Ayodhya Kanda Sarga 63 In Telugu – అయోధ్యాకాండ త్రిషష్ఠితమః సర్గః

అయోధ్యాకాండ త్రిషష్ఠితమః సర్గంలో, దశరథ మహారాజు కౌసల్య, సుమిత్ర, మరియు కైకేయిలతో కలసి రాముడి వనం పంపిన పశ్చాత్తాపంతో బాధపడుతాడు. దశరథుడు రాత్రింబవళ్లు రాముడి గురించే ఆలోచిస్తూ అనుతాపంలో మునిగి తానెవరి మాటలు వినకుండా ఉంటాడు. రాత్రి ఒకప్పుడు, అతను తన గత జీవితంలో చేసిన పాపం గురించి స్మరించుకుంటాడు, అందులో శ్రవణ కుమారుడు అనే అంధురాళ్ల కుమారుడిని పొరపాటున వధించిన సంఘటన. ఈ బాధతో, దశరథుడు తన మరణం సమీపంలో ఉన్నాడు. ఈ సర్గ దశరథుడి పశ్చాత్తాపం, అతని కుమారుడి వియోగంలో నష్టభావాన్ని, మరియు కర్మ ఫలితాలను తెలియజేస్తుంది.

ఋషికుమారవధాఖ్యానమ్

ప్రతిబుద్ధో ముహుర్తేన శోకోపహత చేతనః |
అథ రాజా దశరథః సచింతామభ్యపద్యత || ౧ ||

రామ లక్ష్మణయోశ్చైవ వివాసాద్వాసవోపమమ్ |
ఆవివేశోపసర్గస్తం తమః సూర్యమివాసురమ్ || ౨ ||

సభార్యే నిర్గతే రామే కౌసల్యాం కోసలేశ్వరః |
వివక్షురసితాపాంగాం స్మృత్వా దుష్కృతమాత్మనః || ౩ ||

స రాజా రజనీం షష్ఠీం రామే ప్రవ్రాజితే వనమ్ |
అర్ధరాత్రే దశరథః సంస్మరన్ దుష్కృతం కృతమ్ || ౪ ||

స రాజా పుత్రశోకార్తః స్మృత్వా దుష్కృతమాత్మనః |
కౌసల్యాం పుత్ర శోకార్తామిదం వచనమబ్రవీత్ || ౫ ||

యదాచరతి కళ్యాణి శుభం వా యది వాఽశుభమ్ |
తదేవ లభతే భద్రే కర్తా కర్మజమాత్మనః || ౬ ||

గురు లాఘవమర్థానామారంభే కర్మణాం ఫలమ్ |
దోషం వా యో న జానాతి స బాలైతి హోచ్యతే || ౭ ||

కశ్చిదామ్రవణం ఛిత్త్వా పలాశాంశ్చ నిషించతి |
పుష్పం దృష్ట్వా ఫలే గృధ్నుః స శోచతి ఫలాగమే || ౮ ||

అవిజ్ఞాయ ఫలం యో హి కర్మ త్వేవానుధావతి |
స శోచేత్ఫలవేలాయాం యథా కింశుకసేచకః || ౯ ||

సోఽహమామ్రవణం ఛిత్త్వా పలాశాంశ్చ న్యషేచయమ్ |
రామం ఫలాగమే త్యక్త్వా పశ్చాచ్ఛోచామి దుర్మతిః || ౧౦ ||

లబ్ధశబ్దేన కౌసల్యే కుమారేణ ధనుష్మతా |
కుమారః శబ్దవేధీతి మయా పాపమిదం కృతమ్ || ౧౧ ||

తదిదం మేఽనుసంప్రాప్తం దేవి దుఃఖం స్వయం కృతమ్ |
సమ్మోహాదిహ బాలేన యథా స్యాద్భక్షితం విషమ్ || ౧౨ ||

యథాఽన్యః పురుషః కశ్చిత్పలాశైర్మోహితో భవేత్ |
ఏవం మమాఽప్యవిజ్ఞాతం శబ్ద వేధ్యమయం ఫలమ్ || ౧౩ ||

దేవ్యనూఢా త్వమభవో యువరాజో భవామ్యహమ్ |
తతః ప్రావృడనుప్రాప్తా మదకామవివర్ధినీ || ౧౪ ||

ఉపాస్యహి రసాన్ భౌమాన్ తప్త్వా చ జగదంశుభిః |
పరేతాచరితాం భీమాం రవిరావిశతే దిశమ్ || ౧౫ ||

