మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలు గురించి తెలుసుకుందాం.
నీతికథలు
శ్రీ గర్గభాగవతం లోని నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… శ్రీకృష్ణ లీలలు – తృణావర్త భంజనమ్ కథ.
శ్రీకృష్ణ లీలలు – తృణావర్త భంజనమ్
ముద్దుకృష్ణుని ఒడిలో కూర్చుండబెట్టుకొని ఆడించుచున్నది మహాభాగ్యశాలి అయిన యశోదాదేవి. అప్పుడు తృణావర్తుడనే రక్కసుడు పెద్ద సుడిగాలి రూపములో అక్కడికి వచ్చెను. కొండంత బరువెక్కిన తయుని భారము భరించలేక యశోద శ్రీకృష్ణుని నేలపైకి దించెను. జంతువులు ప్రజలు ఇంటిపైకప్పులు సైతం ఆ పెనుగాలికి ఎగురదొడగెను. ధూళి రేగగా శ్రీకృష్ణుడు యశోదకు గోపికలకు కనబడలేదు. ఆందోళనతో వారు ఆ పరమాత్ముని వెదుకసాగిరి.
చిన్నికృష్ణుడు తృణావర్తుని వెంట మింటికెగసి ఆతని వీపుపైకి ఎక్కెను. అండపిండవేదోండ సహతులను గుప్తగతి బొజ్జలో ఉంచుకొన్న స్వామి భారము మోయలేక ఆతని క్రిందికి వసరికొట్టబోయెను తృణావర్తుడు. పాపం పండిన దానవుని గొంతునులిమి శ్రీకాంతుడు భూభారము దించెను.
నేలగూలి ప్రాణములువిడిచిన అసురుని శరీరముపై ఏమీ ఎఱగనట్టు ఆడుకుంటున్న బాలకృష్ణుని చూసి బాలకుడు క్షేమముగా ఉన్నాడని సంతోషించి యశోద శ్రీకృష్ణుని ముద్దాడి దిష్టి తీసి వేదాశీర్వచనము చేయించెను. ఎన్నో గో భూదానములు పండిత మండలికి ఇప్పించెను.
తృణావర్తుని వృత్తాంతము
పూర్వం పాండుదేశమును సహస్రాక్షుడను మహారాజు పరిపాలించుచుండెడివాడు. ఆతుడు మిక్కిలి భగవద్భక్తుడే కాని స్త్రీలోలుడు. సీతమ్మ చెప్పినట్టు (సత్యసంధః కథ చూడండి) ఎవడైతే వ్యసనాలకు దూరముగా ఉంటాడో వాడే ధర్మమార్గాన నడువగలడు. కామాంధుడైన ఆ సహస్రాక్షుడు దూర్వాసమహర్షి వచ్చాడని ఎఱిగియూ ఆతనికి నమస్కరించలేదు. వ్యసనపరుడై పూజ్యపూజావ్యతిక్రమ దోషము చేసిన సహస్రాక్షుని రాక్షసుడివి కమ్మని ఆ మహర్షి శపించెను. తన తప్పు తెలుసుకొని ప్రాయశ్చిత్తముతో శరణువేడిన ఆ సహస్రాక్షుని మహర్షి మన్నించి “రాజా! ఈ దుష్కార్యమునకు ఫలితమనుభవింపక తప్పదు. చేసిన కర్మ చెడని పదార్థము కదా! కానీ భక్తుడవైన నీకు పరమాత్ముడైన శ్రీకృష్ణుని పాదస్పర్శచే కైవల్యము ప్రాప్తించును” అని ఆశీర్వదించెను. ఆ సహస్రాక్షుడే తృణావర్తుడు.
ఈ కథలోనితి మరొక్కమాణు మీ అందరికోసం
మానవుడు అన్ని వ్యసనములనుండి ఎల్లవేళలా దూరముగా ఉండవలెను. పరమ భక్తుడైనా ఒక్క స్త్రీలోలత్వం అనే వ్యసనము వలన దుష్కర్మ చేసి శాపగ్రస్తుడైనాడు సహస్రాక్షుడు.
మరిన్ని నీతికథలు మీకోసం: