Ayodhya Kanda Sarga 19 In Telugu – అయోధ్యాకాండ ఏకోనవింశః సర్గః

అయోధ్యాకాండ ఏకోనవింశః సర్గంలో, దశరథుడు రాముని వనవాసానికి పంపడానికి నిర్ణయించుకుంటాడు. కౌసల్య, సుమిత్రలు శోకంతో విలపిస్తారు. రాముడు, సీత, లక్ష్మణులు వనానికి వెళ్లడానికి సిద్ధపడతారు. ప్రజలు రాముని వెంబడిస్తారు. వదినీతో పాటు అనుసరించేందుకు సుమిత్రతో మాట్లాడతారు. రాముడు ధైర్యంగా ఉండి కైకేయితో మాట్లాడుతూ తండ్రి ఆజ్ఞను పాటించాల్సిన కర్తవ్యాన్ని గుర్తు చేస్తాడు. ఈ సర్గలో, రాముని ధైర్యం, దశరథుడి వేదన, కుటుంబం, ప్రజల దుఃఖం ప్రాముఖ్యత వహిస్తాయి. రాముడు తన ధర్మం కోసం వనవాసం కోసం సిద్ధపడడం, కుటుంబం, ప్రజల పట్ల తన బాధ్యతలను నిర్దేశించడం ఈ సర్గలో ప్రాముఖ్యత వహిస్తుంది.

రామప్రతిజ్ఞా

తదప్రియమమిత్రఘ్నో వచనం మరణోపమమ్ |
శ్రుత్వా న వివ్యథే రామః కైకేయీం చేదమబ్రవీత్ || ౧ ||

ఏవమస్తు గమిష్యామి వనం వస్తుమహం త్వితః |
జటాఽజినధరో రాజ్ఞః ప్రతిజ్ఞామనుపాలయన్ || ౨ ||

ఇదం తు జ్ఞాతుమిచ్ఛామి కిమర్థం మాం మహీపతిః |
నాభినందతి దుర్ధర్షో యథాపురమరిందమః || ౩ ||

మన్యుర్న చ త్వయా కార్యో దేవి బ్రూమి తవాగ్రతః |
యాస్యామి భవ సుప్రీతా వనం చీరజటాధరః || ౪ ||

హితేన గురుణా పిత్రా కృతజ్ఞేన నృపేణ చ |
నియుజ్యమానో విస్రబ్ధః కిం న కుర్యామహం ప్రియమ్ || ౫ ||

అలీకం మానసం త్వేకం హృదయం దహతీవ మే |
స్వయం యన్నాహ మాం రాజా భరతస్యాభిషేచనమ్ || ౬ ||

అహం హి సీతాం రాజ్యం చ ప్రాణానిష్టాన్ధనాని చ |
హృష్టో భ్రాత్రే స్వయం దద్యాం భరతాయాప్రచోదితః || ౭ ||

కిం పునర్మనుజేంద్రేణ స్వయం పిత్రా ప్రచోదితః |
తవ చ ప్రియకామార్థం ప్రతిజ్ఞామనుపాలయన్ || ౮ ||

తదాశ్వాసయ హీమం త్వం కిం న్విదం యన్మహీపతిః |
వసుధాసక్తనయనో మందమశ్రూణి ముంచతి || ౯ ||

గచ్ఛంతు చైవానయితుం దూతాః శీఘ్రజవైర్హయైః |
భరతం మాతులకులాదద్యైవ నృపశాసనాత్ || ౧౦ ||

దండకారణ్యమేషోఽహమితో గచ్ఛామి సత్వరః |
అవిచార్య పితుర్వాక్యం సమా వస్తుం చతుర్దశ || ౧౧ ||

సా హృష్టా తస్య తద్వాక్యం శ్రుత్వా రామస్య కైకయీ |
ప్రస్థానం శ్రద్దధానా హి త్వరయామాస రాఘవమ్ || ౧౨ ||

ఏవం భవతు యాస్యంతి దూతాః శీఘ్రజవైర్హయైః |
భరతం మాతులకులాదుపావర్తయితుం నరాః || ౧౩ ||

తవ త్వహం క్షమం మన్యే నోత్సుకస్య విలంబనమ్ |
రామ తస్మాదితః శీఘ్రం వనం త్వం గంతుమర్హసి || ౧౪ ||

వ్రీడాఽన్వితః స్వయం యచ్చ నృపస్త్వాం నాభిభాషతే |
నైతత్కించిన్నరశ్రేష్ఠ మన్యురేషోఽపనీయతామ్ || ౧౫ ||

యావత్త్వం న వనం యాతః పురాదస్మాదభిత్వరన్ |
పితా తావన్న తే రామ స్నాస్యతే భోక్ష్యతేఽపి వా || ౧౬ ||

