Balakanda Sarga 1 In Telugu – బాలకాండ ప్రథమః సర్గః

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. వాల్మీకి మహర్షి బాలకాండంలో రాముని జీవిత చరిత్రను అద్భుతమైన రీతిలో చూపించారు. రాముని బాల్య కథనం, ఆత్మవిశ్వాసం, సహజ సమానులు, భర్యలకు ప్రేమ మరియు సహాయకుల మధ్య వివిధ సమానాలను వర్ణించారు. రాజు దశరథుడు అయోధ్యలో రాజ్యం సంపాదించిన విషయంలో చిత్రీకరించారు. ఈ ప్రసంగంలో రాముని జన్మకు సంబంధించిన అనేక అద్భుత ఘటనలు చేరుకున్నాయి.

నారదవాక్యమ్ (సంక్షేప రామాయణం)

తపఃస్వాధ్యాయనిరతం తపస్వీ వాగ్విదాం వరమ్ |
నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్మునిపుంగవమ్ ||

1

కోఽన్వస్మిన్సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ |
ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః ||

2

చారిత్రేణ చ కో యుక్తః సర్వభూతేషు కో హితః |
విద్వాన్ కః కః సమర్థశ్చ కశ్చైకప్రియదర్శనః ||

3

ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కోఽనసూయకః |
కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే ||

4

ఏతదిచ్ఛామ్యహం శ్రోతుం పరం కౌతూహలం హి మే |
మహర్షే త్వం సమర్థోఽసి జ్ఞాతుమేవంవిధం నరమ్ ||

5

శ్రుత్వా చైతత్త్రిలోకజ్ఞో వాల్మీకేర్నారదో వచః |
శ్రూయతామితి చామంత్ర్య ప్రహృష్టో వాక్యమబ్రవీత్ ||

6

బహవో దుర్లభాశ్చైవ యే త్వయా కీర్తితా గుణాః |
మునే వక్ష్యామ్యహం బుద్ధ్వా తైర్యుక్తః శ్రూయతాం నరః ||

7 [బుద్ధ్యా]

ఇక్ష్వాకువంశప్రభవో రామో నామ జనైః శ్రుతః |
నియతాత్మా మహావీర్యో ద్యుతిమాన్ధృతిమాన్వశీ ||

8

బుద్ధిమాన్నీతిమాన్వాగ్మీ శ్రీమాన్ శత్రునిబర్హణః |
విపులాంసో మహాబాహుః కంబుగ్రీవో మహాహనుః ||

9

మహోరస్కో మహేష్వాసో గూఢజత్రురరిందమః |
ఆజానుబాహుః సుశిరాః సులలాటః సువిక్రమః ||

10

సమః సమవిభక్తాంగః స్నిగ్ధవర్ణః ప్రతాపవాన్ |
పీనవక్షా విశాలాక్షో లక్ష్మీవాన్ శుభలక్షణః ||

11

ధర్మజ్ఞః సత్యసంధశ్చ ప్రజానాం చ హితే రతః |
యశస్వీ జ్ఞానసంపన్నః శుచిర్వశ్యః సమాధిమాన్ ||

12

ప్రజాపతిసమః శ్రీమాన్ ధాతా రిపునిషూదనః |
రక్షితా జీవలోకస్య ధర్మస్య పరిరక్షితా ||

13

రక్షితా స్వస్య ధర్మస్య స్వజనస్య చ రక్షితా |
వేదవేదాంగతత్త్వజ్ఞో ధనుర్వేదే చ నిష్ఠితః ||

14

సర్వశాస్త్రార్థతత్త్వజ్ఞః స్మృతిమాన్ప్రతిభానవాన్ |
సర్వలోకప్రియః సాధురదీనాత్మా విచక్షణః ||

15

సర్వదాభిగతః సద్భిః సముద్ర ఇవ సింధుభిః |
ఆర్యః సర్వసమశ్చైవ సదైవ ప్రియదర్శనః ||

16

స చ సర్వగుణోపేతః కౌసల్యానందవర్ధనః |
సముద్ర ఇవ గాంభీర్యే ధైర్యేణ హిమవానివ ||

17

విష్ణునా సదృశో వీర్యే సోమవత్ప్రియదర్శనః |
కాలాగ్నిసదృశః క్రోధే క్షమయా పృథివీసమః ||

18

ధనదేన సమస్త్యాగే సత్యే ధర్మ ఇవాపరః |
తమేవంగుణసంపన్నం రామం సత్యపరాక్రమమ్ ||

19

జ్యేష్ఠం శ్రేష్ఠగుణైర్యుక్తం ప్రియం దశరథః సుతమ్ |
ప్రకృతీనాం హితైర్యుక్తం ప్రకృతిప్రియకామ్యయా ||

20

యౌవరాజ్యేన సంయోక్తుమైచ్ఛత్ప్రీత్యా మహీపతిః |
తస్యాభిషేకసంభారాన్దృష్ట్వా భార్యాఽథ కైకయీ ||

