Ayodhya Kanda Sarga 42 In Telugu – అయోధ్యాకాండ ద్విచత్వారింశః సర్గః

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అయోధ్యాకాండ ద్విచత్వారింశః సర్గ, “దశరథాక్రందః”, రామాయణంలోని ఒక భావోద్వేగభరితమైన భాగం. ఈ సర్గలో, దశరథ మహారాజు రాముడు వనవాసానికి వెళ్లిన దుఃఖంలో ఉండి కన్నీళ్లు కారుస్తాడు. రాముడు తన దగ్గర లేనందుకు, అతను చనిపోయే సమయానికి కూడా తన కుమారుడిని చూడలేనందుకు, దశరథ మహారాజు గాఢమైన వ్యధతో విలపిస్తాడు. ఈ సర్గ దశరథుడి బాధ, అతని ప్రేమ, మరియు రాముడి వలన కలిగిన శూన్యతను హృదయానికి హత్తుకునేలా చిత్రిస్తుంది. ఈ కథనం దశరథ మహారాజు, ఆయన కుమారుడు రాముడి మధ్య ఉన్న అనుబంధం, మరియు విధి పట్ల ఆయన బాధ్యతలను ప్రతిబింబిస్తుంది.

దశరథాక్రందః

యావత్తు నిర్యతస్తస్య రజోరూపమదృశ్యత |
నైవేక్ష్వాకువరస్తావత్సంజహారాత్మచక్షుషీ ||

1

యావద్రాజా ప్రియం పుత్రం పశ్యత్యత్యంతధార్మికమ్ |
తావద్వ్యవర్ధతేవాస్య ధరణ్యాం పుత్రదర్శనే ||

2

న పశ్యతి రజోఽప్యస్య యదా రామస్య భూమిపః |
తదాఽర్తశ్చ విషణ్ణశ్చ పపాత ధరణీతలే ||

3

తస్య దక్షిణమన్వాగాత్కౌసల్యా బాహుమంగనా |
వామం చాస్యాన్వగాత్పార్శ్వం కైకేయీ భరతప్రియా ||

4

తాం నయేన చ సంపన్నో ధర్మేణ వినయేన చ |
ఉవాచ రాజా కైకేయీం సమీక్ష్య వ్యథితేంద్రియః ||

5

కైకేయి మా మమాంగాని స్ప్రాక్షీస్త్వం దుష్టచారిణీ |
న హి త్వాం ద్రష్టుమిచ్ఛామి న భార్యా న చ బాంధవీ ||

6

యే చ త్వామనుజీవంతి నాహం తేషాం న తే మమ |
కేవలార్థపరాం హి త్వాం త్యక్తధర్మాం త్యజామ్యహమ్ ||

7

అగృహ్ణాం యచ్చ తే పాణిమగ్నిం పర్యణయం చ యత్ |
అనుజానామి తత్సర్వమస్మిన్ లోకే పరత్ర చ ||

8

భరతశ్చేత్ప్రతీతః స్యాద్రాజ్యం ప్రాప్యేదమవ్యయమ్ |
యన్మే స దద్యాత్పిత్రర్థం మామాం తద్దత్తమాగమత్ ||

9

అథ రేణుసముధ్వస్తం తముత్థాప్య నరాధిపమ్ |
న్యవర్తత తదా దేవీ కౌసల్యా శోకకర్శితా ||

10

హత్వేవ బ్రాహ్మణం కామాత్స్పృష్ట్వాఽగ్నిమివ పాణినా |
అన్వతప్యత ధర్మాత్మా పుత్రం సంచింత్య తాపసమ్ ||

11

నివృత్యైవ నివృత్యైవ సీదతో రథవర్త్మసు |
రాజ్ఞో నాతిబభౌ రూపం గ్రస్తస్యాంశుమతో యథా ||

12

విలలాప చ దుఃఖార్తః ప్రియం పుత్రమనుస్మరన్ |
నగరాంతమనుప్రాప్తం బుద్ధ్వా పుత్రమథాబ్రవీత్ ||

13

వాహనానాం చ ముఖ్యానాం వహతాం తం మమాత్మజమ్ |
పదాని పథి దృశ్యంతే స మహాత్మా న దృశ్యతే ||

