Ayodhya Kanda Sarga 1 In Telugu – అయోధ్యాకాండ ప్రథమః సర్గః

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అయోధ్యాకాండ రామాయణ కావ్యంలో రెండవ విభాగము. ఇందులో 119 సర్గలు ఉన్నాయి. ఈ ప్రథమః సర్గఃలో రాముని గుణగణాలను, అయోధ్యలోని ప్రజల ఆనందం మరియు భవిష్యత్తులో రాముడు రాజ్యభిషేకం పొందబోతున్నదని ప్రజల ఆశలను వివరిస్తుంది. దశరథ మహారాజు తన పెద్ద కుమారుడైన రాముని యువరాజుగా అభిషేకించాలనే తన నిర్ణయాన్ని ప్రకటిస్తాడు.

రామాభిషేకవ్యవసాయః

గచ్ఛతా మాతులకులం భరతేన మహాత్మనా |
శత్రుఘ్నో నిత్యశత్రుఘ్నో నీతః ప్రీతిపురస్కృతః ||

1

స తత్ర న్యవసద్భ్రాత్రా సహ సత్కారసత్కృతః |
మాతులేనాశ్వపతినా పుత్రస్నేహేన లాలితః ||

2

తత్రాపి నివసంతౌ తౌ తర్ప్యమాణౌ చ కామతః |
భ్రాతరౌ స్మరతాం వీరౌ వృద్ధం దశరథం నృపమ్ ||

3

రాజాఽపి తౌ మహాతేజాః సస్మార ప్రోషితౌ సుతౌ |
ఉభౌ భరతశత్రుఘ్నౌ మహేంద్రవరుణోపమౌ ||

4

సర్వ ఏవ తు తస్యేష్టాశ్చత్వారః పురుషర్షభాః |
స్వశరీరాద్వినిర్వృత్తాశ్చత్వార ఇవ బాహవః ||

5

తేషామపి మహాతేజా రామో రతికరః పితుః |
స్వయంభూరివ భూతానాం బభూవ గుణవత్తరః ||

6

స హి దేవైరుదీర్ణస్య రావణస్య వధార్థిభిః |
అర్థితో మానుషే లోకే జజ్ఞే విష్ణుః సనాతనః ||

7

కౌసల్యా శుశుభే తేన పుత్రేణామితతేజసా |
యథా వరేణ దేవానామదితిర్వజ్రపాణినా ||

8

స హి వీర్యోపపన్నశ్చ రూపవాననసూయకః |
భూమావనుపమః సూనుర్గుణైర్దశరథోపమః ||

9

స తు నిత్యం ప్రశాంతాత్మా మృదుపూర్వం చ భాషతే |
ఉచ్యమానోఽపి పరుషం నోత్తరం ప్రతిపద్యతే ||

10

కథం‍చిదుపకారేణ కృతేనైకేన తుష్యతి |
న స్మరత్యపకారాణాం శతమప్యాత్మవత్తయా ||

11

శీలవృద్ధైర్జ్ఞానవృద్ధైర్వయోవృద్ధైశ్చ సజ్జనైః |
కథయన్నాస్త వై నిత్యమస్త్రయోగ్యాంతరేష్వపి ||

12

బుద్ధిమాన్మధురాభాషీ పూర్వభాషీ ప్రియంవదః |
వీర్యవాన్న చ వీర్యేణ మహతా స్వేన గర్వితః ||

13

న చానృతకథో విద్వాన్వృద్ధానాం ప్రతిపూజకః |
అనురక్తః ప్రజాభిశ్చ ప్రజాశ్చాప్యనురంజతే ||

14

సానుక్రోశో జితక్రోధో బ్రాహ్మణప్రతిపూజకః |
దీనానుకంపీ ధర్మజ్ఞో నిత్యం ప్రగ్రహవాన్ శుచిః ||

15

కులోచితమతిః క్షాత్రం ధర్మం స్వం బహుమన్యతే |
మన్యతే పరయా కీర్త్యా మహత్స్వర్గఫలం తతః ||

16

నాశ్రేయసి రతో విద్వాన్న విరుద్ధకథారుచిః |
ఉత్తరోత్తరయుక్తీనాం వక్తా వాచస్పతిర్యథా ||

