Ayodhya Kanda Sarga 45 In Telugu – అయోధ్యాకాండ పంచచత్వారింశః సర్గః

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అయోధ్యాకాండ పంచచత్వారింశః సర్గ, “పౌరయాచనమ్”, రామాయణంలోని ఒక ముఖ్యమైన భాగం. ఈ సర్గలో, అయోధ్య నగర ప్రజలు రాముడిని తిరిగి రావలసిందిగా అభ్యర్థిస్తారు. రాముడు వనవాసానికి వెళ్లిపోవడం తో, అయోధ్య ప్రజలు దుఃఖంలో మునిగిపోయి, అతడిని తిరిగి తీసుకురావడం కోసం ప్రయత్నిస్తారు. వారు రాముడి నిష్కళంకత, ధర్మపరిపాలన మరియు ప్రజల పట్ల ఉన్న ప్రేమను వర్ణిస్తూ, అతడి అనువర్తితాన్ని రాముడికి విన్నవిస్తారు. ఈ సర్గలో, ప్రజలు రాముడి పట్ల ఉన్న అభిమానాన్ని, ఆరాధనను, మరియు అయోధ్య ప్రజలు ఆయనతో ఉన్న అనుబంధాన్ని స్పష్టంగా చూపుతుంది.

పౌరయాచనమ్

అనురక్తా మహాత్మానం రామం సత్యపరాక్రమమ్ |
అనుజగ్ముః ప్రయాంతం తం వనవాసాయ మానవాః ||

1

నివర్తితేఽపి చ బలాత్సుహృద్వర్గే చ రాజని |
నైవ తే సంన్యవర్తంత రామస్యానుగతా రథమ్ ||

2

అయోధ్యానిలయానాం హి పురుషాణాం మహాయశాః |
బభూవ గుణసంపన్నః పూర్ణచంద్ర ఇవ ప్రియః ||

3

స యాచ్యమానః కాకుత్స్థః స్వాభిః ప్రకృతిభిస్తదా |
కుర్వాణః పితరం సత్యం వనమేవాన్వపద్యత ||

4

అవేక్షమాణః సస్నేహం చక్షుషా ప్రపిబన్నివ |
ఉవాచ రామః స్నేహేన తాః ప్రజాస్స్వాః ప్రజా ఇవ ||

5

యా ప్రీతిర్బహుమానశ్చ మయ్యయోధ్యానివాసినామ్ |
మత్ప్రియార్థం విశేషేణ భరతే సా నివేశ్యతామ్ ||

6

స హి కళ్యాణచారిత్రః కైకేయ్యానందవర్ధనః |
కరిష్యతి యథావద్వః ప్రియాణి చ హితాని చ ||

7

జ్ఞానవృద్ధో వయోబాలో మృదుర్వీర్యగుణాన్వితః |
అనురూపః స వో భర్తా భవిష్యతి భయాపహః ||

8

స హి రాజగుణైర్యుక్తో యువరాజః సమీక్షితః |
అపి చాపి మయా శిష్టైః కార్యం వో భర్తృశాసనమ్ ||

9

న చ తప్యేద్యథా చాసౌ వనవాసం గతే మయి |
మహారాజస్తథా కార్యో మమ ప్రియచికీర్షయా ||

10

యథాయథా దాశరథిర్ధర్మ ఏవ స్థితోఽభవత్ |
తథాతథా ప్రకృతయో రామం పతిమకామయన్ ||

11

బాష్పేణ పిహితం దీనం రామః సౌమిత్రిణా సహ |
చకర్షేవ గుణైర్బద్ధ్వా జనం పునరివాసినమ్ ||

12

తే ద్విజాస్త్రివిధం వృద్ధాః జ్ఞానేన వయసౌజసా |
వయః ప్రకంపశిరసో దూరాదూచురిదం వచః ||

