Ayodhya Kanda Sarga 52 In Telugu | అయోధ్యాకాండ ద్విపంచాశః సర్గః

అయోధ్యా కాండ సర్గ 52 రామాయణంలో ముఖ్యమైన అధ్యాయం. మరునాడు తెల్లవారింది. రాముడు లక్ష్మణుని చూచి ఇలా “లక్ష్మణా! మనము గంగానదిని దాటి ఆవలి ఒడ్డుకు చేరుకోవాలి.గుహునితో చెప్పి గంగానదిని దాటుటకు ఒక నావను సిద్ధం చేయమని చెప్పు.” అని అన్నాడు. లక్ష్మణుడు వెంటనే గుహుని పిలిచి ఒక నావను సిద్ధము చేయమని చెప్పాడు. వెంటనే గుహుడు రామలక్ష్మణులు గంగానదిని దాటుటకు ఒక నావను సిద్ధం చేసాడు. అప్పుడు రాముడు గుహునితో ఇలా అన్నాడు.

గంగాతరణమ్

ప్రభాతాయాం తు శర్వర్యాం పృథు వృక్షా మహా యశాః |
ఉవాచ రామః సౌమిత్రిం లక్ష్మణం శుభ లక్షణమ్ ||

1

భాస్కరోదయ కాలోఽయం గతా భగవతీ నిశా |
అసౌ సుకృష్ణో విహగః కోకిలస్తాత కూజతి ||

2

బర్హిణానాం చ నిర్ఘోషః శ్రూయతే నదతాం వనే |
తరామ జాహ్నవీం సౌమ్య శీఘ్రగాం సాగరంగమామ్ ||

3

విజ్ఞాయ రామస్య వచః సౌమిత్రిర్మిత్ర నందనః |
గుహమామంత్ర్య సూతం చ సోఽతిష్ఠద్భ్రాతురగ్రతః ||

4

స తు రామస్య వచనం నిశమ్య ప్రతిగృహ్య చ |
స్థపతిస్తూర్ణమాహుయ సచివానిదమబ్రవీత్ ||

5

అస్య వాహనసంయుక్తాం కర్ణగ్రాహవతీం శుభామ్ |
సుప్రతారాం దృఢాం తీర్థే శీగ్రం నావముపాహర ||

6

తం నిశమ్య సమాదేశం గుహామాత్యగణో మహాన్ | [గుహాదేశం]
ఉపోహ్య రుచిరాం నావం గుహాయ ప్రత్యవేదయత్ ||

7

తతః సప్రాంజలిర్భూత్వా గుహో రాఘవమబ్రవీత్ |
ఉపస్థితేయం నౌర్దేవ భూయః కిం కరవాణి తే ||

8

తవామరసుతప్రఖ్య తర్తుం సాగరగాం నదీమ్ |
నౌరియం పురుషవ్యాఘ్ర తాం త్వమారోహ సువ్రత! ||

9

అథోవాచ మహాతేజాః రామో గుహమిదం వచః |
కృతకామోఽస్మి భవతా శీఘ్రమారోప్యతామితి ||

10

తతః కలాపాన్ సన్నహ్య ఖడ్గౌ బద్ధ్వా చ ధన్వినౌ |
జగ్మతుర్యేన తౌ గంగాం సీతయా సహ రాఘవౌ ||

11

రామమేవ తు ధర్మజ్ఞముపగమ్య వినీతవత్ |
కిమహం కరవాణీతి సూతః ప్రాంజలిరబ్రవీత్ ||

12

తతోఽబ్రవీద్దాశరథిః సుమంత్రమ్ |
స్పృశన్ కరేణోత్తమదక్షిణేన |
సుమంత్ర శీఘ్రం పునరేవ యాహి |
రాజ్ఞః సకాశే భవచాప్రమత్తః ||

13

నివర్తస్వ ఇత్యువాచైనమేతావద్ధి కృతం మమ |
రథం విహాయ పద్భ్యాం తు గమిష్యామి మహావనమ్ ||

14

ఆత్మానం తు అభ్యనుజ్ఞాతమవేక్ష్యార్తః స సారథిః |
సుమంత్రః పురుష వ్యాఘ్రమైక్ష్వాకమిదమబ్రవీత్ ||

15

నాతిక్రాంతమిదం లోకే పురుషేణేహ కేనచిత్ |
తవ సభ్రాతృ భార్యస్య వాసః ప్రాకృతవద్వనే ||

16

న మన్యే బ్రహ్మ చర్యేఽస్తి స్వధీతే వా ఫలోఽదయః |
మార్దవార్జవయోః వాఽపి త్వాం చేద్వ్యసనమాగతమ్ ||

17

సహ రాఘవ వైదేహ్యా భ్రాత్రా చైవ వనే వసన్ |
త్వం గతిం ప్రాప్స్యసే వీర త్రీన్ లోకాంస్తు జయన్నివ ||

