మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అయోధ్యాకాండ దశమ సర్గ రామాయణంలో ముఖ్యమైన భాగం. ఈ సర్గలో రాముడు, సీత, మరియు లక్ష్మణులు వనవాసం కోసం అయోధ్యను విడిచి వెళ్ళిన తరువాత జరిగే సంఘటనలు చిత్రించబడ్డాయి. వారి వనవాస ప్రయాణంలో ఎదురైన సవాళ్లు, కష్టాలు, మరియు వారు కలసిన వ్యక్తులను ఈ సర్గ వివరంగా వర్ణిస్తుంది. అలాగే, అయోధ్యలో ఉన్న దశరథ మహారాజు మరియు ఇతర కుటుంబ సభ్యుల మనోభావాలను కూడా ఈ సర్గ స్పష్టంగా తెలియజేస్తుంది. ఈ సర్గ ద్వారా రాముడు మరియు అతని కుటుంబం ఎదుర్కొనే దుఃఖం, త్యాగం, మరియు ధైర్యం వంటి అంశాలు పాఠకుల హృదయాలను తాకుతాయి.
కైకేయ్యనునయః
విదర్శితా యదా దేవీ కుబ్జయా పాపయా భృశమ్ |
తదా శేతే స్మ సా భూమౌ దిగ్ధవిద్ధేవ కిన్నరీ ||
1
నిశ్చిత్య మనసా కృత్యం సా సమ్యగితి భామినీ |
మంథరాయై శనైః సర్వమాచచక్షే విచక్షణా ||
2
సా దీనా నిశ్చయం కృత్వా మంథరావాక్యమోహితా |
నాగకన్యేవ నిశ్వస్య దీర్ఘముష్ణం చ భామినీ ||
3
ముహూర్తం చింతయామాస మార్గమాత్మసుఖావహమ్ |
సా సుహృచ్చార్థకామా చ తన్నిశమ్య సునిశ్చయమ్ ||
4
బభూవ పరమప్రీతా సిద్ధిం ప్రాప్యేవ మంథరా |
అథ సా మర్షితా దేవీ సమ్యక్కృత్వా సునిశ్చయమ్ ||
5
సంవివేశాబలా భూమౌ నివేశ్య భృకుటీం ముఖే |
తతశ్చిత్రాణి మాల్యాని దివ్యాన్యాభరణాని చ ||
6
అపవిద్ధాని కైకేయ్యా తాని భూమిం ప్రపేదిరే |
తయా తాన్యపవిద్ధాని మాల్యాన్యాభరణాని చ ||
7
అశోభయంత వసుధాం నక్షత్రాణి యథా నభః |
క్రోధాగారే నిపతితా సా బభౌ మలినాంబరా ||
8
ఏకవేణీం దృఢం బధ్వా గతసత్త్వేవ కిన్నరీ |
ఆజ్ఞాప్య తు మహారాజో రాఘవస్యాభిషేచనమ్ ||
9
ఉపస్థాసమనుజ్ఞాప్య ప్రవివేశ నివేశనమ్ |
అద్య రామాభిషేకో వై ప్రసిద్ధ ఇతి జజ్ఞివాన్ ||
10
ప్రియార్హాం ప్రియమాఖ్యాతుం వివేశాంతఃపురం వశీ |
స కైకేయ్యా గృహం శ్రేష్ఠం ప్రవివేశ మహాయశాః ||
11
పాండురాభ్రమివాకాశం రాహుయుక్తం నిశాకరః |
శుకబర్హిణసంఘుష్టం క్రౌంచహంసరుతాయుతమ్ ||
12
వాదిత్రరవసంఘుష్టం కుబ్జావామనికాయుతమ్ |
లతాగృహైశ్చిత్రగృహైశ్చంపకాశోకశోభితైః ||
13
దాంతరాజతసౌవర్ణవేదికాభిః సమాయుతమ్ |
నిత్యపుష్పఫలైర్వృక్షైర్వాపీభిశ్చోపశోభితమ్ ||
14
దాంతరాజతసౌవర్ణైః సంవృతం పరమాసనైః |
