Ayodhya Kanda Sarga 43 In Telugu – అయోధ్యాకాండ త్రిచత్వారింశః సర్గః

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అయోధ్యాకాండ త్రిచత్వారింశః సర్గ, “కౌసల్యాపరిదేవితమ్”, రామాయణంలోని ఒక భావోద్వేగభరితమైన అధ్యాయం. ఈ సర్గలో, కౌసల్యా దేవి తన కుమారుడు రాముడు వనవాసానికి వెళ్లిపోవడం వల్ల కలిగిన వియోగంతో దుఃఖంలో మునిగిపోతుంది. రాముడి లేని పరిస్థితిలో, ఆమె మనసులో ఉన్న బాధలను, ఆవేదనను వ్యక్తం చేస్తుంది. కౌసల్యా రాముడి బాల్యాన్నీ, అతని సద్గుణాలనూ, ఆమె పట్ల ఉన్న ప్రేమను తలచుకుంటూ విలపిస్తుంది. ఈ సర్గ కౌసల్యా దేవి హృదయవేదనను, ఆమె ప్రేమను, మరియు తల్లి మరియు కుమారుడి మధ్య ఉన్న బలమైన బంధాన్ని హృదయానికి హత్తుకునేలా చిత్రిస్తుంది.

కౌసల్యాపరిదేవితమ్

తతః సమీక్ష్య శయనే సన్నం శోకేన పార్థివమ్ |
కౌసల్యా పుత్రశోకార్తా తమువాచ మహీపతిమ్ ||

1

రాఘవే నరశార్దూలే విషముప్త్వాహిజిహ్మగా |
విచరిష్యతి కైకేయీ నిర్ముక్తేవ హి పన్నగీ ||

2

వివాస్య రామం సుభగా లబ్ధకామా సమాహితా |
త్రాసయిష్యతి మాం భూయో దుష్టాహిరివ వేశ్మని ||

3

అథ స్మ నగరే రామశ్చరన్భైక్షం గృహే వసేత్ |
కామకారో వరం దాతుమపి దాసం మమాత్మజమ్ ||

4

పాతయిత్వా తు కైకేయ్యా రామం స్థానాద్యథేష్టతః |
ప్రదిష్టో రక్షసాం భాగః పర్వణీవాహితాగ్నినా ||

5

గజరాజగతిర్వీరో మహాబాహుర్ధనుర్ధరః |
వనమావిశతే నూనం సభార్యః సహలక్ష్మణః ||

6

వనే త్వదృష్టదుఃఖానాం కైకేయ్యాఽనుమతే త్వయా |
త్యక్తానాం వనవాసాయ కాన్వవస్థా భవిష్యతి ||

7

తే రత్నహీనాస్తరుణాః ఫలకాలే వివాసితాః |
కథం వత్స్యంతి కృపణాః ఫలమూలైః కృతాశనాః ||

8

అపీదానీం స కాలః స్యాన్మమ శోకక్షయః శివః |
సభార్యం యత్సహ భ్రాత్రా పశ్యేయమిహ రాఘవమ్ ||

9

సుప్త్వేవోపస్థితౌ వీరౌ కదాయోధ్యాం గమిష్యతః |
యశస్వినీ హృష్టజనా సూచ్ఛ్రితధ్వజమాలినీ ||

10

కదా ప్రేక్ష్య నరవ్యాఘ్రావరణ్యాత్పునరాగతౌ |
నందిష్యతి పురీ హృష్టా సముద్ర ఇవ పర్వణి ||

11

కదాఽయోధ్యాం మహాబాహుః పురీం వీరః ప్రవేక్ష్యతి |
పురస్కృత్య రథే సీతాం వృషభో గోవధూమివ ||

12

కదా ప్రాణిసహస్రాణి రాజమార్గే మమాత్మజౌ |
లాజైరవకరిష్యంతి ప్రవిశంతావరిందమౌ ||

13

ప్రవిశంతౌ కదాఽయోధ్యాం ద్రక్ష్యామి శుభకుండలౌ |
ఉదగ్రాయుధనిస్త్రింశౌ సశృంగావివ పర్వతౌ ||

14

కదా సుమనసః కన్యా ద్విజాతీనాం ఫలాని చ |
ప్రదిశంతః పురీం హృష్టాః కరిష్యంతి ప్రదక్షిణమ్ ||

15

కదా పరిణతో బుద్ధ్యా వయసా చామరప్రభః |
అభ్యుపైష్యతి ధర్మజ్ఞస్త్రివర్ష ఇవ లాలయన్ ||

16

నిస్సంశయం మయా మన్యే పురా వీర కదర్యయా |
పాతుకామేషు వత్సేషు మాతృణాం శాతితాః స్తనాః ||

17

సాహం గౌరివ సింహేన వివత్సా వత్సలా కృతా |
కైకేయ్యా పురుషవ్యాఘ్ర బాలవత్సేవ గౌర్బలాత్ ||

18

న హి తావద్గుణైర్జుష్టం సర్వశాస్త్రవిశారదమ్ |
ఏకపుత్రా వినా పుత్రమహం జీవితుముత్సహే ||

19

న హి మే జీవితే కించిత్సామర్థ్యమిహ కల్ప్యతే |
అపశ్యంత్యాః ప్రియం పుత్రం మహాబాహుం మహాబలమ్ ||

20

అయం హి మాం దీపయతే సముత్థితః
తనూజశోకప్రభవో హుతాశనః |
మహీమిమాం రశ్మిభిరుద్ధతప్రభో
యథా నిదాఘే భగవాన్దివాకరః ||