21

పూర్వం దత్తవరా దేవీ వరమేనమయాచత |
వివాసనం చ రామస్య భరతస్యాభిషేచనమ్ ||

22

స సత్యవచనాద్రాజా ధర్మపాశేన సంయతః | [చైవ]
వివాసయామాస సుతం రామం దశరథః ప్రియమ్ ||

23

స జగామ వనం వీరః ప్రతిజ్ఞామనుపాలయన్ |
పితుర్వచననిర్దేశాత్కైకేయ్యాః ప్రియకారణాత్ ||

24

తం వ్రజంతం ప్రియో భ్రాతా లక్ష్మణోఽనుజగామ హ |
స్నేహాద్వినయసంపన్నః సుమిత్రానందవర్ధనః ||

25

భ్రాతరం దయితో భ్రాతుః సౌభ్రాత్రమనుదర్శయన్ |
రామస్య దయితా భార్యా నిత్యం ప్రాణసమా హితా ||

26

జనకస్య కులే జాతా దేవమాయేవ నిర్మితా |
సర్వలక్షణసంపన్నా నారీణాముత్తమా వధూః ||

27

సీతాప్యనుగతా రామం శశినం రోహిణీ యథా |
పౌరైరనుగతో దూరం పిత్రా దశరథేన చ ||

28

శృంగిబేరపురే సూతం గంగాకూలే వ్యసర్జయత్ |
గుహమాసాద్య ధర్మాత్మా నిషాదాధిపతిం ప్రియమ్ ||

29

గుహేన సహితో రామో లక్ష్మణేన చ సీతయా |
తే వనేన వనం గత్వా నదీస్తీర్త్వా బహూదకాః ||

30

చిత్రకూటమనుప్రాప్య భరద్వాజస్య శాసనాత్ |
రమ్యమావసథం కృత్వా రమమాణా వనే త్రయః ||

31

దేవగంధర్వసంకాశాస్తత్ర తే న్యవసన్సుఖమ్ |
చిత్రకూటం గతే రామే పుత్రశోకాతురస్తథా ||

32

రాజా దశరథః స్వర్గం జగామ విలపన్సుతమ్ |
మృతే తు తస్మిన్భరతో వసిష్ఠప్రముఖైర్ద్విజైః ||

33

నియుజ్యమానో రాజ్యాయ నైచ్ఛద్రాజ్యం మహాబలః |
స జగామ వనం వీరో రామపాదప్రసాదకః ||

34

గత్వా తు సుమహాత్మానం రామం సత్యపరాక్రమమ్ | [స మహా.]
అయాచద్భ్రాతరం రామమార్యభావపురస్కృతః ||

35

త్వమేవ రాజా ధర్మజ్ఞ ఇతి రామం వచోఽబ్రవీత్ |
రామోఽపి పరమోదారః సుముఖః సుమహాయశాః ||

36

న చైచ్ఛత్పితురాదేశాద్రాజ్యం రామో మహాబలః |
పాదుకే చాస్య రాజ్యాయ న్యాసం దత్త్వా పునః పునః ||

37

నివర్తయామాస తతో భరతం భరతాగ్రజః |
స కామమనవాప్యైవ రామపాదావుపస్పృశన్ ||

38

నందిగ్రామేఽకరోద్రాజ్యం రామాగమనకాంక్షయా |
గతే తు భరతే శ్రీమాన్సత్యసంధో జితేంద్రియః ||

39

రామస్తు పునరాలక్ష్య నాగరస్య జనస్య చ |
తత్రాగమనమేకాగ్రో దండకాన్ప్రవివేశ హ ||

40

ప్రవిశ్య తు మహారణ్యం రామో రాజీవలోచనః |
విరాధం రాక్షసం హత్వా శరభంగం దదర్శ హ ||

41

సుతీక్ష్ణం చాప్యగస్త్యం చ అగస్త్యభ్రాతరం తథా |
అగస్త్యవచనాచ్చైవ జగ్రాహైంద్రం శరాసనమ్ ||

42

ఖడ్గం చ పరమప్రీతస్తూణీ చాక్షయసాయకౌ |
వసతస్తస్య రామస్య వనే వనచరైః సహ ||

43

ఋషయోఽభ్యాగమన్సర్వే వధాయాసురరక్షసామ్ |
స తేషాం ప్రతిశుశ్రావ రాక్షసానాం తథా వనే ||

44

ప్రతిజ్ఞాతశ్చ రామేణ వధః సంయతి రక్షసామ్ |
ఋషీణామగ్నికల్పానాం దండకారణ్యవాసినామ్ ||

45

తేన తత్రైవ వసతా జనస్థాననివాసినీ |
విరూపితా శూర్పణఖా రాక్షసీ కామరూపిణీ ||

46

తతః శూర్పణఖావాక్యాదుద్యుక్తాన్సర్వరాక్షసాన్ |
ఖరం త్రిశిరసం చైవ దూషణం చైవ రాక్షసమ్ ||

47

నిజఘాన రణే రామస్తేషాం చైవ పదానుగాన్ |
వనే తస్మిన్నివసతా జనస్థాననివాసినామ్ ||

48

రక్షసాం నిహతాన్యాసన్సహస్రాణి చతుర్దశ |
తతో జ్ఞాతివధం శ్రుత్వా రావణః క్రోధమూర్ఛితః ||

