అయోధ్యాకాండ ద్విసప్తతితమః సర్గలో, రాముడు అరణ్యవాసం చేస్తుండగా, అయోధ్యలో ఆయన తండ్రి దశరథ మహారాజు ప్రాణాలు విడుస్తాడు. దశరథుడు రాముని వలన విడిపోయిన క్షోభలో ఉండి, రాముడు నగరాన్ని విడిచిపోవడం వల్ల బాధతో మరణించాడు. కైకేయి చిత్తవికారంతో ఉండగా, భరతుడు తన తల్లి చర్యలను దుఃఖించి, రాముని తిరిగి తీసుకురావాలని నిర్ణయించుకుంటాడు. భరతుడు తన సహోదరుడు శత్రుఘ్నునితో కలిసి రాముని అరణ్యంలో కలుసుకోవడానికి బయలుదేరుతాడు. ఈ సర్గలో దశరథుడి మరణం, భరతుడి ప్రతిజ్ఞ, మరియు రాముని తిరిగి పట్టణానికి ఆహ్వానించే యత్నం ప్రధానాంశాలు.
భరతసంతాపః
అపశ్యంస్తు తతస్తత్ర పితరం పితురాలయే |
జగామ భరతో ద్రష్టుం మాతరం మాతురాలయే || ౧ ||
అనుప్రాప్తం తు తం దృష్ట్వా కైకేయీ ప్రోషితం సుతమ్ |
ఉత్పపాత తదా హృష్టా త్యక్త్వా సౌవర్ణమానసమ్ || ౨ ||
స ప్రవిశ్యైవ ధర్మాత్మా స్వ గృహం శ్రీవివర్జితమ్ |
భరతః ప్రతిజగ్రాహ జనన్యాశ్చరణౌ శుభౌ || ౩ ||
సా తం మూర్ధన్యుపాఘ్రాయ పరిష్వజ్య యశస్వినమ్ |
అంకే భరతమారోప్య ప్రష్టుం సముపచక్రమే || ౪ ||
అద్య తే కతిచిద్రాత్ర్యశ్చ్యుతస్యాఽర్యక వేశ్మనః |
అపి నాధ్వశ్రమః శీఘ్రం రథేనాపతతస్తవ || ౫ ||
ఆర్యకస్తే సుకుశలీ యుధాజిన్మాతులస్తవ |
ప్రవాసాచ్చ సుఖం పుత్ర సర్వం మే వక్తుమర్హసి || ౬ ||
ఏవం పృష్ఠస్తు కైకేయ్యా ప్రియం పార్థివ నందనః |
ఆచష్ట భరతః సర్వం మాత్రే రాజీవలోచనః || ౭ ||
అద్య మే సప్తమీ రాత్రిశ్చ్యుతస్యార్యక వేశ్మనః |
అంబాయాః కుశలీ తాతః యుధాజిన్మాతులశ్చ మే || ౮ ||
యన్మే ధనం చ రత్నం చ దదౌ రాజా పరంతపః |
పరిశ్రాంతం పథ్యభవత్తతోఽహం పూర్వమాగతః || ౯ ||
రాజవాక్యహరైర్దూతైః త్వర్యమాణోఽహమాగతః |
యదహం ప్రష్టుమిచ్ఛామి తదంబా వక్తుమర్హసి || ౧౦ ||
శూన్యోఽయం శయనీయస్తే పర్యంకో హేమభూషితః |
న చాయమిక్ష్వాకు జనః ప్రహృష్టః ప్రతిభాతి మే || ౧౧ ||
రాజా భవతి భూయిష్ఠమిహాంబాయా నివేశనే |
తమహం నాద్య పశ్యామి ద్రష్టుమిచ్ఛన్నిహాగతః || ౧౨ ||
పితుర్గ్రహీష్యే చరణౌ తం మమాఖ్యాహి పృచ్ఛతః |
ఆహోస్విదంబ జ్యేష్ఠాయాః కౌసల్యాయా నివేశనే || ౧౩ ||
తం ప్రత్యువాచ కైకేయీ ప్రియవద్ఘోరమప్రియమ్ |
అజానంతం ప్రజానంతీ రాజ్య లోభేన మోహితా || ౧౪ ||
