Ayodhya Kanda Sarga 9 In Telugu – అయోధ్యాకాండ నవమః సర్గః

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అయోధ్యాకాండం లోని నవమ సర్గ, రామాయణంలోని ఒక ప్రధాన భాగం. ఈ సర్గలో రాముడు అయోధ్యను విడిచిపోవడం మరియు ఆ క్రమంలో జరిగిన సంఘటనలు చిత్రీకరించబడ్డాయి. రాముడి పుట్టుక, బాల్యము, మరియు రాజ్యాభిషేకము వరకు జరిగిన సంఘటనలు అయోధ్యాకాండలో ప్రస్తావించబడినవి. నవమ సర్గలో రాముడు, సీత, మరియు లక్ష్మణులు అయోధ్య నుండి వనవాసానికి బయలుదేరుతారు. ఈ సందర్భంలో దశరథ మహారాజు, కౌసల్యా మరియు అయోధ్య ప్రజలు అనుభవించిన దుఃఖాన్ని ఈ సర్గలో వివరించబడింది. కుటుంబబాంధవ్యాలు, విధి, మరియు త్యాగం వంటి ముఖ్యమైన విషయాలు ఈ సర్గలో ప్రధానంగా ఉంటాయి.

రామప్రవాసనోపాయచింతా

ఏవముక్తా తు కైకేయీ క్రోధేన జ్వలితాననా |
దీర్ఘముష్ణం వినిశ్వస్య మంథరామిదమబ్రవీత్ ||

1

అద్య రామమితః క్షిప్రం వనం ప్రస్థాపయామ్యహమ్ |
యౌవరాజ్యే చ భరతం క్షిప్రమేవాభిషేచయే ||

2

ఇదం త్విదానీం సంపశ్యే కేనోపాయేన మంథరే |
భరతః ప్రాప్నుయాద్రాజ్యం న తు రామః కథంచన ||

3

ఏవముక్తా తు సా దేవ్యా మంథరా పాపదర్శినీ |
రామార్థముపహింసంతీ కైకేయీమిదమబ్రవీత్ ||

4

హంతేదానీం ప్రవక్ష్యామి కైకేయి శ్రూయతాం చ మే |
యథా తే భరతో రాజ్యం పుత్రః ప్రాప్స్యతి కేవలమ్ ||

5

కిం న స్మరసి కైకేయి స్మరంతీ వా నిగూహసే |
యదుచ్యమానమాత్మార్థం మత్తస్త్వం శ్రోతుమిచ్ఛసి ||

6

మయోచ్యమానం యది తే శ్రోతుం ఛందో విలాసిని |
శ్రూయతామభిధాస్యామి శ్రుత్వా చాపి విమృశ్యతామ్ ||

7

శ్రుత్వైవం వచనం తస్యాః మంథరాయాస్తు కైకయీ |
కించిదుత్థాయ శయనాత్స్వాస్తీర్ణాదిదమబ్రవీత్ ||

8

కథయ త్వం మమోపాయం కేనోపాయేన మంథరే |
భరతః ప్రాప్నుయాద్రాజ్యం న తు రామః కథంచన ||

9

ఏవముక్తా తయా దేవ్యా మంథరా పాపదర్శినీ |
రామార్థముపహింసంతీ కుబ్జా వచనమబ్రవీత్ ||

10

తవ దైవాసురే యుద్ధే సహ రాజర్షిభిః పతిః |
అగచ్ఛత్త్వాముపాదాయ దేవరాజస్య సాహ్యకృత్ ||

11

దిశమాస్థాయ వై దేవి దక్షిణాం దండకాన్ప్రతి |
వైజయంతమితి ఖ్యాతం పురం యత్ర తిమిధ్వజః ||

12

స శంబర ఇతి ఖ్యాతః శతమాయో మహాసురః |
దదౌ శక్రస్య సంగ్రామం దేవసంఘైరనిర్జితః ||

13

తస్మిన్ మహతి సంగ్రామే పురుషాన్ క్షతవిక్షతాన్ |
రాత్రౌ ప్రసుప్తాన్ ఘ్నంతి స్మ తరసాఽఽసాద్య రాక్షసాః ||

