“అయోధ్యాకాండం” వాల్మీకి మహర్షి రామాయణంలోని రెండవ భాగం. ఈ భాగంలో రాముడు, సీతా, లక్ష్మణులు అరణ్యవాసానికి వెళ్లడం, రాముని పాదుకలను భరతుడు పట్టాభిషేకం చేయడం వంటి సంఘటనలు ఉంటాయి. “ఏకాదశ సర్గ” అంటే “అయోధ్యాకాండంలో పదకొండవ అధ్యాయం”. ఈ సర్గలో, దశరథ మహారాజు రాముని అరణ్యవాసానికి పంపిన తర్వాత కలిగిన విచారం మరియు దుఃఖాన్ని వివరించబడింది. సుమంతుడిని పంపి, రాముడు, సీత, లక్ష్మణులని తీసుకురావడానికి ప్రయత్నించినా, వారు తిరిగి రాకపోవడం కూడా ఇందులో ప్రస్తావించబడింది.
వరద్వయనిర్బంధః
తం మన్మథశరైర్విద్ధం కామవేగవశానుగమ్ |
ఉవాచ పృథివీపాలం కైకేయీ దారుణం వచః || ౧ ||
నాస్మి విప్రకృతాదేవ కేనచిన్నావమానితా |
అభిప్రాయస్తు మే కశ్చిత్తమిచ్ఛామి త్వయా కృతమ్ || ౨ ||
ప్రతిజ్ఞాం ప్రతిజానీష్వ యది త్వం కర్తుమిచ్ఛసి |
అథ తద్వ్యాహరిష్యామి యదభిప్రార్థితం మయా || ౩ ||
తామువాచ మహాతేజాః కైకేయీమీషదుత్స్మితః |
కామీ హస్తేన సంగృహ్య మూర్ధజేషు శుచిస్మితామ్ || ౪ ||
అవలిప్తే న జానాసి త్వత్తః ప్రియతరో మమ |
మనుజో మనుజవ్యాఘ్రాద్రామాదన్యో న విద్యతే || ౫ ||
తేనాజయ్యేన ముఖ్యేన రాఘవేణ మహాత్మనా |
శపే తే జీవనార్హేణ బ్రూహి యన్మనసేచ్ఛసి || ౬ ||
యం ముహూర్తమపశ్యంస్తు న జీవేయమహం ధ్రువమ్ |
తేన రామేణ కైకేయి శపే తే వచనక్రియామ్ || ౭ ||
ఆత్మనా వాత్మజైశ్చాన్యైర్వృణేయం మనుజర్షభమ్ |
తేన రామేణ కైకేయి శపే తే వచనక్రియామ్ || ౮ ||
భద్రే హృదయమప్యేతదనుమృశ్యోద్ధరస్వ మే |
ఏతత్సమీక్ష్య కైకేయి బ్రూహి యత్సాధు మన్యసే || ౯ ||
బలమాత్మని పశ్యంతీ న మాం శంకితుమర్హసి |
కరిష్యామి తవ ప్రీతిం సుకృతేనాపి తే శపే || ౧౦ ||
సా తదర్థమనా దేవీ తమభిప్రాయమాగతమ్ |
నిర్మాధ్యస్థ్యాచ్చ హర్షాచ్చ బభాషే దుర్వచం వచః || ౧౧ ||
తేన వాక్యేన సంహృష్టా తమభిప్రాయమాగతమ్ |
వ్యాజహార మహాఘోరమభ్యాగతమివాంతకమ్ || ౧౨ ||
యథా క్రమేణ శపసి వరం మమ దదాసి చ |
తచ్ఛృణ్వంతు త్రయస్త్రింశద్దేవాః సాగ్నిపురోగమాః || ౧౩ ||
చంద్రాదిత్యౌ నభశ్చైవ గ్రహా రాత్ర్యహనీ దిశః |
జగచ్చ పృథివీ చేయం సగంధర్వా సరాక్షసా || ౧౪ ||
నిశాచరాణి భూతాని గృహేషు గృహదేవతాః |
యాని చాన్యాని భూతాని జానీయుర్భాషితం తవ || ౧౫ ||
సత్యసంధో మహాతేజాః ధర్మజ్ఞః సుసమాహితః |