యా గతిః సర్వభూతానాం తాం గతిం తే పితా గతః |
రాజా మహాత్మా తేజస్వీ యాయజూకః సతాం గతిః || ౧౫ ||
తచ్ఛ్రుత్వా భరతః వాక్యం ధర్మాభిజనవాన్ శుచిః |
పపాత సహసా భూమౌ పితృశోకబలార్దితః || ౧౬ ||
హా హతోఽస్మీతి కృపణాం దీనాం వాచముదీరయన్ |
నిపపాత మహాబాహుర్బాహు విక్షిప్య వీర్యవాన్ || ౧౭ ||
తతః శోకేన సంవీతః పితుర్మరణ దుఃఖితః |
విలలాప మహాతేజాః భ్రాంతాకులిత చేతనః || ౧౮ ||
ఏతత్సురుచిరం భాతి పితుర్మే శయనం పురా |
శశినేవామలం రాత్రౌ గగనం తోయదాత్యయే || ౧౯ ||
తదిదం న విభాత్యద్య విహీనం తేన ధీమతా |
వ్యోమేవ శశినా హీనమప్ఛుష్క ఇవ సాగరః || ౨౦ ||
బాష్పముత్సృజ్య కంఠేన స్వార్తః పరిపీడితః |
ప్రచ్ఛాద్య వదనం శ్రీమద్వస్త్రేణ జయతాం వరః || ౨౧ ||
తమార్తం దేవసంకాశం సమీక్ష్య పతితం భువి |
నికృత్తమివ సాలస్య స్కంధం పరశునా వనే || ౨౨ ||
మత్తమాతంగసంకాశం చంద్రార్కసదృశం భువః |
ఉత్థాపయిత్వా శోకార్తం వచనం చేదమబ్రవీత్ || ౨౩ ||
ఉత్తిష్ఠోత్తిష్ఠ కిం శేషే రాజపుత్ర మహాయశః |
త్వద్విధా న హి శోచంతి సంతః సదసి సమ్మతాః || ౨౪ ||
దానయజ్ఞాధికారా హి శీలశ్రుతివచోనుగా |
బుద్ధిస్తే బుద్ధిసంపన్న ప్రభేవార్కస్య మందిరే || ౨౫ ||
స రుదిత్వా చిరం కాలం భూమౌ విపరివృత్య చ |
జననీం ప్రత్యువాచేదం శోకైః బహుభిరావృతః || ౨౬ ||
అభిషేక్ష్యతి రామం ను రాజా యజ్ఞం ను యక్ష్యతే |
ఇత్యహం కృతసంకల్పో హృష్టః యాత్రామయాసిషమ్ || ౨౭ ||
తదిదం హ్యన్యథాభూతం వ్యవదీర్ణం మనో మమ |
పితరం యో న పశ్యామి నిత్యం ప్రియహితే రతమ్ || ౨౮ ||
అంబ కేనాత్యగాద్రాజా వ్యాధినా మయ్యనాగతే |
ధన్యా రామాదయః సర్వే యైః పితా సంస్కృతస్స్వయమ్ || ౨౯ ||
న నూనం మాం మహారాజః ప్రాప్తం జానాతి కీర్తిమాన్ |
ఉపజిఘ్రేద్ధి మాం మూర్ధ్ని తాత సన్నమ్య సత్వరమ్ || ౩౦ ||
క్వ స పాణిః సుఖ స్పర్శస్తాతస్యాక్లిష్ట కర్మణః |
యేన మాం రజసా ధ్వస్తమభీక్ష్ణం పరిమార్జతి || ౩౧ ||
యో మే భ్రాతా పితా బంధుర్యస్య దాసోఽస్మి ధీమతః |
తస్య మాం శీఘ్రమాఖ్యాహి రామస్యాక్లిష్ట కర్మణః || ౩౨ ||
పితా హి భవతి జ్యేష్ఠో ధర్మమార్యస్య జానతః |
తస్య పాదౌ గ్రహీష్యామి స హీదానీం గతిర్మమ || ౩౩ ||
ధర్మవిద్ధర్మనిత్యశ్చ సత్యసంధో దృఢవ్రతః |