14

తత్రాకరోన్మహద్యుద్ధం రాజా దశరథస్తదా |
అసురైశ్చ మహాబాహుః శస్త్రైశ్చ శకలీకృతః ||

15

అపవాహ్య త్వయా దేవి సంగ్రామాన్నష్టచేతనః |
తత్రాపి విక్షతః శస్త్రైః పతిస్తే రక్షితస్త్వయా ||

16

తుష్టేన తేన దత్తౌ తే ద్వౌ వరౌ శుభదర్శనే |
స త్వయోక్తః పతిర్దేవి యదేచ్ఛేయం తదా వరౌ ||

17

గృహ్ణీయామితి తత్తేన తథేత్యుక్తం మహాత్మనా |
అనభిజ్ఞా హ్యహం దేవి త్వయైవ కథితా పురా ||

18

కథైషా తవ తు స్నేహాత్ మనసా ధార్యతే మయా |
రామాభిషేకసంభారాన్నిగృహ్య వినివర్తయ ||

19

తౌ వరౌ యాచ భర్తారం భరతస్యాభిషేచనమ్ |
ప్రవ్రాజనం తు రామస్య త్వం వర్షాణి చతుర్దశ ||

20

చతుర్దశ హి వర్షాణి రామే ప్రవ్రాజితే వనమ్ |
ప్రజాభావగతస్నేహః స్థిరః పుత్రో భవిష్యతి ||

21

క్రోధాగారం ప్రవిశ్యాద్య క్రుద్ధేవాశ్వపతేః సుతే |
శేష్వానంతర్హితాయాం త్వం భూమౌ మలినవాసినీ ||

22

మా స్మైనం ప్రత్యుదీక్షేథా మా చైనమభిభాషథాః |
రుదంతీ చాపి తం దృష్ట్వా జగత్యాం శోకలాలసా ||

23

దయితా త్వం సదా భర్తుః అత్ర మే నాస్తి సంశయః |
త్వత్కృతే స మహారాజో విశేదపి హుతాశనమ్ ||

24

న త్వాం క్రోధయితుం శక్తో న క్రుద్ధాం ప్రత్యుదీక్షితుమ్ |
తవ ప్రియార్థం రాజా హి ప్రాణానపి పరిత్యజేత్ ||

25

న హ్యతిక్రమితుం శక్తస్తవ వాక్యం మహీపతిః |
మందస్వభావే బుద్ధ్యస్వ సౌభాగ్యబలమాత్మనః ||

26

మణిముక్తం సువర్ణాని రత్నాని వివిధాని చ |
దద్యాద్దశరథో రాజా మాస్మ తేషు మనః కృథాః ||

27

యౌ తౌ దైవాసురే యుద్ధే వరౌ దశరథోఽదదాత్ |
తౌ స్మారయ మహాభాగే సోఽర్థో మా త్వామతిక్రమేత్ ||

28

యదాతు తే వరం దద్యాత్ స్వయముత్థాప్య రాఘవః |
వ్యవస్థాప్య మహారాజం త్వమిమం వృణుయా వరమ్ ||

29

రామం ప్రవ్రాజయారణ్యే నవ వర్షాణి పంచ చ |
భరతః క్రియతాం రాజా పృథివ్యాః పార్థివర్షభః ||

30

చతుర్దశ హి వర్షాణి రామే ప్రవ్రాజితే వనమ్ |
రూఢశ్చ కృతమూలశ్చ శేషం స్థాస్యతి తే సుతః ||

31

రామప్రవ్రాజనం చైవ దేవి యాచస్వ తం వరమ్ |
ఏవం సిద్ధ్యంతి పుత్రస్య సర్వార్థాస్తవ భామినీ ||

32

ఏవం ప్రవ్రాజితశ్చైవ రామోఽరామో భవిష్యతి |
భరతశ్చ హతామిత్రస్తవ రాజా భవిష్యతి ||

33

యేన కాలేన రామశ్చ వనాత్ప్రత్యాగమిష్యతి |
తేన కాలేన పుత్రస్తే కృతమూలో భవిష్యతి ||

34

సుగృహీతమనుష్యశ్చ సుహృద్భిః సార్ధమాత్మవాన్ |
ప్రాప్తకాలం తు తే మన్యే రాజానం వీతసాధ్వసా ||

