Aranya Kanda Sarga 14 In Telugu – అరణ్యకాండ చతుర్దశః సర్గః

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. “అరణ్యకాండ” చతుర్దశః సర్గలో, రాముడు మరియు మిగిలిన ఇద్దరు పంచవటికి వెళుతుండగా జటాయు అనే శక్తివంతమైన డేగతో పరిచయం ఏర్పడింది. రాముడు దాని గుర్తింపు గురించి ప్రశ్నించినప్పుడు, జటాయు మానవులతో పాటు జంతు జాతుల సృష్టిని వివరిస్తాడు మరియు తాను దశరథ రాజుకు స్నేహితుడని మరియు అజ్ఞాతవాసంలో ఉన్న రాముడికి సహాయం చేయాలనుకుంటున్నానని రాముడికి తెలియజేస్తాడు.

జటాయుఃసంగమః

అథ పంచవటీం గచ్ఛన్నంతరా రఘునందనః |
ఆససాద మహాకాయం గృధ్రం భీమపరాక్రమమ్ ||

1

తం దృష్ట్వా తౌ మహాభాగౌ వటస్థం రామలక్ష్మణౌ |
మేనాతే రాక్షసం పక్షిం బ్రువాణౌ కో భవానితి ||

2

స తౌ మధురయా వాచా సౌమ్యయా ప్రీణయన్నివ |
ఉవాచ వత్స మాం విద్ధి వయస్యం పితురాత్మనః ||

3

స తం పితృసఖం బుద్ధ్వా పూజయామాస రాఘవః |
స తస్య కులమవ్యగ్రమథ పప్రచ్ఛ నామ చ ||

4

రామస్య వచనం శ్రుత్వా సర్వభూతసముద్భవమ్ |
ఆచచక్షే ద్విజస్తస్మై కులమాత్మానమేవ చ ||

5

పూర్వకాలే మహాబాహో యే ప్రజాపతయోఽభవన్ |
తాన్మే నిగదతః సర్వానాదితః శృణు రాఘవ ||

6

కర్దమః ప్రథమస్తేషాం విశ్రుతస్తదనంతరః |
శేషశ్చ సంశ్రయశ్చైవ బహుపుత్రశ్చ వీర్యవాన్ ||

7

స్థాణుర్మరీచిరత్రిశ్చ క్రతుశ్చైవ మహాబలః |
పులస్త్యశ్చాంగిరాశ్చైవ ప్రచేతాః పులహస్తథా ||

8

దక్షో వివస్వానపరోఽరిష్టనేమిశ్చ రాఘవ |
కశ్యపశ్చ మహాతేజాస్తేషామాసీచ్చ పశ్చిమః ||

9

ప్రజాపతేస్తు దక్షస్య బభూవురితి విశ్రుతమ్ |
షష్టిర్దుహితరో రామ యశస్విన్యో మహాయశః ||

10

కశ్యపః ప్రతిజగ్రాహ తాసామష్టౌ సుమధ్యమాః |
అదితిం చ దితిం చైవ దనుమప్యథ కాలికామ్ ||

11

తామ్రాం క్రోధవశాం చైవ మనుం చాప్యనలామపి |
తాస్తు కన్యాస్తతః ప్రీతః కశ్యపః పునరబ్రవీత్ ||

12

పుత్రాంస్రైలోక్యభర్తౄన్వై జనయిష్యథ మత్సమాన్ |
అదితిస్తన్మనా రామ దితిశ్చ మనుజర్షభ ||

13

కాలికా చ మహాబాహో శేషాస్త్వమనసోఽభవన్ |
అదిత్యాం జజ్ఞిరే దేవాస్త్రయస్త్రింశదరిందమ ||

14

ఆదిత్యా వసవో రుద్రా హ్యశ్వినౌ చ పరంతప |
దితిస్త్వజనయత్పుత్రాన్దైత్యాంస్తాత యశస్వినః ||

15

తేషామియం వసుమతీ పురాసీత్సవనార్ణవా |
దనుస్త్వజనయత్పుత్రమశ్వగ్రీవమరిందమ ||

16

నరకం కాలకం చైవ కాలికాపి వ్యజాయత |
క్రౌంచీం భాసీం తథా శ్యేనీం ధృతరాష్ట్రీం తథా శుకీమ్ ||

17

తామ్రాపి సుషువే కన్యాః పంచైతా లోకవిశ్రుతాః |
ఉలూకాన్ జనయత్క్రౌంచీ భాసీ భాసాన్వ్యజాయత ||