49

సహాయం వరయామాస మారీచం నామ రాక్షసమ్ |
వార్యమాణః సుబహుశో మారీచేన స రావణః ||

50

న విరోధో బలవతా క్షమో రావణ తేన తే |
అనాదృత్య తు తద్వాక్యం రావణః కాలచోదితః ||

51

జగామ సహమారీచస్తస్యాశ్రమపదం తదా |
తేన మాయావినా దూరమపవాహ్య నృపాత్మజౌ ||

52

జహార భార్యాం రామస్య గృధ్రం హత్వా జటాయుషమ్ |
గృధ్రం చ నిహతం దృష్ట్వా హృతాం శ్రుత్వా చ మైథిలీమ్ ||

53

రాఘవః శోకసంతప్తో విలలాపాకులేంద్రియః |
తతస్తేనైవ శోకేన గృధ్రం దగ్ధ్వా జటాయుషమ్ ||

54

మార్గమాణో వనే సీతాం రాక్షసం సందదర్శ హ |
కబంధం నామ రూపేణ వికృతం ఘోరదర్శనమ్ ||

55

తం నిహత్య మహాబాహుర్దదాహ స్వర్గతశ్చ సః |
స చాఽఽస్య కథయామాస శబరీం ధర్మచారిణీమ్ ||

56

శ్రమణీం ధర్మనిపుణామభిగచ్ఛేతి రాఘవమ్ |
సోఽభ్యగచ్ఛన్మహాతేజాః శబరీం శత్రుసూదనః ||

57

శబర్యా పూజితః సమ్యగ్రామో దశరథాత్మజః |
పంపాతీరే హనుమతా సంగతో వానరేణ హ ||

58

హనుమద్వచనాచ్చైవ సుగ్రీవేణ సమాగతః |
సుగ్రీవాయ చ తత్సర్వం శంసద్రామో మహాబలః ||

59

ఆదితస్తద్యథావృత్తం సీతాయాశ్చ విశేషతః |
సుగ్రీవశ్చాపి తత్సర్వం శ్రుత్వా రామస్య వానరః ||

60

చకార సఖ్యం రామేణ ప్రీతశ్చైవాగ్నిసాక్షికమ్ |
తతో వానరరాజేన వైరానుకథనం ప్రతి ||

61

రామాయావేదితం సర్వం ప్రణయాద్దుఃఖితేన చ |
ప్రతిజ్ఞాతం చ రామేణ తదా వాలివధం ప్రతి ||

62

వాలినశ్చ బలం తత్ర కథయామాస వానరః |
సుగ్రీవః శంకితశ్చాసీన్నిత్యం వీర్యేణ రాఘవే ||

63

రాఘవప్రత్యయార్థం తు దుందుభేః కాయముత్తమమ్ |
దర్శయామాస సుగ్రీవో మహాపర్వత సన్నిభమ్ ||

64

ఉత్స్మయిత్వా మహాబాహుః ప్రేక్ష్య చాస్థి మహాబలః |
పాదాంగుష్ఠేన చిక్షేప సంపూర్ణం దశయోజనమ్ ||

65

బిభేద చ పునః సాలాన్సప్తైకేన మహేషుణా |
గిరిం రసాతలం చైవ జనయన్ప్రత్యయం తదా ||

66

తతః ప్రీతమనాస్తేన విశ్వస్తః స మహాకపిః |
కిష్కింధాం రామసహితో జగామ చ గుహాం తదా ||

67

తతోఽగర్జద్ధరివరః సుగ్రీవో హేమపింగళః |
తేన నాదేన మహతా నిర్జగామ హరీశ్వరః ||

68

అనుమాన్య తదా తారాం సుగ్రీవేణ సమాగతః |
నిజఘాన చ తత్రైనం శరేణైకేన రాఘవః ||

69

తతః సుగ్రీవవచనాద్ధత్వా వాలినమాహవే |
సుగ్రీవమేవ తద్రాజ్యే రాఘవః ప్రత్యపాదయత్ ||

70

స చ సర్వాన్సమానీయ వానరాన్వానరర్షభః |
దిశః ప్రస్థాపయామాస దిదృక్షుర్జనకాత్మజామ్ ||

71

తతో గృధ్రస్య వచనాత్సంపాతేర్హనుమాన్బలీ |
శతయోజనవిస్తీర్ణం పుప్లువే లవణార్ణవమ్ ||

72

తత్ర లంకాం సమాసాద్య పురీం రావణపాలితామ్ |
దదర్శ సీతాం ధ్యాయంతీమశోకవనికాం గతామ్ ||

73

నివేదయిత్వాఽభిజ్ఞానం ప్రవృత్తిం చ నివేద్య చ |
సమాశ్వాస్య చ వైదేహీం మర్దయామాస తోరణమ్ ||

74

పంచ సేనాగ్రగాన్హత్వా సప్త మంత్రిసుతానపి |
శూరమక్షం చ నిష్పిష్య గ్రహణం సముపాగమత్ ||

75

అస్త్రేణోన్ముక్తమాత్మానం జ్ఞాత్వా పైతామహాద్వరాత్ |
మర్షయన్రాక్షసాన్వీరో యంత్రిణస్తాన్యదృచ్ఛయా ||

