మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అయోధ్యాకాండము రామాయణంలోని రెండవ కాండ, ఇది ప్రధానంగా శ్రీ రాముడి జీవితంలోని అయోధ్య నగరంలో జరిగిన సంఘటనలను వివరిస్తుంది. తృతీయ సర్గలో, రాముడు తన తండ్రి దశరథ మహారాజుతో ముఖాముఖి అవుతాడు. ఈ సమయంలో, దశరథ మహారాజు కైకేయి ఇచ్చిన వరాల ప్రభావంతో రాముని అరణ్యవాసానికి పంపించవలసిన అవసరం గురించి చర్చ జరుగుతుంది. ఈ సర్గ రాముని విధేయత, పితృవాక్యపాలన, ధర్మం పట్ల అతని అచంచల నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. రాముడు తన తండ్రి మాటలను గౌరవిస్తూ, కైకేయి కోరిన వరాలను అంగీకరించి, అరణ్యవాసం కోసం సిద్ధమవుతాడు. ఈ సర్గ రాముని మహానుభావతను మరియు అతని ధార్మికతను స్పష్టంగా చూపిస్తుంది.
పుత్రానుశాసనమ్
తేషామంజలిపద్మాని ప్రగృహీతాని సర్వశః |
ప్రతిగృహ్యాబ్రవీద్రాజా తేభ్యః ప్రియహితం వచః ||
1
అహోఽస్మి పరమప్రీతః ప్రభావశ్చాతులో మమ |
యన్మే జ్యేష్ఠం ప్రియం పుత్రం యౌవరాజ్యస్థమిచ్ఛథ ||
2
ఇతి ప్రత్యర్చ్య తాన్రాజా బ్రాహ్మణానిదమబ్రవీత్ |
వసిష్ఠం వామదేవం చ తేషామేవోపశృణ్వతామ్ ||
3
చైత్రః శ్రీమానయం మాసః పుణ్యః పుష్పితకాననః |
యౌవరాజ్యాయ రామస్య సర్వమేవోపకల్ప్యతామ్ ||
4
రాజ్ఞస్తూపరతే వాక్యే జనఘోషో మహానభూత్ |
శనైస్తస్మిన్ప్రశాంతే చ జనఘోషే జనాధిపః ||
5
వసిష్ఠం మునిశార్దూలం రాజా వచనమబ్రవీత్ |
అభిషేకాయ రామస్య యత్కర్మ సపరిచ్ఛదమ్ ||
6
తదద్య భగవాన్సర్వమాజ్ఞాపయితుమర్హసి |
తచ్ఛ్రుత్వా భూమిపాలస్య వసిష్ఠో ద్విజసత్తమః ||
7
ఆదిదేశాగ్రతో రాజ్ఞః స్థితాన్యుక్తాన్కృతాంజలీన్ |
సువర్ణాదీని రత్నాని బలీన్సర్వౌషధీరపి ||
8
శుక్లమాల్యాంశ్చ లాజాంశ్చ పృథక్చ మధుసర్పిషీ |
అహతాని చ వాసాంసి రథం సర్వాయుధాన్యపి ||
9
చతురంగబలం చైవ గజం చ శుభలక్షణమ్ |
చామరవ్యజనే శ్వేతే ధ్వజం ఛత్రం చ పాండురమ్ ||
10
శతం చ శాతకుంభానాం కుంభానామగ్నివర్చసామ్ |
హిరణ్యశృంగమృషభం సమగ్రం వ్యాఘ్రచర్మ చ ||
11
ఉపస్థాపయత ప్రాతరగ్న్యగారం మహీపతేః |
యచ్చాన్యత్కించిదేష్టవ్యం తత్సర్వముపకల్ప్యతామ్ ||
12
అంతఃపురస్య ద్వారాణి సర్వస్య నగరస్య చ |
చందనస్రగ్భిరర్చ్యంతాం ధూపైశ్చ ఘ్రాణహారిభిః ||
13
ప్రశస్తమన్నం గుణవద్దధిక్షీరోపసేచనమ్ |
