను మెచ్చుకుంటారు. ఈ సర్గలో భరతుడు రాముడి పట్ల తన అపారమైన ప్రేమను, విధి పట్ల తన నిబద్ధతను ప్రదర్శిస్తాడు. రాముడు తిరిగి వస్తాడని ఆశతో, భరతుడు తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ, ప్రజల పట్ల ధర్మబద్ధంగా, న్యాయంగా వ్యవహరిస్తాడు. భరతుడి ధర్మ నిష్ఠ, కరుణ, నాయకత్వ లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి.

కచ్చిత్సర్గః

జటిలం చీరవసనం ప్రాంజలిం పతితం భువి |
దదర్శ రామో దుర్దర్శం యుగాంతే భాస్కరం యథా || ౧ ||

కథంచిదభివిజ్ఞాయ వివర్ణవదనం కృశమ్ |
భ్రాతరం భరతం రామః పరిజగ్రాహ బాహునా || ౨ ||

ఆఘ్రాయ రామస్తం మూర్ధ్ని పరిష్వజ్య చ రాఘవః |
అంకే భరతమారోప్య పర్యపృచ్ఛత్సమాహితః || ౩ ||

క్వ ను తేఽభూత్పితా తాత యదరణ్యం త్వమాగతః |
న హి త్వం జీవతస్తస్య వనమాగంతుమర్హసి || ౪ ||

చిరస్య బత పశ్యామి దూరాద్భరతమాగతమ్ |
దుష్ప్రతీకమరణ్యేఽస్మిన్కిం తాత వనమాగతః || ౫ ||

కచ్చిద్ధారయతే తాత రాజా యత్త్వమిహాఽగతః |
కచ్చిన్నదీనః సహసా రాజా లోకాంతరం గతః || ౬ ||

కచ్చిత్సౌమ్య న తే రాజ్యం భ్రష్టం బాలస్య శాశ్వతమ్ |
కచ్చిచ్ఛుశ్రూషసే తాత పితరం సత్యవిక్రమమ్ || ౭ ||

కచ్చిద్ధశరథో రాజా కుశలీ సత్యసంగరః |
రాజసూయాశ్వమేధానామాహర్తా ధర్మనిశ్చయః || ౮ ||

స కచ్చిద్బ్రాహ్మణో విద్వాన్ధర్మనిత్యో మహాద్యుతిః |
ఇక్ష్వాకూణాముపాధ్యాయో యథావత్తాత పూజ్యతే || ౯ ||

సా తాత కచ్చిత్కౌసల్యా సుమిత్రా చ ప్రజావతీ |
సుఖినీ కచ్చిదార్యా చ దేవీ నందతి కైకయీ || ౧౦ ||

కచ్చిద్వినయసంపన్నః కులపుత్రో బహుశ్రుతః |
అనసూయురనుద్రష్టా సత్కృతస్తే పురోహితః || ౧౧ ||

కచ్చిదగ్నిషు తే యుక్తో విధిజ్ఞో మతిమానృజుః |
హుతం చ హోష్యమాణం చ కాలే వేదయతే సదా || ౧౨ ||

కచ్చిద్దేవాన్పితౄన్మాతౄః గురూన్పితృసమానపి |
వృద్ధాంశ్చ తత వైద్యాంశ్చ బ్రాహ్మణాంశ్చాభిమన్యసే || ౧౩ ||

ఇష్వస్త్రవరసంపన్నమర్థశాస్త్రవిశారదమ్ |
సుధన్వానముపాధ్యాయం కచ్చిత్త్వం తాత మన్యసే || ౧౪ ||

కచ్చిదాత్మసమాః శూరాః శ్రుతవంతో జితేంద్రియాః |
కులీనాశ్చేంగితజ్ఞాశ్చ కృతాస్తే తాత మంత్రిణః || ౧౫ ||

మంత్రో విజయమూలం హి రాజ్ఞాం భవతి రాఘవ |
సుసంవృతో మంత్రధరైరమాత్యైః శాస్త్రకోవిదైః || ౧౬ ||

కచ్చిన్నిద్రావశం నైషీః కచ్చిత్కాలే ప్రబుధ్యసే |
కచ్చిచ్చాపరరాత్రేషు చింతయస్యర్థనైపుణమ్ || ౧౭ ||

కచ్చిన్మంత్రయసే నైకః కచ్చిన్న బహుభిః సహ |
కచ్చిత్తే మంత్రితో మంత్రో రాష్ట్రం న పరిధావతి || ౧౮ ||

కచ్చిదర్థం వినిశ్చిత్య లఘుమూలం మహోదయమ్ |
క్షిప్రమారభసే కర్తుం న దీర్ఘయసి రాఘవ || ౧౯ ||

కచ్చిత్తే సుకృతాన్యేవ కృతరూపాణి వా పునః |
విదుస్తే సర్వకార్యాణి న కర్తవ్యాని పార్థివాః || ౨౦ ||

కచ్చిన్న తర్కైర్యుక్త్యా వా యే చాప్యపరికీర్తితాః |
త్వయా వా తవ వాఽమాత్యైర్బుధ్యతే తాత మంత్రితమ్ || ౨౧ ||

కచ్చిత్సహస్రాన్మూర్ఖాణామేకమిచ్ఛసి పండితమ్ |
పండితో హ్యర్థకృచ్ఛ్రేషు కుర్యాన్నిశ్శ్రేయసం మహత్ || ౨౨ ||

