మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అయోధ్యాకాండము రామాయణంలోని రెండవ కాండ, ఇది ప్రధానంగా శ్రీ రాముడి జీవితంలోని అయోధ్య నగరంలో జరిగిన సంఘటనలను వివరిస్తుంది. చతుర్థ సర్గలో, రాముడు తన తండ్రి దశరథ మహారాజుతో పాటు ఆయోధ్యలో ఉన్న సందర్భాలపై దృష్టి సారిస్తాడు. ఈ సర్గ రాముని వైయక్తిక జీవితం, కుటుంబ బంధాలు మరియు ఆయోధ్యలోని ప్రజల అనురాగం పై కేంద్రీకృతమై ఉంది. రాముడు తన పితృ వాక్య పరిపాలనకు ఎంతటి ప్రాధాన్యత ఇస్తాడో, తండ్రి ప్రతిజ్ఞను నిలబెట్టుకోవడం కోసం సకల కష్టాలను ఎలా స్వీకరించాడో ఈ సర్గలో వివరించబడుతుంది. ఈ విధంగా చతుర్థ సర్గ రాముని ధర్మ నిష్ఠ, కర్తవ్య నిబద్ధత మరియు తన కుటుంబ సభ్యులపై ఉన్న ప్రేమను ప్రతిబింబిస్తుంది.
మాత్రాశీఃపరిగ్రహః
గతేష్వథ నృపో భూయః పౌరేషు సహ మంత్రిభిః |
మంత్రయిత్వా తతశ్చక్రే నిశ్చయజ్ఞః స నిశ్చయమ్ ||
1
శ్వ ఏవ పుష్యో భవితా శ్వోఽభిషేచ్యస్తు మే సుతః |
రామో రాజీవతామ్రాక్షో యౌవరాజ్య ఇతి ప్రభుః ||
2
అథాంతర్గృహమావిశ్య రాజా దశరథస్తదా |
సూతమాజ్ఞాపయామాస రామం పునరిహానయ || [మంత్రయామాస]
3
ప్రతిగృహ్య స తద్వాక్యం సూతః పునరుపాయయౌ |
రామస్య భవనం శీఘ్రం రామమానయితుం పునః ||
4
ద్వాఃస్థైరావేదితం తస్య రామాయాగమనం పునః |
శ్రుత్వైవ చాపి రామస్తం ప్రాప్తం శంకాన్వితోఽభవత్ ||
5
ప్రవేశ్య చైనం త్వరితం రామో వచనమబ్రవీత్ |
యదాగమనకృత్యం తే భూయస్తద్బ్రూహ్యశేషతః ||
6
తమువాచ తతః సూతో రాజా త్వాం ద్రష్టుమిచ్ఛతి |
శ్రుత్వా ప్రమాణమత్ర త్వం గమనాయేతరాయ వా ||
7
ఇతి సూతవచః శ్రుత్వా రామోఽథ త్వరయాన్వితః |
ప్రయయౌ రాజభవనం పునర్ద్రష్టుం నరేశ్వరమ్ ||
8
తం శ్రుత్వా సమనుప్రాప్తం రామం దశరథో నృపః |
ప్రవేశయామాస గృహం వివక్షుః ప్రియముత్తమమ్ ||
9
ప్రవిశన్నేవ చ శ్రీమాన్రాఘవో భవనం పితుః |
దదర్శ పితరం దూరాత్ప్రణిపత్య కృతాంజలిః ||
10
ప్రణమంతం సముత్థాప్య తం పరిష్వజ్య భూమిపః |
ప్రదిశ్య చాస్మై రుచిరమాసనం పునరబ్రవీత్ ||
11
రామ వృద్ధోఽస్మి దీర్ఘాయుర్భుక్తా భోగా మయేప్సితాః |
అన్నవద్భిః క్రతుశతైస్తథేష్టం భూరిదక్షిణైః ||
12
జాతమిష్టమపత్యం మే త్వమద్యానుపమం భువి |