వివిధైరన్నపానైశ్చ భక్ష్యైశ్చ వివిధైరపి ||
15
ఉపపన్నం మహార్హైశ్చ భూషణైస్త్రిదివోపమమ్ |
తత్ప్రవిశ్య మహారాజః స్వమంతఃపురమృద్ధిమత్ ||
16
న దదర్శ ప్రియాం రాజా కైకేయీం శయనోత్తమే |
స కామబలసంయుక్తో రత్యర్థం మనుజాధిపః ||
17
అపశ్యన్దయితాం భార్యాం పప్రచ్ఛ విషసాద చ |
న హి తస్య పురా దేవీ తాం వేలామత్యవర్తత ||
18
న చ రాజా గృహం శూన్యం ప్రవివేశ కదాచన |
తతో గృహగతో రాజా కైకేయీం పర్యపృచ్ఛత ||
19
యథాపురమవిజ్ఞాయ స్వార్థలిప్సుమపండితామ్ |
ప్రతిహారీ త్వథోవాచ సంత్రస్తా రచితాంజలిః ||
20
దేవ దేవీ భృశం కృద్ధా క్రోధాగారమభిదృతా |
ప్రతిహార్యా వచః శ్రుత్వా రాజా పరమదుర్మనాః ||
21
విషసాద పునర్భూయో లులితవ్యాకులేంద్రియః |
తత్ర తాం పతితాం భూమౌ శయానామతథోచితామ్ ||
22
ప్రతప్త ఇవ దుఃఖేన సోఽపశ్యజ్జగతీపతిః |
స వృద్ధస్తరుణీం భార్యాం ప్రాణేభ్యోఽపి గరీయసీమ్ ||
23
అపాపః పాపసంకల్పాం దదర్శ ధరణీతలే |
లతామివ వినిష్కృత్తాం పతితాం దేవతామివ ||
24
కిన్నరీమివ నిర్ధూతాం చ్యుతామప్సరసం యథా |
మాయామివ పరిభ్రష్టాం హరిణీమివ సంయతామ్ ||
25
కరేణుమివ దిగ్ధేన విద్ధాం మృగయునా వనే |
మహాగజ ఇవారణ్యే స్నేహాత్పరిమమర్శ తామ్ ||
26
పరిమృశ్య చ పాణిభ్యామభిసంత్రస్తచేతనః |
కామీ కమలపత్రాక్షీమువాచ వనితామిదమ్ ||
27
న తేఽహమభిజానామి క్రోధమాత్మని సంశ్రితమ్ |
దేవి కేనాభిశప్తా౭సి కేన వాఽసి విమానితా ||
28
యదిదం మమ దుఃఖాయ శేషే కళ్యాణి పాంసుషు |
భూమౌ శేషే కిమర్థం త్వం మయి కళ్యాణచేతసి ||
29
భూతోపహతచిత్తేవ మమ చిత్తప్రమాథినీ |
సంతి మే కుశలా వైద్యాస్త్వభితుష్టాశ్చ సర్వశః ||
30
సుఖితాం త్వాం కరిష్యంతి వ్యాధిమాచక్ష్వ భామినీ |
కస్య వా తే ప్రియం కార్యం కేన వా విప్రియం కృతమ్ ||
31
కః ప్రియం లభతామద్య కో వా సుమహదప్రియమ్ |
మా రోదీర్మా చ కార్షీస్త్వం దేవి సంపరిశోషణమ్ ||
32
అవధ్యో వధ్యతాం కో వా కోవా వధ్యః విముచ్యతామ్ |
దరిద్రః కో భవేదాఢ్యో ద్రవ్యవాన్ వాఽప్యకించనః ||
33
అహం చైవ మదీయాశ్చ సర్వే తవ వశానుగాః |
న తే కించిదభిప్రాయం వ్యాహంతుమహముత్సహే ||
34
ఆత్మనో జీవితేనాపి బ్రుహి యన్మనసేచ్ఛసి |
బలమాత్మని జానంతీ న మాం శంకితుమర్హసి ||
35
కరిష్యామి తవ ప్రీతిం సుకృతేనాపి తే శపే |
యావదావర్తతే చక్రం తావతీ మే వసుంధరా ||
36
ప్రాచీనాః సింధుసౌవీరాః సౌరాష్ట్రా దక్షిణాపథాః |
వంగాంగమగధా మత్స్యాః సమృద్ధాః కాశికోసలాః ||
37
తత్ర జాతం బహుద్రవ్యం ధనధాన్యమజావికమ్ |
తతో వృణీష్వ కైకేయి యద్యత్త్వం మనసేచ్ఛసి ||
38
కిమాయాసేన తే భీరు ఉత్తిష్ఠోత్తిష్ఠ శోభనే |
తత్త్వం మే బ్రూహి కైకేయి యతస్తే భయమాగతమ్ ||
39
తత్తే వ్యపనయిష్యామి నీహారమివ భాస్కరః | [రశ్మివాన్]
తథోక్తా సా సమాశ్వస్తా వక్తుకామా తదప్రియమ్ |
పరిపీడయితుం భూయో భర్తారముపచక్రమే ||
40
ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే దశమః సర్గః ||
Ayodhya Kanda Sarga 10 Meaning In Telugu
కైక, మంధర, ఏమి చెయ్యాలో ఎలా చెయ్యాలో దశరథుడు వస్తే ఇలా మాట్లాడాలో మరొకసారి వివరంగా మాట్లాడు కున్నారు. తరువాత కైక కోపగృహంలో ప్రవేశించింది. ఆభరణాలు అన్నీ విసిరికొట్టింది. వెంట్రుకలు గట్టిగా ముడివేసింది. మాసిన బట్టలు కట్టుకుంది. నేలమీద బోర్లాపడుకొని తెచ్చిపెట్టుకున్న బాధను అభినయిస్తూ ఉంది.
ఇంతలో మరునాడు జరగ వలసిన రామ పట్టాభిషేకమునకు చేయవలసిన ఏర్పాట్ల గురించి తగు సూచనలు ఇచ్చిన దశరథుడు, వసిష్ఠుడు వామదేవుడు మొదలగు పెద్దల అనుజ్ఞ తీసుకొని, ఈ విషయమును ముందుగా కైకకు తెలుపవలెనని, వడి వడిగా కైక ఉన్న మందిరమునకు వచ్చాడు.
ఎప్పుడూ కళకళలాడే కైకేయీ మందిరము నిశ్శబ్దముగా ఉంది. శయన మందిరములో కైక కనిపించలేదు. దాసదాసీలు అటు ఇటు తిరుగుతున్నారు. కానీ కైక జాడ మాత్రం కానరాలేదు. ఎప్పుడెప్పుడు కైకతో రామ పట్టాభిషేక వార్త చెబుదామా అని వచ్చిన దశరథ మహారాజు కైక కనపడకపోయేసరికి నిరాశపడ్డాడు. అన్ని గదులు తిరిగాడు. ఎక్కడా కైకజాడ లేదు.
ఎప్పుడూ తను వస్తున్న వర్తమానము ముందుగానే తెలుసు కొని కైక తనకు ఎదురు వచ్చి స్వాగతించి లోపలకు తీసుకొని వెళ్లేది. కాని ఈ మాదిరి ఎప్పుడూ జరగలేదు. ఏమై ఉంటుందా అని ఆలోచిస్తున్నాడు దశరథుడు. అక్కడ నిలబడి ఉన్న కైక ఆంతరంగిక పరిచారికలను పిలిచి కైక గురించి అడిగాడు. నిజానికి అలా అడగడం అవమానం. కాని తప్పలేదు. అడిగాడు.
వారు దశరథునికి నమస్కరించి వినయంగా “మహారాజా! కైకేయీ మహారాణీవారు. కోపగృహంలో ఉన్నారు.”అని చెప్పారు.
