Ayodhya Kanda Sarga 20 In Telugu – అయోధ్యాకాండ వింశః సర్గః

రామాయణం యొక్క అయోధ్యాకాండలో వింశ సర్గం ప్రధానంగా రాముడు, సీతా, లక్ష్మణులు అరణ్యానికి ప్రయాణమవ్వడాన్ని గురించి వివరిస్తుంది. రాముడు తన తండ్రి దశరథుని ఆజ్ఞను పాటిస్తూ సీతా, లక్ష్మణులతో పాటు దండకారణ్యంలో నివసించేందుకు బయలుదేరుతాడు. వారు గంగానదిని దాటి గుహులను, పర్వతాలను దాటుతూ అరణ్యంలో అడుగుపెడతారు. వారు ఇక్కడ ఉండేందుకు తగిన స్థలాన్ని వెతుకుతూ రిషులు, మూనులతో ఆత్మీయంగా మాట్లాడుతారు. ఈ ప్రయాణం వారి ధైర్యం, నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. అందరూ ధైర్యంగా ఒకరికొకరు సహాయం చేస్తూ, ధర్మాన్ని కాపాడతారని ప్రగాఢ విశ్వాసంతో ముందుకు సాగుతారు. ఈ సర్గ రాముడు తన ధర్మాన్ని పాటించడంలో అతని నిబద్ధతను మరియు అరణ్యంలో వారి ప్రయాణం ప్రారంభాన్ని వివరిస్తుంది.

కౌసల్యాక్రందః

తస్మింస్తు పురుషవ్యాఘ్రే నిష్క్రామతి కృతాంజలౌ |
ఆర్తశబ్దో మహాంజజ్ఞే స్త్రీణామంతఃపురే తదా || ౧ ||

కృత్యేష్వచోదితః పిత్రా సర్వస్యాంతఃపురస్య చ |
గతిర్యః శరణం చాపి స రామోఽద్య ప్రవత్స్యతి || ౨ ||

కౌసల్యాయాం యథా యుక్తో జనన్యాం వర్తతే సదా |
తథైవ వర్తతేఽస్మాసు జన్మప్రభృతి రాఘవః || ౩ ||

న క్రుధ్యత్యభిశప్తోఽపి క్రోధనీయాని వర్జయన్ |
కృద్ధాన్ప్రసాదయన్సర్వాన్స ఇతోఽద్య ప్రవత్స్యతి || ౪ ||

అబుద్ధిర్బత నో రాజా జీవలోకం చరత్యయమ్ |
యో గతిం సర్వలోకానాం పరిత్యజతి రాఘవమ్ || ౫ ||

ఇతి సర్వా మహిష్యస్తాః వివత్సా ఇవ ధేనవః |
పతిమాచుక్రుశుశ్చైవ సస్వరం చాపి చుక్రుశుః || ౬ ||

స హి చాంతః పురే ఘోరమార్తశబ్దం మహీపతిః |
పుత్రశోకాభిసంతప్తః శ్రుత్వా వ్యాలీయతాసనే || ౭ ||

రామస్తు భృశమాయస్తో నిఃశ్వసన్నివ కుంజరః |
జగామ సహితో భ్రాత్రా మాతురంతఃపురం వశీ || ౮ ||

సోఽపశ్యత్పురుషం తత్ర వృద్ధం పరమపూజితమ్ |
ఉపవిష్టం గృహద్వారి తిష్ఠతశ్చాపరాన్బహూన్ || ౯ ||

దృష్ట్వైవ తు తదా రామం తే సర్వే సహసోత్థితాః |
జయేన జయతాం శ్రేష్ఠం వర్ధయంతి స్మ రాఘవమ్ || ౧౦ ||

ప్రవిశ్య ప్రథమాం కక్ష్యాం ద్వితీయాయాం దదర్శ సః |
బ్రాహ్మణాన్వేదసంపన్నాన్వృద్ధాన్రాజ్ఞాఽభిసత్కృతాన్ || ౧౧ ||