దత్తమిష్టమధీతం చ మయా పురుషసత్తమ ||
13
అనుభూతాని చేష్టాని మయా వీరసుఖాన్యపి |
దేవర్షిపితృవిప్రాణామనృణోఽస్మి తథాఽఽత్మనః ||
14
న కించిన్మమ కర్తవ్యం తవాన్యత్రాభిషేచనాత్ |
అతో యత్త్వామహం బ్రూయాం తన్మే త్వం కర్తుమర్హసి ||
15
అద్య ప్రకృతయః సర్వాస్త్వామిచ్ఛంతి నరాధిపమ్ |
అతస్త్వాం యువరాజానమభిషేక్ష్యామి పుత్రక ||
16
అపి చాద్యాశుభాన్రామ స్వప్నే పశ్యామి దారుణాన్ |
సనిర్ఘాతా మహోల్కాశ్చ పతితా హి మహాస్వనాః || [దివోల్కా]
17
అవష్టబ్ధం చ మే రామ నక్షత్రం దారుణైర్గ్రహైః |
ఆవేదయంతి దైవజ్ఞాః సూర్యాంగారకరాహుభిః ||
18
ప్రాయేణ హి నిమిత్తానామీదృశానాం సముద్భవే |
రాజా హి మృత్యుమవాప్నోతి ఘోరాం వాఽఽపదమృచ్ఛతి ||
19
తద్యావదేవ మే చేతో న విముంచతి రాఘవ | [విముహ్యతి]
తావదేవాభిషించస్వ చలా హి ప్రాణినాం మతిః ||
20
అద్య చంద్రోఽభ్యుపగతః పుష్యాత్పూర్వం పునర్వసూ |
శ్వః పుష్యయోగం నియతం వక్ష్యంతే దైవచింతకాః ||
21
తతః పుష్యేఽభిషించస్వ మనస్త్వరయతీవ మామ్ |
శ్వస్త్వాఽహమభిషేక్ష్యామి యౌవరాజ్యే పరంతప ||
22
తస్మాత్త్వయాఽద్యప్రభృతి నిశేయం నియతాత్మనా |
సహ వధ్వోపవస్తవ్యా దర్భప్రస్తరశాయినా ||
23
సుహృదశ్చాప్రమత్తాస్త్వాం రక్షంత్వద్య సమంతతః |
భవంతి బహువిఘ్నాని కార్యాణ్యేవంవిధాని హి ||
24
విప్రోషితశ్చ భరతో యావదేవ పురాదితః |
తావదేవాభిషేకస్తే ప్రాప్తకాలో మతో మమ ||
25
కామం ఖలు సతాం వృత్తే భ్రాతా తే భరతః స్థితః |
జ్యేష్ఠానువర్తీ ధర్మాత్మా సానుక్రోశో జితేంద్రియః ||
26
కిం తు చిత్తం మనుష్యాణామనిత్యమితి మే మతిః |
సతాం చ ధర్మనిత్యానాం కృతశోభి చ రాఘవ ||
27
ఇత్యుక్తః సూఽభ్యనుజ్ఞాతః శ్వోభావిన్యభిషేచనే |
వ్రజేతి రామః పితరమభివాద్యాభ్యయాద్గృహమ్ ||
28
ప్రవిశ్య చాత్మనో వేశ్మ రాజ్ఞోద్దిష్టేఽభిషేచనే |
తత్క్షణేన చ నిష్క్రమ్య మాతురంతఃపురం యయౌ || [వినిర్గమ్యే]
29
తత్ర తాం ప్రవణామేవ మాతరం క్షౌమవాసినీమ్ |
వాగ్యతాం దేవతాగారే దదర్శాయాచతీం శ్రియమ్ ||
30
ప్రాగేవ చాగతా తత్ర సుమిత్రా లక్ష్మణస్తథా |
సీతా చ నాయితా శ్రుత్వా ప్రియం రామాభిషేచనమ్ ||
31
తస్మిన్కాలే హి కౌసల్యా తస్థావామీలితేక్షణా |
సుమిత్రయాఽన్వాస్యమానా సీతయా లక్ష్మణేన చ ||
