అయోధ్యాకాండ చతుఃషష్ఠితమః సర్గః రామాయణంలో కీలకమైన సర్గ. ఈ సర్గలో, కైకేయి మనసు వశం చేసేందుకు మంతర ప్రేరణతో, దశరథుని వద్ద రెండు వరాలు కోరుతుంది. మొదటిదిగా, భరతుడిని రాజుగా ప్రకటించాలని, రెండవదిగా రాముడిని 14 సంవత్సరాలు అరణ్యవాసానికి పంపించాలని కోరుతుంది. దశరథుడు ఈ శోకంతో కృంగిపోయి, కైకేయి మాటలను స్వీకరించి, రాముడికి అరణ్యవాసం నిశ్చయిస్తాడు. రాముడు ఈ నిర్ణయాన్ని సమ్మతించి, సీత మరియు లక్ష్మణులతో కలిసి అరణ్యానికి వెళ్ళి, తన తండ్రి ఆజ్ఞను పాటిస్తాడు. ఈ సర్గలో భక్తి, విధేయత, ధర్మాన్ని సృష్టిస్తూ, రాముడి ధైర్యం, కర్తవ్య పరాయణతను చూపుతుంది.
దశరథదిష్టాంతః
వధమప్రతిరూపం తు మహర్షేస్తస్య రాఘవః |
విలపన్నేవ ధర్మాత్మా కౌసల్యాం పునరబ్రవీత్ ||
1
తదజ్ఞానాన్మహత్పాపం కృత్వాహం సంకులేంద్రియః |
ఏకస్త్వచింతయం బుద్ధ్యా కథం ను సుకృతం భవేత్ ||
2
తతస్తం ఘటమాదయ పూర్ణం పరమవారిణా |
ఆశ్రమం తమహం ప్రాప్య యథాఖ్యాతపథం గతః ||
3
తత్రాహం దుర్బలావంధౌ వృద్ధావపరిణాయకౌ |
అపశ్యం తస్య పితరౌ లూనపక్షావివ ద్విజౌ ||
4
తన్నిమిత్తాభిరాసీనౌ కథాభిరపరిక్రమౌ |
తామాశాం మత్కృతే హీనౌ ఉదాసీనావనాథవత్ ||
5
శోకోపహతచిత్తశ్చ భయసంత్రస్తచేతనః |
తచ్చాశ్రమపదం గత్వా భూయః శోకమహం గతః ||
6
పదశబ్దం తు మే శ్రుత్వా మునిర్వాక్యమభాషత |
కిం చిరాయసి మే పుత్ర పానీయం క్షిప్రమానయ ||
7
యన్నిమిత్తమిదం తాత సలిలే క్రీడితం త్వయా |
ఉత్కంఠితా తే మాతేయం ప్రవిశ క్షిప్రమాశ్రమమ్ ||
8
యద్వ్యలీకం కృతం పుత్ర మాత్రా తే యది వా మయా |
న తన్మనసి కర్తవ్యం త్వయా తాత తపస్వినా ||
9
త్వం గతిస్త్వగతీనాం చ చక్షుస్త్వం హీనచక్షుషామ్ |
సమాసక్తాస్త్వయి ప్రాణాః కిం త్వం నో నాభిభాషసే ||
10
మునిమవ్యక్తయా వాచా తమహం సజ్జమానయా |
హీనవ్యంజనయా ప్రేక్ష్య భీతః భీతైవాబ్రవమ్ ||
11
మనసః కర్మ చేష్టాభిరభిసంస్తభ్య వాగ్బలమ్ |
ఆచచక్షే త్వహం తస్మై పుత్రవ్యసనజం భయమ్ ||
12
క్షత్రియోఽహం దశరథో నాహం పుత్రో మహాత్మనః |
సజ్జనావమతం దుఃఖమిదం ప్రాప్తం స్వకర్మజమ్ ||
13
భగవంశ్చాపహస్తోఽహం సరయూతీరమాగతః |
జిఘాంసుః శ్వాపదం కించిత్ నిపానే చాగతం గజమ్ ||
14
తత్ర శ్రుతః మయా శబ్దో జలే కుంభస్య పూర్యతః |
ద్విపోఽయమితి మత్వాఽయం బాణేనాభిహతః మయా ||
15
గత్వా నద్యాస్తతస్తీరమపశ్యమిషుణా హృది |
వినిర్భిన్నం గతప్రాణం శయానం భువి తాపసమ్ ||
16
భగవన్ శబ్దమాలక్ష్య మయా గజజిఘాంసునా |
విసృష్టోఽంభసి నారాచస్తేన తే నిహతస్సుతః ||
17 [తతస్తే]
తతస్తస్యైవ వచనాదుపేత్య పరితప్యతః |
స మయా సహసా బణోద్ధృతో మర్మతస్తదా ||
18
స చోద్ధృతేన బాణేన తత్రైవ స్వర్గమాస్థితః |
భవంతౌ పితరౌ శోచన్నంధావితి విలప్య చ ||
19
అజ్ఞానాద్భవతః పుత్రః సహసాఽభిహతః మయా |
శేషమేవం గతే యత్స్యాత్ తత్ప్రసీదతు మే మునిః ||
20
స తచ్ఛ్రుత్వా వచః క్రూరం మయోక్తమఘశంసినా |
నాశకత్తీవ్రమాయాసమకర్తుం భగవానృషిః ||
21
స బాష్పపూర్ణవదనో నిఃశ్వసన్ శోకకర్శితః |
మామువాచ మహాతేజాః కృతాంజలిముపస్థితమ్ ||
22
యద్యేతదశుభం కర్మ న త్వం మే కథయేః స్వయమ్ |
ఫలేన్మూర్ధా స్మ తే రాజన్ సద్యః శతసహస్రధా ||
23
క్షత్రియేణ వధో రాజన్ వానప్రస్థే విశేషతః |
జ్ఞానపూర్వం కృతః స్థానాత్ చ్యావయేదపి వజ్రిణమ్ ||
24
సప్తధా తు ఫలేన్మూర్ధా మునౌ తపసి తిష్ఠతి |
జ్ఞానాద్విసృజతః శస్త్రం తాదృశే బ్రహ్మవాదిని ||
25
అజ్ఞానాద్ధి కృతం యస్మాత్ ఇదం తేనైవ జీవసి |
అపి హ్యద్య కులం నస్యాత్ ఇక్ష్వాకూణాం కుతః భవాన్ ||
26
నయ నౌ నృప తం దేశమితి మాం చాభ్యభాషత |
అద్య తం ద్రష్టుమిచ్ఛావః పుత్రం పశ్చిమదర్శనమ్ ||
27
రుధిరేణావసిక్తాంగం ప్రకీర్ణాజిన వాససమ్ |
శయానం భువి నిస్సంజ్ఞం ధర్మ రాజవశం గతమ్ ||
28
అథాహమేకస్తం దేశం నీత్వా తౌ భృశదుఃఖితౌ |
అస్పర్శయమహం పుత్రం తం మునిం సహ భార్యయా ||
29
తౌ పుత్రమాత్మనః స్పృష్ట్వా తమాసాద్య తపస్వినౌ |
నిపేతతుః శరీరేఽస్య పితా తస్యేదమబ్రవీత్ ||
30
నాభివాదయసే మాఽద్య న చ మామభిభాషసే |
కిం ను శేషే తు భూమౌ త్వం వత్స కిం కుపితో హ్యసి ||
31
న త్వహం తే ప్రియం పుత్ర మాతరం పస్య ధార్మిక |
కిం ను నాలింగసే పుత్ర సుకుమార వచో వద ||
32
కస్య వాఽపరరాత్రేఽహం శ్రోష్యామి హృదయంగమమ్ |
అధీయానస్య మధురం శాస్త్రం వాన్యద్విశేషతః ||
33
కో మాం సంధ్యాముపాస్యైవ స్నాత్వా హుతహుతాశనః |
శ్లాఘయిష్యత్యుపాసీనః పుత్ర శోకభయార్దితమ్ ||
34
కందమూలఫలం హృత్వా కో మాం ప్రియమివాతిథిమ్ |
భోజయిష్యత్యకర్మణ్యమ్ అప్రగ్రహమనాయకమ్ ||
35
ఇమామంధాం చ వృద్ధాం చ మాతరం తే తపస్వినీమ్ |
కథం వత్స భరిష్యామి కృపణాం పుత్ర గర్ధినీమ్ ||
36
తిష్ఠ మాం మాగమః పుత్ర యమస్య సదనం ప్రతి |
శ్వో మయా సహ గంతాఽసి జనన్యా చ సమేధితః ||
37
ఉభావపి చ శోకార్తౌ అవనాథౌ కృపణౌ వనే |
క్షిప్రమేవ గమిష్యావస్త్వయాఽహీనౌ యమక్షయమ్ ||
38
తతః వైవస్వతం దృష్ట్వా తం ప్రవక్ష్యామి భారతీమ్ |
క్షమతాం ధర్మరాజో మే బిభృయాత్పితరావయమ్ ||
39
దాతుమర్హతి ధర్మాత్మా లోకపాలో మహాయశాః |
ఈదృశస్య మమాక్షయ్యా మేకామభయదక్షిణామ్ ||
40
అపాపోఽసి యదా పుత్ర నిహతః పాపకర్మణా |
తేన సత్యేన గచ్ఛాశు యే లోకాః శస్త్రయోధినామ్ ||
41
యాంతి శూరా గతిం యాం చ సంగ్రామేష్వనివర్తినః |
హతాస్త్వభిముఖాః పుత్ర గతిం తాం పరమాం వ్రజ ||
42
యాం గతిం సగరః శైబ్యో దిలీపో జనమేజయః |
నహుషో ధుంధుమారశ్చ ప్రాప్తాస్తాం గచ్ఛ పుత్రక ||
43
యా గతిః సర్వసాధూనాం స్వాధ్యాయాత్తపసాచ యా |
యా భూమిదస్యాహితాగ్నేః ఏకపత్నీ వ్రతస్య చ ||
44
గో సహస్రప్రదాతౄణాం యా యా గురుభృతామపి |
దేహన్యాసకృతాం యా చ తాం గతిం గచ్ఛ పుత్రక ||
45
న హి త్వస్మిన్ కులే జాతః గచ్ఛత్యకుశలాం గతిమ్ |
స తు యాస్యతి యేన త్వం నిహతో మమ బాంధవః ||
46
ఏవం స కృపణం తత్ర పర్యదేవయతాసకృత్ |
తతోఽస్మై కర్తుముదకం ప్రవృత్తః సహభార్యయా ||
47
స తు దివ్యేన రూపేణ మునిపుత్రః స్వకర్మభిః |
స్వర్గమాధ్యారుహత్ క్షిప్రం శక్రేణ సహ ధర్మవిత్ || ౪౮ ||
48
ఆబభాషే చ వృద్ధౌ తౌ సహ శక్రేణ తాపసః |
ఆశ్వాస్య చ ముహూర్తం తు పితరౌ వాక్యమబ్రవీత్ ||
49
స్థానమస్మి మహత్ప్రాప్తః భవతోః పరిచారణాత్ |
భవంతావపి చ క్షిప్రం మమ మూలముపైష్యతః ||
50
ఏవముక్త్వా తు దివ్యేన విమానేన వపుష్మతా |
ఆరురోహ దివం క్షిప్రం మునిపుత్రః జితేంద్రియః ||
51
స కృత్వా తూదకం తూర్ణం తాపసః సహ భార్యయా |
మామువాచ మహాతేజాః కృతాంజలిముపస్థితమ్ ||
52
అద్యైవ జహి మాం రాజన్ మరణే నాస్తి మే వ్యథా |
యచ్ఛరేణైకపుత్రం మాం త్వమకర్షీరపుత్రకమ్ ||
53
త్వయా తు యదవిజ్ఞానాత్ నిహతః మే సుతః శుచిః |
తేన త్వామభిశప్స్యామి సుదుఃఖమతిదారుణమ్ ||
54
పుత్రవ్యసనజం దుఃఖం యదేతన్మమ సాంప్రతమ్ |
ఏవం త్వం పుత్రశోకేన రాజన్ కాలం కరిష్యసి ||
55
అజ్ఞానాత్తు హతో యస్మాత్ క్షత్రియేణ త్వయా మునిః |
తస్మాత్త్వాం నావిశత్యాశు బ్రహ్మహత్యా నరాధిప ||
56
త్వామప్యేతాదృశో భావః క్షిప్రమేవ గమిష్యతి |
జీవితాంతకరో ఘోరో దాతారమివ దక్షిణా ||
57
ఏవం శాపం మయి న్యస్య విలప్య కరుణం బహు |
చితామారోప్య దేహం తన్మిథునం స్వర్గమభ్యయాత్ ||
58
తదేతచ్ఛింతయానేన స్మృతం పాపం మయా స్వయమ్ |
తదా బాల్యాత్కృతం దేవి శబ్దవేధ్యనుకర్షిణా ||
59
తస్యాయం కర్మణో దేవి విపాకః సముపస్థితః |
అపథ్యైః సహ సంభుక్తః వ్యాధిరన్నరసో యథా ||
60
తస్మాన్మామాగతం భద్రే తస్యోదారస్య తద్వచః |
యదహం పుత్రశోకేన సంత్యక్ష్యామ్యద్య జీవితమ్ ||
61
చక్షుర్భ్యాం త్వాం న పశ్యామి కౌసల్యే సాధు మా స్పృశ |
ఇత్యుక్త్వా స రుదంస్త్రస్తో భార్యామాహ చ భూమిపః ||
62
ఏతన్మే సదృశం దేవి యన్మయా రాఘవే కృతమ్ |
సదృశం తత్తు తస్యైవ యదనేన కృతం మయి ||
63
దుర్వృత్తమపి కః పుత్రం త్యజేద్భువి విచక్షణః |
కశ్చ ప్రవ్రాజ్యమానో వా నాసూయేత్పితరం సుతః ||
64
యది మాం సంస్పృశేద్రామః సకృదద్య లభేత వా |
యమక్షయమనుప్రాప్తా ద్రక్ష్యంతి న హి మానవాః ||
65
చక్షుషా త్వాం న పశ్యామి స్మృతిర్మమ విలుప్యతే |
దూతా వైవస్వతస్యైతే కౌసల్యే త్వరయంతి మామ్ ||
66
అతస్తు కిం దుఃఖతరం యదహం జీవితక్షయే |
న హి పశ్యామి ధర్మజ్ఞం రామం సత్యపరాక్రమమ్ ||
67
తస్యాదర్శనజః శోకః సుతస్యాప్రతికర్మణః |
ఉచ్ఛోషయతి మే ప్రాణాన్వారి స్తోకమివాతపః ||
68
న తే మనుష్యా దేవాస్తే యే చారుశుభకుండలమ్ |
ముఖం ద్రక్ష్యంతి రామస్య వర్షే పంచదశే పునః ||
69
పద్మపత్రేక్షణం సుభ్రు సుదంష్ట్రం చారునాసికమ్ |
ధన్యా ద్రక్ష్యంతి రామస్య తారాధిపనిభం ముఖమ్ ||
70
సదృశం శారదస్యేందోః ఫుల్లస్య కమలస్య చ |
సుగంధి మమ నాథస్య ధన్యా ద్రక్ష్యంతి తన్ముఖమ్ ||
71
నివృత్తవనవాసం తమయోధ్యాం పునరాగతమ్ |
ద్రక్ష్యంతి సుఖినో రామం శుక్రం మార్గగతం యథా ||
72
కౌసల్యే చిత్తమోహేన హృదయం సీదతీవ మే |
వేదయే న చ సంయుక్తాన్ శబ్దస్పర్శరసానహమ్ ||
73
చిత్తనాశాద్విపద్యంతే సర్వాణ్యేవేంద్రియాణి మే |
క్షిణస్నేహస్య దీపస్య సంసక్తా రశ్మయో యథా ||
74
అయమాత్మ భవః శోకో మామనాథమచేతనమ్ |
సంసాదయతి వేగేన యథా కూలం నదీరయః ||
75
హా రాఘవ మహాబాహో హా మమాఽయాసనాశన |
హా పితృప్రియ మే నాథ హాఽద్య క్వాఽసి గతః సుత ||
76
హా కౌసల్యే నశిష్యామి హా సుమిత్రే తపస్విని |
హా నృశంసే మమామిత్రే కైకేయి కులపాంసని ||
77
ఇతి రామస్య మాతుశ్చ సుమిత్రాయాశ్చ సన్నిధౌ |
రాజా దశరథః శోచన్ జీవితాంతముపాగమత్ ||
78
యథా తు దీనం కథయన్నరాధిపః
ప్రియస్య పుత్రస్య వివాసనాతురః |
గతేఽర్ధరాత్రే భృశదుఃఖపీడితః |
తదా జహౌ ప్రాణముదారదర్శనః ||
79
ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే చతుఃషష్ఠితమః సర్గః ||
80
Ayodhya Kanda Sarga 64 Meaning In Telugu
“కౌసల్యా! ఆ ప్రకారంగా నేను నా ప్రమేయం లేకుండానే ఆ ముని కుమారుని మరణానికి కారకుడిని అయ్యాను. అప్పుడు నాకు ఏంచెయ్యాలో తోచలేదు. కొంచెం సేపు ఆలోచించాను. అప్పుడు నాకు ఒక ఉపాయము తట్టింది. నేను కుండ నిండుగా స్వచ్ఛమైన జలమును తీసుకొని ఆ ముని కుమారుడు చెప్పిన మార్గములో నడుచుకుంటూ వారి ఆశ్రమమునకు చేరుకున్నాను.
ఆ ఆశ్రమములో ఒక వృద్ధ దంపతులు ఉన్నారు. వారు అంధులు. లేవలేకుండా ఉన్నారు. ఎవరైనా లేచి నడిపిస్తే గానీ నడవలేకున్నారు. వారే ఆ మునికుమారుని తల్లి తండ్రులు అని అనుకున్నాను. వారు తమ కుమారుని రాక కోసరము ఎదురు చూస్తున్నారు.తమ కుమారుని మంచి తనము గురించి మాట్లాడు కుంటున్నారు. కాని వారి కుమారుడు ఇంక ఎప్పటికీ తిరిగి రాడు అని తెలిస్తే వారి గుండె ఎలా బద్దలవుతుందో తల్చుకుంటేనే నా హృదయం తల్లడిల్లిపోయింది. ఆ ముని కుమారుని చంపిన దు:ఖము కంటే ఆవృద్ధ దంపతులను చూచిన తరువాత కలిగిన దుఃఖము రెట్టింపు అయింది.
నేను వారికి దగ్గరగా వెళ్లాను. నా అడుగుల చప్పుడు విన్ని ఆ వృద్ధులు నన్ను వారి కుమారుడు అని అనుకున్నారు. “కుమారా! ఏమి నాయనా. నీళ్లు తీసుకురావడానికి ఇంత ఆలస్యం అయింది. నాకు చాలా దాహంగా ఉంది. కొంచెము నీళ్లు ఇవ్వు నాయనా. తాగుతాను. అయినా నీకు ఇంకా నీటిలో ఆటలు ఏమిటి చెప్పు. నీ కోసరం మీ అమ్మ బెంగపెట్టుకుంది. లోపలకు వెళ్లి ఆమెను పలకరించు” అని అన్నాడు ఆ వృద్ధుడు.
నేను వారికి ఏమి సమాధానము చెప్పలేదు. “నాయనా కుమారా! ఏమి నాయనా మాతో మాట్లాడవు. నామీద కోపమా. ఈ వృద్ధుల మీద కోపం ఎందుకు కుమారా! మాకు నువ్వే కదా రెండు కళ్లు. నీ కళ్లతో మేము ఈ ప్రపంచాన్ని చూస్తున్నాము. నీ మీద ఆధార పడ్డ మామీద కోసం ఎందుకు కుమారా!” అని కొడుకు కోసం ఆరాటపడుతున్న ఆ వృద్ధుని చూస్తుంటే నా కడుపు తరుక్కుపోయింది. ఆయనను చూచి భయం కూడా వేసింది. అందుకని తత్తరపాటుతో భయం భయంగా ఆయనతో ఇలా అన్నాను.
“మహాత్మా! నేను మీ కుమారుడిని కాదు. దశరథుడు అనే క్షత్రియుడను. అహంకారముతో, అజ్ఞానముతో అవివేకముతో ఈ దుఃఖమును చేజేతులా తెచ్చిపెట్టు కున్నాను. నేను వేటకోసరము సరయూ నదీ తీరమునకు వచ్చాను. ఏనుగును చంపవలెనని మాటువేసి ఉన్నాను. నీ కుమారుడు నీరు కుండలో నీరు నింపు ధ్వని వినపడినది. అది ఏనుగు నీరు త్రాగు శబ్దము అని భ్రమించి శబ్దవేధి బాణముతో కొట్టాను. ఒక మానవ స్వరము హాహాకారము చేయడం వినిపించింది. వెంటనే పోయి చూచాను. అక్కడ నా బాణము దెబ్బతిన్న తమరి కుమారుడు కనిపించాడు. కేవలము ఏనుగును చంపవలెనని నేను వదిలిన బాణము మీ కుమారునికి తగిలినది. మీ కుమారుడు మీ గురించి నాకు తెలియజేసాడు. నేను మీ కుమారుని కోరిక ప్రకారము ఆయన బాధను తొలగించుటకు ఆయన గుండెలలో గుచ్చుకున్న బాణమును లాగివేసితిని. వెంటనే మీ కుమారుడు మరణించాడు. నేను నీరు తీసుకొని మీ కుమారుడు చెప్పిన మార్గములో మీ వద్దకు వచ్చాను. నేను కావాలని మీకుమారుని చంపలేదు. కేవలము అవివేకము వలన తొందరపాటువలన జరిగినది. మీరు ఏ శిక్షవేసినా నేను స్వీకరిస్తాను. మీ ఇష్టము.” అని వారి ముందు నిలబడ్డాను.
ఆయన కొంచెము సేపు మాట్లాడలేదు. తరువాత ఇలా అన్నాడు. “ఓ రాజా! నీవు ఇక్కడకు వచ్చి నా కుమారుని మరణ వార్త చెప్పావు కాబట్టి బతికిపోయావు. లేకపోతే నీ శిరస్సు వేయి వక్కలు అయి ఉండేది. ఎవరైనా క్షత్రియుడు తెలిసి తెలిసీ ముని కుమారుని చంపితే అతను దేవేంద్రుని పదవిలో ఉన్నాసరే అతడు శిక్షార్హుడే. ఎవరైనా తపస్సు చేసుకుంటున్న మునిని కానీ, మునికుమారుని గానీ చంపితే అతని శిరస్సు వెంటనే బద్దలయిపోతుంది. కాని నీవు ఈ అకృత్యమును తెలియక పొరపాటున చేసావు. కాబట్టి ఇంకా బతికి ఉన్నావు. లేకపోతే నీవే కాదు నీ వంశము సాంతము నాశనము అయి ఉండేది. జరిగింది ఏదో జరిగింది. ఇప్పుడు నీవు మా ఇద్దరినీ మా కుమారుని శరీరము ఉన్నచోటికి తీసుకొని వెళ్లు. మా కుమారుని శరీరాన్ని కడసారిగా తడిమి తడిమి చూచుకుంటాము.” అని అన్నాడు. అప్పుడు నేను ఆ ఇరువురు వృద్ధ దంపతులను వారి కుమారుడు చనిపోయిన స్థలమునకు తీసుకొని వెళ్లాను. ఆతల్లి తండ్రులు వారి కుమారుని శవమును మీదపడి ఏడుస్తున్నారు. వారి శోకానికి అంతులేదు.
“కుమారా! నేను రా. మీ తండ్రిని వచ్చాను. లేచి నమస్కారము చేయి నాయనా! అయ్యో నేలమీద పడుకొని ఉన్నావా. లే నాయనా. మా మీద కోపం ఎందుకు నాయనా. మాతో మాట్లాడు. రేపటినుండి ప్రతి రోజూ ప్రాతఃకాలమున మాకు వేదము ఎవరు చదివి వినిపిస్తారు నాయనా! రేపటి నుండి నీ మధురమైన కంఠస్వరము మాకు వినపడదా! రేపటి నుండి ఎవరు పొద్దుటే స్నానసంధ్య ముగించుకొని నా పక్కన కూర్చుని నాకు సేవలు చేస్తారు. రేపటి నుండి మాకు ఎవరు ఫలములు కందమూలములు తెచ్చి తినిపిస్తారు. కుమారా! నీ తల్లిని చూడు నాయనా. కళ్లులేని కబోధి. రేపటి నుండి ఆమె ఆలనా పాలనా ఎవరు చూస్తారు.
రా నాయనా. నీవు యమలోకమునకు వెళ్లకు. మన ఇంటికి రా పోదాము. రేపు మేము కూడా నీ వెంట యమలోకమునకు వస్తాము. అందరమూ కలిసే వెళదాము. నీవు లేని ఈ లోకంలో మేము ఉండలేము. అక్కడ యమునితో నేను మాట్లాడతాను. నీవు మా ఇద్దరినీ పోషించడానికి అనుమతి తీసుకుంటాను. నిస్సహాయులమైన మాకు యముడు ఆ మాత్రం అనుమతి ఇవ్వడా! తప్పకుండా ఇస్తాడు.
నాయనా! కుమారా! నీవు ఏం పాపం చేసావనిరా ఈ పాపాత్ముడు నిన్ను పొట్టన పెట్టుకున్నాడు. నీవు వీరగతిని పొందావు. నీవు కూడా వీరులు పోయే లోకములకు పోతావు. నీవు కూడా దిలీపుడు, సగరుడు, శైబ్యుడు, జనమేజయుడు, నహుషుడు, దుందుమారుడు మొదలగు మహానుభావులు పొందిన వీరగతినే నీవు పొందుతావు. అదీ కాకపోతే, నీవు ముని కుమారుడవు. నీకు సాధువులకు ఏ ఉత్తమగతి లభిస్తుందో ఆ ఉత్తమ గతులు పొందుతావు. నీకూ నిన్ను చంపిన వాడికీ ఉత్తమ గతులు కలుగుతాయి.”
అని ఆ వృద్ధుడు కొడుకును తలచుకుంటూ విలపిస్తున్నాడు. తరువాత ఆ వృద్ధుడు తన కుమారునికి ఉదక క్రియలు నిర్వర్తించాడు. వారు ఆ కార్యక్రమము చేయు నప్పుడు నేను వారి పక్కనే చేతులు కట్టుకొని నిలబడి ఉన్నాను. ఆ వృద్ధుడు తన కుమారునికి జలతర్షణములు వదిలిన తరువాత నన్ను చూచి ఇలా అన్నాడు. “ఓ రాజా! నీవు నీ బాణముతో నా ఒక్కగానొక్క కొడుకును నిర్దాక్షిణ్యంగా చంపి నన్ను నా పుత్రునికి దూరం చేసావు. మేము బతికీ ప్రయోజనము లేదు. కాబట్టి మా ఇద్దరినీ కూడా చంపెయ్యి. మేము మరణమును గురించి చింతించడం లేదు. కాని నీవు నా కుమారుని తెలిసి చంపినా తెలియక చంపినా, తప్పు తప్పే. దానికి నీవు శిక్ష అనుభవించక తప్పదు.
“నేను ఎలాగైతే నీ వలన నా పుత్రుని పోగొట్టుకొని కుమారా కుమారా అని ఏడుస్తూ మరణిస్తున్నానో, నువ్వు కూడా నీ కొడుకును చేజేతులా పోగొట్టుకొని హా పుత్రా హా పుత్రా అని ఏడుస్తూ మరణించు. ఇదే నేను నీకు ఇచ్చే శాపము.” అని నన్ను శపించాడు. తరువాత వారు ఒక చితిని పేర్పించుకొని అగ్నికి ఆహుతి అయ్యారు.
కౌసల్యా! ఆ ప్రకారంగా నేను ఆ ముని కుమారుని మృతికి కారకుడినయి ఆతని తండ్రి శాపానికి ఆహుతి అయ్యాను. ఈ నాడు ఆ శాప ప్రభావంతో నా కుమారుని చేజేతులా అడవులపాలు చేసుకొని రామా రామా అంటూ ఏడుస్తున్నాను. నేను కూడా ఆ వృద్ధుడి వలెనే కొడుకా కొడుకా అని ఏడుస్తూ మరణించవలసిన సమయము ఆసన్నమయినట్టుంది.” అని ఏడుస్తున్నాడు దశరథుడు.