ప్రణమ్య రామస్తాన్వృద్ధాంస్తృతీయాయాం దదర్శ సః |
స్త్రియో వృద్ధాశ్చ బాలాశ్చ ద్వారరక్షణతత్పరాః || ౧౨ ||

వర్ధయిత్వా ప్రహృష్టాస్తాః ప్రవిశ్య చ గృహం స్త్రియః |
న్యవేదయంత త్వరితాః రామమాతుః ప్రియం తదా || ౧౩ ||

కౌసల్యాఽపి తదా దేవీ రాత్రిం స్థిత్వా సమాహితా |
ప్రభాతే త్వకరోత్పూజాం విష్ణోః పుత్రహితైషిణీ || ౧౪ ||

సా క్షౌమవసనా హృష్టా నిత్యం వ్రతపరాయణా |
అగ్నిం జుహోతి స్మ తదా మంత్రవత్కృతమంగళా || ౧౫ ||

ప్రవిశ్య చ తదా రామో మాతురంతఃపురం శుభమ్ |
దదర్శ మాతరం తత్ర హావయంతీ హుతాశనమ్ || ౧౬ ||

దేవకార్యనిమిత్తం చ తత్రాపశ్యత్సముద్యతమ్ |
దధ్యక్షతం ఘృతం చైవ మోదకాన్హవిషస్తథా || ౧౭ ||

లాజాన్మాల్యాని శుక్లాని పాయసం కృసరం తథా |
సమిధః పూర్ణకుంభాంశ్చ దదర్శ రఘునందనః || ౧౮ ||

తాం శుక్లక్షౌమసంవీతాం వ్రతయోగేన కర్శితామ్ |
తర్పయంతీం దదర్శాద్భిర్దేవతాం దేవవర్ణినీమ్ || ౧౯ ||

సా చిరస్యాత్మజం దృష్ట్వా మాతృనందనమాగతమ్ |
అభిచక్రామ సంహృష్టాః కిశోరం బడవా యథా || ౨౦ ||

స మాతరమభిక్రాంతాముపసంగృహ్య రాఘవః |
పరిష్వక్తశ్చ బాహుభ్యాముపాఘ్రాతశ్చ మూర్ధని || ౨౧ ||

తమువాచ దురాధర్షం రాఘవం సుతమాత్మనః |
కౌసల్యా పుత్రవాత్సల్యాదిదం ప్రియహితం వచః || ౨౨ ||

వృద్ధానాం ధర్మశీలానాం రాజర్షీణాం మహాత్మనామ్ |
ప్రాప్నుహ్యాయుశ్చ కీర్తిం చ ధర్మం చోపహితం కులే || ౨౩ ||

సత్యప్రతిజ్ఞం పితరం రాజానం పశ్య రాఘవ |
అద్యైవ హి త్వాం ధర్మాత్మా యౌవరాజ్యేఽభిషేక్ష్యతి || ౨౪ ||

దత్తమాసనమాలభ్య భోజనేన నిమంత్రితః |
మాతరం రాఘవః కించిద్వ్రీడాత్ప్రాంజలిరబ్రవీత్ || ౨౫ ||

స స్వభావవినీతశ్చ గౌరవాచ్చ తదాఽఽనతః |
ప్రస్థితో దండకారణ్యమాప్రష్టుముపచక్రమే || ౨౬ ||

దేవి నూనం న జానీషే మహద్భయముపస్థితమ్ |
ఇదం తవ చ దుఃఖాయ వైదేహ్యా లక్ష్మణస్య చ || ౨౭ ||

గమిష్యే దండకారణ్యం కిమనేనాసనేన మే |
విష్టరాసనయోగ్యో హి కాలోఽయం మాముపస్థితః || ౨౮ ||