17

అరోగస్తరుణో వాగ్మీ వపుష్మాన్దేశకాలవిత్ |
లోకే పురుషసారజ్ఞః సాధురేకో వినిర్మితః ||

18

స తు శ్రేష్ఠైర్గుణైర్యుక్తః ప్రజానాం పార్థివాత్మజః |
బహిశ్చర ఇవ ప్రాణో బభూవ గుణతఃప్రియః ||

19

సమ్యగ్విద్యావ్రతస్నాతో యథావత్సాంగవేదవిత్ |
ఇష్వస్త్రే చ పితుః శ్రేష్ఠో బభూవ భరతాగ్రజః ||

20

కల్యాణాభిజనః సాధురదీనః సత్యవాగృజుః |
వృద్ధైరభివినీతశ్చ ద్విజైర్ధర్మార్థదర్శిభిః ||

21

ధర్మకామార్థతత్త్వజ్ఞః స్మృతిమాన్ప్రతిభానవాన్ |
లౌకికే సమయాచారే కృతకల్పో విశారదః ||

22

నిభృతః సంవృతాకారో గుప్తమంత్రః సహాయవాన్ |
అమోఘక్రోధహర్షశ్చ త్యాగసంయమకాలవిత్ ||

23

దృఢభక్తిః స్థిరప్రజ్ఞో నాసద్గ్రాహీ న దుర్వచాః |
నిస్తంద్రిరప్రమత్తశ్చ స్వదోషపరదోషవిత్ ||

24

శాస్త్రజ్ఞశ్చ కృతజ్ఞశ్చ పురుషాంతరకోవిదః |
యః ప్రగ్రహానుగ్రహయోర్యథాన్యాయం విచక్షణః ||

25

సత్సంగ్రహప్రగ్రహణే స్థానవిన్నిగ్రహస్య చ |
ఆయకర్మణ్యుపాయజ్ఞః సందృష్టవ్యయకర్మవిత్ ||

26

శ్రైష్ఠ్యం శాస్త్రసమూహేషు ప్రాప్తో వ్యామిశ్రకేషు చ |
అర్థధర్మౌ చ సంగృహ్య సుఖతంత్రో న చాలసః ||

27

వైహారికాణాం శిల్పానాం విజ్ఞాతార్థవిభాగవిత్ |
ఆరోహే వినయే చైవ యుక్తో వారణవాజినామ్ ||

28

ధనుర్వేదవిదాం శ్రేష్ఠో లోకేఽతిరథసంమతః |
అభియాతా ప్రహర్తా చ సేనానయవిశారదః ||

29

అప్రధృష్యశ్చ సంగ్రామే క్రుద్ధైరపి సురాసురైః |
అనసూయో జితక్రోధో న దృప్తో న చ మత్సరీ ||

30

న చావమంతా భూతానాం న చ కాలవశానుగః |
ఏవం శ్రేష్ఠైర్గుణైర్యుక్తః ప్రజానాం పార్థివాత్మజః ||

31

సంమతస్త్రిషు లోకేషు వసుధాయాః క్షమాగుణైః |
బుద్ధ్యా బృహస్పతేస్తుల్యో వీర్యేణాపి శచీపతేః ||

32

తథా సర్వప్రజాకాంతైః ప్రీతిసంజననైః పితుః |
గుణైర్విరురుచే రామో దీప్తైః సూర్య ఇవాంశుభిః ||

33

తమేవం వ్రతసంపన్నమప్రధృష్యపరాక్రమమ్ |
లోకపాలోపమం నాథమకామయత మేదినీ ||

34

ఏతైస్తు బహుభిర్యుక్తం గుణైరనుపమైః సుతమ్ |
దృష్ట్వా దశరథో రాజా చక్రే చింతాం పరంతపః ||

35

అథ రాజ్ఞో బభూవైవం వృద్ధస్య చిరజీవినః |
ప్రీతిరేషా కథం రామో రాజా స్యాన్మయి జీవతి ||