35

రామాభిషేకసంభారాన్నిగృహ్య వినివర్తయ |
అనర్థమర్థరూపేణ గ్రాహితా సా తతస్తయా ||

36

హృష్టా ప్రతీతా కైకేయీ మంథరామిదమబ్రవీత్ |
సా హి వాక్యేన కుబ్జాయాః కిశోరీవోత్పథం గతా ||

37

కైకేయీ విస్మయం ప్రాప్తా పరం పరమదర్శనా |
కుబ్జే త్వాం నాభిజానామి శ్రేష్ఠాం శ్రేష్ఠాభిధాయినీమ్ ||

38

పృథివ్యామసి కుబ్జానాముత్తమా బుద్ధినిశ్చయే |
త్వమేవ తు మమాఽర్థేషు నిత్యయుక్తా హితైషిణీ ||

39

నాహం సమవబుధ్యేయం కుబ్జే రాజ్ఞశ్చికీర్షితమ్ |
సంతి దుఃసంస్థితాః కుబ్జా వక్రాః పరమదారుణాః ||

40

త్వం పద్మమివ వాతేన సన్నతా ప్రియదర్శనా |
ఉరస్తేఽభినివిష్టం వై యావత్స్కంధాత్ సమున్నతమ్ ||

41

అధస్తాచ్చోదరం శాతం సునాభమివ లజ్జితమ్ |
పరిపూర్ణం తు జఘనం సుపీనౌ చ పయోధరౌ ||

42

విమలేందుసమం వక్త్రమహో రాజసి మంథరే |
జఘనం తవ నిర్ఘుష్టం రశనాదామశోభితమ్ ||

43

జంఘే భృశముపన్యస్తే పాదౌ చాప్యాయతావుభౌ |
త్వమాయతాభ్యాం సక్థిభ్యాం మంథరే క్షౌమవాసినీ ||

44

అగ్రతో మమ గచ్ఛంతీ రాజహంసీవ రాజసే |
ఆసన్యాః శంబరే మాయాః సహస్రమసురాధిపే ||

45

సర్వాస్త్వయి నివిష్టాస్తా భూయశ్చాన్యాః సహస్రశః |
తవేదం స్థగు యద్దీర్ఘం రథఘోణమివాయతమ్ ||

46

మతయః క్షత్రవిద్యాశ్చ మాయాశ్చాత్ర వసంతి తే |
అత్ర తే ప్రతిమోక్ష్యామి మాలాం కుబ్జే హిరణ్మయీమ్ ||

47

అభిషిక్తే చ భరతే రాఘవే చ వనం గతే |
జాత్యేన చ సువర్ణేన సునిష్టప్తేన మంథరే || [సుందరి]

48

లబ్ధార్థా చ ప్రతీతా చ లేపయిష్యామి తే స్థగు |
ముఖే చ తిలకం చిత్రం జాతరూపమయం శుభమ్ ||

49

కారయిష్యామి తే కుబ్జే శుభాన్యాభరణాని చ |
పరిధాయ శుభే వస్త్రే దేవతేవ చరిష్యసి ||

50

చంద్రమాహ్వయమానేన ముఖేనాప్రతిమాననా |
గమిష్యసి గతిం ముఖ్యాం గర్వయంతీ ద్విషజ్జనమ్ ||

51

తవాపి కుబ్జాః కుబ్జాయాః సర్వాభరణభూషితాః |
పాదౌ పరిచరిష్యంతి యథైవ త్వం సదా మమ ||

52

ఇతి ప్రశస్యమానా సా కైకేయీమిదమబ్రవీత్ |
శయానాం శయనే శుభ్రే వేద్యామగ్నిశిఖామివ ||

53

గతోదకే సేతుబంధో న కళ్యాణి విధీయతే |
ఉత్తిష్ఠ కురు కళ్యాణి రాజానమనుదర్శయ ||

54

తథా ప్రోత్సాహితా దేవీ గత్వా మంథరయా సహ |
క్రోధాగారం విశాలాక్షీ సౌభాగ్యమదగర్వితా ||

