Ayodhya Kanda Sarga 18 In Telugu – అయోధ్యాకాండ అష్టాదశః సర్గః

“రామాయణం” లో అయోధ్యాకాండ అష్టాదశః సర్గం (18వ సర్గ)లో, భరతుడు రాముని కాళ్లకు నమస్కరించి, అయోధ్యకు తిరిగి రావాలని కోరతాడు. భరతుని ప్రేమను చూసి రాముడు హృదయపూర్వకంగా స్పందించి, కానీ తన వనవాసం నిబద్ధతను గుర్తు చేస్తాడు. భరతుడు రాముని పాదుకలను తీసుకొని తిరిగి రాజధానికి వెళతాడు. రాముడు తన పాదుకలను భరతుడికి అప్పగించి, భరతుని ధర్మాన్ని పాటించమని చెప్పాడు. ఈ సర్గలో, రాముడి ధైర్యం, విధేయత, మరియు భరతుని పితృభక్తి ప్రధానాంశాలు. రాముడు తన ధర్మాన్ని పాటిస్తూ, భరతుడు తన యజ్ఞాన్ని నిర్వహించడంలో ఒకరికొకరు స్ఫూర్తిగా నిలుస్తారు.

వనవాసనిదేశః

స దదర్శాసనే రామో నిషణ్ణం పితరం శుభే |
కైకేయీసహితం దీనం ముఖేన పరిశుష్యతా || ౧ ||

స పితుశ్చరణౌ పూర్వమభివాద్య వినీతవత్ |
తతో వవందే చరణౌ కైకేయ్యాః సుసమాహితః || ౨ ||

రామేత్యుక్త్వా చ వచనం బాష్పపర్యాకులేక్షణః |
శశాక నృపతిర్దీనో నేక్షితుం నాభిభాషితుమ్ || ౩ ||

తదపూర్వం నరపతేర్దృష్ట్వా రూపం భయావహమ్ |
రామోఽపి భయమాపన్నః పదా స్పృష్ట్వేవ పన్నగమ్ || ౪ ||

ఇంద్రియైరప్రహృష్టైస్తం శోకసంతాపకర్శితమ్ |
నిఃశ్వసంతం మహారాజం వ్యథితాకులచేతసమ్ || ౫ ||

ఊర్మిమాలినమక్షోభ్యం క్షుభ్యంతమివ సాగరమ్ |
ఉపప్లుతమివాదిత్యముక్తానృతమృషిం యథా || ౬ ||

అచింత్యకల్పం హి పితుస్తం శోకముపధారయన్ |
బభూవ సంరబ్ధతరః సముద్ర ఇవ పర్వణి || ౭ ||

చింతయామాస చ తదా రామః పితృహితే రతః |
కిం స్విదద్యైవ నృపతిర్న మాం ప్రత్యభినందతి || ౮ ||

అన్యదా మాం పితా దృష్ట్వా కుపితోఽపి ప్రసీదతి |
తస్య మామద్య సంప్రేక్ష్య కిమాయాసః ప్రవర్తతే || ౯ ||

స దీన ఇవ శోకార్తో విషణ్ణవదనద్యుతిః |
కైకేయీమభివాద్యైవ రామో వచనమబ్రవీత్ || ౧౦ ||

కచ్చిన్మయా నాపరాద్ధమజ్ఞానాద్యేన మే పితా |
కుపితస్తన్మమాచక్ష్వ త్వం చైవైనం ప్రసాదయ || ౧౧ ||

అప్రసన్నమనాః కిం ను సదా మాం ప్రతి వత్సలః |
వివర్ణవదనో దీనో న హి మామభిభాషతే || ౧౨ ||

శారీరో మానసో వాఽపి కచ్చిదేనం న బాధతే |
సంతాపో వాఽభితాపో వా దుర్లభం హి సదా సుఖమ్ || ౧౩ ||

కచ్చిన్న కించిద్భరతే కుమారే ప్రియదర్శనే |
శత్రుఘ్నే వా మహాసత్త్వే మాతౄణాం వా మమాశుభమ్ || ౧౪ ||

