మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అయోధ్యాకాండ రామాయణ కావ్యంలో రెండవ విభాగము. ఇందులో 119 సర్గలు ఉన్నాయి. అయోధ్య కాండ సర్గ 21 లో, రాముని వనవాసానికి సిద్ధమైన సందర్భంగా సీతా దేవి, లక్ష్మణుడు మరియు ఆయనను కలిసి ప్రస్థానం చేస్తారు. ఈ అధ్యాయంలో, వారి వనవాసానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు, సంభాషణలు మరియు పరిణామాలు వివరించబడతాయి. సీతా దేవి తన భర్త రాముని తో పాటు వనవాసం చేయడానికి నిర్ణయించుకుంటుంది మరియు లక్ష్మణుడు తన అన్నను వదిలి వెళ్ళడానికి సిద్ధపడతాడు. ఇది కుటుంబ బంధాలు, నిబద్ధత మరియు ధర్మం పట్ల వారికి ఉన్న కట్టుబాటును ప్రతిబింబిస్తుంది.
కౌసల్యాలక్ష్మణప్రతిబోధనమ్
తథా తు విలపంతీం తాం కౌసల్యాం రామమాతరమ్ |
ఉవాచ లక్ష్మణో దీనస్తత్కాలసదృశం వచః ||
1
న రోచతే మమాప్యేతదార్యే యద్రాఘవో వనమ్ |
త్యక్త్వా రాజ్యశ్రియం గచ్ఛేత్ స్త్రియా వాక్యవశం గతః ||
2
విపరీతశ్చ వృద్ధశ్చ విషయైశ్చ ప్రధర్షితః |
నృపః కిమివ న బ్రూయాచ్చోద్యమానః సమన్మథః ||
3
నాస్యాపరాధం పశ్యామి నాపి దోషం తథావిధమ్ |
యేన నిర్వాస్యతే రాష్ట్రాద్వనవాసాయ రాఘవః ||
4
న తం పశ్యామ్యహం లోకే పరోక్షమపి యో నరః |
స్వమిత్రోఽపి నిరస్తోఽపి యోఽస్య దోషముదాహరేత్ ||
5
దేవకల్పమృజుం దాంతం రిపూణామపి వత్సలమ్ |
అవేక్షమాణః కో ధర్మం త్యజేత్పుత్రమకారణాత్ ||
6
తదిదం వచనం రాజ్ఞః పునర్బాల్యముపేయుషః |
పుత్రః కో హృదయే కుర్యాద్రాజవృత్తమనుస్మరన్ ||
7
యావదేవ న జానాతి కశ్చిదర్థమిమం నరః |
తావదేవ మయా సార్ధమాత్మస్థం కురు శాసనమ్ ||
8
మయా పార్శ్వే సధనుషా తవ గుప్తస్య రాఘవ |
కః సమర్థోఽధికం కర్తుం కృతాంతస్యేవ తిష్ఠతః ||
9
నిర్మనుష్యామిమాం సర్వామయోధ్యాం మనుజర్షభ |
కరిష్యామి శరైస్తీక్ష్ణైర్యది స్థాస్యతి విప్రియే ||
10
భరతస్యాథ పక్ష్యో వా యో వాఽస్య హితమిచ్ఛతి |
సర్వానేతాన్వధిష్యామి మృదుర్హి పరిభూయతే ||
11
ప్రోత్సాహితోఽయం కైకేయ్యా స దుష్టో యది నః పితా |
అమిత్రభూతో నిఃసంగం వధ్యతాం బధ్యతామపి ||
12
గురోరప్యవలిప్తస్య కార్యాకార్యమజానతః |
ఉత్పథం ప్రతిపన్నస్య కార్యం భవతి శాసనమ్ ||
13
బలమేష కిమాశ్రిత్య హేతుం వా పురుషర్షభ |
దాతుమిచ్ఛతి కైకేయ్యై రాజ్యం స్థితమిదం తవ ||
14