55

అనేకశతసాహస్రం ముక్తాహారం వరాంగనా |
అవముచ్య వరార్హాణి శుభాన్యాభరణాని చ ||

56

తతో హేమోపమా తత్ర కుబ్జావాక్యవశం గతా |
సంవిశ్య భూమౌ కైకేయీ మంథరామిదమబ్రవీత్ ||

57

ఇహ వా మాం మృతాం కుబ్జే నృపాయావేదయిష్యసి |
వనం తు రాఘవే ప్రాప్తే భరతః ప్రాప్స్యతి క్షితిమ్ ||

58

న సువర్ణేన మే హ్యర్థో న రత్నైర్న చ భూషణైః |
ఏష మే జీవితస్యాంతో రామో యద్యభిషిచ్యతే ||

59

అథో పునస్తాం మహిషీం మహీక్షితో
వచోభిరత్యర్థమహాపరాక్రమైః |
ఉవాచ కుబ్జా భరతస్య మాతరం
హితం వచో రామముపేత్య చాహితమ్ ||

60

ప్రపత్స్యతే రాజ్యమిదం హి రాఘవో
యది ధ్రువం త్వం ససుతా చ తప్స్యసే |
అతో హి కళ్యాణి యతస్వ తత్తథా
యథా సుతస్తే భరతోఽభిషేక్ష్యతే ||

61

తథాఽతివిద్ధా మహిషీ తు కుబ్జయా
సమాహతా వాగిషుభిర్ముహుర్ముహుః |
నిధాయ హస్తౌ హృదయేఽతివిస్మితా
శశంస కుబ్జాం కుపితా పునః పునః ||

62

యమస్య వా మాం విషయం గతామితో
నిశామ్య కుబ్జే ప్రతివేదయిష్యసి |
వనం గతే వా సుచిరాయ రాఘవే
సమృద్ధకామో భరతో భవిష్యతి ||

63

అహం హి నైవాస్తరణాని న స్రజో
న చందనం నాంజనపానభోజనమ్ |
న కించిదిచ్ఛామి న చేహ జీవితం
న చేదితో గచ్ఛతి రాఘవో వనమ్ ||

64

అథైతదుక్త్వా వచనం సుదారుణం
నిధాయ సర్వాభరణాని భామినీ |
అసంవృతామాస్తరణేన మేదినీ-
-మథాధిశిశ్యే పతితేవ కిన్నరీ ||

65

ఉదీర్ణసంరంభతమోవృతాననా
తథావముక్తోత్తమమాల్యభూషణా |
నరేంద్రపత్నీ విమనా బభూవ సా
తమోవృతా ద్యౌరివ మగ్నతారకా ||

66

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే నవమ సర్గః ||

Ayodhya Kanda Sarga 9 Meaning In Telugu 

ఒక అబద్ధాన్ని పదే పదే వల్లిస్తే అదే నిజం అని నమ్మే పరిస్తితి వస్తుంది. ఇది ఏ ఒక్కరికీ పరిమితం కాదు. విద్వాసుల దగ్గరినుంచీ నిరక్షరాస్యులవరకూ జరుగుతుంది. కైక విద్వాంసురాలు. దశరథుని భార్య. కేకయ దేశపు రాకుమార్తె. కాని మంథర మాటలకు లోబడి పోయింది. రాముడు పుట్టినప్పటినుండి, రాముని తన కుమారునికన్న ఎక్కువ గారాబంగా పెంచింది. రాముడు అంటే కైకకు ప్రాణం. కాని మంథర చెప్పుడు మాటల ముందు ఇన్నాళ్లు తాను రాముని మీద పెంచుకున్న ప్రేమ అనురాగము ఎందుకూ కొరగాకుండా పోయాయి. ఒక్కసారిగా రాముని మీద ద్వేషము అసూయ ప్రబలాయి.

మంథర చెప్పిన మాటలు వినగానే కైకకు కోపం తారస్థాయికి చేరుకుంది. రోషంతో మంథరతో ఇలా అంది.