సహస్రాణ్యపి మూర్ఖాణాం యద్యుపాస్తే మహీపతిః |
అథవాఽప్యయుతాన్యేవ నాస్తి తేషు సహాయతా || ౨౩ ||

ఏకోఽప్యమాత్యో మేధావీ శూరో దక్షో విచక్షణః |
రాజానం రాజమాత్రం వా ప్రాపయేన్మహతీం శ్రియమ్ || ౨౪ ||

కచ్చిన్ముఖ్యా మహత్స్వేవ మధ్యమేషు చ మధ్యమాః |
జఘన్యాస్తు జఘన్యేషు భృత్యాః కర్మసు యోజితాః || ౨౫ ||

అమాత్యానుపధాఽతీతాన్పితృపైతామహాంఛుచీన్ |
శ్రేష్ఠాన్శ్రేష్ఠేషు కచ్చిత్త్వం నియోజయసి కర్మసు || ౨౬ ||

కచ్చిన్నోగ్రేణ దండేన భృశముద్వేజితప్రజమ్ |
రాష్ట్రం తవానుజానంతి మంత్రిణః కైకయీసుత || ౨౭ ||

కచ్చిత్త్వాం నావజానంతి యాజకాః పతితం యథా |
ఉగ్రప్రతిగ్రహీతారం కామయానమివ స్త్రియః || ౨౮ ||

ఉపాయకుశలం వైద్యం భృత్యసందూషణే రతమ్ |
శూరమైశ్వర్యకామం చ యో న హంతి స వధ్యతే || ౨౯ ||

కచ్చిద్ధృష్టశ్చ శూరశ్చ మతిమాన్ధృతిమాన్ శుచిః |
కులీనశ్చానురక్తశ్చ దక్షః సేనాపతిః కృతః || ౩౦ ||

బలవంతశ్చ కచ్చిత్తే ముఖ్యా యుద్ధవిశారదాః |
దృష్టాపదానా విక్రాంతాస్త్వయా సత్కృత్యమానితాః || ౩౧ ||

కచ్చిద్బలస్య భక్తం చ వేతనం చ యథోచితమ్ |
సంప్రాప్తకాలం దాతవ్యం దదాసి న విలంబసే || ౩౨ ||

కాలాతిక్రమణాచ్చైవ భక్తవేతనయోర్భృతాః |
భర్తుః కుప్యంతి దుష్యంతి సోఽనర్థః సుమహాన్ స్మృతః || ౩౩ ||

కచ్చిత్సర్వేఽనురక్తాస్త్వాం కులపుత్రాః ప్రధానతః |
కచ్చిత్ప్రాణాంస్తవార్థేషు సంత్యజంతి సమాహితాః || ౩౪ ||

కచ్చిజ్జానపదో విద్వాన్దక్షిణః ప్రతిభానవాన్ |
యథోక్తవాదీ దూతస్తే కృతో భరత పండితః || ౩౫ ||

కచ్చిదష్టాదశాన్యేషు స్వపక్షే దశ పంచ చ |
త్రిభిస్త్రిభిరవిజ్ఞాతైర్వేత్సి తీర్థాని చారకైః || ౩౬ ||

కచ్చిద్వ్యపాస్తానహితాన్ప్రతియాతాంశ్చ సర్వదా |
దుర్బలాననవజ్ఞాయ వర్తసే రిపుసూదన || ౩౭ ||

కచ్చిన్న లోకాయతికాన్బ్రాహ్మణాంస్తాత సేవసే |
అనర్థకుశలా హ్యేతే బాలాః పండితమానినః || ౩౮ ||

ధర్మశాస్త్రేషు ముఖ్యేషు విద్యమానేషు దుర్బుధాః |
బుద్ధిమాన్వీక్షికీం ప్రాప్య నిరర్థం ప్రవదంతి తే || ౩౯ ||

వీరైరధ్యుషితాం పూర్వమస్మాకం తాత పూర్వకైః |
సత్యనామాం దృఢద్వారాం హస్త్యశ్వరథసంకులామ్ || ౪౦ ||

బ్రాహ్మణైః క్షత్రియైర్వైశ్యైః స్వకర్మనిరతైః సదా |
జితేంద్రియైర్మహోత్సాహైర్వృతామార్యైః సహస్రశః || ౪౧ ||

ప్రాసాదైర్వివిధాకారైర్వృతాం వైద్యజనాకులామ్ |
కచ్చిత్సుముదితాం స్ఫీతామయోధ్యాం పరిరక్షసి || ౪౨ ||

కచ్చిచ్చిత్యశతైర్జుష్టః సునివిష్టజనాకులః |
దేవస్థానైః ప్రపాభిశ్చ తటాకైశ్చోపశోభితః || ౪౩ ||

ప్రహృష్టనరనారీకః సమాజోత్సవశోభితః |
సుకృష్టసీమా పశుమాన్హింసాభిః పరివర్జితః || ౪౪ ||

అదేవమాతృకో రమ్యః శ్వాపదైః పరివర్జితః |
పరిత్యక్తో భయైః సర్వైః ఖనిభిశ్చోపశోభితః || ౪౫ ||

వివర్జితో నరైః పాపైర్మమ పూర్వైః సురక్షితః |
కచ్చిజ్జనపదః స్ఫీతః సుఖం వసతి రాఘవ || ౪౬ ||

