Balakanda Sarga 65 In Telugu – బాలకాండ పంచషష్టితమః సర్గః

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ లోని పంచషష్టితమః సర్గలో, విశ్వామిత్రుడు సర్వ లోకాలను నివ్వెరపోయేలా చేసిన సుదీర్ఘ ఆశ్రమం తర్వాత బ్రహ్మ ఋషి అవుతాడు. అన్ని దేవతలు బ్రహ్మను విశ్వామిత్రునిపై సర్వ మర్త్యమైన మలినాలనుండి శుద్ధి చేయబడినందున అతనిపై సర్వోన్నతమైన బ్రహ్మ-జ్ఞానాన్ని ఇవ్వమని అభ్యర్థించారు మరియు బ్రహ్మ అతనిపై ఆ అత్యున్నత క్రమాన్ని అంగీకరిస్తాడు. ఈ విధంగా శతానంద మహర్షి విశ్వామిత్రుని పురాణం గురించి తన కథనాన్ని ముగించాడు.

బ్రహ్మర్షిత్వప్రాప్తిః

అథ హైమవతీం రామ దిశం త్యక్త్వా మహామునిః |
పూర్వాం దిశమనుప్రాప్య తపస్తేపే సుదారుణమ్ ||

1

మౌనం వర్షసహస్రస్య కృత్వా వ్రతమనుత్తమమ్ |
చకారాప్రతిమం రామ తపః పరమదుష్కరమ్ ||

2

పూర్ణే వర్షసహస్రే తు కాష్ఠభూతం మహామునిమ్ |
విఘ్నైర్బహుభిరాధూతం క్రోధో నాంతరమావిశత్ ||

3

స కృత్వా నిశ్చయం రామ తప ఆతిష్ఠదవ్యయమ్ |
తస్య వర్షసహస్రస్య వ్రతే పూర్ణే మహావ్రతః ||

4

భోక్తుమారబ్ధవానన్నం తస్మిన్కాలే రఘూత్తమ |
ఇంద్రో ద్విజాతిర్భూత్వా తం సిద్ధమన్నమయాచత ||

5

తస్మై దత్త్వా తదా సిద్ధం సర్వం విప్రాయ నిశ్చితః |
నిఃశేషితేఽన్నే భగవానభుక్త్వైవ మహాతపాః ||

6

న కించిదవదద్విప్రం మౌనవ్రతముపాస్థితః |
అథ వర్షసహస్రం వై నోచ్ఛ్వసన్మునిపుంగవః ||

7

తస్యానుచ్ఛ్వసమానస్య మూర్ధ్ని ధూమో వ్యజాయత |
త్రైలోక్యం యేన సంభ్రాంతమాదీపితమివాభవత్ ||

8

తతో దేవాః సగంధర్వాః పన్నగోరగరాక్షసాః |
మోహితాస్తేజసా తస్య తపసా మందరశ్మయః ||

9

కశ్మలోపహతాః సర్వే పితామహమథాబ్రువన్ |
బహుభిః కారణైర్దేవ విశ్వామిత్రో మహామునిః ||

10

లోభితః క్రోధితశ్చైవ తపసా చాభివర్ధతే |
న హ్యస్య వృజినం కించిద్దృశ్యతే సూక్ష్మమప్యథ ||

11

న దీయతే యది త్వస్య మనసా యదభీప్సితమ్ |
వినాశయతి త్రైలోక్యం తపసా సచరాచరమ్ ||

12

వ్యాకులాశ్చ దిశః సర్వా న చ కించిత్ప్రకాశతే |
సాగరాః క్షుభితాః సర్వే విశీర్యంతే చ పర్వతాః ||

13

భాస్కరో నిష్ప్రభశ్చైవ మహర్షేస్తస్య తేజసా |
ప్రకంపతే చ పృథివీ వాయుర్వాతి భృశాకులః ||

14

బ్రహ్మన్న ప్రతిజానీమో నాస్తికో జాయతే జనః |
సంమూఢమివ త్రైలోక్యం సంప్రక్షుభితమానసమ్ ||

15

బుద్ధిం న కురుతే యావన్నాశే దేవ మహామునిః |
తావత్ప్రసాద్యో భగవానగ్నిరూపో మహాద్యుతిః ||

16

కాలాగ్నినా యథా పూర్వం త్రైలోక్యం దహ్యతేఽఖిలమ్ |
దేవరాజ్యం చికీర్షేత దీయతామస్య యన్మతమ్ ||

