Balakanda Sarga 23 In Telugu – బాలకాండ త్రయోవింశః సర్గః

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ లోని త్రయోవింశః సర్గలో, రాముడు మరియు లక్ష్మణుడు విశ్వామిత్రునితో కలిసి గంగా నది మరియు సరయు నది సంగమించే ప్రదేశంలో ఒక ఆశ్రమంలో నివసిస్తున్నారు. ఒకసారి శివుడు తన మూడవ కన్నుతో ఈ ప్రదేశంలో ప్రేమ దేవుడైన మన్మథుని భౌతిక స్వరూపాన్ని కాల్చివేసాడు.

కామాశ్రమవాసః

ప్రభాతాయాం తు శర్వర్యాం విశ్వామిత్రో మహామునిః |
అభ్యభాషత కాకుత్స్థౌ శయానౌ పర్ణసంస్తరే ||

1

కౌసల్యాసుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే |
ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్ ||

2

తస్యర్షేః పరమోదారం వచః శ్రుత్వా నృపాత్మజౌ |
స్నాత్వా కృతోదకౌ వీరౌ జేపతుః పరమం జపమ్ ||

3

కృతాహ్నికౌ మహావీర్యౌ విశ్వామిత్రం తపోధనమ్ |
అభివాద్యాభిసంహృష్టౌ గమనాయోపతస్థతుః ||

4

తౌ ప్రయాతౌ మహావీర్యౌ దివ్యం త్రిపథగాం నదీమ్ |
దదృశాతే తతస్తత్ర సరయ్వాః సంగమే శుభే ||

5

తత్రాశ్రమపదం పుణ్యమృషీణాముగ్రతేజసామ్ |
బహువర్షసహస్రాణి తప్యతాం పరమం తపః ||

6

తం దృష్ట్వా పరమప్రీతౌ రాఘవౌ పుణ్యమాశ్రమమ్ |
ఊచతుస్తం మహాత్మానం విశ్వామిత్రమిదం వచః ||

7

కస్యాయమాశ్రమః పుణ్యః కో న్వస్మిన్వసతే పుమాన్ |
భగవన్ శ్రోతుమిచ్ఛావః పరం కౌతూహలం హి నౌ ||

8

తయోస్తద్వచనం శ్రుత్వా ప్రహస్య మునిపుంగవః |
అబ్రవీచ్ఛ్రూయతాం రామ యస్యాయం పూర్వ ఆశ్రమః ||

9

కందర్పో మూర్తిమానాసీత్కామ ఇత్యుచ్యతే బుధైః |
తపస్యంతమిహ స్థాణుం నియమేన సమాహితమ్ ||

10

కృతోద్వాహం తు దేవేశం గచ్ఛంతం సమరుద్గణమ్ |
ధర్షయామాస దుర్మేధా హుంకృతశ్చ మహాత్మనా ||

11

దగ్ధస్య తస్య రుద్రేణ చక్షుషా రఘునందన | [అవదగ్ధస్య]
వ్యశీర్యంత శరీరాత్స్వాత్సర్వగాత్రాణి దుర్మతేః ||

12

తస్య గాత్రం హతం తత్ర నిర్దగ్ధస్య మహాత్మనా |
అశరీరః కృతః కామః క్రోధాద్దేవేశ్వరేణ హ ||

13

అనంగ ఇతి విఖ్యాతస్తదాప్రభృతి రాఘవ |
స చాంగవిషయః శ్రీమాన్యత్రాంగం స ముమోచ హ ||

14

తస్యాయమాశ్రమః పుణ్యస్తస్యేమే మునయః పురా |
శిష్యా ధర్మపరా నిత్యం తేషాం పాపం న విద్యతే ||

15

ఇహాద్య రజనీం రామ వసేమ శుభదర్శన |
పుణ్యయోః సరితోర్మధ్యే శ్వస్తరిష్యామహే వయమ్ ||

16

అభిగచ్ఛామహే సర్వే శుచయః పుణ్యమాశ్రమమ్ |
స్నాతాశ్చ కృతజప్యాశ్చ హుతహవ్యా నరోత్తమ ||

17

[* ఇహ వాసః పరో రామ సుఖం వస్త్యామహే వయమ్ | *]
తేషాం సంవదతాం తత్ర తపోదీర్ఘేణ చక్షుషా |
విజ్ఞాయ పరమప్రీతా మునయో హర్షమాగమన్ ||

18

అర్ఘ్యం పాద్యం తథాఽఽతిథ్యం నివేద్య కుశికాత్మజే |
రామలక్ష్మణయోః పశ్చాదకుర్వన్నతిథిక్రియామ్ ||

19

సత్కారం సమనుప్రాప్య కథాభిరభిరంజయన్ |
యథార్హమజపన్సంధ్యామృషయస్తే సమాహితాః ||

20

తత్ర వాసిభిరానీతా మునిభిః సువ్రతైః సహ |
న్యవసన్సుసుఖం తత్ర కామాశ్రమపదే తదా ||

21

కథాభిరభిరామభిరభిరామౌ నృపాత్మజౌ |
రమయామాస ధర్మాత్మా కౌశికో మునిపుంగవః ||

22

Balakanda Sarga 23 In Telugu Pdf With Meaning

మరునాడు సూర్యోదయం కాబోతున్నది. సూర్యోదయానికి ముందు విశ్వామిత్రుడు రామ లక్ష్మణులను తన మృదుమధురమైన మాటలతో నిద్రలేపాడు.

