మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. “అరణ్యకాండ” షోడశః సర్గలో, ఒక రోజు సూర్యోదయానికి ముందు రాముడు సీత మరియు లక్ష్మణులతో కలిసి రోజూ స్నానం చేయడానికి గోదావరి నదికి వెళ్తాడు. దారిలో లక్ష్మణుడు చుట్టూ ఉన్న ప్రకృతిని చూస్తూ శీతాకాలాన్ని స్తుతిస్తాడు. అలా చేయడం ద్వారా అతను రాణి కైకేయిపై అసహనం వ్యక్తం చేస్తాడు మరియు రాముడు దానిని ఖండించాడు.
హేమంతవర్ణనమ్
వసతస్తస్య తు సుఖం రాఘవస్య మహాత్మనః |
శరద్వ్యపాయే హేమంత ఋతురిష్టః ప్రవర్తతే ||
1
స కదాచిత్ప్రభాతాయాం శర్వర్యాం రఘునందనః |
ప్రయయావభిషేకార్థం రమ్యాం గోదావరీం నదీమ్ ||
2
ప్రహ్వః కలశహస్తస్తం సీతయా సహ వీర్యవాన్ |
పృష్ఠతోఽనువ్రజన్ భ్రాతా సౌమిత్రిరిదమబ్రవీత్ ||
3
అయం స కాలః సంప్రాప్తః ప్రియో యస్తే ప్రియంవద |
అలంకృత ఇవాభాతి యేన సంవత్సరః శుభః ||
4
నీహారపరుషో లోకః పృథివీ సస్యశాలినీ |
జలాన్యనుపభోగ్యాని సుభగో హవ్యవాహనః ||
5
నవాగ్రయణపూజాభిరభ్యర్చ్య పితృదేవతాః |
కృతాగ్రయణకాః కాలే సంతో విగతకల్మషాః ||
6
ప్రాజ్యకామా జనపదాః సంపన్నతరగోరసాః |
విచరంతి మహీపాలా యాత్రాస్థా విజిగీషవః ||
7
సేవమానే దృఢం సూర్యే దిశమంతకసేవితామ్ |
విహీనతిలకేవ స్త్రీ నోత్తరా దిక్ప్రకాశతే ||
8
ప్రకృత్యా హిమకోశాఢ్యో దూరసూర్యశ్చ సామ్ప్రతమ్ |
యథార్థనామా సువ్యక్తం హిమవాన్ హిమవాన్ గిరిః ||
9
అత్యంతసుఖసంచారా మధ్యాహ్నే స్పర్శతః సుఖాః |
దివసాః సుభగాదిత్యాశ్ఛాయాసలిలదుర్భగాః ||
10
మృదుసూర్యాః సనీహారాః పటుశీతాః సమారుతాః |
శూన్యారణ్యా హిమధ్వస్తా దివసా భాంతి సామ్ప్రతమ్ ||
11
నివృత్తాకాశశయనాః పుష్యనీతా హిమారుణాః |
శీతా వృద్ధతరా యామాస్త్రియామా యాంతి సామ్ప్రతమ్ ||
12
రవిసంక్రాంతసౌభాగ్యస్తుషారారుణమండలః |
నిఃశ్వాసాంధ ఇవాదర్శశ్చంద్రమా న ప్రకాశతే ||
13
జ్యోత్స్నీ తుషారమలినా పౌర్ణమాస్యాం న రాజతే |
సీతేవ చాతపశ్యామా లక్ష్యతే న తు శోభతే ||
14
ప్రకృత్యా శీతలస్పర్శో హిమవిద్ధశ్చ సామ్ప్రతమ్ |
ప్రవాతి పశ్చిమో వాయుః కాలే ద్విగుణశీతలః ||
15
బాష్పచ్ఛన్నాన్యరణ్యాని యవగోధూమవంతి చ |
శోభంతేఽభ్యుదితే సూర్యే నదద్భిః క్రౌంచసారసైః ||
16
ఖర్జూరపుష్పాకృతిభిః శిరోభిః పూర్ణతండులైః |
శోభంతే కించిదానమ్రాః శాలయః కనకప్రభాః ||
17
మయూఖైరుపసర్పద్భిర్హిమనీహారసంవృతైః |
దూరమభ్యుదితః సూర్యః శశాంక ఇవ లక్ష్యతే ||
18
అగ్రాహ్యవీర్యః పూర్వాహ్ణే మధ్యహ్నే స్పర్శతః సుఖః |
సంరక్తః కించిదాపాండురాతపః శోభతే క్షితౌ ||
19
అవశ్యాయనిపాతేన కించిత్ప్రక్లిన్నశాద్వలా |
వనానాం శోభతే భూమిర్నివిష్టతరుణాతపా ||
20
స్పృశంస్తు విపులం శీతముదకం ద్విరదః సుఖమ్ |
