మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ లోని పంచచత్వారింశః సర్గలో రాముడు మరియు లక్ష్మణులు విశాల అనే నగరానికి చేరుకుని చూసినప్పుడు పాల సముద్రాన్ని మథనం చేసిన పురాణం వారికి వివరించబడింది. క్షీరసాగర మథనం నుండి హాలాహల , ప్రాణాంతక విషం అలాగే అమృతం , అమృత అమృతం ఎలా ఉద్భవించాయి మరియు శివుడు విషాన్ని ఎలా కలిగి ఉన్నాడు మరియు విష్ణువు తాబేలుగా తన అవతారంలో మథనానికి ఎలా సహాయం చేసాడో విశ్వామిత్రుడు వివరిస్తాడు.
అమృతోత్పత్తిః
విశ్వామిత్రవచః శ్రుత్వా రాఘవః సహలక్ష్మణః |
విస్మయం పరమం గత్వా విశ్వామిత్రమథాబ్రవీత్ ||
1
అత్యద్భుతమిదం బ్రహ్మన్కథితం పరమం త్వయా |
గంగావతరణం పుణ్యం సాగరస్యాపి పూరణమ్ ||
2
తస్య సా శర్వరీ సర్వా సహ సౌమిత్రిణా తదా |
జగామ చింతయానస్య విశ్వామిత్రకథాం శుభామ్ ||
3
తతః ప్రభాతే విమలే విశ్వామిత్రం మహామునిమ్ |
ఉవాచ రాఘవో వాక్యం కృతాహ్నికమరిందమః ||
4
గతా భగవతీ రాత్రిః శ్రోతవ్యం పరమం శ్రుతమ్ |
క్షణభూతేవ నౌ రాత్రిః సంవృత్తేయం మహాతపః ||
5
ఇమాం చింతయతః సర్వాం నిఖిలేన కథాం తవ |
తరామ సరితాం శ్రేష్ఠాం పుణ్యాం త్రిపథగాం నదీమ్ ||
6
నౌరేషా హి సుఖాస్తీర్ణా ఋషీణాం పుణ్యకర్మణామ్ |
భగవంతమిహ ప్రాప్తం జ్ఞాత్వా త్వరితమాగతా ||
7
తస్య తద్వచనం శ్రుత్వా రాఘవస్య మహాత్మనః |
సంతారం కారయామాస సర్షిసంఘః సరాఘవః ||
8
ఉత్తరం తీరమాసాద్య సంపూజ్యర్షిగణం తదా |
గంగాకూలే నివిష్టాస్తే విశాలాం దదృశుః పురీమ్ ||
9
తతో మునివరస్తూర్ణం జగామ సహరాఘవః |
విశాలాం నగరీం రమ్యాం దివ్యాం స్వర్గోపమాం తదా ||
10
అథ రామో మహాప్రాజ్ఞో విశ్వామిత్రం మహామునిమ్ |
పప్రచ్ఛ ప్రాంజలిర్భూత్వా విశాలాముత్తమాం పురీమ్ ||
11
కతరో రాజవంశోఽయం విశాలాయాం మహామునే |
శ్రోతుమిచ్ఛామి భద్రం తే పరం కౌతూహలం హి మే ||
12
తస్య తద్వచనం శ్రుత్వా రామస్య మునిపుంగవః |
ఆఖ్యాతుం తత్సమారేభే విశాలస్య పురాతనమ్ ||
13
శ్రూయతాం రామ శక్రస్య కథాం కథయతః శుభామ్ |
అస్మిన్దేశే హి యద్వృత్తం తదాపి శృణు రాఘవ ||
14
పూర్వం కృతయుగే రామ దితేః పుత్రా మహాబలాః |
అదితేశ్చ మహాభాగ వీర్యవంతః సుధార్మికాః ||
15
తతస్తేషాం నరవ్యాఘ్ర బుద్ధిరాసీన్మహాత్మనామ్ |
అమరా అజరాశ్చైవ కథం స్యామ నిరామయాః ||
16
తేషాం చింతయతాం రామ బుద్ధిరాసీన్మహాత్మనామ్ |
క్షీరోదమథనం కృత్వా రసం ప్రాప్స్యామ తత్ర వై ||
17
తతో నిశ్చిత్య మథనం యోక్త్రం కృత్వా చ వాసుకిమ్ |
మంథానం మందరం కృత్వా మమంథురమితౌజసః ||
18
అథ వర్ష సహస్రేణ యోక్త్రసర్పశిరాంసి చ |
[* అధికపాఠః –
వమంత్యతి విషం తత్ర దదంశుర్దశనైః శిలాః ||
19
ఉత్పపాతాగ్నిసంకాశం హాలాహలమహావిషమ్ |
తేన దగ్ధం జగత్సర్వం సదేవాసురమానుషమ్ ||
20
అథ దేవా మహాదేవం శంకరం శరణార్థినః |
జగ్ముః పశుపతిం రుద్రం త్రాహిత్రాహీతి తుష్టువుః ||
21
ఏవముక్తస్తతో దేవైర్దేవదేవేశ్వరః ప్రభుః |