76

తతో దగ్ధ్వా పురీం లంకామృతే సీతాం చ మైథిలీమ్ |
రామాయ ప్రియమాఖ్యాతుం పునరాయాన్మహాకపిః ||

77

సోఽభిగమ్య మహాత్మానం కృత్వా రామం ప్రదక్షిణమ్ |
న్యవేదయదమేయాత్మా దృష్టా సీతేతి తత్త్వతః ||

78

తతః సుగ్రీవసహితో గత్వా తీరం మహోదధేః |
సముద్రం క్షోభయామాస శరైరాదిత్యసన్నిభైః ||

79

దర్శయామాస చాత్మానం సముద్రః సరితాం పతిః |
సముద్రవచనాచ్చైవ నలం సేతుమకారయత్ ||

80

తేన గత్వా పురీం లంకాం హత్వా రావణమాహవే |
రామః సీతామనుప్రాప్య పరాం వ్రీడాముపాగమత్ ||

81

తామువాచ తతో రామః పరుషం జనసంసది |
అమృష్యమాణా సా సీతా వివేశ జ్వలనం సతీ ||

82

తతోఽగ్నివచనాత్సీతాం జ్ఞాత్వా విగతకల్మషామ్ |
బభౌ రామః సంప్రహృష్టః పూజితః సర్వదైవతైః ||

83

కర్మణా తేన మహతా త్రైలోక్యం సచరాచరమ్ |
సదేవర్షిగణం తుష్టం రాఘవస్య మహాత్మనః ||

84

అభిషిచ్య చ లంకాయాం రాక్షసేంద్రం విభీషణమ్ |
కృతకృత్యస్తదా రామో విజ్వరః ప్రముమోద హ ||

85

దేవతాభ్యో వరం ప్రాప్య సముత్థాప్య చ వానరాన్ |
అయోధ్యాం ప్రస్థితో రామః పుష్పకేణ సుహృద్వృతః ||

86

భరద్వాజాశ్రమం గత్వా రామః సత్యపరాక్రమః |
భరతస్యాంతికం రామో హనూమంతం వ్యసర్జయత్ ||

87

పునరాఖ్యాయికాం జల్పన్సుగ్రీవసహితశ్చ సః |
పుష్పకం తత్సమారుహ్య నందిగ్రామం యయౌ తదా ||

88

నందిగ్రామే జటాం హిత్వా భ్రాతృభిః సహితోఽనఘః |
రామః సీతామనుప్రాప్య రాజ్యం పునరవాప్తవాన్ ||

89

ప్రహృష్టముదితో లోకస్తుష్టః పుష్టః సుధార్మికః | [ప్రహృష్టో]
నిరామయో హ్యరోగశ్చ దుర్భిక్షభయవర్జితః ||

90

న పుత్రమరణం కించిద్ద్రక్ష్యంతి పురుషాః క్వచిత్ |
నార్యశ్చావిధవా నిత్యం భవిష్యంతి పతివ్రతాః ||

91

న చాగ్నిజం భయం కించిన్నాప్సు మజ్జంతి జంతవః |
న వాతజం భయం కించిన్నాపి జ్వరకృతం తథా ||

92

న చాపి క్షుద్భయం తత్ర న తస్కరభయం తథా |
నగరాణి చ రాష్ట్రాణి ధనధాన్యయుతాని చ ||

93

నిత్యం ప్రముదితాః సర్వే యథా కృతయుగే తథా |
అశ్వమేధశతైరిష్ట్వా తథా బహుసువర్ణకైః ||

94

గవాం కోట్యయుతం దత్వా విద్వద్భ్యో విధిపూర్వకమ్ |
అసంఖ్యేయం ధనం దత్వా బ్రాహ్మణేభ్యో మహాయశాః ||

95

రాజవంశాన్ శతగుణాన్ స్థాపయిష్యతి రాఘవః |
చాతుర్వర్ణ్యం చ లోకేఽస్మిన్ స్వే స్వే ధర్మే నియోక్ష్యతి ||

96

దశవర్షసహస్రాణి దశవర్షశతాని చ |
రామో రాజ్యముపాసిత్వా బ్రహ్మలోకం ప్రయాస్యతి ||

97

ఇదం పవిత్రం పాపఘ్నం పుణ్యం వేదైశ్చ సమ్మితమ్ |
యః పఠేద్రామచరితం సర్వపాపైః ప్రముచ్యతే ||

98

ఏతదాఖ్యానమాయుష్యం పఠన్రామాయణం నరః |
సపుత్రపౌత్రః సగణః ప్రేత్య స్వర్గే మహీయతే ||

99

పఠన్ ద్విజో వాగృషభత్వమీయా-
-త్స్యాత్ క్షత్రియో భూమిపతిత్వమీయాత్ |
వణిగ్జనః పణ్యఫలత్వమీయా-
-జ్జనశ్చ శూద్రోఽపి మహత్త్వమీయాత్ ||

100

వాల్మీకి మహర్షి దేవర్షి నారదుడిని ఇలా అడిగాడు.