అత్యంతతృషితో వన్యః ప్రతిసంహరతే కరమ్ ||
21
ఏతే హి సముపాసీనా విహగా జలచారిణః |
న విగాహంతి సలిలమప్రగల్భా ఇవాహవమ్ ||
22
అవశ్యాయతమోనద్ధా నీహారతమసా వృతాః |
ప్రసుప్తా ఇవ లక్ష్యంతే విపుష్పా వనరాజయః ||
23
బాష్పసంఛన్నసలిలా రుతవిజ్ఞేయసారసాః |
హిమార్ద్రవాలుకైస్తీరైః సరితో భాంతి సామ్ప్రతమ్ ||
24
తుషారపతనాచ్చైవ మృదుత్వాద్భాస్కరస్య చ |
శైత్యాదగాగ్రస్థమపి ప్రాయేణ రసవజ్జలమ్ ||
25
జరాజర్ఝరితైః పద్మైః శీర్ణకేసరకర్ణికైః |
నాలశేషైర్హిమధ్వస్తైర్న భాంతి కమలాకరాః ||
26
అస్మింస్తు పురుషవ్యాఘ్రః కాలే దుఃఖసమన్వితః |
తపశ్చరతి ధర్మాత్మా త్వద్భక్త్యా భరతః పురే ||
27
త్యక్త్వా రాజ్యం చ మానం చ భోగాంశ్చ వివిధాన్ బహూన్ |
తపస్వీ నియతాహారః శేతే శీతే మహీతలే ||
28
సోఽపి వేలామిమాం నూనమభిషేకార్థముద్యతః |
వృతః ప్రకృతిభిర్నిత్యం ప్రయాతి సరయూం నదీమ్ ||
29
అత్యంతసుఖసంవృద్ధః సుకుమారః సుఖోచితః |
కథం న్వపరరాత్రేషు సరయూమవగాహతే ||
30
పద్మపత్రేక్షణో వీరః శ్యామో నిరుదరో మహాన్ |
ధర్మజ్ఞః సత్యవాదీ చ హ్రీనిషేధో జితేంద్రియః ||
31
ప్రియాభిభాషీ మధురో దీర్ఘబాహురరిందమః |
సంత్యజ్య వివిధాన్ భోగానార్యం సర్వాత్మనా శ్రితః ||
32
జితః స్వర్గస్తవ భ్రాత్రా భరతేన మహాత్మనా |
వనస్థమపి తాపస్యే యస్త్వామనువిధీయతే ||
33
న పిత్ర్యమనువర్తంతే మాతృకం ద్విపదా ఇతి |
ఖ్యాతో లోకప్రవాదోఽయం భరతేనాన్యథా కృతః ||
34
భర్తా దశరథో యస్యాః సాధుశ్చ భరతః సుతః |
కథం ను సాంబా కైకేయీ తాదృశీ క్రూరశీలినీ ||
35
ఇత్యేవం లక్ష్మణే వాక్యం స్నేహాద్బ్రువతి ధార్మికే |
పరివాదం జనన్యాస్తమసహన్ రాఘవోఽబ్రవీత్ ||
36
న తేఽంబా మధ్యమా తాత గర్హితవ్యా కథంచన |
తామేవేక్ష్వాకునాథస్య భరతస్య కథాం కురు ||
37
నిశ్చితాపి హి మే బుద్ధిర్వనవాసే దృఢవ్రతా |
భరతస్నేహసంతప్తా బాలిశీక్రియతే పునః ||
38
సంస్మరామ్యస్య వాక్యాని ప్రియాణి మధురాణి చ |
హృద్యాన్యమృతకల్పాని మనః ప్రహ్లాదనాని చ ||
39
కదా న్వహం సమేష్యామి భరతేన మహాత్మనా |
శత్రుఘ్నేన చ వీరేణ త్వాయా చ రఘునందన ||
40
ఇత్యేవం విలపంస్తత్ర ప్రాప్య గోదావరీం నదీమ్ |
చక్రేఽభిషేకం కాకుత్స్థః సానుజః సహ సీతయా ||
41
తర్పయిత్వాథ సలిలైస్తే పితౄన్ దైవతాని చ |
స్తువంతి స్మోదితం సూర్యం దేవతాశ్చ సమాహితాః ||
42
కృతాభిషేకః స రరాజ రామః
సీతాద్వితీయః సహ లక్ష్మణేన |
కృతాభిషేకో గిరిరాజపుత్ర్యా
రుద్రః సనందీ భగవానివేశః ||
43
Aranya Kanda Sarga 16 In Telugu Pdf Download
రాముడు సీతతో సహా పంచవటిలో ఆనందంగా గడుపు తున్నాడు. ఇంతలో శరదృతువు ముగిసి, హేమంత ఋతువు ప్రవేశించింది. చలికాలము మొదలయింది.