14

యః సుఖేషూషధానేషు శేతే చందనరూషితః |
వీజ్యమానో మహార్హాభిః స్త్రీభిర్మమ సుతోత్తమః ||

15

స నూనం క్వచిదేవాద్య వృక్షమూలముపాశ్రితః |
కాష్ఠం వా యది వాఽశ్మానముపధాయ శయిష్యతే ||

16

ఉత్థాస్యతి చ మేదిన్యాః కృపణః పాంసుకుంఠితః |
వినిశ్శ్వసన్ప్రస్రవణాత్కరేణూనామివర్షభః ||

17

ద్రక్ష్యంతి నూనం పురుషాః దీర్ఘబాహుం వనేచరాః |
రామముత్థాయ గచ్ఛంతం లోకనాథమనాథవత్ ||

18

సా నూనం జనకస్యేష్టా సుతా సుఖసదోచితా |
కంటకాక్రమణక్రాంతా వనమద్య గమిష్యతి ||

19

అనభిజ్ఞా వనానాం సా నూనం భయముపైష్యతి |
శ్వాపదానర్ధితం శ్రుత్వా గంభీరం రోమహర్షణమ్ ||

20

సకామా భవకైకేయి విధవా రాజ్యమావస |
న హి తం పురుషవ్యాఘ్రం వినా జీవితుముత్సహే ||

21

ఇత్యేవం విలపన్రాజా జనౌఘేనాభిసంవృతః |
అపస్నాత ఇవారిష్టం ప్రవివేశ పురోత్తమమ్ ||

22

శూన్యచత్వరవేశ్మాంతాం సంవృతాపణదేవతామ్ |
క్లాంతదుర్బలదుఃఖార్తాం నాత్యాకీర్ణమహాపథామ్ ||

23

తామవేక్ష్య పురీం సర్వాం రామమేవానుచింతయన్ |
విలపన్ప్రావిశద్రాజా గృహం సూర్య ఇవాంబుదమ్ ||

24

మహాహ్రదమివాక్షోభ్యం సుపర్ణేన హృతోరగమ్ |
రామేణ రహితం వేశ్మ వైదేహ్యా లక్ష్మణేన చ ||

25

అథ గద్గదశబ్దస్తు విలపన్మనుజాధిపః |
ఉవాచ మృదుమందార్థం వచనం దీనమస్వరమ్ ||

26

కౌసల్యాయాం గృహం శీఘ్రం రామమాతుర్నయంతు మామ్ |
న హ్యన్యత్ర మమాశ్వాసో హృదయస్య భవిష్యతి ||

27

ఇతి బ్రువంతం రాజానమనయన్ద్వారదర్శినః |
కౌసల్యాయా గృహం తత్ర న్యవేశ్యత వినీతవత్ ||

28

తతస్తస్య ప్రవిష్టస్య కౌసల్యాయా నివేశనమ్ |
అధిరుహ్యాపి శయనం బభూవ లులితం మనః ||

29

పుత్రద్వయవిహీనం చ స్నుషయాఽపి వివర్జితమ్ |
అపశ్యద్భవనం రాజా నష్టచంద్రమివాంబరమ్ ||

30

తచ్చ దృష్ట్వా మహారాజో భుజముద్యమ్య వీర్యవాన్ |
ఉచ్చైఃస్వరేణ చుక్రోశ హారాఘవ జహాసి మామ్ ||

31

సుఖితా బత తం కాలం జీవిష్యంతి నరోత్తమాః |
పరిష్వజంతో యే రామం ద్రక్ష్యంతి పునరాగతమ్ ||

32

అథ రాత్ర్యాం ప్రపన్నాయాం కాలరాత్ర్యామివాత్మనః |
అర్ధరాత్రే దశరథః కౌసల్యామిదమబ్రవీత్ ||

33

రామం మేఽనుగతా దృష్టిరద్యాపి న నివర్తతే |
న త్వా పశ్యామి కౌసల్యే సాధుమాం పాణినా స్పృశ ||

34

తం రామమేవానువిచింతయంతం
సమీక్ష్య దేవీ శయనే నరేంద్రమ్ |
ఉపోపవిశ్యాధికమార్తరూపా
వినిశ్వసంతీ విలలాప కృచ్ఛ్రమ్ ||

