Aranya Kanda Sarga 68 In Telugu – అరణ్యకాండ అష్టషష్ఠితమః సర్గః

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అరణ్యకాండ అష్టషష్ఠితమః సర్గ (68వ సర్గ) రామాయణంలో ప్రముఖమైన అధ్యాయం. ఈ సర్గలో రాముడు, సీత మరియు లక్ష్మణుడితో కలిసి దండకారణ్యంలో విస్తృతంగా పర్యవేక్షణ చేస్తాడు. అక్కడ రాక్షసులు వారిని బాధించేందుకు ప్రయత్నిస్తారు, కానీ రాముడు ధైర్యంగా వారిని ఎదుర్కొంటాడు. ఈ సర్గలో సీతకు భయం తొలగించడం, రాక్షసులను నియంత్రించడం మరియు దండకారణ్యంలో శాంతిని స్థాపించడం వంటి అంశాలు ఉన్నాయి. వాల్మీకి మహర్షి ఈ కథను రచించి, భారతీయ సాంప్రదాయంలో విశేష ప్రాముఖ్యతను అందించాడు.

జటాయుః సంస్కారః

రామః సంప్రేక్ష్య తం గృధ్రం భువి రౌద్రేణపాతితమ్ |
సౌమిత్రిం మిత్రసంపన్నమిదం వచనమబ్రవీత్ ||

1

మమాయం నూనమర్థేషు యతమానో విహంగమః |
రాక్షసేన హతః సంఖ్యే ప్రాణాంస్త్యక్ష్యతి దుస్త్యజాన్ ||

2

అయమస్య శరీరేఽస్మిన్ప్రాణో లక్ష్మణ విద్యతే |
తథాహి స్వరహీనోఽయం విక్లవః సముదీక్షతే ||

3

జటాయో యది శక్నోషి వాక్యం వ్యాహరితుం పునః |
సీతామాఖ్యాహి భద్రం తే వధమాఖ్యాహి చాత్మనః ||

4

కిం నిమిత్తోఽహరత్సీతాం రావణస్తస్య కిం మయా |
అపరాధం తు యం దృష్ట్వా రావణేన హృతా ప్రియా ||

5

కథం తచ్చంద్రసంకాశం ముఖమాసీన్మనోహరమ్ |
సీతయా కాని చోక్తాని తస్మిన్కాలే ద్విజోత్తమ ||

6

కథం వీర్యః కథం రూపః కిం కర్మా స చ రాక్షసః |
క్వ చాస్య భవనం తాత బ్రూహి మే పరిపృచ్ఛతః ||

7

తముద్వీక్ష్యాథ దీనాత్మా విలపంతమనంతరమ్ |
వాచాఽతిసన్నయా రామం జటాయురిదమబ్రవీత్ ||

8

హృతా సా రాక్షసేంద్రేణ రావణేన విహాయసా |
మాయామాస్థాయ విపులాం వాతదుర్దినసంకులామ్ ||

9

పరిశ్రాంతస్య మే తాత పక్షౌ ఛిత్త్వా స రాక్షసః |
సీతామాదాయ వైదేహీం ప్రయాతో దక్షిణాం దిశమ్ ||

10

ఉపరుధ్యంతి మే ప్రాణాః దృష్టిర్భ్రమతి రాఘవ |
పశ్యామి వృక్షాన్సౌవర్ణానుశీరకృతమూర్ధజాన్ ||

11

యేన యాతో ముహూర్తేన సీతామాదాయ రావణః |
విప్రనష్టం ధనం క్షిప్రం తత్స్వామి ప్రతిపద్యతే ||

12

విందో నామ ముహూర్తోఽయం స చ కాకుత్స్థ నాబుధత్ |
త్వత్ప్రియాం జానకీం హృత్వా రావణో రాక్షసేశ్వరః ||

13

ఝషవద్బడిశం గృహ్య క్షిప్రమేవ వినశ్యతి |
న చ త్వయా వ్యథా కార్యా జనకస్య సుతాం ప్రతి ||