కచ్చిత్తే దయితాః సర్వే కృషిగోరక్షజీవినః |
వార్తాయాం సంశ్రితస్తాత లోకో హి సుఖమేధతే || ౪౭ ||

తేషాం గుప్తిపరీహారైః కచ్చిత్తే భరణం కృతమ్ |
రక్ష్యా హి రాజ్ఞా ధర్మేణ సర్వే విషయవాసినః || ౪౮ ||

కచ్చిస్త్రియః సాంత్వయసి కచ్చిత్తాశ్చ సురక్షితాః |
కచ్చిన్న శ్రద్దధాస్యాసాం కచ్చిద్గుహ్యం న భాషసే || ౪౯ ||

కచ్చిన్నాగవనం గుప్తం కచ్చిత్తే సంతి ధేనుకాః |
కచ్చిన్న గణికాశ్వానాం కుంజరాణాం చ తృప్యసి || ౫౦ ||

కచ్చిద్దర్శయసే నిత్యం మనుష్యాణాం విభూషితమ్ |
ఉత్థాయోత్థాయ పూర్వాహ్ణే రాజపుత్ర మహాపథే || ౫౧ ||

కచ్చిన్న సర్వే కర్మాంతాః ప్రత్యక్షాస్తేఽవిశంకయా |
సర్వే వా పునరుత్సృష్టా మధ్యమేవాత్ర కారణమ్ || ౫౨ ||

కచ్చిత్సర్వాణి దుర్గాణి ధనధాన్యాయుధోదకైః |
యంత్రైశ్చ పరిపూర్ణాని తథా శిల్పిధనుర్ధరైః || ౫౩ ||

ఆయస్తే విపులః కచ్చిత్కచ్చిదల్పతరో వ్యయః |
అపాత్రేషు న తే కచ్చిత్కోశో గచ్ఛతి రాఘవ || ౫౪ ||

దేవతార్థే చ పిత్రర్థే బ్రాహ్మణాభ్యాగతేషు చ |
యోధేషు మిత్రవర్గేషు కచ్చిద్గచ్ఛతి తే వ్యయః || ౫౫ ||

కచ్చిదార్యో విశుద్ధాత్మా క్షారితశ్చోరకర్మణా |
అపృష్టః శాస్త్రకుశలైర్న లోభాద్వధ్యతే శుచిః || ౫౬ ||

గృహీతశ్చైవ పృష్టశ్చ కాలే దృష్టః సకారణః |
కచ్చిన్న ముచ్యతే చోరో ధనలోభాన్నరర్షభ || ౫౭ ||

వ్యసనే కచ్చిదాఢ్యస్య దుర్గతస్య చ రాఘవ |
అర్థం విరాగాః పశ్యంతి తవామాత్యా బహుశ్రుతాః || ౫౮ ||

యాని మిథ్యాఽభిశస్తానాం పతంత్యస్రాణి రాఘవ |
తాని పుత్రన్పశూన్ ఘ్నంతి ప్రీత్యర్థమనుశాసతః || ౫౯ ||

కచ్చిద్వృద్ధాంశ్చ బాలాంశ్చ వైద్యముఖ్యాంశ్చ రాఘవ |
దానేన మనసా వాచా త్రిభిరేతైర్బుభూషసే || ౬౦ ||

కచ్చిద్గురూంశ్చ వృద్ధాంశ్చ తాపసాన్దేవతాతిథీన్ |
చైత్యాంశ్చ సర్వాన్సిద్ధార్థాన్ బ్రాహ్మణాంశ్చ నమస్యసి || ౬౧ ||

కచ్చిదర్థేన వా ధర్మమర్థం ధర్మేణ వా పునః |
ఉభౌ వా ప్రీతిలోభేన కామేన చ న బాధసే || ౬౨ ||

కచ్చిదర్థం చ ధర్మం చ కామం చ జయతాంవర |
విభజ్య కాలే కాలజ్ఞ సర్వాన్వరద సేవసే || ౬౩ ||

కచ్చిత్తే బ్రాహ్మణాః శర్మ సర్వశాస్త్రార్థకోవిదాః |
ఆశంసంతే మహాప్రాజ్ఞ పౌరజానపదైః సహ || ౬౪ ||

నాస్తిక్యమనృతం క్రోధం ప్రమాదం దీర్ఘసూత్రతామ్ |
అదర్శనం జ్ఞానవతామాలస్యం పంచవృత్తితామ్ || ౬౫ ||

ఏకచింతనమర్థానామనర్థజ్ఞైశ్చ మంత్రణమ్ |
నిశ్చితానామనారంభం మంత్రస్యాపరిరక్షణమ్ || ౬౬ ||

మంగళస్యాప్రయోగం చ ప్రత్యుత్థానం చ సర్వతః |
కచ్చిత్త్వం వర్జయస్యేతాన్రాజదోషాంశ్చతుర్దశ || ౬౭ ||

దశపంచ చతుర్వర్గాన్సప్తవర్గం చ తత్త్వతః |
అష్టవర్గం త్రివర్గం చ విద్యాస్తిస్రశ్చ రాఘవ || ౬౮ ||

ఇంద్రియాణాం జయం బుద్ధ్వా షాడ్గుణ్యం దైవమానుషమ్ |
కృత్యం వింశతివర్గం చ తథా ప్రకృతిమండలమ్ || ౬౯ ||

