Ayodhya Kanda Sarga 7 In Telugu – అయోధ్యాకాండ సప్తమః సర్గః

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అయోధ్యాకాండము రామాయణంలోని రెండవ కాండ, ఇది ప్రధానంగా శ్రీ రాముడి జీవితంలోని అయోధ్య నగరంలో జరిగిన సంఘటనలను వివరిస్తుంది. సప్తమః సర్గలో, రాముడు తన తండ్రి దశరథ మహారాజుతో పాటు ఆయోధ్యలో ఉన్న సందర్భాలపై దృష్టి సారిస్తాడు. ఈ సర్గ రాముని వైయక్తిక జీవితం, కుటుంబ బంధాలు మరియు ఆయోధ్యలోని ప్రజల అనురాగం పై కేంద్రీకృతమై ఉంది. రాముడు తన పితృ వాక్య పరిపాలనకు ఎంతటి ప్రాధాన్యత ఇస్తాడో, తండ్రి ప్రతిజ్ఞను నిలబెట్టుకోవడం కోసం సకల కష్టాలను ఎలా స్వీకరించాడో ఈ సర్గలో వివరించబడుతుంది.

మంథరాపరిదేవనమ్

జ్ఞాతిదాసీ యతోజాతా కైకేయ్యాస్తు సహోషితా |
ప్రాసాదం చంద్రసంకాశమారురోహ యదృచ్ఛయా ||

1

సిక్తరాజపథాం రమ్యాం ప్రకీర్ణకుసుమోత్కరామ్ |
అయోధ్యాం మంథరా తస్మాత్ప్రాసాదాదన్వవైక్షత ||

2

పతాకాభిర్వరార్హాభిర్ధ్వజైశ్చ సమలంకృతామ్ |
వృతాం ఛన్నపథైశ్చాపి శిరఃస్నాతజనైర్వృతామ్ ||

3

మాల్యమోదకహస్తైశ్చ ద్విజేంద్రైరభినాదితామ్ |
శుక్లదేవగృహద్వారాం సర్వవాదిత్రనిస్వనామ్ ||

4

సంప్రహృష్టజనాకీర్ణాం బ్రహ్మఘోషాభినాదితామ్ |
ప్రహృష్టవరహస్త్యశ్వాం సంప్రణర్దితగోవృషామ్ ||

5

ప్రహృష్టముదితైః పౌరైరుచ్ఛ్రితధ్వజమాలినీమ్ |
అయోధ్యాం మంథరా దృష్ట్వా పరం విస్మయమాగతా ||

6

ప్రహర్షోత్ఫుల్లనయనాం పాండురక్షౌమవాసినీమ్ |
అవిదూరే స్థితాం దృష్ట్వా ధాత్రీం పప్రచ్ఛ మంథరా ||

7

ఉత్తమేనాభిసంయుక్తా హర్షేణార్థపరా సతీ |
రామమాతా ధనం కిం ను జనేభ్యః సంప్రయచ్ఛతి ||

8

అతిమాత్రప్రహర్షోఽయం కిం జనస్య చ శంస మే |
కారయిష్యతి కిం వాపి సంప్రహృష్టో మహీపతిః ||

9

విదీర్యమాణా హర్షేణ ధాత్రీ తు పరయా ముదా |
ఆచచక్షేఽథ కుబ్జాయై భూయసీం రాఘవశ్రియమ్ ||

10

శ్వః పుష్యేణ జితక్రోధం యౌవరాజ్యేన రాఘవమ్ |
రాజా దశరథో రామమభిషేచయితానఘమ్ ||

11

ధాత్ర్యాస్తు వచనం శ్రుత్వా కుబ్జా క్షిప్రమమర్షితా |
కైలాసశిఖరాకారాత్ప్రాసాదాదవరోహత ||

12

సా దహ్యమానా కోపేన మంథరా పాపదర్శినీ |
శయానామేత్య కైకేయీమిదం వచనమబ్రవీత్ ||

13

ఉత్తిష్ఠ మూఢే కిం శేషే భయం త్వామభివర్తతే |
ఉపప్లుతమఘౌఘేన కిమాత్మానం న బుధ్యసే ||

14

అనిష్టే సుభగాకారే సౌభాగ్యేన వికత్థసే |
చలం హి తవ సౌభాగ్యం నద్యాః స్రోత ఇవోష్ణగే ||