ఆర్యః కిమబ్రవీద్రాజా పితా మే సత్యవిక్రమః || ౩౪ ||
పశ్చిమం సాధు సందేశమిచ్ఛామి శ్రోతుమాత్మనః |
ఇతి పృష్టా యథాతత్త్వం కైకేయీ వాక్యమబ్రవీత్ || ౩౫ ||
రామేతి రాజా విలపన్ హా సీతే లక్ష్మణేతి చ |
స మహాత్మా పరం లోకం గతః గతిమతాం వరః || ౩౬ ||
ఇమాం తు పశ్చిమాం వాచం వ్యాజహార పితా తవ |
కాలధర్మపరిక్షిప్తః పాశైరివ మహాగజః || ౩౭ ||
సిద్ధార్థాస్తే నరా రామమాగతం సీతయా సహ |
లక్ష్మణం చ మహాబాహుం ద్రక్ష్యంతి పునరాగతమ్ || ౩౮ ||
తచ్ఛ్రుత్వా విషసాదైవ ద్వితీయా ప్రియశంసనాత్ |
విషణ్ణ వదనో భూత్వా భూయః పప్రచ్ఛ మాతరమ్ || ౩౯ ||
క్వ చేదానీం స ధర్మాత్మా కౌసల్యాఽఽనందవర్ధనః |
లక్ష్మణేన సహ భ్రాత్రా సీతయా చ సమం గతః || ౪౦ ||
తథా పృష్టా యథా తత్త్వమాఖ్యాతుముపచక్రమే |
మాతాస్య యుగపద్వాక్యం విప్రియం ప్రియ శంకయా || ౪౧ || [సుమహద్వాక్యం]
స హి రాజసుతః పుత్ర చీరవాసా మహావనమ్ |
దండకాన్ సహ వైదేహ్యా లక్ష్మణానుచరః గతః || ౪౨ ||
తచ్ఛ్రుత్వా భరతస్త్రస్తః భ్రాతుశ్చారిత్రశంకయా |
స్వస్య వంశస్య మాహాత్మ్యాత్ ప్రష్టుం సముపచక్రమే || ౪౩ ||
కచ్చిన్న బ్రాహ్మణధనం హృతం రామేణ కస్యచిత్ |
కచ్చిన్నాఢ్యో దరిద్రః వా తేనాపాపో విహింసితః || ౪౪ ||
కచ్చిన్న పరదారాన్వా రాజపుత్రోఽభిమన్యతే |
కస్మాత్స దండకారణ్యే భ్రూణహేవ వివాసితః || ౪౫ ||
అథాస్య చపలా మాతా తత్స్వకర్మ యథాతథమ్ |
తేనైవ స్త్రీస్వభావేన వ్యాహర్తుముపచక్రమే || ౪౬ ||
ఏవముక్తా తు కైకేయీ భరతేన మహాత్మనా |
ఉవాచ వచనం హృష్టా మూఢా పండితమానినీ || ౪౭ ||
న బ్రాహ్మణధనం కించిద్ధృతం రామేణ కస్యచిత్ |
కశ్చిన్నాఢ్యో దరిద్రః వా తేనాపాపో విహింసితః || ౪౮ ||
న రామః పరదారాంశ్చ చక్షుర్భ్యామపి పశ్యతి |
మయా తు పుత్ర శ్రుత్వైవ రామస్యైవాభిషేచనమ్ || ౪౯ ||
యాచితస్తే పితా రాజ్యం రామస్య చ వివాసనమ్ |
స స్వవృత్తిం సమాస్థాయ పితా తే తత్తథాఽకరోత్ || ౫౦ ||
రామశ్చ సహ సౌమిత్రిః ప్రేషితః సహ సీతయా |
తమపశ్యన్ ప్రియంపుత్రం మహీపాలో మహాయశాః || ౫౧ ||
పుత్రశోకపరిద్యూనః పంచత్వముపపేదివాన్ |
త్వయాత్విదానీం ధర్మజ్ఞ రాజత్వమవలంబ్యతామ్ || ౫౨ ||
త్వత్కృతే హి మయా సర్వమిదమేవం విధం కృతమ్ |
మా శోకం మా చ సంతాపం ధైర్యమాశ్రయ పుత్రక |