“మంధరా! ఆలోచించగా నీవు చెప్పినదే నిజము అనిపిస్తూ ఉంది. ఇంక ఆలస్యము చేసి ప్రయోజనము లేదు. రాముడు ఉన్నంత వరకూ భరతునికి భవిష్యత్తు లేదు. రాముడు అడవులకు వెళ్లాలి, భరతుడు యువరాజుగా పట్టాభిషిక్తుడు కావాలి. ఇదే నా తక్షణ కర్తవ్యము. మంథరా! నాకు ఏమీ తోచడం లేదు. ఎలాగైనా రేపటి పట్టాభిషేకము ఆగిపోవాలి. భరతుడు రాజ్యాభిషిక్తుడు కావాలి. దీనికి తగిన ఉపాయం చెప్పు.” అని అడిగింది కైక.

తన పాచిక పారినందుకు మంథర లోలోపల సంతోషించింది. ఇందులో మంథరకు లాభించింది ఏమీ లేదు. రాముడు పట్టాభిషేకం ఆగిపోతే మంధరకు ఒరిగింది ఏమీ లేదు. కాని మహారాణి కైక తన మాటకు విలువ ఇచ్చింది. అదే మంథరకు పదివేలు. మంథర రెచ్చిపోయి కైకతో ఇలా అంది.

“నా మాటలకు విలువ ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉ దమ్మా. ఏ పని అయిన చెయ్యడం కష్టం కాని చెడగొట్టడం ఎంత సేపు. రేపు జరగబోయే పట్టాభిషేకము పటాపంచలు చేసే ఉపాయము ఒకటి చెబుతాను. సావధానంగా విను. అయినా నీకు తెలియదటమ్మా! నేను చెప్పాలా చెప్పు. నీకు అన్నీ తెలుసు. ఈ ముసలి దాన్ని పరీక్ష చేస్తున్నావు కదూ. అయినా అడిగావు కాబట్టి చెప్పాలి కదా!” అంది మంథర

వెంటనే కైక తాను కూర్చున్న ఆసనము మీది నుండి లేచి మంథర దగ్గరగా వచ్చింది. “లేదే మంథరా. నాకు ఏ ఉపాయమూ తట్టడం లేదు. భరతునికి పట్టాభిషేకం జరగాలి. అది ఎలాగో చెప్పు.” అని అడిగింది కైక.

“దానికే వస్తున్నానమ్మా! నీవు ఒకసారి నాతో ఒక విషయం చెప్పావు గుర్తుందా. అదేనమ్మా! దేవాసుర యుద్ధంజరిగింది కదా. అప్పుడు ఇంద్రుడికి సాయంగా నీ భర్త దశరథుడు కూడా వెళ్లాడు. ఆయనతో పాటు నువ్వు కూడా వెళ్లావు. మీరంతా దండకారణ్యంలో నివాసం ఉన్న తిమిరధ్వజుడు అనే రాక్షసుని మీదికి యుద్ధానికి వెళ్లారు. ఆ అసురుడు మాయావి. దేవతలనందరినీ ఓడించాడు. ఇంద్రునితో కూడా యుద్ధము చేసాడు. పగలంతా యుద్ధం చేసిన దేవతలు తీసుకుంటున్నారు. నిశాచరులైన రాక్షసులు రాత్రి రాత్రికి రాత్రి దేవతలను ఊచకోత కోసారు. అప్పుడు దశరథ మహారాజు ఆ అసురులతో యుద్ధానికి దిగాడు. కాని రాక్షసులు దశరథుని ఒళ్లంతా తూట్లు పడేట్టు కొట్టారు. నీ భర్త కిందపడి నీ పోయాడు. స్పృహ కోల్పోయాడు.