15

ఏవముక్తా తు కైకేయీ రుష్టయా పరుషం వచః |
కుబ్జయా పాపదర్శిన్యా విషాదమగమత్పరమ్ ||

16

కైకేయీ త్వబ్రవీత్కుబ్జాం కచ్చిత్క్షేమం న మంథరే |
విషణ్ణవదనాం హి త్వాం లక్షయే భృశదుఃఖితామ్ ||

17

మంథరా తు వచః శ్రుత్వా కైకేయ్యా మధురాక్షరమ్ |
ఉవాచ క్రోధసంయుక్తా వాక్యం వాక్యవిశారదా ||

18

సా విషణ్ణతరా భూత్వా కుబ్జా తస్యా హితైషిణీ |
విషాదయంతీ ప్రోవాచ భేదయంతీ చ రాఘవమ్ ||

19

అక్షయ్యం సుమహద్దేవి ప్రవృత్తం త్వద్వినాశనమ్ |
రామం దశరథో రాజా యౌవరాజ్యేఽభిషేక్ష్యతి ||

20

సాస్మ్యగాధే భయే మగ్నా దుఃఖశోకసమన్వితా |
దహ్యమానాఽనలేనేవ త్వద్ధితార్థమిహాగతా ||

21

తవ దుఃఖేన కైకేయి మమ దుఃఖం మహద్భవేత్ |
త్వద్వృద్ధౌ మమ వృద్ధిశ్చ భవేదత్ర న సంశయః ||

22

నరాధిపకులే జాతా మహిషీ త్వం మహీపతేః |
ఉగ్రత్వం రాజధర్మాణాం కథం దేవి న బుధ్యసే ||

23

ధర్మవాదీ శఠో భర్తా శ్లక్ష్ణవాదీ చ దారుణః |
శుద్ధభావేన జానీషే తేనైవమతిసంధితా ||

24

ఉపస్థితం ప్రయుంజానస్త్వయి సాంత్వమనర్థకమ్ |
అర్థేనైవాద్య తే భర్తా కౌసల్యాం యోజయిష్యతి ||

25

అపవాహ్య స దుష్టాత్మా భరతం తవ బంధుషు |
కాల్యే స్థాపయితా రామం రాజ్యే నిహతకంటకే ||

26

శత్రుః పతిప్రవాదేన మాత్రేవ హితకామ్యయా |
ఆశీవిష ఇవాంకేన బాలే పరిహృతస్త్వయా ||

27

యథా హి కుర్యాత్సర్పో వా శత్రుర్వా ప్రత్యుపేక్షితః |
రాజ్ఞా దశరథేనాద్య సపుత్రా త్వం తథా కృతా ||

28

పాపేనానృతసాంత్వేన బాలే నిత్యసుఖోచితే |
రామం స్థాపయతా రాజ్యే సానుబంధా హతా హ్యసి ||

29

సా ప్రాప్తకాలం కైకేయి క్షిప్రం కురు హితం తవ |
త్రాయస్వ పుత్రమాత్మానం మాం చ విస్మయదర్శనే ||

30

మంథరాయా వచః శ్రుత్వా శయనాత్సా శుభాననా |
ఉత్తస్థౌ హర్షసంపూర్ణా చంద్రలేఖేవ శారదీ ||

31

అతీవ సా తు సంహృష్టా కైకేయీ విస్మయాన్వితా |
ఏకమాభరణం తస్యై కుబ్జాయై ప్రదదౌ శుభమ్ ||

32

దత్త్వా త్వాభరణం తస్యై కుబ్జాయై ప్రమదోత్తమా |
కైకేయీ మంథరాం దృష్ట్వా పునరేవాబ్రవీదిదమ్ ||

33

ఇదం తు మంథరే మహ్యమాఖ్యాసి పరమం ప్రియమ్ |
ఏతన్మే ప్రియమాఖ్యాతం భూయః కిం వా కరోమి తే ||

34

రామే వా భరతే వాఽహం విశేషం నోపలక్షయే |
తస్మాత్తుష్టాఽస్మి యద్రాజా రామం రాజ్యేఽభిషేక్ష్యతి ||

35

న మే పరం కించిదితస్త్వయా పునః
ప్రియం ప్రియార్హే సువచం వచో వరమ్ |
తథా హ్యవోచస్త్వమతః ప్రియోత్తరం
పరం వరం తే ప్రదదామి తం వృణు ||