32
శ్రుత్వా పుష్యేణ పుత్రస్య యౌవరాజ్యాఽభిషేచనమ్ |
ప్రాణాయామేన పురుషం ధ్యాయమానా జనార్దనమ్ ||
33
తథా సన్నియమామేవ సోఽభిగమ్యాభివాద్య చ |
ఉవాచ వచనం రామో హర్షయంస్తామనిందితాం ||
34
అంబ పిత్రా నియుక్తోఽస్మి ప్రజాపాలనకర్మణి |
భవితా శ్వోఽభిషేకో మే యథా మే శాసనం పితుః ||
35
సీతయాఽప్యుపవస్తవ్యా రజనీయం మయా సహ |
ఏవమృత్విగుపాధ్యాయైః సహ మాముక్తవాన్పితా ||
36
యాని యాన్యత్ర యోగ్యాని శ్వోభావిన్యభిషేచనే |
తాని మే మంగళాన్యద్య వైదేహ్యాశ్చైవ కారయ ||
37
ఏతచ్ఛ్రుత్వా తు కౌసల్యా చిరకాలాభికాంక్షితమ్ |
హర్షబాష్పకలం వాక్యమిదం రామమభాషత ||
38
వత్స రామ చిరం జీవ హతాస్తే పరిపంథినః |
జ్ఞాతీన్మే త్వం శ్రియా యుక్తః సుమిత్రాయాశ్చ నందయ ||
39
కళ్యాణే బత నక్షత్రే మయి జాతోఽసి పుత్రక |
యేన త్వయా దశరథో గుణైరారాధితః పితా ||
40
అమోఘం బత మే క్షాంతం పురుషే పుష్కరేక్షణే |
యేయమిక్ష్వాకురాజ్యశ్రీః పుత్ర త్వాం సంశ్రయిష్యతి ||
41
ఇత్యేవముక్తో మాత్రేదం రామో భ్రాతరమబ్రవీత్ |
ప్రాంజలిం ప్రహ్వమాసీనమభివీక్ష్య స్మయన్నివ ||
42
లక్ష్మణేమాం మాయా సార్ధం ప్రశాధి త్వం వసుంధరామ్ |
ద్వితీయం మేంతరాత్మానం త్వామియం శ్రీరుపస్థితా ||
43
సౌమిత్రే భుంక్ష్వ భోగాంస్త్వమిష్టాన్రాజ్యఫలాని చ |
జీవితం చ హి రాజ్యం చ త్వదర్థమభికామయే ||
44
ఇత్యుక్త్వా లక్ష్మణం రామో మాతరావభివాద్య చ |
అభ్యనుజ్ఞాప్య సీతాం చ జగామ స్వం నివేశనమ్ ||
45
ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే చతుర్థః సర్గః ||
Ayodhya Kanda Sarga 4 Meaning In Telugu
తరువాత దశరథుడు మంత్రులతో మరలా దీర్ఘంగా ఆలోచించాడు. మరునాడే పుష్యమీ నక్షత్రము. అందుకని, ఆలస్యం లేకుండా రాముని మరునాడు పుష్యమీ నక్షత్రము ఘడియలలో పట్టాభిషిక్తుని చేయవలెనని నిశ్చయించాడు. మంత్రులందరూ ఆ నిర్ణయానికి తమ ఆమోదము తెలిపారు.
తరువాత దశరథుడు సభాభవనము నుండి తన అంతఃపురమునకు వెళ్లాడు. సుమంత్రుని పిలిచి రాముని తన మందిరమునకు తీసుకొని రమ్మని ఆదేశించాడు. దశరథుని ఆదేశాను సారము సుమంత్రుడు రాముని వద్దకు వెళ్లాడు.
“ఇప్పుడేగా తండ్రి గారి వద్దనుండి వచ్చాను మరలా ఎందుకు వచ్చావు?” అని అడిగాడు.