యాత్రాదండవిధానం చ ద్వియోనీ సంధివిగ్రహౌ |
కచ్చిదేతాన్మహాప్రాజ్ఞ యథావదనుమన్యసే || ౭౦ ||

మంత్రిభిస్త్వం యథోద్దిష్టైశ్చతుర్భిస్త్రిభిరేవ వా |
కచ్చిత్సమస్తైర్వ్యస్తైశ్చ మంత్రం మంత్రయసే మిథః || ౭౧ ||

కచ్చిత్తే సఫలా వేదాః కచ్చిత్తే సఫలాః క్రియాః |
కచ్చిత్తే సఫలా దారాః కచ్చిత్తే సఫలం శ్రుతమ్ || ౭౨ ||

కచ్చిదేషైవ తే బుద్ధిర్యథోక్తా మమ రాఘవ |
ఆయుష్యా చ యశస్యా చ ధర్మకామార్థసంహితా || ౭౩ ||

యాం వృత్తిం వర్తతే తాతో యాం చ నః ప్రపితామహాః |
తాం వృత్తిం వర్తసే కచ్చిద్యా చ సత్పథగా శుభా || ౭౪ ||

కచ్చిత్స్వాదుకృతం భోజ్యమేకో నాశ్నాసి రాఘవ |
కచ్చిదాశంసమానేభ్యో మిత్రేభ్యః సంప్రయచ్ఛసి || ౭౫ ||

రాజా తు ధర్మేణ హి పాలయిత్వా
మహామతిర్దండధరః ప్రజానామ్ |
అవాప్య కృత్స్నాం వసుధాం యథావత్
ఇతశ్చ్యుతః స్వర్గముపైతి విద్వాన్ || ౭౬ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే శతతమః సర్గః || ౧౦౦ ||

Ayodhya Kanda Sarga 100 Meaning In Telugu

భరతుడు మరలా రాముని పాదాల మీదకు జారిపోయాడు. రాముని పాదాలు తన కన్నీటితో కడుగుతున్నాడు. రాముడు వాత్సల్యముతో భరతుని రెండు చేతులతో పైకి లేవనెత్తాడు. తన తొడమీద కూర్చోపెట్టుకున్నాడు. భరతుని కళ్లు తుడిచాడు. శిరస్సు ముద్దుపెట్టుకున్నాడు.
“భరతా! నీవు ఒంటరిగా ఈ అరణ్యములకు ఎందుకు వచ్చావు? తండ్రిగారు దశరథమహారాజుగారు రాలేదా!ఆయన ఎక్కడికి వెళ్లారు? నీవు ఒంటరిగా ఎందుకు వచ్చావు? ఎందుకంటే తండ్రిగారు జీవించి ఉండగా నా కొరకు అరణ్యములకు రావలసిన అవసరము నీకు లేదు కదా! మన వివాహముల తరువాత నీవు నీ మాతామహుల ఇంటికి వెళ్లావు. మరలా ఇన్నాళ్లకు నిన్ను చూడగలిగాను. నాకు చాలాసంతోషంగా ఉంది.
కాని నీవు అరణ్యములకు రావలసిన అవసరమేమి ఉన్నదో నాకు తెలియడం లేదు? తండ్రి గారు క్షేమముగా ఉన్నారా! నేను అడవుల పాలు అయ్యాను అన్న దుఃఖంతో స్వర్గస్థులు కాలేదు కదా! లేకపోతే నీవు చిన్నవాడవు, రాజ్యము చేయుటకు అర్హుడవు కావు అని నీ తండ్రిగారు నీకు రాజ్యము ఇచ్చుటకు నిరాకరించలేదు కదా!

ఏకారణము చేత నీవు ఇక్కడకు వచ్చావో తెలియజెయ్యి. భరతా! నేను అనవసరంగా ఏదేదో ఊహించు కుంటున్నాను. తండ్రిగారు క్షేమంగా ఉన్నారని అనుకుంటున్నాను. నీవు ఆయనకు ప్రతిరోజూ సేవలు చేస్తున్నావు కదా! నాకే ఆ భాగ్యము లేదు.

మన పురోహితుల వారు వసిష్ఠుల వారు క్షేమంగా ఉన్నారా. నీవు ప్రతిరోజూ ఆయనను పూజిస్తున్నావు కదా! నా తల్లులు కౌసల్య, సుమిత్ర కైకేయి క్షేమంగా ఉన్నారు కదా! మన పురోహితులు, వారి కుమారుడు నీకు సర్వవేళలా అండగా ఉంటూ నీచేత అగ్ని కార్యములు, హెూమములు చేయిస్తున్నారు కదా! నీకు ధర్మాధర్మములను బోధిస్తున్నారు కదా!

నీవు దేవతలను, పితరులను, తల్లి తండ్రులను, గురువులను ప్రతిరోజూ పూజిస్తున్నావు కదా! బ్రాహ్మణులను, వృద్ధులను ఆదరిస్తున్నావు కదా! మనకు అస్త్రవిద్య చెప్పిన గురువు సుధన్వుని తగురీతిలో సత్కరిస్తున్నావు కదా!

నీవు రాజ్యాభిషిక్తుడవు అయిన తరువాత నీతిమంతులు, బుద్ధిమంతులు, విద్యావంతులు, రాజనీతి విశారదులనే మంత్రులుగా నియమించావు కదా! ఎందుకంటే, మంత్రులు రాజనీతికోవిదులు, రాజుయొక్క రహస్యములను కాపాడకలిగిన వారు అయిఉండడం ఎంతో ముఖ్యం. (ఈ నాడు కూడా మంత్రుల చేత ఓత్ ఆఫ్ సీక్రెసీ ప్రమాణం చేయించడం ఆచారం).