త్వయా చైవ మయా చైవ కృత్వా వైరమనుత్తమమ్ |
కాఽస్య శక్తిః శ్రియం దాతుం భరతాయారిశాసన ||
15
అనురక్తోఽస్మి భావేన భ్రాతరం దేవి తత్త్వతః |
సత్యేన ధనుషా చైవ దత్తేనేష్టేన తే శపే ||
16
దీప్తమగ్నిమరణ్యం వా యది రామః ప్రవేక్ష్యతి |
ప్రవిష్టం తత్ర మాం దేవి త్వం పూర్వమవధారయ ||
17
హరామి వీర్యాద్దుఃఖం తే తమః సూర్య ఇవోదితః |
దేవీ పశ్యతు మే వీర్యం రాఘవశ్చైవ పశ్యతు ||
18
హనిష్యే పితరం వృద్ధం కైకేయ్యాసక్తమానసమ్ |
కృపణం చ స్థితం బాల్యే వృద్ధభావేన గర్హితమ్ ||
19
ఏతత్తు వచనం శ్రుత్వా లక్ష్మణస్య మహాత్మనః |
ఉవాచ రామం కౌసల్యా రుదంతీ శోకలాలసా ||
20
భ్రాతుస్తే వదతః పుత్ర లక్ష్మణస్య శ్రుతం త్వయా |
యదత్రానంతరం కార్యం కురుష్వ యది రోచతే ||
21
న చాధర్మ్యం వచః శ్రుత్వా సపత్న్యా మమ భాషితమ్ |
విహాయ శోకసంతప్తాం గంతుమర్హసి మామితః ||
22
ధర్మజ్ఞ యది ధర్మిష్ఠో ధర్మం చరితుమిచ్ఛసి |
శుశ్రూష మామిహస్థస్త్వం చర ధర్మమనుత్తమమ్ ||
23
శుశ్రూషుర్జననీం పుత్రః స్వగృహే నియతో వసన్ |
పరేణ తపసా యుక్తః కాశ్యపస్త్రిదివం గతః ||
24
యథైవ రాజా పూజ్యస్తే గౌరవేణ తథా హ్యహమ్ |
త్వాం నాహమనుజానామి న గంతవ్యమితో వనమ్ ||
25
త్వద్వియోగాన్న మే కార్యం జీవితేన సుఖేన వా |
త్వయా సహ మమ శ్రేయస్తృణానామపి భక్షణమ్ ||
26
యది త్వం యాస్యసి వనం త్యక్త్వా మాం శోకలాలసామ్ |
అహం ప్రాయమిహాసిష్యే న హి శక్ష్యామి జీవితుమ్ ||
27
తతస్త్వం ప్రాప్స్యసే పుత్ర నిరయం లోకవిశ్రుతమ్ |
బ్రహ్మహత్యామివాధర్మాత్సముద్రః సరితాం పతిః ||
28
విలపంతీం తదా దీనాం కౌసల్యాం జననీం తతః |
ఉవాచ రామో ధర్మాత్మా వచనం ధర్మసంహితమ్ ||
29
నాస్తి శక్తిః పితుర్వాక్యం సమతిక్రమితుం మమ |
ప్రసాదయే త్వాం శిరసా గంతుమిచ్ఛామ్యహం వనమ్ ||
30
ఋషిణా చ పితుర్వాక్యం కుర్వతా వ్రతచారిణా |
గౌర్హతా జానతా ధర్మం కండునాఽపి విపశ్చితా ||
31
అస్మాకం చ కులే పూర్వం సగరస్యాజ్ఞయా పితుః |
ఖనద్భిః సాగరైర్భూమిమవాప్తః సుమహాన్వధః ||
32
జామదగ్న్యేన రామేణ రేణుకా జననీ స్వయమ్ |
కృత్తా పరశునాఽరణ్యే పితుర్వచనకారిణా ||
33
ఏతైరన్యైశ్చ బహుభిర్దేవి దేవసమైః కృతమ్ |
పితుర్వచనమక్లీబం కరిష్యామి పితుర్హితమ్ ||
34
న ఖల్వేతన్మయైకేన క్రియతే పితృశాసనమ్ |
ఏతైరపి కృతం దేవి యే మయా తవ కీర్తితాః ||
