Ayodhya Kanda Sarga 68 In Telugu – అయోధ్యాకాండ అష్టషష్ఠితమః సర్గః

అయోధ్యాకాండ అష్టషష్ఠితమః సర్గ రామాయణంలో ఒక ముఖ్యమైన ఘట్టం. ఈ సర్గలో, రాముడు సీత, లక్ష్మణులతో కలిసి చిత్రకూట పర్వతానికి చేరుకొని అక్కడే నివాసం ఏర్పరచుకుంటారు. అయోధ్యలో, దశరథ మహారాజు రాముని వాత్సల్యం, వనవాసం వల్ల కలిగిన శోకంతో మరణిస్తాడు. రాముని తండ్రి మరణవార్త తెలుసుకున్న భరతుడు, శత్రఘ్నుడు దుఃఖంలో పడతారు. భరతుడు రాముని వెతకడానికి, వనవాసం ముగించమని విజ్ఞప్తి చేయడానికి చిత్రకూటానికి వెళ్లాలనే నిర్ణయం తీసుకుంటాడు. భరతుడు తన తల్లి కైకేయి మీద కోపంతో ఉన్నా, రాముని పట్ల భక్తిని, ప్రేమను వ్యక్తం చేస్తాడు. ఈ సర్గలో కుటుంబ బాంధవ్యాలు, ధర్మపాలన, భక్తి ప్రధానాంశాలుగా ఉంటాయి.

దూతప్రేషణమ్

తేషాం హి వచనం శ్రుత్వా వసిష్ఠః ప్రత్యువాచ హ |
మిత్రామాత్యగణాన్ సర్వాన్ బ్రాహ్మణాంస్తానిదం వచః || ౧ ||

యదసౌ మాతులకులే దత్తరాజ్యః పరం సుఖీ |
భరతః వసతి భ్రాత్రా శత్రుఘ్నేన సమన్వితః || ౨ ||

తచ్ఛీఘ్రం జవనా దూతా గచ్ఛంతు త్వరితైః హయైః |
ఆనేతుం భ్రాతరౌ వీరౌ కిం సమీక్షామహే వయమ్ || ౩ ||

గచ్ఛంత్వితి తతః సర్వే వసిష్ఠం వాక్యమబ్రువన్ |
తేషాం తద్వచనం శ్రుత్వా వసిష్ఠో వాక్యమబ్రవీత్ || ౪ ||

ఏహి సిద్ధార్థ విజయ జయంతాశోక నందన |
శ్రూయతామితికర్తవ్యం సర్వానేవ బ్రవీమి వః || ౫ ||

పురం రాజగృహం గత్వా శీఘ్రం శీఘ్రజవైః హయైః |
త్యక్తశోకైరిదం వాచ్యః శాసనాద్భరతో మమ || ౬ ||

పురోహితస్త్వాం కుశలం ప్రాహ సర్వే చ మంత్రిణః |
త్వరమాణశ్చ నిర్యాహి కృత్యమాత్యయికం త్వయా || ౭ ||

మా చాస్మై ప్రోషితం రామం మా చాస్మై పితరం మృతమ్ |
భవంతః శంసిషుర్గత్వా రాఘవాణామిమం క్షయమ్ || ౮ ||

కౌశేయాని చ వస్త్రాణి భూషణాని వరాణి చ |
క్షిప్రమాదాయ రాజ్ఞశ్చ భరతస్య చ గచ్ఛత || ౯ ||

దత్తపథ్యశనా దూతాజగ్ముః స్వం స్వం నివేశనమ్ |
కేకయాంస్తే గమిష్యంతో హయానారుహ్య సమ్మతాన్ || ౧౦ ||

తతః ప్రాస్థానికం కృత్వా కార్యశేషమనంతరమ్ |
వసిష్ఠేనాభ్యనుజ్ఞాతా దూతాః సంత్వరితా యయుః || ౧౧ ||

న్యంతేనాపరతాలస్య ప్రలంబస్యోత్తరం ప్రతి |
నిషేవమాణాస్తే జగ్ముర్నదీం మధ్యేన మాలినీమ్ || ౧౨ ||

తే హస్తినాపురే గంగాం తీర్త్వా ప్రత్యఙ్ముఖా యయుః |
పాంచాలదేశమాసాద్య మధ్యేన కురుజాంగలమ్ || ౧౩ ||

సరాంసి చ సుపూర్ణాని నదీశ్చ విమలోదకాః |
నిరీక్షమాణాస్తే జగ్ముర్ధూతాః కార్యవశాద్ద్రుతమ్ || ౧౪ ||

