Ayodhya Kanda Sarga 6 In Telugu – అయోధ్యాకాండ షష్ఠః సర్గః

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అయోధ్యాకాండము రామాయణంలోని రెండవ కాండ, ఇది ప్రధానంగా శ్రీ రాముడి జీవితంలోని అయోధ్య నగరంలో జరిగిన సంఘటనలను వివరిస్తుంది. షష్ఠః సర్గలో, రాముడు తన తండ్రి దశరథ మహారాజుతో పాటు ఆయోధ్యలో ఉన్న సందర్భాలపై దృష్టి సారిస్తాడు. ఈ సర్గ రాముని వైయక్తిక జీవితం, కుటుంబ బంధాలు మరియు ఆయోధ్యలోని ప్రజల అనురాగం పై కేంద్రీకృతమై ఉంది. రాముడు తన పితృ వాక్య పరిపాలనకు ఎంతటి ప్రాధాన్యత ఇస్తాడో, తండ్రి ప్రతిజ్ఞను నిలబెట్టుకోవడం కోసం సకల కష్టాలను ఎలా స్వీకరించాడో ఈ సర్గలో వివరించబడుతుంది.

పౌరోత్సేకః

గతే పురోహితే రామః స్నాతో నియతమానసః |
సహ పత్న్యా విశాలాక్ష్యా నారాయణముపాగమత్ ||

1

ప్రగృహ్య శిరసా పాత్రీం హవిషో విధివత్తదా |
మహతే దైవతాయాజ్యం జుహావ జ్వలితేఽనలే ||

2

శేషం చ హవిషస్తస్య ప్రాశ్యాశాస్యాత్మనః ప్రియమ్ |
ధ్యాయన్నారాయణం దేవం స్వాస్తీర్ణే కుశసంస్తరే ||

3

వాగ్యతః సహ వైదేహ్యా భూత్వా నియతమానసః |
శ్రీమత్యాయతనే విష్ణోః శిశ్యే నరవరాత్మజః ||

4

ఏకయామావశిష్టాయాం రాత్ర్యాం ప్రతివిబుధ్య సః |
అలంకారవిధిం కృత్స్నం కారయామాస వేశ్మనః ||

5

తత్ర శృణ్వన్సుఖా వాచః సూతమాగధవందినామ్ |
పూర్వాం సంధ్యాముపాసీనో జజాప యతమానసః ||

6

తుష్టావ ప్రణతశ్చైవ శిరసా మధుసూదనమ్ |
విమలక్షౌమసంవీతో వాచయామాస చ ద్విజాన్ ||

7

తేషాం పుణ్యాహఘోషోఽథ గంభీరమధురస్తదా |
అయోధ్యాం పూరయామాస తూర్యఘోషానునాదితః ||

8

కృతోపవాసం తు తదా వైదేహ్యా సహ రాఘవమ్ |
అయోధ్యానిలయః శ్రుత్వా సర్వః ప్రముదితో జనః ||

9

తతః పౌరజనః సర్వః శ్రుత్వా రామాభిషేచనమ్ |
ప్రభాతాం రజనీం దృష్ట్వా చక్రే శోభయితుం పురీమ్ ||

10

సితాభ్రశిఖరాభేషు దేవతాయతనేషు చ |
చతుష్పథేషు రథ్యాసు చైత్యేష్వట్టాలకేషు చ ||

11

నానాపణ్యసమృద్ధేషు వణిజామాపణేషు చ |
కుటుంబినాం సమృద్ధేషు శ్రీమత్సు భవనేషు చ ||

12

సభాసు చైవ సర్వాసు వృక్షేష్వాలక్షితేషు చ |
ధ్వజాః సముచ్ఛ్రితాశ్చిత్రాః పతాకాశ్చాభవంస్తదా ||

13

నటనర్తకసంఘానాం గాయకానాం చ గాయతామ్ |
మనఃకర్ణసుఖా వాచః శుశ్రువుశ్చ తతస్తతః ||

14

రామాభిషేకయుక్తాశ్చ కథాశ్చక్రుర్మిథో జనాః |
రామాభిషేకే సంప్రాప్తే చత్వరేషు గృహేషు చ ||