ఆశ్చర్యపోయాడు దశరథుడు. కైకేయికి తన మీద కోపమా! ఎందుకు! ఏమీ కారణము! అని తనలో తాను తర్కించుకుంటున్నాడు. దశరథుడు. మెల్ల మెల్ల గా కైకేయీ పడుకొని ఉన్న కోపగృహమునకు వెళ్లాడు. నేలమీద పడుకొని ఉన్న తన ప్రియమైన భార్య కైకను చూచి దశరథునికి దుఃఖము ముంచుకొచ్చింది. దెబ్బతగిలిన లేడిలాగా, దేవలోకము నుండి విసిరివేయబడ్డ దేవకన్యలాగ నేలమీద పడి ఉన్న కైకను చూచి చలించిపోయాడు. వెళ్లి ఆమె పక్కనే నేల మీద కూర్చున్నాడు. ఆమె శరీరాన్ని తన చేతితో మెల్లిగా నిమిరాడు. నెమ్మది అయిన స్వరంతో ఆమెతో ఇలా అన్నాడు.
“దేవీ! ఏమిటీ ఈ అలుక. దేనికి ఈ అలుక. నామీద కోపం ఎందుకు. నేను చేసిన అపరాధము ఏమి? నిన్ను ఎవరన్నా ఏమన్నా అన్నారా! లేక ఎవరన్నా నిన్ను అవమానించారా! నిన్ను ఈ పరిస్థితిలో చూస్తుంటే నాకు దుఃఖము ముంచుకొస్తూ ఉంది. నీవు ఏం కోరితే అది తీర్చే నేను ఉండగా నీకు ఈ కోపమేల? నీ మనసు ఎందుకు కష్టపెట్టుకుంటావు?
అయ్యో ఇన్ని అడుగుతున్నాను. నీ ఆరోగ్యము సంగతే అడగ లేదు. నీకు ఆరోగ్యము సరిగా లేదా! రాజ వైద్యులను పిలిపించనా! నీకు శరీరంలో ఉన్న బాధ ఏమిటో చెప్పు. పోనీ నీకు ఎవరికైనా మేలు చెయ్యాలని అనుకొంటున్నావా. ఎవరైనా సరే వాళ్లకు ఏం కావాలంటే అది ఇస్తాను. పోనీ నీకు ఎవరి మీదనన్నా కోపం ఉందా చెప్పు. వాళ్లను కఠినంగా శిక్షిస్తాను.
అయ్యో దేవీ! ఏమీ చెప్పకుండా ఎందుకు ఇలా నీ శరీరాన్ని శోషింపచేసుకుంటావు. ఇదిగో ఒకే మాట. చెబుతున్నాను విను. నీవు కోరితే చంప కూడని వాడి నన్నా ఒక్క క్షణంలో చంపేస్తాను. లేక ఉరిశిక్ష వేసినవాడినన్నా నిర్దోషిగా వదిలేస్తాను. కటిక దరిద్రుడిని సకల ఐశ్వర్యవంతుడిని చేస్తాను. లేక ధనవంతుడిని వాడి ధనం అంతా లాక్కొని వాడిని బికారిని చేస్తాను.
దేవీ! నన్ను ఆజ్ఞాపించు. సంభవాన్ని అసంభవంగానూ, అసంభవాన్ని సంభవంగానూ చేస్తాను. కాని నీ కోపం మాత్రం విడిచిపెట్టు. ఇంతెందుకు. నేను నా మంత్రులు, పరివారమూ ఈ రాజ్యము అంతా నీ అధీనమే కదా. నీకు అడ్డేముంది. మేమంతా నీ ఆజ్ఞకు బద్ధులమే కదా! ఇంకా ఈ దిగులు ఎందుకు దేవీ. ఇంతకూ నీకు ఏం కావాలో చెప్పు. నీ కోరికను నా ప్రాణాలు ఇచ్చి అయిన సరే నెరవేరుస్తాను.