వరం మమ దదాత్యేష తన్మే శృణ్వంతు దేవతాః || ౧౬ ||
ఇతి దేవీ మహేష్వాసం పరిగృహ్యాభిశస్య చ |
తతః పరమువాచేదం వరదం కామమోహితమ్ || ౧౭ ||
స్మర రాజన్పురా వృత్తం తస్మిన్ దైవాసురే రణే |
తత్ర చాచ్యావయచ్ఛత్రుస్తవ జీవితమంతరా || ౧౮ ||
తత్ర చాపి మయా దేవ యత్త్వం సమభిరక్షితః |
జాగ్రత్యా యతమానాయాస్తతో మే ప్రాదదా వరౌ || ౧౯ ||
తౌ తు దత్తౌ వరౌ దేవ నిక్షేపౌ మృగయామ్యహమ్ |
తథైవ పృథివీపాల సకాశే సత్యసంగర || ౨౦ ||
తత్ప్రతిశ్రుత్య ధర్మేణ న చేద్దాస్యసి మే వరమ్ |
అద్యైవ హి ప్రహాస్యామి జీవితం త్వద్విమానితా || ౨౧ ||
వాఙ్మాత్రేణ తదా రాజా కైకేయ్యా స్వవశే కృతః |
ప్రచస్కంద వినాశాయ పాశం మృగ ఇవాత్మనః || ౨౨ ||
తతః పరమువాచేదం వరదం కామమోహితమ్ |
వరౌ యౌ మే త్వయా దేవ తదా దత్తౌ మహీపతే || ౨౩ ||
తౌ తావదహమద్యైవ వక్ష్యామి శృణు మే వచః |
అభిషేకసమారంభో రాఘవస్యోపకల్పితః || ౨౪ ||
అనేనైవాభిషేకేణ భరతో మేఽభిషేచ్యతామ్ |
యో ద్వితీయో వరో దేవ దత్తః ప్రీతేన మే త్వయా || ౨౫ ||
తదా దైవాసురే యుద్ధే తస్య కాలోఽయమాగతః |
నవ పంచ చ వర్షాణి దండకారణ్యమాశ్రితః || ౨౬ ||
చీరాజినజటాధారీ రామో భవతు తాపసః |
భరతో భజతామద్య యౌవరాజ్యమకంటకమ్ || ౨౭ ||
ఏష మే పరమః కామో దత్తమేవ వరం వృణే |
అద్య చైవ హి పశ్యేయం ప్రయాంతం రాఘవం వనమ్ || ౨౮ ||
స రాజరాజో భవ సత్యసంగరః
కులం చ శీలం చ హి రక్ష జన్మ చ |
పరత్రవాసే హి వదంత్యనుత్తమం
తపోధనాః సత్యవచో హితం నృణామ్ || ౨౯ ||
ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే ఏకాదశః సర్గః || ౧౧ ||
Ayodhya Kanda Sarga 11 Meaning In Telugu
దశరథమహారాజు చేత అడిగించుకొని బతిమాలించుకొని తుదకు కైక లేచి కూర్చుంది. మన్మధ బాణములకు బలి అయిన, తన మీది కామానికి దాసోహం అన్న, తన భర్త దశరథమహారాజుతో ఇలా అంది. “మహారాజా! మీరు అన్నట్టు నన్ను ఎవరూ బాధించలేదు. ఎవరూ అవమానించలేదు. నాకు మిమ్మల్ని కొన్ని వరములు అడగ వలెనని ఒక కోరిక కలిగింది. అది మీరు తీర్చాలి. మీరు తీరుస్తాను అని ప్రతిజ్ఞ చేస్తేనే నా కోరికల గురించి చెబుతాను. తీరా నేను అడిగిన తరువాత మీరు కాదు అంటే నా మనసుకు బాధకలుగుతుంది. మరలా మీరు నన్ను బతిమాలాలి కదా!” అని సన్న సన్నగా సన్నాయి నొక్కులు నొక్కుతున్నట్టు మాట్లాడింది కైక.
