Balakanda Sarga 57 In Telugu – బాలకాండ సప్తపంచాశః సర్గః

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ లోని సప్తపంచాశః సర్గలో, త్రిశంకు పురాణం రాముడికి వివరించబడింది, ఇది విశ్వామిత్రుని పురాణంలో భాగమైంది. బ్రహ్మ విశ్వామిత్రుడిని బ్రాహ్మణ-సన్యాసిగా కాకుండా, రాజుగా-సన్యాసిగా ఉండమని ఆశీర్వదించినప్పుడు, విశ్వామిత్రుడు దేశంలోని దక్షిణ ప్రాంతాలలో తన ఆశ్రయాన్ని కొనసాగిస్తాడు. ఈలోగా, త్రిశంకు అనే రాజు మర్త్య శరీరంతో స్వర్గానికి వెళ్లాలని కోరుకున్నాడు మరియు ఆ సూచనను తిరస్కరించిన వశిష్టుడిని సంప్రదించాడు. అప్పుడు ఆ రాజు అదే ఆలోచనతో అదే వశిష్ఠుని కుమారులను సంప్రదిస్తాడు.

త్రిశంకుయాజనప్రార్థనా

తతః సంతప్తహృదయః స్మరన్నిగ్రహమాత్మనః |
వినిఃశ్వస్య వినిఃశ్వస్య కృతవైరో మహాత్మనా ||

1

స దక్షిణాం దిశం గత్వా మహిష్యా సహ రాఘవ |
తతాప పరమం ఘోరం విశ్వామిత్రో మహత్తపః ||

2

అథాస్య జజ్ఞిరే పుత్రాః సత్యధర్మపరాయణాః |
హవిఃష్యందో మధుష్యందో దృఢనేత్రో మహారథః ||

3

పూర్ణే వర్షసహస్రే తు బ్రహ్మా లోకపితామహః |
అబ్రవీన్మధురం వాక్యం విశ్వామిత్రం తపోధనమ్ ||

4

జితా రాజర్షిలోకాస్తే తపసా కుశికాత్మజ |
అనేన తపసా త్వాం తు రాజర్షిరితి విద్మహే ||

5

ఏవముక్త్వా మహాతేజా జగామ సహ దైవతైః |
త్రివిష్టపం బ్రహ్మలోకం లోకానాం పరమేశ్వరః ||

6

విశ్వామిత్రోఽపి తచ్ఛ్రుత్వా హ్రియా కించిదవాఙ్ముఖః |
దుఃఖేన మహతాఽఽవిష్టః సమన్యురిదమబ్రవీత్ ||

7

తపశ్చ సుమహత్తప్తం రాజర్షిరితి మాం విదుః |
దేవాః సర్షిగణాః సర్వే నాస్తి మన్యే తపఃఫలమ్ ||

8

ఇతి నిశ్చిత్య మనసా భూయైవ మహాతపాః |
తపశ్చచార కాకుత్స్థ పరమం పరమాత్మవాన్ ||

9

ఏతస్మిన్నేవ కాలే తు సత్యవాదీ జితేంద్రియః |
త్రిశంకురితి విఖ్యాత ఇక్ష్వాకుకులవర్ధనః ||

10

తస్య బుద్ధిః సముత్పన్నా యజేయమితి రాఘవ |
గచ్ఛేయం స్వశరీరేణ దేవానాం పరమాం గతిమ్ ||

11

స వసిష్ఠం సమాహూయ కథయామాస చింతితమ్ |
అశక్యమితి చాప్యుక్తో వసిష్ఠేన మహాత్మనా ||

12

ప్రత్యాఖ్యాతో వసిష్ఠేన స యయౌ దక్షిణాం దిశమ్ |
తతస్తత్కర్మసిద్ధ్యర్థం పుత్రాంస్తస్య గతో నృపః ||

13

వాసిష్ఠా దీర్ఘతపసస్తపో యత్ర హి తేపిరే |
త్రిశంకుః సుమహాతేజాః శతం పరమభాస్వరమ్ ||

14

వసిష్ఠపుత్రాన్దదృశే తప్యమానాన్యశస్వినః |
సోఽభిగమ్య మహాత్మానః సర్వానేవ గురోః సుతాన్ ||

15

అభివాద్యానుపూర్వ్యేణ హ్రియా కించిదవాఙ్ముఖః |
అబ్రవీత్సుమహాభాగాన్సర్వానేవ కృతాంజలిః ||

16

శరణం వః ప్రపద్యేఽహం శరణ్యాన్ శరణాగతః |
ప్రత్యాఖ్యాతోఽస్మి భద్రం వో వసిష్ఠేన మహాత్మనా ||

17

యష్టుకామో మహాయజ్ఞం తదనుజ్ఞాతుమర్హథ |
గురుపుత్రానహం సర్వాన్నమస్కృత్య ప్రసాదయే ||

18

శిరసా ప్రణతో యాచే బ్రాహ్మణాంస్తపసి స్థితాన్ |
తే మాం భవంతః సిద్ధ్యర్థం యాజయంతు సమాహితాః ||

