Balakanda Sarga 2 In Telugu – బాలకాండ ద్వితీయః సర్గః

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ ద్వితీయ సర్గలో, వాల్మీకి మహర్షి తన శిష్యుడు భారద్వాజుతో కలిసి ఆశ్రమంలో నివసిస్తున్నారు. ఒక రోజు, నారద ముని అక్కడికి వస్తారు. వాల్మీకి మహర్షి నారదునికి పాదాభివందనం చేసి, అతన్ని సన్మానించి, రాముడి మహిమలను వర్ణించమని కోరుతారు. వాల్మీకి మహర్షి రాముడి విశేషాలను తెలుసుకోవాలని అడుగుతారు – ధర్మవంతుడు, ధైర్యవంతుడు, వాక్కును నిలబెట్టేవాడు, ప్రజలకు ప్రీతిపాత్రుడు వంటి లక్షణాలను కలవాడు ఎవరో చెప్పమని.

బ్రహ్మాగమనమ్ 

నారదస్య తు తద్వాక్యం శ్రుత్వా వాక్యవిశారదః |
పూజయామాస ధర్మాత్మా సహశిష్యో మహామునిః ||

1

యథావత్పూజితస్తేన దేవర్షిర్నారదస్తథా |
ఆపృచ్ఛ్యైవాభ్యనుజ్ఞాతః స జగామ విహాయసమ్ ||

2

స ముహూర్తం గతే తస్మిన్దేవలోకం మునిస్తదా |
జగామ తమసాతీరం జాహ్నవ్యాస్త్వవిదూరతః ||

3

స తు తీరం సమాసాద్య తమసాయా మునిస్తదా |
శిష్యమాహ స్థితం పార్శ్వే దృష్ట్వా తీర్థమకర్దమమ్ ||

4

అకర్దమమిదం తీర్థం భరద్వాజ నిశామయ |
రమణీయం ప్రసన్నాంబు సన్మనుష్యమనో యథా ||

5

న్యస్యతాం కలశస్తాత దీయతాం వల్కలం మమ |
ఇదమేవావగాహిష్యే తమసాతీర్థముత్తమమ్ ||

6

ఏవముక్తో భరద్వాజో వాల్మీకేన మహాత్మనా |
ప్రాయచ్ఛత మునేస్తస్య వల్కలం నియతో గురోః ||

7

స శిష్యహస్తాదాదాయ వల్కలం నియతేంద్రియః |
విచచార హ పశ్యంస్తత్సర్వతో విపులం వనమ్ ||

8

తస్యాభ్యాశే తు మిథునం చరంతమనపాయినమ్ |
దదర్శ భగవాంస్తత్ర క్రౌంచయోశ్చారునిఃస్వనమ్ ||

9

తస్మాత్తు మిథునాదేకం పుమాంసం పాపనిశ్చయః |
జఘాన వైరనిలయో నిషాదస్తస్య పశ్యతః ||

10

తం శోణితపరీతాంగం వేష్టమానం మహీతలే |
భార్యా తు నిహతం దృష్ట్వా రురావ కరుణాం గిరమ్ ||

11

వియుక్తా పతినా తేన ద్విజేన సహచారిణా |
తామ్రశీర్షేణ మత్తేన పత్రిణా సహితేన వై ||

12

తథా తు తం ద్విజం దృష్ట్వా నిషాదేన నిపాతితమ్ |
ఋషేర్ధర్మాత్మనస్తస్య కారుణ్యం సమపద్యత ||

13

తతః కరుణవేదిత్వాదధర్మోఽయమితి ద్విజః |
నిశామ్య రుదతీం క్రౌంచీమిదం వచనమబ్రవీత్ ||

14

మా నిషాద ప్రతిష్ఠాం త్వమగమః శాశ్వతీః సమాః |
యత్క్రౌంచమిథునాదేకమవధీః కామమోహితమ్ ||

15

తస్యైవం బ్రువతశ్చింతా బభూవ హృది వీక్షతః |
శోకార్తేనాస్య శకునేః కిమిదం వ్యాహృతం మయా ||

16

చింతయన్స మహాప్రాజ్ఞశ్చకార మతిమాన్ మతిమ్ |
శిష్యం చైవాబ్రవీద్వాక్యమిదం స మునిపుంగవః ||

17

పాదబద్ధోఽక్షరసమస్తంత్రీలయసమన్వితః |
శోకార్తస్య ప్రవృత్తో మే శ్లోకో భవతు నాన్యథా ||

18

శిష్యస్తు తస్య బ్రువతో మునేర్వాక్యమనుత్తమమ్ |
ప్రతిజగ్రాహ సంహృష్టస్తస్య తుష్టోఽభవద్గురుః ||