35

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే ద్విచత్వారింశః సర్గః ||

Ayodhya Kanda Sarga 42 Meaning In Telugu

రాముని రథము వెళుతున్నంత దూరమూ దశరథుడు అటువేపు చూస్తూనే ఉన్నాడు. రథము పోవు వేగముతో రేగిన ధూళితో రథము కనపడటం లేదు. రామునికి తనకూ దూరము పెరిగిపోతున్నట్టు భావించాడు దశరథుడు. దశరథునికి దుఃఖము ముంచుకొచ్చింది. ఇంక రాముడు తనకు కనపడడు అనే భావనను తట్టుకోలేకపోయాడు. అలాగే నేలమీద కూలబడ్డాడు. పక్కనే ఉన్న కౌసల్య, కైక ఆయననుపట్టుకున్నారు.

దశరథుడు కైక వంక దీనంగా చూచాడు. “ఓ కైకా! దయచేసి నన్ను తాకవద్దు. నీకూ నాకూ ఎలాంటి సంబంధము లేదు. నువ్వు నాకు భార్యవు కావు, బంధువుకావు. నీవు ఎవరని నన్ను తాకుతున్నావు. నీకే కాదు నీ వారికి కూడా నేను ఏమీ కాను. మీకూ నాకూ ఎలాంటి సంబంధము లేదు. నువ్వు ఎప్పుడైతే ధర్మాన్ని విడిచిపెట్టావో అదే క్షణంలో నేనూ నిన్ను విడిచిపెట్టాను. నీచేయి పట్టుకొని పాణిగ్రహణము చేసి అగ్నిహోత్రము చుట్టు మూడు ప్రదక్షిణములు చేసిన నాడు ముడివడిన మన బంధము నేటితో తెగిపోయినది. ఈ లోకంలో కానీ, పరలోకంలో కానీ మన ఇద్దరికీ ఎలాంటి సంబంధము లేదు. నీకూ నీ కుమారుడు భరతునికీ ఈ రాజ్యము కావాలి. తీసుకోండి. నన్ను విడిచిపెట్టండి. నేను చచ్చిపోయిన తరువాత మీరు నాకు జలతర్పణము విడవడానికి కూడా నేను అంగీకరించను. మీరు నా శవాన్ని కూడా తాకడానికి నేను అనుమతించను.” అని అన్నాడు దశరథుడు.

చేసేది లేక కైక ఆయనను విడిచిపెట్టింది. కౌసల్య దశరథుని పట్టుకొని లేవనెత్తి ఆయన రథములో కూర్చోపెట్టింది. తరువాత తన అంత:పురమునకు వెళ్లిపోయింది. దశరథుడు రాముని తల్చుకుంటూ తనలో తానే కుమిలిపోతున్నాడు. బ్రహ్మహత్యాపాతకము చేసిన వాడి మాదిరి భయంతో వణికిపోతున్నాడు. ఇంతలో వార్తాహరులువచ్చి రాముడు అయోధ్యను దాటి వెళ్లిపోయాడు అని చెప్పారు.

“అవును. రాముడు వెళ్లిపోయాడు. రాముడు వెళ్లిన రథచక్రముల జాడలు, రథమునకు కట్టిన గుర్రముల గిట్టల గుర్తులు మాత్రము అయోధ్యలో కనపడుతున్నాయి. రాముని జాడ మాత్రం కనపడటం లేదు. ప్రతిరోజూ చందనము పూసుకొని హంసతూలికా తల్పము మీద నిద్రించే రాముడు ఈ రోజు ఒళ్లంతా మట్టికొట్టుకొని ఉండగా, కటిక నేల మీద నిద్రిస్తాడు కాబోలు. మెత్తని తలగడ లేకుండా నిద్రించని రాముడు కటిక పాషాణమును తల కిందపెట్టుకొని నిద్రిస్తాడేమో! అయోధ్యలో స్నేహితులు, వందిమాగధులు వెంట రాగా
విహరించిన రాముడు రేపటి నుండి మునికుమారులు వెంట రాగా అడవులలో విహరిస్తాడేమో! మెత్తటి తివాచీల మీద నడిస్తేనే కంది పోయే సీత పాదాలు, రేపటి నుండి కటిక రాళ్ల మీద నడవాలి కాబోలు. క్రూరమృగములు అంటేనే భయపడే సీత రేపటినుండి ఆ క్రూర మృగముల భయంకరమైన అరుపులు వింటుందేమో!” అని తనలో తాను అనుకుంటున్నాడు దశరథుడు.