18

వయం ఖలు హతా రామ యే తయాఽప్యుపవంచితాః |
కైకేయ్యా వశమేష్యామః పాపాయా దుఃఖ భాగినః ||

19

ఇతి బ్రువన్నాత్మసమం సుమంత్రః సారథిస్తదా |
దృష్ట్వా దూరగతం రామం దుఃఖార్తః రురుదే చిరమ్ ||

20

తతస్తు విగతే బాష్పే సూతం స్పృష్టోదకం శుచిమ్ |
రామస్తు మధురం వాక్యం పునః పునరువాచ తమ్ ||

21

ఇక్ష్వాకూణాం త్వయా తుల్యం సుహృదం నోపలక్షయే |
యథా దశరథో రాజా మాం న శోచేత్తథా కురు ||

22

శోకోపహత చేతాశ్చ వృద్ధశ్చ జగతీ పతిః |
కామ భారావసన్నశ్చ తస్మాదేతద్బ్రవీమి తే ||

23

యద్యదాజ్ఞాపయేత్కించిత్ స మహాత్మా మహీపతిః |
కైకేయ్యాః ప్రియకామార్థం కార్యం తదవికాంక్షయా ||

24

ఏతదర్థం హి రాజ్యాని ప్రశాసతి నరేశ్వరాః |
యదేషాం సర్వకృత్యేషు మనో న ప్రతిహన్యతే ||

25

యద్యథా స మహారాజో నాలీకమధిగచ్ఛతి |
న చ తామ్యతి దుఃఖేన సుమంత్ర కురు తత్తథా ||

26

అదృష్టదుఃఖం రాజానం వృద్ధమార్యం జితేంద్రియమ్ |
బ్రూయాస్త్వమభివాద్యైవ మమ హేతోరిదం వచః ||

27

నైవాహమనుశోచామి లక్ష్మణో న చ మైథిలీ |
అయోధ్యాయాశ్చ్యుతాశ్చేతి వనే వత్స్యామహేతి చ ||

28

చతుర్దశసు వర్షేషు నివృత్తేషు పునః పునః |
లక్ష్మణం మాం చ సీతాం చ ద్రక్ష్యసి క్షిప్రమాగతాన్ ||

29

ఏవముక్త్వా తు రాజానం మాతరం చ సుమంత్ర మే |
అన్యాశ్చ దేవీః సహితాః కైకేయీం చ పునః పునః ||

30

ఆరోగ్యం బ్రూహి కౌసల్యామథ పాదాభివందనమ్ |
సీతాయా మమ చాఽఽర్యస్య వచనాల్లక్ష్మణస్య చ ||

31

బ్రూయాశ్చ హి మహారాజం భరతం క్షిప్రమానయ |
ఆగతశ్చాపి భరతః స్థాప్యో నృపమతే పదే ||

32

భరతం చ పరిష్వజ్య యౌవరాజ్యేఽభిషిచ్య చ |
అస్మత్సంతాపజం దుఃఖం న త్వామభిభవిష్యతి ||

33

భరతశ్చాపి వక్తవ్యో యథా రాజని వర్తసే |
తథా మాతృషు వర్తేథాః సర్వాస్వేవావిశేషతః ||

34

యథా చ తవ కైకేయీ సుమిత్రా చ విశేషతః |
తథైవ దేవీ కౌసల్యా మమ మాతా విశేషతః ||

35

తాతస్య ప్రియకామేన యౌవరాజ్యమవేక్షతా |
లోకయోరుభయోః శక్యం నిత్యదా సుఖమేధితుమ్ ||

36

నివర్త్యమానో రామేణ సుమంత్రః శోకకర్శితః |
తత్సర్వం వచనం శ్రుత్వా స్నేహాత్ కాకుత్స్థమబ్రవీత్ ||

37

యదహం నోపచారేణ బ్రూయాం స్నేహాదవిక్లబః |
భక్తిమానితి తత్తావద్వాక్యం త్వం క్షంతుమర్హసి ||

38

కథం హి త్వద్విహీనోఽహం ప్రతియాస్యామి తాం పురీమ్ |
తవ తావద్వియోగేన పుత్ర శోకాకులామివ ||

39

సరామమపి తావన్మే రథం దృష్ట్వా తదా జనః |
వినా రామం రథం దృష్ట్వా విదీర్యేతాపి సా పురీ ||

40

దైన్యం హి నగరీ గచ్చేద్దృష్ట్వా శూన్యమిమం రథమ్ |
సూతావశేషం స్వం సైన్యం హత వీరమివాహవే ||

41

దూరేఽపి నివసంతం త్వాం మానసేనాగ్రతః స్థితమ్ |
చింతయంత్యోఽద్య నూనం త్వాం నిరాహారాః కృతాః ప్రజాః ||