భరతా! నీ పాలన ఎలా ఉంది! జాగరూకతతో ఉంటున్నావా లేక సమయం కాని సమయాలలో నిద్రపోతున్నావా! రాజుకు చేటు నిద్ర తెస్తుంది. సదా జాగరూకుడవై ఉండాలి. నీవు ఎల్లప్పుడూ తెల్లవారు జామున లేచి మంత్రాంగములు మంత్రులతో చర్చించాలి. అప్పుడు ఏకాంతము లభిస్తుంది. మరొక మాట! నీవు ఒక్కడివే ఆలోచించి నిర్ణయం తీసుకోడమూ తప్పు. అలాగని ఎక్కువమందితో ఆలోచించడము కూడా తప్పే. ఎందుకంటే నీ ఆలోచనలు అందరికీ తెలిసే ప్రమాదం ఉంది.

భరతా! ఎల్లప్పుడూ తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితాన్ని ఇచ్చేపనులకు ప్రాధాన్యం ఇవ్వాలి. అటువంటి పనులను ఆలస్యం చేయకుండా వెంటనే చేయాలి. కాని ఒక విషయంలో జాగ్రత్త వహించాలి. నీవు ఒక పనినిపూర్తి చేసిన తరువాతనే దానిని బహిరంగ పరచాలి. అంతేగానీ, చేయబోయే పనులను ఎవరికీ తెలియనీయ కూడదు. ఎందుకంటే నీ శత్రువులు, నీవు తలపెట్టిన పనులకు ఆటంకం కలిగించే అవకాశం ఉంది.
నీవు, నీ మంత్రులు నీతిమంతులుగా, రహస్యములను బట్టబయలు చేయకున్నా, మీ చుట్ట పక్కల వారు నేర్పుగా మీ రహస్యములను రాబట్ట వచ్చు. అటువంటి వారిని దూరంగా ఉంచుతున్నావు కదా!

భరతా! అవసరమైతే వేయి మంది మూర్ఖులనైనా వదులు కోగాని, ఒక పండితుని మాత్రము నీ దగ్గరకు చేర్చుకో. పండితులు నీకు ఆపదలలో సాయం చేయగలరు. మూర్ఖులు ఎంతమంది ఉన్నా, తిండి చేటు తప్ప ఎలాంటి సాయమూ చెయ్యరు. మూర్కులైన మంత్రులు పది మంది కన్నా మేధావి, పరాక్రమంతుడు, నిజాయితీ పరుడు, పండితుడు అయిన ఒక్క మంత్రి చాలు. ఆ రాజు క్షేమంగా ఉండగలడు.

నీ సేవకులను వారి వారికి తగిన స్థానములలో నియమించావు కదా! ఎక్కువ సామర్థ్యం ఉన్నవారిని గొప్ప స్థానములలోనూ, కాస్త మధ్యస్థంగా తెలివితేటలు ఉన్నవారిని, మధ్యమ స్థానములలోనూ, పూర్తిగా తెలివితేటలే లేనివారిని అధమ స్థానములలోనూ నియమించావా!
(అంటే మెరిట్ ను బట్టి ఉద్యోగస్థులను నియమించాలి అని రామరాజ్యంలో ఉన్న నిబంధన. ఈ రోజుల్లో ప్రతిభకు పట్టకట్టడం మానేసారు. 60 ఏళ్లుదాటినా రిజర్వేషన్ల పేరిట ప్రతిభను కాల రాస్తున్నారు. మీకు చదువు అక్కర్లేదు, తెలివితేటలు అక్కర్లేదు. పది మార్కులు వచ్చినా చాలు, మీకు రిజర్వేషన్లు ఉన్నాయి అని భరోసా ఇస్తున్నారు. ఇదీ నేటి రాజకీయ రామాయణం.)

నీవు ఉద్యోగులను నియమించే ముందు వారిని కఠిన మైన పరీక్షలకు గురిచేసి అందులోనే నెగ్గిన వారినే ఉద్యోగులుగా నియమిస్తున్నావు కదా! (నేడు మనము అనుసరిస్తున్న యు.పి.యస్.సి లేక ఏ.పి.పి.యస్.సి అలాంటివే కదా.)

నీదేశములో ప్రజలు శాంతి భద్రతలు లోపించి, భయభ్రాంతు లవుతుంటే నీ మంత్రులు చూస్తూ ఊరుకోడం లేదు కదా!
(విజయవాడలో స్కూలుకు పోతున్న చిన్నారిని కిడ్నాప్ చేసి, చంపి, బాయిలర్ లో వేసి కాల్చిన కేసు, రెండు సంవత్సరాలు దాటినా ఒకకొలిక్కిరాలేదు. మన గవర్నమెంటు వారికి చీమ కుట్టినట్టయినా లేదు. ఇదీ నేటి మంత్రుల నిర్వాహకము. పైగా మాది రామరాజ్యము అని గొప్పలుచెప్పుకోడం.).

