Ayodhya Kanda Sarga 8 In Telugu – అయోధ్యాకాండ అష్టమః సర్గః

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అయోధ్యాకాండంలో అష్టమః సర్గ ఒక ప్రధానమైన అధ్యాయం. ఈ భాగంలో అయోధ్య నగరంలో జరిగే కీలకమైన సంఘటనలను, ముఖ్యంగా పాత్రలు ఎదుర్కొనే భావోద్వేగ మరియు నైతిక సంక్షోభాలను వివరించబడింది. ఈ అధ్యాయంలో రాజకుటుంబంలోని సున్నితమైన సంబంధాలను పరిశీలించి, కర్తవ్య, ధర్మం మరియు నిర్ణయాల ప్రభావం వంటి అంశాలను స్పష్టంగా చూపిస్తుంది. అష్టమః సర్గ మనిషి అనుభవాల సారాన్ని అందించడంలో ముఖ్య పాత్ర వహించి, రామాయణం యొక్క సమగ్ర నైతిక కథనాన్ని ప్రోత్సహిస్తుంది. ఈ అధ్యాయం భవిష్యత్తులో పాత్రలు ఎదుర్కొనే సవాళ్లు మరియు కష్టాలను సూచిస్తూ, రామాయణం బోధించే సానాతన విలువలను పాఠకులకు తెలియజేస్తుంది.

మంథరోపజాపః

మంథరా త్వభ్యసూయైనాముత్సృజ్యాభరణం చ తత్ |
ఉవాచేదం తతో వాక్యం కోపదుఃఖసమన్వితా ||

1

హర్షం కిమిదమస్థానే కృతవత్యసి బాలిశే |
శోకసాగరమధ్యస్థం నాత్మానమవబుధ్యసే || [నావబుధ్యసే]

2

మనసా ప్రహసామి త్వాం దేవి దుఃఖార్దితా సతీ |
యచ్ఛోచితవ్యే హృష్టాఽసి ప్రాప్యేదం వ్యసనం మహత్ ||

3

శోచామి దుర్మతిత్వం తే కా హి ప్రాజ్ఞా ప్రహర్షయేత్ |
అరేః సపత్నీపుత్రస్య వృద్ధిం మృత్యోరివాగతామ్ ||

4

భరతాదేవ రామస్య రాజ్యసాధారణాద్భయమ్ |
తద్విచింత్య విషణ్ణాస్మి భయం భీతాఽద్ధి జాయతే ||

5

లక్ష్మణో హి మహేష్వాసో రామం సర్వాత్మనా గతః |
శత్రుఘ్నశ్చాపి భరతం కాకుత్స్థం లక్ష్మణో యథా ||

6

ప్రత్యాసన్నక్రమేణాపి భరతస్యైవ భామిని |
రాజ్యక్రమో విప్రకృష్టస్తయోస్తావద్యవీయసోః || [తయోస్తావత్కనీయసోః]

7

విదుషః క్షత్రచారిత్రే ప్రాజ్ఞస్య ప్రాప్తకారిణః |
భయాత్ప్రవేపే రామస్య చింతయంతీ తవాత్మజమ్ ||

8

సుభగా ఖలు కౌసల్యా యస్యాః పుత్రోఽభిషేక్ష్యతే |
యౌవరాజ్యేన మహతా శ్వః పుష్యేణ ద్విజోత్తమైః ||

9

ప్రాప్తాం సుమహతీం ప్రీతిం ప్రతీతాం తాం హతద్విషమ్ |
ఉపస్థాస్యసి కౌసల్యాం దాసీవ త్వం కృతాంజలిః ||

10

ఏవం చేత్త్వం సహాస్మాభిస్తస్యాః ప్రేష్యా భవిష్యసి |
పుత్రశ్చ తవ రామస్య ప్రేష్యభావం గమిష్యతి ||

11

హృష్టాః ఖలు భవిష్యంతి రామస్య పరమాః స్త్రియః |
అప్రహృష్టా భవిష్యంతి స్నుషాస్తే భరతక్షయే ||

12

తాం దృష్ట్వా పరమప్రీతాం బ్రువంతీం మంథరాం తతః |
రామస్యైవ గుణాన్దేవీ కైకేయీ ప్రశశంస హ ||