19

సోఽభిషేకం తతః కృత్వా తీర్థే తస్మిన్యథావిధి |
తమేవ చింతయన్నర్థముపావర్తత వై మునిః ||

20

భరద్వాజస్తతః శిష్యో వినీతః శ్రుతవాన్ మునిః |
కలశం పూర్ణమాదాయ పృష్ఠతోఽనుజగామ హ ||

21

స ప్రవిశ్యాశ్రమపదం శిష్యేణ సహ ధర్మవిత్ |
ఉపవిష్టః కథాశ్చాన్యాశ్చకార ధ్యానమాస్థితః ||

22

ఆజగామ తతో బ్రహ్మా లోకకర్తా స్వయం ప్రభుః |
చతుర్ముఖో మహాతేజా ద్రష్టుం తం మునిపుంగవమ్ ||

23

వాల్మీకిరథ తం దృష్ట్వా సహసోత్థాయ వాగ్యతః |
ప్రాంజలిః ప్రయతో భూత్వా తస్థౌ పరమవిస్మితః ||

24

పూజయామాస తం దేవం పాద్యార్ఘ్యాసనవందనైః |
ప్రణమ్య విధివచ్చైనం పృష్ట్వాఽనామయమవ్యయమ్ ||

25

అథోపవిశ్య భగవానాసనే పరమార్చితే |
వాల్మీకయే చ ఋషయే సందిదేశాసనం తతః ||

26

బ్రహ్మణా సమనుజ్ఞాతః సోఽప్యుపావిశదాసనే |
ఉపవిష్టే తదా తస్మిన్సాక్షాల్లోకపితామహే ||

27

తద్గతేనైవ మనసా వాల్మీకిర్ధ్యానమాస్థితః |
పాపాత్మనా కృతం కష్టం వైరగ్రహణబుద్ధినా ||

28

యస్తాదృశం చారురవం క్రౌంచం హన్యాదకారణాత్ |
శోచన్నేవ ముహుః క్రౌంచీముప శ్లోకమిమం పునః ||

29

పునరంతర్గతమనా భూత్వా శోకపరాయణః |
తమువాచ తతో బ్రహ్మా ప్రహస్య మునిపుంగవమ్ ||

30

శ్లోక ఏవ త్వయా బద్ధో నాత్ర కార్యా విచారణా |
మచ్ఛందాదేవ తే బ్రహ్మన్ ప్రవృత్తేఽయం సరస్వతీ ||

31

రామస్య చరితం కృత్స్నం కురు త్వమృషిసత్తమ |
ధర్మాత్మనో గుణవతో లోకే రామస్య ధీమతః ||

32

వృత్తం కథయ వీరస్య యథా తే నారదాచ్ఛ్రుతమ్ |
రహస్యం చ ప్రకాశం చ యద్వృత్తం తస్య ధీమతః ||

33

రామస్య సహ సౌమిత్రే రాక్షసానాం చ సర్వశః |
వైదేహ్యాశ్చైవ యద్వృత్తం ప్రకాశం యది వా రహః ||

34

తచ్చాప్యవిదితం సర్వం విదితం తే భవిష్యతి |
న తే వాగనృతా కావ్యే కాచిదత్ర భవిష్యతి ||

35

కురు రామకథాం పుణ్యాం శ్లోకబద్ధాం మనోరమామ్ |
యావత్ స్థాస్యంతి గిరయః సరితశ్చ మహీతలే ||

36

తావద్రామాయణ కథా లోకేషు ప్రచరిష్యతి |
యావద్రామాయణ కథా త్వత్కృతా ప్రచరిష్యతి ||

37

తావదూర్ధ్వమధశ్చ త్వం మల్లోకేషు నివత్స్యసి |
ఇత్యుక్త్వా భగవాన్ బ్రహ్మా తత్రైవాంతరధీయత ||

38

తతః సశిష్యో భగవాన్మునిర్విస్మయమాయయౌ |
తస్య శిష్యాస్తతః సర్వే జగుః శ్లోకమిమం పునః ||

39

ముహుర్ముహుః ప్రీయమాణా ప్రాహుశ్చ భృశవిస్మితాః |
సమాక్షరైశ్చతుర్భిర్యః పాదైర్గీతో మహర్షిణా ||

40

సోఽనువ్యాహరణాద్భూయః శోకః శ్లోకత్వమాగతః |
తస్య బుద్ధిరియం జాతా వాల్మీకేర్భావితాత్మనః |
కృత్స్నం రామాయణం కావ్యమీదృశైః కరవాణ్యహమ్ ||

41

ఉదారవృత్తార్థపదైర్మనోరమై-
-స్తతః స రామస్య చకార కీర్తిమాన్ |
సమాక్షరైః శ్లోకశతైర్యశస్వినో
యశస్కరం కావ్యముదారధీర్మునిః ||