“ఓ నారద మహర్షీ! ఈ భూలోకంలో మంచి గుణములు కలవాడు, పరాక్ర మవంతుడు, ధర్మాత్ముడు, ఎదుటి వారి ఎడల ఆదర భావము కలవాడు, చేసినమేలు మరువని వాడు, ఎల్లప్పుడూ సత్యమునే పలుకువాడు, గట్టి సంకల్పము కలవాడు, అనుకున్న పని నెరవేర్చే గుణము కలవాడు, ఈ సద్గుణములు కలవాడు ఎవరైనా ఉన్నారా!

అంతేకాదు, మంచి నడవడి కలవాడు, సర్వభూతములయందు ప్రీతి కలవాడు, అన్ని విద్యలు నేర్చినవాడు, తనకు అసాధ్యము అంటూ లేదు అని నిరూపించినవాడు, ఎల్లప్పుడూ ఆనందంతో తొణికిస లాడేవాడు, అటువంటి వ్యక్తి ఎవరున్నారు?

ఓ మహర్షీ! మొక్కవోని ధైర్యము కలవాడు, కోపము అంటే ఎరుగని వాడు, మంచి తేజస్సుతో విరాజిల్లేవాడు, అసూయ, ద్వేషములను దగ్గరకు రానీయని వాడు, యుద్దరంగంలో దిగితే దేవతలకు కూడా భయపడని వాడు,. ఇటువంటి సద్గుణములు కల నరుడిని (మానవుడిని) గురించి వినవలెనని నాకు చాలా కుతూహలముగా ఉంది.

దయచేసి నాకు వివరించండి. ఎందుకంటే నీవు ముల్లోకములు సంచరిస్తూ ఉంటావు. అందువలన నీకు తెలిసే అవకాశం ఉంది. కాబట్టి అటువంటి లోకోత్తర పురుషుడిని గురించి నాకు తెలియజేయండి.” అని వాల్మీకి మహర్షి నారదుని అడిగాడు.

అప్పుడు నారదుడు వాల్మీకితో ఇలా అన్నాడు. “ ఓ మహర్షీ! నీవు చెప్పిన గుణములు సామాన్య మానవులలో సాధారణంగా కనిపించవు. ఎందుకంటే అవి అసాధారణము లైన దుర్లభములైన గుణములు. కాని అట్టి గుణములు కలిగిన ఒక మహాపురుషుడు ఉన్నాడు. ఆయన గురించి చెబుతాను. విను.

ఈ భూమండలంలో ఇక్ష్వాకు వంశము ప్రసిద్ధి చెందింది. ఆ వంశములో రాముడు అనే పేరు గల ఒక మహా పురుషుడు జన్మించాడు. ఆ రాముడు జనుల అందరి చేత కీర్తింపబడ్డాడు. ఆ రాముడు స్థిరమైన బుద్ధి కలవాడు. మహావీరుడు. మంచి ప్రకాశము కలవాడు. అసాధారణమైన ధైర్యము కలవాడు.

అంతేకాదు ఆ రాముడు బుద్ధిమంతుడు. నీతిమంతుడు. సకల శాస్త్ర పారంగతుడు. శ్రీమంతుడు. రాముడు శత్రు భయంకరుడు. ఆజానుబాహుడు. స్ఫురద్రూపి. అందగాడు. విశాలమైన వక్షస్థలము కలవాడు. రాముని ధనుస్సు చాలా గొప్పది. శత్రువులను నాశనం చేస్తుంది. రాముడు అంత పొట్టి కాదు, అని చెప్పి మరీ పొడుగు కాదు. రామునికి అన్ని అవయవములు సమపాళ్లలో ఉన్నాయి. సకల శుభ లక్షణ సమన్వితుడు రాముడు.

రాముడు సకల ధర్మములు తెలిసిన వాడు. సత్యమునే పలికెడు వాడు. ఎల్లప్పుడూ ప్రజల హితమును కోరేవాడు. మంచి యశస్వి. జ్ఞాన సంపన్నుడు. ఎల్లప్పుడూ శుచిగా ఉంటాడు. శరణు కోరిన వారిని రక్షించేవాడు. ఆ రాముడు ప్రజాపతితో సమానమైన వాడు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ పట్ల ఆసక్తి కలవాడు. ధర్మాన్ని ఎల్లప్పుడూ పరిరక్షించేవాడు.

రాముడు తనను తాను రక్షించుకుంటూ, తన వారిని కూడా రక్షించేవాడు. రాముడు వేదములు వేదాంగములు చదివిన వాడు. ధనుర్వేదములో దిట్ట. రాముడు సకల శాస్త్రముల అర్థములను తెలిసిన వాడు. మంచి జ్ఞాపక శక్తి కలవాడు. మంచి ప్రతిభావంతుడు. సర్వలోక ప్రియుడు. సాధుజనుల యందు, దీనుల యందు దయగలవాడు. నదులన్నీ సముద్రము చేరినట్టే, సత్పురుషులందరూ రాముని వద్దకు చేరుతారు. రాముడు అందరినీ సమానంగా ఆదరిస్తాడు. రాముడు సముద్రము వలె గంభీరంగా ఉంటాడు. హిమాచలము వలె ధైర్యంగా నిలబడతాడు.