“దశరథమహారాజుగారు తమరిని చూడాలని అనుకుంటున్నారు. మీరు మీ తండ్రి గారి వద్దకు వెళ్లాలో లేదో మీరే నిర్ణయించు కోండి.” అని అన్నాడు సుమంత్రుడు. మారు మాటాడకుండా రాముడు సుమంత్రునితో కూడా దశరథుని వద్దకు వచ్చాడు. తండ్రి గారికి నమస్కరించి, ఆయన ఎదుట చేతులు కట్టుకొని నిలబడ్డాడు రాముడు. దశరథుడు రాముని ప్రేమగా లేవనెత్తి కౌగలించుకొని, పక్కనే ఉన్న ఆసనము మీద కూర్చోపెట్టాడు.
“రామా! నేను చెప్పబోవు మాటలు శ్రద్ధగా విను. నాకు వయసు అయిపోయింది. వృద్ధుడను అయ్యాను. రాజభోగాలు తనివిదీరా అనుభవించాను. ఎన్నో యజ్ఞములు, యాగములను చేసాను. ఈ భూలోకంలో సాటిలేని మేటి వీరులను సంతానంగా కలిగి ఉన్నాను. దేవ ఋణము, ఋషి ఋణము, పితృ ఋణము, విప్ర ఋణము, ఆత్మఋణము తీర్చుకున్నాను. ఇంక నీ పట్టాభిషేకము మాత్రము మిగిలి ఉన్నది. నీవు ఈ అయోధ్యకు రాజు కావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. అందుకని నిన్ను యౌవరాజ్యాభిషిక్తుని చేయ సంకల్పించాను.
ఎందుకనో నాకు కొన్ని దుశ్శకునములు పొడసూపుతున్నాయి. నా జాతకములో చెడ్డ గ్రహము లైన సూర్య, అంగారక, రాహు గ్రహములు ఉచ్ఛస్థితిలో ఉన్నట్టు జ్యోతిష్కులు చెప్పారు. ఇలాంటి పరిస్థితులలో నాకు మరణము కానీ, లేక తీవ్రమైన ఆపద కాని సంభవించే అవకాశం ఉంది. మనస్సు చంచల మైనది. ఏ నిముషానికి ఎలా ఆలోచిస్తుందో తెలియదు. అందుకే నాకు చాలా తొందరగా ఉంది. నా మనసులో మరొక ఆలోచన పొడసూపక ముందే నీ యౌవరాజ్యపట్టాభిషేకము జరిగిపోవాలి అని అనుకుంటున్నాను.
ఈ రోజు పునర్వసు నక్షత్రము. రేపు చంద్రుడు పుష్యమీ నక్షత్రములో ఉంటాడు. ఆ శుభ ముహూర్తము లో నీ పట్టాభిషేకము జరిగిపోవాలి. ఈ సందర్భములో నీవు ఈ రోజు రాత్రి అంతా నీ భార్య సీతతో సహా ఉపవాసము చేసి దర్భాసనము మీద నిద్రపోవాలి.
ప్రస్తుతము భరతుడు అయోధ్యలో లేడు. భరతుడు అయోధ్యలో లేని సమయములోనే నీ పట్టాభిషేకము జరగాలని నా కోరిక. అంటే భరతుడు దుర్మార్గుడు అనికాదు. నీ సోదరుడు భరతుడు ఎల్లప్పుడూ నిన్ను అనుసరించి ఉంటూ నీ క్షేమమునే కోరుతుంటాడు. పైగా భరతుడు ధర్మాత్ముడు, దయాళువు. ఇంద్రియములను జయించిన వాడు. కానీ, మనస్సు చంచలమైనది. ఎటువంటి ధర్మాత్ముల మనస్సులు కూడా చలింపవని నమ్మకము లేదు కదా. ఎప్పుడు ఎవరికి ఎలాంటి బుద్ధిపుడుతుందో ఎవరికి తెలుసు! నీ పట్టాభిషేక వార్త విని నీ తమ్ముడు భరతుని మనస్సు కూడా మారుతుందే మో అని నా అనుమానము. అందుకని ఈ తొందర. ఇంక నీవు వెళ్లవచ్చు.” అని పలికాడు దశరథుడు.