13

ధర్మజ్ఞో గురుభిర్దాంతః కృతజ్ఞః సత్యవాక్ఛుచిః |
రామో రాజ్ఞః సుతో జ్యేష్ఠో యౌవరాజ్యమతోఽర్హతి ||

14

భ్రాతౄన్భృత్యాంశ్చ దీర్ఘాయుః పితృవత్పాలయిష్యతి |
సంతప్యసే కథం కుబ్జే శ్రుత్వా రామాభిషేచనమ్ ||

15

భరతశ్చాపి రామస్య ధ్రువం వర్షశతాత్పరమ్ |
పితృపైతామహం రాజ్యం ప్రాప్నుయాత్పురుషర్షభః || [అవాప్తాపురుషర్షభః]

16

సా త్వమభ్యుదయే ప్రాప్తే వర్తమానే చ మంథరే |
భవిష్యతి చ కల్యాణే కిమర్థం పరితప్యసే ||

17

యథా మే భరతో మాన్యస్తథా భూయోఽపి రాఘావః |
కౌసల్యాతోఽతిరిక్తం చ సోఽనుశుశ్రూషతే హి మామ్ ||

18

రాజ్యం యది హి రామస్య భరతస్యాపి తత్తథా |
మన్యతే హి యథాఽఽత్మానం తథా భ్రాతౄంస్తు రాఘవః ||

19

కైకేయ్యా వచనం శ్రుత్వా మంథరా భృశదుఃఖితా |
దీర్ఘముష్ణం వినిశ్వస్య కైకేయీమిదమబ్రవీత్ ||

20

అనర్థదర్శినీ మౌర్ఖ్యాన్నాత్మానమవబుధ్యసే |
శోకవ్యసనవిస్తీర్ణే మజ్జంతీ దుఃఖసాగరే ||

21

భవితా రాఘవో రాజా రాఘవస్యాను యః సుతః |
రాజవంశాత్తు కైకేయీ భరతః పరిహాస్యతే ||

22

న హి రాజ్ఞః సుతాః సర్వే రాజ్యే తిష్ఠంతి భామిని |
స్థాప్యమానేషు సర్వేషు సుమహాననయో భవేత్ ||

23

తస్మాజ్జ్యేష్ఠే హి కైకేయి రాజ్యతంత్రాణి పార్థివాః |
స్థాపయంత్యనవద్యాంగి గుణవత్స్వితరేష్వపి ||

24

అసావత్యంతనిర్భగ్నస్తవ పుత్రో భవిష్యతి |
అనాథవత్సుఖేభ్యశ్చ రాజవంశాచ్చ వత్సలే ||

25

సాహం త్వదర్థే సంప్రాప్తా త్వం తు మాం నావబుధ్యసే |
సపత్నివృద్ధౌ యా మే త్వం ప్రదేయం దాతుమిచ్ఛసి ||

26

ధ్రువం తు భరతం రామః ప్రాప్య రాజ్యమకంటకమ్ |
దేశాంతరం వా నయితా లోకాంతరమథాఽపి వా ||

27

బాల ఏవ హి మాతుల్యం భరతో నాయితస్త్వయా |
సన్నికర్షాచ్చ సౌహార్దం జాయతే స్థావరేష్వపి ||

28

భరతస్యాప్యనువశః శత్రుఘ్నోఽపి సమాగతః |
లక్ష్మణశ్చ యథా రామం తథాసౌ భరతం గతః ||

29

శ్రూయతే హి ద్రుమః కశ్చిచ్ఛేత్తవ్యో వనజీవిభిః |
సన్నికర్షాదిషీకాభిర్మోచితః పరమాద్భయాత్ ||

30

గోప్తా హి రామం సౌమిత్రిర్లక్ష్మణం చాపి రాఘవః |
అశ్వినోరివ సౌభ్రాత్రం తయోర్లోకేషు విశ్రుతమ్ ||

31

తస్మాన్న లక్ష్మణే రామః పాపం కించిత్కరిష్యతి |
రామస్తు భరతే పాపం కుర్యాదితి న సంశయః ||

32

తస్మాద్రాజగృహాద్దేవ వనం గచ్ఛతు తే సుతః |
ఏతద్ధి రోచతే మహ్యం భృశం చాపి హితం తవ ||

33

ఏవం తే జ్ఞాతిపక్షస్య శ్రేయశ్చైవ భవిష్యతి |
యది చేద్భరతో ధర్మాత్పిత్ర్యం రాజ్యమవాప్స్యసి ||