త్వదధీనా హి నగరీ రాజ్యం చైతదనామయమ్ || ౫౩ ||
తత్పుత్ర శీఘ్రం విధినా విధిజ్ఞైః
వసిష్ఠముఖ్యైః సహితో ద్విజేంద్రైః |
సంకాల్య రాజానమదీన సత్త్వమ్
ఆత్మానముర్వ్యామభిషేచయస్వ || ౫౪ ||
ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే ద్విసప్తతితమః సర్గః || ౭౨ ||
Ayodhya Kanda Sarga 72 Meaning In Telugu
భరతుడు అలా ఆలోచిస్తూ తన తండ్రి దశరథుని మందిరములో ప్రవేశించాడు. అక్కడ దశరథుడు కనిపించలేదు. వెంటనే తన తల్లి కైక మందిరమునకు వెళ్లాడు. కొడుకును చూడగానే కైక మనస్సు సంతోషంతో నిండిపోయింది. కొడుకుకు ఎదురువెళ్లింది. భరతుడు తల్లి కైక పాదములకు నమస్కరించాడు. కైక భరతుని లేవదీసి నుదుటిన ముద్దు పెట్టుకొని తన పక్కన కూర్చుండబెట్టుకొంది.
“నాయనా భరతా! నీ ప్రయాణము బాగా సాగిందా! తాతగారి ఇంట్లో ఎప్పుడు బయలుదేరావు. మార్గములో ఆయాసము కలగలేదు కదా! మీ తాతగారు, మేనమామ అంతా క్షేమంగా ఉన్నారా! ఇంకా కేకయ దేశపు విశేషములు ఏమిటి వివరంగా చెప్పు.” అని ఆతురతగా అడిగింది కైక చెప్పాడు. భరతుడు తల్లి అడిగిన ప్రశ్నలకు అన్నిటికీ సమాధానాలు “అమ్మా! నేను తాతగారి ఇంటి నుండి బయలుదేరి ఏడుదినములు అయింది. అక్కడ తాతగారూ, మామయ్య అంతా క్షేమంగా ఉన్నారు. వారు మీకు, తండ్రి గారికి, పంపిన కానుకలు వెనుక తీసుకొని వస్తున్నారు. అమ్మా! అయోధ్యలో ప్రవేశించినప్పటి నుండి నా మనస్సులో కొన్ని ప్రశ్నలు తలెత్తాయి. వాటికి సమాధానాలు చెబుతావా అమ్మా!” అని అడిగాడు భరతుడు. కైక మాట్లాడలేదు. మౌనంగా ఉంది. భరతుడు ఇలాఅడిగాడు.
అమ్మా! నాన్న గారు ప్రతిరోజూ పడుకొనే బంగారు శయ్యమీద నాన్న గారు లేరు. కారణమేమి? ఈ మందిరములో పరిజనులందరి మొహంలో చింత, శోకము, ప్రస్ఫుటంగా కనపడుతూ ఉంది. కారణమేమి? దశరథ మహారాజు గారు ఎక్కుడ సమయము నీ అంత:పురములోనే గడుపుతారు కదా! మరి ఇప్పుడు ఆయన నీ అంత:పురములో కనిపించడం లేదు. ఎందుకనీ? నేను చాలా రోజుల తరువాత వచ్చాను. నాన్న గారికి పాదాభి వందనము చేసి ఆయన ఆశీర్వాదము తీసుకొనవలెనని చాలా ఆతురతగా ఉన్నాను. ఆయన ఎక్కడ ఉన్నారు. నీ మందిరములో లేరు. కౌసల్య మందిరములో ఉన్నారా! చెప్పమ్మా! నేను నాన్నగారు ఎక్కడ ఉంటే అక్కడకు వెళ్లాలి.” అని గుచ్చి గుచ్చి అడిగాడు.