21

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే త్రిచత్వారింశః సర్గః ||

Ayodhya Kanda Sarga 43 Meaning In Telugu

వీళ్ల పరిస్థితి ఇలా ఉంటే కౌసల్య పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా లేదు. ఆమె కూడా రాముని విడిచి ఉండలేక మనసులోనే కుమిలిపోతూ ఉంది. దశరథుని చూచి ఇలా అంది:

“మహారాజా! మన జీవితములలో కైక విషము చిలకరించి నది. ఇప్పుడు కుముసము విడిచిన పాము వలె నిగ నిగ లాడుతూ మెరిసిపోతూ ఉంది. మనకు దుఃఖంతో కుమిలిపోతున్నాము. ఓ మహారాజా! రాముని అయోధ్యనుండి వెడలగొట్టిన కైక నన్నుకూడా విడిచిపెట్టదు. నన్ను వెంటాడి వేధిస్తుంది. పాము వలె కాటేస్తుంది. కనీసము కైక రాముని అరణ్యములకు పంపకుండా తన వద్ద దాసునిగా నియమించుకొనినా కూడా ఎంతో బాగుండేది. నాకళ్ల ఎదుట నా కుమారుడు ఉండే వాడు. నాలుగు ఇళ్లలో బిక్ష తీసుకొని వచ్చి నన్ను పోషించేవాడు.

ఓ మహారాజా! నీవుమాత్రము తక్కువ చేసావా! దేవతలకు ఇవ్వవలసిన హవిస్సులను రాక్షసులకు ఇచ్చినట్టు, రామునికి ఇవ్వవలసిన రాజ్యమును భరతునికి ఇచ్చావు. ఓ మహారాజా! ఈ పాటికి నా రాముడు అడవిలోకి ప్రవేశించి ఉంటాడంటావా! సీత, లక్ష్మణుడు వెంటరాగా అడవులలో దిక్కు లేకుండా తిరుగుతూ ఉంటాడంటావా! ఎన్నడూ కష్టములు అంటే తెలియని రాముని, సీతను లక్ష్మణుని, ఆ కైక మాటవిని అడవులకు పంపావు. వాళ్లు ఎన్ని కష్టాలు పడుతున్నారో! ఏమో! ఈ వయసులో వారు సుఖాలు అనుభవిం చాల్సింది పోయి, అరణ్యములలో అష్టకష్టాలు పడుతున్నారు. సంభక్ష్య పరమాన్నములు తినడానికి అలవాటు పడ్డవాళ్లు ఆ అడవిలో దిక్కులేని వాళ్లమాదిరి కందమూలములు ఎలా తింటున్నారో కదా!

ఓ మహారాజా! రాముడు సీతతోనూ లక్ష్మణునితోనూ అయోధ్యకు వచ్చినపుడు చూడటానికి నేను బతికి ఉంటానా! ఆ మంగళకరమైన దృశ్యము కళ్లారా చూడగలనా! రామలక్ష్మణులు తిరిగి రాగానే అయోధ్య అంతా పౌర్ణమి నాటి సముద్రము మాదిరి ఎంత ఉప్పొంగిపోతుందోకదా! రాముడు సీతను రథము మీద తన పక్కన కూర్చుండపెట్టుకొని ఎప్పుడు అయోధ్యలో ప్రవేశిస్తాడో కదా! సీతారామలక్ష్మణులు అయోధ్యలోకి ప్రవేశిస్తుంటే అయోధ్యా ప్రజలు వారి మీద పూలు, లాజలు, చల్లే దృశ్యము ఎప్పుడు కనపడుతుందోకదా! అయోధ్యలోకి ప్రవేశించేముందు సీతారాములు అయోధ్య పట్టణమునకు ప్రదక్షిణము చేస్తూ కన్యలకు, బ్రాహ్మణులకు కానుకలు ఇచ్చే దృశ్యము ఎన్నడు చూస్తానో కదా!

ఓ మహారాజా! రాముడు ఈ పధ్నాలుగుసంవత్సరములు అరణ్యములలో మునుల వద్ద ఉండి ఎన్నో ధర్మములు,శాస్త్రములు నేర్చుకొని బుద్ధి పరిణతిచెంది వస్తాడేమో కాని నా రాముడు నాకు మాత్రం ఆడుకునే మూడేళ్ల చంటి వాడి మాదిరి గానే ఉంటాడు. రాముడు రాగానే నేను వాడితో ఆడుకుంటాను. మీరు కాదనకూడదు. అసలు నాకు ఈ పుత్రవియోగము కలగడానికి కారణం నేను ఏజన్మలోనో పాలు తాగే దూడలు వాటి తల్లుల వద్ద పాలుతాగడానికి పోయినపుడు నేను ఆ ఆవుల స్తన్యములను కోసివేసి ఉంటాను. అందుకనే నాకు ఇలాంటి దుర్గతి కలిగింది.

ఓ మహారాజా! నేను గోవునైతే నా రాముడు గోవత్సము. అట్టి మా ఇద్దరినీ సింహము వంటి కైక వేరు చేసినది. ఆ పాపము ఊరికే పోదు. ఓ మహారాజా! నా రాముని విడిచి నేనుజీవించడం కల్ల. ఇంక ఒక్కరోజుకూడా రాముని లేకుండా నేను జీవించడం నా వల్ల కాదు. ఆ శక్తి నాకు లేదు. ఎందు కంటే దావానలము అరణ్యమును కాల్చివేసి నట్టు, పుత్రశోకము అనే అగ్ని నన్ను అనునిత్యమూ దహించి వేస్తూ ఉంది. ఆ అగ్నిలో నేను కాలి బూడిద అవడం తథ్యం.” అని భోరు భోరున ఏడుస్తూ ఉంది కౌసల్య.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము నలుబదిమూడవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అయోధ్యాకాండ చతుశ్చత్వారింశః సర్గః (44)>>

Leave a Comment