Ayodhya Kanda Sarga 22 In Telugu | అయోధ్యాకాండ ద్వావింశః సర్గః

అయోధ్యా కాండ మహాకావ్యం రామాయణంలో ముఖ్యమైన భాగం. ఈ కాండలో రాముడికి జరిగే పలు సంఘటనలు వివరించబడినాయి. సర్గ 22లో, దశరథ మహారాజు రాముడిని అరణ్యవాసం చేయడానికి ప్రస్తుతిస్తారు. ఈ పరిణామం కారణంగా కౌసల్య మరియు సుమిత్ర విపరీతంగా బాధపడుతారు. రాముడు తండ్రి ఆజ్ఞను పాటిస్తూ, సీత మరియు లక్ష్మణుడితో కలిసి అరణ్యానికి వెళ్లే నిర్ణయం తీసుకుంటాడు. ఈ భాగంలో కథానాయికలు వారి భావోద్వేగాలను మరియు కఠిన సమయాలను ఎలా ఎదుర్కొంటారో వివరిస్తారు.

దైవప్రాబల్యమ్

అథ తం వ్యథయా దీనం సవిశేషమమర్షితమ్ |
శ్వసంతమివ నాగేంద్రం రోషవిస్ఫారితేక్షణమ్ ||

1

ఆసాద్య రామః సౌమిత్రిం సుహృదం భ్రాతరం ప్రియమ్ |
ఉవాచేదం స ధైర్యేణ ధారయన్సత్త్వమాత్మవాన్ ||

2

నిగృహ్య రోషం శోకం చ ధైర్యమాశ్రిత్య కేవలమ్ |
అవమానం నిరస్యేమం గృహీత్వా హర్షముత్తమమ్ ||

3

ఉపక్లుప్తం హి యత్కించిదభిషేకార్థమద్య మే |
సర్వం విసర్జయ క్షిప్రం కురు కార్యం నిరత్యయమ్ ||

4

సౌమిత్రే యోఽభిషేకార్థే మమ సంభారసంభ్రమః |
అభిషేకనివృత్త్యర్థే సోఽస్తు సంభారసంభ్రమః ||

5

యస్యా మదభిషేకార్థే మానసం పరితప్యతే |
మాతా మే సా యథా న స్యాత్సవిశంకా తథా కురు ||

6

తస్యాః శంకామయం దుఃఖం ముహూర్తమపి నోత్సహే |
మనసి ప్రతిసంజాతం సౌమిత్రేఽహముపేక్షితుమ్ ||

7

న బుద్ధిపూర్వం నాబుద్ధం స్మరామీహ కదాచన |
మాతౄణాం వా పితుర్వాఽహం కృతమల్పం చ విప్రియమ్ ||

8

సత్యః సత్యాభిసంధశ్చ నిత్యం సత్యపరాక్రమః |
పరలోకభయాద్భీతో నిర్భయోఽస్తు పితా మమ ||

9

తస్యాపి హి భవేదస్మిన్కర్మణ్యప్రతిసంహృతే |
సత్యం నేతి మనస్తాపస్తస్య తాపస్తపేచ్చ మామ్ ||

10

అభిషేకవిధానం తు తస్మాత్సంహృత్య లక్ష్మణ |
అన్వగేవాహమిచ్ఛామి వనం గంతుమితః పునః ||

11

మమ ప్రవ్రాజనాదద్య కృతకృత్యా నృపాత్మజ |
సుతం భరతమవ్యగ్రమభిషేచయితా తతః ||

12

మయి చీరాజినధరే జటామండలధారిణి |
గతేఽరణ్యం చ కైకేయ్యా భవిష్యతి మనఃసుఖమ్ ||

13

బుద్ధిః ప్రణీతా యేనేయం మనశ్చ సుసమాహితమ్ |
తం తు నార్హామి సంక్లేష్టుం ప్రవ్రజిష్యామి మాచిరమ్ ||