అతోషయన్మహారాజమకుర్వన్వా పితుర్వచః |
ముహూర్తమపి నేచ్ఛేయం జీవితుం కుపితే నృపే || ౧౫ ||

యతోమూలం నరః పశ్యేత్ప్రాదుర్భావమిహాత్మనః |
కథం తస్మిన్న వర్తేత ప్రత్యక్షే సతి దైవతే || ౧౬ ||

కచ్చిత్తే పరుషం కించిదభిమానాత్పితా మమ |
ఉక్తో భవత్యా కోపేన యత్రాస్య లులితం మనః || ౧౭ ||

ఏతదాచక్ష్వ మే దేవి తత్త్వేన పరిపృచ్ఛతః |
కిం నిమిత్తమపూర్వోఽయం వికారో మనుజాధిపే || ౧౮ ||

ఏవముక్తా తు కైకేయీ రాఘవేణ మహాత్మనా |
ఉవాచేదం సునిర్లజ్జా ధృష్టమాత్మహితం వచః || ౧౯ ||

న రాజా కుపితో రామ వ్యసనం నాస్య కించన |
కించిన్మనోగతం త్వస్య త్వద్భయాన్నాభిభాషతే || ౨౦ ||

ప్రియం త్వామప్రియం వక్తుం వాణీ నాస్యోపవర్తతే |
తదవశ్యం త్వయా కార్యం యదనేనాశ్రుతం మమ || ౨౧ ||

ఏష మహ్యం వరం దత్త్వా పురా మామభిపూజ్య చ |
స పశ్చాత్తప్యతే రాజా యథాఽన్యః ప్రాకృతస్తథా || ౨౨ ||

అతిసృజ్య దదానీతి వరం మమ విశాంపతిః |
స నిరర్థం గతజలే సేతుం బంధితుమిచ్ఛతి || ౨౩ ||

ధర్మమూలమిదం రామ విదితం చ సతామపి |
తత్సత్యం న త్యజేద్రాజా కుపితస్త్వత్కృతే యథా || ౨౪ ||

యది తద్వక్ష్యతే రాజా శుభం వా యది వాఽశుభమ్ |
కరిష్యసి తతః సర్వమాఖ్యాస్యామి పునస్త్వహమ్ || ౨౫ ||

యది త్వభిహితం రాజ్ఞా త్వయి తన్న విపత్స్యతే |
తతోఽహమభిధాస్యామి న హ్యేష త్వయి వక్ష్యతి || ౨౬ ||

ఏతత్తు వచనం శ్రుత్వా కైకేయ్యా సముదాహృతమ్ |
ఉవాచ వ్యథితో రామస్తాం దేవీం నృపసన్నిధౌ || ౨౭ ||

అహో ధిఙ్నార్హసే దేవి వక్తుం మామీదృశం వచః |
అహం హి వచనాద్రాజ్ఞః పతేయమపి పావకే || ౨౮ ||

భక్షయేయం విషం తీక్ష్ణం మజ్జేయమపి చార్ణవే |
నియుక్తో గురుణా పిత్రా నృపేణ చ హితేన చ || ౨౯ ||

తద్బ్రూహి వచనం దేవి రాజ్ఞో యదభికాంక్షితమ్ |
కరిష్యే ప్రతిజానే చ రామో ద్విర్నాభిభాషతే || ౩౦ ||

తమార్జవసమాయుక్తమనార్యా సత్యవాదినమ్ |
ఉవాచ రామం కైకేయీ వచనం భృశదారుణమ్ || ౩౧ ||

పురా దైవాసురే యుద్ధే పిత్రా తే మమ రాఘవ |
రక్షితేన వరౌ దత్తౌ సశల్యేన మహారణే || ౩౨ ||

తత్ర మే యాచితో రాజా భరతస్యాభిషేచనమ్ |
గమనం దండకారణ్యే తవ చాద్యైవ రాఘవ || ౩౩ ||

యది సత్యప్రతిజ్ఞం త్వం పితరం కర్తుమిచ్ఛసి |
ఆత్మానం చ నరశ్రేష్ఠ మమ వాక్యమిదం శృణు || ౩౪ ||

