మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అయోధ్యాకాండ ఏకోనపంచాశః సర్గ, “జానపదాక్రోశః”, రామాయణంలోని ఒక భావోద్వేగభరితమైన భాగం. ఈ సర్గలో, రాముడు వనవాసం కోసం బయలుదేరిన తర్వాత గ్రామస్తులు అతని లేమితో తీవ్ర దుఃఖంలో మునిగిపోతారు. రాముడి పట్ల వారి ప్రేమను, విశ్వాసాన్ని, మరియు అతడి లేమి వల్ల కలిగిన బాధను గ్రామస్తులు వ్యక్తం చేస్తారు. రాముడు తన ధర్మాన్ని, వినయాన్ని, మరియు ప్రజల పట్ల ఉన్న ప్రేమను గుర్తు చేసుకుంటూ వారు ఆవేదనతో విలపిస్తారు. ఈ సర్గ గ్రామస్తుల ఆక్రందన, రాముడి పట్ల వారి అభిమానం, మరియు అతని వాంఛను ప్రతిబింబిస్తుంది.
జానపదాక్రోశః
రామోఽపి రాత్రిశేషేణ తేనైవ మహదంతరమ్ |
జగామ పురుషవ్యాఘ్రః పితురాజ్ఞామనుస్మరన్ ||
1
తథైవ గచ్ఛతస్తస్య వ్యపాయాద్రజనీ శివా |
ఉపాస్య స శివాం సంధ్యాం విషయాంతం వ్యగాహత ||
2
గ్రామాన్వికృష్టసీమాన్తాన్పుష్పితాని వనాని చ |
పశ్యన్నతియయౌ శీఘ్రం శనైరివ హయోత్తమైః |
శృణ్వన్వాచో మనుష్యాణాం గ్రామసంవాసవాసినామ్ ||
3
[* విగర్హితాం హి కైకేయీం క్రూరాం క్రూరేణ కర్మణా | *]
రాజానం ధిగ్దశరథం కామస్య వశమాగతమ్ ||
4
హా నృశంసాఽద్య కైకేయీ పాపా పాపానుబంధినీ |
తీక్ష్ణా సంభిన్నమర్యాదా తీక్ష్ణకర్మణి వర్తతే ||
5
యా పుత్రమీదృశం రాజ్ఞః ప్రవాసయతి ధార్మికమ్ |
వనవాసే మహాప్రాజ్ఞం సానుక్రోశం జితేంద్రియమ్ ||
6
కథం నామ మహాభాగా సీతా జనకనందినీ |
సదా సుఖేష్వభిరతా దుఃఖాన్యనుభవిష్యతి ||
7
అహో దశరథో రాజా నిస్స్నేహః స్వసుతం ప్రియమ్ |
ప్రజానామనఘం రామం పరిత్యక్తుమిహేచ్ఛతి ||
8
ఏతా వాచో మనుష్యాణాం గ్రామసంవాసవాసినామ్ |
శృణ్వన్నతియయౌ వీరః కోసలాన్కోసలేశ్వరః ||
9
తతః వేదశ్రుతిం నామ శివవారివహాం నదీమ్ |
ఉత్తీర్యాభిముఖః ప్రాయాదగస్త్యాధ్యుషితాం దిశమ్ ||
10
గత్వా తు సుచిరం కాలం తతః శివజలాం నదీమ్ |
గోమతీం గోయుతానూపామతరత్సాగరంగమామ్ ||
11
గోమతీం చాప్యతిక్రమ్య రాఘవః శీఘ్రగైర్హయైః |
మయూరహంసాభిరుతాం తతార స్యందికాం నదీమ్ ||
12
స మహీం మనునా రాజ్ఞా దత్తామిక్ష్వాకవే పురా |
స్ఫీతాం రాష్ట్రావృతాం రామః వైదేహీమన్వదర్శయత్ ||
13
సూత ఇత్యేవ చాభాష్య సారథిం తమభీక్ష్ణశః |
హంసమత్తస్వరః శ్రీమానువాచ పురుషర్షభః ||
14
కదాఽహం పునరాగమ్య సరయ్వాః పుష్పితే వనే |
మృగయాం పర్యాటిష్యామి మాత్రా పిత్రా చ సంగతః ||
15
రాజర్షీణాం హి లోకేఽస్మిన్ రత్యర్థం మృగయా వనే |
కాలే కృతాం తాం మనుజైర్ధన్వినామభికాంక్షితామ్ ||
16
నాత్యర్థమభికాంక్షామి మృగయాం సరయూవనే |
రతిర్హ్యేషాఽతులా లోకే రాజర్షిగణసమ్మతా ||
17
స తమధ్వానమైక్ష్వాకః సూతం మధురయా గిరా |
తంతమర్థమభిప్రేత్య యయౌ వాక్యముదీరయన్ ||
18
ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే ఏకోనపంచాశః సర్గః ||
Ayodhya Kanda Sarga 49 Meaning In Telugu
తనతో వచ్చిన అయోధ్యావాసులు నిద్ర లేవకముందే లేచిన రాముడు తన ప్రయాణం కొనసాగించాడు. సూర్యోదయము అయేటప్పటికి చాలా దూరం వచ్చేసారు. రామ లక్ష్మణులు ప్రాతఃసంధ్యను పూర్తి చేసుకొని మరలా ప్రయాణం అయ్యారు. అనేక గ్రామాల గుండా ప్రయాణిస్తున్నారు. ఆ గ్రామ ప్రజలు రాముని వనవాసము గురించి రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు.