36

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే సప్తమః సర్గః ||

Ayodhya Kanda Sarga 7 Meaning In Telugu

దశరథుని ముగ్గురు భార్యలలో మూడవ భార్య కైక. కేకయ రాజ కుమార్తె. ఆమెకు దశరథునితో వివాహం అయిన తరువాత ఆమెకు తోడుగా మంథర అనే దాసి ఆమె వెంట అయోధ్యకు వచ్చింది. మంధర కైకేయికి ఆంతరంగిక దాసి. సలహాదారు. అటువంటి మంధర ఆ రోజు మేడమీదికి ఎక్కి అయోధ్యానగరాన్ని చూచింది. అయోధ్య అంతా కోలాహలంగా కనపడింది. రాజమార్గములు అన్నీ తోరణముల తోనూ పతాకములతోనూ అలంకరింపబడి ఉన్నాయి. పౌరులందరూ హడావిడిగా రాచ నగరుకు వస్తున్నారు.

ఇదంతా చూచిన మంథరకు ఏమి జరుగుతూ ఉందో అర్ధం కాలేదు. పక్కను ఉన్న ఒక దాసీని పిలిచి “అయోధ్యలో ఏమి జరుగుతూ ఉంది? ఆ కౌసల్య ఒట్టి పిసినారి కదా. ఆమె కూడా దానధర్మములు చేస్తూ ఉందా? ఏమి కారణం? దశరథుడు ఏమైనా ఘనకార్యం చేసాడా!” అని అడిగింది.

ఆ దాసి మంథరతో ఇలా అంది. ” అవును. దశరథమహారాజు గారు రేపు ఉదయం పుష్యమీ నక్షత్రంలో రామునికి యువరాజుగా పట్టాభిషేకము జరిపిస్తున్నాడు.” అని చెప్పి హడావిడిగా వెళ్లిపోయింది.

ఎదుటి వారి ఉన్నతిని చూచి ఓర్వలేని మంథర లో కోపము, అసూయ ప్రవేశించాయి. వెంటనే విసా విసా కైకేయి మందిరమునకు వెళ్లింది. ఆ సమయంలో కైకేయి మెత్తటి పరుపు మీద పడుకొని ఉంది.

కైకను చూచి మంథర కోపంతో “ఓసి తెలివితక్కువదానా! బయట కొంపలు మునుగుతుంటే నువ్వు ఇక్కడ తీరిగ్గా పడుకొని ఉన్నావా! నీకు రాబోయే ఆపదలు నీకు తెలియడం లేదు.” అని అంది మంథర

కైకకు ఏమీ అర్థం కాలేదు. మంథర వంక ఏమి జరిగింది అన్నట్టు చూచింది.

“అయ్యో నీకు ఇంకా ఏమీ అర్థం కాలేదా! నీ భర్తకు నీవు అత్యంత ప్రియమైన భార్యవు అని అనుకుంటున్నావా! కాదమ్మా కాదు. ఎన్నటికీ కాదు. అదంతా నీ భ్రమ. నీ సౌభాగ్యం అంతా ఎండాకాలంలో నీటి మడుగు వలె ఎంది పోయిందే తల్లీ” అని పరుషంగా మాట్లాడింది మంథర.

ఆ మాటలు విన్న కైక ఆలోచనలో పడింది. “మంథరా! ఏం జరిగిందో చెప్పకుండా ఏమిటా మాటలు! అసలు నీకు ఇంత కోపం దుఃఖం ఎలా కలిగింది. ఎందుకు కలిగింది. కాస్త వివరంగా చెప్పవే” అంది కైక. ఆమాటలకు ఇంకాస్త ఏడుపు ఎక్కువ చేసింది మంథర.

‘ఏం చెప్పమంటావే తల్లీ! నీ కొంప నట్టేట మునిగింది. నీకు అంతులేని కష్టం వచ్చి పడింది. నీకు ఈ విషయం తెలుసా. దశరథుడు రామునికి యౌవరాజ్య పట్టాభిషేకము చేస్తున్నాడట. నీతో ఒక మాటన్నా అన్నాడు. నీ అనుమతి తీసుకున్నాడా.” అని సన్న సన్నగా నొక్కుతూ అంది.

“అసలు ఆ విషయం తెలియగానే నాకు ఒళ్లంతా మండి పోయింది అనుకో! పట్టరాని దు:ఖంలో మునిగిపోయాను. నీతో చెప్పి నీకేదో మేలు చేద్దామని వస్తే నీవేమో తీరుబడిగా పడుకొని ఉన్నావు. నీకు చీమ కుట్టినట్టయినా లేదు.