ప్రాదురాసీత్తతోఽత్రైవ శంఖచక్రధరో హరిః ||
22
ఉవాచైనం స్మితం కృత్వా రుద్రం శూలభృతం హరిః |
దైవతైర్మథ్యమానో తు యత్పూర్వం సముపస్థితమ్ ||
23
తత్త్వదీయం సురశ్రేష్ఠ సురాణామగ్రజోసి యత్ |
అగ్రపూజామిమాం మత్వా గృహాణేదం విషం ప్రభో ||
24
ఇత్యుక్త్వా చ సురశ్రేష్ఠస్తత్రైవాంతరధీయత |
దేవతానాం భయం దృష్ట్వా శ్రుత్వా వాక్యం తు శార్ఙ్గిణః ||
25
హాలాహలవిషం ఘోరం స జగ్రాహామృతోపమమ్ |
దేవాన్విసృజ్య దేవేశో జగామ భగవాన్హరః ||
26
తతో దేవాసురాః సర్వే మమంథూ రఘునందన |
ప్రవివేశాథ పాతాలం మంథానః పర్వతోఽనఘ ||
27
తతో దేవాః సగంధర్వాస్తుష్టువుర్మధుసూదనమ్ |
త్వం గతిః సర్వభూతానాం విశేషేణ దివౌకసామ్ ||
28
పాలయాస్మాన్మహాబాహో గిరిముద్ధర్తుమర్హసి |
ఇతి శ్రుత్వా హృషీకేశః కామఠం రూపమాస్థితః ||
29
పర్వతం పృష్ఠతః కృత్వా శిశ్యే తత్రోదధౌ హరిః |
పర్వతాగ్రం తు లోకాత్మా హస్తేనాక్రమ్య కేశవః ||
30
దేవానాం మధ్యతః స్థిత్వా మమంథ పురుషోత్తమ |
అథ వర్షసహస్రేణ ఆయుర్వేదమయః పుమాన్ ||
31 [పున]
ఉదతిష్ఠత్స ధర్మాత్మా సదండం సకమండలుః |
*]
పూర్వం ధన్వంతరిర్నామ అప్సరాశ్చ సువర్చసః ||
32
అప్సు నిర్మథనాదేవ రసస్తస్మాద్వరస్త్రియః |
ఉత్పేతుర్మనుజశ్రేష్ఠ తస్మాదప్సరసోఽభవన్ ||
33
షష్టిః కోట్యోఽభవంస్తాసామప్సరాణాం సువర్చసామ్ |
అసంఖ్యేయాస్తు కాకుత్స్థ యాస్తాసాం పరిచారికాః ||
34
న తాః స్మ ప్రతిగృహ్ణంతి సర్వే తే దేవదానవాః |
అప్రతిగ్రహణాత్తాశ్చ సర్వాః సాధారణాః స్మృతాః ||
35
వరుణస్య తతః కన్యా వారుణీ రఘునందన |
ఉత్పపాత మహాభాగా మార్గమాణా పరిగ్రహమ్ ||
36
దితేః పుత్రా న తాం రామ జగృహుర్వరుణాత్మజామ్ |
అదితేస్తు సుతా వీర జగృహుస్తామనిందితామ్ ||
37
అసురాస్తేన దైతేయాః సురాస్తేనాదితేః సుతాః |
హృష్టాః ప్రముదితాశ్చాసన్వారుణీగ్రహణాత్సురాః ||
38
ఉచ్చైఃశ్రవా హయశ్రేష్ఠో మణిరత్నం చ కౌస్తుభమ్ |
ఉదతిష్ఠన్నరశ్రేష్ఠ తథైవామృతముత్తమమ్ ||
39
అథ తస్య కృతే రామ మహానాసీత్కులక్షయః |
అదితేస్తు తతః పుత్రా దితేః పుత్రానసూదయన్ ||
40
ఏకతోఽభ్యాగమన్సర్వే హ్యసురా రాక్షసైః సహ |
యుద్ధమాసీన్మహాఘోరం వీర త్రైలోక్యమోహనమ్ ||
41
యదా క్షయం గతం సర్వం తదా విష్ణుర్మహాబలః |
అమృతం సోఽహరత్తూర్ణం మాయామాస్థాయ మోహినీమ్ ||
42
యే గతాఽభిముఖం విష్ణుమక్షయం పురుషోత్తమమ్ |
సంపిష్టాస్తే తదా యుద్ధే విష్ణునా ప్రభవిష్ణునా ||
43
అదితేరాత్మజా వీరా దితేః పుత్రాన్నిజఘ్నిరే |
తస్మిన్యుద్ధే మహాఘోరే దైతేయాదిత్యయోర్భృశమ్ ||
44
నిహత్య దితిపుత్రాంశ్చ రాజ్యం ప్రాప్య పురందరః |
శశాస ముదితో లోకాన్సర్షిసంఘాన్సచారణాన్ ||
45
Balakanda Sarga 45 In Telugu Pdf With Meaning
విశ్వామిత్రుడు చెప్పిన గంగావతరణము కథను ఆశ్చర్యముతో విన్నారు రామ లక్ష్మణులు. ఆ రాత్రి అంతా గంగావతరణము కథనే మననం చేసుకుంటూ నిద్రపోయారు.