ద్విజానాం శతసాహస్రే యత్ప్రకామమలం భవేత్ ||
14
సత్కృత్య ద్విజముఖ్యానాం శ్వః ప్రభాతే ప్రదీయతామ్ |
ఘృతం దధి చ లాజాశ్చ దక్షిణాశ్చాపి పుష్కలాః ||
15
సూర్యేఽభ్యుదితమాత్రే శ్వో భవితా స్వస్తివాచనమ్ |
బ్రాహ్మణాశ్చ నిమంత్ర్యంతాం కల్ప్యంతామాసనాని చ ||
16
ఆబధ్యంతాం పతాకాశ్చ రాజమార్గశ్చ సిచ్యతామ్ |
సర్వే చ తాలావచరా గణికాశ్చ స్వలంకృతాః ||
17
కక్ష్యాం ద్వితీయామాసాద్య తిష్ఠంతు నృపవేశ్మనః |
దేవాయతనచైత్యేషు సాన్నభక్షాః సదక్షిణాః ||
18
ఉపస్థాపయితవ్యాః స్యుర్మాల్యయోగ్యాః పృథక్ పృథక్ |
దీర్ఘాసిబద్ధా యోధాశ్చ సన్నద్ధా మృష్టవాససాః ||
19
మహారాజాంగణం సర్వే ప్రవిశంతు మహోదయమ్ |
ఏవం వ్యాదిశ్య విప్రౌ తౌ క్రియాస్తత్ర సునిష్ఠితౌ ||
20
చక్రతుశ్చైవ యచ్ఛేషం పార్థివాయ నివేద్య చ |
కృతమిత్యేవ చాబ్రూతామభిగమ్య జగత్పతిమ్ ||
21
యథోక్తవచనం ప్రీతౌ హర్షయుక్తౌ ద్విజర్షభౌ |
తతః సుమంత్రం ద్యుతిమాన్రాజా వచనమబ్రవీత్ ||
22
రామః కృతాత్మా భవతా శీఘ్రమానీయతామితి |
స తథేతి ప్రతిజ్ఞాయ సుమంత్రో రాజశాసనాత్ ||
23
రామం తత్రానయాంచక్రే రథేన రథినాం వరమ్ |
అథ తత్ర సమాసీనాస్తదా దశరథం నృపమ్ ||
24
[* ఉపవిష్టాశ్చ సచివాః రాజానశ్చ సనైగమాః | *]
ప్రాచ్యోదీచ్యాః ప్రతీచ్యాశ్చ దాక్షిణాత్యాశ్చ భూమిపాః |
మ్లేచ్ఛాశ్చార్యాశ్చ యే చాన్యే వనశైలాంతవాసినః ||
25
ఉపాసాంచక్రిరే సర్వే తం దేవా ఇవ వాసవమ్ |
తేషాం మధ్యే స రాజర్షిర్మరుతామివ వాసవః ||
26
ప్రాసాదస్థో రథగతం దదర్శాయాంతమాత్మజమ్ |
గంధర్వరాజప్రతిమం లోకే విఖ్యాతపౌరుషమ్ ||
27
దీర్ఘబాహుం మహాసత్త్వం మత్తమాతంగగామినమ్ |
చంద్రకాంతాననం రామమతీవ ప్రియదర్శనమ్ ||
28
రూపౌదార్యగుణైః పుంసాం దృష్టిచిత్తాపహారిణమ్ |
ఘర్మాభితప్తాః పర్జన్యం హ్లాదయంతమివ ప్రజాః ||
29
న తతర్ప సమాయాంతం పశ్యమానో నరాధిపః |
అవతార్య సుమంత్రస్తం రాఘవం స్యందనోత్తమాత్ ||
30
పితుః సమీపం గచ్ఛంతం ప్రాంజలిః పృష్ఠతోఽన్వగాత్ |
స తం కైలాసశృంగాభం ప్రాసాదం నరపుంగవః ||
31
ఆరురోహ నృపం ద్రష్టుం సహ సూతేన రాఘవః |
స ప్రాంజలిరభిప్రేత్య ప్రణతః పితురంతికే ||
32
నామ స్వం శ్రావయన్రామో వవందే చరణౌ పితుః |
తం దృష్ట్వా ప్రణతం పార్శ్వే కృతాంజలిపుటం నృపః ||
33