భరతా! నిన్ను నీ మంత్రులు గౌరవిస్తున్నారా లేక నిన్ను ఎదిరించి అవమానించడం లేదు కదా! (మంత్రులు ముఖ్యమంత్రికి ఎదురు తిరగడం, బహిరంగంగా దూషించడం, అధిష్ఠానానికి ఫిర్యాదు చేయడం నేడు పరిపాటి అయిపోయింది.)

ఎందుకంటే భరతా! నీ ఆంతరంగికులు, మంత్రులు ఎవరైనా నీకు ఎదురు తిరిగితే అటువంటి వారిని ఉపేక్షించరాదు. అలా ఉపేక్షిస్తే ఆ రాజు ప్రాణాలకే ముప్పు. (ముఖ్యమంత్రి పక్కనే ఉండి, అసమ్మతిని రెచ్చగొట్టి, ముఖ్యమంత్రి పదవికి, ప్రాణానికి ఎసరు పెట్టడం సర్వసాధారణం అయిపోయింది.)

భరతా! ఇంక నీసేనాపతులు ఎలా ఉన్నారు. సమర్థుడు, విద్యావంతుడు, పరాక్రమ వంతుడు, నిజాయితీ పరుడు, నీకు విశ్వాసపాత్రుడు అయిన వారిని నీ సేనాపతులుగా నియమించావు కదా! బలవంతులు, యుద్ధములో నేర్పుప్రదర్శించినవారిని గౌరవిస్తున్నావు కదా!

నీ సైనికులకు సకాలంలో, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా, జీత భత్యములు అందజేస్తున్నావు కదా! ఎందుకంటే సకాలంలో జీతభత్యములు అందక పోతే సైనికులలో అసంతృప్తి చెలరేగుతుంది. తిరుగుబాటు వచ్చే అవకాశం ఉంది.

నీ రాజ్యములో ఉండే ప్రజలందరూ నీ పట్ల విధేయులుగా ఉన్నారు కదా. నీకోసం తమ ప్రాణములను సైతం అర్పించుటకు సిద్దంగా ఉన్నారు కదా!

నీ దూతలుగా ఎవరిని నియమించుకున్నావు? వారు నీ దేశములో పుట్టిన వారు అయి ఉండాలి. అన్ని విషయములను తెలిసిన సమర్థుడు అయి ఉండాలి. నీవు చెప్పిన విషయములను నేర్పుగా ఉన్నదిఉన్నట్టు ఎదుటివారికి చెప్పే సామర్థ్యం కలిగి ఉండాలి. పైగా అతడు పండితుడు అయి ఉండాలి. ఇటువంటి అర్హతలు కలిగిన పురుషుని నీ దూతగా నియమించు కున్నావు కదా!

నీ స్వదేశములో గానీ, నీ శత్రుదేశములలో గానీ జరిగే విషయములను ఎప్పటి కప్పుడు గూఢచారుల వలన తెలుసుకుంటూ అప్రమత్తంగా ఉంటున్నావు కదా!

ఓ భరతా! ఒకసారి నీతో యుద్ధము చేసి ఓడి పోయిన నీ శత్రువు వాడేం చేస్తాడులే అని విడిచిపెట్ట కూడదు. వాడి పట్ల జాగరూకతగా ఉండాలి. వాడు మరలా తన బలాన్ని పెంచుకొని నిన్ను దొంగదెబ్బ తీయగలడు.

భరతా! కేవలము లౌకికసుఖములగురించి ఆలోచించే భరతా! కేవలము లౌకిక సుఖములగురించి ఆలోచించే నాస్తికవాదుల పట్ల జాగ్రత్తగా ఉండు. వారిని దగ్గర చేరనీయకు. అలాగే, చాలా మంది అజ్ఞానులు, తాము పండితులమనీ, తమకు అంతా తెలుసు అనీ విర్రవీగుతుంటారు. అలాంటివారి పట్ల జాగ్రత్తగా ఉండు. ఎందుకంటే ఇలాంటి వారు ధర్మశాస్త్రములను నమ్మరు. అనవసరమైన తర్కములు చేస్తూ, ప్రజలకు ధర్మశాస్త్రముల పట్ల అపనమ్మకము కలిగిస్తుంటారు. వీరి మాటలు నమ్మకు.

భరతా! అతి పురాతనమైనదీ, ఎందరో చక్రవర్తులు పరిపాలించినదీ అయిన అయోధ్యను జాగ్రత్తగా కాపాడుకుంటున్నావు కదా! ఎందుకంటే అయోధ్య పురాతనమైనా అన్నీ సౌకర్యములు కల నగరము. అయోధ్యలో ఉన్న వ్యవసాయభూములకు, నివాస స్థలములకు నిర్దిష్టమైన హద్దులు, వాటిని తెలిపే గుర్తులు కలిగి ఉన్నాయి. అందు వలన న్యాయపరమైన చిక్కులు వచ్చే అవకాశం లేదు. (నేడు మన న్యాయస్థానములలో ఉన్న వ్యాజ్యాలలో 90 శాతము భూమి సరిహద్దు తగాదాలే.) అయోధ్యలో దేవాలయములు, సత్రములు, చెరువులూ సమృద్ధిగా ఉన్నాయి. అయోధ్యలో ఏటా ఉత్సవములు జరుగుతుంటాయి. ప్రజలందరూ సుఖసంతోషాలతో అలరారుతుంటారు. అయోధ్యలో పంటభూములు సమృద్ధిగా ఉన్నాయి. పశుసంపద అపారంగా ఉంది. ఖనిజ సంపదకు ఆలవాలమైన గనులు అనేకం ఉన్నాయి. హింస అనే పదానికి అయోధ్యలో తావు లేదు. అయోధ్యలో పాపాత్ములు లేరు. అయోధ్య కోట సురక్షితమైనది. అటువంటి అయోధ్యను నీవు చక్కగా రక్షిస్తున్నావు కదా!

