Balakanda Sarga 68 In Telugu – బాలకాండ అష్టషష్టితమః సర్గః

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ అష్టషష్టితమః సర్గలో, రాముడు, లక్ష్మణుడు విష్వామిత్రుడితో కలిసి మిథిలానగరికి చేరుకుంటారు. అక్కడ వారు సీతాస్వయంవరానికి హాజరవుతారు. సీతను పొందాలనుకునే అనేక రాజులు శివధనుస్సును ఎత్తడానికి ప్రయత్నిస్తారు, కానీ ఎవరూ ఆ ధనుస్సును ఎత్తలేరు. చివరికి, రాముడు ఆ ధనుస్సును ఎత్తి, దానిని విరజేస్తాడు.

|| దశరథాహ్వానమ్ ||

జనకేన సమాదిష్టా దూతాస్తే క్లాంతవాహనాః |
త్రిరాత్రముషితా మార్గే తేఽయోధ్యాం ప్రావిశన్పురీమ్ ||

1

రాజ్ఞో భవనమాసాద్య ద్వారస్థానిదమబ్రువన్ |
శీఘ్రం నివేద్యతాం రాజ్ఞే దూతాన్నో జనకస్య చ ||

2

ఇత్యుక్తా ద్వారపాలస్తే రాఘవాయ న్యవేదయన్ |
తే రాజవచనాద్దూతా రాజవేశ్మ ప్రవేశితాః ||

3

దదృశుర్దేవసంకాశం వృద్ధం దశరథం నృపమ్ |
బద్ధాంజలిపుటాః సర్వే దూతా విగతసాధ్వసాః ||

4

రాజానం ప్రణతా వాక్యమబ్రువన్మధురాక్షరమ్ |
మైథిలో జనకో రాజా సాగ్నిహోత్రపురస్కృతమ్ ||

5

కుశలం చావ్యయం చైవ సోపాధ్యాయపురోహితమ్ |
ముహుర్ముహుర్మధురయా స్నేహసంయుక్తయా గిరా ||

6

జనకస్త్వాం మహారాజాఽఽపృచ్ఛతే సపురఃసరమ్ |
పృష్ట్వా కుశలమవ్యగ్రం వైదేహో మిథిలాధిపః ||

7

కౌశికానుమతో వాక్యం భవంతమిదమబ్రవీత్ |
పూర్వం ప్రతిజ్ఞా విదితా వీర్యశుల్కా మమాత్మజా ||

8

రాజానశ్చ కృతామర్షా నిర్వీర్యా విముఖీకృతాః |
సేయం మమ సుతా రాజన్విశ్వామిత్రపురఃసరైః ||

9

యదృచ్ఛయాఽఽగతైర్వీరైర్నిర్జితా తవ పుత్రకైః |
తచ్చ రాజన్ధనుర్దివ్యం మధ్యే భగ్నం మహాత్మనా ||

10

రామేణ హి మహారాజ మహత్యాం జనసంసది |
అస్మై దేయా మయా సీతా వీర్యశుల్కా మహాత్మనే ||

11

ప్రతిజ్ఞాం తర్తుమిచ్ఛామి తదనుజ్ఞాతుమర్హసి |
సోపాధ్యాయో మహారాజ పురోహితపురఃసరః ||

12

శీఘ్రమాగచ్ఛ భద్రం తే ద్రష్టుమర్హసి రాఘవౌ |
ప్రీతిం చ మమ రాజేంద్ర నిర్వర్తయితుమర్హసి ||

13

పుత్రయోరుభయోరేవ ప్రీతిం త్వమపి లప్స్యసే |
ఏవం విదేహాధిపతిర్మధురం వాక్యమబ్రవీత్ ||

14

విశ్వామిత్రాభ్యనుజ్ఞాతః శతానందమతే స్థితః |
ఇత్యుక్త్వా విరతా దూతా రాజగౌరవశంకితాః ||

15

దూతవాక్యం తు తచ్ఛ్రుత్వా రాజా పరమహర్షితః |
వసిష్ఠం వామదేవం చ మంత్రిణోన్యాంశ్చ సోఽబ్రవీత్ ||

16

గుప్తః కుశికపుత్రేణ కౌసల్యానందవర్ధనః |
లక్ష్మణేన సహ భ్రాత్రా విదేహేషు వసత్యసౌ ||

17

దృష్టవీర్యస్తు కాకుత్స్థో జనకేన మహాత్మనా |
సంప్రదానం సుతాయాస్తు రాఘవే కర్తుమిచ్ఛతి ||

18

యది వో రోచతే వృత్తం జనకస్య మహాత్మనః |
పురీం గచ్ఛామహే శీఘ్రం మా భూత్కాలస్య పర్యయః ||

19

మంత్రిణో బాఢమిత్యాహుః సహ సర్వైర్మహర్షిభిః |
సుప్రీతశ్చాబ్రవీద్రాజా శ్వో యాత్రేతి స మంత్రిణః ||

20

మంత్రిణస్తు నరేంద్రేణ రాత్రిం పరమసత్కృతాః |
ఊషుః ప్రముదితాః సర్వే గుణైః సర్వైః సమన్వితాః ||

21

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే అష్టషష్టితమః సర్గః ||

Balakanda Sarga 68 Meaning In Telugu

జనకమహారాజు పంపిన దూతలు అత్యంత ప్రయాసల కోర్చి మూడుదినములకు అయోధ్య నగరమునకు చేరుకున్నారు. రాజభవనమునకు వెళ్లారు. బయట ఉన్న ద్వార పాలకులకు “మిథిలా నగరము నుండి జనకమహారాజు దూతలు వచ్చారు అని దశరథ మహారాజు గారికి మనవి చేయండి.” అని వర్తమానము పంపారు.