34

స తే సుఖోచితో బాలో రామస్య సహజో రిపుః |
సమృద్ధార్థస్య నష్టార్థో జీవిష్యతి కథం వశే ||

35

అభిద్రుతమివారణ్యే సింహేన గజయూథపమ్ |
ప్రచ్ఛాద్యమానం రామేణ భరతం త్రాతుమర్హసి ||

36

దర్పాన్నిరాకృతా పూర్వం త్వయా సౌభాగ్యవత్తయా |
రామమాతా సపత్నీ తే కథం వైరం న యాతయేత్ ||

37

యదా హి రామః పృథివీమవాప్స్యతి
ప్రభూతరత్నాకరశైలపత్తనామ్ |
తదా గమిష్యస్యశుభం పరాభవం
సహైవ దీనా భరతేన భామిని ||

38

యదా హి రామః పృథివీమవాప్స్యతి
ధ్రువం ప్రనష్టో భరతో భవిష్యతి |
అతో హి సంచింతయ రాజ్యమాత్మజే
పరస్య చైవాద్య వివాసకారణమ్ ||

39

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే అష్టమః సర్గః ||

Ayodhya Kanda Sarga 8 Meaning In Telugu

కైక తనకు బహుమానముగా ఇచ్చిన ఆభరణమును విసిరి కొట్టింది మంధర.

“అయ్యో ఎంత తెలివి తక్కువదానివమ్మా నువ్వు. దుఃఖించ తగ్గ సమయంలో సంతోషంతో కేరింతలు కొడుతున్నావు. ముంచు కొస్తున్న ఆపదను గుర్తింలేకున్నావు. నిన్ను, నీ అమాయకత్వాన్ని చూచి నాకు నవ్వు వస్తోంది.

అది కాదమ్మా! నాకు తెలియక అడుగుతాను. సవతి కొడుక్కు పట్టాభిషేకం జరుగుతుంటే సంతోషించే దానివి నువ్వు ఒక్కదానివే కనపడుతున్నావు. నీ చావును నువ్వే కొనితెచ్చుకుంటున్నావు. ఈ రాజ్యము ఎవరిది? దశరథునిది. ఆయనకు రాముడొక్కడే కాదు కదా! భరతుడు కూడా కుమారుడే కదా! భరతునికి కూడా రాజ్యాధి కారము ఉన్నది కాబట్టి రామునికి భరతుని చూస్తే భయము. అందుకే భరతుడు ఇంటలేని సమయములో పట్టాభిషేకము చేసుకుం టున్నాడు. ఈ విషయం ఆలోచించే కొద్దీ నాకు దుఃఖము ఆగటం లేదు తల్లీ నీకు ఎలా ఉందో గాని.

ఇంకో విషయం గమనించావా! రాముడు లక్ష్మణుడు ఒకటి. భరతుడు శత్రుఘ్నుడు ఒకటి. రాముని తరువాత భరతుడు పుట్టాడు. అందుకనీ, రాముని తరువాత రాజ్యాధికారము భరతునికే చెందాలి. లక్ష్మణుడు, శత్రుఘ్నుడు చిన్నవాళ్లు. రాముడు విద్వాంసుడు. రాజనీతి కోవిదుడు. ధనుర్విద్యాపారంగతుడు. అందుకే, నీ కొడుకు భరతుని అమాయకుడిని చేసి రాజ్యం మొత్తం కాజెయ్యాలని చూస్తున్నాడు. రాముడు. ఆ విషయం నువ్వు గ్రహించలేకున్నావు. నాకు మాత్రం వణుకు పుడుతూ ఉంది.

అయినా ఏమనుకొని ఏమి లాభం. అదృష్టం అంతా ఆ కౌసల్యది. ఆమె కొడుకు యువరాజు కాబోతున్నాడు. నువ్వు ఆమెకు దాసిగా ఉండాల్సిందే. ఆమె ముందు చేతులు కట్టుకొని నిలబడాల్సిందే. నువ్వు కౌసల్యకు దాసివి అయితే నీ కొడుకు భరతుడు రామునికి దాసుడు అవుతాడు. నీ కోడలు రాముని భార్యకు దాసి అవుతుంది. మీ కుటుంబానికి దాస్యవృత్తి తప్పదు. …” అని ఇంకా ఏమో అనబోతుంటే మంథరను వారించింది కైక.