ఉష్ణమంతర్దధే సద్యః స్నిగ్ధా దదృశిరే ఘనాః |
తతః జహృషిరే సర్వే భేకసారంగబర్హిణః || ౧౬ ||

క్లిన్నపక్షోత్తరాః స్నాతాః కృచ్ఛ్రాదివ పతత్రిణః |
వృష్టివాతావధూతాగ్రాన్ పాదపానభిపేదిరే || ౧౭ ||

పతితేనాంభసాఽఽచ్ఛన్నః పతమానేన చాసకృత్ |
ఆబభౌ మత్తసారన్గస్తోయ రాశిరివాచలః || ౧౮ ||

పాండురారుణవర్ణాని స్రూతాంసి విమలాన్యపి |
సుస్రువుర్గిరిధాతుభ్యః సభస్మాని భుజంగవత్ || ౧౯ ||

తస్మిన్నతిసుఖే కాలే ధనుష్మానిషుమాన్ రథీ |
వ్యాయామకృతసంకల్పః సరయూమన్వగాం నదీమ్ || ౨౦ ||

నిపానే మహిషం రాత్రౌ గజం వాఽభ్యాగతం నదీమ్ |
అన్యం వా శ్వాపదం కంచిత్ జిఘాంసురజితేంద్రియః || ౨౧ ||

అథాంధకారే త్వశ్రౌషం జలే కుంభస్య పర్యతః |
అచక్షుర్విషయే ఘోషం వారణస్యేవ నర్దతః || ౨౨ ||

తతోఽహం శరముద్ధృత్య దీప్తమాశీవిషోపమమ్ |
శబ్దం ప్రతి గజప్రేప్సురభిలక్ష్య త్వపాతయమ్ || ౨౩ ||

అముంచం నిశితం బాణమహమాశీవిషోపమమ్ |
తత్ర వాగుషసి వ్యక్తా ప్రాదురాసీద్వనౌకసః || ౨౪ ||

హాహేతి పతతస్తోయే బాణాభిహతమర్మణః |
తస్మిన్నిపతితే బాణే వాగభూత్తత్ర మానుషీ || ౨౫ ||

కథమస్మద్విధే శస్త్రం నిపతేత్తు తపస్విని |
ప్రవివిక్తాం నదీం రాత్రౌ ఉదాహారోఽహమాగతః |
ఇషుణాఽభిహతః కేన కస్య వా కిం కృతం మయా || ౨౬ ||

ఋషేర్హి న్యస్త దండస్య వనే వన్యేన జీవతః |
కథం ను శస్త్రేణ వధో మద్విధస్య విధీయతే || ౨౭ ||

జటాభారధరస్యైవ వల్కలాజినవాససః |
కో వధేన మమార్థీ స్యాత్ కిం వాఽస్యాపకృతం మయా || ౨౮ ||

ఏవం నిష్ఫలమారబ్ధం కేవలానర్థసంహితమ్ |
న కశ్చిత్ సాధు మన్యేత యథైవ గురుతల్పగమ్ || ౨౯ ||

నహం తథాఽనుశోచామి జీవిత క్షయమాత్మనః |
మాతరం పితరం చోభౌ అనుశోచామి మద్విధే || ౩౦ ||

తదేతన్మిథునం వృద్ధం చిరకాలభృతం మయా |
మయి పంచత్వమాపన్నే కాం వృత్తిం వర్తయిష్యతి || ౩౧ ||

వృద్ధౌ చ మాతా పితరౌ అహం చైకేషుణా హతః |
కేన స్మ నిహతాః సర్వే సుబాలేనాకృతాత్మనా || ౩౨ ||

తాం గిరం కరుణాం శ్రుత్వా మమ ధర్మానుకాంక్షిణః |
కరాభ్యాం సశరం చాపం వ్యథితస్యాపతద్భువి || ౩౩ ||

తస్యాహం కరుణం శ్రుత్వా నిశి లాలపతో బహు |
సంభ్రాంతః శోకవేగేన భృశమాసం విచేతనః || ౩౪ ||

తం దేశమహమాగమ్య దీన సత్త్వః సుదుర్మనాః |
అపశ్యమిషుణా తీరే సరయ్వాస్తాపసం హతమ్ || ౩౫ ||

అవకీర్ణజటాభారం ప్రవిద్ధకలశోదకమ్ |
స మాముద్వీక్ష్య నేత్రాభ్యాం త్రస్తమస్వస్థచేతసమ్ || ౩౬ ||

ఇత్యువాచ తతః క్రూరం దిధక్షన్నివ తేజసా |
కిం తవాపకృతం రాజన్ వనే నివసతా మయా || ౩౭ ||