15

బాలా అపి క్రీడమానాః గృహద్వారేషు సంఘశః |
రామాభిషేకసంయుక్తాశ్చక్రురేవ మిథః కథాః ||

16

కృతపుష్పోపహారశ్చ ధూపగంధాధివాసితః |
రాజమార్గః కృతః శ్రీమాన్పౌరై రామాభిషేచనే ||

17

ప్రకాశీకరణార్థం చ నిశాగమనశంకయా |
దీపవృక్షాంస్తథా చక్రురనురథ్యాసు సర్వశః ||

18

అలంకారం పురస్యైవం కృత్వా తత్పురవాసినః |
ఆకాంక్షమాణా రామస్య యౌవరాజ్యాభిషేచనమ్ ||

19

సమేత్య సంఘశః సర్వే చత్వరేషు సభాసు చ |
కథయంతో మిథస్తత్ర ప్రశశంసుర్జనాధిపమ్ ||

20

అహో మహాత్మా రాజాయమిక్ష్వాకుకులనందనః |
జ్ఞాత్వా యో వృద్ధమాత్మానం రామం రాజ్యేఽభిషేక్ష్యతి ||

21

సర్వే హ్యనుగృహీతాః స్మ యన్నో రామో మహీపతిః | [సర్వేప్య]
చిరాయ భవితా గోప్తా దృష్టలోకపరావరః ||

22

అనుద్ధతమనా విద్వాన్ధర్మాత్మా భ్రాతృవత్సలః |
యథా చ భ్రాతృషు స్నిగ్ధస్తథాస్మాస్వపి రాఘవః ||

23

చిరం జీవతు ధర్మాత్మా రాజా దశరథోఽనఘః |
యత్ప్రసాదేనాభిషిక్తం రామం ద్రక్ష్యామహే వయమ్ ||

24

ఏవం‍విధం కథయతాం పౌరాణాం శుశ్రువుస్తదా |
దిగ్భ్యో విశ్రుతవృత్తాంతాః ప్రాప్తా జానపదా జనాః || [దిగ్భ్యోఽపి]

25

తే తు దిగ్భ్యః పురీం ప్రాప్తాః ద్రష్టుం రామాభిషేచనమ్ |
రామస్య పూరయామాసుః పురీం జానపదా జనాః ||

26

జనౌఘైస్తైర్విసర్పద్భిః శుశ్రువే తత్ర నిస్వనః |
పర్వసూదీర్ణవేగస్య సాగరస్యేవ నిస్వనః ||

27

తతస్తదింద్రక్షయసన్నిభం పురం
దిదృక్షుభిర్జానపదైరుపాగతైః |
సమంతతః సస్వనమాకులం బభౌ
సముద్రయాదోభిరివార్ణవోదకమ్ ||

28

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే షష్ఠః సర్గః ||

Ayodhya Kanda Sarga 6 Meaning In Telugu

వసిష్ఠుడు తన మందిరము నుండి వెళ్లిపోయిన తరువాత రాముడు, సీతతో కలిసి మంగళ స్నానము చేసి, భక్తితో శ్రీ మహా విష్ణువును పూజించాడు. తరువాత అగ్నికార్యము నిర్వర్తించాడు. శ్రీ మహావిష్ణు మంత్రములు జపిస్తూ అగ్నిలో నేతిని హెూమం చేసాడు. అగ్నిలో వేల్చగా మిగిలిన హవిస్సును తాను భుజించాడు. తరువాత తన భార్య సీతతో కూడా దర్భలతో చేసిన చాప మీద పడుకున్నాడు.

మరునాడు తెల్లవారుజామునే నిద్రలేచాడు. తన మందిరమును చక్కగా అలంకరింపచేసాడు. ఇంతలో వంది మాగధులు వచ్చి స్తోత్రపాఠములతో వారి వంశచరిత్రను చక్కగా రామునికి వినిపించారు. రాముడు ప్రాతఃకాల సంధ్యావందనము నిర్వర్తించాడు. గాయత్రీ మాతను ఉపాసించాడు. బ్రాహ్మణులు పుణ్యాహవాచనము చేసారు.

రామపట్టాభిషేకము జరుగబోవుచున్నదని అయోధ్యా నగర పౌరులందరూ తెల్లవారుజామునే మేల్కొన్నారు. పురమును అంతా అలంకరించారు. రాజ ప్రాసాదముల మీద, కార్యాలయముల మీద, దేవాలయముల మీద పతాకములను ఎగురవేసారు. గాయకులు పాటలు పాడుతున్నారు. నర్తకులు చక్కగా తయారయి రాజభవనమునకు వెళ్లుటకు సిద్ధమవుతున్నారు. నర్తకులు నర్తిస్తున్నారు. అందరూ మంగళకరమైన మాటలు మాట్లాడు కుంటున్నారు. ఎవరి నోట విన్నా రాముని గుణగణములు, రామ పట్టాభిషేకము గురించి మాటలు వినబడుతున్నాయి. రామ పట్టాభిషేకం గురించి తప్ప ఎవరూ మరొక మాట మాట్లాడుకోవడం లేదు. రామ పట్టాభిషేక మహోత్సవము ఎంతసేపు జరుగుతుందో, చీకటి పడుతుందేమో అని పట్ట పగలే చిత్ర విచిత్రములైన దీపములు వీధులలో వెలిగించి పెట్టారు.