18

శ్యేనీ శ్యేనాంశ్చ గృధ్రాంశ్చ వ్యజాయత సుతేజసః |
ధృతరాష్ట్రీ తు హంసాంశ్చ కలహంసాంశ్చ సర్వశః ||

19

చక్రవాకాంశ్చ భద్రం తే విజజ్ఞే సాపి భామినీ |
శుకీ నతాం విజజ్ఞే తు నతాయా వినతా సుతా ||

20

దశ క్రోధవశా రామ విజజ్ఞే హ్యాత్మసంభవాః |
మృగీం చ మృగమందాం చ హరిం భద్రమదామపి ||

21

మాతంగీమపి శార్దూలీం శ్వేతాం చ సురభిం తథా |
సర్వలక్షణసంపన్నాం సురసాం కద్రుకామపి ||

22

అపత్యం తు మృగాః సర్వే మృగ్యా నరవరోత్తమ |
ఋక్షాశ్చ మృగమందాయాః సృమరాశ్చమరాస్తథా ||

23

హర్యాశ్చ హరయోఽపత్యం వానరాశ్చ తరస్వినః |
తతస్త్విరావతీం నామ జజ్ఞే భద్రమదా సుతామ్ ||

24

తస్యాస్త్వైరావతః పుత్రో లోకనాథో మహాగజః |
మాతంగాస్త్వథ మాతంగ్యా అపత్యం మనుజర్షభ ||

25

గోలాంగూలాంశ్చ శార్దూలీ వ్యాఘ్రాంశ్చాజనయత్సుతాన్ |
దిశాగజాంశ్చ కాకుత్స్థ శ్వేతాప్యజనయత్సుతాన్ ||

26

తతో దుహితరౌ రామ సురభిర్ద్వే వ్యజాయత |
రోహిణీం నామ భద్రం తే గంధర్వీం చ యశస్వినీమ్ ||

27

రోహిణ్యజనయద్గా వై గంధర్వీ వాజినః సుతాన్ |
సురసాజనయన్నాగాన్రామ కద్రూస్తు పన్నగాన్ ||

28

మనుర్మనుష్యాంజనయద్రామ పుత్రాన్యశస్వినః |
బ్రాహ్మణాన్క్షత్త్రియాన్వైశ్యాన్ శూద్రాంశ్చ మనజర్షభ ||

29

సర్వాన్పుణ్యఫలాన్వృక్షాననలాపి వ్యాజాయత |
వినతా చ శుకీ పౌత్రీ కద్రూశ్చ సురసా స్వసా ||

30

కద్రూర్నాగం సహస్రస్యం విజజ్ఞే ధరణీధరమ్ |
ద్వౌ పుత్రౌ వినతాయాస్తు గరుడోఽరుణ ఏవ చ ||

31

తస్మాజ్జాతోఽహమరుణాత్సంపాతిస్తు మమాగ్రజః |
జటాయురితి మాం విద్ధి శ్యేనీపుత్రమరిందమ ||

32

సోఽహం వాససహాయస్తే భవిష్యామి యదీచ్ఛసి |
ఇదం దుర్గం హి కాంతారం మృగరాక్షససేవితమ్ |
సీతాం చ తాత రక్షిష్యే త్వయి యాతే సలక్ష్మణే ||

33

జటాయుషం తం ప్రతిపూజ్య రాఘవో
ముదా పరిష్వజ్య చ సన్నతోఽభవత్ |
పితుర్హి శుశ్రావ సఖిత్వమాత్మవాన్
జటాయుషా సంకథితం పునః పునః ||

34

స తత్ర సీతాం పరిదాయ మైథిలీం
సహైవ తేనాతిబలేన పక్షిణా |
జగామ తాం పంచవటీం సలక్ష్మణో
రిపూన్దిధక్షన్ శలభానివానలః ||

35

Aranya Kanda Sarga 14 In Telugu Pdf Download

రాముడు సీత, లక్ష్మణులతో సహా పంచవటికి వెళుతున్నాడు. దారిలో వారికి ఒక వటవృక్షము మీద కూర్చుని ఉన్న పెద్ద ఆకారము కల పక్షి కనపడింది. ఆ అరణ్యములో కామరూపులైన రాక్షసులు నివసిస్తుంటారు అని విని ఉన్నాడు. అందుకని ఆ పక్షిని రాక్షసుడిగా తలచాడు రాముడు.