నేను యజ్ఞయాగములు చేసి సంపాదించిన పుణ్యఫలము మీద ఒట్టుపెట్టు కొని చెబుతున్నాను. నీ కోరిక ఏదో చెప్పు. నెరవేరుస్తాను. ఈ దేశమే నీది. ఈ రాజ్యమే నీది. ఇందులో ఉన్న సమస్త సంపదలు నీవి. నీకు అడ్డేముంది. కోరుకో! నీ ఇష్టం వచ్చినవి కోరుకో!
నీకు మన రాజ్యము ఎంత ఉందో తెలుసు కదా! ఈ భూమి మీద రథచక్రములు ఎంత మేర తిరుగుతాయో అంత భూమి నా అధీనంలో ఉంది. తూర్యు దిక్కున ఉన్న అన్ని రాజ్యములు, సింధు దేశము. సౌవీర దేశము, సౌరాష్ట్ర దేశమూ, దక్షిణమున ఉన్న అన్ని రాజ్యములు, ఇంకా వంగ, అంగ, మగధ, మత్స్య దేశములు, కాశీరాజ్యము, కోసల రాజ్యమూ అన్నీ మన అధీనములు. ఈ రాజ్యములలో ఉన్న సమస్త సంపదలు మన అధీనములు. ఆ సంపదలలో నీకేది కావాలో కోరుకో ఇస్తాను.
ఓ లలనా మణీ! ఇంతకూ నీ దుఃఖ కారణము, భయ కారణము ఏమి. నాకు చెప్పవా. చెబితేనే కదా నాకు తెలిసేది. ఏం జరిగిందో చెప్పకపోతే నేనేం చేయను చెప్పు.” అని సకలవిధాలా అనునయించాడు దశరథుడు.
దశరథుని మాటలు అన్నీ విన్న కైక “ఇనుము బాగా కాలి సమ్మెటదెబ్బలకు అనుకూలంగా ఉంది. మనం ఎలా వంచితే అలా వంగుతుంది.” అని మనసులో అనుకొంది కైక.
ఇప్పుడు తన మనసులోని మాట మెల్ల మెల్లగా నేర్పుగా బయట పెట్టడానికి ఉద్యుక్తురాలయింది కైక.
శ్రీమద్రామాయణము
అయోధ్యా కాండము పదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.
(ఇంతకుముందు సర్గలో మనకు మంధర పాత్ర వచ్చింది. ఈ సర్గలో దశరథుని పాత్ర ప్రాముఖ్యం వహించింది. మంధర కైకేయి దాసి. పుట్టింటి నుండి వచ్చింది. సాధారణంగా మంథర మాటకు విలువ ఇస్తుంది కైక. కాని కైకకు రాముడు అంటే చిన్నప్పటినుండి ఎంతో ప్రేమ, మక్కువ. తన కుమారుడు భరతుని తో పాటుపెంచింది. రామునికి పట్టాభిషేకము అంటే ఎంతో సంతోషించింది. ఆ మాట చెప్పిన మంథరకు బహుమానం కూడా ఇచ్చింది.
కైక దశరథుని భార్య. బాగా చదువుకున్నది. విచక్షణా జ్ఞానం కలది అనుకోవాలి. కాని చెప్పుడు మాటలకు మోసపోయింది. ఒకే విషయం పదే పదే చెప్పడం వల్ల అది నిజం అవుతుంది అంటారు పెద్దలు. రాముడు అయోధ్యలో ఉంటే భరతునికి భవిష్యత్తులేదు అనేమాటను పదే పదే వల్లించింది మంథర. రకరకాలుగా వర్ణించి చెప్పింది. అది దాని ఆలోచన. ఒక దాసి అంతకన్నా ఉన్నతంగా ఎలా ఆలోచించగలదు! కాని ఆ మాటలను గుడ్డిగా నమ్మేసింది కైక.
చెప్పుడు మాటలు వినరాదు అని మనకు అందరికీ తెలుసు. కాని సోదాహరణంగా నిరూపించాడు వాల్మీకి. ఎందరో ఎన్నో చెబుతుంటారు. కాని ప్రతివాడూ తన విచక్షణా జ్ఞానం ఉపయోగించాలి.