17

తతః సురగణాః సర్వే పితామహపురోగమాః |
విశ్వామిత్రం మహాత్మానం వాక్యం మధురమబ్రువన్ ||

18

బ్రహ్మర్షే స్వాగతం తేఽస్తు తపసా స్మ సుతోషితాః |
బ్రాహ్మణ్యం తపసోగ్రేణ ప్రాప్తవానసి కౌశిక ||

19

దీర్ఘమాయుశ్చ తే బ్రహ్మన్దదామి సమరుద్గణః |
స్వస్తి ప్రాప్నుహి భద్రం తే గచ్ఛ సౌమ్య యథాసుఖమ్ ||

20

పితామహవచః శ్రుత్వా సర్వేషాం త్రిదివౌకసామ్ |
కృత్వా ప్రణామం ముదితో వ్యాజహార మహామునిః ||

21

బ్రాహ్మణ్యం యది మే ప్రాప్తం దీర్ఘమాయుస్తథైవ చ |
ఓంకారశ్చ వషట్కారో వేదాశ్చ వరయంతు మామ్ ||

22

క్షత్రవేదవిదాం శ్రేష్ఠో బ్రహ్మవేదవిదామపి |
బ్రహ్మపుత్రో వసిష్ఠో మామేవం వదతు దేవతాః ||

23

యద్యయం పరమః కామః కృతో యాంతు సురర్షభాః |
తతః ప్రసాదితో దేవైర్వసిష్ఠో జపతాం వరః ||

24

సఖ్యం చకార బ్రహ్మర్షిరేవమస్త్వితి చాబ్రవీత్ |
బ్రహ్మర్షిస్త్వం న సందేహః సర్వం సంపత్స్యతే తవ ||

25

ఇత్యుక్త్వా దేవతాశ్చాపి సర్వా జగ్ముర్యథాగతమ్ |
విశ్వామిత్రోఽపి ధర్మాత్మా లబ్ధ్వా బ్రాహ్మణ్యముత్తమమ్ ||

26

పూజయామాస బ్రహ్మర్షిం వసిష్ఠం జపతాం వరమ్ |
కృతకామో మహీం సర్వాం చచార తపసి స్థితః ||

27

ఏవం త్వనేన బ్రాహ్మణ్యం ప్రాప్తం రామ మహాత్మనా |
ఏష రామ మునిశ్రేష్ఠ ఏష విగ్రహవాంస్తపః ||

28

ఏష ధర్మపరో నిత్యం వీర్యస్యైష పరాయణమ్ |
ఏవముక్త్వా మహాతేజా విరరామ ద్విజోత్తమః ||

29

శతానందవచః శ్రుత్వా రామలక్ష్మణసన్నిధౌ |
జనకః ప్రాంజలిర్వాక్యమువాచ కుశికాత్మజమ్ ||

30

ధన్యోఽస్మ్యనుగృహీతోఽస్మి యస్య మే మునిపుంగవ |
యజ్ఞం కాకుత్స్థసహితః ప్రాప్తవానసి కౌశిక ||

31 [ధార్మిక]

పావితోఽహం త్వయా బ్రహ్మన్దర్శనేన మహామునే |
విశ్వామిత్ర మహాభాగ బ్రహ్మర్షీణాం వరోత్తమ ||

32

గుణా బహువిధాః ప్రాప్తాస్తవ సందర్శనాన్మయా |
విస్తరేణ చ తే బ్రహ్మన్కీర్త్యమానం మహత్తపః ||

33

శ్రుతం మయా మహాతేజో రామేణ చ మహాత్మనా |
సదస్యైః ప్రాప్య చ సదః శ్రుతాస్తే బహవో గుణాః ||

34

అప్రమేయం తపస్తుభ్యమప్రమేయం చ తే బలమ్ |
అప్రమేయా గుణాశ్చైవ నిత్యం తే కుశికాత్మజ ||

35

తృప్తిరాశ్చర్యభూతానాం కథానాం నాస్తి మే విభో |
కర్మకాలో మునిశ్రేష్ఠ లంబతే రవిమండలమ్ ||

36

శ్వః ప్రభాతే మహాతేజో ద్రష్టుమర్హసి మాం పునః |
స్వాగతం తపతాం శ్రేష్ఠ మామనుజ్ఞాతుమర్హసి ||

37

ఏవముక్తో మునివరః ప్రశస్య పురుషర్షభమ్ |
విససర్జాశు జనకం ప్రీతం ప్రీతమనాస్తదా ||

38

ఏవముక్త్వా మునిశ్రేష్ఠం వైదేహో మిథిలాధిపః |
ప్రదక్షిణం చకారాథ సోపాధ్యాయః సబాంధవః ||

39

విశ్వామిత్రోఽపి ధర్మాత్మా సరామః సహలక్ష్మణః |
స్వవాటమభిచక్రామ పూజ్యమానో మహర్షిభిః ||

40

Balakanda Sarga 65 In Telugu Pdf With Meaning

ఆ ప్రకారంగా నిర్ణయించుకొన్న విశ్వామిత్రుడు ఉత్తర దిక్కును విడిచి పెట్టాడు. తూర్పు దిక్కుగా వెళ్లాడు. అచ్చట ఆశ్రమమును నిర్మించుకొని వేయి సంవత్సరములు ఘోరమైన తపస్సుచేసాడు.