14

కృతాంతస్త్వేవ సౌమిత్రే ద్రష్టవ్యో మత్ప్రవాసనే |
రాజ్యస్య చ వితీర్ణస్య పునరేవ నివర్తనే ||

15

కైకేయ్యాః ప్రతిపత్తిర్హి కథం స్యాన్మమ పీడనే |
యది భావో న దైవోఽయం కృతాంతవిహితో భవేత్ ||

16

జానాసి హి యథా సౌమ్య న మాతృషు మమాంతరమ్ |
భూతపూర్వం విశేషో వా తస్యా మయి సుతేఽపి వా ||

17

సోఽభిషేకనివృత్త్యర్థైః ప్రవాసార్థైశ్చ దుర్వచైః |
ఉగ్రైర్వాక్యైరహం తస్యాః నాన్యద్దైవాత్సమర్థయే ||

18

కథం ప్రకృతిసంపన్నా రాజపుత్రీ తథాగుణా |
బ్రూయాత్సా ప్రాకృతేవ స్త్రీ మత్పీడాం భర్తృసన్నిధౌ ||

19

యదచింత్యం తు తద్దైవం భూతేష్వపి న హన్యతే |
వ్యక్తం మయి చ తస్యాం చ పతితో హి విపర్యయః ||

20

కశ్చ దైవేన సౌమిత్రే యోద్ధుముత్సహతే పుమాన్ |
యస్య న గ్రహణం కించిత్కర్మణోఽన్యత్ర దృశ్యతే ||

21

సుఖదుఃఖే భయక్రోధౌ లాభాలాభౌ భవాభవౌ |
యచ్చ కించిత్తథాభూతం నను దైవస్య కర్మ తత్ ||

21

ఋషయోఽప్యుగ్రతపసో దైవేనాభిప్రపీడితాః |
ఉత్సృజ్య నియమాంస్తీవ్రాన్ భ్రశ్యంతే కామమన్యుభిః ||

22

అసంకల్పితమేవేహ యదకస్మాత్ప్రవర్తతే |
నివర్త్యారంభమారబ్ధం నను దైవస్య కర్మ తత్ ||

23

ఏతయా తత్త్వయా బుద్ధ్యా సంస్తభ్యాత్మానమాత్మనా |
వ్యాహతేఽప్యభిషేకే మే పరితాపో న విద్యతే ||

24

తస్మాదపరితాపః సంస్త్వమప్యనువిధాయ మామ్ |
ప్రతిసంహారయ క్షిప్రమాభిషేచనికీం క్రియామ్ ||

25

ఏభిరేవ ఘటైః సర్వైరభిషేచనసంభృతైః |
మమ లక్ష్మణ తాపస్యే వ్రతస్నానం భవిష్యతి ||

26

అథవా కిం మమైతేన రాజద్రవ్యమతేన తు |
ఉద్ధృతం మే స్వయం తోయం వ్రతాదేశం కరిష్యతి ||

27

మా చ లక్ష్మణ సంతాపం కార్షిర్లక్ష్మ్యా విపర్యయే |
రాజ్యం వా వనవాసో వా వనవాసో మహోదయః ||

28

న లక్ష్మణాస్మిన్ఖలు కర్మవిఘ్నే
మాతా యవీయస్యతిశంకనీయా |
దైవాభిపన్నా హి వదత్యనిష్టం
జానాసి దైవం చ తథాప్రభావమ్ ||

29

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే ద్వావింశః సర్గః

Ayodhya Kanda Sarga 22 Meaning In Telugu

రాముడు ధృఢచిత్తంతో ఉన్నాడు. తనకు కావలసిన -పట్టాభిషేకము అర్ధాంతరంగా ఆగిపోయినా చలించలేదు. తన లోపల ఉన్న భావాలను బయటకు కనిపించకుండా జాగ్రత్త పడుతున్నాడు. ఆవేశంతో ఊగిపోతున్న లక్ష్మణునితో ఇలా అన్నాడు.
“తమ్ముడా లక్ష్మణా! నీ కోపాన్ని విడిచిపెట్టు. కోపము -ప్రదర్శించడానికి ఇది సమయము కాదు. ధైర్యంగా ఉండు.

