Ayodhya Kanda Sarga 44 In Telugu – అయోధ్యాకాండ చతుశ్చత్వారింశః సర్గః

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అయోధ్యాకాండ చతుశ్చత్వారింశః సర్గ, “సుమిత్రాశ్వాసనమ్”, రామాయణంలోని ఒక హృద్యమైన భాగం. ఈ సర్గలో, సుమిత్రా దేవి తన కుమారుడు లక్ష్మణుడు రాముడితో వనవాసానికి వెళ్లిన సందర్భంలో కౌసల్యా దేవిని ఆత్మీయంగా స్వాంతన పలుకుతుంది. సుమిత్రా తన కుమారుని ధైర్యాన్ని, విధి పట్ల అతని నిబద్ధతను, మరియు రాముడికి తోడుగా ఉండే లక్ష్మణుని త్యాగాన్ని ప్రశంసిస్తుంది. సుమిత్రా మాట్లాడే మాటలు, ఆమె ధైర్యం, మరియు కుటుంబ బాంధవ్యాల పరిరక్షణ పట్ల ఆమె శ్రద్ధ ఈ సర్గలో స్పష్టంగా కనపడతాయి. ఈ సర్గ సుమిత్రా దేవి యొక్క మానసిక బలం, ఆమె పాండిత్యం, మరియు కుటుంబ ప్రీతిని ప్రతిబింబిస్తుంది.

సుమిత్రాశ్వాసనమ్

విలపంతీం తథా తాం తు కౌసల్యాం ప్రమదోత్తమామ్ |
ఇదం ధర్మే స్థితా ధర్మ్యం సుమిత్రా వాక్యమబ్రవీత్ ||

1

తవార్యే సద్గుణైర్యుక్తః స పుత్రః పురుషోత్తమః |
కిం తే విలపితేనైవం కృపణం రుదితేన వా ||

2

యస్తవార్యే గతః పుత్రస్త్యక్త్వా రాజ్యం మహాబలః |
సాధు కుర్వన్మహాత్మానం పితరం సత్యవాదినామ్ ||

3

శిష్టైరాచరితే సమ్యక్ఛశ్వత్ప్రేత్య ఫలోదయే |
రామో ధర్మే స్థితః శ్రేష్ఠో న స శోచ్యః కదాచన ||

4

వర్తతే చోత్తమాం వృత్తిం లక్ష్మణోఽస్మిన్సదాఽనఘః |
దయావాన్సర్వభూతేషు లాభస్తస్య మహాత్మనః ||

5

అరణ్యవాసే యద్దుఃఖం జానతీ వై సుఖోచితా |
అనుగచ్ఛతి వైదేహీ ధర్మాత్మానం తవాత్మజమ్ ||

6

కీర్తిభూతాం పతాకాం యో లోకే భ్రామయతి ప్రభుః |
దర్మసత్యవ్రతధనః కిం న ప్రాప్తస్తవాత్మజః ||

7

వ్యక్తం రామస్య విజ్ఞాయ శౌచం మాహాత్మ్యముత్తమమ్ |
న గాత్రమంశుభిః సూర్యః సంతాపయితుమర్హతి ||

8

శివః సర్వేషు కాలేషు కాననేభ్యో వినిస్సృతః |
రాఘవం యుక్తశీతోష్ణః సేవిష్యతి సుఖోఽనిలః ||

9

శయానమనఘం రాత్రౌ పితేవాభిపరిష్వజన్ |
రశ్మిభిః సంస్పృశన్శీతైః చంద్రమాహ్లాదయిష్యతి ||

10

దదౌ చాస్త్రాణి దివ్యాని యస్మై బ్రహ్మా మహౌజసే |
దానవేంద్రం హతం దృష్ట్వా తిమిధ్వజసుతం రణే ||

11

స శూరః పురుషవ్యాఘ్రః స్వబాహుబలమాశ్రితః |
అసంత్రస్తోప్యరణ్యస్థో వేశ్మనీవ నివత్స్యతి ||

12

యస్యేషుపదమాసాద్య వినాశం యాంతి శత్రవః |
కథం న పృథివీ తస్య శాసనే స్థాతుమర్హతి ||

13

యా శ్రీః శౌర్యం చ రామస్య యా చ కళ్యాణసత్త్వతా |
నివృత్తారణ్యవాసః స క్షిప్రం రాజ్యమవాప్స్యతి ||

14

సూర్యస్యాపి భవేత్సూర్యో హ్యగ్నేరగ్నిః ప్రభోః ప్రభుః |
శ్రియః శ్రీశ్చ భవేదగ్ర్యా కీర్తిః కీర్త్యాః క్షమాక్షమా ||