13

వహంతః జవనా రామం భోభో జాత్యాస్తురంగమాః |
నివర్తధ్వం న గంతవ్యం హితా భవత భర్తరి ||

14

కర్ణవంతి హి భూతాని విశేషేణ తురంగమాః |
యూయం తస్మాన్నివర్తధ్వం యాచనాం ప్రతివేదితాః ||

15

ధర్మతః స విశుద్ధాత్మా వీరః శుభదృఢవ్రతః |
ఉపవాహ్యస్తు వో భర్తా నాపవాహ్యః పురాద్వనమ్ ||

16

ఏవమార్తప్రలాపాంస్తాన్వృద్ధాన్ప్రలపతో ద్విజాన్ |
అవేక్ష్య సహసా రామః రథాదవతతార హ ||

17

పద్భ్యామేవ జగామాథ ససీతః సహలక్ష్మణః |
సన్నికృష్టపదన్యాసో రామః వనపరాయణః ||

18

ద్విజాతీంస్తు పదాతీంస్తాన్రామశ్చారిత్రవత్సలః |
న శశాక ఘృణాచక్షుః పరిమోక్తుం రథేన సః ||

19

గచ్ఛంతమేవ తం దృష్ట్వా రామం సంభ్రాంతచేతసః |
ఊచుః పరమసంతప్తా రామం వాక్యమిదం ద్విజాః ||

20

బ్రాహ్మణ్యం కృత్స్నమేతత్త్వాం బ్రహ్మణ్యమనుగచ్ఛతి |
ద్విజస్కంధాధిరూఢాస్త్వామ్ అగ్నయోఽప్యనుయాంత్యమీ ||

21

వాజపేయసముత్థాని ఛత్రాణ్యేతాని పశ్య నః |
పృష్ఠతోనుప్రయాతాని మేఘానివ జలాత్యయే ||

22

అనవాప్తాతపత్రస్య రశ్మిసంతాపితస్య తే |
ఏభిశ్ఛాయాం కరిష్యామః స్వైశ్ఛత్రైర్వాజపేయికైః ||

23

యా హి నః సతతం బుద్ధిర్వేదమంత్రానుసారిణీ |
త్వత్కృతే సా కృతా వత్స వనవాసానుసారిణీ ||

24

హృదయేష్వేవ తిష్ఠంతి వేదా యే నః పరం ధనమ్ |
వత్స్యంత్యపి గృహేష్వేవ దారాశ్చారిత్రరక్షితాః ||

25

న పునర్నిశ్చయః కార్యస్త్వద్గతౌ సుకృతా మతిః |
త్వయి ధర్మవ్యపేక్షే తు కిం స్యాద్ధర్మమపేక్షితుమ్ || [పథేస్థితమ్]

26

యాచితో నో నివర్తస్వ హంసశుక్లశిరోరుహైః |
శిరోభిర్నిభృతాచార మహీపతనపాంసులైః ||

27

బహూనాం వితతా యజ్ఞా ద్విజానాం య ఇహాగతాః |
తేషాం సమాప్తిరాయత్తా తవ వత్స నివర్తనే ||

28

భక్తిమంతి హి భూతాని జంగమాఽజంగమాని చ |
యాచమానేషు రామ త్వం భక్తిం భక్తేషు దర్శయ ||

29

అనుగంతుమశక్తాస్త్వాం మూలైరుద్ధతవేగినః |
ఉన్నతా వాయువేగేన విక్రోశంతీవ పాదపాః ||

30

నిశ్చేష్టాహారసంచారా వృక్షైకస్థానవిష్ఠితాః |
పక్షిణోఽపి ప్రయాచంతే సర్వభూతానుకంపినమ్ ||

31

ఏవం విక్రోశతాం తేషాం ద్విజాతీనాం నివర్తనే |
దదృశే తమసా తత్ర వారయంతీవ రాఘవమ్ ||

32

తతః సుమంత్రోఽపి రథాద్విముచ్య
శ్రాంతాన్హయాన్సంపరివర్త్య శ్రీఘ్రమ్ |
పీతోదకాంస్తోయపరిప్లుతాంగాన్
అచారయద్వై తమసావిదూరే ||