మంథరా! ఇంకచాలు ఆపు. రాముడు అంటే ఎవరనుకున్నావు? అన్ని ధర్మములు తెలిసినవాడు. గురు ముఖతా విద్య నేర్చుకున్నవాడు. పరుల ఎడల కృతజ్ఞతా భావము కలవాడు. ఎల్లప్పుడూ సత్యమునే పలికెడివాడు. అన్నిటి మించి రాముడు జ్యేష్టుడు. రాజ్య సంప్రదాయ ప్రకారము జ్యేష్టుడే రాజ్యమునకు యువరాజు. ఇందులో తప్పేముంది. దు:ఖించడానికి కేముంది. అసలు నీకు రాముని గురించి నీచ భావము ఎలా కలిగింది. రాముడు యువరాజు అయినా తన తమ్ములను తనతో సమానంగా గౌరవిస్తాడు. ఆదరిస్తాడు. రామ పట్టాభి షేక వార్త వినగానే సంతోషించక ఇలా దుఃఖిస్తావెందుకు? నువ్వు చెప్పినట్టు రాముని తరువాత భరతునిదే కదా రాజ్యాధికారము. రాముడు పరిపాలించిన తరువాత భరతుడే తదుపరి రాజు అవుతాడు. ఇందులో సందేహమేమున్నది. ఈ సంతోష సమయంలో సంతోషిం చాలి గానీ దుఃఖించడం అవివేకుల లక్షణం.

మంథరా! ఇంకో మాట చెబుతున్నాను విను. నాకు భరతుడు ఎంతో రాముడూ అంతే. రాముడు నన్ను తన తల్లి కౌసల్య కన్నా ఎక్కువగా ప్రేమిస్తాడు. అభిమానిస్తాడు. గౌరవిస్తాడు. అటువంటి రాముని గురించి నా ఎదుట నిందిస్తావా! రాముడు రాజు అయితే ఒకటీ భరతుడు రాజు అయితే ఒకటీనా! రాముడు రాజు అయితే నా కుమారుడు భరతుడు కూడా రాజు అయినట్టే! అందుకే ఆ చెడ్డ ఆలోచనలుమాని రాముని రాజ్యాభిషేకమును చూచి ఆనందించు.” అని చీవాట్లు పెట్టింది కైక.

కాని మంథర మారలేదు. దీర్ఘంగా నిట్టూర్చింది. కైక వంక జాలిగా చూసింది. “ఒక పక్క నువ్వు ఎక్కిన పడవను నీ శత్రువు ముంచుతుంటే. నువ్వు ఆ శత్రువునే పొగుడుతున్నావా! ఎంత అమాయకురాలివమ్మా! నువ్వు చెప్పినట్టు రాముడు రాజు అవుతాడు. రాముని తరువాత రాముని కొడుకు రాజు అవుతాడు కానీ భరతుడు ఎలా రాజు అవుతాడు? అసలు అప్పుడు నీ పేరు, నీ కొడుకు భరతుని పేరు ఎవరు తల్చుకుంటారు? అందరూ ‘యువరాజా’ ‘యువరాజా’ అంటూ రాముని కొడుకు వెంట పడతారు. నీ కొడుకు మొహం ఎవరు చూస్తారు.

ఒక రాజుకు నలుగురు కుమారులు ఉంటే అందరూ రాజులు కారు కదా! అందులో జ్యేష్టునికి కానీ, జ్యేష్టుడు పనికి రాని పక్షంలో గుణవంతుడైన తరువాత వాడికి కానీ, రాజ్యాభిషేకము చేస్తారు. ఇది వంశాచారము. అందుకే నా మాటవిను. రాముడు అడ్డు తొలగితే నీ కొడుకే రాజు అవుతాడు. లేకపోతే నీ కొడుకు అనాధ అవుతాడు. రాచమర్యాదలకు సుఖాలకు దూరం అవుతాడు. ఇదంతా నీ మేలుకోరి చెబుతున్నాను. నువ్వేమో రామ పట్టాభిషేక వార్త తెలిసి నాకు కానుకలు ఇస్తున్నావు. ఏంటో!

