మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అరణ్యకాండ సప్తమ సర్గలో, రాముడు, సీత, లక్ష్మణుడు దండకారణ్యంలోకి ప్రవేశిస్తారు. అక్కడ వారి సాహసాలు, రాక్షసులతో జరిగిన ఘర్షణలు, వనవాసంలో ఎదురైన కష్టాలు వివరించబడతాయి. మహర్షి అగస్త్యుని ఆశీర్వాదం అందుకుంటారు.
సుతీక్ష్ణాశ్రమః
రామస్తు సహితో భ్రాత్రా సీతయా చ పరంతపః |
సుతీక్ష్ణస్యాశ్రమపదం జగామ సహ తైర్ద్విజైః ||
1
స గత్వాఽదూరమధ్వానం నదీస్తీర్త్వా బహూదకాః |
దదర్శ విపులం శైలం మహామేఘమివోన్నతమ్ ||
2
తతస్తదిక్ష్వాకువరౌ సంతతం వివిధైర్ద్రుమైః |
కాననం తౌ వివిశతుః సీతయా సహ రాఘవౌ ||
3
ప్రవిష్టస్తు వనం ఘోరం బహుపుష్పఫలద్రుమమ్ |
దదర్శాశ్రమమేకాంతే చీరమాలాపరిష్కృతమ్ ||
4
తత్ర తాపసమాసీనం మలపంకజటాధరమ్ |
రామః సుతీక్ష్ణం విధివత్తపోవృద్ధమభాషత ||
5
రామోఽహమస్మి భగవన్భవంతం ద్రష్టుమాగతః |
త్వం మాఽభివద ధర్మజ్ఞ మహర్షే సత్యవిక్రమ ||
6
స నిరీక్ష్య తతో వీరం రామం ధర్మభృతాం వరమ్ |
సమాశ్లిష్య చ బాహుభ్యామిదం వచనమబ్రవీత్ ||
7
స్వాగతం ఖలు తే వీర రామ ధర్మభృతాం వర |
ఆశ్రమోఽయం త్వయాక్రాంతః సనాథ ఇవ సాంప్రతమ్ ||
8
ప్రతీక్షమాణస్త్వామేవ నారోహేఽహం మాహాయశః |
దేవలోకమితో వీర దేహం త్యక్త్వా మహీతలే ||
9
చిత్రకూటముపాదాయ రాజ్యభ్రష్టోఽసి మే శ్రుతః |
ఇహోపయాతః కాకుత్స్థ దేవరాజః శతక్రతుః ||
10
ఉపాగమ్య చ మాం దేవో మహాదేవః సురేశ్వరః |
సర్వాఁల్లోకాంజితానాహ మమ పుణ్యేన కర్మణా ||
11
తేషు దేవర్షిజుష్టేషు జితేషు తపసా మయా |
మత్ప్రసాదాత్సభార్యస్త్వం విహరస్వ సలక్ష్మణః ||
12
తముగ్రతపసా యుక్తం మహర్షిం సత్యవాదినమ్ |
ప్రత్యువాచాత్మవాన్రామో బ్రహ్మాణమివ కాశ్యపః ||
13
అహమేవాహరిష్యామి స్వయం లోకాన్మహామునే |
ఆవాసం త్వహమిచ్ఛామి ప్రదిష్టమిహ కాననే ||
14
భవాన్సర్వత్ర కుశలః సర్వభూతహితే రతః |
ఆఖ్యాతః శరభంగేణ గౌతమేన మహాత్మనా ||
15
ఏవముక్తస్తు రామేణ మహర్షిర్లోకవిశ్రుతః |
అబ్రవీన్మధురం వాక్యం హర్షేణ మహతాఽఽప్లుతః ||
16
అయమేవాశ్రమో రామ గుణవాన్రమ్యతామిహ |
ఋషిసంఘానుచరితః సదా మూలఫలాన్వితః ||
17
ఇమమాశ్రమమాగమ్య మృగసంఘా మహాయశాః |
అటిత్వా ప్రతిగచ్ఛంతి లోభయిత్వాకుతోభయాః ||
18
నాన్యో దోషో భవేదత్ర మృగేభ్యోఽన్యత్ర విద్ధి వై |
తచ్ఛ్రుత్వా వచనం తస్య మహర్షేర్లక్ష్మణాగ్రజః ||
19
ఉవాచ వచనం ధీరో వికృష్య సశరం ధనుః |
తానహం సుమహాభాగ మృగసంఘాన్సమాగతాన్ ||
20
హన్యాం నిశితధారేణ శరేణాశనివర్చసా |
భవాంస్తత్రాభిషజ్యేత కిం స్యాత్కృచ్ఛ్రతరం తతః ||
21
ఏతస్మిన్నాశ్రమే వాసం చిరం తు న సమర్థయే |
తమేవముక్త్వా వరదం రామః సంధ్యాముపాగమత్ ||
22
అన్వాస్య పశ్చిమాం సంధ్యాం తత్ర వాసమకల్పయత్ |
సుతీక్ష్ణస్యాశ్రమే రమ్యే సీతయా లక్ష్మణేన చ ||
23
తతః శుభం తాపసభోజ్యమన్నం
స్వయం సుతీక్ష్ణః పురుషర్షభాభ్యామ్ |
తాభ్యాం సుసత్కృత్య దదౌ మహాత్మా
సంధ్యానివృత్తౌ రజనీమవేక్ష్య ||
24
ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అరణ్యకాండే సప్తమః సర్గః ||
Aranya Kanda Sarga 7 Meaning In Telugu
రాముడు, సీతతోనూ, లక్ష్మణుని తోనూ, ఇంకా కొందరు మునులతోనూ సుతీక్ష మహర్షి ఆశ్రమమునకు వెళ్లాడు. సుతీక్ష మహర్షి ఆశ్రమము ఒక మహారణ్యములో చదునైన ప్రదేశములో ఉంది. ఆ అడవిలో ఫలవృక్షములు పుష్కలంగా ఉన్నాయి.
