మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అయోధ్యాకాండ సప్తచత్వారింశః సర్గ, “పౌరనివృత్తిః”, రామాయణంలోని ఒక ప్రాధాన్యభరితమైన భాగం. ఈ సర్గలో, రాముడు వనవాసం కోసం బయలుదేరిన తరువాత, అయోధ్య ప్రజలు రాముడిని తిరిగి రావాలని ఆశిస్తూ, అతడిని అనుసరించడానికి ప్రయత్నిస్తారు. కానీ రాముడు వారి అభ్యర్థనలను అంగీకరించక, వారు తిరిగి అయోధ్యకు వెళ్లిపోవాల్సిందిగా చెప్పి, ప్రజలను పంపిస్తాడు. ప్రజలు మనసు కఠినపరచుకుని, రాముడి ఆజ్ఞను పాటిస్తూ తిరిగి అయోధ్యకు వెళతారు. ఈ సర్గలో, ప్రజల విశ్వాసం, విధేయత, మరియు రాముడి పట్ల ఉన్న భక్తి హృదయానికి హత్తుకునేలా చూపబడుతుంది.
పౌరనివృత్తిః
ప్రభాతాయాం తు శర్వర్యాం పౌరాస్తే రాఘవం వినా |
శోకోపహతనిశ్చేష్టా బభూవుర్హతచేతసః ||
1
శోకజాశ్రుపరిద్యూనా వీక్షమాణాస్తతస్తతః |
ఆలోకమపి రామస్య న పశ్యంతి స్మ దుఃఖితాః ||
2
తే విషాదార్తవదనాః రహితాస్తేన ధీమతా |
కృపణాః కరుణా వాచో వదంతి స్మ మనస్వినః ||
3
ధిగస్తు ఖలు నిద్రాం తాం యయాఽపహృతచేతసః |
నాద్య పశ్యామహే రామం పృథూరస్కం మహాభుజమ్ ||
4
కథం నామ మహాబాహుః స తథాఽవితథక్రియః |
భక్తం జనం పరిత్యజ్య ప్రవాసం రాఘవో గతః ||
5
యో నః సదా పాలయతి పితా పుత్రానివౌరసాన్ |
కథం రఘూణాం స శ్రేష్ఠస్త్యక్త్వా నో విపినం గతః ||
6
ఇహైవ నిధనం యామో మహాప్రస్థానమేవ వా |
రామేణ రహితానాం హి కిమర్థం జీవితం హి నః ||
7
సంతి శుష్కాణి కాష్ఠాని ప్రభూతాని మహాంతి చ |
తైః ప్రజ్వాల్య చితాం సర్వే ప్రవిశామోఽథ పావకమ్ ||
8
కిం వక్ష్యామో మహాబాహురనసూయః ప్రియంవదః |
నీతః స రాఘవోఽస్మాభిరితి వక్తుం కథం క్షమమ్ ||
9
సా నూనం నగరీ దీనా దృష్ట్వాఽస్మాన్రాఘవం వినా |
భవిష్యతి నిరానందా సస్త్రీబాలవయోఽధికా ||
10
నిర్యాతాస్తేన వీరేణ సహ నిత్యం జితాత్మనా |
విహినాస్తేన చ పునః కథం పశ్యామ తాం పురీమ్ ||
11
ఇతీవ బహుధా వాచో బాహుముద్యమ్య తే జనాః |
విలపంతి స్మ దుఃఖర్తా వివత్సా ఇవ ధేనవః ||
12
తతః మార్గానుసారేణ గత్వా కించిత్ క్షణం పునః
మార్గనాశాద్విషాదేన మహతా సమభిప్లుతాః ||
13
రథస్య మార్గనాశేన న్యవర్తంత మనస్వినః |
కిమిదం కిం కరిష్యామో దైవేనోపహతా ఇతి ||
14
తతః యథాగతేనైవ మార్గేణ క్లాంతచేతసః |
అయోధ్యామగమన్సర్వే పురీం వ్యథితసజ్జనామ్ ||
15
ఆలోక్య నగరీం తాం చ క్షయవ్యాకులమానసాః |
ఆవర్తయంత తేఽశ్రూణి నయనైః శోకపీడితైః ||
16
ఏషా రామేణ నగరీ రహితా నాతిశోభతే |
ఆపగా గరుడేనేవ హ్రదాదుద్ధృతపన్నగా ||
17
చంద్రహీనమివాకాశం తోయహీనమివార్ణవమ్ |
అపశ్యన్నిహతానందం నగరం తే విచేతసః ||
18
తే తాని వేశ్మాని మహాధనాని
దుఃఖేన దుఃఖోపహతా విశంతః |
నైవ ప్రజజ్ఞుః స్వజనం జనం వా
నిరీక్షమాణాః ప్రవినష్టహర్షాః ||
19
ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే సప్తచత్వారింశః సర్గః ||
Ayodhya Kanda Sarga 47 Meaning In Telugu
రాముని వెంట అడవులకు వచ్చిన బ్రాహ్మణులు పౌరులు ఉదయమే నిద్ర లేచారు. కాలకృత్యములు తీర్చుకున్నారు. సంధ్యా వందనము ఆచరించారు. రాముని కొరకు చూచారు. కాని సీతారామలక్ష్మణులు కనిపించలేదు. అడవి అంతా వెతికారు. కాని వారి జాడలేదు. వారిలో వారు ఇలా అనుకుంటున్నారు.