14

వైదేహ్యా రంస్యసే క్షిప్రం హత్వా తం రాక్షసం రణే |
అసంమూఢస్య గృధ్రస్య రామం ప్రత్యనుభాషతః ||

15

ఆస్యాత్సుస్రావ రుధిరం మ్రియమాణస్వ సామిషమ్ |
పుత్రో విశ్రవసః సాక్షాత్భ్రాతా వైశ్రవణస్య చ ||

16

ఇత్యుక్త్వా దుర్లభాన్ప్రాణాన్ముమోచ పతగేశ్వరః |
బ్రూహి బ్రూహీతి రామస్య బ్రువాణస్య కృతాంజలేః ||

17

త్యక్త్వా శరీరం గృధ్రస్య జగ్ముః ప్రాణా విహాయసమ్ |
స నిక్షిప్య శిరో భూమౌ ప్రసార్య చరణౌ తదా ||

18

విక్షిప్య చ శరీరం స్వం పపాత ధరణీతలే |
తం గృధ్రం ప్రేక్ష్య తామ్రాక్షం గతాసుమచలోపమమ్ ||

19

రామః సుబహుభిర్దుఃఖైర్దీనః సౌమిత్రిమబ్రవీత్ |
బహూని రక్షసాం వాసే వర్షాణి వసతా సుఖమ్ ||

20

అనేన దండకారణ్యే విశీర్ణమిహ పక్షిణా |
అనేకవార్షికో యస్తు చిరకాలసముత్థితః ||

21

సోఽయమద్య హతః శేతే కాలో హి దురతిక్రమః |
పశ్య లక్ష్మణ గృధ్రోఽయముపకారీ హతశ్చ మే ||

22

సీతామభ్యవపన్నో వై రావణేన బలీయసా |
గృధ్రరాజ్యం పరిత్యజ్య పితృపైతామహం మహత్ ||

23

మమ హేతోరయం ప్రాణాన్ముమోచ పతగేశ్వరః |
సర్వత్ర ఖలు దృశ్యంతే సాధవో ధర్మచారిణః ||

24

శూరాః శరణ్యాః సౌమిత్రే తిర్యగ్యోనిగతేష్వపి |
సీతాహరణజం దుఃఖం న మే సౌమ్య తథాగతమ్ ||

25

యథా వినాశో గృధ్రస్య మత్కృతే చ పరంతప |
రాజా దశరథః శ్రీమాన్యథా మమ మహాయశాః ||

26

పూజనీయశ్చ మాన్యశ్చ తథాఽయం పతగేశ్వరః |
సౌమిత్రే హర కాష్ఠాని నిర్మథిష్యామి పావకమ్ ||

27

గృధ్రరాజం దిధక్షామి మత్కృతే నిధనం గతమ్ |
నాథం పతగలోకస్య చితామారోప్య రాఘవ ||

28

ఇమం ధక్ష్యామి సౌమిత్రే హతం రౌద్రేణ రక్షసా |
యా గతిర్యజ్ఞశీలానామాహితాగ్నేశ్చ యా గతిః ||

29

అపరావర్తినాం యా చ యా చ భూమిప్రదాయినామ్ |
మయా త్వం సమనుజ్ఞాతో గచ్ఛ లోకాననుత్తమాన్ ||

30

గృధ్రరాజ మహాసత్త్వ సంస్కృతశ్చ మయా వ్రజ |
ఏవముక్త్వా చితాం దీప్తామారోప్య పతగేశ్వరమ్ ||

31

దదాహ రామో ధర్మాత్మా స్వబంధుమివ దుఃఖితః |
రామోఽథ సహసౌమిత్రిర్వనం గత్వా స వీర్యవాన్ ||

32

స్థూలాన్హత్వా మహారోహీనను తస్తార తం ద్విజమ్ |
రోహిమాంసాని చోత్కృత్య పేశీకృత్య మహాయశాః ||