తండ్రి చెప్పిన మాటలు సావధానంగా విన్న రాముడు, తండ్రి గారి వద్ద సెలవు తీసుకొని నేరుగా తన తల్లి కౌసల్య అంతఃపురమునకు వెళ్లాడు. రాముని పట్టాభిషేక వార్త అంతకు మునుపే కౌసల్యకు తెలియడంతో, ఆమె సీతను, సుమిత్రను, లక్ష్మణుని తన వద్దకు పిలిపించుకొంది. కౌసల్య పట్టుబట్టలు ధరించి లక్ష్మీదేవికి పూజచేస్తూ ఉంది. ఆమె పక్కనే సుమిత్ర, సీత, లక్ష్మణుడు కూర్చుని ఉన్నారు.
రాముడు వచ్చి తల్లి కౌసల్యకు, సుమిత్రకు నమస్కరించాడు. ఆమెతో ఇలా అన్నాడు. “అమ్మా! తండ్రిగారు నన్ను ఇంక నుంచి ప్రజాపాలన చూడమన్నారు. అందుకని నన్ను యువరాజుగా పట్టాభిషిక్తుని చేయడానికి నిశ్చయించారు. రేపే యౌవరాజ్య పట్టాభిషేకము. ఈ రోజు రాత్రి అంతా నేను నా భార్య సీత ఉపవాసము చేసి దర్భాసనము మీద నిద్రించవలెనని ఋత్తిక్కులు, తండ్రిగారు ఆదేశించారు. అమ్మా! నీవు నాకూ, సీతకూ, రేపు జరగబోవు శుభకార్యమునకు చేయవలసిన మంగళకర కార్యక్రములు జరిపించు.” అని అన్నాడు.
తన కుమారునికి యౌవరాజ్యపట్టాభిషేకము అని తన కుమారుని నోటి నుండి విని ఆ తల్లి పొంగిపోయింది. ఆమె కండ్ల వెంట ఆనందభాష్పాలు రాలాయి. “వత్సా! రామా! చిరంజీవ, చిరంజీవ చిరంజీవిగా వర్ధిల్లు. నీవు నీ తమ్ములకు, నీ తల్లి సుమిత్రకు సంతోషము కలుగచెయ్యి. నాయనా! నీవు పుట్టిన వేళా విశేషము చాలామంచిది. నీవు నీ మంచి గుణములతో నీ తండ్రిని సంతోషింప జేసావు. నేను శ్రీ మహావిష్ణువుకు లక్ష్మీదేవికి చేసిన పూజలు అన్నీ ఫలించాయి. అందుకే ఇక్ష్వాకు వంశానికి రాజువు అవుతున్నావు. సుఖంగా వర్థిల్లు.” అని మనసారా దీవించింది.
తల్లి దీవనలు అందుకున్న రాముడు, లక్ష్మణుని చూచి ఇలా అన్నాడు. “సోదరా! లక్ష్మణా! ఈ పట్టాభిషేకము నాకు కాదు. మన ఇద్దరికీ. మనం ఇద్దరం ఒకరికి ఒకరం తోడుగా రాజ్యపాలన చేద్దాము. నీవు నాకు రెండో ఆత్మ. అందుకే నీవే ఈ అయోధ్యకు యువరాజువు. నీ ఇష్టంవచ్ని రాజభోగములు అనుభవించు. పరిపాలన సాగించు. అసలు నీ కోసమే నేను ఈ యౌవరాజ్య పట్టాభిషేకము చేసుకుంటున్నాను.” అని అన్నాడు.
తరువాత సీతా రాములు కౌసల్యకు, సుమిత్రకు నమస్కరించి, తమ మందిరమునకు వెళ్లిపోయారు.
శ్రీమద్రామాయణము
అయోధ్యా కాండము నాలుగవ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.