మరునాడు పొద్దుటే లేచారు. సంధ్వావందనాది కార్యములు పూర్తి చేసుకున్నారు. ఇద్దరూ విశ్వామిత్రుని వద్దకు వచ్చారు. విశ్వామిత్రునికి నమస్కరించి ఆయన పక్కన నిలబడ్డారు. అప్పుడు రాముడు విశ్వామిత్రునితో ఇలా అన్నాడు.
“ఓ మహర్షీ! మీరు చెప్పిన గంగావతరణము కథ మాకు ఎంతో సంతోషమును ఆశ్చర్యమును కలిగించింది. గడిచిన రాత్రి అంతా నేను లక్ష్మణుడు ఆ కథనే మననం చేసుకున్నాము. మనము ఇప్పుడు ఆ పవిత్ర గంగానదిని దాటాలి కదా. అందుకు తగిన ఏర్పాట్లు ఈ ఆశ్రమములో ఉన్న మునికుమారులు చేసారు.” అని వినయంగా చెప్పాడు రాముడు.
తరువాత విశ్వామిత్రుడు, రామలక్ష్మణులు, వారితో వచ్చిన మునులు అందర గంగానదిని దాటారు. విశాల నగరము చేరుకున్నారు.
ఆ విశాల నగరము చూచి రాముడు విశ్వామిత్రునితో ఇలా అన్నాడు. “ ఓ మహర్షీ! ఈ నగరమును ఎవరు పరిపాలిస్తున్నారు? వారు ఏ రాజవంశమునకు చెందిన వారు? వారి చరిత్ర ఏమిటి?
మాకు వివరించండి.” అని అడిగాడు.
అప్పుడు విశ్వామిత్రుడు రామ లక్ష్మణులకు మునులకు విశాల నగర వృత్తాంతమును చెప్పడం మొదలు పెట్టాడు.
“ ఓ రామా! ఇప్పుడు నీకు ఈ ప్రదేశములో ఏమి జరిగిందో సవిస్తరంగా చెబుతాను విను. కృతయుగములో దితి పుత్రులు, అదితి పుత్రులు ఉండేవారు. వారు మహా బలవంతులు. పరాక్రమ వంతులు. ధార్మికులు కూడా. వారందరికీ ఒక కోరిక కలిగింది. తమకు రోగములు, ముసలి తనము, మరణము, లేకుండా ఉండాలని కోరుకున్నారు. దానికి తగిన ఉపాయము గురించి ఆలోచింప సాగారు.
వారికి ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది. క్షీర సాగరమును మధించి అమృతమును పొందాలని అనుకున్నారు. దితి పుత్రులు, అదితి పుత్రులు క్షీరసాగరమును మధించాలని నిశ్చయించుకున్నారు. మంథర పర్వతమును పెకలించి తెచ్చి క్షీరసాగరం లో పడవేసారు. వాసుకిని తాడుగా ఆ పర్వతమునకుచుట్టారు. మంథర పర్వతము కవ్వముగా, వాసుకి తాడుగా క్షీరసాగరమును చిలకసాగారు.
ఒక వెయ్యి సంవత్సరములు గడిచాయి. వాసుకి తన తలల నుండి విషాన్ని కక్కడం మొదలెట్టాడు. ఆ విషంలో నుండి హాలా హలము పుట్టింది. ఆ హాలా హలము జగత్తును అంతటినీ దహించసాగింది. దేవతలందరూ ఆ హాలా హలము నుండి లోకాలను రక్షించమని మహేశ్వరుడిని ప్రార్ధించారు.