33

శకునాయ దదౌ రామో రమ్యే హరితశాద్వలే |
యత్తత్ప్రేతస్య మర్త్యస్య కథయంతి ద్విజాతయః ||

34

తత్స్వర్గగమనం తస్య పిత్ర్యం రామో జజాప హ |
తతో గోదావరీం గత్వా నదీం నరవరాత్మజౌ ||

35

ఉదకం చక్రతుస్తస్మై గృధ్రరాజాయ తావుభౌ |
శాస్త్రదృష్టేన విధినా జలే గృధ్రాయ రాఘవౌ |
స్నాత్వా తౌ గృధ్రరాజాయ ఉదకం చక్రతుస్తదా ||

36

స గృధ్రరాజః కృతవాన్యశస్కరం
సుదుష్కరం కర్మ రణే నిపాతితః |
మహర్షికల్పేన చ సంస్కృతస్తదా
జగామ పుణ్యాం గతిమాత్మనః శుభామ్ ||

37

కృతోదకౌ తావపి పక్షిసత్తమే
స్థిరాం చ బుద్ధిం ప్రణిధాయ జగ్ముతుః |
ప్రవేశ్య సీతాధిగమే తతో మనో
వనం సురేంద్రావివ విష్ణువాసవౌ ||

38

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అరణ్యకాండే అష్టషష్ఠితమః సర్గః ||

Aranya Kanda Sarga 68 Meaning In Telugu PDF

జటాయువు ఆఖరి క్షణాలలో ఉన్నాడు. అది చూచి రాముడు ఇలా అన్నాడు. “లక్ష్మణా! జటాయువు మనకు ఏదో చెప్పాలని అనుకుంటున్నాడు. కానీ చెప్పలేకపోతున్నాడు. ఇతని కంఠస్వరము క్షీణిస్తూ ఉంది.” అన్నాడు.

జటాయువును చూచి “జటాయువూ! ఒక్కసారి కళ్లు తెరువు. మాట్లాడు. సీత గురించి చెప్పు. సీతను రావణుడు ఎందుకు తీసుకెళ్లాడు. ఎక్కడకు తీసుకెళ్లాడు. రావణునికి నేను ఏమీ అపకారము చేయలేదే. మరి సీతను ఎందుకు తీసుకెళ్లినట్టు? ఆ సమయంలో సీత ఎలా ఉంది. ఆమె ఏమైనా చెప్పిందా! ఇంతకూ ఆ రావణుడు అనే రాక్షసుడు ఎలా ఉంటాడు. అతని గురించి చెప్పు. అతను మహా పరాక్రమవంతుడా! అతని నివాసము ఎక్కడ. అతడు ఏమి చేస్తుంటాడు. జటాయూ! మాట్లాడు” అని ఆతురతగా అడుగుతున్నాడు రాముడు.

జటాయువు నెమ్మదిగా కళ్లు తెరిచాడు. రాముని వంక చూచి ఇలా అన్నాడు. “రామా! రావణుడు రాక్షసుడు. మాయావి. తన మాయతో అధికమైన వాయువును సృష్టించి, సీతను ఆకాశమార్గంలో తీసుకెళ్లాడు. అతడు దక్షిణ దిక్కుగా వెళ్లాడు. రామా! నా చూపు మందగిస్తోంది. నాకు ప్రాణాలు పోతున్నాయి. రావణుడు సీతను వింద ముహూర్తంలో అపహరించాడు. ఆ ముహూర్తంలో ఏవస్తువు పోయినా, తొందరలోనే ఆ వస్తువు తిరిగి తన యజమానికి లభిస్తుంది. ఆ విషయం రావణునికి తెలియదు. నీ సీత నీకు తొందరలోనే లభిస్తుంది. నీవు తొందరలలోనే రావణునితో యుద్ధము చేసి, రావణుని చంపి, నీ సీతను తిరిగి పొందుతావు.” అని అంటూ ఉండగానే జటాయువు నోటి నుండి రక్తం పడింది. కళ్లు మూతలు పడ్డాయి.

మరలా జటాయువు ఓపిక తెచ్చుకొని రామునితో “రామా! రావణుడు విశ్రవసుని కుమారుడు. కుబేరునికి సోదరుడు….” అని ఇంకా ఏమో చెప్పబోతూ ప్రాణాలు వదిలాడు జటాయువు.