42

దృష్టం తద్ధి త్వయా రామ యాదృశం త్వత్ప్రవాసనే |
ప్రజానాం సఙ్కులం వృత్తం త్వచ్ఛోకక్లాంతచేతసామ్ ||

43

ఆర్తనాదో హి యః పౌరైః ముక్తస్త్వద్విప్రవాసనే |
సరథం మాం నిశామ్యైవ కుర్యుః శత గుణం తతః ||

44

అహం కిం చాపి వక్ష్యామి దేవీం తవ సుతః మయా |
నీతోఽసౌ మాతులకులం సంతాపం మా కృథా ఇతి ||

45

అసత్యమపి నైవాహం బ్రూయాం వచనమీదృశమ్ |
కథమప్రియమేవాహం బ్రూయాం సత్యమిదం వచః ||

46

మమ తావన్నియోగస్థాస్త్వద్బంధు జనవాహినః |
కథం రథం త్వయా హీనం ప్రవక్ష్యంతి హయోత్తమాః ||

47

తన్న శక్ష్యామ్యహం గంతుమయోధ్యాం త్వదృతేఽనఘ |
వనవాసానుయానాయ మామనుజ్ఞాతుమర్హసి ||

48

యది మే యాచమానస్య త్యాగమేవ కరిష్యసి |
సరథోఽగ్నిం ప్రవేక్ష్యామి త్యక్త మాత్రైహ త్వయా ||

49

భవిష్యంతి వనే యాని తపోవిఘ్నకరాణి తే |
రథేన ప్రతిబాధిష్యే తాని సత్త్వాని రాఘవ ||

50

తత్కృతేన మయాఽవాప్తం రథచర్యాకృతం సుఖమ్ |
ఆశంసే త్వత్కృతేనాహం వనవాసకృతం సుఖమ్ ||

51

ప్రసీదేచ్ఛామి తేఽరణ్యే భవితుం ప్రత్యనంతరః |
ప్రీత్యాఽభిహితమిచ్ఛామి భవ మే పత్యనంతరః ||

52

ఇమే చాపి హయా వీర యది తే వనవాసినః |
పరిచర్యాం కరిష్యంతి ప్రాప్స్యంతి పరమాం గతిమ్ ||

53

తవ శుశ్రూషణం మూర్ధ్నా కరిష్యామి వనే వసన్ |
అయోధ్యాం దేవలోకం వా సర్వథా ప్రజహామ్యహమ్ ||

54

న హి శక్యా ప్రవేష్టుం సా మయా అయోధ్యా త్వయా వినా |
రాజధానీ మహేంద్రస్య యథా దుష్కృతకర్మణా ||

55

వనవాసే క్షయం ప్రాప్తే మమైష హి మనోరథః |
యదనేన రథేనైవ త్వాం వహేయం పురీం పునః ||

56

చతుర్దశ హి వర్షాణి సహితస్య త్వయా వనే |
క్షణ భూతాని యాస్యంతి శతసంఖ్యాఽన్యతోఽన్యథా ||

57

భృత్యవత్సల తిష్ఠంతం భర్తృపుత్రగతే పథి |
భక్తం భృత్యం స్థితం స్థిత్యాం త్వం న మాం హాతుమర్హసి ||

58

ఏవం బహువిధం దీనం యాచమానం పునః పునః |
రామః భృత్యానుకంపీ తు సుమంత్రమిదమబ్రవీత్ ||

59

జానామి పరమాం భక్తిం మయి తే భర్తృవత్సల |
శృణు చాపి యదర్థం త్వాం ప్రేషయామి పురీమితః ||

60

నగరీం త్వాం గతం దృష్ట్వా జననీ మే యవీయసీ |
కైకేయీ ప్రత్యయం గచ్ఛేదితి రామః వనం గతః ||

61

పరితుష్టా హి సా దేవి వనవాసం గతే మయి |
రాజానం నాతిశంకేత మిథ్యా వాదీతి ధార్మికమ్ ||

62

ఏష మే ప్రథమః కల్పో యదంబా మే యవీయసీ |
భరతారక్షితం స్ఫీతం పుత్రరాజ్యమవాప్నుయాత్ ||

63

మమ ప్రియార్థం రాజ్ఞశ్చ సరథస్త్వం పురీం వ్రజ |
సందిష్టశ్చాసి యానర్థాన్ తాంస్తాన్ బ్రూయాస్తథా తథా ||

64

ఇత్యుక్త్వా వచనం సూతం సాంత్వయిత్వా పునః పునః |
గుహం వచనమక్లీబః రామః హేతుమదబ్రవీత్ ||

65

నేదానీం గుహ యోగ్యోఽయం వసో మే సజనే వనే |
అవశ్యం హ్యాశ్రమే వాసః కర్తవ్యస్తద్గతో విధిః ||