అప్పుడు నీవు నీ భర్తను రణరంగము నుండి దూరంగా తీసుకొని పోయి కాపాడావు కదా! కాని రాక్షసులు మిమ్ములను వెంబడించి యుద్ధం చేసారు. మరలా నీవు నీ భర్తను రణరంగంనుండి రాక్షసుల కంట పడకుండా దూరంగా తీసుకొని పోయి కాపాడావు. అలా నీ భర్తను రెండు సార్లు ప్రాణాపాయం నుండి రక్షించావు. నీవు చేసిన మహోపకారమునకు నీ భర్త దశరథుడు ఎంతో సంతోషించాడు. నీకు రెండు సార్లు ఆయన ప్రాణాలు కాపాడావు కాబట్టి నీకు రెండు వరాలు ఇస్తాను అని అన్నాడు. వాటిని నీవు కోరుకోకుండా నీ ఇష్టంవచ్చినప్పుడు కోరుకుంటాను అని అన్నావు. ఇదంతా నీవు చెబితేనే నాకు తెలిసింది.

ఇప్పుడు ఆ వరాలతో పని పడింది. ఆ వరాలను ఇప్పుడు కోరుకో. ఒక వరంగా రామునికి 14 ఏళ్ల వనవాసము. రెండవ వరంగా భరతునికి యౌవరాజ్య పట్టాభిషేకము. దానితో రామ పట్టాభిషేకము ఆగిపోతుంది. నీ కోరిక నెరవేరుతుంది. రాముడు రాజ్యంలో లేకపోతే భరతుడు ప్రజలకు దగ్గర అవుతాడు. వారి ప్రేమ అభిమానములను చూరగొంటాడు. అయోధ్యావాసులు భరతుని తమ ప్రభువుగా అంగీకరిస్తారు. రాముని మరిచిపోతారు. భరతుడు రాజుగా స్థిరపడతాడు. నీవు రాజమాతగా వెలిగిపోతావు. ఇదీ పధకము.

ఈ పథకము అమలు చేయడానికి ముందు నీవు కోపగృహము అలంకరించాలి. మాసిన వస్త్రములు కట్టుకొని, తలకు కట్టుకట్టుకొని నేలమీద పడుకోవాలి. కొంచెం కష్టమే అయినా తప్పదు కదా! దశరథుడు నీ దగ్గరకు వచ్చినపుడు పెద్దపెట్టున ఏడిచి గోల చేయాలి. ఆయన వంక చూడను కూడా చూడకూడదు. మాట్లాడ కూడదు. ఆయన మాట్లాడించినా ఎడమొహం పెడమొహంగా ఉండాలి.

నువ్వు అంటే దశరథునికి ఎంతో ప్రేమ అభిమానము. నీ కోసం ఏమి చెయ్యమన్నా చేస్తాడు. ఆఖరుకు నిప్పుల్లో దూకమన్నా దూకుతాడు. నువ్వు బాధతో ఉంటే చూడలేడు. నువ్వు ఏం అడిగినా ఇస్తాడు. తుదకు తన ప్రాణాలు ఇవ్వమన్నా సంతోషంగా ఇచ్చేస్తాడు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకో. దేవాసుర యుద్ధంలో నీకు ఇస్తానన్న రెండు వరాలు ఇప్పుడు అడుగు. నీకు మణులు, రత్నాలు ఆభరణాలు ఇస్తానని ప్రలోభ పెడతాడు. కాని వాటికి ఆశపడవద్దు. రెండు వరాలు జాగ్రత్తగా కోరుకో.

మొదటి వరం రాముని పదునాలుగు సంవత్సరములు అరణ్యవాసమునకు పంపడం. రెండవ వరము గా భరతుని యువరాజుగా పట్టాభిషిక్తుని చేయడం. రాముడు రాజ్యములో ఉంటే నీ కుమారుని ఎవరూ రాజుగా అంగీకరించరు. రాముడు అడవులకు వెళితే క్రమక్రమంగా భరతుడు రాజుగా వేళ్లూనుకొని స్థిరపడతాడు. రాముడు వనవాసమునకు వెళ్లడం ఒక వరంగా కోరాలి. లేకపోతే రాముడు అయోధ్యలోనే ఉండే ప్రమాదం ఉంది. రాముడు వనములకు వెళితే ప్రజలు రాముని మరిచిపోతారు. నీ కుమారుడు భరతుని రాజుగా అంగీకరిస్తారు. రాముడు ఒక వేళ వనవాసము నుండి తిరిగి వచ్చినా భరతుడు రాజ్యమును ఇయ్యడు. కాబట్టి ముందు రామ పట్టాభిషేకమును ఆపించవలెను.” అని మంథర కైకకు ఒకటికి పది సార్లు చెప్పిందే చెప్పి నూరిపోసింది.

