Ayodhya Kanda Sarga 46 In Telugu – అయోధ్యాకాండ షట్చత్వారింశః సర్గః

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అయోధ్యాకాండ షట్చత్వారింశః సర్గ, “పౌరమోహనమ్”, రామాయణంలోని ఒక సన్నివేశభరితమైన భాగం. ఈ సర్గలో, రాముడు, సీత, మరియు లక్ష్మణులు వనవాసానికి బయలుదేరిన తరువాత, అయోధ్య ప్రజలు తీవ్ర దుఃఖంలో మునిగిపోతారు. రాముడిని విడిచిపెట్టాలనే ఆలోచన వారికి అసహ్యంగా ఉంటుంది మరియు వారు తీవ్ర వేదనతో బాధపడుతారు. రాముడి వినయం, ధర్మపాలన, మరియు ప్రజల పట్ల అతని అపారమైన ప్రేమ వల్ల ప్రజలు మోహములో పడతారు. ఈ సర్గలో, ప్రజల ఆకలితో, నిరాశతో, మరియు రాముడి పట్ల ఉన్న ప్రేమతో కూడిన భావోద్వేగాలు హృదయానికి హత్తుకునేలా ప్రతిబింబిస్తాయి.

పౌరమోహనమ్

తతస్తు తమసాతీరం రమ్యమాశ్రిత్య రాఘవః |
సీతాముద్వీక్ష్య సౌమిత్రిమిదం వచనమబ్రవీత్ ||

1

ఇయమద్య నిశా పూర్వా సౌమిత్రే ప్రహితా వనమ్ |
వనవాసస్య భద్రం తే స నోత్కంఠితుమర్హసి ||

2

పశ్య శూన్యాన్యరణ్యాని రుదంతీవ సమంతతః |
యథానిలయమాయద్భిర్నిలీనాని మృగద్విజైః ||

3

అద్యాయోధ్యా తు నగరీ రాజధానీ పితుర్మమ |
సస్త్రీపుంసాగతానస్మాన్శోచిష్యతి న సంశయః ||

4

అనురక్తా హి మనుజాః రాజానం బహుభిర్గుణైః |
త్వాం చ మాం చ నరవ్యాఘ్ర శత్రఘ్నభరతౌ తథా ||

5

పితరం చానుశోచామి మాతరం చ యశస్వినీమ్ |
అపి వాఽన్ధౌ భవేతాం తు రుదంతౌ తావభీక్ష్ణశః ||

6

భరతః ఖలు ధర్మాత్మా పితరం మాతరం చ మే |
ధర్మార్థకామసహితైః వాక్యైరాశ్వాసయిష్యతి ||

7

భరతస్యానృశంసత్వం విచింత్యాహం పునః పునః |
నానుశోచామి పితరం మాతరం చాపి లక్ష్మణ ||

8

త్వయా కార్యం నరవ్యాఘ్ర మామనువ్రజతా కృతమ్ |
అన్వేష్టవ్యా హి వైదేహ్యా రక్షణార్థే సహాయతా ||

9

అద్భిరేవ తు సౌమిత్రే వత్స్యామ్యద్య నిశామిమామ్ |
ఏతద్ధి రోచతే మహ్యం వన్యేఽపి వివిధే సతి ||

10

ఏవముక్త్వా తు సౌమిత్రం సుమంత్రమపి రాఘవః |
అప్రమత్తస్త్వమశ్వేషు భవ సౌమ్యేత్యువాచ హ ||

11

సోఽశ్వాన్సుమంత్రః సంయమ్య సూర్యేఽస్తం సముపాగతే |
ప్రభూతయవసాన్కృత్వా బభూవ ప్రత్యనంతరః ||

12

ఉపాస్య తు శివాం సంధ్యాం దృష్ట్వా రాత్రిముపస్థితామ్ |
రామస్య శయనం చక్రే సూతః సౌమిత్రిణా సహ ||

13

తాం శయ్యాం తమసాతీరే వీక్ష్య వృక్షదలైః కృతామ్ |
రామః సౌమిత్రిణా సార్ధం సభార్యః సంవివేశ హ ||

14

సభార్యం సంప్రసుప్తం తం భ్రాతరం వీక్ష్య లక్ష్మణః |
కథయామాస సూతాయ రామస్య వివిధాన్గుణాన్ ||

15

జాగ్రతః హ్యేవ తాం రాత్రిం సౌమిత్రేరుదితః రవిః |
సూతస్య తమసాతీరే రామస్య బ్రువతః గుణాన్ ||

16

గోకులాకులతీరాయాస్తమసాయా విదూరతః |
అవసత్తత్ర తాం రాత్రిం రామః ప్రకృతిభిః సహ ||

17

ఉత్థాయ తు మహాతేజాః ప్రకృతీస్తా నిశామ్య చ |
అబ్రవీద్భ్రాతరం రామః లక్ష్మణం పుణ్యలక్షణమ్ ||