తాను వృద్ధుడైన సంగతి ఎరింగి దశరథుడు తగిన నిర్ణయం తీసుకొన్నాడని, ఇంక నుంచి రాముని పాలనలో తాము సుఖ సంతోషాలు అనుభవిస్తామని అయోధ్యావాసులు పొంగిపోతున్నారు. రాముడు తామందరినీ తన సోదరుల మాదిరి వాత్సల్యముతో ఆదరిస్తాడని జనులంతా ఆనంద పరవశులౌతున్నారు. రాముని పట్టాభిషేక వార్త విన్న చుట్టుపక్కల జనపదములలో నివసించు జానపదులు తండోప తండములుగా అయోధ్యకు తరలి వస్తున్నారు. వారందరితోటీ అయోధ్యానగరము క్రిక్కింరిసిపోయింది. వారందరూ మాట్లాడుకుంటూ కేరింతలు కొడుతుంటే వారి ఘోష సముద్రఘోషను మరిపిస్తూ ఉంది. ఆ రోజు అయోధ్యానగరము మహేంద్రుని రాజధాని అమరావతిని తలపిస్తూ ఉంది.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము ఆరవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

వాల్మీకి రామాయణంలో ఈ విధంగా ఉంటే వ్యాసుడు రచించిన బ్రహ్మాండపురాణంలో భాగమయిన ఆధ్యాత్మ రామాయణంలో ఒక కొత్త విషయం ఉంది. అదేమి టంటే…..

ఒక రోజు నారదుడు శ్రీరాముని వద్దకు వచ్చాడు. రాముని తో ఇలా అన్నాడు. “ఓ రామా! నన్ను బ్రహ్మ నీవద్దకుపంపాడు. నీకు నీ తండ్రి దశరథుడు పట్టాభిషేకము చేయవలెనని నిశ్చయించాడు. కాని నీ జననము రావణ సంహారము కొరకు జరిగినది కదా! నీవు రాజ్యపాలన చేస్తుంటే, రావణ సంహారము మాటేమిటి? భూభారము తగ్గించుటకు నీకు రాక్షస సంహారము చేయవలయును కదా! రామా! నీవు దేని కొరకు అవతరించితివో ఆ విషయము మరిచిపోవద్దు” అని అన్నాడు. దానికి రాముడు ఇలా అన్నాడు. “నారదమహర్షీ! నాకు తెలియని విషయము ఏమున్నది. నేను ఆడిన మాట తప్పను. రాక్షస సంహారము చేసెదను. కాలము తీరిన దైత్యులను సంహరించెదను. రేపే దండకారణ్య ప్రయాణము. పదునాలుగు సంవత్సరములు అరణ్య వాసము చేసెదను. సీతాపహరణము మిషతో రావణుని సంహరించెదను.. ఇది సత్యము.” అని రాముడు నారదునితో అన్నాడు. రాముని మాటలకు సంతోషించిన నారదుడు అక్కడి నుండి వెళ్లిపోయాడు. (ఇక్కడ రాముడు సామాన్య మానవుడు కాదు. కారణ జన్ముడు. సాక్షాత్తు విష్ణు అవతారము, భూత, భవిష్యత్ వర్తమానములు తెలిసినవాడు అని చెప్పబడింది.)

తరువాత వసిష్ఠుడు రామునితో ఉపవాసవ్రతము చేయించిన తరువాత వెళ్లిపోయాడు. ఆ సమయంలో దేవలోకంలో దేవతలు సరస్వతీదేవి వద్దకు వెళ్లారు. “అమ్మా సరస్వతీ దేవీ! నీవు ఇప్పుడు వెంటనే భూలోకమునకు వెళ్లాలి. నీవు రామునికి జరుగబోవు పట్టాభిషేకమునకు విఘ్నము కలిగించాలి. ఇది బ్రహ్మదేవుని ఆదేశము. అమ్మా! నీవు ముందుగా మంధర అనే దాసి వాక్కులో ప్రవేశించాలి. తరువాత కైకేయి వాక్కులో ప్రవేశించాలి. శ్రీరాముని పట్టాభిషేక ప్రయత్నము భగ్నము అయిన తరువాత మరలా తిరిగిరావాలి.” అని ప్రార్థించారు. సరస్వతీ దేవి దేవతల ప్రార్థన మన్నించి అయోధ్యా నగరమునకు వచ్చి మంధర వాక్కులో ప్రవేశించింది.