ఒకాయన ఆఫీసుకు వెళ్లాడు. ఆయన భార్యకు ఆమె తల్లి హాస్పిటల్ లో చేరిందని ఫోన్ వస్తుంది. ఆమె హడావిడిగా బయటకు వస్తుంది. పక్కింటి రామారావు తన బైక్ మీద అప్పుడే బయటకు వెళు తుంటాడు. హాస్పిటల్ దాకా లిఫ్టుఅడుగుతుంది ఆమె. ఆయన సరే అంటాడు. ఆయన వెనక బైక్ మీద కూర్చుని హాస్పిటలుకు వెళుతుంది. వీళ్లిద్దరూ బైక్ మీద వెళ్లడం ఒక అనుమాన పక్షిచూస్తాడు. దానికి కాస్త మసాలా తగిలించి ఆమె భర్తకు “నీ భార్య ఎవరితోనో తిరుగుతూ ఉంది” అని నూరిపోస్తాడు. వాడు నమ్మేస్తాడు. వ్యవహారం విడాకుల దాకా వెళుతుంది. ఇది సర్వసాధారణం. అతడు కాస్త విచక్షణా జ్ఞానం ఉపయోగించి “నాతో ఇన్నాళ్లు పవిత్రంగా నమ్మకంగా కాపురం చేసిన భార్య ఈనాడు సడన్ గా ఎందుకు పరాయివాడితో తిరుగుతుంది” అని కొన్ని క్షణాలు తర్కించుకుంటే నిజానిజాలు బయటపడతాయి. వాళ్ల కాపురంలో కలతలు రావు. అలాగే “రాముడు నా కుమారుడికి ఇంత ద్రోహం చేస్తాడా. మంథర మాటలలో నిజం ఎంత” అని కైక కొంచెం ఆలోచించి ఉంటే రామాయణం మరొక విధంగా ఉండేది. కాబట్టి చెప్పుడు మాటలు వినడం, తొందరగా నిర్ణయాలు తీసుకోడం ఆత్మహత్యాసదృశం అని మనకు బోధ చేస్తుంది రామాయణం.
తరువాత ఈ సర్గలో దశరథుని పాత్ర. దశరథుడు అయోధ్యకు మహారాజు. ఎన్నో యజ్ఞములు యాగములు చేసాడు. వసిష్ఠుని పురోహితునిగా కలవాడు. జ్ఞానవృద్ధుడు వయోవృద్ధుడు. ఆయన భార్య కైక. మూడో భార్య కైక మీద ఆయనకు అధికమైన ప్రేమ ఉందని, ఆయనకు ముద్దులభార్యఅని నానుడి. కాని ఆ విషయం మనకు ఎక్కడా కనపడలేదు. పైగా పాయసం పంచడంలో కైకకు ఎనిమిదవ వంతు మాత్రమే ఇచ్చాడు దశరథుడు. అదీ ఒక వంతు మాత్రం ఇచ్చాడు. రెండవ ఎనిమిదవ భాగం సుమిత్రకు ఇచ్చాడు. దశరథునికి కైక మీద అత్యధిక ప్రేమ ఉంటే సగభాగం ఇచ్చి ఉండేవాడు కదా! కాబట్టి కైక మీద దశరథునికి అధికమైన ప్రేమ ఉంది అనడానికి ఆధారాలు లేవు.
కాని రాబోవు సర్గలలో ఒక విషయం ప్రస్ఫుటంగా అర్థం. అవుతుంది. కౌసల్య పేరుకు పట్టపు రాణి అయినా ఆమెను దశరథుడు నిరాదరించాడు. ఏనాడూ తక్కిన భార్యలతో సమానంగా చూడలేదు. అందుకే కౌసల్య సవతులందరిలో నిరాదరణకు గురి అయింది. రాముడు వనవాసమునకు వెళితో సవతులు తనను బతకనివ్వరు అనివాపోతుంది. దీనిని బట్టి దశరథుడు కైకను ఎక్కువగా ఆదరించాడు అని మనకు తెలుస్తూ ఉంది.