“నీవు ఎవరవు? ఇక్కడ ఎందుకు ఉన్నావు?” అని అడిగాడు రాముడు.

“రామా! నేను నీకు తెలియకపోయినా నీవు నాకు తెలుసు. నీవు దశరథుని కుమారుడైన రాముడివి. నీ తండ్రి దశరథుడు నాకు మంచి మిత్రుడు.” అని అన్నాడు.

తన తండ్రికి మిత్రుడైన వాడు తనకు గౌరవింపతగ్గవాడు అని అనుకొన్నాడు రాముడు. ఆ పక్షికి అభివాదము చేసాడు. ఆ పక్షి రామునితో ఇలా పలికింది.

“రామా! నీకు పూర్వము ఎంతమంది ప్రజాపతులున్నారో వారి గురించి చెబుతాను శ్రద్ధగా విను.

ప్రజాపతులలో ప్రథముడు కర్దముడు. అతని తరువాతి వాడు విక్రీతుడు. ఆ తరువాత శేషుడు. అతని తరువాత సంశ్రయుడు, స్థాణువు, మరీచి, అత్రి, క్రతువు, పులస్యుడు, అంగిరసుడు, ప్రచేతసుడు, పులహుడు, దక్షుడు, వివస్వంతుడు వరుసగా ప్రజాపతులయ్యారు.

ఆఖరి వాడు కశ్యప ప్రజాపతి. ఆయనకు అరిష్టనేమి అనే పేరుకూడా ఉంది. నీకు చెప్పానే దక్షుడు అని, ఆయనకు అరవై మంది కుమార్తెలు. వారిలో అదితి, దితి, దనువు, కాళిక, తామ్ర, క్రోధవశ,మను, అనల అనే ఎనిమింది కన్యలను కశ్యపప్రజాపతి పెళ్లిచేసుకున్నాడు.

కశ్యపుడు తన భార్యలతో “మీరందరూ నాతో సమానమైన ముల్లోకములను పోషించగలిగే పుత్రులను ప్రసవించండి.” అని కోరాడు. వారిలో అదితి, దితి, కాళిక అనే వారు మాత్రము కశ్యపుని మాట మన్నించారు. మిగిలినవారు ఆయన మాటమీద మనసు పెట్టలేదు.

కశ్యపుని కోరిక ప్రకారము అదితికి పన్నెండు మంది ఆదిత్యులు (ద్వాదశాదిత్యులు), ఎనిమిది మంది వసువులను (అష్టవసువులు. అందులో ఆఖరి వసువే శాపకారణంగా గంగాదేవికి భీష్ముడిగా పుట్టాడు. మహాభారత కధకు మూలపురుషుడు అయ్యాడు), పదకొండు మంది రుద్రులు, ఇద్దరు అశ్వినులు, మొత్తం ముప్పది ముగ్గురు దేవతలుపుట్టారు.

కశ్యపునకు దితి యందు దైత్యులు జన్మించారు. వారందరూ ఈ భూమికి అధిపతులయ్యారు. పూర్వము ఈ భూమి అంతా దైత్యుల అధీనంలో ఉండేది.

కశ్యపునకు దనువు అనే భార్య ద్వారా హయగ్రీవుడు అనే పుత్రుడు కలిగాడు. కాళి అనే భార్యకు నరకుడు, కాలకుడు అనే పుత్రులు జన్మించారు. తామ్ర అనే భార్య క్రౌంచి, భాసి, శ్యేని,ధృతరాష్ట్రి, శుకి అనే ఆడపిల్లలకు జన్మనిచ్చింది. (ఇవి అన్నీ పక్షిజాతుల పేర్లు).ఆ తరువాత క్రౌంచికి ఉలూకములు (గుడ్లగూబలు), భాసి అనేకూతురు భాస పక్షులకు జన్మనిచ్చింది. శ్యేని అనే కూతురుకు శ్యేనములు (డేగలు) పుట్టాయి. ధృతరాష్ట్రికి రకరకాలైన హంస జాతులు, చక్రవాక పక్షులు, జన్మించాయి. ఈ ప్రకారంగా పక్షిజాతి అభివృద్ధిచెందింది.