సన్నిదేశే పితుస్తిష్ఠ యథాఽనేన ప్రతిశ్రుతమ్ |
త్వయాఽరణ్యం ప్రవేష్టవ్యం నవ వర్షాణి పంచ చ || ౩౫ ||

భరతస్త్వభిషిచ్యేత యదేతదభిషేచనమ్ |
త్వదర్థే విహితం రాజ్ఞా తేన సర్వేణ రాఘవ || ౩౬ ||

సప్త సప్త చ వర్షాణి దండకారణ్యమాశ్రితః |
అభిషేకమిమం త్యక్త్వా జటాజినధరో వస || ౩౭ ||

భరతః కోసలపురే ప్రశాస్తు వసుధామిమామ్ |
నానారత్నసమాకీర్ణాం సవాజిరథకుంజరామ్ || ౩౮ ||

ఏతేన త్వాం నరేంద్రోఽయం కారుణ్యేన సమాప్లుతః |
శోకసంక్లిష్టవదనో న శక్నోతి నిరీక్షితుమ్ || ౩౯ ||

ఏతత్కురు నరేంద్రస్య వచనం రఘునందన |
సత్యేన మహతా రామ తారయస్వ నరేశ్వరమ్ || ౪౦ ||

ఇతీవ తస్యాం పరుషం వదంత్యాం
న చైవ రామః ప్రవివేశ శోకమ్ |
ప్రవివ్యథే చాపి మహానుభావో
రాజా తు పుత్రవ్యసనాభితప్తః || ౪౧ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే అష్టాదశః సర్గః || ౧౮ ||

Ayodhya Kanda Sarga 18 Meaning In Telugu

రాముడు తండ్రిగారైన దశరథ మహారాజు అంత:పురములో ప్రవేశించాడు. లక్ష్మణుడు ద్వారము బయట నిలబడ్డాడు. న్నతాసనముమీద కూర్చొని ఉన్న తండ్రి గారిని చూచాడు రాముడు. తండ్రి మొహములో ఆనందము కనపడటం లేదు. ఏదో చింత తండ్రిమొహంలో కనపడటం చూచాడు రాముడు.

రాముడు ముందుగా తన తండ్రి దశరథునకు పాదాభి వందనము చేసాడు. తరువాత పక్కనే నిలబడిఉన్న తన తల్లి కైకకు పాదాభివందనము చేసాడు.

దశరథుడు రాముని వంక దీనంగా చూచాడు. “రామా!” అని ఒక్కమాట అతికష్టం మీద అన్నాడు. దుఃఖము పొంగుకొని రాగా తల వంచుకొని తలను చేత్తో పట్టుకొని కూర్చున్నాడు.

తండ్రిగారి పరిస్థితి చూచి రాముడు ఆశ్చర్యపోయాడు. ఇంతకు ముందు తండ్రిని ఇలాంటి పరిస్థితిలో ఎన్నడూ చూడలేదు రాముడు. ఎంతటి క్లిష్టమైన రాచకార్యములలో మునిగి ఉన్నా, తనను చూడగానే దశరథుడు “నాయనా! రామా!

నా దగ్గరకు రా!” అని ఆప్యాయంగా పిలిచి తన పక్కనే కూర్చోపెట్టుకొనే వాడు. అలాంటిది ఇప్పుడు, తన పట్టాభిషేక సమయములో, ఇంతటి సంతోష సమయంలో, తండ్రిగారు ఇలా చింతా క్రాంతమైన ముఖంతో ఉండటం రామునికి ఆశ్చర్యం కలిగించింది. తనను ఎప్పుడూ సంతో షంగా పలకరించే తండ్రి ఇలా ముభావంగా ఉండటానికి కారణం తెలియక తల్లడిల్లిపోతున్నాడు రాముడు.

