Ayodhya Kanda Sarga 24 In Telugu | అయోధ్యాకాండ చతుర్వింశః సర్గః

అయోధ్యా కాండ చతుర్వింశః సర్గః రామాయణంలోని ఒక ముఖ్యమైన అధ్యాయం, ఇందులో పాత్రల భావోద్వేగాలు మరియు సందిగ్ధతలు ముందు వస్తాయి. ఈ విభాగంలో, దశరథ మహారాజు తన ప్రియమైన కుమారుడు రాముడు వనవాసానికి వెళ్లడం వలన, కైకేయికి ఇచ్చిన మాట యొక్క ఫలితాలను ఎలా ఎదుర్కొంటున్నాడో చూపిస్తుంది. ఈ అధ్యాయం ధర్మం (నైతిక కర్తవ్యము), త్యాగం మరియు ఆవశ్యకమైన బాధ వంటి అంశాలను ప్రదర్శిస్తుంది. ఈ హృదయ విదారక భాగం రాముని యాత్రలో తరువాత జరిగే సంఘటనలకు పునాదిగా ఉండి, ఇతిహాసంలో ఒక కీలక మలుపుగా నిలుస్తుంది.

కౌసల్యార్తిసమాశ్వాసనమ్

తం సమీక్ష్య త్వవహితం పితుర్నిర్దేశపాలనే |
కౌసల్యా బాష్పసంరుద్ధా వచో ధర్మిష్ఠమబ్రవీత్ ||

1

అదృష్టదుఃఖో ధర్మాత్మా సర్వభూతప్రియంవదః |
మయి జాతో దశరథాత్కథముంఛేన వర్తయేత్ ||

2

యస్య భృత్యాశ్చ దాసాశ్చ మృష్టాన్యన్నాని భుంజతే |
కథం స భోక్ష్యతే నాథో వనే మూలఫలాన్యయమ్ ||

3

క ఏతచ్ఛ్రద్దధేచ్ఛ్రుత్వా కస్య వా న భేవద్భయమ్ |
గుణవాన్దయితో రాజా రాఘవో యద్వివాస్యతే ||

4

నూనం తు బలవాఁల్లోకే కృతాంతః సర్వమాదిశన్ |
లోకే రామాభిరామస్త్వం వనం యత్ర గమిష్యసి ||

5

అయం తు మామాత్మభవస్తవాదర్శనమారుతః |
విలాపదుఃఖసమిధో రుదితాశ్రుహుతాహుతిః ||

6

చింతాబాష్పమహాధూమస్తవాదర్శనచిత్తజః |
కర్శయిత్వా భృశం పుత్ర నిఃశ్వాసాయాససంభవః ||

7

త్వయా విహీనామిహ మాం శోకాగ్నిరతులో మహాన్ |
ప్రధక్ష్యతి యథా కక్షం చిత్రభానుర్హిమాత్యయే ||

8

కథం హి ధేనుః స్వం వత్సం గచ్ఛంతం నానుగచ్ఛతి |
అహం త్వాఽనుగమిష్యామి పుత్ర యత్ర గమిష్యసి ||

9

తథా నిగదితం మాత్రా తద్వాక్యం పురుషర్షభః |
శ్రుత్వా రామోఽబ్రవీద్వాక్యం మాతరం భృశదుఃఖితామ్ ||

10

కైకేయ్యా వంచితో రాజా మయి చారణ్యమాశ్రితే |
భవత్యా చ పరిత్యక్తో న నూనం వర్తయిష్యతి ||

11

భర్తుః కిల పరిత్యాగో నృశంసః కేవలం స్త్రియాః |
స భవత్యా న కర్తవ్యో మనసాఽపి విగర్హితః ||

12

యావజ్జీవతి కాకుత్స్థః పితా మే జగతీపతిః |
శుశ్రూషా క్రియతాం తావత్స హి ధర్మః సనాతనః ||

13

ఏవముక్తా తు రామేణ కౌసల్యా శుభదర్శనా |
తథేత్యువాచ సుప్రీతా రామమక్లిష్టకారిణమ్ ||

14

ఏవముక్తస్తు వచనం రామో ధర్మభృతాం వరః |
భూయస్తామబ్రవీద్వాక్యం మాతరం భృశదుఃఖితామ్ ||

15

మయా చైవ భవత్యా చ కర్తవ్యం వచనం పితుః |
రాజా భర్తా గురుః శ్రేష్ఠః సర్వేషామీశ్వరః ప్రభుః ||

16

ఇమాని తు మహారణ్యే విహృత్య నవ పంచ చ |
వర్షాణి పరమప్రీతః స్థాస్యామి వచనే తవ ||

17

ఏవముక్తా ప్రియం పుత్రం బాష్పపూర్ణాననా తదా |
ఉవాచ పరమార్తా తు కౌసల్యా పుత్రవత్సలా ||

