Aranya Kanda Sarga 45 In Telugu – అరణ్యకాండ పంచచత్వారింశః సర్గః

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అరణ్యకాండ పంచచత్వారింశః సర్గం రామాయణంలోని ఒక ప్రాముఖ్యమైన అధ్యాయం. ఈ సర్గంలో రాముడు సీతను వెతుకుతూ తిరుగుతాడు. మార్గంలో, అతను తీవ్ర విషాదంలో ఉన్న జటాయువును కనుగొంటాడు. జటాయువు రాముడికి సీతను అపహరించిన రావణుడి గురించి వివరించి, సీతను రక్షించే ప్రయత్నంలో తాను ఎలా గాయపడ్డాడో చెబుతాడు.

సీతాపారుష్యమ్

ఆర్తస్వరం తు తం భర్తుర్విజ్ఞాయ సదృశం వనే |
ఉవాచ లక్ష్మణం సీతా గచ్ఛ జానీహి రాఘవమ్ ||

1

న హి మే హృదయం స్థానే జీవితం వాఽవతిష్ఠతే |
క్రోశతః పరమార్తస్య శ్రుతః శబ్దో మయా భృశమ్ ||

2

ఆక్రందమానం తు వనే భ్రాతరం త్రాతుమర్హసి |
తం క్షిప్రమభిధావ త్వం భ్రాతరం శరణైషిణమ్ ||

3

రక్షసాం వశమాపన్నం సింహానామివ గోవృషమ్ |
న జగామ తథోక్తస్తు భ్రాతురాజ్ఞాయ శాసనమ్ ||

4

తమువాచ తతస్తత్ర కుపితా జనకాత్మజా |
సౌమిత్రే మిత్రరూపేణ భ్రాతుస్త్వమసి శత్రువత్ ||

5

యస్త్వమస్యామవస్థాయాం భ్రాతరం నాభిపత్స్యసే |
ఇచ్ఛసి త్వం వినశ్యంతం రామం లక్ష్మణ మత్కృతే ||

6

లోభాన్మమ కృతే నూనం నానుగచ్ఛసి రాఘవమ్ |
వ్యసనం తే ప్రియం మన్యే స్నేహో భ్రాతరి నాస్తి తే ||

7

తేన తిష్ఠసి విస్రబ్ధస్తమపశ్యన్మహాద్యుతిమ్ |
కిం హి సంశయమాపన్నే తస్మిన్నిహ మయా భవేత్ ||

8

కర్తవ్యమిహ తిష్ఠంత్యా యత్ప్రధానస్త్వమాగతః |
ఇతి బ్రువాణాం వైదేహీం బాష్పశోకపరిప్లుతామ్ ||

9

అబ్రవీల్లక్ష్మణస్త్రస్తాం సీతాం మృగవధూమివ |
పన్నగాసురగంధర్వదేవమానుషరాక్షసైః ||

10

అశక్యస్తవ వైదేహీ భర్తా జేతుం న సంశయః |
దేవి దేవ మనుష్యేషు గంధర్వేషు పతత్రిషు ||

11

రాక్షసేషు పిశాచేషు కిన్నరేషు మృగేషు చ |
దానవేషు చ ఘోరేషు న స విద్యేత శోభనే ||

12

యో రామం ప్రతియుధ్యేత సమరే వాసవోపమమ్ |
అవధ్యః సమరే రామో నైవం త్వం వక్తుమర్హసి ||

13

న త్వామస్మిన్వనే హాతుముత్సహే రాఘవం వినా |
అనివార్యం బలం తస్య బలైర్బలవతామపి ||

14

త్రిభిర్లోకైః సముద్యుక్తైః సేశ్వరైరపి సామరైః |
హృదయం నిర్వృతం తేఽస్తు సంతాపస్త్యజ్యతామయమ్ ||

15

ఆగమిష్యతి తే భర్తా శీఘ్రం హత్వా మృగోత్తమమ్ |
న చ తస్య స్వరో వ్యక్తం మాయయా కేనచిత్కృతః ||

16

గంధర్వనగరప్రఖ్యా మాయా సా తస్య రక్షసః |
న్యాసభూతాసి వైదేహి న్యస్తా మయి మహాత్మనా ||

17

రామేణ త్వం వరారోహే న త్వాం త్యక్తుమిహోత్సహే |
కృతవైరాశ్చ వైదేహి వయమేతైర్నిశాచరైః ||

18

ఖరస్య నిధనాదేవ జనస్థానవధం ప్రతి |
రాక్షసా వివిధా వాచో విసృజంతి మహావనే ||

19

హింసావిహారా వైదేహి న చింతయితుమర్హసి |
లక్ష్మణేనైవముక్తా సా క్రుద్ధా సంరక్తలోచనా ||

