మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అరణ్యకాండ ద్విచత్వారింశః సర్గం రామాయణంలోని మూడవ కాండలో ఒక ముఖ్యమైన భాగం. ఇందులో రాముడు, సీత, లక్ష్మణులు అరణ్యంలో ఉంటున్నారు. ఈ సందర్భంలో రావణుడి చెల్లెలు శూర్పణఖా రాముని చూసి అతనితో వివాహం చేసుకోవాలని కోరుతుంది. రాముడు ఆమెను తిరస్కరిస్తాడు, దాంతో శూర్పణఖా సీతకు హాని చేయాలని ప్రయత్నిస్తుంది.
స్వర్ణమృగప్రేక్షణమ్
ఏవముక్త్వా తు వచనం మారీచో రావణం తతః |
గచ్ఛావేత్యబ్రవీద్దీనో భయాద్రాత్రించరప్రభోః ||
1
దృష్టశ్చాహం పునస్తేన శరచాపాసిధారిణా |
మద్వధోద్యతశస్త్రేణ వినష్టం జీవితం చ మే ||
2
న హి రామం పరాక్రమ్య జీవన్ప్రతినివర్తతే |
వర్తతే ప్రతిరూపోఽసౌ యమదండహతస్య తే ||
3
కిం ను శక్యం మయా కర్తుమేవం త్వయి దురాత్మని |
ఏష గచ్ఛామ్యహం తాత స్వస్తి తేఽస్తు నిశాచర ||
4
ప్రహృష్టస్త్వభవత్తేన వచనేన స రావణః |
పరిష్వజ్య సుసంశ్లిష్టమిదం వచనమబ్రవీత్ ||
5
ఏతచ్ఛౌండీర్యయుక్తం తే మచ్ఛందాదివ భాషితమ్ |
ఇదానీమసి మారీచః పూర్వమన్యో నిశాచరః ||
6
ఆరుహ్యతామయం శీఘ్రం రథో రత్నవిభూషితః |
మయా సహ తథా యుక్తః పిశాచవదనైః ఖరైః ||
7
ప్రలోభయిత్వా వైదేహీం యథేష్టం గంతుమర్హసి |
తాం శూన్యే ప్రసభం సీతామానయిష్యామి మైథిలీమ్ ||
8
తతో రావణమారీచౌ విమానమివ తం రథమ్ |
ఆరుహ్య యయతుః శీఘ్రం తస్మాదాశ్రమమండలాత్ ||
9
తథైవ తత్ర పశ్యంతౌ పత్తనాని వనాని చ |
గిరీంశ్చ సరితః సర్వా రాష్ట్రాణి నగరాణి చ ||
10
సమేత్య దండకారణ్యం రాఘవస్యాశ్రమం తతః |
దదర్శ సహమరీచో రావణో రాక్షసాధిపః ||
11
అవతీర్య రథాత్తస్మాత్తతః కాంచనభూషణాత్ |
హస్తే గృహీత్వా మారీచం రావణో వాక్యమబ్రవీత్ ||
12
ఏతద్రామాశ్రమపదం దృశ్యతే కదలీవృతమ్ |
క్రియతాం తత్సఖే శీఘ్రం యదర్థం వయమాగతాః ||
13
స రావణవచః శ్రుత్వా మారీచో రాక్షసస్తదా |
మృగో భూత్వాఽఽశ్రమద్వారి రామస్య విచచార హ ||
14
స తు రూపం సమాస్థాయ మహదద్భుతదర్శనమ్ |
మణిప్రవరశృంగాగ్రః సితాసితముఖాకృతిః ||
15
రక్తపద్మోత్పలముఖ ఇంద్రనీలోత్పలశ్రవాః |
కించిదభ్యున్నతగ్రీవః ఇంద్రనీలదలాధరః ||
16
కుందేందువజ్రసంకాశముదరం చాస్య భాస్వరమ్ |
మధూకనిభపార్శ్వశ్చ పద్మకింజల్కసన్నిభః ||
17
వైడూర్యసంకాశఖురస్తనుజంఘః సుసంహతః |
ఇంద్రాయుధసవర్ణేన పుచ్ఛేనోర్ధ్వం విరాజతా ||
18
మనోహరః స్నిగ్ధవర్ణో రత్నైర్నానావిధైర్వృతః |
క్షణేన రాక్షసో జాతో మృగః పరమశోభనః ||
19
వనం ప్రజ్వలయన్రమ్యం రామాశ్రమపదం చ తత్ |
మనోహరం దర్శనీయం రూపం కృత్వా స రాక్షసః ||
20