నీ రాజ్యములో వర్తక వాణిజ్యములు ఎలాంటి ఆటంకములు లేకుండా సాగుతున్నాయి కదా! వర్తకులు నీకు అనుకూలంగా ఉన్నారు కదా! నీ రాజ్యములో గోరక్షణ సాగుతున్నదికదా! నీ పాలనలో ప్రజలు సురక్షితంగా ఉన్నారు కదా! ఎందుకంటే ప్రజారక్షణ రాజు బాధ్యత.
నీ అంత:పుర స్త్రీలకు నీ రహస్యములను వెల్లడి చేయకుండా, వారిని సరససంభాషణలతో సంతోషపెడుతున్నావు కదా! కాని వారి మాటలకు మోసపోయి తప్పుదారి తొక్కవద్దు.

నీవు గజసంపదను చక్కగా పోషిస్తున్నావు కదా! గజ సంపదను ఎప్పటికప్పుడు పెంచుకుంటూ ఉండు. రాజ్య రక్షణకు గజసంపద చాలా కీలకము.
ఓభరతా! నీవు ప్రతిరోజూ నీ ప్రజలను కలుసుకుంటూ వారి కష్టసుఖములు తెలుసుకుంటున్నావు కదా!

ఓ భరతా! నీ దగ్గర పని చేసే వారి పట్ల కఠినంగా వ్యవహరించి వారు నిన్ను చూడగానే భయపడేట్టు చేయవద్దు. అలాగని వారికి అధిక చనువు ఇవ్వవద్దు. మధ్యేమార్గంగా వారితో మెలుగుతూ ఉండు.

నీ రాజ్యములో ధనము, ధాన్యము, నీరు, నిలవలు సమృద్ధిగా ఉన్నాయికదా. నీకు చాలినంత సైన్యము, యంత్రసామగ్రి సమకూర్చు కున్నావు కదా!
ఓ భరతా! నీ ఆర్ధిక పరిస్థితి ఎలా ఉంది. నీ ఆదాయము ఎక్కువ, వ్యయము తక్కువగా ఉందికదా!
(నేటి కాలంలో లోటుబడ్జెట్ సర్వసాధారణం అయిపోయింది. ఆదాయం తక్కువ, ఖర్చు ఎక్కువ. దాని కోసరం అప్పులు. వాటికి వడ్డీలు. ఆదాయంలోసగం వడ్డీలకే పోతుంది. ఇదీ నేటి ఆర్ధికవ్యవస్థ).

ఓ భరతా! ప్రజాధనము అపాత్రుల చేతులలోనికి వెళ్లడం లేదు కదా! నీవు నీ ధనమును దేవ కార్యములకు, పితృకార్యములకు, అతిధి సత్కారములకు, బ్రాహ్మణులకు, సైనికులకు, మిత్రవర్గములకు వ్యయం చేస్తున్నావు కదా!

భరతా! ఇంక న్యాయ విషయాలకు వస్తాము. నిరపరాధుల మీద నేరం మోపితే, వారిని విచారించకుండా, వారికి తన వాదన వినిపించడానికి అవకాశం ఇవ్వకుండా, దురాశతో అతనికి మరణదండన విధించడం లేదు కదా!

(న్యాయసూత్రాలలో ప్రధానమైనది సహజన్యాయసూత్రము. అంటే ఎవరికైనా అతనికి విరుద్ధంగా ఆదేశాలు ఇచ్చేముందు, అతనికి తన వాదన చెప్పుకొనే అవకాశం ఇవ్వాలి. అలాంటి అవకాశం ఇవ్వకుండా అతనికి విరుద్ధంగా ఏ విధమైన ఆదేశాలు ఇవ్వకూడదు. దీనినే ఏ ప్రపంచ వ్యాప్తంగా ప్రిన్సిపల్స్ ఆఫ్ నాచురల్ జస్టిస్ అని పిలువబడుతుంటాయి. దీనిని త్రేతాయుగంలోనే రాముడు ఆవిష్కరించాడు.)

భరతా! ఎవరైనా దొంగతనముచేస్తూ ఉంటే ప్రత్యక్షంగా చూచి పట్టుకొంటే, అతడు దొంగతనం చేస్తున్నట్టు ప్రత్యక్ష సాక్షులు చెబితే, అటువంటి దొంగలను నీ అధికారులు ధనలోభము చేత విడిచిపెట్టడం లేదు కదా!

(దీనికి వివరణ అనవసరం. అన్నీకాదు కానీ, కొన్ని పోలీసు స్టేషన్లలో జరిగే తంతు ఇదే. అసలు నేరస్తులను విడిచిపెట్టడం, అమాయకుల మీద కేసులు బనాయించడం కొంతమంది పోలీసుల దైనందిన చర్య.)

న్యాయ నిర్ణయము చేసేటప్పుడు నీ న్యాయాధికారులు వీడు ధనికుడు, వీడు పేదవాడు అనే బేధబుద్ధి లేకుండా నిష్పక్షపాతంగా న్యాయ నిర్ణయం చేస్తున్నారు కదా!