కైక వంక చూచాడు. “అమ్మా! తండ్రిగారికి నా వలన ఏమైనా అపరాథము జరిగిందా! నేను ఏమన్నా పొరపాటు చేసానా! నా తండ్రి నా మీద కోపంగా ఉండటానికి కారణమేమి? అమ్మా! నీవైనా తండ్రి గారికి నా మీద అనుగ్రహం కలిగేట్టు చెయ్యమ్మా! లేకపోతే ఎప్పుడూ నేనంటే ప్రసన్నంగా ఉండే తండ్రిగారు ఈరోజు నా మీద కోపంగా  అమ్మా! తండ్రిగారికి శరీరంలో బాగా లేదా! రాజవైద్యులను సంప్రదించారా అమ్మా! లేక మానసికంగా ఏమైనా బాధపడుతున్నారా! చెప్పమ్మా! అమ్మా! మానవులకు సుఖదు:ఖాలు సహజం కదమ్మా!

అమ్మా! వారి మేనమామ గారింట్లో భరతుడు, శత్రుఘ్నుడు క్షేమంగా ఉన్నారు కదా! వారి కేమీ కాలేదు కదా! అమ్మా! మీకు గానీ, మా తల్లి కౌసల్యకు గానీ సుమిత్రకు గానీ అసౌకర్యము ఏమీ కలగలేదు కదా!

అమ్మా! నాన్నగారి దుఃఖము పోగొట్టడానికి ఏమైనా చేస్తాను అమ్మా! తండ్రిగారు దుఃఖపడుతుంటే నేను క్షణకాలం కూడా జీవించలేనమ్మా! ఎందుకంటే నాకు ఈ జన్మను, ఈ శరీరాన్ని ఇచ్చింది నా తండ్రి. ఈ శరీరం ఆయన అధీనము. ఆయన కోసం, ఆయన సంతోషం కోసం నేను ఏమైనా చేస్తాను.

అమ్మా! నాకు ఒక సందేహము. తమరికి మా తండ్రి గారికీ ఏమైనా మనస్పర్ధలు వచ్చాయా! మీరేమన్నా తండ్రిగారిని అనకూడని మాటలు అన్నారా! అమ్మా! నిజం చెప్పమ్మా! ఎందుకంటే నాకు ఊహ తెలిసిన తరువాత నా తండ్రిని నేను ఎప్పుడూ ఇటువంటి దీనస్థితిలో చూడలేదు.” అని కైకను బతిమాలాడు రాముడు.

రాముని ఆవేదన చూచి ఇదే సమయము అని అనుకొంది కైక. తన మనసులో మాట బయట పెట్టింది. “రామా! మీ తండ్రిగారికి శరీరంలో ఎలాంటి జబ్బూలేదు. ఆయన ఆరోగ్యంగానే ఉన్నారు. కాని తన మనసులో ఉన్న విషయం నీతో ఎలా చెప్పాలా అని మధనపడుతున్నారు. ఆ విషయం నీతో చెప్పడానికి భయపడుతున్నాడు కూడా.” అని ఒక క్షణం ఆగింది కైక. “చెప్పమ్మా! తండ్రిగారు నాతో చెప్పడానికి సంకోచిస్తున్న విషయం ఏమిటి? త్వరగా చెప్పమ్మా!” అని తొందర పెట్టాడు రాముడు. “ఏమీ లేదు రామా! చాలా స్వల్పమైన విషయం. పూర్వము దేవాసుర యుద్ధంలో మీ తండ్రిగారు నాకు రెండు వరములు ప్రసాదించారు. ఆ వరములు ఇప్పుడు నేను కోరుకున్నాను. ఆ వరముల గురించి నీతో చెప్పడానికి భయపడుతున్నారు మీ తండ్రిగారు.

రామా! ధర్మము నీకు తెలుసుకదా! సత్యము పలకడం, ఆడినమాట తప్పక పోవడం ఉత్తములకు పరమ ధర్మము కదా! మీ తండ్రి నీ కోసరం ఆడినమాట తప్పుతాను అని అంటున్నాడు. ఇదేమి న్యాయం?” అని పలికింది కైక.

రాముడు.
“అమ్మా! ఆ వరాలు ఏమిటమ్మా. నాతో చెప్పమ్మా!” అని అడిగాడు “అవి నీకు దు:ఖము కలిగించేవి రామా! నీవు ఏమీ అనుకోనంటే చెబుతాను. విన్న తరువాత నన్ను దూషించకూడదు. అసలు ఈ వరాల సంగతి మీ తండ్రిగారే నీకు చెప్పాలి. కానీ నీకు చెప్పడానికి నీతండ్రి సంకోచిస్తున్నాడు.” అని మరలా ఆగింది కైక.