20

అబ్రవీత్పరుషం వాక్యం లక్ష్మణం సత్యవాదినమ్ |
అనార్యాకరుణారంభ నృశంస కులపాంసన ||

21

అహం తవ ప్రియం మన్యే రామస్య వ్యసనం మహత్ |
రామస్య వ్యసనం దృష్ట్వా తేనైతాని ప్రభాషసే ||

22

నైతచ్చిత్రం సపత్నేషు పాపం లక్ష్మణ యద్భవేత్ |
త్వద్విధేషు నృశంసేషు నిత్యం ప్రచ్ఛన్నచారిషు ||

23

సుదుష్టస్త్వం వనే రామమేకమేకోఽనుగచ్ఛసి |
మమ హేతోః ప్రతిచ్ఛన్నః ప్రయుక్తో భరతేన వా ||

24

తన్న సిధ్యతి సౌమిత్రే తవ వా భరతస్య వా |
కథమిందీవరశ్యామం పద్మపత్రనిభేక్షణమ్ ||

25

ఉపసంశ్రిత్య భర్తారం కామయేయం పృథగ్జనమ్ |
సమక్షం తవ సౌమిత్రే ప్రాణాంస్త్యక్ష్యే న సంశయః ||

26

రామం వినా క్షణమపి న హి జీవామి భూతలే |
ఇత్యుక్తః పరుషం వాక్యం సీతయా రోమహర్షణమ్ ||

27

అబ్రవీల్లక్ష్మణః సీతాం ప్రాంజలిర్విజితేంద్రియః |
ఉత్తరం నోత్సహే వక్తుం దైవతం భవతీ మమ ||

28

వాక్యమప్రతిరూపం తు న చిత్రం స్త్రీషు మైథిలి |
స్వభావస్త్వేష నారీణామేవం లోకేషు దృశ్యతే ||

29

విముక్తధర్మాశ్చపలాస్తీక్ష్ణా భేదకరాః స్త్రియః |
న సహే హీదృశం వాక్యం వైదేహీ జనకాత్మజే ||

30

శ్రోత్రయోరుభయోర్మేఽద్య తప్తనారాచసన్నిభమ్ |
ఉపశృణ్వంతు మే సర్వే సాక్షిభూతా వనేచరాః ||

31

న్యాయవాదీ యథాన్యాయముక్తోఽహం పరుషం త్వయా |
ధిక్త్వామద్య ప్రణశ్య త్వం యన్మామేవం విశంకసే ||

32

స్త్రీత్వం దుష్టం స్వభావేన గురువాక్యే వ్యవస్థితమ్ |
గమిష్యే యత్ర కాకుత్స్థః స్వస్తి తేఽస్తు వరాననే ||

33

రక్షంతు త్వాం విశాలాక్షి సమగ్రా వనదేవతాః |
నిమిత్తాని హి ఘోరాణి యాని ప్రాదుర్భవంతి మే ||

34

అపి త్వాం సహ రామేణ పశ్యేయం పునరాగతః |
[* న వేత్యేతన్న జానామి వైదేహి జనకాత్మజే *] ||

35

లక్ష్మణేనైవముక్తా తు రుదంతీ జనకాత్మజా |
ప్రత్యువాచ తతో వాక్యం తీవ్రం బాష్పపరిప్లుతా ||

36

గోదావరీం ప్రవేక్ష్యామి వినా రామేణ లక్ష్మణ |
ఆబంధిష్యేఽథవా త్యక్ష్యే విషమే దేహమాత్మనః ||

37

పిబామ్యహం విషం తీక్ష్ణం ప్రవేక్ష్యామి హుతాశనమ్ |
న త్వహం రాఘవాదన్యం పదాపి పురుషం స్పృశే ||

38

ఇతి లక్ష్మణమాక్రుశ్య సీతా దుఃఖసమన్వితా |
పాణిభ్యాం రుదతీ దుఃఖాదుదరం ప్రజఘాన హ ||

39

తామార్తరూపాం విమనా రుదంతీం
సౌమిత్రిరాలోక్య విశాలనేత్రామ్ |
ఆశ్వాసయామాస న చైవ భర్తు-
-స్తం భ్రాతరం కించిదువాచ సీతా ||

40

తతస్తు సీతామభివాద్య లక్ష్మణః
కృతాంజలిః కించిదభిప్రణమ్య చ |
అన్వీక్షమాణో బహుశశ్చ మైథిలీం
జగామ రామస్య సమీపమాత్మవాన్ ||