నీకు ఇంకో రహస్యం తెలుసా! రాముడు రాజు కాగానే, భరతుడు తనకు పోటీ రాకుండా భరతుని దేశాంతరం పంపేస్తాడు. లేకపోతే చంపిస్తాడు. తన మార్గ నిష్కంటకం చేసుకుంటాడు. అసలు నీ కొడును మేనమామతో కూడా పంపడానికి ఇదే కారణము. నీ కొడుకు ఎదురుగా లేడు కనుక నీ భర్తకు నీ కొడుకుమీద ప్రేమ తగ్గిపోయింది. రాముడు ఎదురుగా ఉన్నాడు కనుక రాముని యువరాజును చేస్తున్నాడు. అందుకనే, ఈ పట్టాభిషేక విషయం కనీసం నీకు గానీ, నీ కుమారుడు భరతునికి కానీ తెలియనీయలేదు. ఇదంతా నీ మీద జరుగుతున్న కుట్ర. అది నీవు తెలుసుకోలేకున్నావు. నేనేం చెయ్యను.

భరతుడు ఇక్కడ ఉంటే ఎక్కడ తన యౌవరాజ్య పట్టాభిషేకానికి అడ్డు పడతాడో అని ముందుగానే పథకం ప్రకారం మేనమామ ఇంటి పంపించారు. అసలు భరతుడు కూడా తన కళ్లెదుట ఉంటే నీ భర్త దశరథుడు నీ మీద ఉన్న ప్రేమతో నీ కుమారుడు భరతునికే పట్టాభిషేకము చేసేవాడు కదా! ఇదంతా రాముడు లక్ష్మణుడు కలిసి చేసిన కుట్ర.

రాముని లక్ష్మణుడు ఏమీ చెయ్యడు. రామునికి లక్ష్మణుడు అడ్డురాడు. కాని భరతుడు తనకు పోటీ వస్తాడని చంపించడానికైనా వెనకాడడు రాముడు. అది తెలుసుకో! ఇక్కడకు వచ్చి రాముని చేతిలో చచ్చే కంటే నీ కుమారుడు అటునుండి అటే ఏ అరణ్యములకో పోవడం
మంచిది.

కాబట్టి నా మాటవిను. ధర్మం ప్రకారము భరతుడు కూడా యువరాజు పదవికి అర్హుడు. అయోధ్యకు ఉత్తరాధికారి. అప్పుడు నీకు, నీ బంధువులకు గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. అయోధ్యాధీశుని తల్లిగా నిన్ను అందరూ గౌరవిస్తారు. లేకపోతే నీకు దాస్యము నీ కొడుక్కు చావు రాసి పెట్టి ఉంది. నీ కొడుకును బాలుడిని అమాయకుడిని చేసి ఆడిస్తున్నారు. నీ కొడుకు కూడా రాజ్యమునకు అర్హుడు కాబట్టి, రామునికి భరతుడు సహజ శత్రువు. ఏనుగును సింహము కబళించినట్టు నీ కొడును రాముడు కబళిస్తాడు. నా మాటవిని నీ కొడుకును రక్షించుకో!

నీకు గుర్తుందా! నువ్వు నీ భర్తకు ముద్దుల భార్యవు. అందుకని నువ్వు కౌసల్యను ఎన్నోసార్లు హేళన చేసావు. అంతకు అంతా ఇప్పుడు నీ మీద పగ తీర్చుకుంటుంది. సందేహము లేదు. ఇంతెందుకమ్మా! రేపు ఆ కాస్త పట్టాభిషేకము కానీ. ఎల్లుండినుండి నీ గతి, నీ కొడుకు గతి ఏమవుతుందో చూడు! నేనుచెప్పడం ఎందుకు. మీ రిద్దరూ అత్యంత దయనీయ స్థితిలో అవమానాలపాలవుతారు. ఇంతెందుకమ్మా! ఒకసారి రాముడు రాజైతే నీ కుమారునికి నాశనము తప్పదు. ఇది యదార్థము. కాబట్టి రాముని పట్టాభిషేకము జరగకుండా ఉండే ఉపాయము ఆలోచించు.” అని పలికింది మంథర.

శ్రీమద్రామాయణము
అయోధ్యా కాండము ఎనిమిదవ సర్గసంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అయోధ్యాకాండ నవమః సర్గః (9) >>

Leave a Comment