36

ఏషా హ్యస్య పరా ప్రీతిర్హృది సంపరివర్తతే |
కదా నామ సుతం ద్రక్ష్యామ్యభిషిక్తమహం ప్రియమ్ ||

37

వృద్ధికామో హి లోకస్య సర్వభూతానుకంపనః |
మత్తః ప్రియతరో లోకే పర్జన్య ఇవ వృష్టిమాన్ ||

38

యమశక్రసమో వీర్యే బృహస్పతిసమో మతౌ |
మహీధరసమో ధృత్యాం మత్తశ్చ గుణవత్తరః ||

39

మహీమహమిమాం కృత్స్నామధితిష్ఠంతమాత్మజమ్ |
అనేన వయసా దృష్ట్వా యథా స్వర్గమవాప్నుయామ్ ||

40

ఇత్యేతైర్వివిధైస్తైస్తైరన్యపార్థివదుర్లభైః |
శిష్టైరపరిమేయైశ్చ లోకే లోకోత్తరైర్గుణైః ||

41

తం సమీక్ష్య మహారాజో యుక్తం సముదితైర్గుణైః |
నిశ్చిత్య సచివైః సార్ధం యువరాజమమన్యత ||

42

దివ్యంతరిక్షే భూమౌ చ ఘోరముత్పాతజం భయమ్ |
సం‍చచక్షే చ మేధావీ శరీరే చాత్మనో జరామ్ ||

43

పూర్ణచంద్రాననస్యాథ శోకాపనుదమాత్మనః |
లోకే రామస్య బుబుధే సంప్రియత్వం మహాత్మనః ||

44

ఆత్మనశ్చ ప్రజానాం చ శ్రేయసే చ ప్రియేణ చ |
ప్రాప్తకాలేన ధర్మాత్మా భక్త్యా త్వరితవాన్నృపః ||

45

నానానగరవాస్తవ్యాన్పృథగ్జానపదానపి |
సమానినాయ మేదిన్యాః ప్రధానాన్పృథివీపతీన్ ||

46

తాన్వేశ్మనానాభరణైర్యథార్హం ప్రతిపూజితాన్ |
దదర్శాలంకృతో రాజా ప్రజాపతిరివ ప్రజాః ||

47

న తు కేకయరాజానం జనకం వా నరాధిపః |
త్వరయా చానయామాస పశ్చాత్తౌ శ్రోష్యతః ప్రియమ్ ||

48

అథోపవిష్టే నృపతౌ తస్మిన్పరబలార్దనే |
తతః ప్రవివిశుః శేష రాజానో లోకసమ్మతాః ||

49

అథ రాజవితీర్ణేషు వివిధేష్వాసనేషు చ |
రాజానమేవాభిముఖాః నిషేదుర్నియతా నృపాః ||

50

స లబ్ధమానైర్వినయాన్వితైర్నృపైః
పురాలయైర్జానపదైశ్చ మానవైః |
ఉపోపవిష్టైర్నృపతిర్వృతో బభౌ
సహస్రచక్షుర్భగవానివామరైః ||

51

Ayodhya Kanda Sarga 1 Meaning In Telugu

భరతుడు తన మేమతో కూడా తాత గారి ఇంటికి వెళ్లాడు. తనతో కూడా శత్రుఘ్నుని తీసుకొని వెళ్లాడు. భరత శత్రుఘ్నులు మేనమామ ఇంట్లో సుఖసంతోషాలతో ఉన్నప్పటికీ, అయోధ్యలో ఉన్న తల్లి తండ్రు లను మరిచిపోలేదు. ప్రతిరోజూ తమ తల్లి తండ్రులను మనసారా తల్చుకుంటూ ఉన్నారు.

అదే ప్రకారంగా దశరథుడు కూడా తన కుమారులు భరత శత్రుఘ్నులు ఏం చేస్తున్నారో ఏమో అని ప్రతి రోజూ తల్చుకుంటూ ఉండేవాడు. ఎందుకంటే దశరథునికి తన నలుగురు కుమారులను సమానంగా ప్రేమించాడు, ఆదరించాడు. అందుకనీ భరత శత్రుఘ్నులు తన ఎదుట లేకపోయినా అనుదినమూ వారిని తల్చుకుంటూ ఉండేవాడు.

