మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ లోని ఏకసప్తతితమః సర్గలో, జనకుడు తన కుమార్తెలను రాముడు మరియు లక్ష్మణులకు వధువులుగా అర్పిస్తూ తన వంశాన్ని వివరిస్తాడు. అలా చేయడం ద్వారా, అతను తన సోదరుడు కుశధ్వజ గురించి మరింత వివరంగా చెప్పాడు, అతని కుమార్తెలు భరతుడు మరియు శత్రుఘ్నులకు కాబోయే భార్యలు. పెళ్లికి టైమింగ్స్ కూడా ఫిక్స్ చేస్తారు.
కన్యాదానప్రతిశ్రవః
ఏవం బ్రువాణం జనకః ప్రత్యువాచ కృతాంజలిః |
శ్రోతుమర్హసి భద్రం తే కులం నః పరికీర్తితమ్ ||
1
ప్రదానే హి మునిశ్రేష్ఠ కులం నిరవశేషతః |
వక్తవ్యం కులజాతేన తన్నిబోధ మహామునే ||
2
రాజాఽభూత్త్రిషు లోకేషు విశ్రుతః స్వేన కర్మణా |
నిమిః పరమధర్మాత్మా సర్వసత్త్వవతాం వరః ||
3
తస్య పుత్రో మిథిర్నామ ప్రథమో మిథిపుత్రకః |
ప్రథమాజ్జనకో రాజా జనకాదప్యుదావసుః ||
4
ఉదావసోస్తు ధర్మాత్మా జాతో వై నందివర్ధనః |
నందివర్ధనపుత్రస్తు సుకేతుర్నామ నామతః ||
5
సుకేతోరపి ధర్మాత్మా దేవరాతో మహాబలః |
దేవరాతస్య రాజర్షేర్బృహద్రథ ఇతి స్మృతః ||
6
బృహద్రథస్య శూరోఽభూన్మహావీరః ప్రతాపవాన్ |
మహావీరస్య ధృతిమాన్సుధృతిః సత్యవిక్రమః ||
7
సుధృతేరపి ధర్మాత్మా ధృష్టకేతుః సుధార్మికః |
ధృష్టకేతోస్తు రాజర్షేర్హర్యశ్వ ఇతి విశ్రుతః ||
8
హర్యశ్వస్య మరుః పుత్రో మరోః పుత్రః ప్రతింధకః |
ప్రతింధకస్య ధర్మాత్మా రాజా కీర్తిరథః సుతః ||
9
పుత్రః కీర్తిరథస్యాపి దేవమీఢ ఇతి స్మృతః |
దేవమీఢస్య విబుధో విబుధస్య మహీధ్రకః ||
10
మహీధ్రకసుతో రాజా కీర్తిరాతో మహాబలః |
కీర్తిరాతస్య రాజర్షేర్మహారోమా వ్యజాయత ||
11
మహారోమ్ణస్తు ధర్మాత్మా స్వర్ణరోమా వ్యజాయత |
స్వర్ణరోమ్ణస్తు రాజర్షేర్హ్రస్వరోమా వ్యజాయత ||
12
తస్య పుత్రద్వయం జజ్ఞే ధర్మజ్ఞస్య మహాత్మనః |
జ్యేష్ఠోఽహమనుజో భ్రాతా మమ వీరః కుశధ్వజః ||
13
మాం తు జ్యేష్ఠం పితా రాజ్యే సోఽభిషిచ్య నరాధిపః |
కుశధ్వజం సమావేశ్య భారం మయి వనం గతః ||
14
వృద్ధే పితరి స్వర్యాతే ధర్మేణ ధురమావహమ్ |
భ్రాతరం దేవసంకాశం స్నేహాత్పశ్యన్కుశధ్వజమ్ ||
15
కస్యచిత్త్వథ కాలస్య సాంకాశ్యాదగమత్పురాత్ |
సుధన్వా వీర్యవాన్రాజా మిథిలామవరోధకః ||
16
స చ మే ప్రేషయామాస శైవం ధనురనుత్తమమ్ |
సీతా కన్యా చ పద్మాక్షీ మహ్యం వై దీయతామితి ||
17
తస్యాఽప్రదానాద్బ్రహ్మర్షే యుద్ధమాసీన్మయా సహ |
స హతోఽభిముఖో రాజా సుధన్వా తు మయా రణే ||
18
నిహత్య తం మునిశ్రేష్ఠ సుధన్వానం నరాధిపమ్ |
సాంకాశ్యే భ్రాతరం వీరమభ్యషించం కుశధ్వజమ్ ||
19
కనీయానేష మే భ్రాతా అహం జ్యేష్ఠో మహామునే |
దదామి పరమప్రీతో వధ్వౌ తే మునిపుంగవ ||
20
సీతాం రామాయ భద్రం తే ఊర్మిలాం లక్ష్మణాయ వై |
వీర్యశుల్కాం మమ సుతాం సీతాం సురసుతోపమామ్ ||
21
ద్వితీయామూర్మిలాం చైవ త్రిర్దదామి న సంశయః |
రామలక్ష్మణయో రాజన్గోదానం కారయస్వ హ ||
22
పితృకార్యం చ భద్రం తే తతో వైవాహికం కురు |
మఘా హ్యద్య మహాబాహో తృతీయే దివసే విభో ||
23
ఫల్గున్యాముత్తరే రాజంస్తస్మిన్వైవాహికం కురు |
రామలక్ష్మణయో రాజన్దానం కార్యం సుఖోదయమ్ ||
24
Balakanda Sarga 71 In Telugu Pdf With Meaning
ఆ ప్రకారంగా వసిష్ఠుడు దశరథుని వంశము గురించి చెప్పిన తరువాత, జనకుడు చేతులు జోడించి ఇలా అన్నాడు.
