Balakanda Sarga 11 In Telugu – బాలకాండ ఏకాదశః సర్గః

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ లోని ఏకాదశః సర్గములో, తన మంత్రి సుమంత్రుని సలహా మేరకు, దశరథుడు ఋష్యశృంగ మహర్షి మరియు అతని భార్య శాంతను తన రాజధాని అయోధ్యకు తీసుకురావడానికి అంగ రాజ్యానికి వెళ్తాడు.

ఋశ్యశృంగస్యాయోధ్యాప్రవేశః

భూయ ఏవ హి రాజేంద్ర శృణు మే వచనం హితమ్ |
యథా స దేవప్రవరః కథయామేవమబ్రవీత్ ||

1

ఇక్ష్వాకూణాం కులే జాతో భవిష్యతి సుధార్మికః |
రాజా దశరథో రాజా శ్రీమాన్సత్యప్రతిశ్రవః ||

2

అంగరాజేన సఖ్యం చ తస్య రాజ్ఞో భవిష్యతి |
[* కన్యా చాస్య మహాభాగా శాంతా నామ భవిష్యతి | *]
పుత్రస్తు సోఽఙ్గరాజస్య రోమపాద ఇతి శ్రుతః ||

3

తం స రాజా దశరథో గమిష్యతి మహాయశాః |
అనపత్యోఽస్మి ధర్మాత్మన్ శాంతా భర్తా మమ క్రతుమ్ ||

4

ఆహరేత త్వయాజ్ఞప్తః సంతానార్థం కులస్య చ |
శ్రుత్వా రాజ్ఞోఽథ తద్వాక్యం మనసాపి విమృశ్య చ ||

5 [విచింత్య]

ప్రదాస్యతే పుత్రవంతం శాంతా భర్తారమాత్మవాన్ |
ప్రతిగృహ్యం చ తం విప్రం స రాజా విగత జ్వరః ||

6

ఆహరిష్యతి తం యజ్ఞం ప్రహృష్టేనాంతరాత్మనా |
తం చ రాజా దశరథో యష్టుకామః కృతాంజలిః ||

7

ఋశ్యశృంగం ద్విజశ్రేష్ఠం వరయిష్యతి ధర్మవిత్ |
యజ్ఞార్థం ప్రసవార్థం చ స్వర్గార్థం చ నరేశ్వరః ||

8

లభతే చ స తం కామం ద్విజముఖ్యాద్విశాం పతిః |
పుత్రాశ్చాస్య భవిష్యంతి చత్వారోఽమితవిక్రమాః ||

9

వంశప్రతిష్ఠానకరాః సర్వలోకేషు విశ్రుతాః |
ఏవం స దేవప్రవరః పూర్వం కథితవాన్కథామ్ ||

10

సనత్కుమారో భగవాన్ పురా దేవయుగే ప్రభుః |
స త్వం పురుషశార్దూల తమానయ సుసత్కృతమ్ ||

11

స్వయమేవ మహారాజ గత్వా సబలవాహనః |
[* సుమంత్రస్య వచః శ్రుత్వా హృష్టో దశరథోఽభవత్ | *]
అనుమాన్య వసిష్ఠం చ సూతవాక్యం నిశామ్య చ ||

12

వసిష్ఠేనాభ్యనుజ్ఞాతో రాజా సంపూర్ణమానసః |
సాంతఃపురః సహామాత్యః ప్రయయౌ యత్ర స ద్విజః ||

13

వనాని సరితశ్చైవ వ్యతిక్రమ్య శనైః శనైః |
అభిచక్రామ తం దేశం యత్ర వై మునిపుంగవః ||

14

ఆసాద్య తం ద్విజశ్రేష్ఠం రోమపాదసమీపగమ్ |
ఋషిపుత్రం దదర్శాదౌ దీప్యమానమివానలమ్ ||

15

తతో రాజా యథాన్యాయం పూజాం చక్రే విశేషతః |
సఖిత్వాత్తస్య వై రాజ్ఞః ప్రహృష్టేనాంతరాత్మనా ||

16

రోమపాదేన చాఖ్యాతమృషిపుత్రాయ ధీమతే |
సఖ్యం సంబంధకం చైవ తదా తం ప్రత్యపూజయత్ ||

17

ఏవం సుసత్కృతస్తేన సహోషిత్వా నరర్షభః |
సప్తాష్ట దివసాన్రాజా రాజానమిదమబ్రవీత్ ||

18

శాంతా తవ సుతా రాజన్సహ భర్త్రా విశాంపతే |
మదీయం నగరం యాతు కార్యం హి మహదుద్యతమ్ ||

19

తథేతి రాజా సంశ్రుత్య గమనం తస్య ధీమతః |
ఉవాచ వచనం విప్రం గచ్ఛ త్వం సహ భార్యయా ||

20

ఋషిపుత్రః ప్రతిశ్రుత్య తథేత్యాహ నృపం తదా |
స నృపేణాభ్యనుజ్ఞాతః ప్రయయౌ సహ భార్యయా ||

21

తావాన్యోన్యాంజలిం కృత్వా స్నేహాత్సంశ్లిష్య చోరసా |
ననందతుర్దశరథో రోమపాదశ్చ వీర్యవాన్ ||

22

తతః సుహృదమాపృచ్ఛ్య ప్రస్థితో రఘునందనః |
పౌరేభ్యః ప్రేషయామాస దూతాన్వై శీఘ్రగామినః ||

23

క్రియతాం నగరం సర్వం క్షిప్రమేవ స్వలంకృతమ్ |
ధూపితం సిక్త సమ్మృష్టం పతాకాభిరలంకృతమ్ ||