కాని తన నలుగురు కుమారులలోనూ పెద్ద కుమారుడు రాముడు అంటే దశరథునకు ప్రేమాభిమానాలు కొంచెం ఎక్కువగా ఉండేవి. కౌసల్యకు కూడా రాముడు అంటే పంచప్రాణాలు. రాముని విడిచి ఒక్క నిముషం కూడా ఉండేది కాదు. ఇంక రాముడు కూడా అందుకు తగ్గట్టుగానే ఉండేవాడు.

రాముడు మంచి రూపవంతుడు. శౌర్యవంతుడు. పైగా దశరథుని కుమారుడు. రాముడు ఎల్లప్పుడూ ప్రశాంతమైన మనస్సుతో ఉండేవాడు. అందరితో మృదువుగా మాట్లాడేవాడు. తనతో ఎవరైనా కటువుగా మాట్లాడినా మౌనంగా ఉండేవాడే కాని వారితో పరుషంగా మాట్లాడేవాడు కాదు.

రాముడు అల్ప సంతోషి. ఎవరైనా తనకు చిన్న ఉపకారము చేసినా అమితంగా సంతోషించేవాడు. తనకు ఎవరు ఎన్ని అపకార ములు చేసినా వాటిని మనసులో పెట్టుకొనే వాడు కాదు. రాముడు అస్త్రవిద్య శస్త్ర విద్యలు సాధన చేసేవాడు. తీరిక సమయములలో వయోవృద్ధులు జ్ఞానవృద్ధుల వద్దకు పోయి మంచి విషయములు నేర్చుకొనే వాడు. అంతేగాని వినోద విలాసములతో సమయమును వృధాచేసేవాడు కాదు.

రాముడు అందరితోనూ చాలా కలుపుగోలుగా ఉండేవాడు. ముందు తనే అందరినీ పలుకరించి వారి యోగక్షేమములు అడిగి తెలుసుకొనేవాడు. తాను అమితమైన పరాక్రమ వంతుడైనను కొంచెం కూడా గర్వము లేకుండా అందరితో కలిసిపోయేవాడు.

రాముడికి ఉన్న మరొక మంచి లక్షణము రాముడు ఎన్నడూ అసత్యము పలికేవాడు కాదు. బ్రాహ్మణులను, పెద్దలను గౌరవించే వాడు. ప్రజలు తనను ఏ ప్రకారం గౌరవిస్తారో అదే ప్రకారము రాముడు కూడా శ్రీ గౌరవించేవాడు. రాముడికి కోపం అంటే ఏమిటో తెలియదు. అందరి మీద దయకలిగి ఉండేవాడు. దీనులను చూచి జాలిపడేవాడు. తోచిన సహాయము చేసేవాడు.

రాముడు ధర్మపరుడు. సకల ధర్మములను తెలిసినవాడు. కానీ ఏమీ తెలియనట్టు ఉండేవాడు. తనకు అన్నీ తెలుసు అని గర్వించేవాడు కాదు. రాముడు మచ్చలేని మానవుడు. ఇంద్రియము లను అదుపులో ఉంచుకొని ప్రవర్తించేవాడు. రాముడు క్షత్రియుడు. అందుకని తన స్వధర్మము అయిన క్షత్రియ ధర్మమును ఆచరించే వాడు. రాముడు తనకు కానీ, ఇతరులకు కానీ కీడు చేసే కార్యముల యందు ఏమాత్రం ఆసక్తి చూపేవాడు కాదు. ధర్మవిరుద్ధంగా ఏ పనీ చేసేవాడు కాదు. ఎదుటి వారి ఆంతర్యమును గ్రహించి తగు విధంగా నేర్పుగా మాట్లాడేవాడు.

రాముడు తన ఆరోగ్యమును చక్కగ కాపాడుకొనేవాడు. ఎలాంటి దురలవాట్లకు లోనయ్యేవాడు కాదు. ఏ కాలములో ఎలా ఉండాలో, ఏ పని చెయ్యాలో తెలుసుకొని అలా ఉండేవాడు, ఆ పనులే చేసేవాడు. సాటివారలలో సాధువర్తనుడు అని పేరుతెచ్చుకున్నాడు. అంతేకాదు అయోధ్యపుర ప్రజలలో కూడా రాముడు సాధు వర్తనుడు అని పేరు తెచ్చుకున్నాడు.