రాముడు ఆ ఆశ్రమములో ప్రవేశించాడు. తపస్సులో ఉన్న సుతీక్ష మహర్షిని చూచాడు. భక్తితో నమస్కరించాడు. తనను తాను పరిచయం చేసుకున్నాడు.
“ఓ మహర్షీ! నా పేరు రాముడు అయోధ్యాధి పతి దశరథుని కుమారుడను. తండ్రి ఆజ్ఞ మేరకు, నా భార్య, సోదరునితో కలిసి అరణ్యవాసము చేస్తున్నాను. శరభంగ మహర్షి ఆదేశము మేరకు తమ దగ్గరకు వచ్చాను. కళ్లు తెరిచి నాతో మాట్లాడండి.” అని ప్రార్థించాడు.
సుతీక్ష మహర్షి కళ్లు తెరిచాడు. రాముని చూచాడు. పరమానందంతో రాముని కౌగలించుకున్నాడు.
“రామా! నీకు స్వాగతము. నీరాకచే మా ఆశ్రమమునకు ఒక నాధుడు దొరికినట్టయింది. రామా! నీ గురించి విన్నాను. నీవు అరణ్యములలో సంచరిస్తున్నావని తెలిసి నీ రాక కొరకు ఎదురు చూస్తున్నాను. దేవేంద్రుడు వచ్చి నన్ను స్వర్గలోకమునకు ఆహ్వానించాడు. నేను స్వర్గమునకు వెళ్లవలెనని నిశ్చయించుకున్నాను. కాబట్టి నేను ఆర్జించిన తపోఫలమును నీకు ధారపోస్తాను. నీవు స్వీకరించు.” అని అన్నాడు.
అప్పుడు రాముడు ఆ మహర్షితో ఇలా అన్నాడు. “ఓ మహర్షీ! నీ గురించి శరభంగ మహర్షి వలన విని ఉన్నాను. తమరు నాకు ఉండటానికి తగిన ప్రదేశమును నిర్ణయిస్తారని శరభంగ మహర్షి చెప్పాడు.” అని అన్నాడు.
“రామా! ఈ అడవిలో ఈ ప్రాంతము నివాసయోగ్యమైనది. ఇక్కడ ఫలవృక్షములు, పూదోటలు విస్తారముగా ఉన్నాయి. పర్ణశాల నిర్మించుకోడానికి అనువైన చదునైన ప్రదేశము ఉంది. కాబట్టి నీవు పర్ణశాల నిర్మించుకొని ఇక్కడే ఉండవచ్చును. కాని ఈ ప్రదేశమునకు పెద్ద పెద్ద జంతువులు గుంపులు గుంపులుగా వస్తాయి. కాని అవి ఎవరికీ హాని చెయ్యవు. కాసేపు అటూ ఇటూ తిరిగి వెళ్లిపోతాయి. అది తప్ప ఇక్క ఏ విధమైన భయము లేదు. ప్రశాంతంగా ఉంటుంది.” అని అన్నాడు సుతీక్ష మహర్షి.
అప్పుడు రాముడు ఇలా అన్నాడు. “ఓ మహర్షీ! నాకు మృగముల వలన భయము లేదు. నేను వనవాసిని కాను కదా. క్షత్రియుడను. ఈ ధనుర్బాణములతో మనకు హాని కలిగించు మృగములను చంపగలను. కాని నేను మృగములను చంపడం సహజంగా దయాళువులైన మీకు కష్టం కలిగించవచ్చును. కాబట్టి నేను ఇక్కడ ఎక్కువ కాలము ఉండలేను అనిపిస్తూ ఉంది.” అని అన్నాడు రాముడు.
తరువాత రాముడు, లక్ష్మణుడు సంధ్యావందనాది కార్యక్రమములు నిర్వర్తించారు. సుతీక్ష మహర్షి రామలక్ష్మణులకు, సీతకు, వారితో వచ్చిన మునులకు ఫలములను ఇచ్చి సత్కరించాడు. ఆ రాత్రికి వారు సుతీక్షుని ఆశ్రమములోనే ఉన్నారు.
శ్రీమద్రామాయణము
అరణ్యకాండము ఏడవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్