ఒక రోజు రాముడు పొద్దునే గోదావరినదికి స్నానానికి వెళ్లాడు. రాముని వెంట సీత, లక్ష్మణుడు కూడా వెళ్లారు. ఆ హేమంత ఋతువు అందాలను చూచి లక్ష్మణుడు రాముని తో ఇలా అన్నాడు.
“రామా! నీకు హేమంత ఋతువు అంటే ఎంతో ఇష్టం కదా. ఇప్పుడు హేమంత ఋతువు ప్రవేశించింది. మంచు కురుస్తూ ఉంది. నదీజలాలు స్నానానికి అనుకూలంగా లేవు. చలికి వెచ్చగా అగ్నిహోత్రము దగ్గర ఉండవలెనని కోరికగా ఉంది. పంటలు బాగా పండి కొత్త ధాన్యములు ఇంటికి చేరుతున్నాయి.
ఉత్తరాయనము రాగానే పితృదేవతలను పూజించి జనులు తరిస్తున్నారు. వర్షాకాలము ముగియడంతో రాజులు ఇతర రాజ్యముల మీదికి దండెత్తడానికి ఆసక్తిగా ఉన్నారు. అసలే మంచుతో కప్పబడిన హిమవత్పర్వతము సూర్యుడు భూమికి దూరంగా ఉండటంతో ఇంకా ఎక్కువ మంచుతో శోభిల్లుతోంది..
మనుష్యులు మధ్యాహ్నపు ఎండలో హాయిగా ఉంటున్నారు. రాత్రిళ్లు చలితో వణుకుతున్నారు. పగటి భాగమున కూడా సూర్యుడు తన తీక్షతను కోల్పోయాడు. పగలు కూడా చలిగాలులు వీస్తున్నాయి. అడవులలో జంతువులు కూడా తిరగడం లేదు. గుహలకే పరిమిత మైనాయి. మంచు కురవడంతో రాత్రిళ్లు ఎవరూ ఆరుబయట పడుకోడం లేదు.
చంద్రుడు గుండ్రంగా అందంగా ఉంటాడు. కాని అందాలు ఇప్పుడు సూర్యునికి సంక్రమించాయి. సూర్యుడు కూడా మంచు చేత కప్పబడి, తీక్షత తగ్గి, పూర్ణ చంద్రుని వలె ప్రకాశిస్తున్నాడు. పడమటి దిశనుండి చలిగాలులు వీస్తున్నాయి.
రాత్రి అంతా చలిగా ఉండి, పొద్దున్నే సూర్యోదయం కాగానే పక్షులు కిలా కిలా రావాలతో రెక్కలు విప్పుకొని ఎగిరిపోతున్నాయి. సూర్యకిరణములను పొగ మంచు కప్పడం వలన, సూర్యుడు బాగా పైకి వచ్చినా తీవ్రత తగ్గి నిండు చంద్రుని వలె కనపడుతున్నాడు. ఎండ కొద్ది కొద్దిగా నేల మీద పాకుతూ ఉంది. కాని వేడిగా లేదు.
మధ్యాహ్నము ఎండ చాలా సుఖంగా ఉంది. ఈ అడవిలో ఉన్న పచ్చిక మీద పడ్డ మంచు బిందువులు, పొద్దుటి ఎండలో ముత్యాలమాదిరి ప్రకాశిస్తున్నాయి.