విశ్వామిత్రుని శరీరము ఎండుకట్టె మాదిరి అయింది. అతని తపస్సుకు ఎన్నో విఘ్నాలు కలిగాయి. కాని విశ్వామిత్రుడు చలించలేదు. ఇంద్రియములకు లోబడలేదు.

వేయి సంవత్సరములు పూర్తి అయ్యాయి. ఇంక తపస్సు పూర్తి అయింది అనుకొని ఆహారము తీసుకొనడానికి కూర్చున్నాడు. ఇంతలో ఇంద్రుడు బ్రాహ్మణ వేషములో వచ్చాడు. చాలా ఆకలితో ఉన్నాను. అన్నం పెట్టమని యాచించాడు. మారు మాటాడకుండా విశ్వామిత్రుడు తాను తెచ్చుకున్న ఆహారాన్ని ఇంద్రుడికి ఇచ్చాడు.

బ్రాహ్మణ వేషములో ఉన్న ఇంద్రుని ఒక్కమాట కూడా అనలేదు. ఇంద్రుడి మీద కోప పడలేదు. తాను నిరాహారంగా ఉండిపోయాడు.

మరలా తపస్సుకు పూనుకొన్నాడు. కేవలం గాలిని ఆహారంగా తీసుకుంటూ మరలా వేయి సంవత్సరములు తపస్సు చేసాడు. విశ్వామిత్రుని తలలో నుండి పొగలు చెలరేగాయి ఆ మంటలు లోకాలను దహిస్తాయేమో అని దేవతలు భయపడ్డారు. అందరూ బ్రహ్మ వద్దకు వెళ్లారు.

“ ఓ బ్రహ్మదేవా! విశ్వామిత్రుని మీరు మహర్షి అన్నారు. కాని ఆయన తపస్సు మానలేదు. రంభను పంపాము. ఆమెను రాయిని చేసాడు. ఆయన ఆహారాన్ని లాక్కున్నాము. కోపగించలేదు. ఎన్ని ప్రలోభాలు పెట్టినా చలించలేదు. ఘోరంగా తపస్సు చేస్తున్నాడు. ఆయన శరీరంనుండి మంటలు చెలరేగి లోకాలను దహిస్తున్నాయి.

తమరే రక్షించాలి. తమరు వచ్చి ఆయనకు వరాలు ఇవ్వాలి. లేకపోతే లోకాలు నాశనమైపోతాయి. సూర్యుడు ప్రకాశించడం లేదు. గాలి వీచడం లేదు. భూమి కంపిస్తూ ఉంది. కావున తమరు వెంటనే రండి.” అని వేడుకున్నారు.

దేవతల కోరిక మేరకు బ్రహ్మదేవుడు వారి వెంట విశ్వామిత్రుని వద్దకు వచ్చాడు. విశ్వామిత్రునితో ఇలా అన్నాడు.

” ఓ బ్రహ్మర్షీ! నీవు బ్రాహ్మణత్వమును పొందావు. బ్రహ్మర్షివైనావు. నీ తపస్సుకు చాలా సంతోషించాను. నీకు దీర్ఘాయుష్షు ప్రసాదిస్తున్నాను. ముల్లోకములలో నీ ఇష్టం వచ్చినట్టు సంచరించు. నీకు శుభం కలుగుతుంది.” అని వరాలు ఇచ్చాడు బ్రహ్మ.

విశ్వామిత్రుని మనస్సు ఎంతో సంతోషం పొందింది. ఆయన బ్రహ్మదేవుని చూచి ఇలా అన్నాడు. ” ఓ బ్రహ్మదేవా! మీరు నాకు బ్రాహ్మణత్వము, బ్రహ్మర్షి పదవి ప్రసాదించారు. నేను బ్రహ్మర్షిని అయితే దానితో పాటు ఓంకారము, వషట్కారములు, వేదములు నాకు లభ్యమగును గాక! వాటిని నేను ఇతరులకు బోధించు అధికారము లభించును గాక! యజ్ఞములు యాగములు చేయించు అధికారము నాకు కలుగు గాక! బ్రహ్మర్షి అయిన వసిష్ఠుడు నన్ను బ్రహ్మర్షిగా అంగీరించును గాక! ఇవి కూడా నాకు ప్రసాదించండి.” అని అడిగాడు.