66

సోఽహం గృహీత్వా నియమం తపస్విజనభూషణమ్ |
హితకామః పితుర్భూయః సీతాయా లక్ష్మణస్య చ ||

67

జటాః కృత్వా గమిష్యామి న్యగ్రోధ క్షీరమానయ |
తత్క్షీరం రాజపుత్రాయ గుహః క్షిప్రముపాహరత్ ||

68

లక్ష్మణస్యాత్మనశ్చైవ రామస్తేనాకరోజ్జటాః |
దీర్ఘబాహుర్నరవ్యాఘ్రో జటిలత్వమధారయత్ ||

69

తౌ తదా చీరవసనౌ జటామండలధారిణౌ |
అశోభేతామృషిసమౌ భ్రాతరౌ రామరక్ష్మణౌ ||

70

తతః వైఖానసం మార్గమాస్థితః సహలక్ష్మణః |
వ్రతమాదిష్టవాన్ రామః సహాయం గుహమబ్రవీత్ ||

71

అప్రమత్తః బలే కోశే దుర్గే జనపదే తథా |
భవేథా గుహ రాజ్యం హి దురారక్షతమం మతమ్ ||

72

తతస్తం సమనుజ్ఞాయ గుహమిక్ష్వాకునందనః |
జగామ తూర్ణమవ్యగ్రః సభార్యః సహలక్ష్మణః ||

73

స తు దృష్ట్వా నదీతీరే నావమిక్ష్వాకునందనః |
తితీర్షుః శీఘ్రగాం గంగామిదం లక్ష్మణమబ్రవీత్ ||

74

ఆరోహ త్వం నరవ్యాఘ్ర స్థితాం నావమిమాం శనైః |
సీతాం చారోపయాన్వక్షం పరిగృహ్య మనస్వినీమ్ ||

75

స భ్రాతుః శాసనం శృత్వా సర్వమప్రతికూలయన్ |
ఆరోప్య మైథిలీం పూర్వమారురోహాత్మవాంస్తతః ||

76

అథారురోహ తేజస్వీ స్వయం లక్ష్మణపూర్వజః |
తతో నిషాదాధిపతిర్గుహో జ్ఞాతీనచోదయత్ ||

77

రాఘవోఽపి మహాతేజాః నావమారుహ్య తాం తతః |
బ్రహ్మవత్ క్షత్రవచ్చైవ జజాప హితమాత్మనః ||

78

ఆచమ్య చ యథాశాస్త్రం నదీం తాం సహ సీతయా |
ప్రాణమత్ప్రీతిసంహృష్టో లక్ష్మణశ్చామితప్రభః ||

79

అనుజ్ఞాయ సుమంత్రం చ సబలం చైవ తం గుహమ్ |
ఆస్థాయ నావం రామస్తు చోదయామాస నావికాన్ ||

80

తతస్తైశ్చోదితా సా నౌః కర్ణధారసమాహితా |
శుభస్ఫ్యవేగాభిహతా శీఘ్రం సలిలమత్యగాత్ ||

81

మధ్యం తు సమనుప్రాప్య భాగీరథ్యాస్త్వనిందితా |
వైదేహీ ప్రాంజలిర్భూత్వా తాం నదీమిదమబ్రవీత్ ||

82

పుత్రో దశరథస్యాయం మహారాజస్య ధీమతః |
నిదేశం పాలయత్వేమం గంగే త్వదభిరక్షితః ||

83

చతుర్దశ హి వర్షాణి సమగ్రాణ్యుష్య కాననే |
భ్రాత్రా సహ మయా చైవ పునః ప్రత్యాగమిష్యతి ||

84

తతస్త్వాం దేవి సుభగే క్షేమేణ పునరాగతా |
యక్ష్యే ప్రముదితా గంగే సర్వకామసమృద్ధినీ ||

85

త్వం హి త్రిపథగా దేవి బ్రహ్మలోకం సమీక్షసే |
భార్యా చోదధి రాజస్య లోకేఽస్మిన్ సంప్రదృశ్యసే ||

86

సా త్వాం దేవి నమస్యామి ప్రశంసామి చ శోభనే |
ప్రాప్తరాజ్యే నరవ్యాఘ్రే శివేన పునరాగతే ||

87

గవాం శతసహస్రం చ వస్త్రాణ్యన్నం చ పేశలమ్ |
బ్రాహ్మణేభ్యః ప్రదాస్యామి తవ ప్రియచికీర్షయా ||

88

సురాఘటసహస్రేణ మాంసభూతౌదనేన చ |
యక్ష్యే త్వాం ప్రయతా దేవి పురీం పునరుపాగతా ||

89

యాని త్వత్తీరవాసీని దైవతాని వసంతి చ |
తాని సర్వాణి యక్ష్యామి తీర్థాన్యాయతనాని చ ||

90

పునరేవ మహాబాహుర్మయా భ్రాత్రా చ సంగతః |
అయోధ్యాం వనవాసాత్తు ప్రవిశత్వనఘోఽనఘే ||

91

తథా సంభాషమాణా సా సీతా గంగామనిందితా |
దక్షిణా దక్షిణం తీరం క్షిప్రమేవాభ్యుపాగమత్ ||

92

తీరం తు సమనుప్రాప్య నావం హిత్వా నరర్షభః |
ప్రాతిష్ఠత సహ భ్రాత్రా వైదేహ్యా చ పరంతపః ||

93

అథాబ్రవీన్మహాబాహుః సుమిత్రానంద వర్ధనమ్ |
భవ సంరక్షణార్థాయ సజనే విజనేఽపి వా ||

94

అవశ్యం రక్షణం కార్యమదృష్టే విజనే వనే |
అగ్రతః గచ్ఛ సౌమిత్రే సీతా త్వామనుగచ్ఛతు ||

95

పృష్ఠతోఽహం గమిష్యామి త్వాం చ సీతాం చ పాలయన్ |
అన్యోన్యస్యేహ నో రక్షా కర్తవ్యా పురుషర్షభ ||

96

న హి తావదతిక్రాంతా సుకరా కాచన క్రియా |
అద్య దుఃఖం తు వైదేహీ వనవాసస్య వేత్స్యతి ||

97

ప్రనష్టజనసంబాధం క్షేత్రారామవివర్జితమ్ |
విషమం చ ప్రపాతం చ వనం హ్యద్య ప్రవేక్ష్యతి ||

98

శృత్వా రామస్య వచనం ప్రతిస్థే లక్ష్మణోఽగ్రతః |
అనంతరం చ సీతాయాః రాఘవో రఘునందనః ||

99

గతం తు గంగాఽపరపారమాశు
రామం సుమంత్రః ప్రతతం నిరీక్ష్య |
అధ్వ ప్రకర్షాద్వినివృత్త దృష్టిః
ముమోచ బాష్పం వ్యథితస్తపస్వీ ||

100

స లోకపాలప్రతిమప్రభావవాన్
తీర్త్వా మహాత్మా వరదో మహానదీమ్ |
తతః సమృద్ధాన్ శుభసస్యమాలినః
క్రమేణ వత్సాన్ ముదితానుపాగమత్ ||

101

తౌ తత్ర హత్వా చతురః మహామృగాన్
వరాహమృశ్యం పృషతం మహారురుమ్ |
ఆదాయ మేధ్యం త్వరితం బుభుక్షితౌ|
వాసాయ కాలే యయతుర్వనః పతిమ్ ||

102

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే ద్విపంచాశః సర్గః ||

Ayodhya Kanda Sarga 52 Meaning In Telugu

మరునాడు తెల్లవారింది. రాముడు లక్ష్మణుని చూచి ఇలా “లక్ష్మణా! మనము గంగానదిని దాటి ఆవలి ఒడ్డుకు చేరుకోవాలి.గుహునితో చెప్పి గంగానదిని దాటుటకు ఒక నావను సిద్ధం చేయమని చెప్పు.” అని అన్నాడు. లక్ష్మణుడు వెంటనే గుహుని పిలిచి ఒక నావను సిద్ధము చేయమని చెప్పాడు. వెంటనే గుహుడు రామలక్ష్మణులు గంగానదిని దాటుటకు ఒక నావను సిద్ధం చేసాడు. అప్పుడు రాముడు గుహునితో ఇలా అన్నాడు.

“మిత్రమా! నన్ను నావను ఎక్కించుము” అని అన్నాడు. గుహుడు రామలక్ష్మణులను సీతను నావ ఉన్న ప్రదేశమునకు తీసుకొని వెళుతున్నాడు. అప్పుడు సుమంత్రుడు రాముని చూచి ఇలాఅన్నాడు. “రామా! మీరు గంగానదిని దాటి ఆవల ఒడ్డుకు వెళుతున్నారు. నేనేమి చేయాలి. సెలవివ్వండి.” అని అడిగాడు. రాముడు సుమంత్రుని వీపుమీద చేయి వేసి ఆప్యాయంగా అన్నాడు.

నిమిరి “సుమంత్రా! నీవు అయోధ్యకు తిరిగి పొమ్ము. మా తండ్రి దశరథుని జాగ్రత్తగా చూచుకొమ్ము. నీవు చేసిన సాయమునకు కృతజ్ఞుడను. ఇంక నేను కాలి నడకన అరణ్యములలోకి వెళ్లెదను. నీవు అయోధ్యకు వెళ్లుము.” అని అన్నాడు రాముడు.
అప్పుడు సుమంత్రుడు రాముని చూచి ఇలాఅన్నాడు.

“రామా! అయోధ్యకు రాజువై ఉండి కూడా, నీవు సామాన్యుని వలె అడవులలో తిరుగుతున్నావు. తండ్రి ఆజ్ఞప్రకారము ఇటువంటి పని నీవు మాత్రమే చేయగల సమర్థుడవు. కాని నీకు వచ్చిన కష్టము సామాన్యమైనది కాదు. జీవితములో ఇలాంటి కష్టములు కూడా సంభవిస్తుంటే ఇంక వేదాధ్యయనము చేసి గానీ, మంచి ప్రవర్తన కలిగి ఉండి గానీ ప్రయోజనమేమి.

రామా! నీవు చేసిన వనవాసము వృధాపోదు. ఈవనవాసమునకు ప్రతిఫలముగా నీకు సద్గతులు లభిస్తాయి. కాని మేమే దురదృష్ట వంతులము. నిన్ను అడవుల పాలుచేసిన ఆ కైక చేతి కింద బ్రతుక వలసిన దౌర్భాగ్య ము పట్టినది. ఏం చేస్తాము.” అని రాముని చూచి ఏడ్చాడు సుమంత్రుడు.

రాముడు సుమంత్రుని చూచి ఇలా అన్నాడు. “సుమంత్రా! అన్ని తెలిసినవాడవు నీవే ఇలా దుఃఖిస్తే ఎలాగ. మా ఇక్ష్వాకు వంశమునకు, ముఖ్యంగా మా తండ్రిగారికి నీవు ఆప్తుడవు. కాబట్టి నీవు మా తండ్రిగారి మంచి చెడ్డలు చూడాలి కదా. ఆ కైకను సంతోషపెట్టడానికి మా తండ్రిగారు ఏమి చెప్పినా, ఆయన మనస్సు బాధపడ కుండా నీవు ఆపనులు అన్నీ చేయాలి కదా! ప్రస్తుతము దశరథుడు అయోధ్యకు రాజు ఆయన మాట పాలించడం మన అందరి కర్తవ్యము. దశరథమహారాజు అనుచితమైన పనులు చెప్పినా

అవి చేయడం మన కర్తవ్యము. కాబట్టి నీవు అయోధ్యకు పోయి దశరథ మహారాజుకు, నేను నమస్కరించినట్టుగా చెప్పి, ఇంకా నా మాటలుగా ఇలా చెప్పు. “తండ్రిగారూ! నేను గానీ, లక్ష్మణుడు గానీ, సీత గానీ, మేము అడవులలో నివసించవలసి వచ్చినదే అని ఏ మాత్రమూ బాధపడటం లేదు.

అరణ్యవాసము పదునాలుగుసంవత్సరములు పూర్తిచేసుకొని మేము అయోధ్యకు తిరిగి వస్తాము. అప్పుడు మేమందరమూ నీ కళ్ల ఎదుటనే ఉంటాము.” అని నా మాటగా మా తండ్రిగారికి చెప్పు.
అలాగే మాతల్లి కౌసల్యను, కైకను, ఇతర తల్లుల యోగక్షేమము లను అడిగినట్టు చెప్పు.

నేను, సీత, లక్ష్మణుడు మా తల్లి కౌసల్యకు పాదాభి వందనము చేసామని చెప్పు. మా తండ్రిగారికి మేమందరమూ పాదాభివందనము చేసామని చెప్పు. వీలైనంత త్వరగా మా తమ్ముడు భరతుని తీసుకొని వచ్చి అయోధ్యకు రాజుగా అభిషేకము చేయమని నామాటగా మా తండ్రిగారికి చెప్పు. రాజ్యాభిషిక్తుడు అయిన తరువాత భరతునితో ఈ విధంగా నా మాటగా చెప్పు.

“భరతా! నీకు నీ తల్లి కైక ఎలాగో. నా తల్లి కౌసల్య, లక్ష్మణుని తల్లి సుమిత్రకూడా అలాగే. మన తండ్రిగారి కోరిక అనుసరించి నీవు అయోధ్యకు పట్టాభిషిక్తుడవై ఇహపరములలో సుఖాలు అనుభవించు.” ఈ విధంగా భరతునికి చెప్పు. సుమంత్రా! ఇంక నీవు అయోధ్యకు బయలు దేరు.” అని అన్నాడు.

రాముడు చెప్పి మాటలన్నీ విన్న సుమంత్రుడి దుఃఖానికి అంతులేదు. రామునితో ఇలా అన్నాడు. “రామా! నేను నీ అనుచరుడను. భక్తుడను. కాని, నీవు చెప్పిన పనులన్నీ నేను చేయలేను. నన్ను క్షమించు. నిన్ను ఈ అడవులలో విడిచి పెట్టి నేను ఒంటరిగా అయోధ్యకు వెళ్లలేను. రాముడు నా రథము మీద అడవులకు వస్తున్నప్పుడు, అయోధ్యా వాసులు ఆ రథం వెంట పరుగెత్తి ఎంతో దు:ఖించారు.

ఇప్పుడు రాముడు లేకుండా నేను రథాన్ని మాత్రం అయోధ్యకు తీసుకొని వెళితే వారి గుండెలు బద్దలవుతాయి. ఎందుకంటే అయోధ్యావాసుల గుండెల్లో నీవు కొలువుదీరి ఉన్నావు. వారు దూరంగా ఉన్నా అనుక్షణం నిన్ను తలచుకుంటూనే ఉంటారు. ఓ రామా! నీవు అరణ్యమునకు నారథము మీద వచ్చునప్పుడు అయోధ్యాపౌరులు ఎంతగా ఏడ్చారో, ఇప్పుడు నీవు లేకుండా వచ్చిన రథమును చూచి అంత కన్నా ఎక్కువ ఏడుస్తారు. కాబట్టి నీవు లేని రథమును నేను అయోధ్యకు తీసుకొని వెళ్లలేను.

అది సరే! నేను కౌసల్య వద్దకు పోయి ఏమని చెప్ప మంటావు? నీ కుమారుని అరణ్యములలో విడిచివచ్చాను అని చెప్పమంటావా! అది నా వల్లకాదు. ఆమాట చెప్పి నీ తల్లిని మరింత దుఃఖపెట్టలేను. కాబట్టి నేను అయోధ్యకు తిరిగి వెళ్లలేను. నీ వెంటనే ఇక్కడే ఉంటాను. అలా కాకుండా నన్ను వదిలిపెట్టి నీవు వెళ్లిపోతే, నేను ఇక్కడే చితి పేర్చుకొని అగ్నిలో దూకుతాను. ఓ రామా! నేను నీకు ఎలాంటి ఇబ్బంది కలిగించను. నీకు సాయంగాఉంటాను.

అనువైన మార్గములలో నిన్ను రథం మీద తీసుకొని వెళతాను. ఇంతకాలము నీవు ఎక్కిన రథము తోలాను. ఇప్పుడు నీ వెంట ఉండి నీతో వనవాససుఖము అనుభవిస్తాను. ఓ రామా! నేనే కాదు. నీకు సేవచేసిన ఈ హయములు కూడా ఉత్తమ గతులు పొందగలవు. నాకు స్వర్గలోక సుఖములు కూడా వద్దు.

నీతోపాటు అరణ్యములలో ఉంటాను. నీవు లేని అయోధ్యలో ఉండలేను. వనవాసము పూర్తి అయిన తరువాత మనమందరమూ ఇదే రథము మీద అయోధ్యకు పోదాము. ఓ రామా! నీ వెంట ఉంటే ఈ పదునాలుగు సంవత్సరములు క్షణాల్లా గడిచిపోతాయి. కాబట్టి నన్ను నీ వెంట ఉండేటట్టు అనుగ్రహించు.” అని వేడుకున్నాడు సుమంత్రుడు.

ఆ మాటలువిన్న రాముడు సుమంత్రునితో ఇలా అన్నాడు. “నీకు నా మీద ఉన్న భక్తి, గౌరవము నాకు తెలియవా చెప్పు. అయినా నిన్ను అయోధ్యకు ఎందుకు పంపుతున్నానో తెలుసా! నేను నిజంగా వనవాసమునకు వెళ్లాను అని నీవు కైకకు చెబితే ఆమె నమ్ముతుంది. లేకపోతే మహారాజు దశరథుడు నన్ను వేరేచోటికి పంపి వనవాసము నకు పంపాను అని అబద్ధం చెప్పాడు అని అనుకుంటుంది.

కాబట్టి నీవు వెళ్లి మా వనవాసము సంగతి చెప్పి, కైక మనసులో ఉన్న శంకను పోగొట్టాలి.
నీ మాట నమ్మి కైక తన కుమారునికి పట్టాభిషేకము చేయిస్తుంది. లేకపోతే అయోధ్య అనాధగా ఉండిపోతుంది. కాబట్టి నీవు అయోధ్యకు వెళ్లక తప్పదు. అయోధ్యకు పోయి నీకు ఏమేమి

చెయ్యమని చెప్పానో అవన్నీ చేయి.” అని పలికాడు రాముడు. తరువాత గుహుని చూచి రాముడు ఇలా అన్నాడు. “మిత్రమా! నేను జనావాసములలో నివసించరాదు. కేవలము అరణ్యములలో ఆశ్రమములలో ముని వేషధారణలో నివసించాలి. కాబట్టి నేను లక్ష్మణుడు జటలు ధరించాలి. దానికి అనువగు మర్రిపాలు తెప్పించు.” అని అన్నాడు.

వెంటనే గుహుడు మర్రిపాలు తెప్పించాడు. ఆ మర్రిపాలను రాముడు లక్ష్మణుడు తమ వెంట్రుకలకు పట్టించారు. తన కేశములను పైకి ఎత్తి ముని కుమారుల వలె కట్టుకున్నారు. అప్పుడు రామక్ష్మణులు ముని కుమారులవలె శోభించారు. తరువాత రాముడు వెంటనే త్వర త్వరగా గంగానది వైపు వెళ్లాడు. సీత, లక్ష్మణుడు రాముని అనుసరించారు. అందరూ పడవను సమీపించారు.

“లక్ష్మణా! ముందు నీవు పడవలో ఎక్కి తరువాత సీతను ఎక్కించుము.” అని అన్నాడు. కాని లక్ష్మణుడు ముందు సీతను పడవలో ఎక్కించి తరువాత తాను ఎక్కాడు. తరువాత రాముడు పడవలో ఎక్కాడు. పడవ మెల్లిగా గంగానదిలో కదిలింది. రాముడు, సీత, లక్ష్మణుడు గంగానదీమతల్లికి నమస్కరించారు. రాముడు గుహునికి, సుమంత్రునికి వీడ్కోలు చెప్పాడు.

పడవ గంగానది మధ్యకు చేరుకుంది. అప్పుడు సీతాదేవి గంగానదికి నమస్కరించి ఇలా మొక్కుకుంది. “తల్లీ గంగా మాతా! నేను, రాముడు, లక్ష్మణుడు పద్నాలుగేళ్లు వనవాసము చేసి సుఖంగా తిరిగి వచ్చేట్టు దీవించు. తిరిగి వచ్చునపుడు నిన్ను పూజిస్తాను. నీదీవెనలు ఫలించి రాముడు అయోధ్యకు తిరిగి వచ్చి పట్టాభిషేకము చేసుకున్న నాడు, నీకు సంతోషము కలిగేటట్టు బ్రాహ్మణులకు లక్షలాది గోవులను, వస్త్రములను, దానంగా ఇస్తాను.

బ్రాహ్మణులకు భోజనము పెడతాను. నేను వనవాసము నుండి తిరిగి వచ్చిన తరువాత నీకు నూరు కుండలతో సురను (మద్యమును), మాంసాహారమును సమర్పించుకుంటాను. నీకే కాదు, నీ తీరమున గల సమస్త దేవాలయములలోనూ పూజలు చేయిస్తాను. మేము క్షేమంగా అయోధ్యకు తిరిగి వచ్చేట్టు దీవించు.” అని గంగా దేవికి మొక్కుకుంది సీత.

పడవ గంగానది దక్షిణ తీరమునకు చేరింది. సీతారామ లక్షణులు పడవ దిగి అడవిలోకి నడుచుకుంటూ వెళ్లారు. రాముడు లక్ష్మణుని చూచి ఇలా అన్నాడు. “లక్ష్మణా! మనము జనావాసములలో ఉన్నను, జనములు లేని ప్రదేశములో ఉన్నను, మన జాగ్రత్తలో మనం ఉండాలి. మనలను మనం రక్షించుకోవాలి. ఈ అరణ్యములో జన సంచారము కనపడటంలేదు.

వన్యమృగములనుండి మనలను మనం రక్షించుకోవాలి. అందుకని నీవు ముందు నడువు. నేను నీ వెనక నడిచెదను. మనమధ్య సీత ఉంటుంది. మనము ఇద్దరము ఒకరిని ఒకరు రక్షించుకుంటూ సీతను కూడా రక్షించాలి. లక్ష్మణా! మనకు ముందుజాగ్రత్త అవసరము. పరిస్థితి దాటిపోయిన తరువాత, చింతించి ప్రయోజనము లేదు. సీతకు వనవాసములోని కష్టముల గురించి తెలియదు. ఇంక మీదట తెలుసుకుంటుంది. సీతా! ఈ అరణ్యములలో ఉద్యానవనములు చేయి

ఉండవు. అగాధమైన లోయలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా నడవాలి.”అని అన్నాడు రాముడు. రాముడు చెప్పినట్టు లక్ష్మణుడు ముందు నడుస్తూ దారిని చూపిస్తున్నాడు. తరువాత సీత, ఆమె వెనక రాముడు నడుస్తున్నారు.
వీరి సంగతి ఇలాఉంటే అక్కడ సుమంత్రుడు, పడవ కంటికి కనపడినంతవరకూ రాముని చూస్తూ ఉన్నాడు. పడవ కనుమరుగు కాగానే, దుఃఖంతో కుమిలిపోయాడు. రథమును తీసుకొని అయోధ్యకు వెళ్లాడు.

రాముడు, సీతా లక్ష్మణులతో అడవులలో ప్రయాణం చేసి వత్సదేశము చేరుకున్నాడు. ఇంతలో చీకటి పడింది. రామ లక్ష్మణులు అడవిలో దొరికే వరాహములను, దుప్పులను, చంపి వాటి మాంసమును సేకరించారు. అందరూ ఒక పెద్ద వృక్షము మొదట విశ్రమించారు.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము ఏబది రెండవ సర్గ సంపూర్ణము ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అయోధ్యాకాండ త్రిపంచాశః సర్గః (53) >>

Leave a Comment