ఆ మాటలకు దశరథుడు నవ్వాడు. కైక తల వెంట్రుకలు తన చేతిలోకి తీసుకొని సుతారంగా నిమురుతూ ఇలా అన్నాడు. దానిని తప్పకుండా నెరవేరుస్తాను. సందేహపడకుండా అడుగు. ఎందుకంటే రాముడు నాకు ఆరోప్రాణమ. నా ఐదు ప్రాణాలు లోపల ఉంటే రాముడు నాకు బయట ఉన్న ఆరో ప్రాణము. రాముని చూడనిది నేను ముహూర్త కాలం కూడా జీవించలేను. అటువంటి రాముని మీద ఒట్టుపెట్టుకొని చెబుతున్నాను. ఇంకా నన్ను నమ్మవా!
ఓ కైకా! రాముని రక్షించుకోడానికి నేను నా ప్రాణాలను, నా ముగ్గురు కుమారుల ప్రాణాలను కూడా బలిపెట్టడానికి సిద్ధంగా ఉ న్నాను. అటువంటి రాముని మీద ఒట్టుపెట్టుకుంటున్నాను. ఏమిటి ఇంకా ఆలోచిస్తున్నావు. నీ మనసులో ఏముందో తెలుసుకోడానికి నా మనసు అల్లల్లాడిపోతూ ఉంది. నా మీద దయయుంచి నీ కోరిక వెల్లడించు.
అసలు నా మీద నీకు ఎందుకింత అపనమ్మకము. నా మీద నీకు సర్వాధికారాలు ఉన్నాయి కదా! నన్ను శాసించే అధికారం నీకు ఉంది. ఇంకా విను. నేను రాముని మీదనే కాదు. నేను ఇప్పటి దాకా యజ్ఞయాగములు చేసి ఆర్జించిన పుణ్యము మీదకూడా ఒట్టుపెట్టు కొని చెబుతున్నాను. ఇంక నైనా నీ మనసులోని కోరిక బయట పెట్టు. ఇంకా నన్ను చిత్రవధ చెయ్యకు.” అని దీనంగా వేడుకున్నాడు దశరథుడు. ఆ మాటలకు ఎంతో సంతోషించింది కైక. ఇంక తన మనోరథము ఈడేరింది అని మురిసిపోయింది. మెల్లి మెల్లిగా తన మనసులోని కోరికలు దశరథుని తో వెల్లడించసాగింది.
“ఓ దశరథ మహారాజా! మీరు ఎంతో ఒట్టు పెట్టుకొన్నారు. కనుక నా కోరికలు మీరు తీరుస్తారు అని నమ్మకం కుదిరింది. అదీ కాకుండా మీరు చేసిన ప్రతిజ్ఞలను అగ్నిదేవునితో సహా దేవతలందరూ సాక్షీభూతంగా విన్నారు. వారే కాదు సూర్య చంద్రులు, ఆకాశము, గ్రహములు, రాత్రింపగళ్లు, భూమి, గంధర్వులు, రాక్షసులు, నిశా చరులు, సమస్త గృహదేవతలు, ఇంకా ఇతరములైన భూతజాతులు అన్నీ వింటున్నారు. ఓ పంచభూతములారా! సకల దేవతలారా! వినండి. నాకు, నా భర్త దశరథమహారాజుగారు, పూర్వముదేవాసుర యుద్ధములలో నాకు ఇస్తాను అని వాగ్దానము చేసిన రెండు వరములు ఇచ్చుటకు అంగీకరించారు. దానికి మీరే సాక్షులు.” అని పలికి కైక దశరథుని వచన బద్ధుని చేసింది. కైక ఏమి అడిగితే దానిని ఇవ్వడం తప్ప దశరథునికి మరోగత్యంతరం లేదు అన్న పరిస్థితులు కల్పించింది. కైకమీది మోహంతో దశరథుడు ఆమె అన్న మాటలకు అన్నిటికీ మరోమాట మాట్లాడకుండా తలూపుతున్నాడు.