ధిక్కష్టమితి నిశ్వస్య రాజా శోకపరిప్లుతః |
మూర్ఛితో న్యపతత్తస్మిన్పర్యంకే హేమభూషితే || ౧౭ ||

రామోఽప్యుత్థాప్య రాజానం కైకేయ్యాఽభిప్రచోదితః |
కశయేవాహతో వాజీ వనం గంతుం కృతత్వరః || ౧౮ ||

తదప్రియమనార్యాయాః వచనం దారుణోదయమ్ |
శ్రుత్వా గతవ్యథో రామః కైకేయీం వాక్యమబ్రవీత్ || ౧౯ ||

నాహమర్థపరో దేవి లోకమావస్తుముత్సహే |
విద్ధి మామృషిభిస్తుల్యం కేవలం ధర్మమాస్థితమ్ || ౨౦ ||

యదత్రభవతః కించిచ్ఛక్యం కర్తుం ప్రియం మయా |
ప్రాణానపి పరిత్యజ్య సర్వథా కృతమేవ తత్ || ౨౧ ||

న హ్యతో ధర్మచరణం కించిదస్తి మహత్తరమ్ |
యథా పితరి శుశ్రూషా తస్య వా వచనక్రియా || ౨౨ ||

అనుక్తోఽప్యత్రభవతా భవత్యా వచనాదహమ్ |
వనే వత్స్యామి విజనే వర్షాణీహ చతుర్దశ || ౨౩ ||

న నూనం మయి కైకేయి కించిదాశంససే గుణమ్ |
యద్రాజానమవోచస్త్వం మమేశ్వరతరా సతీ || ౨౪ ||

యావన్మాతరమాపృచ్ఛే సీతాం చానునయామ్యహమ్ |
తతోఽద్యైవ గమిష్యామి దండకానాం మహద్వనమ్ || ౨౫ ||

భరతః పాలయేద్రాజ్యం శుశ్రూషేచ్చ పితుర్యథా |
తథా భవత్యా కర్తవ్యం స హి ధర్మః సనాతనః || ౨౬ ||

స రామస్య వచః శ్రుత్వా భృశం దుఃఖహతః పితా |
శోకాదశక్నువన్బాష్పం ప్రరురోద మహాస్వనమ్ || ౨౭ ||

వందిత్వా చరణౌ రామో విసంజ్ఞస్య పితుస్తదా |
కైకేయ్యాశ్చాప్యనార్యాయాః నిష్పపాత మహాద్యుతిః || ౨౮ ||

స రామః పితరం కృత్వా కైకేయీం చ ప్రదక్షిణమ్ |
నిష్క్రమ్యాంతఃపురాత్తస్మాత్స్వం దదర్శ సుహృజ్జనమ్ || ౨౯ ||

తం బాష్పపరిపూర్ణాక్షః పృష్ఠతోఽనుజగామ హ |
లక్ష్మణః పరమక్రుద్ధః సుమిత్రాఽఽనందవర్ధనః || ౩౦ ||

ఆభిషేచనికం భాండం కృత్వా రామః ప్రదక్షిణమ్ |
శనైర్జగామ సాపేక్షో దృష్టిం తత్రావిచాలయన్ || ౩౧ ||

న చాస్య మహతీం లక్ష్మీం రాజ్యనాశోఽపకర్షతి |
లోకకాంతస్య కాంతత్వాచ్ఛీతరశ్మేరివ క్షపా || ౩౨ ||

న వనం గంతుకామస్య త్యజతశ్చ వసుంధరామ్ |
సర్వలోకాతిగస్యేవ లక్ష్యతే చిత్తవిక్రియా || ౩౩ ||

ప్రతిషిధ్య శుభం ఛత్రం వ్యజనే చ స్వలంకృతే |
విసర్జయిత్వా స్వజనం రథం పౌరాంస్తథా జనాన్ || ౩౪ ||

ధారయన్మనసా దుఃఖమింద్రియాణి నిగృహ్య చ |
ప్రవివేశాత్మవాన్వేశ్మ మాతురప్రియశంసివాన్ || ౩౫ ||

సర్వో హ్యభిజనః శ్రీమాన్ శ్రీమతః సత్యవాదినః |
నాలక్షయత రామస్య కించిదాకారమాననే || ౩౬ ||

ఉచితం చ మహాబాహుర్న జహౌ హర్షమాత్మనః |
శారదః సముదీర్ణాంశుశ్చంద్రస్తేజ ఇవాత్మజమ్ || ౩౭ ||

వాచా మధురయా రామః సర్వం సమ్మానయఞ్జనమ్ |
మాతుః సమీపం ధర్మాత్మా ప్రవివేశ మహాయశాః || ౩౮ ||