ఇటువంటి సకల సద్గుణ సంపన్నుడు కౌసల్యకు పుత్రుడిగా జన్మించాడు. ఆ రాముడు పరాక్రమములో విష్ణువుతో సమానుడు. చంద్రుడిని చూస్తే ఎంత ఆనందకరంగా ఉంటుందో రాముని చూస్తే కూడా అంతే ఆనందం కలుగుతుంది. కాని రాముడు కోపం వస్తే ప్రళయాగ్నిస్వరూపుడు. ఇంకా రాముడు ఓర్పులో భూదేవిని, దానములో కుబేరుని, సత్యము పలుకుటలో ధర్మదేవతను మించినవాడు.

అటువంటి రామునికి తండ్రి దశరధుడు. దశరధుడు సకలగుణాభిరాముడైన రామునికి యౌవరాజ్య పట్టాభిషేకం చేయాలని సంకల్పించాడు. ఇది దశరధుని భార్య అయిన కైకకు నచ్చలేదు. ఆ సమయంలో ఆమె దశరధుని తనకు పూర్వము ఇస్తానన్న రెండు వరములు ఇమ్మని కోరింది. ఆ రెండు వరములలో ఒకటి రాముడిని రాజ్యము నుండి వెళ్లగొట్టడం, రెండవది తన కుమారుడైన భరతునికి పట్టాభిషేకం జరగడం. మాట తప్పని, తప్పలేని దశరధుడు రాముని వనవాసమునకు వెళ్లమని చెప్పాడు. తల్లితండ్రుల మాటలను శిరసావహించి, రాముడు రాజ్యము విడిచి అరణ్యములకు వెళ్లాడు.

రాముని తమ్ముడు లక్ష్మణుడు. అన్న రాముని విడిచి క్షణం కూడా ఉండలేడు. అందుకని లక్ష్మణుడు కూడా రాముని వెంట అరణ్యము లకు వెళ్లాడు. రాముని భార్య సీత. రామునికి ప్రాణసమాను రాలు. ఆమె జనక మహారాజు కుమార్తె. సర్వలక్షణ సంపన్న. నారీలోకములో ఉ త్తమురాలు. చంద్రుని అనుసరించి రోహిణి ఉన్నట్టుగా, రాముని విడిచి ఉండలేక, సీత కూడా రాముని వెంట అడవులకు వెళ్లింది.

రాముడు, లక్ష్మణుడు సీత అడవులకు వెళుతుంటే అయోధ్య ప్రజలు రామునితో పాటు గంగానది దాకా వచ్చారు. తరువాత రాముని ఆదేశము మేరకు అయోధ్యకు మరలిపోయారు. రాముడు, సీత, లక్ష్మణుడు ఆ రాత్రికి శృంగిభేరపురములో ఉన్న గుహుడు అనే నిషాదుడిని కలుసుకున్నారు. తరువాత రాముడు తన సారధిని రధమును వెనక్కు తీసుకొని వెళ్ల మని పంపివేసాడు.

మరునాడు వారు గంగానదిని దాటారు. ఒక వనమునుండి మరొక వనమునకుపోతూ, భారద్వాజమహర్షి ఆదేశము మేరకు చిత్రకూటము అను ప్రదేశమునకు చేరుకున్నారు. అక్కడ ఒక పర్ణశాలను నిర్మించుకున్నారు. అక్కడ ఏ చీకూ చింతా లేకుండా హాయిగా నివసిస్తున్నారు.

ఇక్కడ అయోధ్యలో ఉన్న దశరధుడు పుత్రవియోగము తట్టుకోలేక స్వర్గస్థుడయ్యాడు. దశరధుని మరణం తరువాత భరతుని రాజ్యాభిషిక్తుని కమ్మని వసిష్టుడు మొదలగు వారుకోరారు. కాని భరతుడు ఒప్పుకొన లేదు. రాముని ఆజ్ఞ కొరకు భరతుడు రాముడు ఉన్న చోటికి వెళ్లాడు. రామునికి తండ్రి మరణ వార్త తెలిపి, తిరిగి అయోధ్యకు వచ్చి రాజ్యము స్వీకరించమని కోరాడు.

ధర్మాత్ముడైన రాముడు తండ్రి ఆజ్ఞ పాలించడం తన ధర్మమని, రాజ్యపాలనకు ఒప్పుకొనలేదు. రాముడు తన పాదుకలను భరతునికి ఇచ్చాడు. తనకు బదులుగా సింహాసనము మీద వాటిని ఉంచమన్నాడు. తగు మాటలు చెప్పి భరతుని వెనక్కు పంపివేసాడు. భరతుడు రామ పాదుకలను భక్తితో స్వీకరించి, అయోధ్య వెలుపల ఉన్న నంది గ్రామమునకు వెళ్లాడు. అక్కడు రాముని పాదుకలను ఉంచాడు. రాముని ఆగమనమును కోరుకుంటూ అక్కడి నుండి రాజ్యపాలన సాగించాడు.