(ఈ సంఘటనలు మనకు ఆధ్యాత్మ రామాయణంలో కనపడతాయి. ఇంక ఈ సందర్భంలో తులసీరామాయణం లో ఏముందో తెలుసుకుందాము.)

అయోధ్యలో పౌరులందరూ రామపట్టాభిషేక సందర్భములో ఉత్సవాలు జరుపుకుంటుంటే దేవలోకములో దేవతలు విచారంగా ఉ న్నారు. వారందరూ సరస్వతీదేవి వద్దకు పోయి ఇలా అన్నారు.

“అమ్మా! రామ పట్టాభిషేకము జరుగబోవుచున్నది. నీవు ఎలాగైనా దానిని భగ్నము చేసి, రాముని అరణ్యములకు పంపాలి. దాని వలన దేవతల కార్యము సఫలమవుతుంది.” అని అన్నారు. ఆ మాటలకు సరస్వతీ దేవి నేను ఇటువంటి పాడు పని చెయ్యాలా అని చింతించింది. ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంది. అప్పుడు దేవతలు ఇలా అన్నారు.

“అమ్మ తమరు ఈ పని చేసినందువలన తమరికి ఏ దోషమూ అంటదు. ఇది దేవ కార్యము. రాముడు సామాన్య మానవుడు కాడు. భేదమోదములకు అతీతుడు. సుఖము దుఃఖము సామాన్య మానవులకు కానీ రామునికి అంటవు. కాబట్టి తమరు అయోధ్యకు వెళ్లాలి.” అని ప్రార్థించారు.

అప్పుడు సరస్వతీ దేవి తనలో తాను ఇలా అనుకొన్నది.

“ఆహా! ఈ దేవతలు ఎంత అల్పబుద్ధులు. వీరు ఉండేచోటు అత్యున్నత స్థానమైన స్వర్గము. కానీ వీరి బుద్ధులు మాత్రము పరమ నీచములు. ఇతరులు బాగుపడుతుంటే చూచి సహించలేరు. పోనీ. ఇదీ ఒకందుకు మంచిదే… రాముడు వనవాసము వెళితే రాక్షససంహారము జరుగుతుంది. రామాయణ కధ లోకంలో ప్రచారం అవుతుంది. ఎంతో మంది కవులు గాయకులు రామ కథను గానం చేస్తారు. నేను ఆ కవులు గాయకుల నాలుకల మీద నాట్యం చేస్తుంటాను. రామ కథను గానం చేస్తుంటాను. దీనివలన భూలోకంలో నా పేరు ప్రతిష్ఠలు పెరుగుతాయి.” అని అనుకొన్నది సరస్వతీ దేవి. దేవతల కోరిక ప్రకారము అయోధ్యకు వచ్చింది. ఇదీ తులసీరామాయణంలో ఉన్నకధ.

పై చెప్పిన కధా సంఘటనలు వాల్మీకి రామాయణంలో లేవు. రాముడు వనవాసమునకు పోవడంలో దేవరహస్యాలు ఏమీ లేవు. మామూలు మానవుల్లో ఎలా జరుగుతుందో అలా జరిగింది.

దశరథుడు భరతుడు ఇంటలేని సమయంలో కావాలనే రామ పట్టాభిషేకమునకు ముహూర్తము నిర్ణయించాడు అని స్పష్టంగా తెలుస్తూ ఉంది.

యుగధర్మము ప్రకారము రాజ్యము జ్యేష్టునికి చెందుతుంది. దశరథుని కుమారులలో పెద్దవాడు రాముడు. అందుకని రామునికి పట్టాభిషేకం చెయ్యడంలో ఎవరికీ అభ్యంతరం ఉండదు. కాని భరతుడు ఏమైనా పేచీ పెడతాడేమో అని దశరథుడు సందేహించాడు. అందుకని భరతుడు లేని వేళ పట్టాభిషేకము నిర్ణయించాడు.

వాల్మీకి రామాయణము ప్రకారము ఇందులో దేవతల ప్రసక్తికానీ, దేవరహస్యము కానీ ఏమీలేవు.

అయోధ్యాకాండ సప్తమః సర్గః (7) >>

Leave a Comment