అటువంటి రాముడు విద్యాభ్యాసము పూర్తి చేసు కున్నాడు. వేద వేదాంగములలో ప్రావీణ్యము సంపాదించాడు. ధనుర్విద్యలో తండ్రి దశరథుని మించిపోయాడు. తాను జన్మించిన ఇక్ష్వాకు వంశమునకు తన సద్గుణములతో వన్నె తెచ్చే వాడయ్యాడు. పురుషార్థములైన ధర్మము, అర్థము, కామము, మోక్షము వీటి గురించి న తత్త్వమును బాగా ఆకళింపు చేసుకొని తదనుగుణంగా నడుచుకొనేవాడు. క్షత్రియోచితములైన ఆచార వ్యవహారములను చక్కగా అనుసరించేవాడు.

రాముడు తనలోని ఆలోచనలను పైకి కనపడనీయడు. పైకి నవ్వుతూనే ఉండేవాడు. మనసులోని భావములను ముఖంలో కనపడనిచ్చేవాడు కాదు. అనవసరంగా కోపగించుకోడం, సంతోషంతో పొంగిపోవడం చేసేవాడు కాదు. ఎల్లప్పుడూ సౌమ్యంగా ఒకే విధంగా ఉండేవాడు. ఏ విషయంలోనూ మొండిగా పట్టుబట్టడం మొండిగా వాదించడం చేసేవాడు కాదు. స్థిరమైన బుద్ధికలవాడు.

ఏ పరిస్థితులతో కూడా మనస్సును చలింపనీయడు రాముడు. రామునికి సోమరి తనము అంటే తెలియదు. ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండేవాడు. ఎదుటి వారిలో ఉన్న తప్పులు పట్టేముందు తనలో ఉన్న తప్పులు తెలుసుకొని వాటిని సరిదిద్దు కొనేవాడు. ఎవరైనా తనకు చిన్న మేలు చేసినా దానిని గుర్తు పెట్టుకొని తగిన సమయ ములో ప్రత్యుపకారము చేసేవాడు.

రాముడు న్యాయశాస్త్రములో కూడా ప్రావీణ్యము సంపాదించాడు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణలో అత్యంత నేర్పును ప్రదర్శించేవాడు. రాముడు రాజ్యపాలనలలో కూడా నిష్ణాతుడు. మంచి వారిని చేరదీసి ఆదరించేవాడు. దుర్మార్గులను దగ్గరకు చేరనిచ్చేవాడు. కాదు. రాజ్యపాలన కు కావలసిన ధనమును నేర్పుగా ప్రజలనుండి రాబట్టేవాడు. ఆ ధనమును వ్యయం చేయడంలోకూడా సంయమనం పాటించేవాడు. అనవసరమైన ఖర్చులను నివారించేవాడు.

రాముడు వేద వేదాంగములనే కాదు, ఇంకా ఇతరత్రా ఉన్న శాస్త్రములను కూడా బాగా అధ్యయనం చేసాడు. అన్నింటిలోనూ ప్రావీణ్యం సంపాదించాడు. తగు మాత్రంగా సుఖములను అనుభవించేవాడు. సుఖములను అనుభవించేటప్పుడు కూడా ఎంతో జాగరూకతతో ఉండేవాడు. రాముడు సంగీత నృత్యములలో కూడా ప్రవేశము ఉన్నవాడు.

పైన చెప్పిన లక్షణములను బట్టి, రాముడు సాత్వికుడు భోగలాలసుడు అనుకుంటే పొరపాటే. ఆయనకు యుద్ధరీతులు అన్ని కూడా బాగా తెలుసు. గుర్రములను ఏనుగులను లొంగదీసుకొని మచ్చిక చేసుకొనేవాడు. ధనుర్విద్యలో ప్రావీణ్యము సంపాదించాడు. శత్రువుల ఎడల నిర్దాక్షిణ్యంగా వ్యవహరించేవాడు. యుద్ధములో దేవతలు, రాక్షసులు ఎదురైనా జంకేవాడు కాదు. ధైర్యంతో ఎదిరించి గెలిచే సామర్థ్యము ఉన్నవాడు. అనిచెప్పి అందరి మీదా అనవసరంగా యుద్ధానికి కాలుదువ్వేవాడు కాదు.