శుకి అనే కూతురుకు నత అనే కుమారుడు కలిగాడు. నతకు వినత అనే కూతురు పుట్టింది. కశ్యపునకు క్రోధవశ అనే భార్య ద్వారా మృగి, మృగమంద, హరి, భద్రమద, మాతంగి, శార్దూలి, శ్వేత, సురభి, సురస, కద్రువ అనే పదిమింది పుత్రికలు జన్మించారు. (ఇవన్నీ మృగజాతుల పేర్లు). మృగి సంతానము లేళ్లు, దుప్పులు, జింకలు. ఎలుగుబంట్లు, చామరీ మృగములు ఇంకా ఇతర మృగములు మృగమంద సంతానము. హరికి సింహములు, వానరములు పుట్టాయి. (అందుకే సింహమునకు కోతులకు, హరి అనే పేరు వచ్చింది.

భద్రమదకు ఇరావతి అనే కూతురు పుట్టింది. ఇరావతికి ఐరావతము పుట్టింది. మాతంగికి ఏనుగుజాతి జన్మించింది. శార్దూలి అనే కూతురికి పెద్దపులులు, కొండముచ్చులు జన్మించాయి. శ్వేతకు దిగ్గజములు జన్మించాయి.

సురభి రోహిణి, గంధర్వి అనే ఇద్దరు కూతుళ్లకు జన్మనిచ్చింది. రోహిణికి గోవులు, గోసంతతి, గంధర్వికి అశ్వజాతి, సురసకు రెండు తలలు అంతకన్నా ఎక్కువ తలల పాములు, కద్రువకు ఒక్కొక్క పడగ ఉన్న పాములు జన్మించాయి.

మనువుకు మానవులు జన్మించారు. ఆ మానవులు వారి వారి గుణముల బట్టీ చేసే వృత్తులబత్తీ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులుగా విభజింపబడ్డారు. అనల మంచి మంచి ఫలములను ఇచ్చు వృక్షజాతికి జన్మనిచ్చింది.

రామా! నీకు పక్షిజాతులకు జన్మనిచ్చిన వినత, నాగులకు జన్మనిచ్చిన కద్రువ గురించి చెబుతాను విను. వినత శుకికి మనుమరాలు. కద్రువ సురసకు సోదరి. కద్రువకు ఆదిశేషుడు కుమారుడుగా పుట్టాడు. వినతకు గరుడుడు, అరుణుడు అనే పుత్రులు జన్మించారు.

(గరుడుడు విష్ణువుకు వాహనము అయ్యాడు. అరుణుడుకి కాళ్లు లేకపోవడం వల్ల సూర్యుని రథమునకు సారథి అయ్యాడు).

ఆ అరుణుడికి ఇద్దరు కుమారులు. నేను, సంపాతి. నా పేరు జటాయువు. నేను శ్యేని జాతికి చెందిన వాడిని. ఇదీ నా జన్మ వృత్తాంతము.

(అవకాశము వస్తే చాలు, పూర్వకాలపు కవులు కొత్త కొత్త విషయాలను ఆయాపాత్రల ద్వారా మనకు తెలియజేస్తారు. వాల్మీకి ఇక్కడ ఎన్నో కొత్త విషయాలు మనకు చెప్పాడు. ఈభూమి మీద మనుషులు, జంతువులు, పక్షులు, వృక్షములు ఎలా పుట్టాయి, వాటి పుట్టు పూర్వోత్తరాలు ఏమిటి అనే విషయాలను వివరంగా చెప్పాడు.)

రామా! ఈ వనమంతా నాకు బాగాతెలుసు. నీకు ఇష్టం అయితే నేను నీకు ఏదైనా సాయం కావలిస్తే చేస్తాను. నీకు సహాయకుడుగా ఉంటాను. ఈ అడవిలో అనేక క్రూర మృగములు, నరమాంసభక్షకులైన రాక్షసులు ఉన్నారు. నీవు కోరితే మీరు ఇంట లేనపుడు సీత రక్షణ బాధ్యతను నేను వహిస్తాను.” అని అన్నాడు.

జటాయువు చెప్పిన మాటలను శ్రద్ధగా విన్నాడు రాముడు. జటాయువును చూచి తన తండ్రిని గుర్తుకు తెచ్చుకున్నాడు. తండ్రికి మారుగా జటాయువును పూజించాడు రాముడు. తరువాత జటాయువు పంచవటికి మార్గం చూపించాడు. జటాయువుతో కలిసి రాముడు, లక్ష్మణుడు సీతతో సహా పంచవటికి వెళ్లాడు.

శ్రీమద్రామాయణము
అరణ్యకాండము పదునాల్గవ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

అరణ్యకాండ పంచదశః సర్గః (15) >>

Leave a Comment