చతుర్దశ హి వర్షాణి వత్స్యామి విజనే వనే |
మధుమూలఫలైర్జీవన్హిత్వా మునివదామిషమ్ || ౨౯ ||

భరతాయ మహారాజో యౌవరాజ్యం ప్రయచ్ఛతి |
మాం పునర్దండకారణ్యే వివాసయతి తాపసమ్ || ౩౦ ||

స షట్ చాష్టౌ చ వర్షాణి వత్స్యామి విజనే వనే |
ఆసేవమానో వన్యాని ఫలమూలైశ్చ వర్తయన్ || ౩౧ ||

సా నికృత్తేవ సాలస్య యష్టిః పరశునా వనే |
పపాత సహసా దేవీ దేవతేవ దివశ్చ్యుతా || ౩౨ ||

తామదుఃఖోచితాం దృష్ట్వా పతితాం కదలీమివ |
రామస్తూత్థాపయామాస మాతరం గతచేతసమ్ || ౩౩ ||

ఉపావృత్యోత్థితాం దీనాం బడబామివ వాహితామ్ |
పాంసుకుంఠితసర్వాంగీం విమమర్శ చ పాణినా || ౩౪ ||

సా రాఘవముపాసీనమసుఖార్తా సుఖోచితా |
ఉవాచ పురుషవ్యాఘ్రముపశృణ్వతి లక్ష్మణే || ౩౫ ||

యది పుత్ర న జాయేథాః మమ శోకాయ రాఘవ |
న స్మ దుఃఖమతో భూయః పశ్యేయమహమప్రజాః || ౩౬ ||

ఏక ఏవ హి వంధ్యాయాః శోకో భవతి మానసః |
అప్రజాఽస్మీతి సంతాపో న హ్యన్యః పుత్ర విద్యతే || ౩౭ ||

న దృష్టపూర్వం కళ్యాణం సుఖం వా పతిపౌరుషే |
అపి పుత్రే తు పశ్యేయమితి రామస్థితం మయా || ౩౮ ||

సా బహూన్యమనోజ్ఞాని వాక్యాని హృదయచ్ఛిదామ్ |
అహం శ్రోష్యే సపత్నీనామవరాణాం వరా సతీ || ౩౯ ||

అతో దుఃఖతరం కిం ను ప్రమదానాం భవిష్యతి |
మమ శోకో విలాపశ్చ యాదృశోఽయమనంతకః || ౪౦ ||

త్వయి సన్నిహితేఽప్యేవమహమాసం నిరాకృతా |
కిం పునః ప్రోషితే తాత ధ్రువం మరణమేవ మే || ౪౧ ||

అత్యంతం నిగృహీతాఽస్మి భర్తుర్నిత్యమతంత్రితా |
పరివారేణ కైకేయ్యాః సమా వాఽప్యథవావరా || ౪౨ ||

యో హి మాం సేవతే కశ్చిదథవాఽప్యనువర్తతే |
కైకేయ్యాః పుత్రమన్వీక్ష్య స జనో నాభిభాషతే || ౪౩ ||

నిత్యక్రోధతయా తస్యాః కథం ను ఖరవాది తత్ |
కైకేయ్యా వదనం ద్రష్టుం పుత్ర శక్ష్యామి దుర్గతా || ౪౪ ||

దశ సప్త చ వర్షాణి తవ జాతస్య రాఘవ |
ఆసితాని ప్రకాంక్షంత్యా మయా దుఃఖపరిక్షయమ్ || ౪౫ ||

తదక్షయమహం దుఃఖం నోత్సహే సహితుం చిరమ్ |
విప్రకారం సపత్నీనామేవం జీర్ణాఽపి రాఘవ || ౪౬ ||

అపశ్యంతీ తవ ముఖం పరిపూర్ణశశిప్రభమ్ |
కృపణా వర్తయిష్యామి కథం కృపణజీవికామ్ || ౪౭ ||