తే ప్రసన్నోదకాం దివ్యాం నానావిహగసేవితామ్ |
ఉపాతిజగ్ముర్వేగేన శరదండాం జనాకులామ్ || ౧౫ ||

నికూలవృక్షమాసాద్య దివ్యం సత్యోపయాచనమ్ |
అభిగమ్యాభివాద్యం తం కులింగాం ప్రావిశన్ పురీమ్ || ౧౬ ||

అభికాలం తతః ప్రాప్యతే బోధిభవనాచ్చ్యుతామ్ |
పితృపైతామహీం పుణ్యాం తేరురిక్షుమతీం నదీమ్ || ౧౭ ||

అవేక్ష్యాంజలిపానాంశ్చ బ్రాహ్మణాన్ వేదపారగాన్ |
యయుర్మధ్యేన బాహ్లీకాన్ సుదామానం చ పర్వతమ్ || ౧౮ ||

విష్ణోః పదం ప్రేక్షమాణా విపాశాం చాపి శాల్మలీమ్ |
నదీర్వాపీస్తటాకాని పల్వలాని సరాంసి చ || ౧౯ ||

పస్యంతో వివిధాంశ్చాపి సింహవ్యాగ్రమృగద్విపాన్ |
యయుః పథాఽతిమహతా శాసనం భర్తురీప్సవః || ౨౦ ||

తే శ్రాంతవాహనా దూతాః వికృష్ణేన పథా తతః |
గిరివ్రజం పురవరం శీఘ్రమాసేదురంజసా || ౨౧ ||

భర్తుః ప్రియార్థం కులరక్షణార్థమ్
భర్తుశ్చ వంశస్య పరిగ్రహార్థమ్ |
అహేడమానాస్త్వరయా స్మ దూతాః
రాత్ర్యాం తు తే తత్పురమేవ యాతాః || ౨౨ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే అష్టషష్ఠితమః సర్గః || ౬౮ ||

Ayodhya Kanda Sarga 68 Meaning In Telugu

ఋషులు మాట్లాడిన మాటలు అన్నీ శ్రద్ధగా విన్నాడు వసిష్ఠుడు. మంత్రులతో ఆలోచించాడు. వారితో ఇలా అన్నాడు. “మహా ఋషులారా! ప్రస్తుతము భరత శత్రుఘ్నులు వారి మేమమామగారి ఇంట ఉన్నారు. వారిని తీసుకొని వచ్చుటకు వెంటనే దూతలను పంపెదను. దశరథుడు, తాను చనిపోకముందే భరతునికి రాజ్యము ఇస్తానని కైకకు మాట ఇచ్చిఉన్నాడు. కాబట్టి రాజ్యము ఎవరిది అన్న సమస్య తలెత్తదు. భరతుడు రాగానే అతనికి పట్టాభిషేకము జరిపించెదము.” అని చెప్పాడు.

వసిష్ఠుని ఆదేశము ప్రకారము సిద్దార్ధుడు, జయంతుడు, విజయుడు, అశోకుడు, నందుడు అనే దూతలను పిలిపించాడు. వారితో ఇలా అన్నాడు. “దూతలారా! జాగ్రత్తగా వినండి. మీరు వెంటనే భరతుని వద్దకు వెళ్లండి. అతనికి దశరథుని మరణ వార్త తెలియనీయకండి. మీ మొహంలో ఎక్కడా విషాద చ్ఛాయలు కనపడకూడదు. నా మాటగా భరతునికి ఇలా చెప్పండి. “పురోహితులు అందరూ నీ హితము కోరుతున్నారు. నీతో ఒక అవసరమైన పని ఉన్నది. నీవు వెంటనే అయోధ్యకు రావలెను.” అని చెప్పండి. రాముడు వనవాసమునకు వెళ్లిన విషయము ఏమాత్రము భరతునికి తెలియనీయకండి. మీరు వెళ్లునపుడు కేకయ రాజుకు భరతునికి శత్రుఘ్నునికి అనేక కానుకలు తీసుకొని వెళ్లండి.” అని ఆదేశించాడు.
వసిష్ఠుని ఆదేశము ప్రకారము ఆ దూతలు భరతుని వద్దకు బయలుదేరారు. ఆ దూతలు హస్తినాపురము దాటి తరువాత గంగానదిని చేరుకొని, అక్కడి నుండి పశ్చిమంగా ప్రయాణించి పాంచాల దేశము చేరుకొని అక్కడి నుండి శరండా నదిని దాటి కులింగా నగరిని చేరుకున్నారు. అక్కడి నుండి ఇక్షుమతీ నదిని దాటి బాహ్లిక దేశము గుండా సుదామ పర్వతమును చేరుకున్నారు. అక్కడి నుండి విపాసా నదిని దాటి గిరివ్రజపురమును ప్రవేశించారు.