“ఆ దశరథుడు కామానికి వశుడై తన భార్య కైక మాటలు విని కన్నకుమారుని అడవులకు వెళ్లగొట్టాడు. ధర్మాత్ముడైన రాముడు తండ్రి మాట కాదనలేక అడవులకు వెళ్లాడు ఏమి ఆశ్చర్యము. అయినా రాముడు అడవులకు వెళ్లాడు. ఆయనతో పాటు సీత ఎందుకు వెళ్లాలి? సుకుమారి అయిన సీత అడవులలో ఎలా ఉండగలదు? రామునితోపాటు సీత కూడా అన్ని కష్టాలు పడవలసిన దేనా! ఎంత దారుణము.” అని రక రకాలుగా అనుకుంటున్నారు.
వారి మాటలు వింటూ రాముడు అరణ్యముల వంక సాగుతున్నాడు. వారు వేదశ్రుతి అనే నదిని దాటారు. దక్షిణ దిక్కుగా ఉన్న అగస్త్య ఆశ్రమము వైపు ప్రయాణం చేస్తున్నారు. అలా ప్రయాణం చేస్తూ వారు గోమతీ నదీ తీరానికి చేరుకున్నారు. గోమతీ నదిని దాటిన తరువాత వారు స్యందికా నదిని చేరుకున్నారు. ఆ నదిని కూడా దాటి వారు పూర్వము మను చక్రవర్తి రాముని మూల పురుషుడైన ఇక్షాకువునకు ఇచ్చిన విశాలమైన భూములలోకి ప్రవేశించారు. ఆ భూమి నంతనూ రాముడు సీతకు చూపించి దాని గురించిన వృత్తాంతమును సీతకు వివరించాడు. సారవంతమైన ఆ భూముల గుండా వారు ప్రయాణం చేస్తున్నారు. అనేక వన్యప్రాణులతో నిండిన అడవులలో గుండా వారు వెళుతున్నారు. అప్పుడు సుమంత్రుని చూచి రాముడు ఇలా అన్నాడు.
“సుమంత్రా! నేను వనవాసము ముగించుకొని తిరిగివచ్చి తల్లితండ్రుల దర్శనము చేసుకొని ఈ వనసీమలలో ఎప్పుడు తనివిదీరా వేటాడెదనో కదా! వేట క్షత్రియులకు ఉచితమే కానీ నాకు ఎందుకో సరయూనదీతీరములో ఉన్న ఈవనములలో వేటాడవలెనని కోరిక అంతగా లేదు. అసలు నాకు వేట మీద అంత మక్కువ లేదు. అరణ్యములలో వాటి మానాన అవి బతుకుతున్న అమాయకమైన ఆ ప్రాణులను, కేవలం మన ఆనందం కోసరం, వేట మిషతో చంపడం పాపం కదా! అందుకనే నాకు వేట మీద అంతగా కోరిక లేదు. కాని క్రూర మృగములు విజృంభించినపుడు వేటాడక తప్పదు.” అని వేట గురించి ముచ్చటించుకుంటూ రాముడు సుమంత్రుడు నడిపే రథం మీద ప్రయాణిస్తున్నాడు.
శ్రీమద్రామాయణము,
అయోధ్యాకాండము నలుబదితొమ్మిదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.