ఇంతలో విష్ణు మూర్తి కూడా అక్కడకు వచ్చాడు. మహావిష్ణువు చిరునవ్వు నవ్వుతూ మహేశ్వరునితో ఇలా అన్నాడు. “ఓ మహా దేవా! నీవు అందరి కన్నా పెద్ద వాడివి. దేవాసురులు క్షీరసాగరం మధిస్తుంటే ముందు హాలా హలము పుట్టింది. అందరి కన్నా పెద్దవాడికి నువ్వు కాబట్టి, ముందు పుట్టిన హాలా హాలమును గ్రహించుటకు నీవే సమర్థుడివి. కాబట్టి పెద్దవాడిగా ఆ హాలా హలమును తీసుకో.” అని అన్నాడు.
తరువాత మహావిష్ణువు అక్కడి నుండి వెళ్లిపోయాడు. మహా శివుడు హాలా హలమును అమృతము మాదిరి తాగాడు. తరువాత శివుడు కూడా వెళ్లిపోయాడు. మరలా దేవతలు అసురులు క్షీరసాగరమును మధించసాగారు.
ఇంతలో మరొక ఉత్పాతము జరిగింది. కింద ఆధారము ఏమీ లేక పోవడంతో, మంధర పర్వతము క్షీరసాగరం అడుక్కు పోసాగింది. అప్పుడు మరలా దేవతలు, అసురులు విష్ణుమూర్తిని ప్రార్థించారు.
” ఓ మహాబాహోూ! సర్వ భూతములకు నీవే దిక్కు. మా మొర ఆలకించి ఈ మంధర పర్వతమును పైకెత్తు. మాకు సాయం చెయ్యి.” అని ప్రార్థించారు.
దేవతల మొరను విన్న విష్ణువు తాను కూర్మ రూపం (తాబేలురూపం) ధరించి ఆ మంధర పర్వతము కింద చేరాడు. మంథర పర్వతము కుంగి పోకుండా ఎత్తి పట్టుకున్నాడు. తరువాత దేవ దానవులు మరలా క్షీరసాగరమును మథించసాగారు.
మరలా వేయి సంవత్సరములు గడిచిపోయాయి. అప్పుడు ధన్వంతరి, అప్సరసలు క్షీరసాగరంలో నుండి పుట్టారు. “ఓ రామా! నీళ్లను మధించగా వచ్చిన రసము నుండి పుట్టిన వారు కాబట్టి వారికి అప్సరసలు అనే పేరు వచ్చింది. ఆ అప్సరసలు అరవైకోట్ల మంది పుట్టారు. ఆ అప్సరసలను వివాహం చేసుకోడానికి దేవదానవులలో ఎవరూ ముందుకు రాలేదు. అందుకని వారు ఎవరికీ చెందని సాధారణ స్త్రీలుగా ఉండిపోయారు.
తరువాత వరుణుని కుమార్తె వారుణి (మద్యమునకు అధిదేవత) తనను ఎవరు పరిగ్రహిస్తారా అని అనుకుంటూ బయటకు వచ్చింది. ఆ వారుణిని దితి పుత్రులు స్వీకరించలేదు. అదితి పుత్రులు స్వీకరించారు. ఆ కారణం చేత అనగా వారుణిని (సురను) స్వీకరించకపోవడం చేత దితి పుత్రులు అసురులు అయ్యారు. సురను స్వీకరించడం చేత అదితి పుత్రులు (దేవతలు) సురులు అయ్యారు.
మరలా క్షీర సాగర మథనం జరిగింది. క్షీర సాగరం లోనుండి ఉచ్చైశ్రవము అనే గుర్రము, కౌస్తుభము అనే మణి, దాని తరువాత అమృతము పుట్టాయి.
ఆ అమృతము కోసరము దేవతలు అసురులు యుద్ధము చేసుకున్నారు. అసురులు నాశనం అయ్యారు. ఆ యుద్ధములో అసురులు, దైత్యులు ఒక పక్షం చేరారు. అదితి పుత్రులైన దేవతలు ఒక పక్షం చేరారు. ఆ యుద్ధంలో అందరూ నాశనం అయ్యారు.
తరువాత శ్రీ మహావిష్ణువు మోహినీ రూపంలో అమృతమును హరించుకు పోయాడు. దానితో దానవులకు కోపం వచ్చింది. దానవులు, దైత్యులు అందరూ విష్ణువు తో యుద్ధానికి దిగారు. శ్రీ మహావిష్ణువు వారి నందరినీ సంహరించాడు. దేవతలకు అధిపతి దేవేంద్రుడు. దేవదానవ యుద్ధంలో అసురులను అందరినీ చంపి, దేవేంద్రుడు ముల్లోకములకు అధిపతి అయ్యాడు.
శ్రీమద్రామాయణము
బాలకాండ నలుబది ఐదవ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.
బాలకాండ షట్చత్వారింశః సర్గః (46) >>