18

ఆసాం రామ సపత్నీనాం వస్తుం మధ్యే న మే క్షమమ్ |
నయ మామపి కాకుత్స్థ వనం వన్యాం మృగీమివ ||

19

యది తే గమనే బుద్ధిః కృతా పితురపేక్షయా |
తాం తథా రుదతీం రామో రుదన్వచనమబ్రవీత్ ||

20

జీవంత్యా హి స్త్రియా భర్తా దైవతం ప్రభురేవ చ |
భవత్యా మమ చైవాద్య రాజా ప్రభవతి ప్రభుః ||

21

న హ్యనాథా వయం రాజ్ఞా లోకనాథేన ధీమతా |
భరతశ్చాపి ధర్మాత్మా సర్వభూతప్రియం‍వదః ||

22

భవతీమనువర్తేత స హి ధర్మరతః సదా |
యథా మయి తు నిష్క్రాంతే పుత్రశోకేన పార్థివః ||

23

శ్రమం నావాప్నుయాత్కించిదప్రమత్తా తథా కురు |
దారుణశ్చాప్యయం శోకో యథైనం న వినాశయేత్ ||

24

రాజ్ఞో వృద్ధస్య సతతం హితం చర సమాహితా |
వ్రతోపవాసనిరతా యా నారీ పరమోత్తమా ||

25

భర్తారం నానువర్తేత సా తు పాపగతిర్భవేత్ |
భర్తుః శుశ్రూషయా నారీ లభతే స్వర్గముత్తమమ్ ||

26

అపి యా నిర్నమస్కారా నివృత్తా దేవపూజనాత్ |
శుశ్రూషామేవ కుర్వీత భర్తుః ప్రియహితే రతా ||

27

ఏష ధర్మః పురా దృష్టో లోకే వేదే శ్రుతః స్మృతః |
అగ్నికార్యేషు చ సదా సుమనోభిశ్చ దేవతాః ||

28

పూజ్యాస్తే మత్కృతే దేవి బ్రాహ్మణాశ్చైవ సువ్రతాః |
ఏవం కాలం ప్రతీక్షస్వ మమాగమనకాంక్షిణీ ||

29

నియతా నియతాహారా భర్తృశుశ్రూషణే రతా |
ప్రాప్స్యసే పరమం కామం మయి ప్రత్యాగతే సతి ||

30

యది ధర్మభృతాం శ్రేష్ఠో ధారయిష్యతి జీవితమ్ |
ఏవముక్తా తు రామేణ బాష్పపర్యాకులేక్షణా ||

31

కౌసల్యా పుత్రశోకార్తా రామం వచనమబ్రవీత్ |
గమనే సుకృతాం బుద్ధిం న తే శక్నోమి పుత్రక ||

32

వినివర్తయితుం వీర నూనం కాలో దురత్యయః |
గచ్ఛ పుత్ర త్వమేకాగ్రో భద్రం తేఽస్తు సదా విభో ||

33

పునస్త్వయి నివృత్తే తు భవిష్యామి గతక్లమా |
ప్రత్యాగతే మహాభాగే కృతార్థే చరితవ్రతే ||

34

పితురానృణ్యతాం ప్రాప్తే త్వయి లప్స్యే పరం సుఖమ్ |
కృతాంతస్య గతిః పుత్ర దుర్విభావ్యా సదా భువి ||

35

యస్త్వాం సంచోదయతి మే వచ ఆచ్ఛిద్య రాఘవ |
గచ్ఛేదానీం మహాబాహో క్షేమేణ పునరాగతః ||

36

నందయిష్యసి మాం పుత్ర సామ్నా వాక్యేన చారుణా |
అపీదానీం స కాలః స్యాద్వనాత్ప్రత్యాగతం పునః |
యత్త్వాం పుత్రక పశ్యేయం జటావల్కలధారిణమ్ ||

37

తథా హి రామం వనవాసనిశ్చితం
సమీక్ష్య దేవీ పరమేణ చేతసా |
ఉవాచ రామం శుభలక్షణం వచో
బభూవ చ స్వస్త్యయనాభికాంక్షిణీ ||

38

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే చతుర్వింశః సర్గః ||

Ayodhya Kanda Sarga 24 Meaning In Telugu

రాముని నిశ్చయమును విని కౌసల్య తల్లడిల్లి పోయింది. ఆమెకు నోట మాట రాలేదు. రాబోవు చీకటి రోజులను తలచు కొని తల్లడిల్లి పోయింది. “రామా! ప్రతిదినము మృష్టాన్నములు భుజించుటకు అలవాటు పడ్డవాడికి అడవులలో మున్యాశ్రమములలో వారు ఇచ్చు ఆకులు, దుంపలు, పండ్లతో ఎలా జీవిస్తావయ్యా? ఎందుకంటే అయోధ్యలో నీ సేవకులు కూడా నీ కన్నా మెరుగైన భోజనము చేస్తుంటారు కదా! నీవు అడవులలో కందమూలములు ఎలా తిని బతుకుతావు. రామా! నీవంటి సద్గుణములు కలవాడిని, ప్రీతి పాత్రుడిని, నిర్దయగా రాజు అరణ్యము లకు పంపుతున్నాడే ఇంక మాలాంటి వారిగతి ఏమిటి? రామా! నీవు వెళ్లిన తరువాత అయోధ్యలో ఉండటానికి మాకు భయంగా ఉంది.