గృహ్యాంజలౌ సమాకృష్య సస్వజే ప్రియమాత్మజమ్ |
తస్మై చాభ్యుదితం సమ్యఙ్మణికాంచనభూషితమ్ ||
34
దిదేశ రాజా రుచిరం రామాయ పరమాసనమ్ |
తదాసనవరం ప్రాప్య వ్యదీపయత రాఘవః ||
35
స్వయైవ ప్రభయా మేరుముదయే విమలో రవిః |
తేన విభ్రాజతా తత్ర సా సభాఽభివ్యరోచత ||
36
విమలగ్రహనక్షత్రా శారదీ ద్యౌరివేందునా |
తం పశ్యమానో నృపతిస్తుతోష ప్రియమాత్మజమ్ ||
37
అలంకృతమివాత్మానమాదర్శతలసంస్థితమ్ |
స తం సస్మితమాభాష్య పుత్రం పుత్రవతాం వరః ||
38
ఉవాచేదం వచో రాజా దేవేంద్రమివ కశ్యపః |
జ్యేష్ఠాయామసి మే పత్న్యాం సదృశ్యాం సదృశః సుతః ||
39
ఉత్పన్నస్త్వం గుణశ్రేష్ఠో మమ రామాత్మజః ప్రియః |
త్వయా యతః ప్రజాశ్చేమాః స్వగుణైరనురంజితాః || [యతస్త్వయా]
40
తస్మాత్త్వం పుష్యయోగేన యౌవరాజ్యమవాప్నుహి |
కామతస్త్వం ప్రకృత్యైవ వినీతో గుణవానసి ||
41
గుణవత్యపి తు స్నేహాత్పుత్ర వక్ష్యామి తే హితమ్ |
భూయో వినయమాస్థాయ భవ నిత్యం జితేంద్రియః ||
42
కామక్రోధసముత్థాని త్యజేథా వ్యసనాని చ |
పరోక్షయా వర్తమానో వృత్త్యా ప్రత్యక్షయా తథా ||
43
అమాత్యప్రభృతీః సర్వాః ప్రకృతీశ్చానురంజయ |
కోష్ఠాగారాయుధాగారైః కృత్వా సన్నిచయాన్బహూన్ ||
44
తుష్టానురక్తప్రకృతిర్యః పాలయతి మేదినీమ్ | [ఇష్టా]
తస్య నందంతి మిత్రాణి లబ్ధ్వాఽమృతమివామరాః ||
45
తస్మాత్పుత్ర త్వమాత్మానం నియమ్యైవం సమాచర | [తస్మాత్త్వమపి చాత్మానం]
తచ్ఛ్రుత్వా సుహృదస్తస్య రామస్య ప్రియకారిణః ||
46
త్వరితాః శీఘ్రమభ్యేత్య కౌసల్యాయై న్యవేదయన్ |
సా హిరణ్యం చ గాశ్చైవ రత్నాని వివిధాని చ ||
47
వ్యాదిదేశ ప్రియాఖ్యేభ్యః కౌసల్యా ప్రమదోత్తమా |
అథాఽభివాద్య రాజానం రథమారుహ్య రాఘవః |
యయౌ స్వం ద్యుతిమద్వేశ్మ జనౌఘైః ప్రతిపూజితః ||
48
తే చాపి పౌరా నృపతేర్వచస్త-
-చ్ఛ్రుత్వా తదా లాభమివేష్టమాశు |
నరేంద్రమామంత్ర్య గృహాణి గత్వా
దేవాన్సమానర్చురభిప్రహృష్టాః ||
49
ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే తృతీయ సర్గః ||
Ayodhya Kanda Sarga 3 Meaning In Telugu
పై విధంగా రాముని గుణగణాలను కీర్తించి, రాముడే యౌవరాజ్య పట్టాభిషేకమునకు తగినవాడు అని ముక్తకంఠంతో చెప్పి పురప్రముఖులు అందరూ చేతులు జోడించి నిలబడ్డారు. వారి మాటలు వినిన దశరథుడు ఎంతో సంతోషించాడు.