15

దైవతం దైవతానాం చ భూతానాం భూతసత్తమః |
తస్య కే హ్యగుణా దేవి రాష్ట్రే వాఽప్యథవా పురే ||

16

పృథివ్యా సహ వైదేహ్యా శ్రియా చ పురుషర్షభః |
క్షిప్రం తిసృభిరేతాభిః సహ రామోఽభిషేక్ష్యతే ||

17

దుఃఖజం విసృజంత్యాస్రం నిష్క్రామంతముదీక్ష్య యమ్ |
అయోధ్యాయాం జనాః సర్వే శోకవేగసమాహతాః ||

18

కుశచీరధరం దేవం గచ్ఛంతమపరాజితమ్ |
సీతేవానుగతా లక్ష్మీస్తస్య కింనామ దుర్లభమ్ ||

19

ధనుర్గ్రహవరో యస్య బాణఖడ్గాస్త్రభృత్స్వయమ్ |
లక్ష్మణో వ్రజతి హ్యగ్రే తస్య కింనామ దుర్లభమ్ ||

20

నివృత్తవనవాసం తం ద్రష్టాసి పునరాగతమ్ |
జహి శోకం చ మోహం చ దేవి సత్యం బ్రవీమి తే ||

21

శిరసా చరణావేతౌ వందమానమనిందితే |
పునర్ద్రక్ష్యసి కళ్యాణి పుత్రం చంద్రమివోదితమ్ ||

22

పునః ప్రవిష్టం దృష్ట్వా తమభిషిక్తం మహాశ్రియమ్ |
సముత్స్రక్ష్యసి నేత్రాభ్యాం క్షిప్రమానందజం పయః ||

23

మా శోకో దేవి దుఃఖం వా న రామే దృశ్యతేఽశివమ్ |
క్షిప్రం ద్రక్ష్యసి పుత్రం త్వం ససీతం సహలక్ష్మణమ్ ||

24

త్వయాఽశేషో జనశ్చైవ సమాశ్వాస్యో యదాఽనఘే |
కిమిదానీమిమం దేవి కరోషి హృది విక్లబమ్ ||

25

నార్హా త్వం శోచితుం దేవి యస్యాస్తే రాఘవః సుతః |
న హి రామాత్పరో లోకే విద్యతే సత్పథే స్థితః ||

26

అభివాదయమానం తం దృష్ట్వా ససుహృదం సుతమ్ |
ముదాఽశ్రు మోక్ష్యసే క్షిప్రం మేఘలేఖేవ వార్షికీ ||

27

పుత్రస్తే వరదః క్షిప్రమయోధ్యాం పునరాగతః |
పాణిభ్యాం మృదుపీనాభ్యాం చరణౌ పీడయిష్యతి ||

28

అభివాద్య నమస్యంతం శూరం ససుహృదం సుతమ్ |
ముదాఽస్త్రైః ప్రోక్ష్యసి పునర్మేఘరాజిరివాచలమ్ ||

29

ఆశ్వాసయంతీ వివిధైశ్చ వాక్యైః
వాక్యోపచారే కుశలాఽనవద్యా |
రామస్య తాం మాతరమేవముక్త్వా
దేవీ సుమిత్రా విరరామ రామా ||

30

నిశమ్య తల్లక్ష్మణ మాతృవాక్యమ్
రామస్య మాతుర్నరదేవపత్న్యాః |
సద్యః శరీరే విననాశ శోకః
శరద్గతః మేఘ ఇవాల్పతోయః ||

31

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే చతుశ్చత్వారింశః సర్గః ||

Ayodhya Kanda Sarga 44 Meaning In Telugu

కౌసల్య తన కుమారుడు రాముని తలచుకొని విలపిస్తూ ఉంటే పక్కనే ఉన్న సుమిత్ర ఆమెను ఓదారుస్తూ ఉంది. ఆ మాటకొస్తే సుమిత్రకుమారుడు లక్ష్మణుడు కూడా రాముని వెంట అరణ్యములకు వెళ్లాడు. కాని సుమిత్ర ఎంతో గుండె నిబ్బరంతో కౌసల్యను ఊరడించింది.

“అక్కా! కౌసల్యా! రాముడి గురించి ఏడవడం ఎందుకు? రాముడు సకల సద్గుణ సంపన్నుడు. ఎక్కడ ఉన్నా రాణించగలడు. రాముని కోసం విలపించడం తగదు. రాముడు కేవలము తన తండ్రి మాటను నిలబెట్టడానికి అరణ్యాలకు వెళ్లాడు. అది ఉత్తములు అనుసరించే మార్గము కదా. రాముడు ధర్మం నిలబెట్టాడు. ఇహ పరాలను సాధించాడు. రాముని కోసం విలపించడం వృధా!