35
నాహం ధర్మమపూర్వం తే ప్రతికూలం ప్రవర్తయే |
పూర్వైరయమభిప్రేతో గతో మార్గోఽనుగమ్యతే ||
36
తదేతత్తు మయా కార్యం క్రియతే భువి నాన్యథా |
పితుర్హి వచనం కుర్వన్న కశ్చిన్నామ హీయతే ||
37
తామేవముక్త్వా జననీం లక్ష్మణం పునరబ్రవీత్ |
వాక్యం వాక్యవిదాం శ్రేష్ఠః శ్రేష్ఠః సర్వధనుష్మతామ్ ||
38
తవ లక్ష్మణ జానామి మయి స్నేహమనుత్తమమ్ |
విక్రమం చైవ సత్త్వం చ తేజశ్చ సుదురాసదమ్ ||
39
మమ మాతుర్మహద్దుఃఖమతులం శుభలక్షణ |
అభిప్రాయమవిజ్ఞాయ సత్యస్య చ శమస్య చ ||
40
ధర్మో హి పరమో లోకే ధర్మే సత్యం ప్రతిష్ఠితమ్ |
ధర్మసంశ్రితమేతచ్చ పితుర్వచనముత్తమమ్ ||
41
సంశ్రుత్య చ పితుర్వాక్యం మాతుర్వా బ్రాహ్మణస్య వా |
న కర్తవ్యం వృథా వీర ధర్మమాశ్రిత్య తిష్ఠతా ||
42
సోఽహం న శక్ష్యామి పితుర్నియోగమతివర్తితుమ్ |
పితుర్హి వచనాద్వీర కైకేయ్యాఽహం ప్రచోదితః ||
43
తదేనాం విసృజానార్యాం క్షత్రధర్మాశ్రితాం మతిమ్ |
ధర్మమాశ్రయ మా తైక్ష్ణ్యం మద్బుద్ధిరనుగమ్యతామ్ ||
44
తమేవముక్త్వా సౌహార్దాద్భ్రాతరం లక్ష్మణాగ్రజః |
ఉవాచ భూయః కౌసల్యాం ప్రాంజలిః శిరసా నతః ||
45
అనుమన్యస్వ మాం దేవి గమిష్యంతమితో వనమ్ |
శాపితాఽసి మమ ప్రాణైః కురు స్వస్త్యయనాని మే ||
46
తీర్ణప్రతిజ్ఞశ్చ వనాత్పునరేష్యామ్యహం పురీమ్ |
యయాతిరివ రాజర్షిః పురా హిత్వా పునర్దివమ్ ||
47
శోకః సంధార్యతాం మాతర్హృదయే సాధు మా శుచః |
వనవాసాదిహైష్యామి పునః కృత్వా పితుర్వచః ||
48
త్వయా మయా చ వైదేహ్యా లక్ష్మణేన సుమిత్రయా |
పితుర్నియోగే స్థాతవ్యమేష ధర్మః సనాతనః ||
49
అంబ సంహృత్య సంభారాన్ దుఃఖం హృది నిగృహ్య చ |
వనవాసకృతా బుద్ధిర్మమ ధర్మ్యాఽనువర్త్యతామ్ ||
50
ఏతద్వచస్తస్య నిశమ్య మాతా
సుధర్మ్యమవ్యగ్రమవిక్లబం చ |
మృతేవ సంజ్ఞాం ప్రతిలభ్య దేవీ
సమీక్ష్య రామం పునరిత్యువాచ ||
51
యథైవ తే పుత్ర పితా తథాఽహం
గురుః స్వధర్మేణ సుహృత్తయా చ |
న త్వానుజానామి న మాం విహాయ
సుదుఃఖితామర్హసి గంతుమేవమ్ ||
52
కిం జీవితేనేహ వినా త్వయా మే
లోకేన వా కిం స్వధయాఽమృతేన |
శ్రేయో ముహూర్తం తవ సన్నిధానం
మమేహ కృత్స్నాదపి జీవలోకాత్ ||
53
నరైరివోల్కాభిరపోహ్యమానో
మహాగజోఽధ్వానమనుప్రవిష్టః |
భూయః ప్రజజ్వాల విలాపమేనం
నిశమ్య రామః కరుణం జనన్యాః ||
54