41

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అరణ్యకాండే పంచచత్వారింశః సర్గః ||

Aranya Kanda Sarga 45 Meaning In Telugu PDF

మారీచుడు గొంతు మార్చి రాముని గొంతుతో “హా సీతా! హా లక్షణా!” అంటూ అరిచిన అరుపులు ఆశ్రమంలో ఉన్న సీతకు, బయట నిలబడి ఉన్న లక్ష్మణునికి వినపడ్డాయి…

లక్షణుడు ఆ అరుపులను పట్టించుకోలేదు. 14,000 మంది రాక్షసులను ఒంటి చేత్తో మట్టుబెట్టిన రాముడు, కేవలం ఒక రాక్షసునికి బెదిరి అలా అరుస్తాడా! అసంభవం. ఇదేదో రాక్షస మాయ. ఆ మాయలకు లోబడరాదు”అని నిర్ణయించుకున్నాడు.

కాని సీతలో స్త్రీ సహజమైన భయము ఆందోళనా మొదలయ్యాయి. వెంటనే లక్ష్మణుని పిలిచింది.

“లక్ష్మణా! విన్నావుగా మీ అన్నగారు అరిచిన అరుపులు. మీ అన్నగారు ఏదో భయంకరమైన ఆపదలో ఉన్నట్టు ఉన్నారు. లేకపోతే అలా కేకలుపెట్టరు. నువ్వు సత్వరమే వెళ్లి మీ అన్నగారిని రక్షించు.” అని తొందర పెట్టింది.

సీత మాటలకు లక్ష్మణుడు చలించలేదు. మరలా సీత లక్ష్మణుని తొందర పెట్టింది. “లక్ష్మణా! నా మనసు అంతా ఆందోళనగా ఉంది. నా ప్రాణములు నిలవడం లేదు. తొందరగా వెళ్లు. ఏమయిందో తెలుసుకో. రాముని రక్షించు. రాముడు ఏ రాక్షసుల వాత పడ్డాడో. లేక పోతే అలా అరవడు. తొందరగా వెళ్లవయ్యా!!” అని తొందర పెట్టింది సీత.

అయినా లక్ష్మణుడు కదలలేదు. చుట్టు ఏమైనా ఆపద పొంచి ఉన్నదా అని పరికిస్తున్నాడు. అప్పుడు సీతలో అనుమాన బీజం మొలకెత్తింది. అనుమానం మనసులో నాటుకోవాలే కానీ, దానికి హద్దు ఉండదు. శాఖోపశాఖలుగా విస్తరిస్తుంది. సీత ప్రస్తుతం అదే అవస్థలో ఉంది. అనుమానానికి కోపం తోడైతే ఇంక చెప్పేదేముంది. ఏం మాట్లాడుతున్నారో తెలియకుండా మాట్లాడతారు.

“లక్ష్మణా! ఏమీటా మౌనం. మీ అన్న అరుపులు నీకు వినపడలేదా! నేను చెప్పిన మాటలూ వినపడలేదా! నీ అన్న ఆపదలో ఉంటే రక్షించవలసిన బాధ్యత నీకు లేదా! నీ అన్నను రక్షించడానికి నీవు వెళ్లడం లేదంటే నీవు నీ అన్నకు మిత్రుడివి కావు. శత్రువు.

ఆ! నాకు అర్థం అయింది. నీకు నా మీద కోరిక ఉంది. అందుకే నీ అన్న రాముని అడ్డు తొలగించుకోవాలని చూస్తున్నావు. నీకు నా మీద దురాలోచన ఉండటం వలననే నీవు రాముని రక్షించడానికి వెళ్లడం లేదు. రాముడికి ఆపద కలగాలనీ, మరణించాలనీ నీవు కోరుకుంటున్నావు కదూ! రాముడు తిరిగి రాడని నమ్మకంతో ఉన్నావు కదూ! నీకు రాముని మీద ఏ మాత్రం ప్రేమలేదు. నా మీద కోరిక ఉంది. అందుకే ఇలా చేస్తున్నావు.

లక్ష్మణా! అసలు నువ్వు మాతో అరణ్యాలకు ఎందుకు వచ్చినట్టు? రాముని రక్షించడానికే కదా! ఆ రాముడే ఇప్పుడు ఆపదలో ఉన్నప్పుడు ఇక్కడ ఉండి ఏం చేస్తున్నావు? లక్ష్మణా! నీకు రాముని రక్షించడమే ప్రధానమైన కర్తవ్యము అంతే కానీ నా ఎదురుగా నిలబడటం కాదు. నన్ను రక్షించడం కాదు ముఖ్యం. ముందు నీవు రాముని వద్దకు వెళ్లు. ఆపదలో ఉన్న రాముని రక్షించు.” అంటూ సీత కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ కిందపడిపోయింది.