రామా! నీవు చెప్పినది సత్యము. నీ లాంటి వాడినే అరణ్యము లకు పంపడానికి అనుకూలించిన విధి ఎంత బలమైనదో ఇప్పుడు తెలుస్తూ ఉంది. నీవు వెళ్లిన తరువాత నాకు ఇంక శోకమే మిగిలింది. ఆ శోకాగ్నిలో నేను దగ్ధం అవడం తథ్యం. అందుకే రామా! నన్ను కూడా నీ వెంట తీసుకొనిపో. నీవు ఎక్కడ ఉంటే అదే నాకు రాజమందిరము. పద పోదాము.” అని రాముని వెంట వెళ్లడానికి కౌసల్య

ఉద్యుక్తురాలయింది. తన కోసం శోకిస్తున్న తల్లి కౌసల్యను చూచి రాముడు ఇలా అన్నాడు. “అమ్మా! అన్నీ తెలిసిన నీవే ఇలా మాట్లాడితే నేనేమి అనగలను. నీకు తెలుసు గదా! కైక తండ్రి గారిని తన చెప్పుచేతల్లో ఉంచుకొని తన ఇష్టం వచ్చి నట్టు ఆడిస్తూ ఉంది. ఇంక నువ్వు కూడా ఇక్కడ లేక పోతే తండ్రి గారి పరిస్థితి ఏమిటి? ఆయన బాగోగులు ఎవరు చూచుకుంటారు. నీవు కూడా తండ్రిగారిని విడిచి పెట్టి నాతో అరణ్యములకు వస్తే, తండ్రిగారు జీవించడం కల్ల.

కాబట్టి నీవు తండ్రి గారిని చూచుకుంటే ఇక్కడే ఉండాలి. పైగా, నీ వంటి పతివ్రత భర్తను వదిలిపెట్టి అరణ్యములకు పోవడం అత్యంత క్రూరమైన పని. అది నీ వంటి సౌశీల్యవతులకు తగని పని. ఒక భార్యగా జీవితాంతము భర్తకు సేవ చెయ్యడం నీ కర్తవ్యము. ధర్మము. కాబట్టి నీవు ఇక్కడే ఉండి నీ ధర్మమును పాటించమని చేతులు జోడించి ప్రార్థిస్తున్నాను.” అన్నాడు రాముడు.

రాముని మాటలకు కౌసల్య బదులు చెప్పలేక పోయింది. “రామా! నీవు చెప్పినట్టే చేస్తాను.” అని మాత్రం అనగలిగింది. తల్లి మాటలకు రాముడు సంతోషించాడు. “అమ్మా! నా తండ్రి దశరథుడు మహారాజు, మనకందరికీ పూజనీయుడు. మనల నందరినీ ఆజ్ఞాపించగల సమర్థుడు. ఆయన ఆజ్ఞలను పాటించడం మన అందరి కర్తవ్యము. నీవు అలా చూస్తూ ఉండగానే పదునాలుగేళ్ల వనవాసము పూర్తి చేసుకొని వచ్చి నీ కళ్లముందు నిలబడతాను. నీవు ఏమి చెబితే అది చేస్తాను.” అని

అన్నాడు రాముడు. కుమారుని మాటలకు కౌసల్యకు ఒక పక్క దుఃఖము, మరొక పక్క సంతోషమూ కలిగాయి. కాని రాముడు వెళ్లిన తరువాత సవతుల మధ్య తన పరిస్థితి ఏమిటి అని తలచుకొనే సరికి ఆమెకు శరీరం వణికిపోయింది.
“రామా! నీవు లేని అయోధ్యలో నేను ఉండలేను. ఈ సవతులు నన్ను బతుకనీయరు. నన్ను నీ వెంట తీసుకొని పో” అని భోరున ఏడవసాగింది. వ్యవహారం మరలా మొదటికి వచ్చింది అనుకున్నాడు. రాముడు. తల్లి ఏడుపు చూచి రామునికి కూడా దుఃఖము పార్లుకొచ్చింది. తల్లిని ఎలా ఓదార్చాలో ఆమె నిర్ణయాన్ని ఎలా మార్చాలో తెలియలేదు రామునికి. ఏమైనా సరే మరలా మరొక సారి చెప్పి చూద్దాము అని అనుకున్నాడు రాముడు. తల్లి కౌసల్యతో ఇలా అన్నాడు.