స మాతరం చైవ విసంజ్ఞకల్పా-
-మార్తం చ సౌమిత్రిమభిప్రతప్తమ్ |
ధర్మే స్థితో ధర్మ్యమువాచ వాక్యం
యథా స ఏవార్హతి తత్ర వక్తుమ్ ||
55
అహం హి తే లక్ష్మణ నిత్యమేవ
జానామి భక్తిం చ పరాక్రమం చ |
మమ త్వభిప్రాయమసన్నిరీక్ష్య
మాత్రా సహాభ్యర్దసి మాం సుదుఃఖమ్ ||
56
ధర్మార్థకామాః కిల తాత లోకే
సమీక్షితా ధర్మఫలోదయేషు |
తే తత్ర సర్వే స్యురసంశయం మే
భార్యేవ వశ్యాఽభిమతా సుపుత్రా ||
57
యస్మింస్తు సర్వే స్యురసన్నివిష్టాః
ధర్మో యతః స్యాత్తదుపక్రమేత |
ద్వేష్యో భవత్యర్థపరో హి లోకే
కామాత్మతా ఖల్వపి న ప్రశస్తా ||
58
గురుశ్చ రాజా చ పితా చ వృద్ధః
క్రోధాత్ప్రహర్షాద్యది వాపి కామాత్ |
యద్వ్యాదిశేత్కార్యమవేక్ష్య ధర్మం
కస్తం న కుర్యాదనృశంసవృత్తిః ||
59
స వై న శక్నోమి పితుః ప్రతిజ్ఞా-
-మిమామకర్తుం సకలాం యథావత్ |
స హ్యావయోస్తాత గురుర్నియోగే
దేవ్యాశ్చ భర్తా స గతిః స ధర్మః ||
60
తస్మిన్పునర్జీవతి ధర్మరాజే
విశేషతః స్వే పథి వర్తమానే |
దేవీ మయా సార్ధమితోఽపగచ్ఛే-
-త్కథం స్విదన్యా విధవేవ నారీ ||
61
సా మాఽనుమన్యస్వ వనం వ్రజంతం
కురుష్వ నః స్వస్త్యయనాని దేవి |
యథా సమాప్తే పునరావ్రజేయం
యథా హి సత్యేన పునర్యయాతిః ||
62
యశో హ్యహం కేవలరాజ్యకారణా-
-న్న పృష్ఠతః కర్తుమలం మహోదయమ్ |
అదీర్ఘకాలే న తు దేవి జీవితే
వృణేఽవరామద్య మహీమధర్మతః ||
63
ప్రసాదయన్నరవృషభః స్వమాతరం
పరాక్రమాజ్జిగమిషురేవ దండకాన్ |
అథానుజం భృశమనుశాస్య దర్శనం
చకార తాం హృది జననీం ప్రదక్షిణమ్ ||
64
ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే ఏకవింశః సర్గః ||
Ayodhya Kanda Sarga 21 Meaning In Telugu
రాముడు అరణ్యములకు పోతాను అని చెప్పడం, ఆ మాటలు విని కౌసల్య భోరున ఏడవడం అంతా చూస్తున్నాడు లక్ష్మణుడు. వారిని చూచి ఇలా అన్నాడు.
“అమ్మా కౌసల్యా! అన్నా రామా! ఒక స్త్రీ కోరిన కోరికలు నెరవేర్చడం కోసరం రాముడు అడవులకు వెళ్లడం నాకు అసలే ఇష్టం లేదు. మన తండ్రి దశరథుడు కామపీడితుడు, భోగలాలసుడు. విషయ వాంఛలకు లోబడ్డవాడు. అలాంటి రాజు, కైక మాటలకు లోబడి ఏమైనా మాట్లాడవచ్చును. కాని అది ఆచరణయోగ్యము కాదు. ఎందుకంటే రాముడు అయోధ్యనుండి వెడలగొట్టబడవలసిన తప్పు ఏమీ చేయలేదు. చేయడు కూడా. అటువంటప్పుడు రాముడు అడవులకు ఎందుకు వెళ్లాలి.