ఇంతలో కైక గుర్తుకు వచ్చింది.

“ఓకైకా! నీ కోరిక తీరిందా! నీకళ్లు చల్లబడ్డాయా! ఇంక నీ ఇష్టం. నీకు మొగుడు లేడు. నీవు విధవరాలవు. రాముడు లేని ఈ లోకంలో నేను ఉండను. నీవే ఈరాజ్యాన్ని పాలించుకో.”అని అరుస్తున్నాడు.

ఈ విధంగా దశరథుడు రాముని కోసరం శోకిస్తున్నాడు. వెనకకు తిరిగి పాడుబడినట్టు ఉన్న అయోధ్యలో ప్రవేశించాడు. అటు ఇటు చూస్తూ వెళుతున్నాడు. అయోధ్యలో ఏ ఇంటి ద్వారము తెరవ బడలేదు. ఏ ఇంటి ముందరా జనం లేరు. దేవాలయాలు, అంగళ్లు, అన్నీ మూసి ఉన్నాయి. రహదారుల మీద జనసంచారము లేదు. అటువంటి అయోధ్య వీధులగుండా దశరథుడు తన అంతఃపురము చేరుకున్నాడు.

ఆరోజు దాకా రాముని మాటలతో రాముని ఆటపాటలతో సందడిగా ఉన్న అంతఃపురము నిశ్శబ్దముగా ఉంది. నిర్మానుష్యమైన ఆ అంత:పురములో ఉండలేకపోయూడు దశరథుడు. “నేను ఇక్కడ ఉండలేను. నన్ను వెంటనే కౌసల్యమందిరమునకు తీసుకొని వెళ్లండి.” అని ఆదేశించాడు. వెంటనే పరిచారికలు దశరథుని కౌసల్య మందిరము నకు తీసుకొని వెళ్లారు. కౌసల్య మందిరములో దశరథుడు ఒక శయ్యమీద పడుకొన్నాడు.

కొడుకులు కోడళ్లు లేని ఆ గృహము దశరథునికి చంద్రుడులేని ఆకాశము మాదిరి అనిపించింది. ఉన్నట్టుండి దశరథుడు ఉ లిక్కిపడుతున్నాడు. ఏడుస్తున్నాడు. “రామా నన్ను విడిచి వెళ్లిపోయావా” అని అరుస్తున్నాడు. “పద్నాలుగేళ్ల వనవాసము ముగించుకొని నా రాముడు తిరిగి అయోధ్యకు వచ్చినపుడు, ఈ అయోధ్యా పౌరులం దరూ రామునికి ఘనస్వాగతము ఇస్తారు. అప్పటికి నేను ఉండను కదా! ఆ అదృష్టానికి నేను నోచుకోలేదు కదా!” అని వాపోతున్నాడు. దశరథుడు.

రాత్రి అయింది. దశరథుడు భోజనము చేయలేదు. నిద్రపోలేదు. అర్థరాత్రి కౌసల్యను పిలిచాడు. “కౌసల్యా! నాకుకళ్లు కనిపించడం లేదు. నా దృష్టి రామునితో పాటు వెళ్లిపోయింది. రాముని చూచిన కళ్లతో నేను దేనినీ చూడలేను. నన్ను తాకు. నిన్ను గుర్తుపడతాను.” అని అన్నాడు దశరథుడు.

భర్తమాటలకు కౌసల్యకు దుఃఖము ముంచుకొచ్చింది. దశరథుని చేతి మీద తన చెయ్యివేసి నిమురుతూ ఆయన పక్కనే కూర్చుంది కౌసల్య.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము నలుబదిరెండవ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అయోధ్యాకాండ త్రిచత్వారింశః సర్గః (43) >>

Leave a Comment