తరువాత రాముడు దండకారణ్యము ప్రవేశించాడు. అక్కడ నివసిస్తున్న విరాధుడు అనే రాక్షసుని చంపాడు. శరభంగ మహర్షిని, సుతీక్ష మహర్షిని, అగస్త్య మహర్షిని, ఆయన భ్రాతను సందర్శించాడు. ఆ ప్రకారంగా అరణ్యములో నివసించుచున్న రాముని అక్కడ ఉన్న మునులు చూడడానికి వచ్చారు. తమకు రాక్షస బాధ ఎక్కువగా ఉ న్నదని, ఆరాక్షసులను సంహరించి తమకు రక్షణ కల్పించమని రాముని కోరారు. తాను రాక్షస సంహారము చేస్తాను అని రాముడు ఆ ఋషులకు మాట ఇచ్చాడు.

ఆ దండకారణ్యములో రావణుని సేనలు ఉన్నాయి. రావణుని చెల్లెలు పేరు శూర్పణఖ. ఆమె కామ రూపిణి. ఆమె రాముని కామించింది. రాముడు ఆమె ముక్కు చెవులు కోసి విరూపిగా చేసాడు. శూర్పణఖ వెళ్లి రావణుని సైన్యాధి పతులైన ఖర, దూషణ, త్రిశిరులకు తనకు జరిగిన అవమానము గురించి చెప్పింది.

వారందరూ రాముని మీదికి యుద్ధానికి వచ్చారు. రాముడు వారితో యుద్ధము చేసి వారినందరినీ సంహరించాడు. ఆ ప్రకారంగా రాముడు తాను దండకారణ్యము లో ఉన్నపుడు జనస్థానములో నివసించుచున్న రాక్షసులను 14,000 మందిని సంహరించాడు.

ఈ వార్త రావణాసురుడికి తెలిసింది. అతనికి కోపం వచ్చింది. తనకు సాయం చెయ్యమని మారీచుడు అనే రాక్షసుని కోరాడు. కాని మారీచుడు ఒప్పుకొనలేదు. ఖర, దూషణాది రాక్షసవీరులను సంహరించిన రాముడు వంటి మహావీరునితో వైరము పెట్టుకోవద్దని హితవు చెప్పాడు. కాని రావణుడు వినలేదు. మారీచుని బలవంతంగా ఒప్పించాడు.

మారీచుని వెంటబెట్టుకొని రావణుడు రాముడు ఉండే ఆశ్రమమునకు వెళ్లాడు. మారీచుని సాయముతో రాముని, లక్ష్మణుని దూరంగా పంపాడు. మాయోపాయంతో రావణుడు సీతను అపహరించాడు. అడ్డు వచ్చిన జటాయువును చంపాడు.

రామలక్ష్మణులు ఆశ్రమమునకు తిరిగి వచ్చారు. సీత కనపడలేదు. సీతను వెదుకుతుంటే జటాయువు కనిపించాడు. సీతను రావణుడు అపహరించాడు అని తెలుసుకున్నారు. జటాయువుకు దహన సంస్కారములు చేసారు. తరువాత సీతను వెదుకుతూ అడవిలో తిరుగుతున్నారు. కబంధుడు అనే రాక్షసుని చూచారు. తమకు అపకారము చేయబోయిన కబంధుని చంపి అతనికి శాపవిముక్తి కలిగించారు. కబంధుడు వారిని శబరి ఆశ్రమమునకు వెళ్లమని చెప్పాడు. కబంధుని శరీరమునకు అంత్యక్రియలు చేసారు రామలక్ష్మణులు.

తరువాత వారు శబరి ఆశ్రమమునకు వెళ్లారు. శబరి వారిని పూజించింది. తరువాత వారు పంపా తీరమునకు వెళ్లారు. అక్కడ హనుమంతుని చూచారు. వానర రాజైన సుగ్రీవునితో స్నేహము చేసారు. రాముడు తన గురించి సీతాపహరణము గురించి సుగ్రీవునికి చెప్పాడు. సుగ్రీవుడు తనకు, తన అన్న వాలికి ఉన్న వైరము గురించి రామునికి చెప్పాడు.

రాముడు వాలిని చంపుతానని ప్రతిజ్ఞచేసాడు. కాని రాముడు వాలిని చంపగలడా అని సుగ్రీవునికి అనుమానము కలిగింది. అంతకు పూర్వము వాలి చేతిలో చచ్చిన దుందుభి అనే రాక్షసుని శరీరమును రాముడికి చూపాడు. రాముడు ఆ రాక్షసుని శరీరమును తన కాలి గోటితో పది యోజనములు దూరంగా పడేటట్టు విసిరివేసాడు. ఒకే బాణంతో ఏడు మద్దిచెట్లను కూల్చాడు. అప్పుడు సుగ్రీవునికి రాముని మీద నమ్మకం కుదిరింది.