ఆనందంగా ఉండు. ఈరోజు నాకు పట్టాభిషేకము అన్న విషయము -మరిచిపో. నా పట్టాభిషేకమునకు సేకరించిన వస్తువులు అన్నీ పక్కన పెట్టు. పాపము నా తల్లి కైక నాకు పట్టాభిషేకము జరుగబోవుచున్నది అని బాధపడిపోతూ ఉంది. ఆమె బాధను మనము పోగొట్టాలి. -పట్టాభిషేకము ఆగిపోయింది అని ఆమెకు తెలియజెయ్యాలి.

ఎందుకంటే నా తల్లి కైక మనసులో బాధ, అనుమానము ఉంటే నేను -సహించలేను. నేను పుట్టిన తరువాత నా తల్లులకు గానీ నా తండ్రికి గానీ మనసు బాధపెట్టలేదు. నా తండ్రి సత్యమునే పలుకుతాడు. ఆడిన మాట తప్పడు. ఆయన నా తల్లి కైకకు ఇచ్చిన మాట నెరవేర్చడం నా కర్తవ్యము.

మీరు అనుకున్నట్టు నాకు పట్టాభిషేకము జరిగితే నా తండ్రి నా తల్లి కైకకు ఇచ్చిన మాట తప్పిన వాడు అవుతాడు. అది నాకు ఇష్టం లేదు. కాబట్టి, నా పట్టాభిషేక కార్యక్రమమును ఇంతటితో నిలిపివేసి వెంటనే అరణ్యములకు వెళ్లే పనిలో ఉంటాను. అదే నా ప్రస్తుత కర్తవ్యము. నేను అడవులకు వెళితే నా తల్లి కైక మనస్సు శాంతిస్తుంది. ఆమె పరిపూర్ణంగా సంతోషిస్తుంది. తన కుమారుడు భరతునికి నిర్విఘ్నంగా పట్టాభిషేకము జరిపించు కుంటుంది.

లక్ష్మణా! నీకు తెలుసో లేదో. మన తండ్రిగారు కూడా ఈ నిర్ణయాన్ని చాలా బాధతో తీసుకున్నారు. ఆయన తీసుకున్న నిర్ణయం అమలు పరచడం మన బాధ్యత. మనం ఇంకొక విషయం మరిచి పోకూడదు. నేను కోరుకోకుండానే నా పట్టాభిషేకము నిర్ణయం అయింది. కాని అది అర్థాంతరంగా ఆగిపోయింది. ఇది కూడా నా ప్రమేయం లేకుండానే జరిగింది. ఈ విచిత్ర పరిణామాలకు ఎవరూ కారణం కాదు. ఎవరినీ తప్పుపట్టనవసరం లేదు. ఇది అంతా దైవ నిర్ణయం అని సరిపెట్టుకోవాలి.

మన తల్లి కైకకు నా పట్టాభిషేకము ఆపించవలెనని ఆ దైవమే బుద్ధిపుట్టించి ఉంటుంది. లేకపోతే ఇదివరలో ఎప్పుడూ నన్ను పల్లెత్తు మాటకూడా అనని మన తల్లి కైక, నాకు ఎందుకు ఈ రకమైన బాధ, కష్టం కలిగిస్తుంది. నన్ను అడవులకు పొమ్మని శాసిస్తుంది. నేను నా తల్లి కైకకు ఎన్నడూ మనసుకు కష్టం కలిగించి ఎరుగను. అలాగే నా తల్లి కైక నన్ను, తన కుమారుడు భరతుని ఎన్నడూ బేధబుద్ధితో చూడలేదు. మాఇద్దరినీ సమానంగా చూచింది. ఇవన్నీ నీకూ తెలుసు.