తం గుణైః సమతాం ప్రాప్తో భ్రాతా విపులవిక్రమః |
సౌమిత్రిరనువవ్రాజ ధారయన్దుఃఖమాత్మజమ్ || ౩౯ ||

ప్రవిశ్య వేశ్మాతిభృశం ముదాఽన్వితం
సమీక్ష్య తాం చార్థవిపత్తిమాగతామ్ |
న చైవ రామోఽత్ర జగామ విక్రియాం
సుహృజ్జనస్యాత్మవిపత్తిశంకయా || ౪౦ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే ఏకోనవింశః సర్గః || ౧౯ ||

Ayodhya Kanda Sarga 19 Meaning In Telugu

తన తల్లి కైక మాటలు విన్న రాముడు ఏ మాత్రం బాధ పడలేదు. “అమ్మా! కైకా! అన్నీ నీవు చెప్పినట్లే జరుగుతాయమ్మా. నేను తండ్రి గారి మాట ప్రకారము జటలు, నార చీరలు ధరించి అరణ్యవాసము చేస్తాను. ఈ చిన్న విషయానికి తండ్రి గారు ఎందుకు బాధపడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. తండ్రిగారి మాట నేను ఎప్పుడు కాదన్నాను. ఆయన మాట నేను కాదు అని అంటే కదా వారు బాధ పడాలి. వారి మాట నాకు శిరోధార్యము.

అమ్మా! నాకు జన్మనిచ్చిన వాడు నా తండ్రి. నన్ను పెంచి, పెద్దచేసి, నాకు విద్యాబుద్ధులు చెప్పించాడు. అటువంటి తండ్రి మాటను నేను కాదంటానా అమ్మా! కాని తండ్రిగారు ఈ విషయము నాకు స్వయంగా చెప్పిఉంటే బాగుండేది. తండ్రిగారు “రామా! నేను భరతునికి యౌవరాజ్య పట్టాభిషేకము చేయదలిచాను” అని ఒక్కమాట నాతో అంటే నేను రాజ్యమును భరతునికి అప్పగించి ఉండేవాడిని. ఒక్క రాజ్యమే కాదు తండ్రిగారు కోరితే నా సర్వస్వమును భరతునికి అర్పిస్తాను. ఇందులో సందేహము లేదు.

అమ్మా! నీవు తండ్రి గారిని ఓదార్చు. అమ్మా! అమ్మా! చూడమ్మా. తండ్రి గారు నా మొహం లోకి చూడలేక నేల చూపులు చూస్తూ కన్నీరు కారుస్తున్నారు. నేను తండ్రిగారి మాటలను పాటిస్తాను అని చెప్పమ్మా. వెంటనే నేను భరతుని తీసుకొని వచ్చుటకు దూతలను కేకయ దేశమునకు పంపుతాను.

అమ్మా! నా తండ్రిగారి మాటలు మంచివా, మంచివి కావా అని నేను తర్కించను. తండ్రి గారి నిర్ణయం నాకు అనుకూలమా ప్రతికూలమా అని ఆలోచించను. తండ్రిగారి మాటలను తప్పకుండా పాటిస్తాను. పదునాలుగేళ్లు వనవాసము చేస్తాను. నా మాట నమ్మండి.”అని నిశ్చయంగా అన్నాడు రాముడు.

అప్పుడు రాముని మాటలలో నమ్మకం కుదిరింది కైకకు. కైక మనసు సంతోషంతో పరవళ్లు తొక్కింది. కాని పైకి మాత్రం ఆ సంతోషమును బహిర్గతము చేయలేదు. రాముని తొందరపెట్టసాగింది.

“రామా! వెంటనే వేగముగా పరుగెత్తే గుర్రముల మీద దూతలను భరతుని మేనమామ ఇంటికి పంపు. భరతుడు వెంటనే ఇక్కడకు రావాలి. భరతుడు వచ్చువరకు నీవు ఆగనవసరం లేదు. నీవు వెంటనే అరణ్యములకు ప్రయాణమై వెళ్లు. నీ తండ్రి గారు స్వయంగా నీతో చెప్పలేదని సందేహించకు. పాపం మీ తండ్రిగారు నీతో ఈ విషయం ఎలా చెప్పాలా అని తనలో తనే మధనపడుతున్నాడు. నీవు ఇక్కడ ఉంటే ఆ బాధతో నీ తండ్రి ఆహారము కానీ, నీరు కానీ ముట్టడు. కాబట్టి నీవు తక్షణం వనములకు వెళితేనే ఆయన ఆహారం తీసుకుంటాడు.” అని పలికిన కైక వంక అసహ్యంగా చూచాడు దశరథుడు.