రామునికి పరమ శత్రువు కూడా రాముని గురించి చెడ్డగా మాట్లాడడు. ధర్మాచరణము చేయు వాడు ఎవరూ గుణవంతుడు, ఋజువర్తనుడు అయిన కుమారుని అడవులకు పంపడు. రాజధర్మము తెలిసిన వాడు ఎవడూ దశరథ మహారాజు మాటలను ధర్మ సమ్మతము గా అంగీకరింపడు. ధర్మసమ్మతము కాని రాజు ఆదేశములను మనము పాటించ నవసరము లేదు. రాజ్యం వీరభోజ్యము. నాకు అనుమతి ఇవ్వండి బలప్రయోగంతో రాజ్యము స్వాధీనము చేసుకుంటాను. ఎవరు అడ్డు వస్తారో చూస్తాను.
రామా! నేను నీ పక్క ధనుస్సు పట్టుకొని నిలబడి ఉండగా నీ నీడను కూడా ఎవరూ తాకలేరు. రామా! ఈ అయోధ్యా నగరము నీది. ఈ అయోధ్యలో నీకు ఎవరైనా అపకారము చేయడానికి సాహసిస్తే, ఈ అయోధ్యానగరాన్నే నేలమట్టం చేస్తాను.
రామా! ఈ లోకం తీరే అంత. మెతకగా ఉంటే నెత్తికెక్కుతారు.
భరతునికి పట్టాభిషేకము చెయ్యాలి అనే వాడు ఎవడినైనాసరే భరతుని పక్షానమాట్లాడే ఎవడి నైనా సరే వాడిని వధిస్తాను. కైక పక్షము వహించి, కైక మీది ప్రేమతో నిన్ను అడవులకు పంపుతున్న మన తండ్రి దుర్మార్గుడు. దుర్మార్గుడు బంధింపతగినవాడు. అందుకని దశరథుని బంధించెదను. అవసరమైతే వధిస్తానుకూడా. గురువు అయినా సరే, దుర్మార్గుడు అయితే అతడు శిక్షార్హుడు.
రామా! మన తండ్రి ఎవరి అండచూచుకొని, పెద్దవాడైన నిన్ను కాదని రాజ్యమును భరతునికి ఇవ్వదలచుకున్నాడో అర్థం కావడం లేదు. నీతో నాతో విరోధము పెట్టుకొని భరతునికి రాజ్యాభిషేకము చేసే ధైర్యము దశరధునికి ఎక్కడిది?
అమ్మా! కౌసల్యాదేవీ! నాకు రాముడు అంటే ప్రాణము. నా ధనుస్సు మీద నేను చేసిన యజ్ఞయాగముల మీద ఒట్టుపెట్టుకొని చెబుతున్నాను. రాముడు సామాన్యుడు కాడు. రాముడు అరణ్యములలోనూ అగ్నిలోనూ ప్రవేశింపగలడు. కానీ, దేనికైనా సరే,
రాముని కన్నా ముందు నేను ఉంటాను. నేను ఉండగా మీకు ఎలాంటి భయము లేదు. నిశ్చింతగా ఉండండి.” అని ఆవేశంతో పలికాడు అక్ష్మణుడు.
ఆవేశంతో పలికిన లక్ష్మణుని మాటలు విన్న కౌసల్య రాముని తో దు:ఖిస్తూ ఇలాఅంది. “రామా! నీ తమ్ముడు లక్ష్మణుని మాటలు విన్నావు కదా! నీకు ఇష్టం అయితే ఆ ప్రకారము చెయ్యి. అధర్మపరురాలు అయిన నా సవతి కైకేయీ మాటలు మనము పాటించ నవసరము లేదు. నీవు అరణ్యములకు వెళ్ల నవసరము లేదు.