జిహీర్షురంభో గుర్వర్థం యదహం తాడితస్త్వయా |
ఏకేన ఖలు బాణేన మర్మణ్యభిహతే మయి || ౩౮ ||

ద్వావంధౌ నిహతౌ వృద్ధౌ మాతా జనయితా చ మే |
తౌ కథం దుర్బలావంధౌ మత్ప్రతీక్షౌ పిపాసితౌ || ౩౯ ||

చిరమాశాకృతాం తృష్ణాం కష్టాం సంధారయిష్యతః |
న నూనం తపసో వాఽస్తి ఫలయోగః శ్రుతస్య వా || ౪౦ ||

పితా యన్మాం న జానాతి శయానం పతితం భువి |
జానన్నపి చ కిం కుర్యాదశక్తిరపరిక్రమః || ౪౧ ||

భిద్యమానమివాశక్తస్త్రాతుమన్యో నగో నగమ్ |
పితుస్త్వమేవ మే గత్వా శీఘ్రమాచక్ష్వ రాఘవ || ౪౨ ||

న త్వామనుదహేత్ క్రుద్ధో వనం వహ్నిరివైధితః |
ఇయమేకపదీ రాజన్ యతః మే పితురాశ్రమః || ౪౩ ||

తం ప్రసాదయ గత్వా త్వం న త్వాం స కుపితః శపేత్ |
విశల్యం కురు మాం రాజన్ మర్మ మే నిశితః శరః || ౪౪ ||

రుణద్ధి మృదుసోత్సేధం తీరమంబు రయో యథా |
సశల్యః క్లిశ్యతే ప్రాణైర్విశల్యో వినశిష్యతి || ౪౫ ||

ఇతి మామవిశచ్చింతా తస్య శల్యాపకర్షణే |
దుఃఖితస్య చ దీనస్య మమ శోకాతురస్య చ || ౪౬ ||

లక్షయామాస హృదయే చింతాం మునిసుతస్తదా |
తామ్యమానః స మాం కృచ్ఛాదువాచ పరమార్తవత్ || ౪౭ ||

సీదమానో వివృత్తాంగో వేష్టమానో గతః క్షయమ్ |
సంస్తభ్య శోకం ధైర్యేణ స్థిరచిత్తో భవామ్యహమ్ || ౪౮ ||

బ్రహ్మహత్యాకృతం పాపం హృదయాదపనీయతామ్ |
న ద్విజాతిరహం రాజన్ మాభూత్తే మనసో వ్యథా || ౪౯ ||

శూద్రాయామస్మి వైశ్యేన జాతః జనపదాధిప |
ఇతీవ వదతః కృచ్ఛ్రాత్ బాణాభిహతమర్మణః || ౫౦ ||

విఘూర్ణతో విచేష్టస్య వేపమానస్య భూతలే |
తస్యత్వానమ్యమానస్య తం బాణమహముద్ధరమ్ || ౫౧ ||

జలార్ద్రగాత్రం తు విలప్య కృచ్ఛ్రాత్
మర్మవ్రణం సంతతముచ్ఛ్వసంతమ్ |
తతః సరయ్వాం తమహం శయానమ్
సమీక్ష్య భద్రేఽస్మి భృశం విషణ్ణః || ౫౨ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే త్రిషష్ఠితమః సర్గః || ౬౩ ||

Ayodhya Kanda Sarga 63 Meaning In Telugu

దశరథుడు కలతనిద్రలో ఉన్నాడు. పూర్వము జరిగిన సంఘటనలు పదే పదే గుర్తుకు వస్తున్నాయి. నిద్రపట్టడం లేదు. ఆ విషయం కౌసల్యకు చెబితే తన దు:ఖము కొంచెమైనా ఉపశమిస్తుంది అని అనుకున్నాడు. కౌసల్యను పిలిచాడు. తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు. ఆమెతో ఇలా చెప్పసాగాడు.

ఓ కౌసల్యా! మానవుడు తాను చేసిన పుణ్యమునకు పాపమునకు ఈ జన్మలోనే తగిన ఫలితాన్ని అనుభవిస్తాడు. వాడు ఎవరైనా సరే, ఒక పనిని మొదలు పెట్టే ముందు, తాను చేయబోయే పని మంచిదా, చెడ్డదా, ఆ పని వలన మంచి ఫలితము వస్తుందా లేక చెడ్డ ఫలితము వస్తుందా అని తెలుసుకొని తరువాత ఆ పని మొదలుపెట్టాలి. అలా చెయ్యని వాడు మూర్ఖుడు, ఏమీ తెలియని వాడు అని పెద్దలు అంటారు.