అది చూచి లక్ష్మణుడు ఊరుకోలేకపోయాడు. సీతతో ఇలా అన్నాడు. “ఓ విదేహ రాజపుత్రీ! ఊరడిల్లుము. రామునికి ఏమీ కాదు. రాముని రాక్షసులు గానీ, దేవతలు గానీ, గంధర్వులు కానీ, నాగులు కానీ, ఆఖరుకు మానవులు కానీ జయించలేరు. ఇందులో సందేహము ఏ మాత్రము లేదు. యుద్ధములో దేవేంద్రుని కూడా జయించగల రామునికి ఒక రాక్షసుని వల్ల ఆపద కలగడం అసంభవం. రాముని చంపడం ఎవరి తరమూ కాదు. రాముడు నన్ను నీకు రక్షణగా ఇక్కడ ఉంచాడు. నిన్ను ఒంటరిగా ఈ అడవిలో వదిలి నేను వెళ్లడం క్షేమం కాదు. కాబట్టి నీ దు:ఖాన్ని వదిలిపెట్టు. నీ భర్త ఆ మృగాన్ని చంపి నీ తీసుకురాగలడు.

ఓ జనకరాజపుత్రి! సావధానంగా ఆలోచించు. అది రాముని కంఠస్వరము కాదు. రాక్షసుల మాయ. నా అనుమానము నిజం అయితే ఆ మాయా మృగము మారీచుడు. వాడే రామబాణంతో చచ్చేటప్పుడు అలా అరిచిఉంటాడు. నిన్ను జాగ్రత్తగా కాపాడమని రాముడు నిన్ను నా వద్ద ఉంచాడు. నిన్ను అంతేజాగ్రత్తగా రామునికి అప్పగించవలసిన బాధ్యత నాది. అందుకని నిన్ను ఈ అడవిలో ఒంటరిగా విడిచి ఇక్కడి నుండి వెళ్లడం నాకు ఇష్టం లేదు.

సీతా! మరొక మాట. రాముడు జనస్థానములో ఉన్న రాక్షసులను అందరినీ చంపాడు. అది నీకు తెలుసు. ఆ కారణం చేత రాక్షసులు అంతా రాముడి మీద కోపంతో, శత్రుత్వంతో ఉన్నారు. రాక్షసులు వింత వింత గొంతులతో అరుస్తూ ఉంటారు. వాటిని మనము పట్టించుకోకూడదు. కాబట్టి నీవు రాముని గూర్చి చింతపడవలదు. రాముడు క్షేమంగా తిరిగి వస్తాడు. ” అని అన్నాడు. లక్ష్మణుడు.

లక్ష్మణుని మాటలు సీత చెవికి ఎక్కలేదు. ఆమెకు అనుమానము ఎక్కువ అయింది. కోపంతో లక్ష్మణునితో ఇలా అంది.

“ఓ లక్ష్మణా! నీవు రఘువంశములో చెడ బుట్టావు. నీ బుద్ధి ఇప్పుడు తెలిసింది. ఈ అడవిలో రామునికి ప్రాణాపాయము ఎప్పుడు కలుగుతుందా అని ఎదురు చూస్తున్నావు. ఇప్పుడు నీ కోరిక సిద్ధించింది. అందుకే రామునికి సాయంగా వెళ్లను అంటున్నావు. నీకు దుర్బుద్ధి పుట్టింది అనడానికి ఇంతకన్నా ఏమి కావాలి?

ఇది నీకు పుట్టిన బుద్ధా! లేక నువ్వు భరతుడు కలిసి ఆడుతున్న నాటకమా! ఏది ఏమైనా మీ కోరిక సిద్ధించదు. నేను మీకు దక్కను. మనసా వాచా కర్మణా రాముడినే కోరుకుంటున్న నేను మీకు వశం అవుతానని ఎలా అనుకున్నారు! నా రాముడు లేకుండా నేను ఈ భూమి మీద క్షణకాలం బతకలేను. నీ ఎదుటనే ప్రాణత్యాగము చేసుకుంటాను.” అని వలా వలా ఏడుస్తోంది సీత.

లక్ష్మణునికి ఆమెను ఎలా ఓదార్చాలో, ఎలా అనునయించాలో, ఎలా నమ్మించాలో అర్థం కావడం లేదు.