రామా! నీకు అన్ని ధర్మములు తెలుసు. మాతృసేవ చెయ్యడం పరమ ధర్మము. కాబట్టి నీవు అయోధ్యలో ఉండి ఈ వృద్యాప్యంలో నా దగ్గర ఉండి నాకు సేవలు చెయ్యి. నీ ధర్మమును ఆచరించు. రామా! పూర్వము కాశ్యపుడు తన తల్లికి సేవలు చేసి తరించాడు. రామా! నీకు నీ తండ్రి ఎంతటి పూజనీయుడో, నేనూ అంతటి పూజనీయురాలనే కదా. కాబట్టి నేను చెబుతున్నాను. నీవు అరణ్యములకు వెళ్ల నవసరము లేదు. అరణ్యములకు వెళ్లుటకు నేను అనుమతి ఇవ్వను. నీవు నా దగ్గర ఉండి నాకు సేవలు చేసుకో.
నీవు అరణ్యములలో ఉంటే నేను ఇక్క మృష్టాన్నములు ఎలా భుజించగలను. నీతోపాటు ఉంటూ ఆకులు అలములు తినడం నాకు ఎంతో ఇష్టం. అలా కాకుండా నీవు అరణ్యములకు వెళితే నేను అన్నపానీయములను తీసుకోకుండా ప్రాయోపవేశము చేస్తాను. క్రుంగి, కృశించి మరణిస్తాను. నీ కోసరం నిన్ను తల్చుకుంటూ నేను మరణిస్తే నీకు దుర్గతులు కలుగుతాయి. తర్వాత నీ ఇష్టం.” అని పలికింది.
కౌసల్య తమ్ముడు లక్ష్మణుని మాటలూ, తల్లి కౌసల్య మాటలూ సావధానంగా విన్నాడు రాముడు. వారితో ఇలా అన్నాడు.
“అమ్మా! నాకు నా తండ్రి దైవసమానుడు. ఆయన ఆజ్ఞను ధిక్కరించే శక్తి నాకు లేదు. కాబట్టి నిన్ను వేడుకుంటున్నాను. నన్ను అరణ్యములకు వెళ్లనీ. పూర్వము పితృవాక్య పరిపాలన కొరకు కండు మహర్షి గోవును కూడా చంపాడు. మన వంశములోని సగర కుమారులు తండ్రి ఆజ్ఞ మేరకు భూమి నంతా తవ్వారు. ఆ ప్రయత్నంలో తమ ప్రాణాలు కోల్పోయారు. అంతెందుకు, తన తండ్రి జమదగ్ని ఆజ్ఞమేరకు, పరశు రాముడు, తన తల్లి రేణుకను గొడ్డలితో నరికి చంపాడు. అమ్మా!
మన పూర్వీకులందరూ పితృవాక్పరిపాలనకు తమ ప్రాణాలు కూడా అర్పించారు. నేను నా తండ్రి మాట మేరకు కేవలం అరణ్యములకు పోతున్నాను. నా పూర్వీకులు ఆచరించిన ధర్మమునే నేనూ ఆచరిస్తున్నాను.
ఈనాడు నేను నా స్వార్థము కొరకు, పితృవాక్యమును పాటించకుండా, కొత్త ధర్మమును సృష్టించలేను. తండ్రి మాటను పాటించిన వాడికి దోషము అంటదు. తండ్రిమాటను ధిక్కరించి నేను నా పూర్వీకులముందు దోషిగా నిలబడలేను.” అని తల్లితో పలికిన రాముడు తమ్ముడు లక్ష్మణుని చూచి ఇలా అన్నాడు.
“తమ్ముడా లక్ష్మణా! నీకు నా మీద ఎంత ప్రేమ, వాత్సల్యము గౌరవము ఉన్నాయో నాకు తెలుసు. నా తల్లికి ధర్మసూక్ష్మములు వేదాంత రహస్యములు తెలియక పోవడం వలన, పామరత్వం చేత దుఃఖము పొందుతూ ఉంది.