18

అస్మద్వ్యపేక్షాన్సౌమిత్రే నిరపేక్షాన్గృహేష్వపి |
వృక్షమూలేషు సంసుప్తాన్పశ్య లక్ష్మణ సాంప్రతమ్ ||

19

యథైతే నియమం పౌరాః కుర్వంత్యస్మన్నివర్తనే |
అపి ప్రాణాన్న్యసిష్యంతి న తు త్యక్ష్యంతి నిశ్చయమ్ ||

20

యావదేవ తు సంసుప్తాస్తావదేవ వయం లఘు |
రథమారుహ్య గచ్ఛామ పంథానమకుతోభయమ్ ||

21

అతః భూయోఽపి నేదానీమిక్ష్వాకుపురవాసినః |
స్వపేయురనురక్తా మాం వృక్షమూలాని సంశ్రితాః ||

22

పౌరా హ్యాత్మకృతాద్దుఃఖాద్విప్రమోక్ష్యా నృపాత్మజైః |
న తే ఖల్వాత్మనా యోజ్యా దుఃఖేన పురవాసినః || [న తు]

23

అబ్రవీల్లక్ష్మణో రామం సాక్షాద్ధర్మమివస్థితమ్ |
రోచతే మే తథా ప్రాజ్ఞ క్షిప్రమారుహ్యతామితి ||

24

అథ రామోఽబ్రవీచ్ఛ్రీమాన్సుమంత్రం యుజ్యతాం రథః |
గమిష్యామి తతోఽరణ్యం గచ్ఛ శ్రీఘ్రమితః ప్రభో ||

25

సూతస్తతః సంత్వరితః స్యందనం తైర్హయోత్తమైః |
యోజయిత్వాఽథ రామాయ ప్రాంజలిః ప్రత్యవేదయత్ ||

26

అయం యుక్తో మహాబాహో రథస్తే రథినాంవర |
తమారోహ సుభద్రం తే ససీతః సహలక్ష్మణః ||

27

తం స్యందనమధిష్ఠాయ రాఘవః సపరిచ్ఛదః |
శీఘ్రగామాకులావర్తాం తమసామతరన్నదీమ్ ||

28

స సంతీర్య మహాబాహుః శ్రీమాన్శివమకంటకమ్ |
ప్రాపద్యత మహామార్గమభయం భయదర్శినామ్ ||

29

మోహనార్థం తు పౌరాణాం సూతం రామోఽబ్రవీద్వచః |
ఉదఙ్ముఖః ప్రయాహి త్వం రథమాస్థాయ సారథే ||

30

ముహూర్తం త్వరితం గత్వా నివర్తయ రథం పునః |
యథా న విద్యుః పౌరా మాం తథా కురు సమాహితః ||

31

రామస్య వచనం శ్రుత్వా తథా చక్రే స సారథిః |
ప్రత్యాగమ్య చ రామస్య స్యందనం ప్రత్యవేదయత్ ||

32

తౌ సంప్రయుక్తం తు రథం సమాసిత్థౌ
తదా ససీతౌ రఘవంశవర్ధనౌ |
ప్రచోదయామాస తతస్తురంగమాన్
స సారథిర్యేన పథా తపోవనమ్ ||

33

తతః సమాస్థాయ రథం మహారథః
ససారథిర్ధాశరథిర్వనం యయౌ |
ఉదఙ్ముఖం తం తు రథం చకార స
ప్రయాణమాంగళ్య నిమిత్తదర్శనాత్ ||

34

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే షట్చత్వారింశః సర్గః ||

Ayodhya Kanda Sarga 46 Meaning In Telugu

తమసానదీ తీరమునకు చేరుకున్న రాముడు, సీతతో, లక్ష్మణునితో ఇలా అన్నాడు.

“ఓ సీతా! లక్ష్మణా! ఇప్పుడు మనము వనవాసములోకి ప్రవేశించాము. మన వనవాసములో ఇది తొలి రాత్రి. చీకట్లు కమ్ముకుంటున్నాయి. పక్షులు కూడా తమ తమ గూళ్లకు చేరి నిశ్శబ్దంగా నిద్రపోతున్నాయి. అయోధ్యలోని మనవారందరూ మన కోసము దు:ఖిస్తూ ఉంటారు. ముఖ్యంగా నా తల్లి కౌసల్య, నా తండ్రి దశరథుడు నా కోసం ఏడ్చి ఏడ్చి అంధులుగా మారిపోతారా అని భయంగా ఉంది. నా తల్లి తండ్రులను ఇంక భరతుడే ఓదార్చాలి. అయినా ధర్మాత్ముడు అయిన భరతుడు ఉండగా నా తల్లితండ్రులకు భయమేముంటుంది.