“అమ్మా! అదేంటమ్మా అలా అంటావు. నీవు అయోధ్యకు పట్టమహిషిని. దశరథునికి పట్టపురాణివి. నిన్ను ఎవరేమంటారు. అందరూ నీ కనుసన్నలలో మెలగవలసిన వారే కదా! పైగా మహారాజు గారు నేవెంటనే ఉంటారు. నీకు అన్యాయం ఎందుకు జరుగుతుంది. రాజు ఉన్నంతకాలము నీవు అనాధవు ఎలా అవుతావు? పైగా నా తరువాత యువరాజు భరతుడు ఉంటాడు. భరతునికి నీవు అంటే పంచప్రాణాలు. పైగా భరతుడు ధర్మనిరతి ఎక్కువగా కలవాడు. ఎవరి మాటా విని అధర్మమునకు తలవంచడు. ఇంక నీకేం భయం. కాబట్టి ఆ భయాలు, అనుమానాలు నీ మనసులో నుండి తొలగించు. వృద్ధుడైన మహారాజును కనిపెట్టుకొని ఉండు.

ఒక భార్యగా అది నీ ధర్మము, కర్తవ్యము. అమ్మా! స్త్రీలు ఎన్ని వ్రతములు, ఉప వాసములు, పుణ్య కార్యములు చేసినను, భర్తను నిర్లక్ష్యము చేసిన భార్యకు నరక ప్రాప్తి కలుగుతుందని ధర్మశాస్త్రము చెబుతుంది కదా! అలాగే ఏ దేవతలకూ పూజలు చేయకున్నా ఏ వ్రతములు ఆచరించకున్నా కేవలం భర్తను దైవంగా పూజించే భార్యకు ఉత్తమ లోకాలు కలుగుతాయి అని కూడా చెబుతారు కదా! భర్తకు అనుకూలవతిగా, ఆయనను జీవితాంతం విడిచిపెట్టకుండా ఉండటం భార్యకు పరమధర్మము అని వేదములు, శాస్త్రములు, శ్రుతులు, స్మృతులలో చెప్పబడింది కదా!

అమ్మా! నీవు అయోధ్యలో ఉండి తండ్రి గారిని సేవించు కుంటూ, నా క్షేమం కోసం వ్రతాలూ, పూజలూ చేస్తూ బ్రాహ్మణులను పూజిస్తూ ఉంటే నేను అరణ్యాలలో ఏ బాధా లేకుండా క్షేమంగా ఉంటానమ్మా! నీవు చేసే పూజలూ, వ్రతాలూ నన్ను సదా ఆపదలనుండి రక్షిస్తూ ఉంటయమ్మా! నీవు ఇలా చేసావనుకో ఈ పదునాలుగేళ్లు ఇట్టే గడిచిపోతాయి. నేను ఇక్కడ లేని లోటు నీకు తెలియదు. నేను వచ్చిన తరువాత నీవు ఎలా చెబితే అలా చేస్తాను.” అని తల్లిని బుజ్జగించాడు రాముడు.

కౌసల్య కొడుకు మాటలకు మారు మాటాడలేకపోయింది. కళ్లు తుడుచుకొంది. “రామా! విధి బలీయమయింది. అంతకన్నా నీ నిశ్చయము బలమైంది. దానిని ఎవరూ మార్చలేరు. నీవు అరణ్యములకు క్షేమంగా వెళ్లిరా.

నీకు నా దీవెనలు ఎప్పుడూ ఉంటాయి. నీకు సదా క్షేమము కలుగు గాక! నీవు వచ్చిన తరువాత నా దుఃఖములు అన్నీ తొలగి పోతాయి అనే ఆశతో నీ రాక కోసం వెయ్యికళ్లతో ఎదురుచూస్తూ ఉంటాను. కాని రామా! మా అందరి మాటను కాదని నిన్ను అరణ్యము లకు వెళ్లమని ప్రేరేపించు చున్న ఆ దైవము యొక్క లీలలను ఎవరూ అర్థం చేసుకోలేరు.

రామా! నీ పద్నాలుగేళ్ల వనవాసము ఒక్కరోజులో గడిచిపోయి ఈరోజే నీవు వనములనుండి తిరిగి వచ్చే రోజు అయితే ఎంత బాగుంటుంది!’ అని ఆశాభావంతో పలికింది కౌసల్య. తనకు నమస్కరించిన రామునికి సదా మంగళం కలగాలని మనసారా ఆశీర్వదించింది.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము ఇరువది నాల్గవ సర్గ సంపూర్ణము ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అయోధ్యాకాండ పంచవింశః సర్గః (25) >>

Leave a Comment