కౌసల్యా సుప్రజా రామ పూర్వా సన్ధ్య ప్రవర్తతే।
ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్॥

కౌసల్య గర్భవాసాన జన్మించిన ఉత్తమ పుత్రుడవైన ఓ రామా! ప్రాత: కాల సంధ్యకు సమయము ఆసన్నమైనది. ఓ రామా! నిద్ర లే! ప్రాత:కాల 3! కృత్యములు. సంధ్యావందనాది కార్యక్రములు నీవు చేయవలసి ఉన్నది.

(పైశ్లోకము అందరికీ శ్రీ వేంకటేశ్వర సుప్రభాతములో మొదటి శ్లోకంగానే తెలుసు. ఆ శ్లోకము మూలం వాల్మీకి రామాయణంలో ఉందని కొద్దిమందికి మాత్రమేతెలుసు. అందుకే ఈ శ్లోకమును ఇక్క యధాతథంగా రాసాను).

విశ్వామిత్రుని మాటలు విన్న రామ లక్ష్మణులు వెంటనే నిద్ర లేచారు. కాలకృత్యములు తీర్చుకొన్నారు. స్నానము, సంధ్యావందనము ఆచరించారు. సూర్యునికి అర్ఘ్యము ఇచ్చారు. గాయత్రీ మంత్రము పఠించారు. తరువాత ముగ్గురూ తమ ప్రయాణము కొనసాగించారు.

వారు సరయూనదీ గంగానదిలో కలిసే సంగమస్థానము చేరుకున్నారు. ఆ ప్రదేశంలో ఉన్న పురాతనమైన ముని ఆశ్రమములను చూచారు. ఆ ఆశ్రమములను చూచిన రామలక్ష్మణులు “ఓ మహర్షీ! ఈ ఆశ్రమములు ఎవరివి?’ ఈ ఆశ్రమములలో ఎవరు ఉంటారు?”. అని అడిగారు.

దానికి విశ్వామిత్రుడు ఇలా సమాధానము చెప్పాడు. “ఓ రామా! ప్రస్తుతము మన్మధుడు దేహము లేకుండా అనంగుడిగా ఉన్నాడు కానీ, పూర్వము మన్మధుడు దేహము కలవాడు. మన్మధునికి కాముడు అని పేరు. పూర్వము శివుడు ఈ ప్రదేశములో తపస్సు చేసుకునేవాడు. తరువాత శివుడు వివాహం చేసుకొని వెళ్లిపోయాడు. . అటువంటి శివుని మన్మథుడు ఎదిరించాడు. అప్పుడు శివుడు హంకరించి, మన్మధుని వంక కోపంగా చూచాడు. శివుని కోపాగ్నికి మన్మధుడు భస్మము అయిపోయాడు. మన్మధుని శరీర అవయవములు అన్ని చోట్లా చెల్లాచెదరుగా పడిపోయాయి. అప్పుడు మన్మధుడు శరీరం లేనివాడు అయ్యాడు.

పూర్వము పరమశివుడు తపస్సు చేసిన ఆశ్రమము ఇదే. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఋషులు అందరూ పూర్వము పరమశివునికి శిష్యులుగాఉండేవారు. వారే ఇప్పటికీ తపస్సు చేసుకుంటూ ఉన్నారు. వీరు ధర్మపరులు. వీరికి పాపం అటే ఏమిటో తెలియదు. మనము ఈ రాత్రికి ఇక్కడే ఉండి రేపుఉదయము మన ప్రయాణము కొనసాగిద్దాము. మనము ఇప్పుడు స్నానము, సంధ్య ఆచరించి, శుచులై ఈ ఆశ్రమములలోని ప్రవేశిద్దాము” అని అన్నాడు విశ్వామిత్రుడు.

వీరు ఈ ప్రకారము మాట్లాడుకుంటూ ఉండగా, ఆ ఆశ్రమములలో ఉన్న ఋషులు వీరి రాకను చూచి ఎంతో ఆనందించారు. రామలక్ష్మణులను విశ్వామిత్రుని సాదరంగా ఆహ్వానిచి సత్కరించారు. తరువాత ఆ ఋషులు సాయంసంధ్యాసమయంలో చేయ వలసిన సంధ్యావందనము, గాయత్రీజపము కార్యములు ఏకాగ్రచిత్తంతో చేసారు.

ఆ రాత్రికి విశ్వామిత్రుడు, రామలక్ష్మణులు ఆ ఆశ్రమములో నిద్రించారు. విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు మార్గాయాసము తెలియకుండా అనేక పుణ్య కథలను చెప్పి ఆనందింపచేస్తూ ఉన్నాడు.

ఇది వాల్మీకి విరచిత
రామాయణ మహాకావ్యములో
బాలకాండలో ఇరవై మూడవ సర్గ సంపూర్ణము.

ఓం తత్సత్ ఓంతత్సత్ ఓంతత్సత్.

బాలకాండ చతుర్వింశః సర్గః (24) >>

Leave a Comment