ఇంక కైక తప్పించుకోలేక పోయింది. కాని నర్మగర్భంగా చెప్పసాగింది. “కుమారా భరతా! నీ తండ్రిగారు సాధారణంగా అన్ని జీవులు ఏ గతి పొందుతాయో అదే గతిని పొందారు.” అని చెప్పింది. భరతునికి అర్థం అయింది. తండ్రి మరణవార్త విని అలాగే కుప్పకూలిపోయాడు భరతుడు. అతనికి నోటమాట రాలేదు. దు:ఖంతో కుమిలిపోతున్నాడు. కైక భరతుని వద్దకు వచ్చి అతనిని లేపి పక్కన ఉన్న ఆసనము మీద కూర్చోపెట్టింది.
“భరతా! అదేమిటి అలా పడిపోయావు. నీ వంటి రాకుమారులు, కాబోయే మహారాజులు ఇలా దిగులు చెందవచ్చునా! నీ శోకము మాను.” అని ఊరడించింది కైక. కాని భరతునికి శోకము ఆగలేదు. పెద్దగా ఏడుస్తున్నాడు. “అమ్మా! వసిష్ఠులవారు శీఘ్రముగా రమ్మన్నారు అంటే రామునికి పట్టాభిషేకమునకు సుముహూర్తము నిశ్చయించినారేమో అనుకున్నాను. కాని ఇంతటి దుర్వార్త వినవలసి వస్తుందని అనుకోలేదు. అమ్మా! ఇంత హటాత్తుగా తండ్రిగారు చనిపోవుటకు కారణమేమి! ఏమైనా వ్యాధి సోకినదా! తండ్రిగారి అవసాన కాలములో దగ్గర ఉండి ఆయన అంత్యక్రియము జరిపించిన రాముడు ధన్యుడు. ఆ భాగ్యమునకు నేను నోచుకోలేదు. నేను వచ్చాను అని తెలియగానే నాకు ఎదురు వచ్చి నా శరీరమును అంతా నిమిరి, నా శిరమును ఆఘ్రాణించు తండ్రిగారు కనపడనప్పుడే అనుకున్నాను. ఇలాంటిది ఏదో జరిగి ఉంటుందని. నా తండ్రిగారి చేతి స్పర్శ అనుభవించు భాగ్యము ఈ జన్మకు లేదు కదా!
అమ్మా తండ్రి గారి తరువాత తండ్రి అంతటివాడు రాముడు. ఆయన నాకు అన్నగారే కాదు, తల్లి, తండ్రి, గురువు, దైవము. రామునికి నా రాక గురించి తెలపండి. నా తండ్రికి బదులు నా అన్నగారి పాదాలు పట్టుకొని ఆశీర్వాదము తీసుకుంటాను. రాముడు నన్ను ఆశీర్వదిస్తే నా తండ్రి ఆశీర్వదించినట్టే! అమ్మా! తండ్రిగారి మరణసమయములో నేను దగ్గర లేను కదా! నాతో చెప్పమని ఏమైనా చెప్పాడా అమ్మా! చెప్పమ్మా! నా తండ్రి గారి మాటలు యధాతథంగా చెప్పమ్మా!” అని కైకను ప్రార్థించాడు భరతుడు.
కైక జరిగింది చెప్పసాగింది. “కుమారా! నీ తండ్రి దశరథ మహారాజు తన ఆఖరి ఘడియలలో హా రామా! హా లక్ష్మణా! హా సీతా! అని వారిని తల్చుకుంటూ ప్రాణాలు వదిలాడు. ఇంకా ఇలా అన్నాడు. “రాముడు సీతతో లక్ష్మణునితో అయోధ్యకు తిరిగి వచ్చినపుడు చూచిన వారు ధన్యులు కదా!” అని అన్నాడు.