అలాంటి కైక మంథర మాటలు విని కోపగృహంలో పడుకొని ఉంది. దశరథుడు కోపగృహం ప్రవేశించాడు. కోపకారణం అడిగాడు. ఆమె బదులు చెప్పలేదు. అప్పుడు మొదలెట్టాడు. ఈ రాజ్యం నీది అన్నాడు. నేను, నా పరివారము, నీకు దాసులము అన్నాడు. చంపదగని వాడినికూడా నువ్వు కావాలంటే చంపుతాను అన్నాడు. చంపదగిన వాడిని కూడా నువ్వు ఊ అంటే వదిలేస్తాను అన్నాడు. (అంటే నీ కోసం హంతకులను వదిలేస్తాను, నిరపరాధులను ఉ రితీస్తాను అని అర్థం). నువ్వు ఏం కావాలంటే అది ఇస్తాను అంటాడు.
దశరథుడు లాంటి చక్రవర్తి తన భార్య కేవలం కోపంతో ఉంది అన్నంత మాత్రాన ఇంత దిగజారిపోవాలా! పోనీ అన్నీ అబద్ధాలు చెప్పాడు అని అనుకుంటే ఆయన సత్యసంధుడు అని పేరు. మరి వాల్మీకి ఎందుకు అలా రాసాడు? కారణం స్పష్టంగా కనపడుతూనే ఉంది. ఎంతటివారలైనా కాంత దాసులే. రాబోవు కాలంలో జరగబోయే పరిణామాన్ని త్రేతాయుగంలోనే చెప్పాడు వాల్మీకి. నేడు మనం ఎన్నో స్త్రీ సంబంధమైన స్కాండల్సు వింటున్నాము. చూస్తున్నాము. ఎంతటి గొప్పవారైనా తాను కోరుకున్న స్త్రీ ముందు దాసోహం అంటారు. సమస్తం ధారపోయడానికి సిద్ధపడతారు . వాళ్లు చదువుకున్న ఉన్నత విద్యలు, పదవులు, సంస్కారము, ఏవీ గుర్తుకురావు. అడ్డురావు. సమస్తం ఆమెతోడిదే లోకం అన్నట్టు ప్రవర్తిస్తారు. చివరకు ఊబిలో పడిపోతారు. అలాంటి ప్రమాదాల నుండి జాగ్రత్త పడమని వాల్మీకి ఈ సంఘటనల ద్వారా మనకు హెచ్చరిక చేస్తున్నాడు.
అలాగే అహల్య వృత్తాంతం కూడా. అహల్య తన భర్త గౌతముని కాకుండా పరాయి పురుషుడితో కామక్రీడలు కొనసాగించింది. ఫలితం వెంటనే అనుభవించింది. కొన్ని వందల సంవత్సరాల పాటు అచేనంగా ఒంటరిగా దుమ్ము ధూళిలో పడి ఉంది. ఈరోజుల్లో కూడా పరాయి పురుషుడి మోజులో పడిన స్త్రీలు, స్వంత భర్తను, పిల్లలను హతమార్చడం లాంటి సంఘటనలు వింటున్నాము. వెంటనే కటకటాల పాలవుతున్నారు. శిక్షలు అనుభవిస్తున్నారు.
ఈ రోజుల్లో స్త్రీలు పతివ్రతలు కానక్కరలేదు. కనీసం భర్తకు విధేయతగా ఉంటేచాలు. సంసారం సాఫీగా గడిచిపోతుంది. ఈ సందేశాన్ని మనకు అహల్య వృత్తాంతం ద్వారా అందించాడు వాల్మీకి.
రామాయణం కేవలం ఆధ్యాత్మిక కావ్యంగా కాకుండా ఒక సామాజిక గ్రంధంగా చదవగలిగితే ఇలాంటి సూక్తులు ఎన్నో మనకు మన దైనందిన జీవితంలో ఉపకరిస్తాయి అని నా భావన.)