అంతెందుకు రాముని వెంట నా కుమారుడు కూడా వెళ్లాడు. రామునికి సేవచేస్తూ కాపాడుతూఉంటాడు. రాముని గురించి భయం ఎందుకు. పైగా సీత. సుకుమారి. ఎండకన్నెరుగనిది. సుఖములు తప్ప దు:ఖము అంటే ఏమిటో తెలియనిది. అటువంటి సీత కూడా రాముని వెంట అడవులకు వెళ్లింది కదా. రాముడు ధర్మమును సత్యమును నమ్ముకున్నాడు. రాముని కీర్తి ప్రతిష్టలు ముల్లోకములలోనూ వ్యాపిస్తుంది. దీనికి సంతోషించాలి గానీ దుఃఖిస్తావెందుకు.

సూర్యుడు తన కిరణములతో రాముని శోషింపచేయడు. గాలి మెల్లగా వీస్తూ నీ కుమారునికి హాయి చేకూరుస్తుంది. రాత్రివేళలలో చంద్రుడు తనకిరణములతో రామునికి ఆహ్లాదము కలిగిస్తాడు. పైగా రామునికి ఎంతో దివ్య అస్త్ర సంపద ఉంది. కాబట్టి రామునికి శత్రు భయము లేదు. రాముడు అడవిలో ఉన్నా అంత:పురములో ఉన్నట్టే భావించు. పైగా రాముడు ధైర్యానికి శౌర్యానికి పెట్టింది పేరు. ఇంక రామునికి తిరుగేముంది. రాముడు ఇట్టే వనవాసమును ముగించుకొని రాగలడు.

ఓ కౌసల్యా! ఇంకా రాముడు సూర్యునికి సూర్యుని వంటి వాడు. అలాగే అగ్నికి అగ్ని, సంపదకు సంపద, కీర్తికి కీర్తి, ఓర్పుకు ఓర్పు, దేవతలకు దేవత, భూతములకు భూతము కాగల సమర్థత కలవాడు. (సాధారణంగా మానవులను కుంగదీసేది,దౌర్బల్యాన్ని కలుగజేసేది భయం. కాని రాముడు, అటువంటి భయానికే భయం పుట్టించే వాడు అని అర్ధము). అటువంటి రామునికి అడవీ అంతఃపురమూ ఒకటే కదా!

నువ్వు చూస్తూ ఉండు. 14 సంవత్సరాలు క్షణంలో గడిచిపోతాయి. రాముడు తన పక్కన సీతను కూర్చోబెట్టుకొని, రాజ్యలక్ష్మిని వరిస్తాడు. రాముడికి శక్యంకానిది పొందలేనిది ఈలోకంలో ఏదీలేదు. అన్నీ రామునికి పాదాక్రాంతమవుతాయి. అంతే కాకుండా ధనుర్బాణములు ధరించి లక్ష్మణుడు ముందు నడుస్తూ ఉండగా రామునికి అసాధ్యముఅనేది ఏముంటుంది చెప్పు.

ఓ కౌసల్యా! నేనుసత్యము చెబుతున్నాను. రాముడు తిరిగి అయోధ్యలో అడుగు పెట్టిననాడు నువ్వు ఎదురేగి రామునికి హారతులు ఇచ్చి నీ వెంట తీసుకొని వస్తావు. అయోధ్యకు తిరిగి వచ్చిన తరువాత రాముడు తన స్నేహితులతో నీ దగ్గరకు వచ్చి నీకు నీ నమస్కరించిననాడు, నీవు ఆనందపడేరోజు…. రాముడు వచ్చి నీ పాదములను పట్టుకొని ఆశీర్వదించమని అడిగే రోజు… ఆ రోజు ఎంతో దూరంలో లేదు.

అయినా నువ్వు మా అందరికీ పెద్దదానివి. నువ్వు మా అందరినీ ఓదార్చాల్సింది పోయి, నువ్వే ఇలా బాధ పడితే మా గతి ఏమిటి. రాముని వంటి సకల సద్గుణ సంపన్నుడైన కుమారుని కన్నందుకు నీవు జీవితాంతము సంతోషించాలి కానీ, కేవలం పదునాలుగేళ్లు వనవాసమునకే ఇంత దు:ఖించాలా! రాముని జీవిత కాలములో ఇది ఎంత. కాబట్టి నువ్వు నిశ్చింతగా ఉండు.” అని సుమిత్ర కౌసల్యను ఓదార్చింది.

సుమిత్ర ఆదరంతో చెప్పిన మాటలు విన్న కౌసల్య తన శోకమును మెల్ల మెల్లగా విడిచిపెట్టింది.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము నలుబది నాలుగవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అయోధ్యాకాండ పంచచత్వారింశః సర్గః (45) >>

Leave a Comment