ఉపవాసైశ్చ యోగైశ్చ బహుభిశ్చ పరిశ్రమైః |
దుఃఖసంవర్ధితో మోఘం త్వం హి దుర్గతయా మయా || ౪౮ ||

స్థిరం తు హృదయం మన్యే మమేదం యన్న దీర్యతే |
ప్రావృషీవ మహానద్యాః స్పృష్టం కూలం నవాంభసా || ౪౯ ||

మమైవ నూనం మరణం న విద్యతే
న చావకాశోఽస్తి యమక్షయే మమ |
యదంతకోఽద్యైవ న మాం జిహీర్షతి
ప్రసహ్య సింహో రుదతీం మృగీమివ || ౫౦ ||

స్థిరం హి నూనం హృదయం మమాయసం
న భిద్యతే యద్భువి నావదీర్యతే |
అనేన దుఃఖేన చ దేహమర్పితం
ధ్రువం హ్యకాలే మరణం న విద్యతే || ౫౧ ||

ఇదం తు దుఃఖం యదనర్థకాని మే
వ్రతాని దానాని చ సంయమాశ్చ హి |
తపశ్చ తప్తం యదపత్యకారణాత్
సునిష్ఫలం బీజమివోప్తమూషరే || ౫౨ ||

యది హ్యకాలే మరణం స్వయేచ్ఛయా
లభేత కశ్చిద్గురుదుఃఖకర్శితః |
గతాఽహమద్యైవ పరేతసంసదం
వినా త్వయా ధేనురివాత్మజేన వై || ౫౩ ||

అథాపి కిం జీవితమద్య మే వృథా
త్వయా వినా చంద్రనిభాననప్రభ |
అనువ్రజిష్యామి వనం త్వయైవ గౌః
సుదుర్బలా వత్సమివానుకాంక్షయా || ౫౪ ||

భృశమసుఖమమర్షితా తదా
బహు విలలాప సమీక్ష్య రాఘవమ్ |
వ్యసనముపనిశామ్య సా మహత్
సుతమివ బద్ధమవేక్ష్య కిన్నరీ || ౫౫ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే వింశః సర్గః || ౨౦ ||

Ayodhya Kanda Sarga 20 Meaning In Telugu

(ఇంతకు ముందు సర్గలో వాల్మీకి మహర్షి రాముడు కౌసల్య మందిరము ప్రవేశించాడు అని చెప్పాడు. కాని ఈ సర్గలో కొంచెం వెనక్కు వెళ్లాడు. ఇప్పుడు మనము ఇంకా దశరథుని అంతఃపురము లోనే ఉన్నాము. ఇంక చదవండి.)

కైక మాటలను మన్నించి రాముడు అక్కడనుండి బయటకు వచ్చిన తరువాత కైక అంతఃపురములోని స్త్రీలు, దశరథుని ఇతర భార్యలు భోరున ఏడ్చారు. అయ్యో రాముడు అడవులకు వెళ్లిపోతున్నాడా అని దు:ఖించారు. (దశరథునికి కైసల్యా, సుమిత్ర,కైకేయీ కాక ఇంకా మూడువందలయాభై మంది భార్యలు ఉన్నట్టు ప్రతీతి.)

“తండ్రి నోటి నుండి మాట వెలుపలికి వచ్చీ రాకముందే ఆ కార్యములను చక్కబెట్టే రాముడు, అంత:పురములోని వారికి ఏ లోటూరాకుండా అన్ని అమర్చేరాముడు అరణ్యములకు పోతున్నాడు. తన తల్లి పట్ల ఎటువంటి భక్తి, ప్రేమ చూపుతున్నాడో, మన యందు కూడా అలాంటి భక్తి వినయము ప్రేమ చూపిన రాముడు అరణ్యము లకు పోతున్నాడు. కోపమంటే ఎరుగని రాముడు, ఎవరైనా తన మీద కోపగించినా వారి మీద కోపించని రాముడు ఇప్పుడు అరణ్యములకు పోతున్నాడు. ఇన్నాళ్లు దశరథుడు ఏదో తెలివిగల రాజు అనుకున్నాము, కాని ఇంత తెలివితక్కువగా కన్నకొడుకును కారడవులకు పంపే మూర్ఖుడు అనేకోలేదు.” ఈ ప్రకారంగా అంత:పుర స్త్రీలందరూ తలొక మాటా అనుకుంటూ దు:ఖిస్తున్నారు.