భరతునికి అనుమానం కలిగింది. “అమ్మా! రాముడు, లక్ష్మణుడు, సీత ఎక్కడకు వెళ్లారు. ఎందుకు వెళ్లారు? ఎప్పుడు వస్తారు.” అని అడిగాడు భరతుడు. తాను చెప్పబోవు సంగతులు భరతునికి సంతోషము కలిగిస్తాయి అనే భ్రమలో జరిగింది జరిగినట్టు చెప్పసాగింది కైక.
“కుమారా భరతా! నీ అన్న రాముడు నార చీరలు ధరించి భార్యాసమేతుడై, లక్ష్మణుని వెంటదీసుకొని అరణ్యములకు వెళ్లాడు.” అని చెప్పింది. భరతుడు ఆశ్చర్యపోయాడు. ధర్మము తప్ప మరొకటి తెలియని రాముడు ఏ తప్పుచేసాడని రాజ్యము నుండి వెడలి పోయాడు అని ఆలోచించాడు. తల్లి కైకను ఇలా అడిగాడు.
“అమ్మా! రాముడు ఏమి తప్పు చేసాడని రాజ్యమునుండి వెడలగొట్టబడ్డాడు. రాముడు బ్రాహ్మణుల సొత్తును దొంగిలించాడా! రాముడు ఎవరి నైనా నిరపరాధిని దండించాడా! లేక రాముడు ఇతర స్త్రీలను, ఇతరుల భార్యలను కామవాంఛతో కోరుకున్నాడా. లేక ఏమైనా భ్రూణ హత్య లాంటిది చేసాడా! రాముడు ఏ అపరాధమూ చెయ్యకుండా రాజ్యమునుండి ఎందుకు అరణ్యములకు పంపబడ్డాడు.” అని నిలదీసాడు భరతుడు. ఇంక చెప్పక తప్పదని అసలు విషయాన్ని చెప్పసాగింది కైక. “రాకుమారా! రాముడు నీవు చెప్పిన ఏ పాపమూ చెయ్యలేదు. నీ తండ్రి దశరథుడు రామునికి పట్టాభిషేకము చేయుటకు ముహూర్తము నిశ్చయించాడు. ఆ విషయమును విన్న నేను ఆందోళనపడ్డాను. వెంటనే నీ తండ్రి వద్దకు పోయి, నీకు యౌవరాజ్యము పట్టాభిషేకము చేయమనీ, రాముని పదునాలుగేళ్లు అరణ్యములకు పంపమని కోరాను. నీ తండ్రి నాకు ఇదివరలో ఇచ్చిన వరములను సఫలము చేయుటకు రాముని అరణ్యములకు పంపాడు. రాముని వెంట సీత, లక్ష్మణుడు కూడా వెళ్లారు. రాముడు అరణ్యములకు పోవడంతో నీ తండ్రి దిగులుతో రాముని ఇంక చూడలేనేమోనని చింతతో మరణించాడు.
నాయనా భరతా! ఇదంతా నేను నీ కోసమే, నీ మేలు కోరి, నీ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని చేసాను. కాబట్టి వెంటనే నీవు రాజ్యాభిషిక్తుడివికా! ఈ తల్లి కోర్కె నెరవేర్చు. నీ తండ్రి మాట ప్రకారము రాముడు అడవులకు వెళ్లాడు. నా మాట ప్రకారము నీవు పట్టాభిషిక్తుడివి కా! కాబోయే మహారాజువు. నీవు దిగులు పడకూడదు. ధైర్యంగా ఉండు. ఇప్పుడు నీకు దాయాదుల బాధ లేదు. నీ ఇష్టం వచ్చినట్టు అయోధ్యను పాలించు. నీవు వెంటనే వసిష్ఠుని కలిసి, నీ తండ్రికి శాస్త్రోక్తంగా అంత్య క్రియలు నిర్వర్తించి, తరువాత రాజ్యాభిషిక్తుడివి కా! అని పలికింది కైక.
శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము డెబ్బది రెండవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.