భరతా! ఒక విషయం గుర్తుపెట్టుకో. ఏ రాజైనా తన ఇష్టం వచ్చినట్టు శాసనములను చేసి, అమాయకులను కష్టముల పాలు చేస్తాడో, అయాయకుల మీద అక్రమంగా నేరములు మోపి శిక్షిస్తాడో, ఆ రాజు ఎక్కువ కాలము రాజుగా ఉండలేడు. అతని రాజ్యంలో ప్రజలు కార్చిన కన్నీళ్లే ఆ రాజును శిక్షిస్తాయి. సర్వనాశనం చేస్తాయి.

ఓ భరతా! నీ రాజ్యములో శిశువులను, వృద్ధులను, పండితులను ఆదరిస్తున్నావు కదా!
(శిశుసంరక్షణాలయాలు, వృద్ధాశ్రమాలు, వృద్ధాప్య పెన్షన్లు, పండితులకు, కళాకారులకు పెన్షన్లు ఈకోవకే చెందుతాయి. రాముని కాలంలోనే ఇవి అమలులో ఉన్నాయి.).

ఓ భరతా! నీవు ధన సంపాదనకోసం ధర్మాన్ని విడిచిపెట్టడం, సుఖములు మరిగి భోగలాలసుడవై ధర్మమును విడిచి, ధనమును దుర్వినియోగం చెయ్యడం లాంటివి చేయడం లేదుకదా! నీవు ధర్మపరంగా ధనసంపాదన చేస్తూ, ధర్మమార్గంలో సంపాదించిన ధనమునకు తగ్గ కోరికలతో తృప్తిపడుతూ, రాజ్యము చేస్తున్నావుకదా!

ఓభరతా! నీవు ఎల్లప్పుడూ నీ రాజ్యములో ఉన్న ప్రజల క్షేమము కోరుతున్నావు కదా! ఓ భరతా! రాజు చెయ్యకూడనివి,ఆచరించరానివి చెబుతాను విను. రాజునాస్తికుడు కారాదు. అసత్యము పలుకరాదు.

రాజుకు కోపము పనికిరాదు. రాజుకు నిర్లక్ష్యం పనికిరాదు. రాజు విషయములను గురించి దీర్ఘంగా ఆలోచిస్తూ సాగదీయడం, నాన్చడం పనికిరాదు.
(నేటి రాజకీయ నాయకులకు ఇదే తారక మంత్రము. పార్కలాం. వ్యవహారములను నాన్చడం, సాగదీయడం, కమీటీలపేరుతో కాలయాపన చేయడం, వాటికవే పరిష్కారం అవుతాయి అనుకోవడం నేటి రాజకీయనాయకుల తీరు. ఇది తప్పు, చేయకూడదు అని రాముడు స్పష్టంగా చెప్పాడు.)

జ్ఞానులను నిర్లక్ష్యం చేయకూడదు. రాజులకు సోమరి తనంపనికిరాదు. ఇంద్రియ సుఖములకు లోనుకాకూడదు. సమిష్టిగా నిర్ణయాలు తీసుకోవాలే గానీ, ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోకూడదు. తీసుకొన్ననిర్ణయాలను అమలు చేయకుండా ఉండకూడదు. (రాజకీయనాయకులు ఆర్భాటంగా పునాదిరాళ్లు వేయడం, పనులుమాత్రం మొదలు పెట్టకపోవడం మనం చూస్తూనే ఉన్నాము..)

రాజు తన ఆలోచనలను రహస్యంగా ఉంచాలి. బహిర్గతం చేయకూడదు. ప్రజాక్షేమం పాటించాలి. ప్రజావ్యతిరేక పనులు చేయకూడదు. శత్రువులను నేర్పుగా ఎదుర్కోవాలి కానీ, మూర్ఖంగా ఒక్కుమ్మడిగా ఎదుర్కోకూడదు. రాజైన వాడు పైచెప్పిన వాటిని విడిచిపెట్టాలి. భరతా! మరలా చెప్పుచున్నాను. ఎప్పుడూ నీ సొంత నిర్ణయాలు తీసుకోకు. మంత్రులతో కూలంకళంగా చర్చించి సమిష్టి నిర్ణయాలు తీసుకో. మంత్రులతో నీ చర్చలను చాలా రహస్యంగాఉంచు. నీవు ప్రతిరోజూ నీ భార్యతో కలిసి వేదాధ్యయనము చెయ్యి. అది మంచి ఫలితాలనిస్తుంది.నీ బుద్ధిని ఎల్లప్పుడూ ధర్మము నందే ఉంచు. ధర్మము వలననే అర్థ,కామములను పొందు. మన తండ్రిగారు, మన తాత ముత్తాతలు ఈ మార్గమునే అనుసరించారు. నీవుకూడా అదే ధర్మమార్గము అనుసరించి రాజ్యపాలన చెయ్యి.

మరొక మాట. నీవు భుజించునపుడు నీ మిత్రులతో సహాభుజించు. ఒంటరిగా భుజించవద్దు. పైచెప్పిన ప్రకారము రాజ్యపాలన చేసిన రాజు మరణానంతరము నరకమునకుకాకుండా స్వర్గమునకు వెళతాడు. “అని రాముడు భరతునికి రాజనీతి ఉపదేశించాడు.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము నూరవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

అయోధ్యాకాండ ఏకాధికశతతమః సర్గః (101) >>

Leave a Comment