“పుర ప్రముఖులారా! నా జ్యేష్టపుత్రుడు, నాకు అత్యంత ప్రియుడు, అయిన రాముని యువరాజుగా పట్టాభిషిక్తుని చేయుటకు మీరందరూ అంగీకరించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. రాముని పాలనలో మీకు శుభమగు గాక!” అనిపలికి తన పురోహితు లైన వసిష్ఠుడు, వామదేవులను చూచి ఇలా అన్నాడు.
“రాబోవు చైత్రమాసము పట్టాభిషేకమునకు అనువైన సమయము. చైత్ర మాసములో రాముని పట్టాభిషేకమునకు తగిన ఏర్పాట్లు చేయండి.” అని ఆదేశించాడు.
ఆమాటలు వినిన పురజనులు పెద్దగా హర్షధ్వానాలు చేసారు. తరువాత దశరథుడు వసిష్ఠునితో ఇలా అన్నాడు. “మహాత్మా! రాబోవు చైత్రమాసములో జరుగబోవు రామ పట్టాభిషేకమునకు తగిన ఏర్పాట్లు చేయుటకు ఆదేశాలు ఇవ్వండి.” అని అన్నాడు.
ఆ మాటలు వినిన వసిష్ఠుడు అక్కడే ఉన్న అధికారులను చూచి ఇలా ఆదేశించాడు.
పట్టాభిషేకమునకు కావలసిన సంభారములు సిద్ధం చెయ్యండి. బంగారము, రత్నములు, అభిషేకమునకు కావలసిన ద్రవ్యములు, రకరకాల పుష్పములు, పుష్పమాలలు, లాజలు, తేనె, నెయ్యి, కొత్త బట్టలు, రథములు, ఆయుధములు, చతురంగ బలములు,శు భలక్షణములు ఉన్న గజములు, ఛత్రము, చామరములు, తెల్లటి ధ్వజము, బంగారముతో చేసిన పాత్రలు, బంగారు తొడుగులు వేసిన కొమ్ములు కల వృషభము, పులి చర్మములు, వీటిని అన్నిటినీ రాజుగారి యొక్క అగ్నిహోత్రము చేయు గృహములో సిద్ధంగా ఉంచాలి.
అంతఃపురమును, ద్వారములను పుష్పమాలలతో అలంక రింపుడు. సుగంధ ద్రవ్యములతో సువాసనలతో అంతఃపురము నిండి పోవాలి. పాలు,పెరుగు, నెయ్యి మొదలగు ఆహారపదార్థములను సమృద్ధిగా ఉండేట్టు చూడండి. బ్రాహ్మణ సంతర్పణలు ఏ లోటూ లేకుండా జరగాలి. బ్రాహ్మణులను సత్కరించుటకు కావలసిన సంభారములు ఏర్పాటు చేయండి. రేపు ఉదయమే బ్రాహ్మణులు స్వస్తివాచనము పలకాలి. అందుకు కావలసినవి సిద్ధం చేయండి. ఇంక రాజవీధులను పన్నీటితో తడపండి. పురవీధులను బాగా అలంకరించండి. పతాకములు కట్టండి. అరటి స్తంభములు, తోరణములు కట్టండి. రామునికి స్వాగతము పలకడానికి వేశ్యాస్త్రీలను ద్వారముల వద్ద వేచి ఉండమనండి. అయోధ్యలో ఉన్న అన్ని దేవాలయములలో పూజలు జరిపించండి. దేవునికి నివేదించుటకు అన్న ప్రసాదములు మొదలగునవి ఏర్పాటు చేయండి. సైన్యములో యోధులు అందరూ మంచి మంచి దుస్తులు ధరించి, పొడవైన కత్తులు అలంకారంగా పట్టుకొని ఊరేగింపుగా ముఖద్వారము వద్దకు వచ్చి ఉండాలి. ఇంకా ఏమైనా ఏర్పాట్లు మిగిలిపోయి ఉంటే వాటిని అన్నింటినీ జాగ్రత్తగా చేయించండి.” అని ఆదేశాలు ఇచ్చారు.
వసిష్ఠుడు వామదేవుడు తాము చేసిన ఏర్పాట్లు గురించి దశరథునికి తెలియజేసారు. తాను అనుకొన్న ఏర్పాట్లు అన్నీ సక్రమంగా జరుగుతున్నందుకు దశరథుడు ఎంతో సంతోషించాడు. వెంటనే సుమంతుని పిలిచాడు.