42

తదుపగతసమాససంధియోగం
సమమధురోపనతార్థవాక్యబద్ధమ్ |
రఘువరచరితం మునిప్రణీతం
దశశిరసశ్చ వధం నిశామయధ్వమ్ ||

43

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే
ఆదికావ్యే బాలకాండే ద్వితీయః సర్గః ||

44

 

నారదుడు చెప్పిన సంక్షిప్త రామాయణమును విని వాల్మీకి

మహర్షి, మరియు ఆయన శిష్యులు నారదుని ఎంతో భక్తితో పూజించారు. తరువాత నారదుడు దేవలోకము వెళ్లిపోయాడు.

తరువాత వాల్మీకి మహర్షి తమసానదీ తీరమునకు వెళ్లాడు. ఏ మాత్రం మలినము లేని ఒక రేవు వద్దకు వెళ్లాడు. తన శిష్యుని తనకు కావలసిన పాత్ర, నార బట్టలు తెమ్మన్నాడు వాల్మీకి. ఆ రేవులో స్నానం చేయడానికి సంకల్పించాడు. ఆ ప్రకారంగా శిష్యుడు వాల్మీకికి చెంబు, నార బట్టలు ఇచ్చాడు. వాటిని తీసుకొని వాల్మీకి ఆ వనమంతా ఒక సారి కలయ చూచాడు.

కొంచెం దూరంలో ఒక చెట్టు మీద నిర్భయంగా విహరిస్తున్న క్రౌంచ పక్షుల జంటను చూచాడు. అంతలో ఒక బోయవాడు ఆ క్రౌంచ పక్షుల జంటలో మగపక్షిని తన బాణముతో నిర్దయగా కొట్టి చంపాడు. ఆమగపక్షి రక్తం కారుతూ కింద పడిపోయింది. కింద పడిపోయిన మగపక్షిని చూచి ఆడ పక్షి ఎంతో దుఃఖించింది. కింద పడ్డ మగపక్షి చుట్టూ తిరుగుతూ దీనంగా ఏడుస్తూ ఉంది.

ఏడుస్తున్న ఆ ఆడ పక్షిని చూచాడు వాల్మీకి. ఆయన మనస్సు ద్రవించిపోయింది. వాల్మీకి ఆ బోయవానిని చూచి ఇలా అన్నాడు.

మా నిషాద ప్రతిష్ఠాం త్వమగమ: శాశ్వతీ: సమా: |
యత్ క్రౌఞ్యమిథునాదేకమవధీ: కామమోహితమ్||

“ఓయీ బోయవాడా! నీవు మన్మధావస్థలో ఉన్న పక్షుల జంటలో ఒక దానిని చంపావు. కాబట్టి నీవు కూడా అల్పాయుష్కుడవు అవుదువు కాక!” అనే వాక్యము వాల్మీకి నోటి వెంటవచ్చింది.

అంతలో తనలో తాను ఇలా అనుకున్నాడు. “ఇదేమిటి! నేను ఈ పక్షుల జంటను చూచి ఇలా అనుకోవడం ఏమిటి! నానోటి నుండి ఇటువంటి వచనములు రావడం ఏమిటి!” అని అనుకున్నాడు. వెంటనే తన శిష్యుని పిలిచి ఇలా అన్నాడు. “ఆ క్రౌంచపక్షులలో ఒక దానిని బోయవాడు చంపగా, దానిని చూచి నేను చలించిపోయి పాదబద్ధంగా ఒక వాక్యము చెప్పాను. అది వృధా కారాదు. అది శ్లోకముగా ప్రసిద్ధి చెందుతుంది.” అని పలికాడు వాల్మీకి.

శిష్యుడు వెంటనే ఆ శ్లోకమును కంఠస్థము చేసాడు. తరువాత వాల్మీకి స్నానము చేయడానికి వెళ్లాడు. స్నానము చేసిన తరువాత తన ఆశ్రమమునకు పోతూ ఆ శ్లోకమునే మననం చేసుకుంటున్నాడు. ఆయన వెంట భరద్వాజుడు అనే ఆయన శిష్యుడు వెంట వెళుతున్నాడు. వాల్మీకి ఆశ్రమమునకు పోయి తన నోటి వెంట వచ్చిన శ్లోకమును మననం చేసుకుంటూ ధ్యానములో కూర్చున్నాడు. ఆ ధ్యానములో ఆయనకు ఇతర వాక్యాలు కథలు స్ఫురించాయి.