లక్ష్మణా! ఈ లోకంలో ధర్మాచరణ ఎంతో ముఖ్యము. ధర్మము నందే సత్యము ప్రతిష్ఠితమై ఉన్నది. తండ్రిగారు తన ధర్మమును తాను పాటించారు. తల్లికి వరాలు ఇస్తాను అన్నారు. ఆమె కోరుకొన్నది ఇవ్వడం రాజు ధర్మము. ఆ ధర్మమును ఆయన నిర్వర్తించాడు.
పితృవాక్పరిపాలన నా ధర్మము. కాబట్టి నా ధర్మమును నేను నిర్వర్తించాలి కదా! ధర్మమును ఆశ్రయించిన వాడు తండ్రికి, తల్లికి, గురువుకు ఇచ్చిన మాటను తప్పకూడదు. నా తండ్రి మాటలను నా తల్లి కైకేయీ నాకు చెప్పింది. ఇందులో ఆమె తప్పేముంది. తండ్రి మాటలను ఆచరించడం నా ధర్మము.
కాని క్షత్రియ ధర్మము వేరుగా ఉంటుంది. బలవంతంగా రాజ్యము ఆక్రమించుకోడం క్షత్రియ ధర్మము. ప్రస్తుతము మనకు కులధర్మమే ముఖ్యము. క్షత్రియ ధర్మము కాదు. నీవు కూడా క్షత్రియ ధర్మమును పక్కనపెట్టి ధర్మాచరణము చెయ్యి. నీ కోపము వదిలి పెట్టు. నేను చెప్పిన మాటలను ఆచరించు.” అని అన్నాడు రాముడు.
తరువాత తల్లి కౌసల్యను చూచి చేతులు జోడించి ఇలా అన్నాడు. “అమ్మా! నేను అరణ్యములకు పోవడానికి నాకు అనుమతి ఇవ్వు. దీనికి మారు పలికితే నా మీద ఒట్టు. నా ప్రయాణమునకు కావలసిన వస్తువులను సేకరించు. అమ్మా! పదునాలుగు సంవత్స రములు ఎంతలో అయిపోతాయి. ఇలా వెళ్లి అలాతిరిగి వస్తాను. నామాట నమ్ము. అమ్మా! నీ మనసులో నా గురించి దుఃఖించకు.
తండ్రిమాట ప్రకారము వెళుతున్నాను. నీ మాట ప్రకారము తిరిగి వస్తాను. అమ్మా! మనకందరకూ పెద్ద తండ్రి గారు. నీవు, నేను, సీత లక్ష్మణుడు, అందరమూ తండ్రిగారి మాటను గౌరవించాలి కదా! అదియే కదా సనాతనధర్మము. అమ్మా! ఇంక నా పట్టాభిషేకమునకు ఏర్పాట్లు చేయడం ఆపి, నా వనవాసమునకు ఏర్పాట్లు చెయ్యి.” అని అన్నాడు రాముడు.
రాముడు అలా మాట్లాడుతుంటే కౌసల్యకు ఏమనాలో తోచలేదు. రాముని చూచి ఇలా అంది. “రామా! నీవు సనాతన ధర్మము గురించి చెప్పావు. సనాతన ధర్మములో తండ్రి మాటకు ఎంత విలువ ఇవ్వాలో తల్లి మాటకూ అంతే విలువ ఇవ్వాలి కదా. కాబట్టి నేను చెబుతున్నాను. నీ తల్లి మాట ప్రకారము నీ తల్లిని విడిచి నీవు వెళ్లవద్దు. నన్ను దు:ఖముల పాలు చెయ్యవద్దు. నేను నీకు తల్లిని, గురువును. నేను నీకు వనములకు పోవడానికి అనుజ్ఞ ఇవ్వను. నీవు వెళ్లడానికి వీలు లేదు.