33

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే పంచచత్వారింశః సర్గః ||

Ayodhya Kanda Sarga 45 Meaning In Telugu

అయోధ్యలో పరిస్థితి ఇలా ఉంట, అక్కడ రాముడు రథము మీద అరణ్యములకు వెళుతున్నాడు. రాముని రథం వెంట ఎంతో మంది అయోధ్యాపౌరులు రాముని అనుసరిస్తున్నారు. రాముడు ఎంత చెప్పినా వారు వినకుండా ఆయన రథమును వెంబడిస్తున్నారు. రాముని మీద వారికి ఉన్న ప్రేమ వారిని రాముని నుండి విడదీయ లేక పోయింది. తన తండ్రి మాట నిలబెట్ట డానికి రాముడు అడవులకు వెళుతున్నప్పుడు, రామునికి తోడుగా మేము కూడా అడవులకు ఎందుకు వెళ్లకూడదు అని వారు అనుకున్నట్టున్నారు.

తన వెంటవచ్చు అయోధ్యాపౌరులను చూచి రాముడు తన రథమును ఆపించాడు. వారిని చూచి ఇలా అన్నాడు. “ఓ అయోధ్యా ప్రజలారా! మీరు నా మీద చూపుతున్న ప్రేమాభిమానములకు నాకు ఎంతో ఆనందంగా ఉంది. కాని నాది ఒక కోరిక. నా మీద మీరు
చూపుతున్న ప్రేమాభిమానములు ఇదేరీతిలో భరతుని మీద కూడా చూపించండి. అలా చేస్తే నాకు ఇంకా ఆనందం కలుగుతుంది.

భరతుడు నా తమ్ముడు. సద్గుణవంతుడు. నా కాన్న బాగుగా రాజ్యమును పరిపాలించగలడు. నా తమ్ముడు భరతుడు వయసులో నా కన్నా చిన్న వాడయినా జ్ఞానములో నా కన్నా పెద్దవాడు. నా కంటే పరాక్రమ వంతుడు. అయోధ్యకు తగిన రాజు అనిపించుకుంటాడు. భరతుడు అన్నివిధములా రాజు కాదగినవాడు.

మనందరికీ ప్రభువు దశరథమహారాజు. ఆయన తన కుమారుడు భరతుని యువరాజుగా ప్రకటించాడు. మనకు మన మహారాజు మాటలను మన్నించాలి. నేను సంతోషంగా అడవులకు వెళ్లాలంటే మీరందరూ మన మహారాజు దశరథుడు కంటనీరు పెట్టకుండా చూచుకోవాలి. కాబట్టి మీరందరూ వెనుకకు మరలండి.” అని అన్నాడు రాముడు.

కాని వారు రాముని మాట వినలేదు. మౌనంగా ఉన్నారు. కొంతమంది వృద్ధ బ్రాహ్మణులు రాముని చూచి ఇలాఅన్నారు. “రామా! నీవు అరణ్యములకు వెళ్లవద్దు. రాముని రథమునకు కట్టిన ఓ హయములారా! మీరు ముందుకు సాగకండి. మన రాముని తిరిగి అయోధ్యకు తీసుకొని రండి. ధర్మాత్ముడు, సకల సద్గుణ సంపన్నుడు అయిన రాముని మీరు అయోధ్యకు తీసుకొని రావలెనే గానీ, అడవులకు తీసుకొని వెళ్లకూడదు.” అని దీనంగా పలికారు.

వారి దీనాలాపములను విన్న రాముడు రథం దిగాడు. సీతను, లక్ష్మణుని కూడా రథం దిగమన్నాడు. నడుచుకుంటూ అడవులకు వెళుతున్నాడు. అయోధ్యావాసులు కూడా ఆయన వెంట నడిచివెళుతున్నారు. వారు రామునితో ఇలా అన్నారు.