లక్ష్మణా! నీవు నా వెంబడి రావడం నా మంచికే జరిగింది. లేకపోతే నేను ఒక్కడినే సీతా సంరక్షణ భారం వహించవలసి వచ్చేది. ఓ లక్ష్మణా! ఈ రాత్రికి నేను ఆహారం ఏమీ తీసుకోను. కేవలము నీళ్లు తాగి ఉంటాను. నాకు భోజనము చెయ్యాలని కోరిక లేదు. నీవు మాత్రము మన రథాశ్వములను జాగ్రత్తగా చూచుకో. వాటికి కావలసిన ఆహారపానీయాలు అందాయోలేదో చూడు.” అని అన్నాడు. రాముడు.

రథమును తోలుకొని వచ్చిన సుమంత్రుడు గుర్రములకు కావలసిన ఆహారము పెట్టాడు. వాటిదగ్గరే ఉన్నాడు. తరువాత సుమంత్రుడు రామునకు, సీతకు, లక్ష్మణునకు చెట్ల ఆకులతో కూడిన శయ్యలు(పడకలు) ఏర్పాటు చేసాడు. రాముడు, సీత, లక్ష్మణుడు ఆ శయ్యలమీద పడుకున్నారు. రాముడు సీత నిద్రపోయారు గానీ, సుమంత్రునికి లక్ష్మణునికి నిద్రపట్టలేదు. వారు ఇద్దరూ రాముని సద్గుణముల గురించి ఒకరితో ఒకరు చెప్పుకుంటున్నారు. ఇంతలో రాత్రి గడిచిపోయింది. తెల్లవారింది. సూర్యోదయము కావచ్చింది. రాముని వెంట వచ్చిన బ్రాహ్మణులు కూడా తమసానదీ తీరంలో నిద్రించారు.

పెందరాడే నిద్రలేచిన రాముడు లక్ష్మణునితో ఇలా అన్నాడు. “ఓ లక్ష్మణా! వీరిని చూడు. నాకోసరము, నామీద ప్రేమతో అభిమానంతో తమ తమ గృహములను విడిచి నా వెంట అడవులకు వచ్చారు. చెట్ల కింద, కటిక నేలమీద నిద్రిస్తున్నారు. వీరు నా కోసం తమ ప్రాణములనైనా ఇస్తారు కానీ తమ తమ నివాసములకు వెళ్లేటట్టులేదు. కాబట్టి అధర్మమైనా నాకు ఒక మార్గము తోచుచున్నది. వీరందరూ నిద్రలేచే లోపు మనము రథం ఎక్కి దూరంగా వెళ్లి పోదాము. అప్పుడు వీరు చేసేది లేక తిరిగి అయోధ్యకు వెళ్లిపోతారు. మనతో పాటు వీరికీ వనవాసము తప్పుతుంది. ఇంక వీళ్లకు ఈ చెట్లకింద నిద్రించే అవసరము ఉండదు. పౌరులకు ఏదైనా దు:ఖము కలిగితే రాజులు తొలిగించాలి కానీ, రాజులే పౌరులకు దుఃఖము కలిగించకూడదు.” అని అన్నాడు రాముడు.

“రామా! నీ మాటలు చాలా బాగున్నాయి. అలాగే చేద్దాము. సుమంత్రా రథమును సిద్ధం చెయ్యి. మనం వెంటనే బయలుదేరాలి.” అని అన్నాడు లక్ష్మణుడు.

సుమంత్రుడు త్వరత్వరగా రథమును సిద్ధం చేసాడు. రాముడు, సీత, లక్ష్మణుడు రథం ఎక్కారు. వారు రథము మీద తమసా నదీ తీరాన్ని దాటారు. రాముడు సుమంత్రునితో ఇలా అన్నాడు. “ఓ సుమంత్రా! నీవు ఉత్తరదిక్కుగా కొంతదూరం ప్రయాణించి తరువాత రథమును వెనుకకు తిప్పుకొని రమ్ము. మా వెంట వచ్చిన బ్రాహ్మణులకు కనపడకుండా మరలా మావద్దకు రథమును తీసుకొని రా. ఎట్టి పరిస్థితులతోనూ మా విషయం వారికి తెలియనియ్యకు.” అని అన్నాడు. సుమంత్రుడు.

రాముడు చెప్పినట్టే చేసి రథమును మరలా రాముని వద్దకు తీసుకొని వచ్చి నిలిపాడు. తరువాత సీతారామలక్ష్మణులు రథం ఎక్కారు. సుమంత్రుడు రథమును అరణ్యమార్గములో పోనిచ్చాడు.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము నలుబది ఆరవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

అయోధ్యాకాండ సప్తచత్వారింశః సర్గః (47) >>

Leave a Comment