“అమ్మా సీతా! నీకు ఎలా బదులు చెప్పాలో అర్థం కావడం లేదు. నీవు అలా మాట్లాడటంలో ఆశ్చర్యం లేదు. నీ పరిస్థితులలో ఉన్న ఏ స్త్రీ అయినా ఇలాగే మాట్లాడుతుంది అనేది లోకవిదితము. కాని నీవు జనకుని కుమార్తెవు. రాముని భార్యవు. నీవు కూడా ఇలా మాట్లాడటం భావ్యం కాదు. నీ మాటలు నా చెవులలో ములుకుల వలె గుచ్చుకుంటూ ఉన్నాయి.

ఇప్పటిదాకా ఓర్పుతో సహించాను. ఇంక సహించలేను. నేను నా అన్నగారి ఆజ్ఞను పాటిస్తున్నాను. దీనికి ఈ వనదేవతలే సాక్షులు. కాని నీవే మనసులో దురాలోచన పెట్టుకొని నన్ను నిందిస్తున్నావు. నీవు కోరినట్టే నేను రాముని రక్షించడానికి వెళుతున్నాను.

ఓ జనకరాజపుత్రీ! ఈ వనదేవతలే నీకు రక్షగా ఉందురు గాక! నీకు క్షేమం అగుగాక! ఓ సీతా! ప్రస్తుతము నాకు అనుకూలమైన శకునములు కనపడటం లేదు. మరలా నేను, నువ్వు రాముడు కలిసి ఉండగా చూస్తానో లేదో అని అనుమానంగా ఉంది. ” అని వెళ్లనా వద్దా అని తటపటాయిస్తున్నాడు లక్ష్మణుడు.

అది చూచి మరలా సీత సూటీ పోటీ మాటలు అనడం మొదలెట్టింది. “ఓ లక్ష్మణా! ఎందుకు అనవసరంగా ఆలస్యం చేస్తున్నావు. రామునికి ఏదైనా ప్రమాదం జరగాలని కోరుకుంటున్నావా! రామునికి జరగకూడనిది జరిగితే నేను గోదావరిలో దూకుతాను. ఉరిపోసుకొని చస్తాను. లేదా ఆ ఎత్తైన పర్వతము మీదికి ఎక్కి కిందికి దూకుతాను. విషం తాగుతాను. అగ్నిలో దూకుతాను. చస్తాను. అంతేగానీ నేను పరపురుషుని నా పాదముతో కూడా తాకను.” అని నెత్తీ నోరూ బాదుకుంటూ ఏడుస్తూ ఉంది సీత.

సీత ఏడుపు భరించలేకపోయాడు లక్ష్మణుడు. ఏమి అయితే అది అవుతుందని, సీతకు నమస్కరించాడు. మరలా మరలా వెనక్కు తిరిగి చూచుకుంటూ, కనులనిండా నీరు నిండగా, ఆ స్థలం వదిలి రాముని వెదుక్కుంటూ వెళ్లాడు లక్ష్మణుడు.

(ఇక్కడ ఒక మాట. మనకు అనుశ్రుతంగా ఉన్న కథలలో లక్ష్మణుడు ఆశ్రమము ముందు ఒక గీతగీచాడనీ, రావణుడు దగ్గర రాగానే ఆ గీత మంటలు విరజిమ్మింది అనీ, అందుకని రావణుడు సీతను గీతదాటి రమ్మన్నాడనీ, సీత గీత దాటగానే, తీసుకొని వెళ్లాడని, సీతను తాకకుండా ఆమె ఉన్న ప్రదేశమును మొత్తం పెకలించి తీసుకువెళ్లాడనీ, రావణుడు సీతను తాకితో భస్మం అయిపోతాడని శాపం ఉందనీ, అందుకని సీతను తాకకుండా తీసుకొని వెళ్లాడనీ రకరకాల కథలు ప్రచారంలో ఉన్నాయి. అవే సినిమాలలో, టివిలలో కూడా చూపించారు. కాని వాల్మీకి రామాయణంలో ఇవన్నీ లేవు. లక్ష్మణుడు గీతా గీయలేదు. సీత గీత దాటనూ లేదు. రావణుడు సీతను మెడ కింద ఒక చెయ్యి, నడుము కింద ఒక చెయ్యి వేసి ఎత్తుకొని రథం మీద కూర్చోపెట్టాడు. తాను కూర్చుని సీతను తన ఒడిలో కూర్చోపెట్టుకొని తీసుకొని వెళ్లాడు.

(అట్లేనాదాయ వైదేహీం రథమారోపయత్తదా) అని వాల్మీకి రామాయణంలో ఉంది.)

శ్రీమద్రామాయణము
అరణ్యకాండము నలుబది ఐదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

అరణ్యకాండ షట్చత్వారింశః సర్గః (46)>>

Leave a Comment