ప్రలోభనార్థం వైదేహ్యా నానాధాతువిచిత్రితమ్ |
విచరన్ గచ్ఛతే తస్మాచ్ఛాద్వలాని సమంతతః ||
21
రూప్యైర్బిందుశతైశ్చిత్రో భూత్వా స ప్రియదర్శనః |
విటపీనాం కిసలయాన్ భంక్త్వాదన్ విచచార హ ||
22
కదలీగృహకం గత్వా కర్ణికారానితస్తతః |
సమాశ్రయన్మందగతిః సీతాసందర్శనం తథా ||
23
రాజీవచిత్రపృష్ఠః స విరరాజ మహామృగః |
రామాశ్రమపదాభ్యాశే విచచార యథాసుఖమ్ ||
24
పునర్గత్వా నివృత్తశ్చ విచచార మృగోత్తమః |
గత్వా ముహూర్తం త్వరయా పునః ప్రతినివర్తతే ||
25
విక్రీడంశ్చ క్వచిద్భూమౌ పునరేవ నిషీదతి |
ఆశ్రమద్వారమాగమ్య మృగయూథాని గచ్ఛతి ||
26
మృగయూథైరనుగతః పునరేవ నివర్తతే |
సీతాదర్శనమాకాంక్షన్ రాక్షసో మృగతాం గతః ||
27
పరిభ్రమతి చిత్రాణి మండలాని వినిష్పతన్ |
సముద్వీక్ష్య చ తం సర్వే మృగా హ్యన్యే వనేచరాః ||
28
ఉపగమ్య సమాఘ్రాయ విద్రవంతి దిశో దశ |
రాక్షసః సోఽపి తాన్వన్యాన్ మృగాన్ మృగవధే రతః ||
29
ప్రచ్ఛాదనార్థం భావస్య న భక్షయతి సంస్పృశన్ |
తస్మిన్నేవ తతః కాలే వైదేహీ శుభలోచనా ||
30
కుసుమాపచయవ్యగ్రా పాదపానభ్యవర్తత |
కర్ణికారానశోకాంశ్చ చూతాంశ్చ మదిరేక్షణా ||
31
కుసుమాన్యపచిన్వంతీ చచార రుచిరాననా |
అనర్హాఽరణ్యవాసస్య సా తం రత్నమయం మృగమ్ ||
32
ముక్తామణివిచిత్రాంగం దదర్శ పరమాంగనా |
సా తం రుచిరదంతోష్ఠీ రూప్యధాతుతనూరుహమ్ ||
33
విస్మయోత్ఫుల్లనయనా సస్నేహం సముదైక్షత |
స చ తాం రామదయితాం పశ్యన్ మాయామయో మృగః ||
34
విచచార పునశ్చిత్రం దీపయన్నివ తద్వనమ్ |
అదృష్టపూర్వం తం దృష్ట్వా నానారత్నమయం మృగమ్ |
విస్మయం పరమం సీతా జగామ జనకాత్మజా ||
35
ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అరణ్యకాండే ద్విచత్వారింశః సర్గః ||
Aranya Kanda Sarga 42 Meaning In Telugu
అప్పటికి రెండు సార్లు రాముడి చేతిలో చావు తప్పించుకున్నా, మూడవసారి రాముడి చేతిలో తనకు చావు తప్పదని రూఢి చేసుకొని రావణుని వెంట బయలుదేరాడు మారీచుడు. ఎన్ని మాటలు మాట్లాడినా తుదకు మారీచుడు తన మాటను మన్నించి తన వెంట వస్తున్నందుకు చాలా సంతోషించాడు రావణుడు. అప్పుడే సీత తన ఒడిలో వాలినట్టు సంతోషపడ్డాడు.
మారీచుని కౌగలించుకొని “మారీచా! నామాట విని ఇప్పుడు నువ్వు అసలైన మారీచుడవు అనిపించుకున్నావు. నువ్వు ఇంతకు ముందు మాదిరి రాముడికి భయపడే మారీచుడవు కావు. నీవు కూడా నాతో రా. రథం ఎక్కు. మనం ఇద్దరం రాముని ఆశ్రమం దాకా వెళదాము తరువాత తెలుసుగా. కాస్త సీతను ప్రలోభ పెట్టి నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు పారిపో.