రాముని మొహంలోకి చూడలేక మరలా తల దించుకున్నాడు. రామునికి విషయం అర్థం అయింది. తన తల్లి కైకతో ఇలా అన్నాడు. “అమ్మా! నేను ఎల్లప్పుడూ ధర్మమును తప్పను. తండ్రి మాటలను పాటిస్తాను. నా తండ్రి మాట ముందు ఈ రాజ్యము, భోగములు నాకు గడ్డిపరక తో సమానము. అమ్మా! నీకు ఇందాకే చెప్పాను. నా తండ్రి గారి మాటను నెరవేర్చడానికి నేను నా ప్రాణములను కూడా లెక్కచెయ్యను. ఇంక ఈ వనవాసము ఒక లెక్కలోది కాదు.

అమ్మా! తమరికి తెలియనిది ఏమున్నది. పుత్రునికి తండ్రికి సేవచెయ్యడం, తండ్రి మాటను పాటించడం కన్నా వేరే ధర్మము ఏముంటుంది. తండ్రి గారి నోటివెంట నా వనవాసము గురించి ఒక మాట కూడా రాక పోయినా, నీవు చెప్పావు కాబట్టి ఆ మాటలు నా తండ్రి గారు చెప్పినట్టే భావిస్తాను.

అదికాదమ్మా! నేను నీ పుత్రుడను. నాపై నీకు సర్వాధి కారములు ఉన్నాయి. భరతుని రాజ్యాభిషేకము గురించి నాతో ఒక్క మాట చెబితే సరిపోయేది కదా. దీనికి తండ్రి గారిని ఇంత బాధపెట్ట వలెనా! అంటే ఈ రాముడి మీద తమరికి నమ్మకం లేదా అమ్మా! నాకు తమరు ఒకటీ, మా తండ్రి ఒకటి కాదు. మీ ఇద్దరి మాటా ఒకటే. ఇంక నాకు సెలవు ఇప్పించండి. నేను వెళ్లి మా తల్లి కౌసల్య దగ్గర అనుమతి తీసుకొని, నా భార్య సీతను ఊరడించి, తరువాత అరణ్యవాసమునకు వెళతాను. అమ్మా! తండ్రిగారిని జాగ్రత్తగా చూచుకొనమని భరతునికి చెప్పమ్మా! ఎందుకంటే తండ్రికి సేవచెయ్యడం మన సనాతన ధర్మం.” అని అన్నాడు రాముడు.

రాముని ఒక్కొక్క మాటా వింటుంటే దశరథుననికి దు:ఖము పొర్లుకొని వస్తూ ఉంది. వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. నోటమాట రావడం లేదు. శరీరం వశం తప్పుతూ ఉంది. తూలిపోతున్నాడు. అయినా నిలదొక్కు ఉంటున్నాడు. రాముడు తండ్రి పాదములకు, కైక పాదము లకు నమస్కరించాడు. తరువాత రాజ మందిరము నుండి బయటకు వచ్చాడు.

ఇదంతా ద్వారము వద్ద వేచి ఉన్న లక్ష్మణుడు వింటూ ఉన్నాడు. కోపంతో రగిలిపోతున్నాడు. కాని అన్నగారి మొహం చూచి కోపాన్ని అణుచుకుంటున్నాడు. రాముడు బయటకు రాగానే రాముని వెనకగా వెళ్లాడు. రాముడు అక్కడ అమర్చిన పట్టాభిషేక ద్రవ్యములకు నమస్కరించాడు. సమస్తము త్యజించిన యోగివలె అక్కడి నుండి వెళుతున్నాడు. ఛత్రమును చామరమును వద్దన్నాడు. తన వెంట వచ్చిన స్నేహితులను వెళ్లిపొమ్మన్నాడు. రథమును కూడా వద్దన్నాడు. పాదచారియై తన తల్లి కౌసల్య మందిరమునకు వెళ్లాడు.

ఇంతజరిగినా రాముని మొహం మీద ఉన్న చిరునవ్వు చెరగలేదు. అందరినీ చిరునవ్వుతూ పలకరిస్తున్నాడు. రాముని వెంట ఉన్న లక్ష్మణుడు మాత్రం కోపంతో రగిలిపోతున్నాడు. కోపం ఆపుకోలేకపోతున్నాడు. లక్ష్మణుని కోపం అతని మొహంలో స్పష్టంగా కనపడుతూ ఉంది. రాముడు కౌసల్యాభవనములో ప్రవేశించేటప్పటికి ఆమె భవనమంతా ఆనందోత్సాహాలతో నిండి ఉంది. రాముడు తన మొహంలో ఏ మాత్రం వికారము కనపడ్డా ఆ ఆనందంఅంతా విషాదంగా మారుతుందని గ్రహించి, తన పెదవుల మీద చిరునవ్వు చెరగనీయకుండా తల్లివద్దకు వెళ్లాడు.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము పంతొమ్మిదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అయోధ్యాకాండ వింశః సర్గః (20) >>

Leave a Comment