“ఓ దశరథ మహారాజా! ఒక్కసారి మీరు నేను పాల్గొన్న దేవాసుర యుద్ధము జ్ఞప్తికి తెచ్చుకొనుడు. అప్పుడు ఏం జరిగిందో మీకు జ్ఞాపకం ఉంది కదా! ఆ యుద్ధములో మీరు ఓడిపోయే పరిస్తితి వచ్చింది. మీ రథ, గజ, తురగ, పదాతి బలములు అన్నీ నశించి పోయాయి. అప్పుడు నేను మిమ్ములను రెండు సార్లు ప్రాణాపాయము నుండి రక్షించాను. అప్పుడు మీరు నాకు రెండు వరములు ఇస్తాను అని వాగ్దానము చేసారు. మీకు గుర్తు ఉంది కదా! కాని నేను అప్పుడు ఆ వరములు కోరలేదు. నాకు ఇష్టం వచ్చినపుడు కోరుకుంటాను అని అన్నాను. . మీరు సత్యవాక్పరిపాలకులు. ఆడిన మాట తప్పరు. అందుకని ఆ వరములు ఇప్పుడు కోరుకుంటున్నాను. ఆవరములు మీరు నాకు ప్రసాదించాలి. తీరా నేను అడిగిన తరువాత మీరు ఇవ్వను అంటే నాకు ఆత్మహత్యే శరణ్యము అవుతుంది.” అని నేర్పుగా దశరథుని తన మాటల వలలో ఇరికించింది. వలలో పడ్డ లేడిపిల్లలా అయ్యాడు దశరథుడు. కైకేయి కామ పాశములలో ఇరుక్కుపోయాడు. అన్నిటికీ తలూపాడు. “నీవు ఏం కోరితే అది ఇస్తాను. సందేహించకు” అని వాగ్దానం చేసాడు దశరథుడు.
“ఓ దశరథమహారాజా! ఇప్పుడు నా మనసుకు స్వస్థత చేకూరింది. మీరు చేసిన వాగ్దానమును నెరవేరుస్తారు అనే నమ్మకం కుదిరింది. ఆ నాడు మీరు నాకు ఇచ్చిన వరములు కోరుకుంటు న్నాను. సావధాన చిత్తులై వినండి. మీరు రేపు రాముని పట్టాభిషేకమునకు అనేక సంభారములు సమకూర్చారు కదా! ఎన్నో ఏర్పాట్లు చేసారు కదా! నగరమంతా అలంకరింపచేసారు కదా! చాలాసంతోషము. కాని ఒక చిన్న మార్పు. అదే సంభారములతో, అవే ఏర్పాట్లతో, అవే అలంకరణలతో, రేపు రామునికి బదులు నా కుమారుడు భరతునికి యౌవ్వరాజ్య పట్టాభిషేకము జరిపించండి. ఇది నేను కోరుకునే, మీరు నాకు ఇవ్వడానికి అంగీకరించిన మొదటి వరము.” అంది కైక.
దశరథునికి తలతిరిగినట్టయింది. “మరి రాముడు! రాముడు ఏమవుతాడు!” అని అప్రయత్నంగా అన్నాడు దశరథుడు. వెంటనే కైక “రాముడు పదునాలుగు సంవత్సరములు నార చీరలు కట్టుకొని అరణ్యవాసం చెయ్యాలి. అయోధ్యకు దూరంగా ఉండాలి. ఇదే నా రెండవ వరము.” అని పలికింది కైక.
దశరథునికి నోటి మాట రాలేదు. ఒళ్లంతా మొద్దుబారిపోయింది. శరీరం వశం తప్పుతూ ఉంది. ఏమనాలో తోచని స్థితిలో ఉ న్నాడు దశరథుడు. మరలా ఇలా అంది. “నా కుమారుడైన భరతుడు శత్రుభయం లేకుండా రాజ చేయాలి. (అంటే రాముడు భరతునికి శత్రుసమానుడు అని చెప్పకనే చెప్పింది కైక). అందుకే రాముడు ఈ రోజే అరణ్యములకు వెళ్లాలి. రాముడు వనవాసమునకు వెళ్లడం నేను కళ్లారా చూడాలి. ఓ దశరథ మహారాజా! ఓ సత్యవాక్పరిపాలకా! మీరు అన్న మాట నిలబెట్టుకోండి. నా కోరికలు తీర్చండి. ఎందుకంటే సత్యమునే పలకడం, అన్న మాటకు కట్టుబడి ఉండటం ఇక్ష్వాకు వంశ రాజుల ధర్మము. అన్న మాట నిలబెట్టుకుంటే నీకు పరలోకములో సుఖశాంతులు కలుగుతాయి.” అని తేల్చి చెప్పింది కైక. (ఇంక ఈ లోకంలో నీ పని అయిపోయింది అని అప్రయత్నంగా కైక నోటినుండి వెలువడింది.).
శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము పదకొండవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్