కౌసల్యకు భర్తను ఎలా ఓదార్చాలో తెలియడం లేదు. మౌనంగా ఉంది. తరువాత దశరథుడే అన్నాడు. “ఓ కౌసల్యా! నేను తెలివితక్కువగా అడవులకు వెళ్లమంటే, రాముడు ధర్మం ధర్మం అంటూ అడవులకు వెళ్లాడు. రాముడు చేసింది ధర్మమే. కాని నేనే అధర్మానికి పాలుబడ్డాను. కొడుకును అడవులకు పంపాను.
లేకపోతే ఎవడైనా చేజేతులా కొడుకును పోగొట్టుకుంటాడా! పోనీ నేను తెలివి తక్కువ వాడిని. ఏ కొడుకైనా తండ్రి అడవులకు పో అంటే కోపించకుండా ఉంటాడా! కాని రాముడు కోపం తెచ్చుకోలేదు. అదే ధర్మం అంటాడు. నేను అధర్మంగా ప్రవర్తించినా రాముడు ధర్మంగా ప్రవర్తించాడు. కాని నాకు అవసాన దశ సమీపించింది. ఈ ఆఖరి ఘడియలలో రాముడు నా దగ్గర ఉంటే ఎంత బాగుంటుంది. కౌసల్యా! అటు చూడు.యమదూతలు నాకోసరం వస్తున్నారు. శాప వశాత్తు నాకు నా మరణ కాలంలో నా రాముడు దూరం అయ్యాడు.
కౌసల్యా! నా ప్రాణాలు యమభటులు తీసుకుపోనవసరం లేదు. రాముడు నాకు దూరం కావడమే నా పుత్రశోకమే నాప్రాణాలు తీసేస్తుంది. రాముడు పద్నాలుగు సంవత్సరాల తరువాత అయోధ్యకు వచ్చినపుడు చూచే అదృష్టం నాకు లేదు. ఆ అదృష్టానికి నేను నోచుకోలేదు. కేవలము దేవతలే ఆ దృశ్యము చూడగలరు. నా వంటిపాపాత్ముడికి ఆ అర్హత లేదు.
కౌసల్యా! ఒక్కొక్కటిగా నా అవయవాలు చలనం కోల్పోతున్నాయి. నా ఆయువు క్షీణించి పోతూ ఉంది. ఈ ఆఖరు క్షణాలలో కూడా రాముని స్మరణ నన్ను వదలడం లేదు. రామా! రామా! ఎక్కడున్నావయ్యా! ఏం చేస్తున్నావయ్యా! ఒక్కసారి నా కళ్లకు కనపడవయ్యా! కౌసల్యా! నేను మరణిస్తున్నాను.
ఓ కైకా! నీ ఉసురు కొట్టి నేను చచ్చిపోతున్నాను. నీవు ఆనందంగా ఉండు. నా కులాన్ని నాశనం చేసావు. నన్ను మరణానికి గురిచేసావు. నీవు కోరుకున్నట్టు నేను చచ్చిపోతున్నాను. చచ్చిపోతున్నాను.” అంటూ పలవరిస్తున్నాడు దశరథుడు. అలా పలవరిస్తూనే దశరథుడు ప్రాణాలు వదిలాడు. దశరథుడు తాను పొందిన ముని శాపము గురించి చెబుతూ ఉండగానే కౌసల్య శోకభారంతో నిద్రలోకి జారుకుంది. అంతకు ముందే సుమిత్రకూడా నిద్రపోయింది. అందుకని వారికి నిద్రలోనే పలవరిస్తూ దశరథుడు ప్రాణాలు వదిలిన సంగతి తెలియదు. అప్పటికి అర్ధరాత్రి దాటింది. కౌసల్య అంత:పురములో నిశ్శబ్దము ఆవరించింది.
శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము అరువదినాలుగవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.