రామా! అటు చూడు! పాపము ఆ ఏనుగు నీళ్లు తాగుదామని తన తొండమును నీటిలో పెట్టి, నీళ్లు జివ్వుమని చల్లగా తగలగానే తన తొండమును వెనక్కు లాగేసుకుంది. అంతెందుకు ఆ పక్షులు కూడా ఆ చల్లదనానికి నీటిలో దిగడానికి జంకుతున్నాయి. రామా! ఈ నదిలో నీరుకూడా అధికంగా చల్లగా ఉండటం వలన తాగడానికి వీలులేకుండా ఉంది కదా!
రామా! అడవిలో ఉన్న మన పరిస్థితి ఇలా ఉంది కదా! మరి అయోధ్యలో భరతుడు ఎలా ఉన్నాడో! నీ యందు భక్తితో అయోధ్యలో ఉన్నా అరణ్యములో ఉన్నట్టు ఉన్నాడేమో! రాజభోగములను విడిచిపెట్టి, నేల మీద పడుకుంటూ, మన మాదిరి ఫలములను ఆహారముగా తీసుకుంటూ జీవనము గడుపుతున్నాడేమో! రామా! మనము స్నానానికి గోదావరి నదికి వచ్చినట్టు భరతుడు కూడా సరయూనదికి స్నానానికి వెళుతూ ఉంటాడనుకుంటాను.
దక్షిణాపథములో ఉన్న మనకే ఇంత చలిగాఉంటే ఉత్తరదేశంలో అయోధ్యలో ఉన్న భరతునికి ఇంకెంత చలిగా ఉందో కదా! ఈ తెల్లవారుజామున సరయూనదిలో ఎలా స్నానం చేస్తున్నాడో కదా! ఎందుకంటే, భరతుడు అయోధ్యలో ఉన్నా, అరణ్యములో ఉన్నా నిన్ను అనుసరిస్తున్నాడు. నీ రాకకై తపిస్తున్నాడు. అటువంటి వాడు స్వర్గలోకాధిపత్యమునకు అర్హుడు.
రామా! సాధారణంగా కుమారుడికి తల్లి బుద్ధులు, కుమార్తెకు తండ్రి బుద్ధులు వస్తాయి అంటారు. కానీ, భరతుడికి తల్లి కైకకు ఉన్న ఏమాత్రమూ రాలేదు. అయినా రామా! దశరథ మహారాజు భార్యగా ఉండి, భరతునికి కన్నతల్లిగా ఉన్న కైకకు ఇంత కుటిలబుద్ధి ఎలా వచ్చిందో తెలియదు కదా.!…” అని లక్ష్మణుడు ఇంకా ఏదో చెప్పబోతుంటే రాముడు అడ్డుకున్నాడు.
“లక్షణా! దయచేసి నీవు ఎట్టి పరిస్థితులలోనూ మాత కైకను దూషించకూడదు. నేను వనవాసము చెయ్యాలని చేస్తున్నాను. ఇందులో ఆమె ప్రమేయము ఎంత మాత్రమూ లేదు. నా బాధ అంతా ఒకటే. భరత శత్రుఘ్నులు నా దగ్గర లేరే అని. అంతే కానీ ఈ వనవాసము నాకు ఎంతో ఆనందమూ కలిగిస్తూ ఉంది. నువ్వు, భరత శత్రుఘ్నులు ఎప్పుడు నా దగ్గరగా ఉంటారో కదా అని ఆతురతగా ఎదురుచూస్తున్నాను.” అని అన్నాడు రాముడు.
ఈ విధంగా మాట్లాడుకుంటూ అందరూ గోదావరీ తీరము చేరుకున్నారు. అందరూ గోదావరిలో దిగి స్నానాలు చేసారు. సీతా రామ లక్ష్మణులు గోదావరిలో పితృతర్పణము, దేవ తరణము, నిర్వర్తించారు. సూర్యోదయ కాలములో అర్ఘ్యము విడిచారు. తరువాత అందరూ ఆశ్రమమునకు వెళ్లారు.
(వాల్మీకి ఈ సర్గలో కేవలము శరదృతువు ఎలా ఉంటుందో వర్ణించాడు. ఈ రోజుల్లో ఈ జనారణ్యాలలో ఉన్న మనకు, పల్లెసీమలలో హేమంత ఋతువులో, ప్రకృతి సౌందర్యము ఎలా ఉంటుందో చూడ్డం కుదరడం లేదు. అందుకని ఆ ప్రకృతి అందాలను మనముందు ఆవిష్కరించాడు మహర్షి వాల్మీకి.)
శ్రీమద్రామాయణము
అరణ్యకాండము పదహారవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.
అరణ్యకాండ సప్తదశః సర్గః (17) >>