రామ లక్ష్మణులు అటు పోగానే నేను సీతను తీసుకొని ఇటు వచ్చేస్తాను.” అని వ్యవహారాన్ని చాలా తేలిగ్గా తేల్చేశాడు రావణుడు.
తరువాత రావణుడు, మారీచుడు ఇద్దరూ గాడిదలు కట్టిన రథం ఎక్కి దండకారణ్యం వైపు ప్రయాణం సాగించారు. కొన్ని దినములు ప్రయాణించి ఇద్దరూ రాముని ఆశ్రమం దగ్గరకు చేరుకున్నారు. రావణుడు, మారీచుడు ఇద్దరూ రథం దిగారు.
“మారీచా! అటు చూడు. అదే రాముని ఆశ్రమము అనుకుంటాను. నేనుచెప్పింది గుర్తు ఉంది కదా. ఆ ప్రకారం చెయ్యి నేను ఈ పరిసరాలలో దాక్కొని ఉంటాను.” అని అన్నాడు రావణుడు.
వెంటనే మారీచుడు తన కామరూప విద్య ప్రభావంతో ఒక బంగారు వన్నెకల లేడి రూపం ధరించాడు. రాముని ఆశ్రమం దగ్గర అటు ఇటు తిరుగుతున్నాడు. సీత దృష్టి లో పడేట్టు సంచరిస్తున్నాడు. మారీచుడు ధరించిన ఆ లేడి రూపము చాలా సుందరంగా ఉంది. దాని ముఖము సగం తెల్లగా సగం నల్లగా ఉంది. మెడ కొంచెం ఎత్తుగా ఉంది. దాని శరీరము బంగారు రంగుతో మెరుస్తూ ఉంది.
ఆ లేడి అక్కడ ఉన్న పచ్చికను కొరుకుతూ అటు ఇటు తిరుగుతూ ఉంది. అటు ఇటు పరుగెత్తుతూ, గెంతుతూ, భయం భయంగా చూస్తూ ఉంది. కాసేపు అలా ఆడుకొని, కొంచెం సేపు అలసటగా పడుకొంది. మరలా లేచి గెంతుతూ ఆశ్రమ ద్వారం దగ్గర తచ్చాడుతూ ఉంది. ఎలాగైనా సీత దృష్టిలో పడాలని నానా పాట్లు పడుతూ ఉంది ఆ మాయ లేడి.
ఇంతలో కొన్ని లేళ్లు అక్కడకు గుంపుగా వచ్చాయి. ఈ మాయలేడి కూడా వాటితో కలిసి ఆడుతూ ఉంది. కాని మిగిలిన లేళ్లు ఈ మాయలేడిని వాసన చూచి ఎందుకో దూరంగా పరుగెడుతున్నాయి. మారీచునకు ఆ లేళ్లను చూస్తుంటే వాటిని కరా కరా నమిలి తినాలని మహాకోరికగా ఉంది. కాని తాను ఉన్న పరిస్థితులలో ఆ పని చేయకూడదని ఆ కోరికను చంపుకున్నాడు.
అదే సమయంలో సీత పూలు కోయడానికి ఆశ్రమం నుండి వెలుపలికి వచ్చింది. ఆశ్రమం బయట ఉన్న పూల చెట్ల నుండి పూలు కోస్తూ ఉంది. ఇంతలో ఆ మాయలేడి సీత కంటపడింది. బంగారు వర్ణంతో మిలా మిలా మెరిసిపోతున్న ఆ లేడి వంక కుతూహలంగా చూచింది సీత. ఆ అరణ్యంలో అంతవరకూ అటువంటి లేడిని సీత చూడలేదు. అందుకని ఆశ్చర్యం ఆ లేడి వంక చూస్తూ ఉంది.
అమ్మయ్య వచ్చిన పని అయిందనుకున్నాడు మారీచుడు. సీత దగ్గరగా వెళ్లి ఆమె తనను అందుకొనేటట్టు ఆమెకు దగ్గరగా అటు ఇటు తిరుగుతున్నాడు.
శ్రీమద్రామాయణము
అరణ్యకాండము నలుబది రెండవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్