“ఓ దశరథ మహారాజా! తమరి వంశక్రమమును గూర్చి విని చాలా ఆనందించాను. కన్యాదాన సమయములో వధువు యొక్క వంశమును గూర్చి కూడా వివరించడం సాంప్రదాయము. కాబట్టి మా వంశ చరిత్రను వివరిస్తాను. అవధరించండి.
మాది మిథిలా నగరము. ఈ మిథిలా నగరమును నిర్మించిన వాడు మిథి అనే చక్రవర్తి. మిది, నిమి చక్రవర్తి కుమారుడు. ఆయనే మా వంశమునకు మూలపురుషుడు. మిథిని జనకుడు అని కూడా పిలుస్తారు. ఆయనే మా వంశములో మొట్ట మొదటి జనకుడు.
మిథి కుమారుడు ఉదావసువు. ఉదావసుని కుమారుడు నందివర్థనుడు. నంది వర్ధనుని కుమారుడు సుకేతువు. సుకేతుని కుమారుడు దేవరాతుడు. దేవరాతుని కుమారుడు బృహద్రథుడు. బృహద్రథుని కుమారుడు మహావీరుడు. మహావీరుని కుమారుడు సుధృతి. సుధృతి కుమారుడు దుష్టకేతువు. ఆయన రాజర్షి.
రాజర్షిఅయిన దుష్టకేతువు కుమారుడు హర్యశ్వుడు. హర్యశ్వుని కుమారుడు మరుడు. మరుని కుమారుడు ప్రతింధకుడు. ప్రతింధకుని కుమారుడు కీర్తిరథుడు. కీర్తిరథుని కుమారుడు దేవమీఢుడు. దేవమీఢుని కుమారుడు విబుధుడు. విబుధుని కుమారుడు మహీధ్రకుడు. మహీధ్రకుని కుమారుడు కీర్తిరాతుడు. ఆయన కూడా రాజర్షి.
రాజర్షి అయిన కీర్తిరాతునికి మహారోముడు జన్మించాడు. మహారోముని కుమారుడు స్వర్ణరోముడు. స్వర్ణరోముని కుమారుడు హ్రస్వరోముడు. ఆ హ్రస్వరోమునికి ఇరువురు కుమారులు పుట్టారు. అందులో పెద్దవాడను నేను. రెండవ వాడు నా తమ్ముడు కుశధ్వజుడు.
మా తండ్రిగారైన హ్రస్వరోమ మహారాజు నన్ను ఈ మిథిలా నగరమునకు రాజుగా చేసాడు. నా తమ్ముని బాధ్యతను నాకు అప్పగించి ఆయన వనములకు వెళ్లాడు. కాలవశాత్తు నా తండ్రిగారు స్వర్గస్థులయ్యారు. నేను నా తమ్ముని పోషణభారము వహించి రాజ్యము చేస్తున్నాను.
కొంత కాలము తరువాత సాంకాశ మహారాజు సుధన్వుడు నా రాజ్యము మీదికి దండెత్తి వచ్చాడు. నా వద్ద ఉన్న శివధనుస్సును, నా కుమార్తె సీతను తనకు ఇవ్వమని నాకు వర్తమానము పంపాడు. నేను నా కుమార్తెను గానీ శివధనుస్సును గానీ సుధన్వునికి ఇవ్వడానికి అంగీకరించలేదు. మా ఇరువురికి యుద్ధము జరిగింది.
నేను సుధన్వుని యుద్ధములో ఓడించి వధించాను. సాంకాశ పురమును ఆక్రమించుకున్నాను. తరువాత నా తమ్ముడు కుశధ్వజుని సాంకాశ పురమునకు రాజుగా పట్టాభిషిక్తుని చేసాను.
ఓ వసిష్ట మునీంద్రా! మా సోదరులలో నేను పెద్ద వాడను. నా కుమార్తె పేరు సీత. నా తమ్ముడు కుశధ్వజుని కుమార్తె పేరు ఊర్మిళ. సీతను రామునికి, ఊర్మిళను లక్ష్మణునికి ఇచ్చి వివాహము జరిపించడానికి సంకల్పించాను. ఈ విషయమును ఏ మాత్రము సందేహమునకు తావు లేకుండా మూడు మారులు నొక్కి చెప్పుచున్నాను. నా కుమార్తెలైన సీత, ఊర్మిళ లను దశరథమహారాజు కుమారులైన రామునికి లక్ష్మణునికి ఇచ్చి వివాహం జరిపించుటకు ఎంతో ఆనందించుచున్నాను.
ఓ దశరథ మహారాజా! రామ లక్ష్మణులతో గోదానము మొదలగు శుభకార్యములను చేయించండి. పితృకార్యము జరిపించిన తదుపరి వివాహమహోత్సవమును జరిపించెదను.
ఓ దశరథ మహారాజా! నేడు మఘా నక్షత్రము. నేటికి మూడవ రోజున అనగా ఉత్తరఫల్గునీ నక్షత్రములో వివాహము జరిపించెదము. ఈ రెండు రోజులలో రామ లక్ష్మణుల చేత గోదానము మొదలగు దానములు ఇచ్చు కార్యక్రములు నిర్వర్తింపుడు.” అని వినయంతో పలికాడు జనకుడు.
శ్రీమద్రామాయణము
బాలకాండము డెబ్బది ఒకటవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.
బాలకాండ ద్విసప్తతితమః సర్గః (72) >>