రాముని వెంటతీసుకొని వాలి ఉన్న గుహ వద్దకు వెళ్లాడు సుగ్రీవుడు. బయట ఉండి సుగ్రీవుడు గట్టిగా అరిచాడు. ఆ అరుపు విని వాలిబయటకు వచ్చాడు. వాలి భార్య తార వాలిని యుద్ధమునకు వెళ్ల వద్దని వారించింది. కాని వాలి వినలేదు. వాలి సుగ్రీవునితో యుద్ధము చేసాడు. రాముడు ఒకే బాణంతో వాలిని చంపాడు. సుగ్రీవుని వానర రాజ్యమునకు పట్టాభిషిక్తుని చేసాడు.

తరువాత సుగ్రీవుడు సీతాదేవిని వెదుకుటకు వానరులను నలుదిక్కులకు పంపాడు. హనుమంతుడు దక్షిణ దిక్కుగా వెళ్లాడు. సముద్రమును దాటి లంక చేరుకున్నాడు. అశోకవనంలో రాముని కొరకు శోకించుచున్న సీతను చూచాడు. హనుమంతుడు సీతను కలుసుకున్నాడు. రాముడు ఇచ్చిన ఉంగరమును గుర్తుగా చూపించాడు. రామ సుగ్రీవుల మైత్రి గురించి చెప్పాడు.

తరువాత హనుమంతుడు అశోకవనము యొక్క తోరణ ద్వారమును ధ్వంసము చేసాడు. తనను పట్టుకోబోయిన రావణుని సేనాపతులను ఐదుగురిని చంపాడు. అక్షకుమారుని చంపాడు. తుదకు బంధింప బడ్డాడు. తరువాత తనను తాను విడిపించుకొని లంకాదహనము చేసాడు.

హనుమంతుడు లంక నుండి రాముని వద్దకు వచ్చాడు. సీతన చూచాను అని రామునితో చెప్పాడు. తరువాత వానర సేనలతో సముద్ర తీరము చేరుకున్నారు రాముడు సుగ్రీవుడు. తనకు దారి ఇవ్వని సముద్రుని తన రామబాణముతో అల్లకల్లోలము చేసాడు. సముద్రుని మాట ప్రకారము రాముడు నీలునితో వారధి కట్టించాడు. ఆ సేతువుమీదుగా లంకకు చేరుకున్నాడు.

రావణునితో యుద్ధముచేసి రావణుని సంహరించాడు. కాని అన్నిరోజులు పరాయి వాడి వద్ద ఉన్న సీతను పరిగ్రహించడానికి సందేహ పడ్డాడు. ఆ మాటలు భరించలేక సీత అగ్నిప్రవేశము చేసింది. అగ్నిదేవుడు వచ్చి సీత కల్మషము లేనిది అని చెప్పాడు. అప్పుడు రాముడు సీతను స్వీకరించాడు.

రాముడి పాలనలో ప్రజలందరూ ధర్మబద్ధంగా నడుచుకున్నారు. సకాలంలో వానలు కురిసి దుర్భిక్షము అంటూ లేకుండా పోయింది. తండ్రి జీవించి ఉండగా పుత్రులు మరణించడం లేదు. స్త్రీలకు వైధవ్యము లేదు. స్త్రీలందరూ పతివ్రతలుగా ఉన్నారు. రామ రాజ్యంలో అగ్ని భయం, చోర భయం, జలభయం, ఆకలి భయం గానీ, లేవు. రాజ్యములో ధనధాన్యములు సమృద్ధిగా ఉండేవి. ప్రజలందరూ సంతోషంగా జీవించారు.

రాముడు లెక్కలేనన్ని అశ్వమేధ యాగములు చేసాడు. లక్షల కొలదీ గోవులను బ్రాహ్మణులకు దానంగా ఇచ్చాడు. రామ రాజ్యములో నాలుగు వర్ణముల వారు తమ తమ పనులను సక్రమంగా చేసుకుంటూ సంతోషంగా జీవించారు. ఆ ప్రకారంగా రాముడు 11,000 సంవత్సరములు రాజ్యపాలన చేసి తుదకు బ్రహ్మలోకము చేరుకున్నాడు.
ఈ రామ చరిత్ర అతి పవిత్రమైనది. సమస్త పాపములను నాశనం చేస్తుంది. పుణ్యములను కలుగజేస్తుంది. ఈ రామ కధ వేదసమ్మతము. ఈ రామ చరిత్రను చదివినవారికి సమస్త పాపములు తొలగిపోతాయి. వారికి ఆయువు వృద్ధి చెందుతుంది. పుత్రపౌత్రాదు లతో సకలసుఖములు అనుభవిస్తారు. తరువాత స్వర్గలోకము చేరు కుంటారు.

ఈరామాయణము చదివిన బ్రాహ్మణులు అన్ని విద్యలలో ప్రావీణ్యులవుతారు. క్షత్రియులకు రాజ్యప్రాప్తి కలుగుతుంది. వైశ్యులకు వ్యాపారాభివృద్ధి కలుగుతుంది. శూద్రులు కీర్తివంతులవుతారు.

ఇది వాల్మీకి విరచిత
శ్రీమద్రామాయణ మహాకావ్యములో
బాలకాండలో మొదటి సర్గ సంపూర్ణము.

ఓం తత్సత్ ఓంతత్సత్ ఓంతత్సత్.

బాలకాండ ద్వితీయః సర్గః (2) >>

Leave a Comment