అమ్మ కైకా! నేను నీ వెంట ఇంత దూరం వచ్చాను కదా. నీ సుఖం నా సుఖం అనీ, నీ కష్టం నా కష్టం అనుకొని ఇన్నాళ్లు నిన్ను అంటిపెట్టుకొని ఉన్నాను కదా! అయ్యో! రాజ వంశంలో పుట్టి దశరథమహారాజు గారికి ముద్దుల భార్య వు అయి ఉండీ రాచనగరులో జరిగే కుట్రలు తెలుసుకోలేకపోతే ఎలాగా! నీ భర్త నీతో పైపైన ఇష్టంగా ఉన్నట్టు నటిస్తూ ప్రేమగా మాట్లాడుతున్నా, లోలోపల నీకు తీరని అపకారం చేస్తున్నాడమ్మా. అది నీవు గ్రహించలేక పోతున్నావు.

అయినా నిన్ను అని ప్రయోజనం లేదు. నీవు అసలే అమాయకురాలివి. తెల్లనివి అన్నీ పాలు నల్లనివి అన్నీ నీళ్లు అని నమ్ముతావు. అందుకే నీ భర్త నీకు ఇంత ద్రోహం, మోసం చేస్తున్నా తెలుసుకోలేకపోతున్నావు. పైపై ఇచ్చకపు మాటలు నీకు, ప్రయోజనాలన్నీ కౌసల్యకు. ఇదమ్మా నీ భర్త వరస. అందుకే కాస్త నా మాట విను. నీ భర్త, నీ కుమారుడు భరతుని, శత్రుఘ్నుని వాళ్ల మేనమామ గారి ఇంటికి పంపాడా. ఇక్కడ అకస్మాత్తుగా రేపు ఉదయమే రామునికి యౌవరాజ్య పట్టాభిషేకము జరిపిస్తున్నాడు. భరతుని అడ్డు తొలగించుకొని రాజ్యం అంతా రామునికి కట్టబెడుతున్నాడు.

ఏమోనమ్మా! పామును పక్కలో పెట్టుకొని పడుకుంటున్నావు. అది అదునుచూచి కాటేసింది. నీ విషయంలో దశరథుడు అదే చేసాడు. నీకేమో కోరినవి అన్నీ తెచ్చి ఇచ్చి ప్రేమతో చూస్తున్నట్టు నటిస్తూ, నీకు తీరని ద్రోహం చేస్తున్నాడు. రామునికి పట్టాభిషేకం చేసి నీకూ నీ కుమారునికీ తీరని అన్యాయం చేస్తున్నాడు. కాబట్టి ఓ కైకా! ఇప్పటి కన్నా మేలుకో. ఏదో ఒకటి చెయ్యి ఈ పట్టాభిషేకమును ఆపు. నిన్ను నీ కుమారుడు భరతుని రక్షించుకో అంది మంథర కైకను ఓరగా చూస్తూ.

కైక “మంథరా!” అని అరిచింది. కైకకు రామ పట్టాభిషేకము అని మాత్రం వినబడింది. మిగిలిన మాటలు ఏమీ వినబడలేదు. “ఏమన్నావే! నా రామునికి పట్టాభిషేకమా! ఎంతటి శుభవార్త చెప్పావే. ఇదుగో ఈ ఆభరణం కానుకగా తీసుకో. ఇంతటి మంగళకరమైన వార్త చెప్పినందుకు ఇది చాలా ఇంకా ఏమన్నా కావాలా” అంటూ తనమెడలోని హారాన్ని మంథరకు కానుకగా ఇచ్చింది. కైక మనస్సు ఆనంద డోలికలలో తేలిపోతూ ఉంది.

“మంథరా! నాకు రాముడన్నా భరతుడన్నా ఒకటేనే. ఇద్దరూ నాకు సమానమే. అందుకే నా భర్త రామునికి యౌవరాజ్య పట్టాభిషేకము జరిపిస్తున్నాడు అని తెలిసి నా హృదయం ఆనందంతో ఊగిపోతూ ఉంది. అబ్బా! నీవు కూడా ఆనందంగా ఉండవే. మనకు ఇంతకన్నా సంతోషకరమైన విషయం ఇంకేముంటుంది చెప్పు. అడగవే. నీకే కావాలో అడుగు. కాదనకుండా ఇస్తాను.” అని సంతోషంతో మంథరను పట్టుకొని ఊపుతూ కేరింతలు కొట్టింది కైక.

శ్రీమద్రామాయణము
అయోధ్యా కాండము ఏడవ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అయోధ్యాకాండ అష్టమః సర్గః (8) >>

Leave a Comment