మంథర దుర్బోధలు బాగా తలకెక్కాయి కైకకు. తన కొడుకు భరతుడు అప్పుడే యువరాజు అయినట్టు కలలు కంటోంది. తన శ్రేయస్సు కోరి ఇంతగా తనకు ఆలోచనలను చెప్పిన మంథరను మనసులోనే అభినందించింది.

(ఇక్కడ వాల్మీకి ఒక వాక్యం రాసాడు. కైకేయి స్వతాహాగా మంచి గుణములు కలది అయినా తన దాసి మంథర దుర్బోధలను విని ఏమీ తెలియని అమాయకురాలైన బాలిక వలె చెడుతోవలో నడిచింది. అని. ఇలాంటి మంధరలు మనకు ప్రతి ఇంటా కనపడతారు. వాళ్లు మన బంధువులైనా కావచ్చు లేక పక్కింటి వాళ్లు ఎదురింటి వాళ్లు కావచ్చు. వారి చెప్పుడు మాటలకు లోబడి సంసారాలు చెడ గొట్టుకొనే కైకలు ఎంతో మంది మన కళ్లముందే కనపడతున్నారు.)

“ఆ హా మంధరా! నీకు ఎన్ని విషయాలు తెలుసే. నాకు ఎన్ని మంచి విషయాలు చెప్పావు. నీకు ఇన్ని తెలివితేటలు ఉన్నాయని నాకు ఇంతవరకూ తెలియదు. నీమేలు ఎన్నటికీ మరువలేను. మంథరా! అసలు నువ్వు చెప్పకపోతే నాకు మహారాజు మనసులో ఏముందో తెలిసి ఉండేది కాదు. నీవు రూపానికి కుబ్జవే కాని బుద్ధిలో బృహస్పతివి. నువ్వు చెప్పినట్టు రాముడు అడవులకు పోయి నా కొడుకు భరతుడు రాజైతే నీ ఒళ్లంతా బంగారు తొడుగు వేయిస్తానే. నువ్వు నాకు ఎలా సేవలు చేస్తున్నావో, ఇతర దాసీల చేత నీకు అలా సేవలు చేయిస్తాను. ఆ కౌసల్య దాసీలు నిన్ను చూచి అసూయపడేలా చేస్తాను.” అని మంథరను పొగిడింది.

తన రాణి కైక తనను అలా పొగుడుతుంటే మంథర పొంగి పోయింది. “ఏంటమ్మా ఇంకా ఇలాగే ఉన్నావా. నేను చెప్పినవి అన్నీ అప్పుడే మరిచిపోయావా” అంది మంథర.

“లేదు లేవే. అన్నీ గుర్తున్నాయి.” అంటూ తన అలంకారములు అన్నీ ఒకటి ఒకటిగా తీసేసింది. పట్టు బట్టలు విప్పి మాసిన చీర కట్టుకుంది. తలకు కట్టు కట్టింది. నేలమీద పడుకుంది.

“మంథరా! రాజుగారు వస్తే ఇలా చెప్పు. భరతుడు రాజైనా కావాలి. లేకపోతే నేను చావనన్నా చావాలి. అదే నా కోరిక అని చెప్పు. ఇంకా ఏమంటావంటే అక్కడ రాముడికి పట్టాభిషేకం జరిగితే ఇక్కడ నా ప్రాణాలు పోతాయి అని చెప్పు.” అని పలికింది.

“అవన్నీ నాకు తెలుసు లేవమ్మా. నువ్వు మాత్రం రాజుగారితో ఖచ్ఛితంగా ఉండు. రాముని అరణ్య వాసము, భరతుని పట్టాభిషేకము ఇవి రెండే కావాలి అని చెప్పు.” అని చెప్పింది మంథర.

“అంతా నువ్వు చెప్పినట్టే చేస్తాను లేవే.” అని పలికింది కైక.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము తొమ్మిదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అయోధ్యాకాండ దశమః సర్గః (10) >>

Leave a Comment