“ఏమిటీ మనము ఒళ్లు తెలియకుండా నిద్రపోయాము. ఉదయమే మెలుకువ రాలేదు. మన కోసం చూచి రాముడు తన దారిన తాను వెళ్లిపోయి ఉంటాడు. ఏం చేస్తాం. రాముడు ఇన్నాళ్లు మనలను కన్నబిడ్డలవలె చూచుకున్నాడు. ఇప్పుడు ఆయనకు అరణ్యవాసము దాపురించింది. అందుకే మనలను విడిచి వెళ్లి పోయాడు. ఇంక మనకు దిక్కు ఎవ్వరు. రాముని విడిచి మనము జీవించలేము. మనము కూడా రాముడు వెళ్లిన ఉత్తర దిక్కుగా వెళ్ళాము. ఏనాటి కైనా రాముడు మనకు కనపడకపోతాడా! రాముడు లేకుండా జీవించడం కంటే రాముని వెదకడమే ఉత్తమము. లేకపోతే ఇక్కడే మనము పెద్ద చితి పేర్చుకొని అందులో అందరమూ అగ్ని ప్రవేశము చేస్తాము.
ఇప్పుడు మనము రాముడు లేకుండా అయోధ్యకు వెళితే, మన ఇంట్లో వాళ్లు “రాముడు ఏడీ!” అని అడిగితే ఏమని సమాధానము చెప్పగలము. రాముని అరణ్యములలో వదిలి వచ్చాము అని చెప్పాలా! మనమందరమూ రాముని తిరిగి తీసుకు వస్తామని అయోధ్యావాసులు అందరూ మనకోసం ఎదురు చూస్తూ ఉంటారు. మనము రాముడు లేకుండా వెళితే వారి దుఃఖమునకు అంతు ఉండదు.
రాముడు ఉన్నప్పుడు మనము అయోధ్యలో ఉన్నాము. రాముని వెంట అడవులకు వచ్చాము. రాముడు లేని అయోధ్యలో మరలా అడుగుపెట్టలేము. ఇప్పుడు ఏమి చెయ్యడం.” అంటూ తమలో తాము వ్యాకులపడుతున్నారు.
కొంత మంది రథము పోయిన జాడలు అనుసరించి పోదామన్నారు. అందరూ రథము జాడల అనుసరించి వెళ్లారు. కాని ప్రయోజనం లేకపోయింది. ఇంక చేసేది లేక అందరూ తిరిగి అయోధ్య దారి పట్టారు. సాయంత్రానికి అయోధ్యానగరము చేరుకున్నారు. రాముని లేని అయోధ్య వారికి పాడుబడినట్టు కనిపించింది. చంద్రుడు లేని ఆకాశము లాగా వెలవెలబోతున్న అయోధ్యను వారు చూడలేక పోయారు. రాముని వదిలివచ్చిన దు:ఖముతో ఎవరి గృహములకు వారు వెళ్లిపోయారు.
శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము నలుబది ఏడవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.