రామా! నీవు లేని ఈ బ్రతుకు నిరర్థకము. నేను చచ్చి స్వర్గానికి వెళ్లినా, అక్కడ లభించే అమృతము కూడా నీకుసాటి రాదు. నీవు ముహూర్తకాలము నా ఎదుట ఉంటేచాలు, ఏ స్వర్గసుఖములు దానికి సమానం కావు. రామా! నన్ను విడిచి వెళ్లకు.” అంటూ దీనంగా ఏడుస్తున్న తల్లిని చూచి రాముని మనస్సు ద్రవించి పోయింది. ఆమెను ఎలా ఓదార్చాలో తెలియలేదు రామునికి. అందుకని లక్ష్మణుని చూచి ఇలా అన్నాడు.
“లక్ష్మణా! నీవు కూడా తల్లిగారితో చేరి నన్ను ఆపడానికి ప్రయత్నం చేస్తున్నావు. ఇది ధర్మమా! తల్లిగారు చూడు ఎలా పరితపిస్తూ ఉందో. ఆమెను ఊరడించాల్సింది పోయి, ఆమెను, నన్ను, నీ మాటలతో బాధపెట్టావు.
లక్ష్మణా! అర్థకామములు ధర్మ సమ్మతము లైనపుడే అవి మంచి ఫలములను ఇస్తాయి. అందుకని అర్థకామముల కంటే ధర్మమునకే ప్రాధాన్యము. ధర్మాచరణము అత్యంత ఆవశ్యకము. మనము ఎల్లప్పుడూ ధర్మసమ్మతములైన పనులను చేయడంలోనే ఆసక్తి కలిగి ఉండాలి.
కేవలము అర్థము, కామము తో కూడిన పనులను చేయడం వలన రాగ ద్వేషములు ప్రబలుతాయి. అవి ధర్మపరులకు మంచివి కావు. మన తండ్రి వృద్ధుడు. మనకు పూజ్యుడు. ఆయన కామ ప్రకోపంతో గానీ, కోపంతో గానీ మనలను ఒక పనిచెయ్యమని చెప్పినప్పుడు, అది ధర్మంకాదు అని మనం నిరాకరించడం, ధర్మాచరణము అనిపించుకోదు. కేవలము దుష్టులు మాత్రమే అలా చేస్తారు.
లక్ష్మణా! మన తండ్రిగారు నీకు, నాకు తండ్రి, గురువు, దైవము. అలాగే మన తల్లి గారికి ఆయన భర్త. భర్త మాట భార్యకు శిరోధార్యము. కాబట్టి మనందరికీ దశరథ మహారాజు ఆజ్ఞను పాటించడం తప్ప మరోమార్గము లేదు. పైగా, తన భర్త అయిన దశరథమహారాజు గారు జీవించిఉండగా, భర్తను వదిలిపెట్టి, తల్లిగారు నా వెంట అడవులకు ఎలా రాగలరు. అది ధర్మము కాదు.”
అని తల్లి వంక తిరిగి“అమ్మా! నాకు అరణ్యములకు వెళ్లుటకు అనుమతి ఇవ్వు. పదునాలుగు సంవత్సరముల తరువాత నేను క్షేమంగా అయోధ్యకు తిరిగి రావాలని నన్ను ఆశీర్వదించు. నా తండ్రి మాటను పాటించడం, నాపూర్వీకులు నడిచిన బాటలో నడవడం–వీటితో పోలిస్తే, ఈ తుచ్ఛమైన రాజ్యభోగములు నాకు తృణప్రాయములు. కేవలం రాజ్యం కోసరం శాశ్వత కీర్తి ప్రతిష్టలను వదులుకోలేను.
అమ్మా! ఈ జీవితము నీటి బుడగ వంటిది. నాలుగు రోజులు రాజ్యం పాలించడం కోసరం, ధర్మము తప్పి, అధర్మంగా రాజ్యమును కైవసం చేసుకోవడం మంచిది కాదు.” అని తన మనస్సులో ఉన్న మాటను అమ్మకు, తమ్ముడికి స్పష్టం చేసాడు. తల్లికి ప్రదక్షిణ పూర్వకంగా నమస్కారముచేసాడు.
శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము ఇరువది ఒకటవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.