అది తెలుసుకోలేని రాముడు “ఇంకా ఇంకా రావణుని గురించి చెప్పు” అని జటాయువును కుదిపి కుదిపి అడుగుతున్నాడు. జటాయువు ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి. జటాయువు తల వాల్చి కిందకు జారిపోయాడు.

జటాయువు చనిపోయాడని తెలుసుకున్న రాముడు లక్ష్మణునితో ఇలా అన్నాడు. “లక్ష్మణా! ఈ జటాయువు నా తండ్రికి స్నేహితుడు. ఈ దండకారణ్యంలో తన మానాన తాను బతుకుతూ, నా కొరకు, సీతను రక్షించుట కొరకు, తన ప్రాణాలు సైతం బలిపెట్టాడు. ఇంకా ఎంతో కాలము బతకవలసిన వాడు మనకోసం ప్రాణాలు కోల్పోయాడు. కేవలము నాకు సాయం చెయ్యాలని, సీతను రక్షించాలని, రావణునితో యుద్ధం చేసి, రావణుని చేతిలో చంపబడ్డాడు.

మంచివారు, వీరులు, శూరులు, పరోపకారము చేసేవారు, మనుష్యులలోనే కాదు, జంతువుల లోనూ పక్షులలోనూ ఉంటారని ఈ జటాయువు నిరూపించాడు. ఈ జటాయువు మరణము, అందులోనూ నా కోసం మరణించడం నాకు అత్యంత దుఃఖమును కలిగించింది. సీతా వియోగము కన్నా ఎక్కువ దుఃఖము అనుభవిస్తున్నాను. నా తండ్రి నాకు ఎంత పూజనీయుడో ఈ జటాయువు కూడా అంతే పూజనీయుడు…

లక్ష్మణా! మనము ఈ జటాయువుకు దహన సంస్కారములు జరిపిద్దాము. కట్టెలు తీసుకురా!” అని అన్నాడు.

తరువాత రాముడు, లక్ష్మణుడు జటాయువుకు దహనసంస్కారములు చేసారు. రాముడు జటాయువు ఆత్మశాంతికి ప్రార్థించాడు. “ఓ జటాయువూ! ఎల్లప్పుడూ యజ్ఞములు చేసే వారికి, నిత్యము అగ్నిహోత్రము చేసేవారికి ఎటువంటి పుణ్యలోకములు లభిస్తాయో, ఆ పుణ్యలోకములు నీకు లభించుగాక! సన్యాసులకు, యుద్ధములో మరణించినవారికి ఎలాంటి ఉత్తమ లోకాలు లభిస్తాయో అవి నీకు లభించునుగాక! నా చేత దహన సంస్కారములు పొందిన నీవు ఉత్తమ లోకములు పొందుతావు!” అని పలికాడు రాముడు.

తరువాత లక్ష్మణుడు దర్భలను తీసుకొని వచ్చాడు. రోహి మృగములనుచంపి ఆ మాంసమును తీసుకొని వచ్చాడు. రాముడు దర్భలు నేలమీద పరిచాడు. రోహి మృగము మాంసముతో ముద్దలు చేసి ఆ దర్భల మీద పెట్టి జటాయువుకు మంత్రపూర్వకంగా పిండప్రదానము చేసాడు. తరువాత రాముడు లక్ష్మణుడు గోదావరీ నదికి వెళ్లి స్నానం చేసి శాస్త్రోక్తంగా జటాయువుకు జలతర్పణములు విడిచారు. రాముని చేత ఉత్తర క్రియలు జరిపించుకున్న జటాయువు ఉత్తమలోకములకు వెళ్లాడు. తరువాత రామలక్ష్మణులు సీతను వెదుక్కుంటూ అడవిలోకి వెళ్లారు.

శ్రీమద్రామాయణము
అరణ్యకాండము అరువది ఎనిమిదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

అరణ్యకాండ ఏకోనసప్తతితమః సర్గః (69) >>

Leave a Comment