రాముడు ఎవరిమీద కోపగించుకోడు. అవసరం అయినప్పుడు కోపం తెచ్చు కుంటాడు. అవసరం తీరగానే ఆ కోపాన్ని వదిలేస్తాడు. ఇన్ని సుగుణ ములు ఉన్నవాడు కాబట్టే రాముడు మూడులోకములలో కీర్తింప బడ్డాడు. రాముడు తన సుగుణములతో సూర్యుని వలె ప్రకాశించే వాడు.

ఇటువంటి సకలసద్గుణసంపన్నుడైన రాముడు తమకు రాజు కావాలని అయోధ్యా ప్రజలు కోరుకొనేవారు. ఇదే ఆలోచన దశరథునికి కూడా వచ్చింది. “తన జీవిత కాలంలో రాముడు రాజు అవుతాడా! రాముని రాజుగా నేను చూడగలనా!” అని అనుకున్నాడు. రాముడికి రాజు కాదగ్గ లక్షణములు ఉన్నాయా అని ఆలోచించాడు.

అయోధ్యావాసులందరూ రాముడు రాజు కావాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే రాముడు ఎల్లప్పుడూ ప్రజల యొక్క వృద్ధిని కోరుకొనే వాడు. అయోధ్యా ప్రజలకు దశరథుని కంటే కూడా రాముడు అంటేనే ఎక్కువ గౌరవము అభిమానము. రాముడు బల పరాక్రమములలో యమునితోనూ ఇంద్రునితోనూ సమానమైనవాడు. బుద్ధిలో బృహస్పతి వంటి వాడు. ధైర్యములో మేరుపర్వతము వంటి వాడు. ఒక రాజుకు ఉండవలసిన మంచి లక్షణములు అన్నీ రామునికి ఉన్నాయి.

ఆ ఆలోచన వచ్చిందే తడవుగా దశరథుడు తనమంత్రులను పిలిపించాడు. వారితో ఆలోచించాడు. “అమాత్యులారా! నేను పెద్దవాడిని అయ్యాను. వయసు మీద పడింది. ఇంక రాజ్యపాలన చేయలేను. అయోధ్యప్రజలందరూ రాముడు రాజు కావాలని కోరుకుంటున్నారు. రాముడు రాజు అవడం అందరికీ సమ్మతమే. రాముడు రాజు అయితే నేను కూడా నిశ్చింతగా విశ్రాంతి తీసుకుంటాను. దీనికి మీరంతా అనుమతిస్తారని ఆశిస్తున్నాను.” అని అన్నాడు.

మంత్రులంతా దశరథుని మాటలకు సంతోషంగా తమ ఆమోదము తెలిపారు. వారి అనుమతితో రాముని యువరాజును చేయడానికి నిశ్చయించాడు దశరథుడు. తరువాత దశరథుడు సభను ఏర్పాటు చేసాడు. సామంత రాజులను, పురప్రముఖులను, అధికారులను, ఉద్యోగులను సభకు ఆహ్వానించాడు..

ఇన్ని చేసాడు కానీ కేకయ దేశంలో ఉన్న భరతునికి, శత్రుఘ్నునికి ఈ విషయం తెలియజేయలేదు. తరువాత వారే తెలుసుకుంటారులే అని నిర్లక్ష్యం చేసాడు.

(అలా కాకుండా భరతుని, శత్రుఘ్నుని పిలిపించి వారితో కూడా చెప్పి వారి సమ్మతి కూడా తీసుకొని ఉంటే రామాయణ మహాకావ్యము ఇంతటితో ఆగిపోయి ఉండేదేమో!)

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము ప్రథమ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అయోధ్యాకాండ ద్వితీయః సర్గః (2) >>

Leave a Comment