( పైన చెప్పబడిన పట్టణములు, ప్రదేశములు, నదుల పేర్లు ప్రస్తుతము మనకు తెలియక పోవచ్చు. కాని క్రీ.పూ. మన భారత దేశ పటమును చూచినట్టయితే కొన్ని అన్నా కనపడే అవకాశము ఉంది. ఆనాటి మహాకవులు ఇతిహాసములు చెబుతూ నాటి దేశ కాల మాన పరిస్థితులను తరువాతి తరాలకు తెలియజేయడానికి పడే తపన దీనిని బట్టి మనకు అర్థం అవుతుంది. కిష్కింధా కాండలో కూడా సీత ను ఎక్కడెక్కడ వెతకాలో సుగ్రీవుడు వివరించేటప్పుడు నాటి భారతదేశములో ఉన్న ప్రదేశములను పర్వతములను నదులను గురించి పూర్తిగా వర్ణిస్తాడు. అలాగే న్యాయ సూత్రముల గురించి కూడా అక్కడక్కడ ప్రస్తావించడం జరిగింది. నాటి ధర్మసూత్రముల ప్రకారము రాజ్యము జ్యేష్టుడికి చెందుతుంది. జ్యేష్ఠుడు రాజ్యమును త్యజించి అడవులకు వెళ్లిపోతే తరువాతి వాడికి చెందుతుంది. అందుకని నేర్పుగా రాముని అడవులకు పంపింది కైక. అలాగే 14 సంవత్సరములు కాల పరిమితి విధించడం. సాధారణంగా 12 సంవత్సరములు దాటితే ఆస్తి మీద హక్కు పోతుంది. కాని రామాయణ కాలంలో 14 సంఖ్యకు ప్రాధాన్యము ఉంది. అదేమిటో ముందు ముందు మీరు చూస్తారు. ఇక్కడ యుగ ధర్మం గురించి కూడా మనకు అవగాహన కలుగుతుంది. కృతయుగంలో అంతా సిద్ధంగా ఉంచారు. కేవలం మానవులు ఆ ప్రకారం నడుచుకోవడమే ఆనాటి వారి కర్తవ్యము. కృతము అనగా చేయబడినది అని అర్థం. కాని త్రేతాయుగములో అలా కాదు. వాదమునకు ప్రతి వాదము అమలులో కి వచ్చింది. ఇది లక్ష్మణుని వాదనలో కనపడుతుంది. రాముడు— రాజు ఏమి చేసినా అది న్యాయమే అవుతుంది. రాజాజ్ఞను శిరసావహించడమే మన విధి– అని అంటాడు. దానికి ప్రతిగా లక్ష్మణుడు,– రాజు కామాతురుడై చేసిన నిర్ణయాన్ని ప్రజలు అమలు పరచనవసరం లేదు– అని వాదిస్తాడు. రాజు మీద తిరుగుబాటుకు ఇది నాంది.

అలాగే దశరథుడు కూడా ఆలోచిస్తాడు. ఒక సందర్భంలో దశరథుడు “నేను అడవులకు వెళ్లమన్నాను. కానీ రాముడు “ఇది అధర్మము, నేను వెళ్లను” అని అనవచ్చు కదా. అలా అంటే నేను కాదంటానా! ఎవరైనా రామునికి ఆ ప్రకారము చెయ్యమని చెప్పవచ్చు కదా” అని అంటాడు. ఈ నాడు కూడా కొంతమంది ప్రభుత్వాధి కారులు లొసుగులతో కూడిన ఉత్తర్వులను జారీ చేసి, అవతల వారితో “మేము చేసింది చేసాము, మీరు వెంటనే కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకొండి.” అని అనడం, వారే ఫలానా అడ్వొకేట్ దగ్గరకు వెళ్లమని సలహా ఇవ్వడం, సర్వసాధారణం అయిపోయింది.
పోలీసులు కూడా పై అధికారుల మెప్పుకోసరం ఎడా పెడా అరెస్టులు చేసి, అలా అరెస్టులు చేసిన వారి పక్షాన పోలీసులే ప్లీడర్లను కూడా నియమించి అరెస్టులు చేసిన వారికి బెయిలు ఇప్పిస్తున్నారు.

ఇలాంటివి ముందు ముందు రామాయణంలో మనకు ఎన్నో కనపడతాయి.)

శ్రీమద్రామాయణము
అయోధ్యా కాండము అరువది ఎనిమిదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

అయోధ్యాకాండ ఏకోనసప్తతితమః సర్గః (69) >>

Leave a Comment