వారి మాటలు విన్న దశరథునికి శోకము ఇంకా ఎక్కువ అయింది. వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. అంతలోనే స్పృహ తప్పుతున్నాడు. మరలా తేరుకుంటున్నాడు. రాముని కోసం చుట్టు వెర్రి చూపులు చూస్తున్నాడు. రాముడు కనపడక మరలా హతాశుడవుతున్నాడు.
కౌసల్య అంతఃపురము బయట ద్వారముల వద్ద అనేక మంది బ్రాహ్మణులు నిలబడి ఉన్నారు. రాముని చూడగానే వారందరూ లేచి నిలబడ్డారు. అందులో ఒక వృద్ధ బ్రాహ్మణుడు “రామా! నీకు జయమగు గాక” అని ఆశీర్వదించాడు. రాముడు అక్కడ నిలబడి ఉన్న బ్రాహ్మణులకు అందరికీ భక్తితో నమస్కరించాడు.

తరువాత ద్వారము వద్ద బ్రాహ్మణులు, ముత్తయిదువలు నిలబడి ఉన్నారు. రాముని రావడం చూచి వారందరూ లేచి నిలబడ్డారు. వారందరూ జయజయ ధ్వానములతో రాముని కౌసల్యా మందిరమునకు స్వాగతించారు.

మరి కొంత మంది లోపలకు పరుగు పరుగున వెళ్లి కౌసల్యకు రాముడు వస్తున్నాడు అన్న వార్తను అందించారు. కౌసల్య రాత్రి అంతా జాగారము చేసి పొద్దుటే లేచి, స్నానాదికములు ఆచరించి, తెల్లని పట్టుచీర కట్టుకొని రాముని క్షేమం కోరుతూ విష్ణు పూజ చేసింది. తరువాత అగ్నిలో మంగళ ద్రవ్యములు హెూమం చేస్తూ ఉంది. రాముడు అంతఃపురములో ప్రవేశించి హెూమము చేస్తూ ఉన్న తల్లిని చూచాడు.

రాముడు రావడం చూచి కౌసల్య లేచి రాముని దగ్గరగా వచ్చింది. రాముడు తల్లి పాదములకు నమస్కరించాడు. కౌసల్య రాముని ఆశీర్వదించింది. తరువాత రాముని రెండు చేతలతో లేపి గట్టిగా కౌగలించుకొని తలమీద ముద్దు పెట్టుకొంది. “నాయనా రామా! నీవు కూడా నీపూర్వీకుల వలె కీర్తి ప్రతిష్టలు పొందుదువు గాక! నీవు నీ వంశకర్తలు ఆచరించిన ధర్మములను పాటించెదవు గాక! నీ తండ్రి దశరథ మహారాజు నిన్ను ఈ రోజు యువరాజుగా పట్టాభిషిక్తుని చేస్తాను అన్నాడు. నీ తండ్రి మాట తప్పడు. నీకు ఈ రోజే యౌవరాజ్య పట్టాభిషేకము జరగ గలదు.