19

సశరీరో యథాహం వై దేవలోకమవాప్నుయామ్ |
ప్రత్యాఖ్యాతో వసిష్ఠేన గతిమన్యాం తపోధనాః ||

20

గురుపుత్రానృతే సర్వాన్నాహం పశ్యామి కాంచన |
ఇక్ష్వాకూణాం హి సర్వేషాం పురోధాః పరమా గతిః ||

21

పురోధసస్తు విద్వాంసస్తారయంతి సదా నృపాన్ |
తస్మాదనంతరం సర్వే భవంతో దైవతం మమ ||

22

Balakanda Sarga 57 In Telugu Pdf With Meaning

“ఓ రామా! వసిష్ఠుని చేతిలో ఓడిపోయి పరాభవము చెందిన తరువాత, ఆ అవమాన భారము తట్టుకోలేని విశ్వామిత్రుడు తన భార్యతో సహా దక్షిణ దిశగా వెళ్లాడు. అక్కడ కేవలం ఫలములు మాత్రము ఆహారముగా తీసుకుంటూ, ఘోరమైన తపస్సుచేసాడు. ఆ సమయంలో విశ్వామిత్రునకు హవిష్యందుడు, మధుస్యందుడు, ధృడనేత్రుడు, మహారథుడు అనే నలుగురు కుమారులు జన్మించారు. అప్పటికి వేయి సంవత్సరములు గడిచాయి.

విశ్వామిత్రుని తపస్సునకు మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షం అయ్యాడు. “ఓ విశ్వామిత్రా! నీ తపస్సునకు నేను మెచ్చాను. నీవు క్షత్రియుడవు. ఇప్పుడు బ్రాహ్మణత్వము అవలంబించి తపస్సు చేసావు. అందుచేత నీవు రాజర్షివి అయ్యావు.” అని పలికాడు.

తరువాత బ్రహ్మదేవుడు స్వర్గలోకమునకు వెళ్లిపోయాడు. బ్రహ్మదేవుడు చెప్పిన మాటలతో విశ్వామిత్రునకు తృప్తి కలగలేదు. పైగా కోపం వచ్చింది. ఇంత కాలము తపస్సు చేసిన తనను రాజర్షి అంటాడా. నేను బ్రహ్మర్షిని ఎందుకు కాకూడదు. బ్రహ్మర్షి అని పిలువబడేవరకు తపస్సు చేస్తాను. అని నిర్ణయించుకున్నాడు. మరలా తపస్సు చేయడం మొదలు పెట్టాడు విశ్వామిత్రుడు.

ఆవిధంగా విశ్వామిత్రుడు తీవ్రంగా తపస్సు చేస్తున్న కాలంలో ఇక్ష్వాకు వంశంలో త్రిశంకు అనే రాజుఉండేవాడు. అతనికి ఈ శరీరంతోపాటు స్వర్గానికి వెళ్లాలి అనే కోరిక బలీయంగా ఉండేది. ఆయన ఆస్థానములో వసిష్ఠుడు పురోహితుడుగా ఉండేవాడు.

త్రిశంకు వసిష్ఠుని పిలిచి తన కోరిక తెలిపాడు. త్రిశంకుని విపరీతమైన కోరిక విన్న వసిష్ఠుడు ఆ పని తన వల్లకాదు అని చెప్పాడు.

“నీ వల్ల కాక పోతే నీ కుమారులతో చేయిస్తాను” అని పలికి త్రిశంకుడు వసిష్ఠుని కుమారుల వద్దకు వెళ్లాడు. వసిష్ఠుని నూర్గురు కుమారులు తమతమ ఆశ్రమములలో తపస్సు చేసుకుంటున్నారు. వారి వద్దకు వెళ్లాడు త్రిశంకు. వాళ్లముందు చేతులు జోడించి ఇలా ప్రార్థించాడు.

“ఓ ముని కుమారులారా! నేను ఒక యజ్ఞము చేయ సంకల్పించాను. కాని మీ తండ్రిగారు వసిష్ఠులవారు నా చేత ఆ యజ్ఞము చేయించుటకు ఒప్పుకొనలేదు. అందు వలన మీ వద్దకు వచ్చాను. నేను ఈ శరీరముతో స్వర్గలోకమునకు పోవుటకు తగిన యజ్ఞమును మీరు నా చేత చేయించాలి. మీరు మహానుభావులు. అటువంటి యజ్ఞచేయించుటకు మీరే సమర్థులు.

వసిష్ఠుడు నాకు పురోహితుడు. ఆయన కాదన్నపుడు ఆ కార్యము ఆయన కుమారులైన మీరే నెరవేర్చాలి. రాజులకు పురోహితులు దైవసమానులు కదా!. అందువలన మీరు నాకు దైవ సమానులు. కాబట్టి నా కోరిక కాదనకండి. నా చేత యజ్ఞము చేయించి నన్ను సశరీరంగా స్వర్గలోకమునకు పంపండి” అని వేడుకున్నాడు త్రిశంకు.

శ్రీమద్రామాయణము
బాలకాండము యాభైఏడవ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

బాలకాండ అష్టపంచాశః సర్గః (58) >>

Leave a Comment