మోదుగుపూలు పెద్దవిగా ఉంటాయి. కాని మామిడి పూత చాలా చిన్నదిగా ఉంటుంది. మోదుగ పూలు పెద్దవి కాబట్టి పెద్ద పెద్ద కాయలు, పండ్లు కాస్తాయి అని మామిడి చెట్లను నరికి, మోదుగ చెట్లను పెంచిన వాడు మూఢుడు కాక మరేమవుతాడు. ఎందుకూ పనికిరాని మోదుగ కాయలను చూచి ఏడుస్తాడు. తాను చేయబోయే పనికి ఎలాంటి ఫలితం వస్తుందో తెలియకుండా ఆ పని చేసేవాడు, పూతా పిందే లేని చెట్టుకు నీరు పోసి పెంచిన వాడితో సమానము. మామిడి చెట్టులాంటి రాముని అడవులకు పంపి, మోదుగ చెట్లను పెంచుతున్నాను. కాని ఈ పాపమునకు బలమైన కారణము ఉంది.

నేను మంచి యవ్వనములో ఉండగా నాకు శబ్దవేధి విద్యనేర్చుకున్నాను. ఎంత చీకటిలో ఉన్న మృగము నైనా అది చేయు శబ్దమును విని దానిని గురితప్పకుండా కొట్టగల నేర్పు నాకు ఉండేది. అదే నాకు చేటు తెచ్చింది. మహా పాపము చేయించింది.

ఓ కౌసల్యా! అప్పటికి నాకు వివాహము కాలేదు. మంచి యవ్వనములో ఉన్నాను. పైగా యువరాజును. కోరికలు ఎక్కువ. దానితో కూడా మదము, గర్వము కూడా ఎక్కువే. ఒక వర్షాకాలంలో నేను సరయూనది సమీపములోని అడవికి వేటకు వెళ్లాను. వేటాడి వేటాడి అలసి పోయాను. అంతలో చీకటి పడింది. నాకు రాత్రిళ్లు వేటాడటం చాలా ఇష్టం. సరోవరములో నీటిని తాగుటకు వచ్చు జంతువులు నీరు తాగునపుడు చేయు గుడ గుడ శబ్దములను బట్టి వాటిని బాణములతో కొట్టి వినోదించేవాడిని.

అదే ప్రకారము ఆ రాత్రికూడా నేను ఒక సరోవరము దాపున మాటు వేసి కూర్చున్నాను. ఆ రోజు ఒక ఏనుగును వేటాడవలెనని సంకల్పముతో ఉన్నాను. ఇంతలో నీటిలో దిగిన శబ్దము, కుండలో నీరు నింపునపుడు వచ్చే శబ్దము నాకు వినపడ్డాయి. నేను ఏనుగు తన తొండముతో నీరు తాగుతూ ఉంది అని అనుకున్నాను. ఒక బాణము తీసి, ఆ శబ్దము వచ్చు వైపు గురిపెట్టి కొట్టాను. ఏనుగు ఘీంకారమునకు బదులు “అయ్యో అమ్మా అమ్మా” అంటూ మనిషి అరిచిన శబ్దము వినపడింది.

నేను పరుగు పరుగున ఆ సరోవరము వద్దకు వెళ్లాను. అక్కడ ఒక ముని కుమారుడు పడి ఉన్నాడు. నేను వదిలిన బాణము అతని గుండెల్లో గుచ్చుకొని ఉంది. “మేము ఈ అడవితో తపస్సుచేసుకుంటుంటే మా మీద ఏ దుర్మార్గుడు బాణప్రయోగము చేసినాడో కదా! మేము ఎవరికీ అపకారము చేయలేదే! నీళ్లు తీసుకొని పోవడానికి నేను ఇక్కడికి వచ్చాను. కాని నన్ను ఎవరో బాణంతో కొట్టారు. మేము హింస అంటే ఏమిటో ఎరుగము. ఎవరికీ ఏ విధమైన అపకారమూ చెయ్యము.

అటువంటిమాకు ఈ విధంగా బాణంతో కొట్టి మరణ శిక్ష విధించుటకు కారణమేమి? నేను ఎవరికీ ఏ అపకారము చెయ్యలేదు. అంటువంటిది నన్ను ఎందుకు బాణంతో కొట్టాల్సివచ్చింది. అతడు ఎవరో కానీ ఏ విధంగానూ మంచి ఫలితము ఇవ్వని ఈ పని చేసి మహాపాపం చేసాడు. నేను చనిపోతున్నందుకు నాకు విచారములేదు. కాని నా తల్లి తండ్రుల గురించే నాకు బాధగా ఉంది. నా తల్లి తండ్రులను వారి వృధ్యాప్యములో నేను వారిని పోషిస్తున్నాను. నేను ఇలా అర్థాంతరంగా మరణిస్తే వారికి దిక్కు ఎవరు? ఆ మూర్ఖుడు ఎవరో గానీ నన్ను మాత్రమే చంపలేదు. నాతోపాటు నా తల్లితండ్రులను కూడా చంపాడు. ” అని పరి పరి విధములుగా బాధతో విలపిస్తున్నాడు.