రామా! రాత్రి ఎప్పుడు తిన్నావో ఏమో. రా నాయనా భోజనము చేద్దువు గానీ.” అని ఆప్యాయంగా రాముని భోజనానికి పిలిచింది. రాముడు మరలా తన తల్లి కౌసల్యకు నమస్కరించి ఇలా అన్నాడు. “అమ్మా! ఇప్పుడు మనకు ఒక అనుకోని ఆపద ఒకటి వచ్చి పడినది. నేను ఇప్పుడు అత్యవసరంగా దండకారణ్యము పోవలెను. దీని వలన నీవు, సీత, లక్ష్మణుడు దు:ఖిస్తారు అని నాకు తెలుసు. కాని ఇది తప్పదు. నేను వెళ్లి తీరాలి. కాబట్టి నాకు నేటి నుండి ఈ రాజభోగము లు, రాజ భోజనములు, సింహాసనములు నిషిద్ధములు. నేను కందమూలములు తింటూ, దర్భాసనము మీద పడుకోవాలి. ఈ విధముగా నేను పదునాలుగేళ్లు వనవాసము చెయ్యాలి. నాకు బదులుగా భరతుడు రాజ్యాభిషిక్తుడు అవుతాడు. ఇది తండ్రి గారి నిర్ణయము. నాకు శిరోధార్యము.” అని అన్నాడు.

రాముడు ఈ మాటలు అంటూ ఉండగానే కౌసల్య నిట్టనిలువునా కూలిపోయింది. రాముడు వెంటనే తల్లిని పైకి లేపి పక్కనే ఉన్న ఆసనము మీద కూర్చో పెట్టాడు. పరిచారికలు చల్లని నీళ్లు ఆమె మొహం మీద చల్లి సేదదీర్చారు. కౌసల్యకు దుఃఖము ఆగటం లేదు. కళ్లనుండి నీరు ధారాపాతంగా కారిపోతూ ఉంది. నోటమాట పెగలడంలేదు.

“రామా! నువ్వు నా కడుపున ఎందుకు పుట్టావయ్యా! నాకు ఈ వార్త చెప్పడానికేనా! అసలు నాకు పిల్లలు లేకుండా ఉంటేనే బాగుండేది. పిల్లలు లేరు అని ఒకే దిగులు ఉండేది. కాని ఇప్పుడు నువ్వు పుట్టి పెరిగి ప్రయోజకుడవు అయి నాకు ఎనలేని దుఃఖము కలిగిస్తున్నావు. ఇది నీకు న్యాయమా రామా!

రామా! నేను పెళ్లి చేసుకొని ఇక్కడకు వచ్చిన తరువాత సుఖము అనేది ఎలా ఉంటుందో నాకు తెలియదు. నా భర్త రాజుగా ఉ న్న రోజుల్లో నాకు ఏనాడూ సుఖము లేదు. కనీసము నువ్వు పట్టాభిషిక్తుడవు అయిన తరువాత అన్నా సుఖపడదామనుకున్నాను. ఆ ఆశకూడా అడియాస చేసావు రామా!

రామా! నేను అందరి కంటే పెద్ద భార్యను అయి ఉండి కూడా, నీ వనవాసముతో అందరి ముందూ తలదించుకోవాల్సిన పరిస్థితి, వారి సూటీ పోటీ మాటలు పడాల్సిన దౌర్భాగ్యము నాకు దాపురించింది. ఇంతకు మించి స్త్రీలకు దు:ఖము ఏముంటుంది. రామా! నీవు ఇక్కడ ఉండగానే నా సవతులు నన్ను నిరాదరిస్తున్నారు. ఇంక నీవు లేకపోతే చెప్పవలెనా. నా బతుకు దుర్భరము అవుతుంది. అందుకే నాకు మరణమే శరణ్యము.
రామా! నా భర్త నన్ను ఏనాడూ అందరితో పాటు ఆదరించలేదు. ముఖ్యంగా ఆ కైక, ఆమె దాస దాసీల పాటి కూడా నేను చెయ్యలేదు. నా భర్త వారి కన్నా హీనంగా నన్ను చూచాడు. పేరుకు పెద్దభార్యనే కానీ స్వతంత్రించి ఏ పనీ చెయ్యలేను. నాది ఒక బానిసబతుకు. నువ్వు చెప్పినట్టు రేపు భరతుడు రాజైతే. ఈరోజు నన్ను పలకరించే వాళ్లు కూడా రేపు నా మొహం చూడరు. నాతో మాట్లాడరు. ఇంక కైక సంగతి చెప్ప పనిలేదు. రేపటి నుండి నన్ను ఒక మనిషిగా కూడా చూడదు. చీటికీ మాటికీ నన్ను నిందిస్తూ ఉంటుంది. అసలు ఆమె మొహం చూడటానికే నాకు భయంగా ఉంటుంది.