24

తతః ప్రహృష్టాః పౌరాస్తే శ్రుత్వా రాజానమాగతమ్ |
తథా ప్రచక్రుస్తత్సర్వం రాజ్ఞా యత్ప్రేషితం తదా ||

25

తతః స్వలంకృతం రాజా నగరం ప్రవివేశ హ |
శంఖదుందుభినిర్ఘోషైః పురస్కృత్య ద్విజర్షభమ్ ||

26

తతః ప్రముదితాః సర్వే దృష్ట్వా తం నాగరా ద్విజమ్ |
ప్రవేశ్యమానం సత్కృత్య నరేంద్రేణేంద్రకర్మణా ||

27

[* యథా దివి సురేంద్రేణ సహస్రాక్షేణ కాశ్యపమ్ | *]
అంతఃపురం ప్రవేశ్యైనం పూజాం కృత్వా చ శాస్త్రతః |
కృతకృత్యం తదాత్మానం మేనే తస్యోపవాహనాత్ ||

28

అంతఃపురాణి సర్వాణి శాంతాం దృష్ట్వా తథాగతామ్ |
సహ భర్త్రా విశాలాక్షీం ప్రీత్యానందముపాగమన్ ||

29

పూజ్యమానా చ తాభిః సా రాజ్ఞా చైవ విశేషతః |
ఉవాస తత్ర సుఖితా కంచిత్కాలం సహర్త్విజా ||

30 [సహద్విజా]

“ఓ దశరథమహారాజా! తమరి గురించి సనత్కుమారుడు ఇంకా ఏమి చెప్పాడో వినండి.

‘రాబోవు కాలంలో ఇక్ష్వాకు వంశంలో ధర్మాత్ముడు, శీలవంతుడు అయిన దశరథుడు అనే రాజు జన్మిస్తాడు. ఆయనకు పుత్రసంతానము కలుగదు. రోమపాదుడు దశరథునకు మిత్రుడు. దశరథుడు రోమపాదుని వద్దకు వెళ్లి ఋశ్యశృంగుని అయోధ్యకు పంపమని, తనకు పుత్రసంతానము కలిగేట్టు ఒకయాగం చేయించమని అర్థిస్తాడు. దానికి రోమపాదుడు అంగీకరిస్తాడు. రోమపాదుడు ఋష్యశృంగుని అయోధ్యకు పంపుతాడు. తనకు సంతాన ప్రాప్తి కలిగేటట్టు యజ్ఞము చేయించమని దశరథుడు ఋష్యశృంగుని ప్రార్థిస్తాడు. ఋష్యశృంగుడు దశరథుని చేత యజ్ఞము చేయిస్తాడు. ఫలితంగా దశరథునకు అమిత పరాక్రమవంతులు, వంశోద్ధారకులు అయిన నలుగురు పుత్రులు కలుగుతారు.’ అని సనత్కుమారుడు చెప్పగా నేను విన్నాను.

కాబట్టి ఓ దశరథ మహారాజా! ఆ మహాఋషి మాటలు తప్పవు. నీవు వెంటనే అంగదేశమునకు స్వయముగా పోయి ఋష్యశృంగుని తీసుకొని రమ్ము. యజ్ఞము చేయింపుము. నీకు పుత్ర సంతానము కలుగుతుంది.” అని సుమంతుడు చెప్పాడు.

ఆ మాటలకు ఎంతో సంతోషించాడు దశరథుడు. పురోహితుడైన వశిష్టుని అనుమతి తీసుకున్నాడు. తన మంత్రులతో సహా అంగదేశము నకు వెళ్లాడు. అంగరాజు దశరథుని సాదరంగా ఆహ్వానించాడు. అతిథి సత్కారములు చేసాడు. అంగరాజు పక్కన అగ్ని వలె ప్రకాశించు చున్న ఋష్యశృంగుని చూచాడు దశరథుడు. రోమపాదుడు దశరథుని ఋష్యశృంగునికి పరిచయం చేసాడు. ఋష్యశృంగుడు దశరథునికి నమస్కరించాడు.

దశరథుడు అంగరాజ్యములో ఏడురోజులు ఉన్నాడు. ఎనిమిదవ రోజున తాను వచ్చిన పని తెలిపాడు.

“ఓ అంగరాజా! నేను ఒక యజ్ఞము చేయ సంకల్పించాను. ఆ యజ్ఞమునకు నీ కుమార్తె శాంతను, అల్లుడు ఋష్యశృంగుని అయోధ్యకు పంపవలసింది.” అని ప్రార్థించాడు. దానికి అంగరాజు అంగీకరించాడు.

ఋష్యశృంగుడు సతీసమేతంగా అయోధ్యకు ప్రయాణమయ్యాడు. తమ రాకను దశరథుడు ముందుగా నే అయోధ్యావాసులకు తెలియజేసాడు. స్వాగత సత్కారములు ఘనంగా చేయమని ఆదేశించాడు.

దశరధుడు ఋష్యశృంగుని తీసుకొని అయోధ్యా నగరము ప్రవేశించాడు. అయోధ్యాపురవాసులు వారికి మంగళవాద్యములతో ఘనస్వాగతం పలికారు. శాంతను చూచి అంతఃపుర స్త్రీలు ఎంతో సంతోషించారు. ఆమెను సాదరంగా ఆహ్యానిం చారు. శాంతా ఋష్యశృంగులు అయోధ్యలో కొంతకాలము ఉన్నారు.

ఇది వాల్మీకి విరచిత
రామాయణ మహాకావ్యములో
బాలకాండలో పదకొండవసర్గ సంపూర్ణము.

ఓం తత్సత్ ఓంతత్సత్ ఓంతత్సత్

బాలకాండ ద్వాదశః సర్గః (12) >>

Leave a Comment