“ఓ రామా! మేమంతా బ్రాహ్మణులము. నీవు బ్రాహ్మణులకు హితుడవు. అందుకని మేమంతా నీ వెంట వచ్చుచున్నాము. మేము ప్రతిరోజూ అర్చించే అగ్నులను మా వెంట మోసుకొని వస్తున్నాము. మేము వాజపేయము చేసినప్పుడు మాకు లభించిన తెల్లని గొడుగులు(ఛత్రములు) కూడా మా వెంట వస్తున్నాయి. ప్రస్తుతము నీకు ఛత్రము లేదు. నీవు మా ఛత్రముల నీడలో విశ్రాంతి తీసుకో.

మాకు వేదాధ్యయనము, వేద పఠనము తప్ప మరోవ్యాపకము లేదు. ప్రస్తుతము నీ వెంటవచ్చుటయే మాకు వ్యాపకము. నీవు ఎక్కడ ఉంటే మేము అక్కడ ఉంటాము. మా వెంట వేదములు ఉంటాయి. మా భార్యలు మమ్ములను తలుచుకుంటూ అయోధ్యలో ఉండగలరు. నీవు అయోధ్యకు తిరిగి రావలెనని మా నిర్ణయము. మా నిర్ణయము ధర్మసమ్మతము. ధర్మసమ్మతమైన మా నిర్ణయమును ధర్మాత్ముడవైన నీవే మన్నించకపోతే వేరువాళ్లు ఎవరు మన్నిస్తారు. మేమందరమూ వృద్ధులము. మా వెంట్రుకలు తెల్లబడ్డాయి. మా ఆశలు కూడా తెల్లబడనీయకు. అయోధ్యకు మరలిరా!

నీ వెంబడి వచ్చుచున్న బ్రాహ్మణులు చాలామంది ఎన్నో యజ్ఞములు మొదలు పెట్టారు. వారందరూ తమ తమ యజ్ఞములను వదిలి వచ్చారు. వారు తాము మొదలు పెట్టిన యజ్ఞములు పూర్చిచేయాలంటే నీవు అయోధ్యకు తిరిగిరావాలి. వారు నీ వెంట అడవులకు వస్తే, వారు తాము మొదలు పెట్టిన యజ్ఞములను ఎలా పూర్తి చేస్తారు.

ఓ రామా! మేమే కాదు. అయోధ్యలో ఉన్న చరాచరములు, సకల జీవరాసులు అన్నీ నీ రాక కొరకు ఎదురుచూస్తున్నాయి.

రామా! ఆ వృక్షములను చూడు. అవి కూడా నీ వెంట అడవులకు రావలెనని ఎంతో కుతూహలముగా ఉన్నాయి కాని వాటి వేళ్లు భూమిలో పాతుకొని పోవడం వల్ల కదలలేక, నీకోసం విలపిస్తున్నాయి. ఆ వృక్షములే కాదు, ఆ వృక్షముల మీద గూళ్లు కట్టుకొని నవసిస్తున్న పక్షలు కూడా ఆహారము మాని నీ కోసం జాలిగా ఎదురు చూస్తున్నాయి. నిన్ను వెనుకకు మరలమని వేడుకుంటున్నాయి.”అని ఆ బ్రాహ్మణులు రాముని వెంట నడుస్తున్నారు.

రాముడు అడవులకు వెళ్లడం తనకు కూడా ఇష్టంలేదు. అన్నట్టు తమసానది వాళ్లకు అడ్డంగా వచ్చింది. అందరూ తమసా నదీ తీరము చేరుకున్నారు. సుమంత్రుడు రథమునకు కట్టిన గుర్రములను విప్పి వాటికి స్నానం చేయించి నీరు త్రాగించాడు. వాటికి తిండి పెట్టాడు.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము నలుబదిఐదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అయోధ్యాకాండ షట్చత్వారింశః సర్గః (46) >>

Leave a Comment