కాబట్టి లక్ష్మణా! కైక నా గురించి పరుషంగా మాట్లాడటంగానీ, నా పట్టాభిషేకమును నిలిపివేయడం గానీ, ఆమె స్వతాహాగా చేసినది కాదు. అంతా దైవ నిర్ణయం. లేకపోతే ఉత్తమ రాజవంశము లో పుట్టిన కైక, ఒక సామాన్య స్త్రీ వలె, తన భర్తముందు, పట్టాభిషేకము చేసుకోబోవు తన కుమారుని తూలనాడుతుందా! అతని పట్టాభి షేకమును ఆపిస్తుందా! ఆ మె విపరీత ప్రవర్తనకు దైవమే కారణము కానీ వేరుకాదు.

దైవ నిర్ణయములు చాలా కఠినంగా ఉంటాయి. దైవ నిర్ణయాన్ని అడ్డుకోడానికి ఎవరికీ సాధ్యం కాదు. అందుకే నా తల్లి కైక నన్ను అడవులకు వెళ్లమని కోరింది. ఆ దైవనిర్ణయాన్ని అమలు పరచడం నా కర్తవ్యం. దైవము ఎలా నడిపిస్తే అలా నడవడం మన కర్తవ్యం. అలాంటి దైవ నిర్ణయానికి ఎవడు ఎదురీదగలడు?

లక్ష్మణా! మనము ఏదో చేస్తున్నాము ఏదో సాధిస్తున్నాము అని అనుకుంటాము. అది పొరపాటు. మనకు అనుదినమూ కలిగే సుఖదు:ఖాలు, భయము, క్రోధమూ, లాభనష్టాలూ, ఉండటం, లేకపోవడం, ఇవి అన్నీ దైవ నిర్ణయంబట్టి జరుగుతూ ఉంటాయి. మానవుల ప్రమేయము ఏమీ లేదు.

పూర్వము ఇంద్రియములను జయించాము అని చెప్పుకొన్న మహాఋషులు కూడా దైవప్రేరితులై, కామ కోరికలకు లోబడి, తమ తపస్సులను నాశనం చేసుకున్నారు. ఏదైనా ఒక పని మనము సంకల్పించినపుడు. ఆ పని పూర్తి కావచ్చే సమయంలో ఏదైనా అడ్డు తగిలితే దానిని దైవనిర్ణయంగానే భావించాలి.

కాబట్టి ఇంకొంచెం సేపటిలో జరుగబోవు నా పట్టాభి షేకము, ఏ కారణం చేతనైనా, ఆగిపోయింది అంటే అది దైవనిర్ణయమే గాని వేరు కాదు. నా పట్టాభిషేకము అగిపోయినందుకు నాకు ఎలాంటి దుఃఖము లేదు. నేను బాధపడటం లేదు. నీవు కూడా నీ మనసులో ఉన్న బాధను తీసి వెయ్యి. వెంటనే పట్టాభిషేకమునకు జరుగుచున్న పనులను నిలిపివెయ్యి.

లక్ష్మణా! నా పట్టాభిషేకము కొరకు సముద్రముల నుండి పవిత్ర పుణ్య నదీనదముల నుండి తెచ్చిన నీటితో నేను రేపటినుండి గడపబోవు తాపస వ్రతమునకు దీక్షా స్నానం చేస్తాను. అయినా వద్దులే. ఎక్కడెక్కడి నుంచో అతి కష్టం మీద తెచ్చిన ఈ పుణ్య నదీజలములు నాకు ఎందుకు. నేను బావిలో నుండి నీరు తోడుకొని స్నానం చేస్తాను. రేపటి నుండి నేను అలా చెయ్యాలి కదా!

తమ్ముడూ! నాకు రాజ్యలక్ష్మి లభించలేదని బాధ పడకు. దానికి బదులు నాకు వనలక్ష్మి లభించిందని సంతోషించు. నా దృష్టిలో రెండూ ఒకటే.” అని అని లక్ష్మణుని అనునయించాడు రాముడు.

అయోధ్యాకాండ త్రయోవింశః సర్గః (౨౩) >>

Leave a Comment