ఆసమయంలో బ్రహ్మదేవుడు వాల్మీకిని చూడటానికి ఆయన ఆశ్రమమునకు వచ్చాడు. బ్రహ్మగారిని చూచి వాల్మీకి సంభ్రమంతో లేచి చేతులు జోడించి నిలబడ్డాడు. బ్రహ్మదేవునికి అర్ఘ్యము, పాద్యము సమర్పించాడు. ఉచితాసనము మీద కూర్చోపెట్టాడు. బ్రహ్మదేవుని ఆదేశము మేరకు తాను కూడా ఒక ఆసనము మీదకూర్చున్నాడు. వాల్మీకి మనసులో మాత్రము ఆ క్రౌంచపక్షుల జంట గురించి ఆలోచిస్తున్నాడు. “ఆ హా! అందముగా విహరిస్తున్న ఆ క్రౌంచ పక్షుల జంటలో ఒక దానిని ఆ క్రూరుడు నిర్దయగా కొట్టాడు కదా!” అని ఆలోచిస్తున్నాడు. వాల్మీకి మనస్సు దుఃఖంతో నిండి పోయింది. ఆప్రయత్నంగా ఆ వాక్యము ఆయన నోటి వెంట వచ్చింది.

ఆ వాక్యములను విన్నాడు బ్రహ్మ. ” ఓ వాల్మీకి మహర్షి! నీ నోట వెంట వచ్చిన వాక్యము శ్లోకమే. అందుకు సందేహము లేదు. ఇది నా సంకల్పమే. నా సంకల్పము వల్లనే నీ నోటి వెంట ఆ వాక్యము వెలువడింది. అది శ్లోకము అయింది. నీవు పుణ్యప్రదమును, మనస్సులను రమింపచేయునదియును అగు రాముని యొక్క చరితమును శ్లోకరూపంలో కావ్యంగా రచించు. రాముడు ధర్మాత్ముడు. గుణవంతుడు. బుద్ధిమంతుడు. రాముని కధను నీకు నారదుడు చెప్పాడు కదా. అదే కధను సవిస్తరముగా చెప్పు. రాముడు, సీత, లక్ష్మణుడు, రాక్షసులు మొదలగు వారి గురించి నీకు తెలిసిన విషయములూ, తెలియని విషయములూ అన్నీ ఇప్పుడు నీకు స్పష్టంగా గోచరమవుతాయి.

ఈ రామాయణ కావ్యములో నీవు రాసిన ఏ ఒక్కమాట కూడా అసత్యము కాదు. కాబట్టి నీవు రామ కధను శ్లోకరూపంలో రచించు. ఈ చరాచర జగత్తు ఉన్నంత వరకూ రామ చరిత్ర ఈ లోకంలో నిలిచి ఉంటుంది. నీ చే రచింప బడిన రామాయణ కావ్యము ఎంత కాలము ప్రచారంలో ఉంటుందో అంత కాలమూ నేను సృష్టించిన సమస్తలోకములలో నీవు నివసిస్తావు.” అని పలికాడు బ్రహ్మదేవుడు. తరువాత బ్రహ్మదేవుడు అంతర్థానమయ్యాడు.

ఇది అంతా విన్న వాల్మీకి మహర్షి శిష్యులు ఆశ్చర్యపోయారు. రామాయణ కావ్యమునకు మూలమైన ఆ శ్లోకమును మరలా మరలా స్మరించుకుంటున్నారు. ఒకరితో ఒకరు చెప్పుకుంటూ మననం చేసుకుంటున్నారు. నాలుగు పాదములతో, సమసంఖ్యగల అక్షరములతో, మహర్షి నోటి నుండి వచ్చిన ఆ శ్లోకము శిష్యులు మాటిమాటి కీ గానం చేయడం వలన శ్లోకత్వము పొందింది.

ఇదంతా గమనించిన వాల్మీకి మహర్షి “రామాయణ మహా కావ్యమును అంతా ఇదే విధంగా శ్లోకరూపంలో రచిస్తాను” అని నిశ్చయించుకున్నాడు. వాల్మీకి మహర్షి రామ చరితమును ఉదారమైన పదములతో, మనోహరములైన అక్షరములతో కూర్చిన వందలాది శ్లోకములలో రచించాడు. ఆ మహా కావ్యము సమాసములతోనూ, సంధులతోనూ, వ్యుత్పత్తులతోనూ, సుమధురములు, అర్థవంతములు అయిన వాక్యములతోనూ అలరారింది.

ఇది వాల్మీకి విరచిత
శ్రీమద్రామాయణ మహాకావ్యములో
బాలకాండలో రెండవ సర్గ సంపూర్ణము.

 ఓం తత్సత్ ఓంతత్సత్ ఓంతత్సత్.

బాలకాండ  తృతీయః సర్గః (3) >>

Leave a Comment