ఈ సందిగ్ధము భరించలేకపోతున్నాడు రాముడు.
“అమ్మా! నా సంగతి తెలిసికూడా నీవు ఇలా మాట్లాడటం తగునా అమ్మా! నా తండ్రిగారు చెబితే నేను నా ప్రాణములు కూడా గడ్డిపోచలాగా విడిచిపెడతాను. అగ్నిలో దూకమన్నా దూకుతాను. విషం తాగమన్నా తాగుతాను. సముద్రంలో దూకమన్నా దూకుతాను.

అమ్మా! నా తండ్రి ఏది చెబితే అది చేస్తాను అని ప్రతిజ్ఞ చేస్తున్నాను. అమ్మా! నేను రెండు మాటలు మాట్లాడను. నాది ఒకే మాట. చెప్పమ్మా! నేనేం చెయ్యాలి? నా తండ్రి దుఃఖము ఎలా పోగొట్టాలి?” అని అడిగాడు రాముడు.

కైకకు లోలోపల ఎంతో సంతోషంగా ఉంది. రాముడు దారిలోకి వచ్చాడు అనుకొంది. తన కోరికలు తీరే సమయం ఎంతోదూరం లేదు అనుకొంది. మెల్ల మెల్లగా తన మనసులో ఉన్న కోరికలు బయటపెట్టింది.

“పూర్వము జరిగిన దేవాసుర యుద్ధములో నేను నీ తండ్రి దశరథుని ప్రాణములు కాపాడినపుడు ఆయన నాకు రెండు వరములు ఇచ్చాడు. అవి ఇప్పుడు నేను కోరాను. అందులో మొదటిది. భరతుని అయోధ్యకు పట్టాభిషిక్తుని చేయడం. రెండవది నీవు పదునాలుగు సంవత్సరములు నారచీరలు ధరించి, కందమూలములు తింటూ దండకారణ్యములో వనవాసము చెయ్యడం.

నీ తండ్రి మాటను నిలబెట్టాలన్నా, నీవు పలికిన మాటలు, చేసిన ప్రతిజ్ఞ, నిలుపుకోవాలన్నా నేను చెప్పినట్టు చేయాలి. మీ తండ్రి గారి ఆజ్ఞ పాలించడం నీ ధర్మం. అందుకని నీవు పదునాలుగు సంవత్సరములు వనవాసము చెయ్యాలి. నీ పట్టాభిషేకము కొరకు నీ జరిగిన ఏర్పాట్లతోనే నీకు బదులు భరతునికి పట్టాభిషేకము జరగాలి. భరతుడు రాజ్యము చేస్తుంటే, అతనికి నీవు అడ్డు కాకుండా వనములలో ఉండాలి.

ఈ విషయములను నీతో చెప్పడానికి నీ తండ్రి సంకోచి స్తున్నాడు. బాధపడుతున్నాడు. అందుకని ఆయన మాటలుగా నేను నీకు చెబుతున్నాను. నీ తండ్రి మాటను నిలబెట్టి, ఆయన కీర్తిని ముల్లోకాలలో వ్యాపింపజెయ్యి. కుమారుడుగా అదే నీ కర్తవ్యము కదా! నీ సత్యవాక్పరిపాలన వలన నీ తండ్రి తరిస్తాడు.” అని పలికింది కైక.

కైక ఆ మాదిరి చెబుతూ ఉంటే దశరథుడు కోపంతో రగిలిపోతున్నాడు. బాధతో కుమిలిపోతున్నాడు. రాముని మొహం చూడలేక సిగ్గుతో తలదించుకున్నాడు. కాని రాముడు మాత్రము చిరునవ్వుతో తల్లి కైక మాటలు విన్నాడు. ఆయన మొహంలో ఏ మాత్రం బాధ కనిపించలేదు.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము పదునెనిమిదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అయోధ్యాకాండ ఏకోనవింశః సర్గః (19) >>

Leave a Comment