రామా! నిన్ను చూచుకొని, ఇన్నాళ్లు ఈ దుర్భరమైన బాధలు భరించాను. నీకు ఉపనయనము అయిన నాటి నుండి దాదాపు పదిహేడు సంవత్సరములు నువ్వు రాజ్యాభిషిక్తుడవు అవుతావనీ, నా కష్టములు తీరుస్తావని ఆశతో ఎదురు చూచాను. నీ మాటలతో ఆ ఆశ నిరాశ అయింది. ఈ వృద్ధాప్యంలో నేను, నా సవతుల సూటీ పోటీ మాటలు, వారు చేయు అవమానములు భరించలేను.

ఇన్నాళ్లు నీ ముద్దులొలికే మొహం చూస్తూ ఈ బాధలన్నీ దిగమింగుకున్నాను. ఇంక నువ్వు నాకు కనపడవు. నేను ఈ బాధలు భరించలేను. నేను ఎంతో దురదృష్టవంతురాలను. లేకపోతే నీ క్షేమం గురించి, నీకు ఆయురారోగ్య ఐశ్వర్యములు కలగాలనీ, నీవు రాజ్యాభిషిక్తుడివికావాలనీ ఎన్నో పూజలు వ్రతాలూ ఉపవాసాలు చేసాను. ఏ దేవుడూ నన్ను కరుణించలేదు. నా బాధలను తీర్చలేదు. అవన్నీ వ్యర్ధమైపోయాయి.

రామా! నా గుండె చాలా కఠినమయింది లేకపోతే నీవు చెప్పిన ఈ దుర్వార్త విని నా గుండెలు ఈ పాటికి పగిలిపోవాల్సింది. కాని అలా జరగలేదు.. నాగుండెలు రాతి బండలు. అవి పగలవు. నాకు మరణము రాదు.

రామా! నాకు పుత్ర సంతానము కావాలని ఎన్నో పూజలు, ఎన్నెన్నో వ్రతాలూ యజ్ఞాలు యాగాలు చేసాను. నీవు పుట్టావు. కానీ ఏం లాభం. అవి ఫలించలేదు. నీకు వనవాసము ప్రాప్తించింది.

రామా! మానవులకు తమ ఇష్టం వచ్చినప్పుడు మరణించే అవకాశము లేదు కదా! లేకపోతే నీవు ఈ మాట చెప్పగానే హాయిగా మరణించి ఉండేదాన్ని. ఎందుకంటే రామా! ఇంక నేను ఎందుకు బతకాలి. ఎవరి కోసం బతకాలి. ఏం అనుభవించడానికి బతకాలి. వ్యర్ధంగా కలకాలం బతకడం కంటే మరణించడం మేలు కదా!

లేకపోతే రామా! ఒకపని చెయ్యి. నన్నుకూడా నీ వెంట అరణ్యములకు తీసుకొని వెళ్లు. నీ యోగక్షేమాలు చూసుకుంటూ నీ వెంటే ఉంటాను.” అని కౌసల్య రాముని చూచి తన మనసులో ఉన్న బాధను ఆవేశాన్ని అంతా వెళ్లగక్కింది.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము ఇరువదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అయోధ్యాకాండ ఏకవింశః సర్గః (21) >>

Leave a Comment