ఆ మాటలు విన్న మా మనసు వికలమైపోయింది. ఏమి చెయ్యడానికి తోచలేదు. ఆ ముని కుమారుని దగ్గరగా వెళ్లాను. అతడు తెచ్చిన కుండా పక్కనే పడి ఉంది. అతని శరీరం అంతా రక్తంతో తడిసిపోయి ఉంది. నేను అతని పక్కనే కూర్చున్నాను. ఆ ముని కుమారుడు కళ్లు పైకెత్తి నన్ను చూచాడు.

“ఓ రాజా! నువ్వేనా నన్ను బాణంతో కొట్టింది. నేను నీకు ఏమి అపకారము చేసానని నన్ను బాణంతో కొట్టావు. నేను నా తల్లి తండ్రుల కొరకు నీళ్లు తీసుకొని పోవడానికి వచ్చాను. అది అపరాధమా! నువ్వు నన్నే కాదు. నా తల్లి తండ్రులనుకూడా చంపావు. నా తల్లి తండ్రులు దాహంతో అలమటిస్తున్నారు. నేను నీళ్లు తీసుకొని వస్తానని నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కాని నేను ఇక్కడ బాణము తగిలి చనిపోయినట్టు వారికి తెలియదు. నా తండ్రికి నేను చనిపోయానని తెలిసినా ఏమీ చేయలేడు కదా! ఒక వృక్షమును నరుకుతుంటే పక్కన ఉన్న వృక్షము ఏమీ చేయలేనట్టు, నేను చనిపోతున్నా నా తండ్రి ఏమీ చేయలేని నిస్సహాయస్థితిలో ఉన్నాడు. కాని, నా తండ్రి, నాకు ఈ దుస్థితి కలిగించిన నిన్ను, దారుణంగా శపించగలడు. అందుకని నీవు ఈ జలమును తీసుకొని పోయి నా తండ్రికి ఇచ్చి ఆయన దాహము తీర్చు. ఆయన శాంతిస్తాడు. అదుగో ఆ కనపడే కాలి బాట వెంట వెళితే మా ఆశ్రమము వస్తుంది. నీవు వెంటనే వెళ్లి మా తండ్రికి ఈ విషయం చెప్పు.

ఓ రాజా! నీవు కొట్టిన బాణము నా శరీరంలో గుచ్చుకొని చాలా బాధకలిగిస్తూ ఉంది. నీవు దానిని బయటకు లాగు. నాకు సత్వరమే మరణం ప్రసాదించు.” అని ఆ ముని కుమారుడు నాతో అన్నాడు. నేను ఆ బాణమును తీస్తే అతను వెంటనే మరణిస్తాడు. తియ్యకపోతే మరణయాతన అనుభవిస్తాడు. ఏం చేయాలో నాకు తోచలేదు. నేను పడుతున్న బాధను గ్రహించాడు ఆ ముని కుమారుడు. కాని అప్పటికే ఆ ముని కుమారుడు బాధతో నేల మీదపడి గిలా గిలా కొట్టుకుంటున్నాడు. అంత బాధలో కూడా నాతో ఇలా అన్నాడు.

“ఓ రాజా! నీవు బ్రహ్మ హత్య చేసానని భయపడకు. ఎందుకంటే నేను బ్రాహ్మణుడను కాను. నా తండ్రి వైశ్యుడు. నా తల్లి శూద్ర వనిత. కాబట్టి నీకు ఆభయం లేదు.” అని అంత బాధలో కూడా నా మనసుకు ఊరట కలిగించాడు. ఆ ముని కుమారుడి బాధను చూడలేక నేను అతని శరీరము నుండి బాణమును లాగేసాను. ఆ ముని కుమారుడు నా వంకే చూస్తూ ప్రాణములు విడిచాడు. నేను కొట్టిన బాణముచే మృతిచెందిన ఆ ముని కుమారుని చూచి నా మనస్సుకు చాలా బాధకలిగింది.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము అరువది మూడవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అయోధ్యాకాండ చతుఃషష్ఠితమః సర్గః (64) >>

Leave a Comment