ఆ వర్తమానమును అందుకున్న దశరథుడు వారిని లోపలకు రమ్మన్నాడు. జనక మహారాజు పంపిన దూతలు జ్ఞానవృద్ధుడు, వయోవృద్ధుడు అయిన దశరథమహారాజును చూచి వినయంతో నమస్కరించారు. ఆయనతో ఇలా అన్నారు.

“దశరథ మహారాజా! తమరికి జయము కలుగు గాక! మేము మిథిలాధి పతి అయిన జనకమహారాజు వద్దనుండి దూతలుగా వచ్చాము. జనక మహారాజు తమరియొక్క, తమరి మంత్రి, సామంత, పురోహితుల యొక్క యోగ క్షేమ సమాచారములు విచారించు చున్నారు. తమరి కుశలము కనుక్కోమని చెప్పారు. తమరి కుమారులు రాముడు, లక్ష్మణుడు విశ్వామిత్రుల వారి సంరక్షణలో సురక్షితముగా ఉన్నారని తమరికి చెప్పమన్నారు. విశ్వామిత్రుడు, రామలక్ష్మణులు మిథిలలో జనక మహారాజు అతిథి సత్కారములు అందుకుంటున్నారు అని చెప్పమన్నారు. విశ్వామిత్రుల వారి అనుమతితో తమరితో ఈ మాటలు, వారి మాటలుగా చెప్పమన్నారు.

“నేను నా కుమార్తె సీతను వీరత్వమునే శుల్కముగా నిర్ణయించి వివాహము జరిపిస్తాను అని ప్రతిజ్ఞ చేసిన విషయం తమరికి తెలుసు. కాని నా కుమార్తెను వరించి వచ్చిన వీరులందరూ నా చేత పరాజితులై పారిపోయారు. వీర్యశుల్క అయిన నా కుమార్తె సీతను, విశ్వామిత్ర మహర్షి వెంట మిథిలకు వచ్చిన తమరి కుమారుడు, రాముడు, తన వీరత్వముతో గెల్చుకున్నాడు. తర తరాలుగా మా గృహములో పూజలందుకొనుచున్న శివధనుస్సును తమరి కుమారుడు రాముడు అవలీలగా ఎక్కుపెట్టి మధ్యకు విరిచి లోకానికి తన పరాక్రమమును చాటాడు.

వీర్యశుల్క అయిన నా కుమార్తె సీతను నా ప్రతిజ్ఞ ప్రకారము తమరి కుమారుడు రామునికి ఇచ్చి వివాహము చేయుటకు నాకు అనుజ్ఞ ఇవ్వవలసినదిగా ప్రార్థించుచున్నాను. తమరు బంధువులు, మిత్రులు, పురోహితులు సహితంగా మిథిలకు విచ్చేయవలసినదిగా కోరుచున్నాను. తమరుమిథిలకు వచ్చి శ్రీరాముని వివాహ మహోత్సవమును జరిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను.” అని జనక మహారాజు విశ్వామిత్రుల అనుమతి పొంది, తమ పురోహితులు శతానందులవారి అనుమతి పొంది తమరితో పైవిధముగా చెప్పమన్నారు.” అని ఆ దూతలు జనక మహారాజు సందేశమును దశరథునికి సవినయంగా మనవిచేసారు.

తన కుమారునికి వివాహము అని తెలిసి దశరథుడు ఎంతో సంతోషించాడు. వసిష్ఠుని, పురోహితులను పిలిపించాడు.

వారితో ‘ ఇలా అన్నాడు. “రాముడు, లక్ష్మణుడు విశ్వామిత్రునితో కలిసి విదేహ పురములో ఉన్నాడని వర్తమానము వచ్చింది. మన రాముని బల పరాక్రమములు చూచి విదేహ మహారాజు జనకుడు తన కుమార్తె సీతను మన రామునికి ఇచ్చి వివాహము చేయ సంకల్పించాడట. కాబట్టి మీరు జనకుని గురించి వివరాలు సేకరించండి. జనకునితో సంబంధము మీ అందరకూ ఇష్టం అయితే. జనకుని ఆచార వ్యవహారాలు మీకు నచ్చితే, మనము విదేహ పురమునకు బయలుదేరి వెళుదాము.” అని అన్నాడు.

దశరథుని ఆస్థానములో ఉన్న పురోహితులు, ఋషులు తమలో తాము తర్కించుకొని అందరూ ఏక కంఠంతో జనకునితో సంబంధము తమకు ఇష్టమే అని చెప్పారు. ఆ మాటలకు దశరథుడు ఎంతో సంతోషించాడు. “రేపే ప్రయాణము” అని నిర్ణయించాడు.

జనక మహారాజు దూతలు ఆ రాత్రికి దశరథమహారాజు అతిధులుగా అయోధ్యలో ఉన్నారు.

శ్రీమద్రామాయణము
బాలకాండము అరవై ఎనిమిదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

బాలకాండ ఏకోనసప్తతితమః సర్గః (69) >>

Leave a Comment