బ్రహ్మదేవుడు అలాగే అన్నాడు. తరువాత దేవతలు అందరూ వసిష్ఠుని వద్దకు వెళ్లారు. “ఓ వసిష్ట మహర్షీ ! విశ్వామిత్రుడు చేసిన ఘోరమైన తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవుడు విశ్వామిత్రుని “బ్రహ్మర్షి” అని అన్నాడు. తమరు కూడా వచ్చి విశ్వామిత్రుని “బ్రహ్మర్షి” అని అంగీకరించండి.” అని ప్రార్థించారు.

ఆ మాటలకు వసిష్ఠుడు సరే అన్నాడు. వారి వెంట విశ్వామిత్రుని వద్దకు వచ్చాడు. “ఓ విశ్వామిత్రా! నీవు బ్రహ్మర్షివి. నేను అంగీకరిస్తున్నాను.” అని అన్నాడు.

వెంటనే దేవతలు కూడా ఇలా అన్నారు. “ఓ విశ్వామిత్రా! నీవు బ్రహ్మర్షి అని అందరూ అంగీకరించారు. నీవు కోరిన వరములు అన్నీ నీకు లభ్యమవుతాయి. ఇంక మేము వెళుతున్నాము.” అని పలికి దేవతలు స్వర్గలోకమునకు వెళ్లిపోయారు.

వెంటనే విశ్వామిత్రుడు లేచి వసిష్ఠునిసాదరంగా ఆహ్వానించాడు. అర్ఘ్యము పాద్యము సమర్పించి పూజించాడు.

ఓ రామా! విశ్వామిత్రుడు పై చెప్పిన విధంగా బ్రాహ్మణత్వమును సంపాదించి బ్రహ్మర్షి అయ్యాడు. ఈ విశ్వామిత్రుడు మునులలో ఉత్తముడు. ధర్మాత్ముడు. వీరుడు.” అని శతానందుడు రామలక్ష్మణులకు విశ్వామిత్రుని వృత్తాంతమును సవిస్తరముగా వివరించాడు. రామలక్ష్మణులతో పాటు జనక మహారాజు కూడా విశ్వామిత్రుని వృత్తాంతమును విన్నాడు. విశ్వామిత్రునికి చేతులు జోడించి నమస్కారము చేసాడు.

“ఓ విశ్వామిత్ర మహర్షీ! ధన్యోస్మి. తమరు ఇక్ష్వాకు వంశములో జన్మించిన రామలక్ష్మణులతో సహా మా నగరమునకు వచ్చి మమ్ములను అనుగ్రహించినందుకు నాకు మహాదానందముగా ఉంది. తమరి దర్శనభాగ్యముచే నేను పవిత్రుడను అయ్యాను. తమరి గురించి శతానందులవారు చెప్పిన మాటలను నేను శ్రద్ధాభక్తులతో విన్నాను.

నీ గుణగణములను మేము అందరమూ విని తరించాము. నీవు చేసిన తపస్సు ఊహాతీతము. పరులకు అసాధ్యము. అటువంటి ఘోర తపస్సుచెయ్యడం నీకే చెల్లింది. తమరి యొక్క తపో విశేషము లను ఎన్ని సార్లు విన్నా తనివితీరడం లేదు. కాని ప్రస్తుతము సూర్యుడు అస్తమించుచున్నాడు.

తమరు సాయంకాల సంధ్యావందనాది కార్యములు నిర్వర్తించవలెను కదా! కాబట్టి నాకు సెలవు ఇప్పించండి. రేపు ఉదయము తమరి దర్శనము చేసుకుంటాను. తమరిని సాదరముగా మిథిలా నగరమునకు ఆహ్వానించి నా వెంట తీసుకొని వెళతాను.” అని వినయంగా పలికాడు జనకమహారాజు.

ఆ మాటలకు విశ్వామిత్రుడు ఎంతో సంతోషించాడు. జనకునకు వెళ్లడానికి అనుజ్ఞ ఇచ్చాడు.

జనక మహారాజు విశ్వామిత్రునకు ప్రదక్షిణపూర్వక నమస్కారము చేసాడు. తరువాత అమాత్యులు పురోహితులతో కలిసి మిథిలకు వెళ్లాడు.

శ్రీమద్రామాయణము
బాలకాండము అరవై ఐదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

బాలకాండ షట్షష్టితమః సర్గః (66) >>

Leave a Comment