“సుమంతా! నీవుపోయి రాముని నా దగ్గరకు తీసుకొనిరా.” అని ఆదేశించాడు. దశరథుని ఆదేశాను సారము సుమంతుడు రాముని వద్దకు వెళ్లాడు.
దశరథుడు తన రాజ్యములో ఉన్న సామంంతులందరితో సమావేశము అయ్యాడు. ఇంతలో సుమంతుడు పోయి రాముని రథము మీద ఎక్కించుకొని దశరథుని వద్దకు తీసుకొని వచ్చాడు. రాముని రాకను దూరంనుండే చూచాడు దశరథుడు. రథము మీద ఠీవిగా కూర్చున్న రాముని చూడడానికి దశరథునికి వేయి కన్నులు ఉ న్నా ఇంకా చాలవేమో అనిపించింది. “ఎంత చూచినా ఇంకా చూడాలని పించే సౌందర్యము రామునిది” అని అనుకున్నాడు దశరథుడు.
రాముడు రథం దిగాడు. రాముడు దశరథుని వద్దకు వస్తుంటే రాముని వెనక సుమంతుడు చేతులు కట్టుకొని నడుస్తున్నాడు. రాముడు దశరథుని వద్దకు వచ్చి తండ్రి పాదములకు నమస్కరించాడు. దశరథుడు రాముని రెండు చేతులతో పైకి లేపి గట్టిగా కౌగలించుకున్నాడు. తరువాత తన పక్కను ఉన్న ఒక ఉ న్నతాసనము మీద కూర్చోపెట్టాడు.
దశరథుడు రామునితో ఇలా అన్నాడు. ” ఓ రామా! నీవు నాకు జ్యేష్ట పుత్రుడవు. నీ తల్లి కౌసల్య నాకు పెద్ద భార్య. పట్టపు రాణి. ఆమెకు సకల సద్గుణ సంపన్నుడవు యోగ్యుడవు అయిన నీవు జన్మించావు. నీవు అంటే నాకు చాలా ప్రేమ, అభిమానము. నిన్ను అయోధ్యకు యువరాజును చేయాలని సంకల్పించాను. రాబోవు పుష్యమీ నక్షత్రము నందు నీకు యౌవరాజ్య పట్టాభిషేకము జరుపనిశ్చయించాను. ఈ సందర్భంలో నీకు ఒక స్నేహితుడుగా కొన్ని విషయాలు చెబుతున్నాను. శ్రద్ధగా విను.
నీవు ఈ అయోధ్యకు కాబోయే మహారాజువు. నీవు అందరితో వినయంగా ఉండాలి. నీ ఇంద్రియములను అదుపులో పెట్టుకోవాలి. కామము, క్రోధము మొదలగు వాటిని దగ్గరకు రానీయకూడదు. నీవు అమాత్యులతో నేర్పుగా నడుచుకోవాలి. కోశాగారము, ధాన్యాగారము, ఆయుధాగారము ధనముతోనూ, ధాన్యముతోనూ ఆయుధములతోనూ ఎల్లప్పుడూ సమృద్ధిగా ఉండేట్టు చూచుకోవాలి. ఆ ప్రకారంగా రాజ్యపాలన చెయ్యాలి.” అనిఅన్నాడు దశరథుడు.
ఇంతలో రాముని మిత్రులు ఈసంతోష వార్తను కౌసల్యకు చెప్పడానికి ఆమె వద్దకు పరుగు పరుగున వెళ్లారు. కౌసల్యకు రాముని పట్టాభిషేక వార్త చెప్పగానే ఆమె సంతోషంతో పొంగి పోయింది. ఆ వార్త తెచ్చినవారికి బంగారు ఆభరణములు బహు మానంగా ఇచ్చి సత్కరించింది.
దశరథుని వద్ద ఉన్న రాముడు, తండ్రికి నమస్కరించి, తన గృహమునకు వెళ్లాడు.
శ్రీమద్రామాయణము,
అయోధ్యాకాండము తృతీయ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.